April 27, 2024

‘బెస్ట్ ఫ్రెండ్’ ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: నండూరి సుందరీ నాగమణి
“ఈ మధ్య నీకు మరీ చిరాకు ఎక్కువ అవుతోంది…ఏమైంది నీకు? వర్క్ స్ట్రెస్ బాగా ఎక్కువైనట్టుంది…” నా ముఖంలోకి చూస్తూ చెప్పింది లహరి.
నన్ను నేను నియంత్రించుకుంటూ, “సారీ లహరీ…” అని చెప్పాను. ఈ రోజు లహరి చేసిన ఉప్మాలో పొరపాటుగా ఉప్పు ఎక్కువైపోయింది… ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నపుడు మూడ్ ఆఫ్ అయితే ఇక రోజంతా అంతే… అందుకే ఆమెపై కోపంగా అరిచిన నాకు గిల్టీగా అనిపించింది.
“సుజిత్, నాకు మీటింగ్ ఉంది… టైం అవుతోంది… నేను కాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను… నీకు వీలుంటే బాబును స్కూల్లో దింపేసి వెళ్ళు…” అప్పటికే తయారై ఉన్న లహరి త్వరత్వరగా వెళ్ళిపోయింది బయటికి.
అప్పటికే స్నానం చేసి డ్రెస్ అయి ఉన్న వినీల్ కి కబుర్లు చెబుతూ, పాలల్లో కార్న్ ఫ్లేక్స్ వేసి తినిపించి, నా కార్లో స్కూల్లో దింపేసి నేను ఆఫీసుకు వెళ్ళిపోయాను.
***
ఆఫీస్ కి వెళ్ళింది మొదలు పని, పని, పని… మధ్యాహ్నం ఫారిన్ డెలిగేట్స్ తో హోటల్ లో లంచ్. సాయంత్రం నాలుగింటివరకూ వాళ్ళతో మీటింగ్. మళ్ళీ ఆఫీస్ కి వచ్చి కొన్ని అర్జెంట్ లెటర్స్ చూడటం, రిప్లై లు మెయిల్ లో పంపటం… హార్డ్ కాపీస్ పంపేవి కొరియర్ చేయించటం… సాయంత్రం ఆరున్నర దాటిపోయింది ఆఫీసులోనే.
లహరి తాను వినీల్ ని పిక్ చేసుకుని ఇంటికి వెళుతున్నాను అని మెసేజ్ చేసింది. బాగా అలిసిపోయిన నేను కారు డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాను… ఏమైందో తెలియదు… ఉన్నట్టుండి కారు ఆగిపోయింది. కారు దిగి బానెట్ ఎత్తి చూసాను కానీ సమస్య ఏమిటో అర్థం కాలేదు… చిరు చలి, చీకటి… చిరాగ్గా అనిపించింది. మొబైల్ లోంచి మెకానిక్ కి ఫోన్ చేసాను. కారు ఎలాగూ రోడ్ పక్కకి ఆపుకున్నాను కనుక ఎవరికీ అడ్డం లేదు… అది నో పార్కింగ్ ఏరియా కూడా కాదు…
ఎడమ ప్రక్కన చిన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం కనిపించింది. ఎందుకో నాకు గుడికి వెళ్లాలని అనిపించింది. ఎలాగూ మెకానిక్ రావటానికి అరగంట అయినా పడుతుంది. ఈలోగా ఒక్క సారి వెళ్లి దర్శనం చేసుకుంటే… ఆలోచన వచ్చిందే తడవు, షూ విప్పి కారు లోపలే ఉంచి కారు లాక్ చేసి, కాలి నడకన దేవాలయంలోకి నడిచాను. కాలికి మట్టి, గరుకైన ఇసుక, చిన్న చిన్న రాళ్ళు తగులుతుంటే గమ్మత్తుగా అనిపించింది నాకు.
లోపల నీటి పంపు వద్ద కాళ్ళు కడుక్కుని, ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, దర్శనం కోసం లోపలికి దారి తీసాను. స్వామికి నిలువెల్లా పూలతో అలంకారం బాగా చేసారు… గర్భగుడిలో వెలిగించిన నూనె దీపాల కాంతిలో స్వామి ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్నాడు. రెండు చేతులూ జోడించి స్వామికి నమస్కరించాను. పూజారి శఠారిని తల మీద ఉంచాడు… వాలెట్ లోంచి చేతికి అందిన నోటు తీసి హుండీలో వేసాను.
పక్కనే ఉన్న మంటపంలో కూర్చుని కళ్ళు మూసుకున్నాను. మనసంతా గజిబిజిగా ఉంది. ఆఫీసు వ్యవహారాల తలనొప్పులు సరే సరి… ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండటం లేదు. లహరీ, నేనూ ఇద్దరూ ఆఫీసుల్లో బిజీనే… దాంతో కాసేపు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవటం కూడా గగనమైపోతోంది… వినీల్ తో కలిసి ఆడుకోవటం కానీ, వాడిని చదివించటం కానీ చేయలేకపోతున్నాను… ఎందుకు? ఎందుకు ఈ జీవితం ఇంత యాంత్రికంగా తయారైంది? ఎక్కడా బంధం, అనుబంధం కనిపించటం లేదు… మొన్నటికి మొన్న నా కజిన్ రామన్నయ్య ఇంటికి వెళ్ళినపుడు వాళ్ళ అబ్బాయి బుజ్జిగాడిని దగ్గరకు పిలిస్తే “నాకు హోమ్ వర్క్ చాలా ఉంది బాబాయ్!” అంటూ వెళ్లిపోయేడు. చిన్నప్పుడు ఎప్పుడూ నా దగ్గరే ఉండేవాడు… ఆ క్షణం ఎంతో బాధగా అనిపించినా, పెరిగిపోతున్న చదువులు, బాధ్యతలు గుర్తు వచ్చి సర్దుకున్నాను…
‘టక్ – టక్ – టక్!’ ఏదో చిరపరిచితమైన శబ్దం వినవచ్చింది… ఆ శబ్దం నన్ను కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళింది…
మంటపంలోనే మరో ప్రక్కన కూర్చున్న ఒకావిడ, కొబ్బరి చిప్పను పట్టుకొని పగలగొడుతోంది. గచ్చుమీద ఆ కొబ్బరిచిప్ప చేస్తున్న శబ్దమే అది… విడివడిన కొబ్బరిముక్కను విరిచి ముక్కలు చేసి, తన ఐదేళ్ళ కొడుక్కు కబుర్లు చెబుతూ తినిపిస్తోంది ఆ తల్లి… నాకు ఆ తల్లీ కొడుకులు కనిపించటం లేదు… ఆ స్థానంలో నేనూ, మా కామేశ్వరి పిన్నీ కనబడుతున్నాము… నా మనసు అతి వేగంతో నా బాల్యంలోకి పరుగులు తీసింది.
***
“అబ్బా, సుజా… ఎక్కడమ్మా నువ్వు? కనిపించవా ప్లీజ్…” స్తంభం చాటుగా దాగి ఉన్న నన్ను చూడనట్టే ముందుకు వెళ్లి వెదుకుతున్నట్టు నటిస్తోంది కామేశ్వరి పిన్ని… వెనకాలే వెళ్లి ఆమె కొంగు పట్టుకు లాగాను పకపకా నవ్వుతూ…
“సుజా… వచ్చేసావా? నువ్వు కనబడలేదని ఎంత కంగారైపోయిందో కన్నా…” నన్ను దగ్గరగా హత్తుకుని, బుగ్గల మీద ముద్దులు కురిపించింది పిన్ని.
“జేజి ఎంత బాగున్నాడు పిన్నీ… ఆ పువ్వుల దండలు ఎవరు కడతారు?” పిన్ని పక్కనే కూర్చుంటూ అడిగాను. “గుడిలో పూజారి గారు ఉంటారు కదా… ఆయన పూలు తీసుకువస్తే, వాళ్ళ ఇంట్లో పిన్నులు, అత్తయ్యలూ, వాళ్ళ పిల్లలూ కడతారు…” చేతిలోని కొబ్బరి చిప్పను టక్కు టక్కున గచ్చు మీద కొడుతూ అంది పిన్ని…
“గొబ్బరి నాకూ…” చేయి చాపాను.
“నీకే కన్నా…” ముక్కలైన కొబ్బరిని విరిచి చిన్న ముక్కలుగా చేసి, నాకు తినిపించింది పిన్ని….
మా అమ్మా, నాన్నా ఇద్దరూ ఉద్యోగస్తులే… ఉదయం వెళితే సాయంత్రం వస్తారు. అందుకని నన్ను ప్రతిరోజూ పక్క వీధిలోనే ఉన్న అమ్మమ్మ ఇంట్లో వదిలి వెళ్ళేది అమ్మ. ఇంటర్ ఫెయిల్ అయి ఖాళీగా ఉన్న కామేశ్వరి పిన్ని, తను చదువుకొంటూనే నా ఆలనాపాలనా చూసుకునేది. నాక్కూడా పిన్ని అంటే చాలా ఇష్టం… నిద్ర మంచం మీదనుంచి లేపేసి, అలాగే నన్ను తీసుకువచ్చి దింపేవారు మా నాన్న.
ఏడుస్తూ వచ్చిన నన్ను సముదాయిస్తూ, పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరకు తీసుకుపోయి, “నీకు తెలుసా సుజా, రాత్రి ఈ చెట్టు మీదికి పెద్ద పాము వచ్చింది… సుజిత్ ఏడీ, అని అడిగింది. పొద్దున్నే వస్తాడు అని చెప్పాను…” అని కథ చెబుతూ నాకు పళ్ళు తోమేసి ముఖం కడిగేది…
స్నానానికి ప్రతీరోజూ పేచీ పెట్టేవాడిని… వాకిట్లోని మందార చెట్టునుంచి విరబూసిన పువ్వొకటి కోసుకువచ్చి, బకెట్ లోని వేడి నీళ్ళలో వేసేది పిన్ని. “ఇదేంతి పిన్ని?” అని అడిగితే “ఇది దేవుడి పువ్వు నాన్నా… ఈ నీళ్ళలో ఈ పువ్వేసి స్నానం చేస్తే దేవుడు బోలెడు బొమ్మలు ఇస్తాడు తెలుసా?” అనేది పిన్ని. “జిజంగా? అయితే నేను చేత్తాను… నాకు చానం పొయ్యి…” అనేవాడిని… ఏడవకుండా, చక్కగా స్నానం చేయించుకునేవాడిని. పిన్ని నా వొళ్ళు తుడిచి, పౌడరు వేసి ఉతికిన బట్టలు వేసి పువ్వులా తయారు చేసేది.
టిఫిన్ తినిపిస్తూ జంతువుల కథలు చెప్పేది. నాతో పాటు బొమ్మలు పెట్టుకుని ఆడేది… అక్షరాలు, నెంబర్లూ నేర్పేది… సీసాలో పాలు పడుతూ, చక్కని పాటలు పాడేది… అవి వింటూ హాయిగా నిద్రపోయేవాడిని. గంటో, రెండు గంటలో గడిచాక మెలకువ వచ్చి, పిన్ని కోసమే వెదుక్కునే వాడిని… పిన్ని తో కలిసి ఆడుకునే వాణ్ణి… మధ్యాహ్నం కాగానే తెల్లని అన్నంలో చక్కగా పప్పూ, నెయ్యీ వేసి కలిపి గోరుముద్దలు తినిపించేది పిన్ని. నాకు ఆవకాయ ముక్కంటే చాలా ఇష్టం… కానీ ఆ కారమంటే భయం… అందుకని ఆవకాయ పిండి తను అన్నంలో కలుపుకొని, ముక్కని చక్కగా కడిగి నాకిచ్చేది పిన్ని. అరగంట సేపు దాన్ని చప్పరిస్తూ తినేవాడిని నేను.
నా ప్రతీ పుట్టినరోజుకూ కొత్త డ్రెస్ ఒకటి, నేను కోరుకున్న బొమ్మ ఒకటి తప్పక కొని ఇచ్చేది కామేశ్వరి పిన్ని. వాటిని అపురూపంగా చూసుకునే వాడిని నేను. ఇంట్లో ఉన్నపుడు కోపం వచ్చి మా అమ్మ కేకలు వేస్తే, “నేను పిన్ని దగ్గరికి వెళ్ళిపోతా…” అనేవాడిని కోపంగా… అలా నేను పిన్ని కడుపున పుట్టకపోయినా ఆమెకు కొడుకునై పోయాను.
స్కూల్ లో జాయిన్ అయాక కూడా ఆటో అబ్బాయి సాయంకాలం స్కూలయ్యాక నన్ను అమ్మమ్మ ఇంట్లోనే దింపేవాడు… అమ్మ ఆఫీసు నుంచి వచ్చేవరకూ పిన్నితోనే గడిపేవాడిని. అమ్మ వచ్చేసరికి నా హోమ్ వర్క్, ఒక్కోసారి డిన్నర్ కూడా అయిపోయేవి… “మీరు ఉండబట్టి… ముఖ్యంగా కామూ, నీ వల్ల వీడి గురించి ఏ బెంగా లేకుండా హాయిగా ఉద్యోగానికి వెళ్లి వస్తున్నానే…” రిలీఫ్ గా అనేది అమ్మ.
గుడికి, పార్కులకి, సినిమాలకి పిన్నితోనే వెళ్ళే వాణ్ణి నేను. కేరం బోర్డు ఆడటం పిన్నే నేర్పించింది. అష్టా చెమ్మా కూడా పిన్ని దగ్గరే నేర్చుకున్నాను. స్కూలుకు సెలవులు ఇచ్చినపుడు కజిన్స్ ఇంటికి వెళ్ళినా పిన్ని గుర్తు వస్తే ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించేది… పిన్నితో కలిసి భోజనం చేసినప్పుడు సైగ చేసేవాడిని… తన అన్నంలో ఆవకాయ ముక్క కలిపేసి, కడిగి ఇచ్చేది పిన్ని… అబ్బా అది ఎంత రుచిగా ఉండేదో…
ఒకసారి పిన్ని పుట్టినరోజుకి లేత నీలం రంగు సిల్క్ చీర కొనిచ్చింది అమ్మ… ఆ రోజు అమ్మమ్మ ఇంట్లోనే టిఫిన్ తిన్నాను. స్కూలుకు వెళ్లబోయే ముందు హడావుడిగా, ఎప్పటిలాగే అలవాటు ప్రకారం పిన్ని చీరకొంగు లాక్కుని దానికి చేతులు తుడిచేసుకుని స్కూల్ కి వెళ్ళిపోయాను…
ఆ సాయంత్రం అమ్మ వచ్చి పిన్నిని ఎంత తిట్టిందో… ‘కొంచెమైనా జాగ్రత్త ఉండక్కరలేదా? ఖరీదైన చీర! కొత్తచీరకి అలా మరకలు చేసేసుకుంటావా? డ్రై వాష్ చేసినా ఆ మరకలు పోవు…” అంటూ… పిన్ని నవ్వుతూ చూసిందే తప్ప, నా వల్ల అలా అయిందని చెప్పనేలేదు…
నేను ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మా నాన్నకి వేరే ఊరికి బదిలీ అయింది… అమ్మ కూడా అక్కడికే ట్రాన్స్ ఫర్ చేయించుకుంది… బయలుదేరేముందు పిన్ని దుఃఖానికి అంతులేకుండా పోయింది… నన్ను దగ్గరికి తీసుకుని ఒకటే ఏడుపు… నాక్కూడా బెంగగానే అనిపించింది.
“అయ్యో కామూ, చిన్నపిల్లలా ఇదేమిటే? ప్రతీ సెలవులకీ వాడిని పంపిస్తాగా? బాధపడకు…” సముదాయించింది అమ్మ.
ఊరు వెళ్ళిన తరువాత చదువులో పడిపోయాను నేను. తర్వాత పిన్నికి పెళ్ళి జరిగిపోవటం, ఆమె పల్లెటూరిలో ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోవటం జరిగిపోయాయి… అప్పుడప్పుడూ ఫోన్ చేసేది. నేనుంటే మాట్లాడేవాడిని… పుట్టినరోజుకు తప్పక ఫోన్ చేసి విష్ చేస్తుంది ఇప్పటికీ… నేనే పొడిగా మాట్లాడి పెట్టేస్తూ ఉంటాను… ఎందుకు? ఎందుకిలా మారిపోయాన్నేను? నా మనసు నన్ను నిలదీస్తోంది…
పిన్నికి ఇద్దరు పిల్లలు పుట్టినా నా మీదనే ఎక్కువ ప్రేమను చూపించేది… పైగా ఒక మాట కూడా చెప్పేది… ‘అక్క పిల్లలున్న అమ్మాయిలు పెళ్ళి కాకుండానే తల్లులుగా మారిపోతార్రా…’ అని.. నా పెళ్ళికి ఒంట్లో బాగుండక పోయినా కష్టపడి వచ్చింది పిన్ని. నన్ను దగ్గరకు తీసుకుని ఎప్పటిలా తలమీద ముద్దు పెట్టింది. నాకు సిగ్గేసి, అందరూ చూస్తున్నారని మొహమాటపడి దూరంగా జరిగిపోయాను. పెళ్ళి అయాక బయలుదేరి వెళుతూ, నా చేతిలో ఐదువేలు పెట్టింది… “సుజా! ఏమైనా కొనుక్కో కన్నా” అని చెప్పింది. చాటుగా పెళ్ళికూతురిని కలిసి, “సుజిత్ ని బాగా చూసుకోమ్మా… వాడు పసివాడు…” అని చెప్పిందట… లహరి చెప్పి ఒకటే నవ్వటం… ఆమె అలా పిన్నిని అపహాస్యం చేస్తూ నవ్వటం నాకసలు నచ్చకపోయినా, కొత్తపెళ్లికూతురు కాబట్టి ఏమీ అనలేకపోయాను…
ఇప్పటికీ నేనంటే ప్రాణం పెట్టే పిన్నికి ఏం చేసాను నేను? కనీసం నాకు పెళ్ళి అయాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా కలవలేకపోయాను. రామన్నయ్య వాళ్ళ బుజ్జిగాడి మీద కోపం తెచ్చుకునే అధికారం నాకు ఏముందని?
ప్రతి చిన్న విషయాన్ని ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్టు చెప్పుకునే పిన్నిని చూడకుండా, కలవకుండా ఇన్నేళ్ళు ఎలా ఉండిపోయాను? పైగా బంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఫీల్ అవుతున్నానే… అలా అనుకునే అర్హతే లేదు నాకు…
జేబులో ఉన్న మొబైల్ రింగ్ అవటంతో గబుక్కున ఈ లోకంలోకి వచ్చిన నాకు అర్థమైంది, నేను ఏడుస్తున్నానని… చేతిరుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాను. ఫోన్ లో అవతలి పక్కన మెకానిక్… తాను కారు దగ్గర ఉన్నానని, రమ్మని పిలుస్తున్నాడు… దీర్ఘంగా నిట్టూర్చి లేచాను.
***
“ఇప్పుడు ఆ పల్లెటూరికి ఎందుకూ?” పదో సారి విసుగ్గా, చిరాగ్గా అంది లహరి ట్రాలీ బాగ్ సర్దుకుంటున్న నా వైపు చూస్తూ…
“నీకు చెప్పలేను లహరీ… చెప్పినా నీకు అర్థం కాదు… అర్జెంట్ గా మా పిన్నిని చూడాలి నేను…”
“ఎవరినీ? ఆ పల్లెటూరావిడనా?” కిసుక్కున నవ్వింది లహరి.
“నీకు దామిని బెస్ట్ ఫ్రెండ్ కదా… ఆవిడని ఎవరైనా ఏమైనా అంటే నీకు కోపం, బాధ కలుగుతాయి కదూ?” లహరి ముఖంలోకి నిశితంగా చూస్తూ అన్నాను..
“అవును… అయితే?”
“మా పిన్నిని గురించి ఎవరు చులకనగా మాట్లాడినా నాకూ అంతే… షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్!”
“ఓయబ్బో, ఇంతకాలం ఏమైంది ఆ ప్రేమ?” సాగదీసింది లహరి.
“బెటర్ లేట్ దాన్ నెవ్వర్… ఇన్నాళ్ళూ పోగొట్టుకున్న సిరిని మళ్ళీ సంపాదించుకోవటానికే వెళుతున్నాను…” ట్రాలీ జిప్ వేసాను నేను.
“జాగ్రత్త లహరీ… వినీల్ మీద విసుక్కోకు… వాడితో ఫ్రెండ్లీ గా ఉంటూ కాస్త కథలూ, కబుర్లూ చెప్పు… ఊరికే కోప్పడకు… పిల్లలను ప్రేమించటమూ, పెంచటమూ ఓ కళ… అది మా పిన్నికి బాగా తెలుసు… నీకు మేనేజ్ చేయటం కష్టం అనిపిస్తే లీవ్ పెట్టుకో… కానీ వాణ్ణి చూసుకో… నేను బయలుదేరతాను…బై విన్నూ… నెక్స్ట్ టైం కామూ బామ్మ దగ్గరికి నిన్నూ తీసుకువెళతానులే…” నావైపే బెంగగా చూస్తున్న వినీల్ కి చెప్పేసి కదిలాన్నేను.
***
“సుజా… నువ్వు… నువ్వేనా తండ్రీ! ఇన్నాళ్ళ తర్వాత నాకోసం వచ్చావా?” కామేశ్వరి పిన్ని తన కళ్ళజోడు సవరించుకుంటూ నా వైపు చూసి నన్ను దగ్గరకు తీసుకుంది… కానీ కంటికి కన్నీరు అడ్డుపడటం వలన నా రూపురేఖలు కనిపించక, నా ముఖాన్ని ఆర్తిగా తడమసాగింది…
“పిన్నీ…” ఆమె కౌగిలిలో ఒదిగిపోయాను.
“సుజ్జన్నా, అమ్మకి నీ గురించి ఎంత ఆరాటమో… సుజాకి ఈ పండు అంటే ఇష్టం… సుజాకి ఈ స్వీటు అంటే ఇష్టం అని చెబుతూ ఉంటుంది… ఆ పాత చీర లైట్ బ్లూ కలర్ ది బీరువాలోంచి తీసుకుని దానిమీదున్న మరకల వైపే చూస్తూ, వాటిని తడుముతూ ఉండిపోతుంది… అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం…తనకి స్నేహితులు ఎవ్వరూ లేరు… నువ్వే తన బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతూ ఉంటుంది మాకు…” పిన్ని కొడుకు సుధీర్ చెప్పాడు.
నాకు ఉవ్వెత్తున ఏడుపు వచ్చేసింది… ఏడుస్తున్న నన్ను సముదాయిస్తున్నట్టు వీపు మీద నిమిరింది పిన్ని.
ఆ మధ్యాహ్నం భోజనం చేస్తుంటే, ఆవకాయ ముక్కను అన్నంలో కలుపుకున్న పిన్నికి, ఆ ముక్కను కడిగి నాకివ్వాలని అనిపిస్తోంది… కానీ ఏదో మొహమాటం అడ్డుపడటం వలన సంశయిస్తోంది…
“పిన్నీ, నా ఆవకాయ ముక్క…” అంటూ ముందుకి వంగి, కామేశ్వరి కంచంలోని ఆవకాయ ముక్కను గబుక్కున తీసుకుని, చటుక్కున నోట్లో పెట్టేసుకున్నాను. అదే రుచి… పసితనంలోకి పరుగు తీస్తూ వెళ్ళిపోయింది నా మనసు… కామేశ్వరి పిన్ని ముఖంలో వేయి చందమామల కాంతి… కళ్ళలోకి ఆనందబాష్పాలు వచ్చేసాయి…
“పిన్నీ, నా కొడుకును ఎలా పెంచాలో నాకు తెలియటం లేదు…” చిన్నపిల్లాడిలా పిన్ని ఒడిలో తలపెట్టుకుని పడుకున్న నా జుట్టులోకి వెళ్ళు పోనిచ్చి దువ్వుతూ, “పిల్లల మీది ప్రేమ లోపల ఉంటే చాలదు నాన్నా, దాన్ని ఎక్స్ ప్రెస్ చేయాలి… అప్పుడు అన్నీ అవే వస్తాయి…” అంది మెత్తగా…
***
(సమాప్తం)

విశ్లేషణ: డా.మంథా భానుమతి

స్నేహం అంటే సమ వయస్కుల మధ్యనే ఉండాలని లేదు. ఒక తాతా- మనవడు, అమ్మమ్మా- మనవరాలు, కలిసి పెరిగిన మేనత్త-మేనకోడలు.. ఇలా ఏ ఇద్దరి మధ్యనైనా ఉండచ్చు. సాధారణంగా తెలుగు వారి కుటుంబాలలో, ఇళ్లల్లో చిన్నవాళ్లకి అక్క పిల్లలతో, అన్న పిల్లలతో ఉండే అనుబంధం ఒక తీయని స్నేహం అనడంలో అనుమానం లేదు. అందుకే పింతల్లో- మేనత్తో, తల్లో- మేనమామో, తండ్రో-పింతండ్రో అంటారు.
ఈ అనుబంధాన్ని కథా వస్తువుగా తీసుకుని చక్కని కథ అల్లారు నండూరి సుందరీ నాగమణి. సుజిత్, ఎంతో ప్రేమతో ఆడించిన తన అన్న కొడుకు అంటీ ముట్టనట్లు ఉన్నాడని బాధపడుతూ, అనుకోకుండా దర్శనం చేసుకున్న ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని.. కొబ్బరి ముక్క పగల గొట్టిన శబ్దం విని, తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. కామేశ్వరి పిన్నితో తనకి గల స్నేహబంధాన్ని తల్చుకుంటూ, తనకీ అన్న కొడుక్కీ ఏ మాత్రం భేదం లేదని గ్రహించి, పిన్నిని చూడడానికి వెళ్లడం చాలా సహజంగా చెప్పారు రచయిత్రి.
నండూరి సుందరీ నాగమణి పాఠకులకి సుపరిచితురాలు. కొద్ది కాలంలోనే ఎన్నో కథలూ, నాలుగు నవలలూ రచించి, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సులభమైన శైలితో, మన పక్కింట్లోనో ఎదురింట్లోనో జరుగుతున్న సంఘటనలేమో అనిపిస్తాయి ఆవిడ కథలు చదువుతుంటే.

2 thoughts on “‘బెస్ట్ ఫ్రెండ్’ ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

  1. చక్కటి కుటుంబ కధా.. ఇతివృత్తం..మనసుకు హత్తుకునేలా రాసారు…రచయిత్రి..కి అభినందనలు….

  2. జ్యోతీ, నా కథను ప్రచురించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చక్కని సమీక్ష చేసినందుకు భానక్క గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *