May 11, 2024

నిజాలు

రచన: పారనంది శాంత కుమారి

అమ్మమాటకో,ఆలిమాటకో లొంగిపోవటం కాదు
ఇద్దరి మాటలకు సమానమైన విలువివ్వాలి.
అమ్మవైపో ఆలివైపో ఒంగిపోవటం కాదు,
ఇరువురిని ఒకేలా చూడగలగాలి.
ఆ ఇద్దరిమధ్యన ఘర్షణలకు కుంగిపోవటం కాదు,
సమయస్ఫూర్తితో వాటిని తీర్చగలగాలి.
వారిరువురిలో ఎవరునిన్ను మెచ్చుకున్నా పొంగిపోవటం కాదు,
ఆ పొగడ్త వెనుకనున్న అసలు ప్రయోజనం తెలుసుకోగాలగాలి.
అమ్మని ఆదరిస్తూనే భార్యప్రేమని ఆస్వాదించాలి.
అమ్మ అవసరాలను తీరుస్తూనే భార్యమనోగతాన్ని స్వాగతించాలి.
అమ్మని గౌరవిస్తూనే ఆలిని గారంచేయాలి.
అమ్మని అపార్ధం చేసుకోకుండానే ఆలిని అర్ధంచేసుకోవాలి.
అమ్మని పరదాలమాటున ఉంచకుండానే ఆలి సరదాలను తీర్చాలి.
అమ్మతో అనుబంధాన్ని,ఆలితో భవబందాన్ని పెంచుకోవాలి.
అమ్మ మహిమను,ఆలి మాయను రెండింటినీ అనుభవించాలి.
అమ్మ పాదాలకు నమస్కరిస్తూనే ఆలి పాదాలని ఒత్తాలి.
అమ్మ ఆరోగ్యాన్ని సరిచూస్తూనే ఆలికి ఆనందాలను సమకూర్చాలి.
అమ్మనొక కంట,ఆలినొక కంట చూసుకోవాలి.
ఇద్దరి సమస్యలనూ ఒకేలా అర్ధం చేసుకోవాలి.
అమ్మను మొత్తకూడదు,ఆలిని ఎత్తకూడదు.
అమ్మ ఎక్కువని,ఆలి మక్కువని,
అమ్మ సత్యమని,ఆలి నిత్యమని ఎరుకరావాలి,
అమ్మ వేకువని,ఆలి వెన్నెలని,
అమ్మ కలిమిఅని,ఆలి బలిమిఅని తెలిసిరావాలి.
అమ్మలేకుంటే జీవితానికి అర్ధంలేదని,
ఆలిలేకుంటే జీవితం అర్ధంకాదని తెలుసుకోవాలి.
ప్రేమకు ప్రతిరూపం అమ్మ!ప్రేమకు ప్రతిబింబం ఆలి!
నువ్వు తెలుసుకోని కానుక అమ్మ,
నువ్వు తెలియలేని వేడుక ఆలి.
నిన్నర్ధం చేసుకొనే ఒకేఒక దేవత అమ్మ,
నువ్వర్ధం చేసుకోవాల్సిన ఒక దేవత ఆలి.
నీ సృష్టికి మూలం అమ్మ,నీ దృష్టికి మూలం ఆలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *