April 26, 2024

మాయానగరం – 32

రచన: భువనచంద్ర

పందుల్లో కూడా తెలివైన పందులు, మూర్ఖపు పందులూ, దగాకోరు పందులూ, కేటు పందులూ, ఇలా చాలా రకాలుంటై. కానీ ఏ పంది బురదలో దొర్లకుండా మాత్రం ఉండదు. వాటి తెలివి తేటలు పరువు ప్రతిష్టలు, హెచ్చుతగ్గులూ, మిగతా విషయాలలోనే కానీ, బురదలో స్నానించడంలో కాదు.
పదవి కోసం ఎగబడే వాళ్ళ జాతి కూడా అలాంటిదే. మిగతా అన్ని విషయాలలోనూ ఒకరికీ మరొకరికీ తేడాలుంటాయిగానీ, పదవి సంపాదించే విషయంలో మాత్రం కాదు. ఎంతకైనా దిగజారతారు. ఎంత నీచానికైనా వొడిగడతారు. సర్వనామం తనకి తను అర్పించుకొనే పనిముట్టు.
శామ్యూల్ రెడ్డిని మెట్లెంకించడం కోసం సారాలో కల్తీ చేయించింది అతనే. మొత్తం ప్లాన్ అంతా అతనిదే. కల్తీ చేసింది తానేనని అతను శామ్యూల్ కి చెప్పలేదు.
కార్లు, ఆంబులెన్సులూ, రాయల్ హాస్పటల్ కి పేషంట్ల తరలింపులూ, అవయవ దానం పేరిట భారిగా చేతులు మారిన ధనాలూ బేరసారాలూ, అన్నీ అతని సూచనల మెరకే జరిగాయి. అవన్నీ సర్వనామం ప్లాన్ లోని భాగాలే.
బోసుబాబు హిస్టరీ కూడా శామ్యూల్ రెడ్డి హిస్టరీ అంత కూలంకషంగానూ సేకరించాడు. ఇద్దరీ లవ్ టార్గెట్టు శోభ అని గ్రహించాడు. నవనీతం గురించి క్లుప్తంగా మాత్రమే చరిత్ర తవ్వాడు. తవ్వేటప్పుడు నవనీతాన్ని చూడలా.
చూశాక నవనీతం అతనికి మరపుకు రావట్లా. “నలబయ్యే పడిలో ప్రేమంటే ఇదేనా?” తనలో తానే ఆశ్చర్యపోయాడు సర్వనామం. మొదట్లో తీవ్రంగా ప్రతిఘటించిన నవనీతమే ఆ తరవాత ఓ ట్రాన్స్ లోకి వెళ్ళి, ఏం చేస్తోందో, ఏం మాట్లాడుతోందో కూడా తెలీకుండా సహకరించింది. అంటే “షీ ఈజ్ ద గాడెస్ ఆఫ్ సెక్స్ ” అనుకున్నాడు సర్వనామం.
సర్వనామం జీవితం ఓ పజిల్ లాంటిది. అతనికి ఎక్కడా తృప్తి కలగలేదు. అంతులేని తెలివితేటలతో మహామహా మేధావుల్ని చిత్తు చేశాడు. ‘గేమ్స్ ‘ ఆడటం అతనికి హాబీ. సమస్య లేకపోతే అతను బ్రతకలేడు. అలాంటిది మొదటిసారి మనసు తృప్తి పడింది. కొన్ని రోజులే కావొచ్చు , కానీ అలాంటి తృప్తి మళ్ళీ మళ్ళీ కావాలని అతని మనసు అలజడి చేస్తోంది.
కానీ నవనీతం దగ్గరకి వెళ్ళదలుచుకోలేదు.
“ఓ ఆకాశమా.. నేను అందగాడ్ని కాదు… అసలు స్త్రీని ఎంతవరకు సుఖపెట్టాలో ఏమేమి చెయ్యాలో నాకేమీ తెలీదు. ఆకలితో వున్న ఎద్దు గడ్డి వామిని చూస్తే ఎలా దాని మీద పడి మేస్తుందో అలా నవనీతం మీద పడ్డాను. ఆమె ‘ఇలాకా ‘ కూడా గొప్పదే. బోసు నాకంటే అన్ని విధాలా గొప్పోడే. ఒక్క తెలివితేటల్లో తప్ప. వాడ్ని వదిలి నా దగ్గరకీ నవనీతం ఎందుకొస్తుందీ? యీమెకి కృతజ్ఞత ఎక్కువని తెలుసు. ఆ కృతజ్ఞతతోనే తన్నులు తింటూ బోసుతోటే వుంటుంది కానీ నా దగ్గరకు ఎందుకొస్తుంది? అసలీ పిచ్చి నాకెందుకు పుట్టింది? తను రాదు.. నేను వెళ్ళను. కానీ తనను నేనే నా దగ్గరకి ప్రాణాలు కుదవబెట్టి అయినా రప్పించుకోవాలి. అంటే.. అద్భుతమైన ప్లాన్ వెయ్యాలి…. నాకు సహకరించవూ?” అని ఆకాశాన్ని బ్రతిమాలాడాడు.
వంచన నిండిన మనసుతో పంచభూతాల్ని నిన్నటి దాకా అతను గుర్తించలేదు కానీ నవనీతంతో గడపిన క్షణాలు అతన్ని లోకంలోకి తీసుకొచ్చి ప్రకృతిని పరిచయం చేశాయి. ‘సెట్ చెయ్యాలి..ఏదో ఒకటి ” మళ్ళీ అనుకుంటూ నడుస్తున్నాడు.
“అబ్బా… ఏమా భుజాల నునుపుదనం… ఆ చెక్కిళ్ళు.. కన్నీటి ధారలతో వుప్పగా మారినా ఎంత చిక్కనివీ? ఆమె ఒక్క అవయవము గుర్తొచ్చిన కొద్దీ సర్వనామంలో ఒక్కో మనోద్వారం తెరుచుకుంటోంది. తనకి తెలీకుండా శామ్యూల్ రెడ్డి ఆఫీస్ వైపు నడిచాడు.
లోపల శామ్యూల్ రెడ్డి లేడు. ఆఫీస్ మహా ‘పోష్ ‘ గా వుంది. తనంతట తానే ఏ.సి ఆన్ చేశాడు.
“సారీ అది సార్ వచ్చినప్పుడే ఆన్ చెయ్యాలి. ఇంతకీ మీరెవరూ? ఏం పని మీద వచ్చారూ? అసలు లోపలకి ఎందుకొచ్చారూ? ” కోపంగా అడిగాడు ఆఫీస్ బాయ్.
“సర్వనామం వచ్చాడని మీ బాస్ కి చెప్పు. నాతో ఎలా మాట్లాడాలో ఆయన్నడిగి నేర్చుకో ” దర్పంగా ఓ చూపు ఆఫీస్ బాయ్ మీద పడేసి బయటకొచ్చాడు సర్వనామం
*********************
మదాలస ధ్యానం అంతా చదువు మీదే వుంది. త్వరలోనే ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానని అహోబలరావుగారు చెప్పారు. నీరజకి చాలా ఆశ్చర్యంగా వుంది. కాం గా తన పని చేసేశాక వదినగారు యీ వయసులో చదువెందుకు మొదలెట్టిందో ఆమెకి అర్ధం కాలేదు. నీరజ తల్లి అయితే ఏ చిన్న అవకాశము దొరికినా ” ఇదేమిటమ్మా చోద్యం.. ఆడముండలు చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేల్లాలా? వయసుడిగిన ఆడది ‘సవత్త ‘ వివరాలడిగినట్టు, ఇప్పుడీ చదువెందుకో? అసలు ఆడది ఉద్యోగం చేయడం మా ఇంటావంటా వుందా?” అంటూ సూటిపోటి మాటలు హేళనలూ, ఎద్దేవాలూ చేయ్యడం మానట్లేదు.
ఆవిడని ఊరుకోమని చెబుదామన్నా , ఊరుకొనే రకం కాదని , ఇంకా రెచ్చిపోతుందని నీరజకి తెలుసు.
మదాలస సుందర రామమూర్తికి మధ్య మాటలు లేవు. అంతా మౌనమే. సుందరరామమూర్తి ‘సంధి ‘ కి సిద్ధమే కానీ, మదాలసే సంధికి ‘సొడ్డు ‘ కొడుతోందని నీరజకి అనుమానం.
“మాట్లాడొచ్చుగా అన్నయ్య వదినతో ” అన్నది అన్నతో
“సిగ్గు విడిచి నేను మాట్లాడినా ఆవిడ మాట్లాడుతుందా? చెల్లీ… నీకు తెలీదు. ఈ మధ్య మీ వదిన కళ్ళకు నేను ఆనడంలేదు. అయినా ఆనడానికి నా దగ్గరేముంది? అందమా? గొప్ప ఉద్యోగమా? ఆస్తా? ఏమీలేని బికారి మొగుడ్ని ఏ పెళ్ళాం మాత్రం గౌరవంతో చూస్తుంది? ” సెల్ఫ్ పిటీని ఇంఫిరియారిటీ కాంప్లెక్స్ ని కలిపి అన్నాడు నీరజతో.
ఆ మాటలు మదాలసకు వినబడేటట్టు అన్నా మదాలస మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఆ మౌనమే నీరజలో అన్నగారి మీద సానుభూతిని రగిలించింది.
ఏ ఆడదానికి మరో ఆడది అర్ధం కాకపోవడం ఇక్కడ విచిత్రం. కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం ఏ మాత్రం చెయ్యకపోవడం చిత్రాతిచిత్రం.
“నువ్వు మాట్లాడితే అన్నయ్య మాట్లాడటానికి సిద్ధంగానే వున్నాడుగా వదినా… ఒక్క మాట మాట్లాడకూడదూ?” ఆగలేక వదిన్నడిగింది నీరజ ( లోలోపల కోపంగా వున్నా)
“మాటలు మంటని పెంచితే, మౌనం ఆ మంటని చల్లారుస్తుంది నీరజా, మాట్లాడకూడదనే పట్టింపేమి నాకు లేదు. ఎవరితోనైనా నిరభ్యంతరంగా మాట్లాడుతా, అయితే అవతల వారి మాటలు కత్తిపోట్లలా గుచ్చుకోకుండా వుంటే! ఐతే పోట్లు పొడుస్తున్నామనే ఆలోచనే మనుషులకు వుండదు. ఒక విషయం తెలుసా? మనిషి మీద మనిషి ఆర్ధికంగా డిపెండ్ అవ్వడం అంత ధైన్యం లోకంలో మరొకటి లేదు. అదీ ఆడవాళ్ళకి. కానీ యాచకుడికి యాచకుడు శతృవైనట్టుగా , ఆడదానికి ఆడదే శతృవు. మగవడి వాదనని సమర్ధించే వాళ్ళు కూడా మళ్ళీ ఆడాళ్ళే ” నిర్లిప్తగా నవ్వింది మదాలస.
నీరజ మాట్లాడటానికి తోచలేదు. సైలెంటైంది. “పందుల్లా మంచం మీద పడి దొర్లడానికి సమయం దొరకడం లేదనేగా నీ దుగ్ధ? సరే.. రేపు ఏ చిన్న తిరుపతికో పోయి అలానే దొర్లుదాం. ” కచ్చగా ఆ రాత్రి అన్నాడు సుందర రామమూర్తి మదాలసతో.
“దొర్లాలనిపిస్తే ఇక్కడా బురదే వుందిగా? “అంత కష్టం అక్కర్లేదులెండి. అసలు దొర్లడం ఎందుకు?” అసహనాన్ని అణచుకుకొని నవ్వింది మదాలస.
ఆ మాట అవతలున్న నీరజకు వినిపించలేదనడం అబద్ధం. నిజం ఏమిటంటే చాలా విచిత్రంగా ‘నిజం ‘ విన్నాక కూడా నీరజకి అన్న మీద అర్ధం లేని సానుభూతి పెరగడం. ఆవిడ దృష్టిలో లెక్కలు సడన్ గా మారిపోయాయి. ‘బ్లడ్ ఈజ్ థిక్కర్ థాన్ వాటర్” అని నిర్ధారించినవాడు మహా మేధావి. రక్తానికెప్పుడూ సాంద్రత ఎక్కువే.
మొగుడి కచ్చ మాటలు నీరజకి వినిపించే వుంటాయని మదాలస బాధపడింది. కారణం నీరజకు అన్న మీద వుండే గౌరవం మంటగలిసి పోతుందేమోనని. వారిద్ధరి అనుబంధంలోనూ తన మూలంగా ఏ తేడా రాకూడదని మదాలస కోరిక. నీరజ మనసులో బాధ మదాలస వూహించనూ కూడా వూహించలేదు.
రాత్రి గడుస్తోంది. పొద్దు పొడుస్తోంది. కాలం తన దారిన తాను నదిలా ప్రవహిస్తూ సాగిపోతూనే వుంటుంది. అసహ్యంగా మాట్లాడి మనసుని చెడగొట్టిన సుందరరామమూర్తి హాయిగా నిదురపోతే , రానురాను యీ శాడిజం ఎలా పరిణమిస్తుందో అని నిద్రపట్టక చాప మీద కూర్చునే రాత్రికి తోడుంది మదాలస.
నిద్రపోయినా పోకపోయిన పెళ్ళైన మధ్యతరగతి ఆడది , అందునా అత్త ఆడబిడ్డ వున్న ‘కుటుంబ స్త్రీ ‘ లేచి తీరాల్సిందే. అలా అని బోలెడు వ్రత కథలు , పురాణాలూ ఘోషిస్తున్నాయట. వర్షం కురుస్తున్న వాకిట్లో ముగ్గెయ్యడం మానకూడదట. మానేస్తే ఇంటికి ‘అరిష్టం ‘ అట. ఇలాంటి అద్భుతమైన ఆచారాల జాబితా మదాలస అత్తగారు నోట్లోనే వుంది.
యధావిధిగా వంట చేసి కారేజి సర్ధింది మదాలస. తనదారి తాను పోయాడు సుందరరామమూర్తి.
“వదినా!… పోనీ చిన్నతిరుపతి నాల్రోజులు వెళ్ళిరావచ్చుగా? ” సనంగా అయినా సూటిగా అడిగింది నీరజ. “యూ టూ బ్రూటస్ ” అని సీజర్ అన్నప్పుడు బ్రూటస్ ఎంత షాక్ తిని వుంటాడో అంత షాక్ తిన్నది మదాలస. నిర్ఘాంతపోయింది.
ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద వున్నదాన్ని మురుక్కాలవలో విసిరేసినంతగా విభ్రాంతికి లోనైంది.
“నువ్వూ… నువ్వూ నేను సెక్స్ కోసం వెంపర్లాడుతున్నానని అనుకుంటున్నావా నీరజా? ” అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని అని, అక్కడకక్కడే నేల మీద చతికలబడి ‘భగవంతుడా ‘ అని భోరుమన్నది మదాలస. వెయ్యి నీటి మేఘాలు తమలోని నీరునంతా నేల మీద కుమ్మరిస్తే ఎలా వుంటుందో అలా జారాయి ఆమె కళ్ళలోని అశ్రువులు.
“ఎవరు చచ్చారని ఆ ఏడుపు?” గదిలోంచి అరచిన అత్తగారి అరుపు మదాలసకి వినిపించనేలేదు.

***********************************

వెంకటస్వామి పరిస్థితి కాస్త చికాగ్గానే వుంది. ఫాదర్ డేవిడ్ కి ఫోన్ చేస్తే పరమశివం పారిపోయినట్టు తెలిసింది… అదీ గోడ దూకి. అంటే వాడు యాక్టివ్ గానే వున్నట్టు లెక్క. వాచ్ మాన్ చూసింది కూడా వాడినే అయుండాలి. అసలే పాములాంటివాడు… అందునా పగబట్టాడు. వాడు వాచ్ మాన్ కి కనిపించేటట్టు మసలుతున్నాడంటే అర్ధం తనకి వార్నింగ్ ఇవ్వాలనే. అదో వేట. అదో హంట్.

నందినిని తీసుకొని పారిపోద్దామంటే , ఆమె ఒప్పుకోవడం లేదు. తమతో పాటు కేరళ రమ్మంటోంది. అక్కడకి వెళ్ళాక ఆమె ఆస్తి తనకి దక్కుతుందని నమ్మకం ఏమిటి? అమాయకమైన ప్రేమ దక్కచ్చు. దాని వల్ల లాభం? ( లేక ఉపయోగం?)
వాచ్ మాన్ కబురందించి వారమైంది. పరమశివం మళ్ళీ వచ్చిన జాడ లేదు. ఎక్కడుంటాడో కనుకోవడం ఎలా? నందినిని పూర్తిగా ముగ్గులోకి దించడం క్షణం పని. ఆ తరవాత?
రకరకాల ఆలోచనలు పధకాలు వెంకటస్వామి మనసులో తిరుగుతున్నై. ఒక్క ‘శోభనం ‘ తప్ప మిగతావన్నీ వెంకటస్వామీ, నందిని మధ్య జరుగుతున్నై.

***********************

పరమశివం పెట్టె తీసి వాడి వస్తు సామగ్రి చూసిన దగ్గరనుంచి మహదేవన్ మనసు మనసులో లేదు. తనకేమైనా అయితే కూతురి పరిస్థితి ఏమిటి? వెంకటస్వామి మంచివాడే, మంచి పనిమంతుడే , కానీ వాడికి పైకెగబాకాలనే బలమైన బలహీనతా వుంది.
‘ఎదగాలనుకునేవాడు ఎందర్నైనా తొక్కెయ్యగలడు ‘ అని మహదేవన్ కి తెలుసు.
వాడి కన్ను నందిని మీదుంది. నందిని కంటే, నందినికి వున్న నగల మీద ఆస్తి మీదా వుంది… ఏం చెయ్యాలి?
ఆలోచిస్తున్నాడు మహదేవన్. మొన్న మొన్నటి వరకు ఏ చీకు చింతా లేకుండా అన్నపూర్ణ సేవ చేశాను. వృద్ధాప్యంలో యీ ఉపద్రవాలొచ్చిపడ్డాయి. పోనీ, ఎవరినైనా సలహా అడుగుద్దామన్నా చెప్పేదెవరూ? కేరళకి వెళ్ళాలంటే తొందరతొందరగా హోటల్ ని వైండ్ అప్ చేసేయ్యాలి. అనేకనేక విధాలుగా మహదేవన్ మనసు పరుగుతీస్తోంది. పొయ్యి భగభగా మండుతోంది. అన్నం కుతకుతా వుడుకుతోంది. అన్నం మాత్రం గాడిపొయ్యె మీద వండటం మహదేవన్ కి ఇష్టం. అందుకోసం బండెడు కట్తె కొనిపడేస్తాడు. బియ్యం కుతకుతా వుడికే శబ్ధం అంటే అతనికి చాలా ఇష్టం. ఆ శబ్ధం అతడికి తల్లిని గుర్తుకు తెస్తుంది. మహదేవన్ కి వంట నేర్పింది అతని తల్లే. ఆవిడ మళయాళీ అయినా భర్తతో పాటు ఆంధ్రా, తమిళ్ నాడు, కర్ణాటకల్లో తిరిగింది. అన్నీ రాష్ట్రాల వంటల్నీ అణుకువగా నేర్చుకుంది. మహదేవన్ కి తాను వండే వంటల గురించి వివరంగా చెబుతూ చేసే విధానాన్ని ఒకటికి పదిసార్లు చెబుతూ, ఆ తరవాత తను చేసి , మరోనాడు మహదేవన్ తో చేయించేది.
లోకంలో ‘ అన్నపూర్ణ సేవ ‘ కి సాటైన మరొకటి లేదు ‘ అని ఎన్ని వేలసార్లు చెప్పిందో! అంత గొప్ప తల్లి పన్నెండో ఏట చనిపోతే, దుఖాన్ని దిగమింగుకొని ఓ పక్క చదువుకుంటూ మరో పక్క తండ్రికి వంట చేసి పెడుతూ గడిపాడు మహదేవన్.
“నాయనా.. ఆంధ్రా వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ‘రుచికి ‘ ప్రాణమిస్తారే తప్ప నువ్వు మళయాళివా, మరాఠీవా అని చూడరు. ప్రాంతీయ జాడ్యం ఆ జాతికి లేదు. జీవితంలో మరే పని నీకు అన్నం పెట్టకపోతే, నువ్వే అన్నం చేసి వందమందికి అన్నం పెట్టు. వంట అనేది మన నాయర్లకి కొత్తేమీ కాదు. తరతరాలుగా అది మన రక్తంలో వుంది. ” అని చెప్పిందే చెబుతూ వుండేది. అందుకే పద్దెనిమిదో ఏట తండ్రిపోయాక ఆంధ్రా వచ్చేశాడు. కేరళ తన పూర్వీకుల రాష్ట్రం తప్ప తనని తననిగా చూసేవారెవరున్నారూ? చుట్టాలున్నారు… కానీ లేనిది వారితో గాఢమైన సంబంధమే.
నిట్టూర్చాడు మహదేవన్. అతనికి తెలియంది ఏమిటంటే రెండు కళ్ళు కట్టెపుల్లల నించి అబ్జర్వ్ చేయడం.
ఆ రెండు కళ్ళూ పచ్చపాము కళ్ళలాగా కుదించుకున్నాయి. చూపు మాత్రం తీక్షణంగా వుంది. అవి పరమశివం కళ్ళు. పగతో రగులుతున్న కళ్ళు. ప్రాణం తియ్యాలనే పట్టుదలతో వున్న కళ్ళు. అయితే ఆ కళ్ళు వెతుకుతున్నది మహదేవన్ ని కాదు.. వెంకటస్వామిని.
ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *