May 3, 2024

Gausips – ఎగిసే కెరటాలు-8

రచన: శ్రీసత్య గౌతమి

తెల్లారింది. అమెరికా కూడా నిద్ర లేచింది. రాకేష్ ఎప్పుడో లేచిపోయి తయారయ్యి ఆఫీస్ కి బయలుదేరడానికి రెడీగా ఉన్నాడు. ఈ లోపుల కాఫీ కలుపుకొని తాగుతూ టీ.వి, పెట్టుకొని వెదర్ చానల్ చూస్తున్నాడు. అప్పుడు లేచింది సింథియా.
“ఆర్ యూ రెడీ టు గో?” సింథియా ప్రశ్న.
“యెస్”
“నన్నేం చెయ్యమంటావ్?”
“నీ యిష్టం. కాఫీ చేసుకుంటావో లేక డంకెన్ డోనట్స్ కి వెళ్తావో”.
“నువ్వక్కడినుండి కాఫీ తెచ్చుకున్నావా? మరి నాకూ తేలేదేం?” చిన్నగా గద్దించింది సింథియా.
“నువ్వు నాకెప్పుడైనా కాఫీ చేసిచ్చావా?” అని ఎదిరించాడు రాకేష్.

దానికి కొంచెం ఆశ్చర్యపోయింది సింథియా. “రాత్రేగా తనకు కూడా ఫ్రెండ్స్ తో పాటు కాక్టైల్ కలిపిచ్చాడు??? కాఫీ తేవడానికేమయ్యింది? అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా ఎవరూలేనప్పుడు మరోలా ఉంటున్నాడా? ఏం ఎందుకు?” …….. ఆలోచించడం మొదలెట్టింది.

నీకోసం తెచ్చుకునేటప్పుడు నాకు తెచ్చి పెట్టొచ్చుగా?” అక్కసుగా అడిగింది సింథియా.
“నేను నీ పనివాడినా?” సూటిగా అడిగాడు.
ఇలా తానొకసారి అతనని అడిగిన సంధర్భం గుర్తొచ్చింది సింథియాకు.
“మరి నిన్న వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకీ, నాకు కలిపిచ్చావ్?”
“అది ఫ్రెండ్షిప్”… అంతే సూటిగా రాకేష్ సమాధాన మిచ్చాడు.
ఇక తన టైం బాగోలేదు, సంపాదనా లేదు … పడుండాలి తప్పదు అని సరిపెట్టుకొని సింథియా మళ్ళీ అడిగింది.
“సరే కాఫీ గురించి వదిలేద్దాం. నా ఉద్యోగం గురించి నన్నేమి చెయ్యమంటావ్?”
“అదీ నీ యిష్టమే”
“కౌశిక్ సహాయం తీసుకోవాలనుకుంటున్నాను”
“చేస్తానన్నాడా?”
“చెయ్యాలి. చేస్తాడు. ఇంతకు మునుపు మా ఇద్ధరి స్నేహం అటువంటిది”

రాకేష్ భృకుటి ముడిపడింది. ఆమె చెప్పే విధానం అతనికి వింతగా తోచింది.
“సరే. నీ యిష్టం. ఉద్యోగం సంపాదించుకో. ఆ ఉద్యోగంలేకపోతే చిక్కి శల్యమైపోయేటట్లున్నావు”
ఆ మాట సరదాగా మాత్రం తీసుకోలేదు సింథియా. తనను రాకేష్ దెప్పి పొడుస్తున్నట్లుగానే తీసుకున్నది. అవమానపడినట్లుగా ఫీల్ అయ్యింది.
పైకి మాత్రం “సరే” అన్నది.
***************
సాయంత్రం కూడా అయ్యింది. రాకేష్ వచ్చేశాడు, కిచెన్ లోకి వెళ్ళి మైక్రో వేవ్ లో ఏదో హీట్ చేసుకొని లైట్ గా డిన్నర్ కి ఉపక్రమిస్తున్నాడు. సింథియా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నది.

“హలో” … సింథియా ఫోన్ లో మాట్లాడుతున్నది కౌశిక్ తో.
“ష్యూర్. వెన్ కెన్ ఐ కం?”
“అఫ్ కోర్స్” అంటూ వెయ్యి వోల్టుల బల్బుల కాంతిని ముఖాన నింపుకొని చాలా ఆనందంగా ఉంది. రాకేష్ ఆమె ముఖం చూసి “అబ్బో … ఏం జరిగిందో” అని స్వగతంగా అనుకున్నాడు.

సింథియా చక చకా బీరువాలోని బట్టలు తీసుకొని పాటలు పాడుకుంటూ బాత్రూం లోకి వెళ్ళిపోయింది. రాకేష్ జాగ్రత్తగా అబ్జెర్వ్ చేస్తున్నాడు.
“ఆమె కిష్టమొచ్చినట్లు వుండడం, తనకు కావల్సిందాని గురించి మాత్రమే ఆలోచించడం చేస్తున్నది సింథియా. కాస్త ఉద్యోగం పోగానే చాలా తల్లడిల్లిపోతోందీ, ఇండియాలో పాత స్థలాన్ని, పాత బాస్ ని తలుచుకొని తలచుకొని కుమిలిపోతోంది. ఇప్పటివరకూ ఆమె ఆలోచనల్లో నేను గాని, కనీసం తన అమ్మా, నాన్న, తమ్ముడు వాళ్ళయినా కూడా లేరేమిటీ? క్రొత్తగా విదేశాలకొచ్చిన అమ్మాయిలు చాలా హోం సిక్ గా ఫీల్ అవుతారు, అది కూడా కనబడలేదు ఈమెలో. ఏంటబ్బా???? కేవలం అమెరికాకు రావడానికి మాత్రమే నన్ను చేసుకున్నట్లున్నది. నేనే గనుక ఇంటెర్ నెట్లో దొరకకపోయుంటే అమెరికా ఆలోచనే ఉండేది కాదేమో. ఇక్కడి విషయాలన్నీ చెప్పి నేనే ఆమెకు అనవసరమైన ఆలోచన్లను రేకెత్తించానేమో… దాని ఫలితంగా ఆమె స్వార్ధానికి నేనే బలయిపోయానన్నమాట”

ఈ ఆలోచనలతో చాలా సత మతమయి రాకేష్ మనసు చాలా బరువెక్కింది. ఇక ఈమెను నేను, నా సంసారమనే దారిలోకి తీసుకురావడం కష్టమే. మోస పోయాను … మోసపోయాను … అని రెండుసార్లు అనుకొని మనసులోనే వెక్కి వెక్కి ఏడ్చాడు.

ఈలోపుల స్నానం చేసి ఫ్రెష్ గా తయారయ్యి సింథియా నవ్వుతూ వచ్చి ప్రక్కన కూర్చున్నది.

“హౌ ఈజ్ యువర్ డే?” సింథియా పలకరింపు.
“గుడ్” ముక్తసరిగా జేవురించిన మొహంతో రాకేష్.
“టుమారో ఐ యాం మీటింగ్ కౌశిక్”
దేనికి అని అడగబోయి ఇష్టం లేక “ఊ” … అని ఊరుకున్నాడు.

సింథియా రాకేష్ ముఖ కవళికలను చూసి … తన ఆనందాన్ని రాకేష్ ఓర్చుకోలేకపోతున్నాడనే అనుకున్నది తప్పా … తన గురించి చాలా లోతైన ఆలోచనలను చెయ్యడం మొదలుపెట్టాడు రాకేష్ అని మాత్రం క్యాచ్ చెయ్యలేకపోయింది.

అదే సింథియా తెలివి తక్కువతనం. తాను ఎలా చూసినా, ఏమిచేసినా కన్నవాళ్ళు ఆమె మీద ఆధారపడి ఉండబట్టి పడి ఉన్నారు. చటర్జీ కూడా గారాన్ని నేర్పేశాడు, ఆమె ఆడింది ఆట, పాడింది పాట. పెళ్ళి చేసుకున్న రాకేషే కదా …పిలక పట్టుకొని ఆడించొచ్చు అనుకున్నది. బెడిసికొడుతోంది.

చాలా హుషారుగా ప్రొద్దున్నే లేచి డ్రెస్ అప్ అయ్యి సింథియా రాకేష్ చూస్తుండగానే బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోతోంది. రాకేష్ మౌనం గా చూస్తున్నాడు. ఆ చూపు ని అనుకోకుండా మళ్ళీ మననం చేసుకుందేమో సింథియా ఆగి వెనక్కి చూసి చెప్తోంది.

“రాకేష్ … నేను కౌశిక్ ని కలవడానికి వెళ్తున్నాను. సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను నా ప్రోగ్రాం గురించి, ఓకే … సీయు”.

రాకేష్ మౌనం లో తేడాలేదు, చూపులోనూ తేడాలేదు.

సింథియా కారు కదిలి వెళ్ళిపోయింది.

*************

కౌశిక్ ని ఆఫీస్ లో కలిసింది. చాలా సేపు ఫ్రెండ్లీ గా మాట్లాడుకున్నారు. తర్వాత చెప్పింది ఉద్యోగ విషయం. సింథియా చెప్పేంతవరకూ కౌశిక్ అడగలేదు. అది సింథియాని ఆశ్చర్యపరిచింది.

“ఈ టాపిక్ నేను ఎత్తేంత వరకూ మీరు నన్ను అడగనే లేదూ…”
“నువ్వు దీనికొచ్చావని నాకు చెప్పలేదుగా.. ఫ్రెండ్లీగా కలుద్దామనేగా అడిగావ్”
“అయితేమాత్రం?”
“వెల్ … అది నీ స్వంత విషయం’.
“ఈ సమాధానం ఎందుకో నాకు నచ్చలేదు”

కౌశిక్ నవ్వి వూరుకున్నాడు.

అది సింథియా గమనించి, మీరు చూపించిన ఈ ఉద్యోగం పోయింది. అది చెబుదామని కూడా వచ్చాను.

“నాకు తెలుసు … నీ బాస్ నాకు ఫ్రెండే గా. చెప్పింది”

ఆ మాట విని హతాశురాలయ్యింది … సింథియా.

“అయినా నో ప్రోబ్లం. యు విల్ గెట్ అనెధర్ జాబ్. నౌ యు హేవ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ అమెరికా”
“వెల్ వెల్ వెల్ … థిస్ ఈజ్ వాట్ ఐ యాం నాట్ లుకింగ్ ఫర్. ఐ వాంట్ అ జాబ్”
“వెల్ … ఫర్ థట్ యు నీడ్ టు వర్క్ టు థైర్ సాటిస్ఫేక్షన్ అండ్ నీడ్ టు రీచ్ డెడ్ లైన్స్”
“హౌ డు యు నో వాట్ హేపెండ్ థేర్?”
“ఐ వస్ టోల్డ్ ఆల్ రెడీ”
“ఓహ్ … యు న్యూ థిస్ బిఫోర్. నో ప్రాబ్లం … బట్ వ్హాట్ ఆల్ మై ఓల్డ్ బాస్ సెడ్ … ఇట్స్ అ లై. షీ బాధర్డ్ మి లైక్ ఎనీథింగ్. అండ్ రాకేష్ డిడ్ నాట్ అండర్ స్టాండ్ మి అండ్ మై ప్రాబ్లం విత్ హెర్. హి బికేం అ పైన్ టు మి టూ …” అంటూ ఏడుపు లంఘించుకున్నది.
“ఈజ్ ఇట్? ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ హిం?”
“యస్ … నాట్ హ్యాపి. ఐ లాస్ట్ మై జాబ్ బికాజ్ ఐ కుడ్ నాట్ కాన్సెంట్రేట్ బికాజ్ ఆఫ్ హిం. నౌ ఆల్సో హి ఈజ్ బాధరింగ్ మి యాజ్ ఐ లాస్ట్ మై జాబ్ అండ్ నో ఎర్నింగ్స్. ఏదో ఒక దెప్పిపొడుపు మాట అంటున్నాడు, తను కాఫీ చేసుకుంటాడు నాకు కనీసం తాగుతావా అని కూడా అడగడు. బయట నుండి ఫుడ్ తెచ్చుకుంటాడు, వేడి చేసుకొని తినేసి నిద్రపోతాడు. అసలు తిన్నానా, లేదా అని కూడా అడగడు. ఈ మార్పులు క్రొత్తవి. ఉద్యోగం పోవడం వల్ల నాకిస్తున్న ట్రీట్మెంట్ అలాంటిది”

మొసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టింది. అంతవరకూ గలగల లాడుతున్న సింథియా … పారే నదిలా ఏడ్చేసరికి కౌశిక్ నిజం గా బాధపడడం మొదలు పెట్టాడు.

చటర్జీ తో మాట్లాడలేకపోయావా రాకేష్ గురించి. తానేమయినా మాట్లాడేవాడేమో రాకేష్ తో. తనకు రాకేష్ బాగా తెలుసుకదా.

మాట్లాడాను, ఇవాళో రేపో మీతో కూడా చటర్జీ మాట్లాడతానన్నారు.

“నాతో? దేని గురించి?”
“ఎందుకలా నొచ్చుకుంటారు? ఈ అభాగ్యురాలి మాట అంత చేదయిపోయిందా? నాలా క్రొత్తగా పెళ్ళి చేసుకొని అమెరికా వచ్చే అమ్మాయిలు ఎంతో మంది బాధలు పడుతున్నారు …” అని వెక్కి వెక్కి ఏడ్చింది.

పూర్తిగా వేరే వేరే డైరక్షన్స్ లోకి తీసుకు వెళ్ళిపోయింది సింథియా తన కేసుని. కౌశిక్ పూర్తిగా జాలితో నిండిపోయిన కబూతర్ అయిపోయాడు. అతని దృష్టిలో రాకేష్ ఒక రాక్షసుడు ఇప్పుడు. చటర్జీని తెచ్చి పెట్టింది తెలివిగా సింథియా, ఇంకా తెలివిగా తన పైన జాలిని సృష్టించుకొన్నది. కౌశిక్ ఇక సింథియా, చటర్జీల గ్రిప్ లోకి మళ్ళీ దూకెయ్యడానికి సిద్ధం గా ఉన్నాడు.

ఎలా మరికొంతసేపు ఇద్దరూ మాట్లాడుకొని అక్కడినుండి నిష్క్రమించారు. ఆ రాత్రే చటర్జీ దగ్గిరనుండి కౌశిక్ కు ఫోన్. చాలా సేపు ఏవో మాట్లాడుకున్నారు. ఫోన్ పెట్టేశాక…

కౌశిక్ చాలా సేపు అలాగే కూర్చుండిపోయి చేతిలో ఉన్న వైన్ గ్లాసుని నోటకందించుకొని సన్నగా వైన్ సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు.

ఆ తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్లు తలాడించుకొని వెళ్ళి నిద్రపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *