May 2, 2024

అరుణోదయం

రచన: కర్రా నాగలక్ష్మి

మధ్యాహ్నం మూడయింది, మంచం మీద నడుం వాల్చిందన్నమాటే గాని కళ్లు మూతలు పడటం లేదు . అంతూపొంతూ లేని ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అలకలో .
గత మూడు సంవత్సరాలుగా తన జీవితంలో జరిగిన మార్పులు తనని అంధకారంలోకి నెట్టేసేయి .
ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించుకుంటే విధిలిఖితం అని తప్ప మరో సమాధానం రాలేదు .
మూడేళ్ల కిందట యెర్రని పారాణి కాళ్లకు పెట్టి ఫెళ్లున ఆకాశమంత పందిరి వేసి అయిదు నక్షత్రాల హటలులో ఒక్కగా నొక్క కూతురికి పెళ్లి చేసి అమెరికాకి పంపితే ఆరునెలలకు తిరగకుండా ముద్దులకూతురికి ఒంట్లో బాగులేదు వెంటనే రమ్మని పిలుపు, మరిపెంగా మనుమలని యెత్తుకోవాలని అమెరికాలో కాలుపెట్టిన తనకి చావు బతుకుల మధ్య బల్లిలా బెడ్ కి అతుక్కుపోయిన కూతుర్ని చూస్తే కళ్లల్లోంచి నీరుకాదు నెత్తురు కారింది .
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని పేరు పెట్టని జబ్బు రోజురోజు కాస్తకాస్త తినేస్తూ వుంటే చూస్తూ భరించలేక, బయటకి యేడ్వలేక తను అనుభవించిన బాధ పగవారికి కూడా రాకూడదని యెన్నిమార్లు దేవుడికి మొక్కుకుందో, పేరులేని జబ్బు ఖర్చు భరించలేం మీ దేశం తీసుకు పొమ్మని ఇన్సూరెన్స్ కంపెనీ చేతులెత్తేస్తే నా దేశం నా కూతుర్ని బతికిస్తుందనే ఆశను కార్పొరేట్ ఆసుపత్రులు మరో సంవత్సరంన్నర సాగదీసి వదిలేస్తే ఎముకలగూడుగా మారిన కూతురు తన చేతులలో ఆఖరి శ్వాస విడిచిన దెబ్బ తనని జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది .
పగలు తిండి సహించదు.. రాత్రి నిద్ర రాదు, యీ మధ్య జ్ఞాపకశక్తి కూడా తగ్గినట్లు అనిపిస్తోంది .
ఇలాగే ఖాళీగా వుంటే మాత్రం తనకి పిచ్చెక్కడం ఖాయం, కళ్లల్లో పెట్టుకొని పెంచి పెద్దచేసి, పెద్దపెద్ద చదువులు చెప్పించి, మంచి అబ్బాయితో పెళ్లి చేసి ముసలి వయసులో వారి పిల్లలతో కాలక్షేపం చేసి కూతురి చేతిలో కన్ను ముయ్యాలనే తన కోరిక అంత తీర్చలేనిదా ? యెందుకిలా చేసేవు ? అని యెన్నిమార్లు భగవంతుడిని నిలదీసిందో, మగపుట్టుక పుట్టిన పాపానికి మనసులో మెదిలే భావాలను బహిర్గతం చెయ్యలేక కుమిలి కృశించి పోతున్న భర్త ను చూస్తే కడుపు తరుక్కుపోతోంది .
తుదశ్వాస విడివడానికి క్షణం ముందు మాట్లాడలేని అశక్తతతో తన గారాలపట్టి తన వైపు చూసిన చూపుకు అర్దం తనకు తెలుసు . మాట యిచ్చినట్లుగా ఆ చేతిని నిమిరిన తనకు తెలుసు తన కంటినీరు తన బంగారుతల్లికి పరలోకంలో మనఃశాంతి ని కరువు చేస్తుందని, కాని తనకు తెలియనిది ఒకటే తన ముద్దుల పట్టిని మర్చిపోవటం యెలా ?
ఆలోచనలలో మునిగి పోయిన అలక కళ్లు సన్నని మత్తుతో మూతలు పడ్డాయి .
నిద్రలో యేవేవో దృశ్యాలు కదలి కర్తవ్య బోధ చేసినట్టుగా అనిపించింది . వెన్నుమీద చరచి నట్టుగా తుళ్లిపడి లేచింది అలక .
తన కర్తవ్యం యేమిటో తెలిసింది కాని యెక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు సమస్య తనదగ్గరకు రాదు తనే సమస్యను వెతుక్కుంటూ వెళ్లాలి .
యువరాజులను పట్టాభిషేకానికి ముందు లోకజ్ఞానం సంపాదించడానికి దేశాటనకు పంపేవారట, తనూ అలాగే ముందు దేశాటన చెయ్యాలి, అప్పుడే దీనులు నిస్సహాయులు పడే బాధలు తెలుస్తాయి .
దేశాటన యెక్కడనుంచిమొదలు పెట్టాలి ? అనుకోగానే తను పుట్టి పెరిగిన టౌను గుర్తొచ్చింది .
తన సహాయం కోసం యెవరో యెదురు చేస్తున్నారని కాదు కాని యెందుకో ఆ వూరే గుర్తొచ్చింది .
తను చిన్నప్పుడు తిరుగాడిన ప్రదేశాలు తన లో దుఃఖాన్ని తీరుస్తాయని ఆలోచనే అక్కడకి ప్రయాణం కట్టించింది .
తన వూరు దగ్గరవుతున్న కొద్దీ యేదో కదలిక అలకలో, కన్న తల్లి చేతులు చాపి పిలుస్తున్న అనుభూతి .
ట్రైను లోంచి కాలు కింద పెట్టగానే వెన్నులోంచి సన్నని వణుకు .
“ వెల్కం వెల్కం, యిన్నాళ్లకైనా మేం గుర్తొచ్చినందుకు, పద పద” అంటున్న అత్త కొడుకు సురేష్ వెనకాలే స్టేషన్ బయటకి నడిచింది అలక .
******. ******** *********
“ ఎన్నాళ్ల నుంచి యిలా” కుళ్లు చీర కట్టుకొని తైల సంస్కారం లేని జట్టుతో శూన్యం లోకి చూస్తూ ఓ మూలన కూర్చున్న అరుణని చూస్తూ అత్త తో అంది అలక .
“ సుమారు పదేళ్లుగా యిదే వరస, యెవరెన్ని చెప్పినా వినదు, ముగ్గురన్నదమ్ముల తర్వాత పుట్టిన ఆడపిల్లకదా అని ముద్దు చెయ్యడం పాపం అయింది, పెళ్లంటూ చేసి పంపేం, కాపురం చేసుకుంటూ బుద్దిగా వుండొద్దూ, ఒక్కనాడు మొగుడికి వండి పెట్టిన పాపానికి పోలేదు, మా అల్లుడు మంచివాడు కాబట్టి యెలాగో కాపరం చేసేడు, మా వియ్యపరాలు గయ్యాళిదేంకాదు, యేదో నాలుగు కేకలేసేది గాని పనీపాటా సరిగ్గా చెయ్యని కోడలుని తన్ని తగిలెయ్యలేదు, దీనికడుపున ఓ కాయ కాస్తేనన్నా దారిలోకి వస్తుంది అని అనుకున్నాం, ఊహూ.. ఆ కాయా కాసింది పదహారేళ్లు పెంచిన ఆ కాయని యిది కడుపున పెట్టుకోడం జరిగింది, అంతా ఖర్మ కాకపోతే మరేంటి చెప్పు, ఆ పిల్లాడు పోవడంతో యిది యిలా తయారయింది, వాళ్లు మాత్రం యెన్నాళ్లుగా వూరుకుంటారు, దీన్ని తీసుకొచ్చి దింపి పోయేరు . బాగుపడ్డనాడు చెప్పండి తీసుకెళ్తాం అని, యిది బాగుపడలేదు, యిలా వున్న పిల్లని యేమని పంపుతాం, నీ కూతురు పోయి నువ్వేడుస్తున్నావు నేను యిలాంటి కూతుర్ని చూస్తూ ప్రతీ రోజూ యేడుస్తున్నాను” అంటూ కళ్లొత్తుకుంది మేనత్త .
“ కారణం తెలుసుకోవాలని ప్రయత్నించలేదా, డాక్టర్ కి చూపించాలని అనుకోలేదా ?” ఆమెని మధ్యలో అడ్డుకొని అంది అలక .
“ మొండితనమే, మనం చెప్పింది చచ్చినా వినదు, దానికి యెంత తోచితే అంతే, మొండితనానికి మందెవడు కనిపెట్టేడే మరీనూ, గొంతు చించుకొని వంద చెపితే ఒకటి వినేది, చిన్నప్పుడు నుంచి అంతేగా, పెళ్లైన తరవాతేనా మారుతుందేమో అనుకుంటే ఊహూ ….. మార్పేమీ లేదు, యెనభై యేళ్లొచ్చిన మా వియ్యపరాలు బ్రతికి వుంది కాబట్టి అల్లుడికి కలో గంజి వుడకేసి పోస్తోంది, ఇంటరు రెండో సంవత్సరం చదువుతున్న పిల్లాడు యేదో విషజ్వరం సోకి అపస్మారకంలో వుంటే యీ తింగరది ఒక మాత్రకి మరొకటి వేసిందట, వెంటనే వికటించింది, ఆసుపత్రిలోనే వుంది కదా ! పిల్లాడు గిలగిలా కొట్టుకుంటూ వుంటే డాక్టర్లను పిలవాలని తెలీదుటే, భయం… భయం అని తలుపు పక్కన నక్కి కూర్చొని వుందట, నర్సు చెక్ చెయ్యడానికి వచ్చేసరికి యిది పరిస్థితి, పిల్లాడు ప్రాణాలు అప్పటికే పోయాయట, పిల్లాడు పోయిన తరవాత భయం వేస్తోంది అన్నమాట తప్ప మరో మాట లేదు, ఒంటి మీద స్పృహ లేదు, చెప్పగా చెప్పగా యెప్పుడో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటుంది . కన్నకూతురు యెదురుగుండా యిలా వుంటే ప్రత్యక్ష నరకమంటే నమ్ము, రాత్రి పగలూ ఒకటే ప్రశ్న వేధిస్తోంది, నా తరవాత యీ తింగర మేళం దినం దిబ్బ యెలా చేరుతుందో భగవంతుడా అని “ అత్త యేదోదో గొణుగుతూనే నిద్రలోకి జారుకుంది .
అలక వంద చెబితే ఒకటి వింటుంది అన్నదగ్గరే ఆగిపోయింది, చిన్నప్పటినుంచి మన్నుతిన్న పాము లాగే వుండేది, తనీడుదే అయినా చదువులో తనకన్నా వెనుకబడి వుండేది .
ఒకడికి పది మార్లు చెప్తేగాని తలకెక్కని వాళ్లని ‘ స్లో లెర్నర్స్ ‘ అని అంటారని యెక్కడో ఆ మధ్యన చదివిన విషయం గుర్తొచ్చింది అలకకి . వారు ‘ స్పెషల్ చిల్డ్రెన్ ‘ లలా కాకుండా చూడ్డానికి మామూలుగానే వుంటారు, కాని వారి మెదడు నార్మల్ వారిలా కాక కాస్త స్లో . అలాంటిదేనేమో అరుణ కూడా, ఆమెకి అర్దమయేటట్లు చెప్పగలిగే సహానంగాని, అవగాహన గాని వీరికి లేకపోయిందేమో ?, తన దుఃఖాన్ని మరొకరితో పంచుకోవాలని తెలియని అరుణ తనలోని దుఃఖాన్ని, భయాలని ఒకదాని మీద వొకటి పేరుస్తూ పోయింది .
ముందుగా అరుణలో పేరుకు పోయిన దుఃఖాన్ని, భయాలను మనసు పొరలలోంచి బయటకి తియ్యాలి .
అరుణ పదేళ్లుగా యిలా వున్న విషయం తనవరకు యెందుకు రాలేదు, అత్త కూతురు కాబట్టి పట్టించుకోలేదా?, యిదే స్థితిలో సొంత చెల్లెలుంటే యిన్నాళ్లు యిలా పట్టించుకోకుండా వదిలేసేదా ? తన చిన్నప్పుడు యెప్పడూ తల్లి అనే మాటలు మనసులో తిరిగేయి .
‘ యేమిటో ఒదినా ఫామిలీ ప్లానింగని మనం ఒకరినో యిద్దరినో కన్నాం, చదువులు పోతాయని యేడాది కో రెండేళ్లకో ఓ మారు కలుస్తున్నాం, కనీసం కజిన్స్ మధ్య నైనా ఒకరి కష్టసుఖాలు మరొకరితో పంచునేంత చనువు పెరగితే వారి మనసులు తేలికవుతాయి ‘
చిన్నతనంలో యీ మాటల అర్దం కాకపోయినా పెద్దయాక వాటి అర్దమూ తెలిసింది, విలువా తెలిసింది . దేవుని దయ వల్ల తన సహచరుడే స్నేహితుడుగా మారడం తో మనసులో చెలరేగే సంఘర్ణలు అతనితో పంచుకొని స్వాంతన పొందేది . అందరికీ అంత అదృష్టం లభించదుగా ?
అందుకే తన యీ చిన్న ప్రయత్నం .
కూతురు మరణం తో తనలో యేర్పడ్డ శూన్యాన్ని యేంచేసి నింపాలని భావించిందో అది స్పష్టంగా కనిపించ సాగింది .
నిస్సహాయ మహిళలు, మోసానికి గురైన వాళ్లు మన దేశంలో కోకొల్లలలు, సహాయం అందించే సంస్ధలు యెన్నున్నా సహాయం పొందనివారు లెక్కకు మించే వున్నారు .
పెద్ద పెట్టుబడి పెట్టి సహాయక సంస్థ ప్రారంభించడానికి తన దగ్గర అంద ఆర్ధికబలమూ లేదు, పలుకుబడీ లేదు, అందుకే తన చుట్టూ వున్న వారిలోంచే ఒకరినో యిద్దరినో యెంచుకొని వారి జీవితాన్ని గాడిలో పెట్టాలి . ఒక సమస్య పరిష్కారం అయేకే మరొకటి తీసుకోవాలి అనేది అలక ఆలోచన .
తను అందించే సహాయం వల్ల సహాయంకోసం యెదురు చూసే మహిళల సంఖ్యలో పెద్దగా తేడా రాకపోవచ్చు, కాని తన చుట్టుపక్కల వారి ఆలోచనలలో తప్పకుండా మార్పు వస్తుంది అనే చిన్న ఆశాకిరణమే అలకని ముందుకు నడిపిస్తోంది .
సహాయం అందించాలంటే యేదో ఒక ఆర్గనైజేషన్ తో చేతులు కలపాలని లేదా బాగా డబ్బున్నవాళ్లు తప్ప ఛారిటీ వర్క్ చెయ్యకూడదనే అపోహలకు తెర పడుతుంది .
చెయ్యాలనే కోరిక చెయ్యగలమనే నమ్మకం వుంటే చాలనే విషయం పదిమందికి అర్దమైతే చాలు, అదే వుద్యమంలా మారడానికి యెంతో సమయం పట్టదు .
సమస్య తెలిసి పోయిన తరవాత పరిష్కారం చెయ్యడం యెంతసేపు .
ఇప్పటికే జరిగిన ఆలస్యం చాలు అన్నట్లుగా కార్యాచరణ లోకి దిగింది అలక .
అరుణ చేతులని తన చేతులలోకి తీసుకొని ‘ అరుణా అలా వెళదాం పద ‘ అంది .
అరుణలో కదలిక లేదు .
‘రామకోవెలకి వెళ్లి ప్రసాదం తెచ్చుకుందామా ? ‘ అటునుంచి అలా కాలువ పక్కగా వెళ్లి కందిచేలో కందికాయలు తిందామా ? ‘
“ అమ్మో …….. నాకు …… భయం ……” కూడబలుక్కుంటున్నట్లుగా అంది అరుణ .
“నేనున్నానుగా నీకెందుకూ భయం”
కళ్లు చక్రాల్లా తిప్పుతూ ‘ ఔను అలక వుండగా మాకెందుకూ భయం ‘ యెప్పుడో చిన్నప్పుడు తన అల్లరి గ్రూపు వాడిన మాటని చిలకలా పలుకుతున్న అరుణని నీళ్లు నిండిన కళ్లతో చూసింది అలక .
లేడికి లేచిందే పరుగన్నట్లుగా బయలుదేరిన అరుణని చూస్తూ వారించబోయిన అత్త కొడుకుని కళ్లతోనే వారించింది అలక .
రామకోవెల పక్కనుంచి కంది చేలో అడుగు పెట్టేరు యిద్దరూ, వర్షాలు లేక కాపు రాకముందే యెండిపోయిన చేను అలకలో దుఃఖాన్ని కలిగించింది .
అరుణ లో వస్తున్న మార్పు అలకలో ఆశ ను నింపుతోంది .
“ గుర్తుందా అరుణా యిక్కడ మనం ఆడుకున్న దాగుడు మూతల ఆటలు, మామిడి తోటలో తోటమాలి చూడకుండా దొంగిలించి తిన్న మామిడి పిందెలు” .
‘ అలకుండగా మా కెందుకు భయం …. నా కప్పుడు యెంత భయం వేసిందో తెలుసా ? నువ్వు నా దగ్గర లేవుగా ….. బాబు…నా… బాబు… యెదో …. అయితే …. నువ్వు లేవుగా …… నేనెంత భయపడ్డానో తెలుసా …. అమ్మ… అమ్మ… కూడా.. నాకు భయమేసింది…. ‘ గట్టిగా అలక చెయ్య పట్టుకొని వణుకుతోంది అరుణ .
అలక మనసు ఆనందంతో నిండింది, మొదటి రోజే అరుణని యీ పాటి కదిలించగలిగిందంటే ఓ నెల్లాళ్లలో మామూలు మనిషిని చెయ్యొచ్చు . అరుణకే కాదు ఆమె వారికి కూడా ఆమె మానసిక స్థితి మీద అవగాహన కలిగించాలి . అదే మంత కష్టం కాదు .
కాలం చెల్లి మరణించిన వారిని బ్రతికించలేం కాని జీవచ్ఛవాలలా బ్రతుకుతున్న అరుణ లాంటి వారికి చేయూత నిచ్చి వారిని బ్రతించుకోవాలి అని నిశ్చయించుకుంది అలక .
****** ******* ***********
కొద్ది రోజులలోనే అరుణ కళకళ లాడుతూ భర్త దగ్గరకి వెళ్లింది, వారి ముఖం లో కనబడుతున్న ఆనందం చూస్తూ వుంటే తన చిట్టితల్లి ‘ యిదేనమ్మా నీనుంచి నేను కోరుకున్నది ‘ అని మబ్బులలో మాయమైనట్లనిపించింది అలకకి .
తరవాత ఒకరు యిద్దరు ….. ముగ్గురు …… అలా …. అలా …. సమస్యలు, సమస్యలతో మనుషులు ‘అరుణోదయ ‘ ను వెతుక్కుంటూ రాసాగారు . ఇప్పడు అలక మబ్బులలో తన బంగారు తల్లిని వెతుక్కోటం లేదు, యెందుకంటే ‘ అరుణోదయ’ కు వచ్చే ప్రతీ ఆడపిల్లా తన గారాలపట్టే కాబట్టి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *