May 2, 2024

కలర్స్

రచన: స్వప్న పేరి

“”దయచేసి వినండి , సికింద్రాబాదు నుంచి గుంటూరు వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్ మరి కొద్దిపట్లో ప్లాట్ఫోర్మ్ నుంబరు 5 పైకి వచ్చును””

సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే రద్దీ గా ఉంది. సాయంకాలం సమయం. అటు వెళ్ళే జనాలు , ఇటు వెళ్ళే జనాలు.
నరహరి , తన భార్య తులసి , వాళ్ళ అబ్బాయి కిరణ్ , ముగ్గురు గుంటూరు దగ్గర ఉన్న మంగళగిరిలో ఉంటారు. నరహరి అక్కడే కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు. వారం క్రితమే ఒక పని పైన ముగ్గురు హైదరాబాదు వచ్చారు. వచ్చిన పని మూడు రోజుల్లోనే అయిపోవడంతో , హైదరాబాద్ ఊరుని చూద్దామని అనుకున్నారు.
ముందర కిరణ్ కి జూ చూపిద్దామని , ముగ్గురు ఒక కార్ మాట్లాడుకుని వెళ్లారు. జూ లోపల రకరకాల జంతువులని చూసిన కిరణ్ చాలా ఆనందించాడు. కోతులు ఉండే చోటికి వెళ్ళినపుడు , ఒక కోతి కిరణ్ ని చూసి గెంతింది. అది చూసి కిరణ్ కూడా అలాగే చేశాడు. కోతి మళ్ళీ అలాగే చేస్తే , కిరణ్ అలాగే చేశాడు.ఇలా ఒక పది నిమిషాలు భలేగా కోతితో ఆడుకున్నాడు. నరహరి,తులసి ఇద్దరు కిరణ్ ని చూసి చాలా ఆనందపడ్డారు.
జూ తరువాత బిర్లా టెంపుల్, టాంక్ బండ్ చూసి , అటు నుంచి హోటల్ కి వెళ్లారు. పక్కన టేబల్ లో వాళ్ళు ఎం‌ఎల్‌ఏ దోసా తెప్పించుకున్నారు. అది చూసిన కిరణ్ ” ఎంటమ్మా అది ?” అన్నాడు.
“అది దోస రా” అని తులసి అంది.
“అదేంటమ్మా , దోస అంటే నువ్వు నాకు నోట్లో ముద్ద పెడతావు కదా. ఇదేమో వేరేలాగా ఉంది” అని కిరణ్ అన్నాడు.
తులసి కిరణ్ ని చూసి , నవ్వి “అది వేరే దోస బాబు. ఇది వేరేది” అంది.
అక్కడ టిఫిన్ చేసి , రైల్వే స్టేషన్ కి బయలుదేరారు. బాగా రద్దీగా ఉండడంతో కిరణ్ ని తన చేయి వదలకుండా గట్టిగా పట్టుకునే ఉంది తులసి. వాళ్ళు ఎక్కవల్సిన రైలు ప్లాట్ఫోర్మ్ న౦బరు 5 పైకి వస్తుందని తెలుసుకుని ముగ్గురు బ్రిడ్జి ఎక్కి అటు వెళ్లారు.సామాను అంతా ఒక పక్కకి పెట్టి , అక్కడే ఉన్న గట్టు పైన కూర్చున్నారు.ఇంతలోగా ఒక పెద్దాయన , వాళ్ళ ఆవిడ , కూతురు ,ఒక ముసలావిడ అక్కడకి ,తులసి కూర్చున చోటుకి వచ్చారు.
వచ్చిన అతను నరహరితో రైలు ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. నరహరి తనకి కూడా తెలియదు , వాళ్ళు కూడా అదే రైలుకోసం చూస్తున్నారు అని సమాధానం ఇచ్చాడు.
వాళ్లతో వచ్చిన అమ్మాయితో కిరణ్ పాలక్రించి , మాట్లాడాడు. ముందుగా ఒకసారి కిరణ్ కేసి చూసి , అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది. కొంచం సేపు బాగానే మాట్లాడి , నెమ్మదిగా విసుక్కోవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి.ఇది చూసి తులసి కిరణ్ ని వారించింది. విసిగించకుండా కూర్చోమని చెప్పింది.సరే అని తల ఊపాడు.ఇంతలోగా రైలు వచ్చింది.అందరూ లేచి రైలు దేగ్గరికి వెళ్లారు.
కిరణ్ ని తీసుకుని తులసి వాళ్ళ బెర్తుల దగ్గరికి వెళ్లింది . వెనకాలే నరహరి సామాను తీసుకుని వెళ్ళాడు. ఆ పెద్దాయాన వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు. ఆ అమ్మాయిని చూసి కిరణ్ ఆనందించాడు.
“నా పేరు శర్మ , మీ పేరు ” అని అక్కడికి వచ్చిన పెద్దాయన అన్నాడు.
“నా పేరు నరహరి అండి. వాడు నా కొడుకు , నా భార్య” అని తులసిని పరిచయం చేశాడు.
కిరణ్ కేసి చూసి , “ఆహా , బావుంది ” అని నవ్వాడు.
రైలు కదిలింది. కిటికీ దగ్గర కూర్చుంటానని కిరణ్ మారాం చేశాడు. నరహరి జరిగి , కిరణ్ ని కూర్చోపెట్టాడు. రైలు ముందరికి కదులుతున్న కొద్దీ చెట్లు , గుడిసెలు , రాళ్ళు , ఇళ్ళు అన్నీ వెనకాలగా వెళ్ళడం గమనించాడు కిరణ్. కిటికీలోనుంచి తలని బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ,నుదురుకి దెబ్బ తగిలించుకున్నాడు. అది చూసి తులసి కిరణ్ ని “గొడవ చేయకుండా కూర్చో నాన్న . అలా దెబ్బలు అవి తగిలించుకోకు ” అని మందలించింది.
రైలులో వేరుశెనగలు , చాక్లెట్ట్లు , బజ్జీలు ఇంకా ఏవేవో అమ్మేవాళ్ళు వస్తునప్పుడల్లా కిరణ్ అది కొను , ఇది కొను , అదేమిటి ,ఇదేమిటి అని ప్రశ్నలు వేయడం అందరికీ కొంచం చిరాకుగా అనిపించింది. ఎదురుగా కూర్చున్న అమ్మాయితని చూసి కిరణ్ నవ్వాడు. ఆ అమ్మాయి కూడా నవ్వింది. అప్పుడు కిటికీ పక్కనుంచి వచ్చి , ఆ అమ్మాయి పక్కకి కూర్చున్నాడు.శర్మ ఇదంతా గమస్తున్నాడు. కిరణ్ ఆమె గాజులు , పుస్తకం ,కళ్ళజోడు అవి పీకడం , ముట్టుకోవడం కొంచం ఇబ్బంది కలిగించింది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ నుంచి లేచి , పైన బెర్తులోకి వెళ్ళి కూర్చుంది. ఇది చూసి ,కొద్దిసేపు అయ్యాక , కిరణ్ కూడా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూంటే , శర్మ గట్టిగా అరిచి , కిరణ్ ని బలవంతంగా కూర్చోపెట్టాడు. నరహరికి కోపం వచ్చింది , అతని దగ్గరగా వెళ్తుండగా తులసి ఆపింది.
రైలు కొంచం వేగం పెరిగాక కిరణ్ నరహరి భుజం పైన నిద్రపోయాడు. గుంటూరు కంటే ముందర వచ్చే స్టేషన్ వస్తున్నప్పుడు , శర్మ నరహరికి దగ్గరగా వచ్చి ,
“ఏవండీ , మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట చెప్తాను.” అన్నాడు శర్మ.
“చెప్పండి.”
“మీరు మీ అబ్బాయిని ఎవరన్నా మంచి డాక్టర్ కి చూపించండి. ఆ చిన్నపిల్ల చేష్టలు అవి తగ్గుతాయేమో. చూస్తుంటే పెద్ద పిల్లాడిలాగా ఉన్నాడు. మతిస్థిమితం బాగానే ఉన్నా , ఏదో ప్రాబ్లం అనుకుంటా” అని శర్మ అన్నాడు.
ఇది విన్న నరహరి , “కరక్టే చెప్పారండి. అసలు హైదారాబాదు వచ్చినదే వీణ్ణి డాక్టర్ కి చూపించడానికి. ఎప్పుడు చూడని లోకం ని చూస్తున్నాడు కదూ , అందుకే ఇంత ఆనందం.’
అయోమయంగా శర్మ నరహరి కేసి చూశాడు.
అది గమనించి నరహరి, ” మా వాడికి పుట్టుకతోనే దృష్టి లేదు. మా ఊరికి ఒక ఎన్‌జి‌ఓ వాళ్ళు వస్తే , ఇక్కడ హైదరాబాద్ లో ఆపరేషన్ చేస్తారని , మా వాడికి చూపు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అది వినగానే నేను , నా భార్య వీణ్ణి తీసుకుని ఇదిగో ఇలా వచ్చాము.”
శర్మ కిటికీ దగ్గర ఉన్న కిరణ్ ని అలా చూస్తూ నోరు వెళ్లబెట్టి ఉండిపోయాడు. విషయం తెలియకుండా కిరణ్ పైన కోపం చూపించినందుకు మనసులోనే బాధపడ్డాడు.
“ప్రకృతి ని తొలిసారిగా చూస్తున్న మా వాడు మరి చిన్నపిల్లాడే కదండీ ! అందుకే చిన్నపిల్ల్లాడిలాగా కేరింతలు వేస్తున్నాడు , చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నాడు ” అని చిన్నగా నవ్వి , తులసికేసి చూసి , కళ్ళలో వస్తున్న ఆనందబాష్పాలతో కిరణ్ ని కళ్ళారా చూసుకున్నాడు.

—————————————-XXXXXXXXXXXXXX—————————————–

3 thoughts on “కలర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *