May 3, 2024

శుభోదయం – 10

రచన: డి.కామేశ్వరి

“భయపడకు అమ్మా! నాకేం అవలేదు. నిక్షేపంలా వున్నాను ఆ సంగతి విని. నా రంగులాగే నా చర్మం దళసరి. ఏమీ అవదులే” అన్నాదు కులాసాగా. రాధ నిట్టూర్చింది.
“రాధా… నీ నిట్టూర్పులు యింక మానేయి. జరగవలసిందంతా జరిగింది. ఇప్పుడింక దేనికి భయం. ఆ మాధవ్ కూతురికలా జరిగింది. తనకి జరిగిన అవమానం, శిక్ష నీకు తెల్సిందన్న దుగ్ధతో అలా అన్నాడు. యిన్నేళ్ళ తరువాత నిన్ను చూడడం. ఆ చూడడం అలాంటి సమయంలో జరిగింది కనక ఉక్రోషం కొద్ది ఏదో అన్నాడు. ఆ మాటలు పట్టించుకుని నీవు సిల్లీగా బాధపడడం చాలా బావుంది.” రాజారాం మందలిస్తున్నట్టన్నాడు.
రాధ విషాదంగా నవ్వింది. “నీకు తెలీదు రాజారాం. అతనెంత నీచంగా నన్ను అవమానించాడో తల్చుకుంటే బాధగా వుంది. ఆడదాన్నయి వుండి, తోటి స్త్రీని, అందులో అభంశుభం తెలియని చిన్నపిల్ల మీద అతని మీద కోపం తీర్చుకోవడానికింత నీచానికి ఎలా వడిగట్టగలనని అసలు ఎలా ఆలోచించాడు. రెండేళ్ళు కాపురం చేశాడు. నన్ను అంత తక్కువ అంచనా ఎలా వేయగలిగాడు?”
“లీవిట్ రాధా.. కోపంతో, అసూయతో అన్నాడు కాని సీరియస్‌గా అనలేదని నా ఉద్ధేశం”
అతని మాటలు అతని నోట్లో వుండగానే, మాధవ్ సీరియస్‌గా కాక అతి సీరియస్‌గా అన్నాడని నిరూపిస్తున్నట్టు పోలీస్ యినస్పెక్టర్ వచ్చాడు.
“రండి యిన్‌స్పెక్టర్.. ఆ రౌడీల సంగతి ఏమన్నా తెల్సిందా, వాళ్ళేమన్నా చెప్పారా” ఆ విషయం మాట్లాడడానికి వచ్చాడని ఆరాటంగా అడిగింది రధ.
ఇనస్పెక్టర్ యిబ్బందిగా మొహం పెట్టి ” ఆ విషయం యింకా ఏమీ తెలియలేదు. కాని.. కేసు కొత్తమలుపు తిరిగింది. సారీ మేడం.. ఈ కేసులో అనుమానితులుగా మిమ్మల్ని, మీ అబ్బాయిని ప్రశ్నించడానికి మెజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టమని మాకు ఆర్డర్స్ వచ్చాయి.” అతనేదో తప్పు పని చేస్తున్నట్టు రాధ మొహం చూడలేక రాజారాం వంక చూస్తూ అన్నాడు.
రాధ, శ్యాం, రాజారాం ముగ్గురూ ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. “వ్వాట్?” రాజారాం నోరు పెగుల్చుకుని అన్నాడు. వీళ్లు అనుమానితులా? ఏ ఆధారంతో ఆ మాట అంటున్నారు” ఆశ్చర్యంగా అన్నాడు.
“రేప్ చేయబడిన కుమారి రేఖ తండ్రి పోలీసు కంప్లెయింట్ యిచ్చారు. తన మీద పాతకక్షతో రాధాదేవిగారు యీ పని ఎవరికో డబ్బిచ్చి చేయించారని, అందులో ఆమె కొడుకు పాత్ర కూడా వుండవచ్చని తమకు గట్టి నమ్మకం వుందని దోషులను పట్టి శిక్షించాలని కోరుతూ కంప్లెయింట్ యిచ్చారు.
రాధ మొహం తెల్లగా పాలిపోయింది. “నేను చేయించానా? ఎంత అన్యాయం! ఇన్‌స్పెక్టర్! మీరూ చూశారు రేఖ దుస్థితికి నేనెంత బాధపడ్డానో, మీకు ఆ రౌడీల గురించి ఆచూకీ యిచ్చింది నేను” అంది ఆందోళనగా, శ్యాం కూడా యీ వ్యవహారం యింత దూరం వెడుతుందని ఎదురుచూడలేదేమో తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు.
“నిజానిజాలు మాకెలా తెలుస్తాయి మేడం. ఆ రౌడీల గురించి చెపితే మీ మీద అనుమానం రాకుండా వుంటుందని చెప్పారని ఆయనంటున్నారు. యింతకీ అనుమానితులు అన్నాం కాని మీరే చేశారని అనలేదు కదా? మీరు చెప్పదలచింది మెజిస్ట్రేట్ ముందు చెప్పవచ్చు. అనుమానం నిరాధారమని మీరు తేల్చలేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయించవచ్చు. అనుమానానికి తగిన ఆధారాలు లేవని ఆయననుకుంటే మిమ్మల్ని వదిలేస్తారు.
“ఇంతకీ ఏ ఆధారంతో ఆయన రాధ మీద కేసు పెట్టాడు. ఎవిడెన్సు లేకుండా ఎవరో ఏదో అన్నారని మెజిస్ట్రేట్ ప్రశ్నించే హక్కు వుంటుందా?” రాజారాం అడిగాడు.
నీవెవరన్నట్టు చూసాడు యినస్పెక్టర్.
“ఆయన రాజారాంగారని మా స్నేహితులు, శ్రేయోభిలాషులు” రాధ అతని భావం గుర్తించి అంది.
“సార్.. వెంటనే పూర్తి ఎవిడెన్స్ లేకపోయినా, అనుమానితులుగా ప్రశ్నించే హక్కు మెజిస్ట్రేట్‌కి వుంది. ఆయన ప్రశ్నలకి సమాధానాలు సంతృప్తికరంగా వుంటే విడిచి పెట్టవచ్చు. యిటీజ్ అప్ టు హిం.. అనుమానాస్పదంగా వుంటే అరెస్ట్ చేసి కోర్టులో కేసు అయేవరకు బెయిల్ మీద విడిచిపెట్టవచ్చు. బెయిల్ యిచ్చేది లేనిది ఎగైన్ యిటీజ్ అప్ టు హిం. సాధారణంగా మర్డర్ కేసుల్లో కళ్ళారా చూసినవారిని ఎవరయినా చూస్తే అలాంటివారికి తప్ప మామూలుగా యిలాంటి కేసులకి బెయిల్ తప్పకుండా యిస్తారు” యినస్పెక్టర్ వివరించాడు. ఆ యినస్పెక్టర్ పాపం కుర్రాడు. రాధాదేవి ఆస్పత్రికి రావడం, రేఖమీద ఎంత సానుభూతి చూపిందో, తమకి ఆ రౌడీల గురించి ఆచూకి యివ్వడం తెలుసు. చదువుకుని, ఉద్యోగం చేసే ఆమెపై అతనికి గౌరవం వుంది. యీ పని ఆమె చేసిందంటే అతనికి ఎంతమాత్రం నమ్మకం లేదు. కాని అతని డ్యూటీ అతను చెయ్యక తప్పదు.
“ఇన్‌స్పెక్తర్! మాధవరావుకి నా మీద అనుమానం వుంది. యిందుకు శ్యామ్ ది ఏముంది? నేను వస్తాను నన్ను తీసికెళ్ళండి” అంది ఆందోళనగా.
“సారీ మేడం, నా డ్యూటీ నన్ను చేయనీండి. పదండి వెడదాం.”
రాధ ఆందోళనగా రాజారాం వంక చూసింది.”యిన్‌స్పెక్టర్, ఆమె తరఫున మాట్లాడటానికి మేము లాయర్‌ని ఏర్పాటు చేసుకోవచ్చునా.. రాధా! నేను లాయర్‌తో మాట్లాడి తీసుకొస్తాను. అంతవరకు నీవు ఏమీ మాట్లాడకు” అన్నాడూ.
నిండా మునిగాక చలి ఏమిటన్నట్టు చూసింది రాధ. “లాయరు ఎందుకు రాజారాం, ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్. ఆ మాత్రం జవాబులు చెప్పగలను. చెయ్యని నేరానికి ఎందుకు భయపడాలి” అంది నిబ్బరంగా.
“అది కాదు. లా పాయింట్లు..”
“సార్.. యిప్పుడు కేవలం అనుమానితులా కాదా అనడానికి ఎలిబీ గురించి దాని గురించి అడుగుతారు. మెజిస్ట్రేట్ వీరి జవాబులతో సంతృప్తి పడకపోతే అప్పుడు లాయరుతో మాట్లాడవచ్చు. మీరు పదండి మేడం. ఆలస్యం అయింది” యిన్‌స్పెక్టర్ కాస్త అసహనంగా అన్నాడు.
“సరే, ఎందుకన్నా మంచిది లాయర్‌తో మాట్లాడతాను. రాధా, మీరు వెళ్లండి. ధైర్యంగా జవాబులు యివ్వు. శ్యాం అమ్మకి ధైర్యం చెప్పు” రాధ చీర మార్చుకుని, బ్యాగ్ పట్టుకుని యిల్లు తాళం పెట్టింది. రాధ, శ్యాం పోలీసు జీపులో కూర్చున్నారు.
ఇంటిముందు పోలీసు జీపు రావదం, యిన్‌స్పెక్టర్ రావడం చూసి యిరుగు పొరుగు కుతూహలంగా ఏమిటోనని చూశారు. యింటి ముందు తచ్చాడారు.
రాధ, శ్యాం పోలీసుల వెంట జీపులో ఎక్కి కూర్చుని వెడుతుంటే తెల్లబోతూ చూసారు . రాజారాంని అందరూ చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు.
“ఆ, ఏం లేదు. ఆ రేప్ కేసులో ఎవరో రౌడీలు అనుమానితులు అంటూ రాధ చెప్పిందంట. అదేదో అడగడానికి తీసికెళ్తున్నారు” అంటూ యింకేం అడిగే అవకాశం యివ్వకుండా లాయరుని కలవడానికి వెళ్లిపోయాడు.
*****
“రాధాదేవిగారూ! కుమారి రేఖకి జరిగిన మానభంగంలో మీ చెయ్యి వుందని కుమారి రేఖ తండ్రి మీ మీద కంప్లెయింట్ యిచ్చారు. యిందుకు మీ సమాధానం ఏమిటి? మెజిస్ట్రేట్ మర్యాదగానే అడిగాడు. రాధాదేవి సౌమ్యరూపం, ఆమె మొహంలో కనపడే సంస్కారం చూసి ఆమె చేస్తున్న ఉద్యోగం అన్నీ తెలిసి మర్యాద చూపించి కూర్చోమని కుర్చీ ఆఫర్ చేసి అడిగాడు.
రాధ తొణక్కుండా నిబ్బరంగా చూసింది. “రేఖ మీద జరిగిన అత్యాచారంలో నా పాత్ర వుందని ఆయన ఏ ఆధారంతో అన్నాడు? నా పాత్ర ఏ విధంగా వుందన్నారో చెప్పగలరా సార్!”
“ఆయన మీద పాతకక్షతో మిమ్మల్ని గురిచేసిన అవమానానికి ప్రతీకారంగా ఆయన కూతురినిలా చేసి పగ సాధించి తృప్తిపడాలని మీరే ఎవరిచేతో డబ్బిచ్చి చేయించారని ఆయన అంటున్నారు. దీనికి మీరేం చెప్పగలరు?”
“సార్, ఎప్పుడో యిరవై ఏళ్ళ క్రితం ఆయన మీద వున్న కోపం చూపడానికి ఒక అమాయకురాలైన యువతి జీవితాన్ని ఎన్నుకునేటంత కుసంస్కారం నాలో లేదని చెప్పగలగడం తప్ప యింకేం చెప్పలేను. నేననుభవించిన హింస, అవమానం మరో స్త్రీకి కలిగించేటంత నీచత్వం నాలో లేదు. రేఖ తండ్రి మాధవరావు అని కూడా నాకు తెలియదు. యిరవై ఏళ్ళ క్రితం అతన్ని విడిచిపెట్టి వచ్చాక మళ్లీ అతని గురించి తెలుసుకోవాలని కూడా తలచలేదు. నా ధ్యేయం, నా ఆశయం, నా గమ్యం అంతా నా కొడుకు మీదే పెట్టుకుని రోజులు గడిపాను. రేఖ ఎవరో తెలిస్తేగదా నేను ఆమె మీద అత్యాచారం చెయించానని చెప్పడానికి?
ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *