May 2, 2024

అమ్మ రాసిన వీలునామా

రచన: పద్మా త్రివిక్రమ్

ప్రియాతి ప్రియమైన నా బంగారు తల్లికి,

ప్రేమతో నీ పుట్టినరోజునాడు అమ్మ ఆశీర్వదించి వ్రాయు వీలునామా. నాకు అన్నింటికీ తొందరే అనుకుంటున్నావా, అవునే, నీలాగే నాకు తొందరెక్కువే… ఏమి చేస్తాము చెప్పు, అప్పుడే నీకు ఇరవయ్ రెండో పుట్టినరోజా, అసలు నాకు బొత్తిగా నమ్మబుద్ది కావట్లేదు.
ఏ పసిపిల్లల్ని చూసినా, ఏ స్కూల్ కి వెళ్ళే పిల్లలని చూసినా నువ్వే గుర్తుకు వస్తావు.
ఆ తప్పటడుగులు, ఆ చిలకపలుకులు, ఆ ప్రశ్నించే విధానం, ఆ అల్లరి, ఆ మొండితనం, ఆ పేచీలు…ఏమని చెప్పను, ఎన్నని చెప్పను, ఒకటా రెండా నువ్వు చూపించిన లీలలు నాకు.
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ, ఏవో ప్రశ్న లడుగుతూ, కిలకిలమని నవ్వుతూ కాలం గడిపే నువ్వు ఇంతలో ఎంత పెద్ద దానివి ఎలా ఐపోయావో ఎంత మాత్రం అర్ధం అవట్లేదు… కాలం పరుగెడుతుంది అంటే బహుశా ఇదేనేమో…….
కాలంతో పాటు మనుషులు మారతారు అంటే ఏదో అనుకున్నా కానీ నిన్ను చూస్తూ వుంటే బాగా అర్ధమవుతోంది. ఎంత అందంగా, ఎంత తెలివిగా, ఎంత చలాకీగా వుండేదానివి……. కానీ వయసుతో పాటు క్రమంగా నీలో ఒక తెలియని నిరాసక్తత నీకు తెలియకుండా నిన్ను అవహిస్తోంది అదే నాకు చాలా దిగులుగా వుంది.
నిజమే జీవితం ఒక పరుగు పందెం లాగా వుంది కాదని అనను, కానీ ఒక నిమిషం ఆగు, ఆలోచించు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని……… నిజంగా busy నా లేక ఫీలింగ్ busy నా…… రెండు ఒకేలా అనిపిస్తాయి కానీ కాదు
ఇది నాణానికి ఒక వైపు మాత్రమే నాణానికి మరో వైపు do or die లేక పొతే మనం అనుకున్న గమ్యం చేరలేము.
ఎక్కడ ఆగాలి, ఎక్కడ పరిగెత్తాలి అన్నది కచ్చితం గా తెలిసినవాళ్లనే విజయం వరిస్తుంది.
గమ్యం చేరుకోవడానికి మార్గంతో పాటు మనసు వుండాలి, విజయం సాధించాలంటే ఒడిపోతామన్న భయం కన్నా గెలవాలన్న తపన ఎక్కువ గా వుండాలి. చేసే ప్రతీ చిన్న పనిని త్రికరణ శుద్ది గా చేయాలి.
నాకు తెలుసు నువ్వు ఎంత వొత్తిడికి గురి అవుతున్నవో…… అమ్మ నాన్నల కల నెరవేర్చగలనా లేదా అన్న ఆందోళన నిన్ను ఎంత స్తబ్దుగా చేస్తోందో కానీ మా ఉద్దేశం అది కాదురా బంగారు…అర్ధంచేసుకోవు………
అసలు గెలుపంటే ఏమిటిరా……… చదువులో ఫస్ట్ రావడం, మంచి ఉద్యోగం ఇదేనా…… నీ ఉద్దేశం అదే ఐతే నువ్వు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టేరా…..జీవితంలో నిజమైన గెలుపు ఏమిటో తెలుసా……ఎల్లప్పుడు ఉత్సాహంగా వుండడం. అదిగో అప్పుడే కోపం వచ్చేస్తోంది కదా నా ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది అనే కదా నీ భావన…. అవును రా ఆ స్టేజి దాటి వచ్చాను కాబట్టే ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను.
జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఆనందంగా వుండడమే….. అందులో ఎటువంటి సందేహం లేదు….. కానీ అసలు ఆనందం అంటే ఏమిటి? మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కలిగేదా…….. లేకపొతే అందరి దగ్గిర లేనిది మన దగ్గిర ఉండడమా….. మనసుంటే మార్గం దొరుకుతుంది అన్నట్టుగా….. కాస్త నిన్ను నీవు నిశితంగా పరిక్షించుకుంటే నీకే అర్ధమవుతుంది. భోగమే ఆనందం అని భ్రమ పడుతూ, అందులోనే కొట్టుకుపోతూ, అసంతృప్తితో రగిలిపోతూ….. ఎటు పోతున్నామో తెలియని అయోమయంలో కొట్టుకుపోతున్నాం.
జీవితం నిత్య సంఘర్షణ……. మంచికి చెడుకి మధ్య, బుద్హికి మనసుకి మధ్య. ఒకటి కావాలంటే ఇంకొకటి కోల్పోవాలి. రెండూ మాత్రం ఖచ్చితంగా రావు. దేనికోసం దేనిని కోల్పోవాలో తెలుసుకోవడమే ఇంగితం. అందమైన సూర్యోదయాన్ని చూడాలంటే సూర్యోదయం కన్నా ముందు లేవడమే తప్ప వేరే అవకాశం వుండదు.
నిత్య జీవితంలో మన ఇష్టాలు అవసరాలు మధ్య జరిగే ఘర్షణే మనం ఎదుర్కునే ఒత్తిడి. ఇష్టం అవసరాన్ని డామినేట్ చేస్తే మనసుది విజయం. అవసరం ఇష్టాన్ని డామినేట్ చేస్తే బుద్దిది విజయం. బుద్దిని మనసుని సమన్వయం చేసుకుంటూ అవసరాలని ఇష్టాలుగా, ఇష్టాలని అవసరాలుగా చేసుకుంటే అంతిమ విజయం మనిషిదే.. ఈ గెలుపు ఆత్మవంచనతో కాకుండా ఆత్మ విమర్శతో గెలవాలని మనసారా ఆశీర్వదిస్తూ…………..అందరూ వీలునామా లో ఆస్తి వివరాలు రాస్తారు. నాకు వున్న తెలిసిన ఆస్తి మాత్రం ఎటువంటి పరిస్థితులలో అయినా మనని మనం కోల్పోకుండా నిన్ను నీవు గెలవడమే నిజమైన గెలుపు. …… అదే నిజమైన ఆస్తి. మా అమ్మమ్మ దగ్గరినించి మా అమ్మకి, మా అమ్మ దగ్గరినించి నాకు…నా దగ్గరినించి నీకు……..

ప్రేమతో………….. అమ్మ.

1 thought on “అమ్మ రాసిన వీలునామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *