March 30, 2023

మనుగడ కోసం.

రచన: ఓలేటి శశికళ

శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం రోజు. సాయంత్రం పేరంటంపెట్టుకుని, అరవైమందిని పిలుచుకున్నాను. చాలా సందడిగా జరిగింది పేరంటం. పిలిచినవారంతా చక్కటి ముస్తాబుతో, అందమయిన పట్టుచీరలు కట్టుకుని, కొత్త, పాత నగలు అలంకరించుకుని, అపర లక్ష్మీదేవుల్లా ఒచ్చి పసుపు, కుంకుమ, తాంబూలాదులు తీసుకుని వెళ్ళి పోయారు. ”అమ్మయ్యా! ఒకరిద్దరు తప్ప అందరూ ఒచ్చేసినట్టే”.
ఇంక వీధి తలుపు వేద్దామని వెళ్తూ, నా అమ్మవారిని ఒకసారి తేరిపార చూసుకున్నా. పాలరాతి మందిరంలో, స్థాపించిన అష్టలక్ష్మీ కలశంలో, వెండి కళ్ళు, ముక్కు, చెవులు అమర్చి, చతుర్భుజాలు పెట్టి, అభయ ముద్ర, కర కమలాలు అమర్చి, అమ్మవారికి ఎర్రటి కంచిపట్టు చీర నలంకరించి, మంగళ సూత్రాలు, నల్లపూసలతోపాటు, నాకున్న భారీ నగలన్నీ వేసి, తృప్తిగా అలంకరించుకున్నా. మండపం పక్క చిన్న అరటి చెట్లు పెట్టి, సహజమయిన బంతి, చేమంతి, రోజాలతో సింగారించాను. రంగురంగుల విద్యుద్దీపాలు, పెద్ద పెద్ద వెండి, ఇత్తడి కుందుల్లో దీపాలు దగద్దగాయమానంగా వెలుగుతూ, సుగంధ ద్రవ్యాలు పరిమళాలు వెదజల్లుతుంటే, ఒకలాంటి దివ్యానుభూతి కలిగి, కొన్ని క్షణాలు, ఆ దివ్య సుందరమూర్తిలో మమేకమై చూస్తూ ఉండిపోయా.
“శాంతమ్మా”! అన్న పిలుపుకు ఒక్కసారి ఉలిక్కిపడి గుమ్మం కేసి చూసా. అమ్మాజీ. ”ఓ! రా అమ్మాజీ లోపలికి” ఆహ్వానించా. పెద్ద స్టీలు పళ్ళెంలో పళ్ళు, పూలు, చీర పట్టుకుని ఒచ్చింది. అమ్మవారికి దణ్ణం పెట్టుకుని, తను తెచ్చినవన్నీ, నాకు బొట్టు పెట్టి ఇచ్చింది.
“అయ్యో! ఇవన్నీ ఎందుకు?. ఇది పేరంటం. ఇవన్నీ తేవక్కర్లేదు”, అని నవ్వుతూ అన్నా.
“శాంతిగారూ! ఇన్నేళ్ళలో ఎవరైనా నన్ను ఇలా శుభకార్యానికి కానీ, పేరంటానికి కానీ పిలవడం ఇదే మెదటిసారమ్మ. నేనెప్పుడూ మీలాంటి పెద్దవారిళ్ళకి ఒచ్చింది లేదు” స్వల్పంగా ఎర్రబడ్డ మొహంతో అంది.
నేను వెంటనే మాట మార్చి ”ఇంకేంటి విశేషాలు?. ఈ రోజు హాస్పిటల్ డ్యూటీ అయిపోయిందా? మీ చెల్లెళ్ళను కూడా తేవలిసింది” అంటూ ప్రశ్నలువేస్తూనే, గబగబా ఒక ప్లేట్ లో పులిహార, బొబ్బట్టు, పాయసం, పెరుగు వడ అమర్చి తెచ్చి తన చేతికిచ్చా. తీసుకోడానికి చాలా మొహమాటపడి పోయింది. ప్రసాదం అని చెప్పాక తీసుకుని, చాలా అపురూపంగా తినింది.
“చాలా థేంక్సమ్మా. నాకెంత సరదానో ఇలాంటివి చూడడం. మమ్మల్ని మనుషుల్లాగే చూడరు ఈ వీధిలో వాళ్ళు. రోజూ అందరి ఈటెల్లాంటి మాటలు వింటూ, చురకల్లాంటి చూపులు తప్పించుకుంటూ, దినదిన గండంగా బతుకుతున్నాం. మీరు చూస్తూనే ఉంటారుగా, మా పక్కింటి చైనులుగారు పెట్టే పుర్రాకులు. ఏదో అలా నోరు పెట్టుకుని బతుకుతున్నా. నాకు తెలుసు నేనంటే మన వీధిలో అందరికీ అసహ్యం, నాతో మాట్లాడాలంటే జంకు అని. ఏంచెయ్యనమ్మా? మా నాన్నగారు నా మీద నలుగురు చెల్లెళ్ళు, తమ్ముడు బాధ్యత పెట్టి పోయారు. మాకు ఇల్లు తప్ప ఇంకో ఆస్థిలేదు. కష్టపడి నా తరవాత చెల్లి రాజీకి పెళ్ళి చేస్తే, రెండేళ్ళు కాపురంచేసి, వాడు చెన్నై పారిపోయాడు. తనని బట్టల కొట్లో పనికి పెట్టా. సునీత, మాలతి, సతీష్ చదువుకుంటున్నారు.
వాణికి ఈ పదకొండో నెల పెళ్ళి మా మేనత్త కొడుకుతో. సొంతమన్న మాటే కానీ, . కొండంత ఆశ. ఎక్కడనుండి తెస్తానని కూడా లేదు. బండి, బంగారం అని పేచీ. ఏమోనమ్మా. ఎలా ఈదాలో తెలీట్లేదు ”. కళ్ళలో సన్న నీటి తెర. కడుపు తరుక్కుపోయింది. ముఫ్పై ఏళ్ళుంటాయేమో తనకు. పాపం ఎన్ని సమస్యలో. నాకు తెలిసిన అమ్మాజీ వేరు, నేను చూస్తున్న అమ్మాజీ వేరు. చాలా సేపు తన జీవితం గురించి చెప్పకొచ్చింది. నేను కూడా ఇరుగు పొరుగుతో గొడవలొద్దని, సామరస్యంగా అందరినీ కలుపుకుని వెళ్ళమని సలహా ఇచ్చి, ఇంకొంత ప్రసాదం జిప్ లాక్ కవర్లలో పెట్టి, తాంబూలంలో మంచిచీర పెట్టి ఇచ్చా. అందమయిన ఆమె కళ్ళల్లో మెరుపు.
మెట్లదాకా వెళ్ళా దింపడానికి. అప్పృడే మెట్లెక్కుతున్న మా బావగారు అమ్మాజీని చూడగానే కళ్ళల్లో కోపం, అసహనం ఛాయలు. వెళ్ళిపోయింది అమ్మాజీ.
అప్పుడే వార్త వెళ్ళిపోయినట్టుంది. ఇంటికి ఒస్తూనే శ్రీవారి మొదటి ప్రశ్న, “అమ్మాజీ ఎందుకొచ్చింది?. నీకు ముందే చెప్పా. మనం ఉమ్మడికుటుంబంలో ఉన్నప్పుడు, అందరికీ ఆమోదయోగ్యంగా బ్రతకాలని. అమ్మాజీ లాంటి బజారు మనిషి మనింటి గడప
ఎక్కిందంటే, ఎంత గొడవౌతుందో తెలీదా? కావాలనే చేస్తున్నావా?. ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లున్నాయి. నీ చదువులు, సంస్కరణలు పక్కన పెట్టి, ఒక పెద్దింటి ఆడదానిగా నడుచుకో” సాగి పోతోంది ఆయన వాక్ప్రవాహం. బాగా ఎక్కించినట్లున్నారు విషం అనుకున్నా మనసులో.
“మనం ఉమ్మడిలో ఉన్నా ఎవరిళ్ళలో వాళ్ళున్నాం. నా పూజకి నేనెవర్ని పిలుచుకుంటే ఏమిటి సమస్య? దైవం ముందు అందరూ సమానులే. ఇంకొకరి శీలాలు ఎంచడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఇంకోసారి దయచేసి నాకు శీలపాఠాలు చెప్పొద్దు. నేను మీ కుటుంబ కట్టుబాట్లేమీ దాటి ప్రవర్తించడం లేదు” అని కాస్త తీక్షణంగానే జవాబిచ్చి, ఇంకా విషయం ముగించా. మనసంతా చేదయిపోయింది.
ఆరునెలలే అయ్యింది మేము వైజాగ్ ఒచ్చి. ఏడేళ్ళు ఢిల్లీలోఉన్నాకా, రమణ తల్లితండ్రులకు దగ్గరలో ఉండాలని, . స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం సంపాదించి విశాఖపట్టణం మకాం మార్చాడు. మంచి కంపెనీ వసతి ఉన్నా తీసుకోకుండా ఆరుగురు అన్నదమ్ములు, మా అత్తమామలు ఉండే పెద్ద ఉమ్మడింటి కాపురం పెట్టాము. చాలా కట్టుబాట్లు, ఆంక్షలున్న, సాంప్రదాయక కుటుంబం. అయితే ప్రేమాభిమానాలు, సఖ్యతున్న తోటి కోడళ్ళ మధ్య జీవితం సజావుగానే సాగిపోతోంది. కానీ ఇదిగో ఈ అమ్మాజీ లాంటివాళ్ళ పొడ కూడా కిట్టదు వీళ్ళకి.
నాకింకా అమ్మాజీని చూసిన మొదటిరోజు బుర్రలో తాజాగా ఉంది. ఆ రోజు పొద్దున్నే ఇంకా నిద్రమంచం మీదే ఉండగా, పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఒక్కసారి హడిలిపోయి లేచా. మా పడక గది వీధి వైపు ఉండడంతో, కొంచెం కిటికీ తెర పక్కకి జరిపి బయటకు చూసా. ఈయన ”వెధవ గోల. మళ్ళీ మొదలయ్యింది” అనుకుంటూ మా పాపబెడ్రూంలోకి వెళ్ళిపోయారు. చూద్దును కదా. మా ఎదురింటి అమ్మాజీ, వాళ్ళ పక్కింటి చైనులుగారు హోరాహోరీ పొట్లాడేసుకుంటున్నారు. అమ్మాజీ పెంచుతున్న కోళ్ళు గోడ దూకి చైనులుగారింట్లో దూరి, పెరడు పాడు చేస్తున్నాయిట.
“నీకు లక్షసార్లు చెప్పా! కోళ్ళుపెంచడం, చంపడం ఇక్కడ చెయ్యడానికి వీల్లేదని. తల పొగరెక్కి వీగిపోతున్నావు. ఆడముండవని ఆలోచిస్తున్నా. నిన్నూ, నీ కుటుంబాన్నీ రోడ్డు మీదకి క్షణాల్లో లాగగలను”.
అంతే కాళికలా ఆయన మీదకి దూసుకొచ్చేసింది “పంతులూ! ముండ రండ అన్నావంటే మర్యాద దక్కదు. నేనూ అన్నానంటే నీ నోరు పడిపోద్ది. నన్ను కోళ్ళు పెంచద్దని చెప్పడానికి నువ్వెవడివి?. ఈ సారి సాయిబుతో చెప్పి, . మేక కూడా కోయిస్తా. నీ దిక్కున్న చోటు చెప్పుకో” ఇద్దరూ ఒకరికి మించి ఒకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు.
ఆయన కొడుకనుకుంటా పచ్చగా దబ్బపండులా ఉన్నాడు. ముప్ఫై పైనే వయసుండచ్చు. మధ్యలో కొచ్చి దణ్ణాలు పెడుతూ స్పర్ధ ఆపబోయాడు. కానీ లాభం లేకపోయింది. పెద్దాయన స్వేచ్ఛగా దుర్భాషలాడుతున్నారు. ఆ అమ్మాయి రెచ్చి పోతోంది.
అంతలో ఒక విచిత్రం జరిగింది. ఒక గులాబీబాలలాంటి సౌకుమారి, పట్టుచీర గోచీ వేసి కట్టుకుని, నల్లటి తడి జుట్టు ముడివేసుకుని, పెద్ద కుంకుమ బొట్టుతో, అపర పార్వతిలా బయటకి ఒచ్చి, గోడ పక్కన నిలబడి, అమ్మాజీకి మాత్రం కనబడేట్టు రెండు చేతులు జోడించి, బ్రతిమాలే థోరణిలో చూసింది. అంతే నాగస్వరం విన్న పాములా, మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది అమ్మాజీ. ఆ రోజు సాయంత్రమే కోళ్ళు అమ్మేయడం చూసా నేను.
ఇంక అక్కడి నుండి ఈ ఎదురింటి వాళ్ళిద్దరూ నా దినచర్యలో భాగం అయిపోయారు. డెలివరీకి ఒచ్చిన మా పెద్దబావగారి అమ్మాయి అమ్మాజీ కధ చెప్పుకొచ్చింది.
తనతో పాటే చదివిందట అమ్మాజీ. విమెన్స్ కాలేజీలో ఇంటర్ చదువుతుంటే వున్న ఒక్కదిక్కు, తండ్రి, ఆర్. టీ. సీ బస్సు గుద్ది, ఆరు నెలలు ఆసుపత్రిలో కోమాలో ఉండి చనిపోయారుట. శవాన్ని తీసుకెళ్ళలేని పరిస్థితిలో, ఆ నర్సింగ్ హోమ్ డాక్టర్ చెయ్యి పట్టుకుంటే, జీవితాంతం పట్టుకోనిస్తా. ముందు నాకు సాయం చెయ్యమని చెప్పి, అన్ని కార్యక్రమాలయ్యాక, అక్కడే నర్సుగా చేరిందట.
అప్పటి నుంచే మితిమీరిన ఆత్మ విశ్వాసంతో, ఆడింది ఆటగా పాడింది పాటగా, అందరినీ దబాయించి బతికేస్తోందిట. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలతో అనుకున్నది సాధించుకుంటుందిట.
ఇక చైనులుగారూ తక్కువవారు కాదు. కోనసీమలో కోట్లు విలువ చేసే భూములున్నాయిట. నగర ప్రముఖులకెందరికో ఆయనే పౌరహిత్యం నెరపుతారు. యజ్ఞాలు, యాగాలకు ఈయన్ని సంప్రదిస్తారు. శిష్యులను ఇంట్లోపెట్టుకుని స్మార్తం, వేదం నేర్పించి, మెరికల్లా చేసి, వివిధ కార్యక్రమాలకు పంపుతారు. మంచి వ్యవహారకర్త. వేదవేదాంగాల్లోశాసించగల మేధావి, పండితుడు. ఆగమ శాస్త్రవేత్త. ఆయనిల్లు నిరంతరం పూజా పాఠాదులతో, వచ్చే పోయేవారితో, ఒక దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది.
ఆయన ఒక్కగానొక్క కొడుకు శంకరం. అతని భార్య రాధ. చైనులుగారి భార్య జబ్బుమనిషి. నల్లమందు వేసుకుని ఎప్పుడూ పడుకునే ఉంటుంది. ఇంటి పనిభారం అంతా చిగురుటాకులాంటి రాధ మీదే. మా మావగారన్నట్టు చైనులుగారు గొప్ప జ్ఞానే కాని కోపాన్ని, అహంకారాన్ని జయించలేకపోయారు. కొడుకు, కోడలు, శిష్యులు, అమ్మాజీ కుటుంబం ఆయన కోపాగ్నికి సమిధలు.
ఏ తెల్లవారో, రాత్రి డ్యూటీ దిగి ఒచ్చే అమ్మాజీ, తెల్లవారుఝామునే చక్కగా వాకిలి తుడిచి, కల్లాపు జల్లి పెద్ద ముగ్గు పెడుతుంది. ఈ లోపున రాధ ఒస్తుంది. ఆమె చేతిలోంచి చీపురు లాక్కుని వాళ్ళ వాకిలి కూడా చిమ్మి ముగ్గేస్తుంది అమ్మాజీ, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి తెలియకుండా. ఈ లోపల ఇద్దరు గుసగుసగా కబుర్లు చెప్పుకుంటారు.
పాపం రాధ ఆస్తమా పేషంటు. కానీ చైనులు గారు ఆయుర్వేదం తప్ప వాడనివ్వరు. ఒక రోజు అమ్మాజీ రాధకు ఇన్ హేలర్ ఇస్తుండగా చూసా. అంతే కాదు, పండగలు, పబ్బాలకి, నవరాత్రులకీ, చాతుర్మాస వ్రతాలకీ, పోటెత్తే అతిధులకు రాధ ఒక్కతే ఒండివార్చాలి. గోడ మీంచి అమ్మాజీ, చెల్లెళ్ళు అందుకుని, కూరలు తరిగిచ్చేసి, పప్పులు రుబ్బేసి, రహస్యంగా గోడ మీంచి ఇచ్చేసేవారు. ఈ అమ్మాయి స్వయంపాకాలకొచ్చిన పప్పూ, బియ్యం, చీరలు అటు పడేసేది. ఎవ్వరికీ తెలీని ఒక పరస్పర స్నేహస్రవంతి, అంతర్లీనంగా సాగి పోతుండేది. మేముండే ప్రాంతం విపరీతమయిన నీటిఎద్దడి.
నీళ్ళ టాంకర్లు ఒస్తే అమ్మాజీ నీళ్ళు పట్టి, తలుపు చాటు నిలబడే రాధకి అందించేది. తరవాత చైనులుగారు లక్షలు ఖర్చుపెట్టి పెద్ద లైను వేయించుకుంటే, రాధ రాత్రిపూట నీళ్ళ పైపు వీళ్ళవైపు పడేసేది. వీళ్ళిద్దరి స్నేహానికీ అసలు వారధి ”కిట్టూ” అనబడే కృష్ణశాస్త్రి. అమ్మాజీ అందగత్తె అనే చెప్పాలి. మంచి రంగు. ఎత్తుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పడూ నవ్వతున్నట్టుండే నల్లకళ్ళు, ఒత్తయిన పెద్ద జడ, చీరకట్టులో, ఎవరయినా తలతిప్పి చూసే అందమే. ఆమె అందం ఆమెకు చాలా పలుకుబడి తెచ్చిందంటారు. నాకయితే, తెల్లారుఝామున కలకలలాడుతూ, పువ్వులు, దీపం, ముగ్గుతో కనిపించే ఆమె తులసి కోట, తన గురించి వేరుగా అనుకోనివ్వదు. ఆ మాత్రం బలం లేకపోతే, వాళ్ళమూడొందల గజాల స్థలం చైనులుగారెప్పుడో లాగేసేవారు.
ఇంతకీ కృష్ణ శాస్త్రి అలియాస్ ”కిట్టప్ప” శంకరం, రాధల ముద్దుబిడ్డ. నిరంతరం పనులతో సతమతమయ్యే రాధకి పిల్లాడిని చూసుకోడానికి సమయం ఉండేది కాదు. పనిపిల్లను పెడితే, . ఆ అమ్మాయి అమ్మాజీ ఇంటికి తీసుకుపోతే, వీళ్ళంతా వాడిని ఆడించి, . ముద్దు చేసి, కొండొకచో, ముద్దలు కూడా పెట్టేసేవారు. విషయం తెలిసి ఆగ్రహహోదగ్రులైన చైనులుగారు, పనిపిల్లను మానిపించేసారు. తాతగారు కారు బయటకెళ్ళగానే వీడు గోడమీంచి పార్సిలయ్యేవాడు.
అయినా అమ్మాజీ, చైనులుగారు ప్రతీవారం రోడ్డెక్కి కొట్టుకుంటూనే ఉండేవారు. కారు గుమ్మం దగ్గరపెట్టేరనో, కాకి ఎముకలు తెచ్చి దర్భల్లో వేసిందనో, పిల్లి మీద ఎలకమీదా పెట్టుకుని. కాలం ఎప్పటికీ అలాగే ఉంటే జీవిత చక్రం ఆగిపోతుందేమో!! ఎప్పుడో ఒక కుదిపేసే మార్పు ఒస్తూ ఉంటుంది. జీవన సమీకరణాలు మారుస్తూ ఉంటుంది.
నల్లమందు మోతాదెక్కువయ్యి చైనులుగారి భార్య మరణించింది. జీవిత సహచరి వియోగం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. బీపీ, షుగరు ఎక్కువయ్యాయి, . ఒకరోజు శంకరం పెళ్ళిచేయించడానికి హైదరాబాదు వెళ్ళాడు. ఆ సమయంలో చైనులుగారు హార్టు అటాక్ ఒచ్చి పడిపోయారు. కాళ్ళూ చేతులు ఆడని రాధ అమ్మాజీని పిలిచింది.
అమ్మాజీ ప్రధమ చికిత్స చేసి, వెంటనే అంబులెన్సు పిలిపించి, వాళ్ళ డాక్టరుగారి సాయంతో అపోలోలో చేర్పించింది. వెంటనే వైద్యసాయం అందడంతో ఆయన బ్రతికి బయటపడ్డారు. తరువాత బైపాస్ అయ్యి ఇంటి కొచ్చారు. చెప్పాలంటే చాలా మార్పు వచ్చింది. ఎక్కువ మౌనంగా ఉంటున్నారు.
అమ్మాజీ మాత్రం అదో పెద్ద సాయం కాదనుకుంది. నిజమే మా వీధిలో మూర్ఛ రోగి పడిపోతే నీళ్ళు పోసేది వాళ్ళొక్కరే. తారు రోడ్డు వేస్తుంటే, కూలీలకి, నీళ్ళు, టీలు వీళ్ళే ఇస్తారు. ఇంటిముందు పెద్ద టబ్బులో నీళ్ళు పెడుతుంది. దారిని పోయే మూగజీవాల కోసం. పెద్ద మట్టి దాకలో అన్నం కలిపి పెడుతుంది, ఏ వీధి కుక్కలేనా తింటాయని. కూరల గంపలెత్తుకొచ్చే వాళ్ళు, వీళ్ళఅరుగు మీదే కూర్చుని, ఏదేనా పెడితే, తిని పోతారు. పనివాళ్ళకి వైద్యసహాయం కావాలంటే అమ్మాజీ. మునిసిపల్ కార్పొరేషన్ లో పనంటే అమ్మాజీ. అల్లుడు కూతుర్ని తరిమేస్తే పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలంటే అమ్మాజీ. అయినా అమ్మాజీ తిరుగుబోతు, వెలయాలు, పతిత, గయ్యాళి. ఎన్నో విధాల అవమానించిన పొరిగింటి వారికి ఆమె ఇంకా పెద్ద ఉపకారం చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వలన వారం రోజులనుండి ఎడ తెరిపి లేని వానలు. వీధుల్లో వాననీళ్ళు వాగుల్లా పారుతున్నాయి. మురికి కాలవలన్నీ పొంగి పొర్లిపోతున్నాయి. అక్కడక్కడ డ్రైనేజీ స్లాబులు తీసేసున్నాయి.
ఆ రోజు ప్లేస్కూలు కెళ్ళి ఒస్తూ, మూడేళ్ళ కిట్టూ ఇంటి దగ్గరలోనే పడవ వేద్దామని ఒంగి కాలవలో పడిపోయాడు. అందరూ చూస్తుండగా ప్రవాహంలో పడి కొట్టుకు పోతున్నాడు. అందరం నిశ్చేష్టులయిపోయాం.
అప్పుడే డ్యూటీ నుండి ఒచ్చింది అమ్మాజీ. ఒక్క నిమిషం వ్యర్ధం చెయ్యకుండా ముందుకు పరిగెట్టింది. పిచ్చిదానిలా పరిగెడుతూ, తన చీర లాగేసింది. డౌన్ లో కాలవ పెద్దదయ్యే చోట కరెంట్ స్థంభానికి చీర కట్టి, ఇంకో చివర తన నడుంకి కట్టుకుని, ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రైన్ లోకి దూకేసింది.
సరిగ్గా అదే సమయానికి కిట్టూ కొట్టుకొచ్చాడు. వాడిని పట్టుకుని, బలంగా గట్టు మీదికి విసిరేసింది. వెంటనే అక్కడికి చేరిన జనాలు పిల్లాడిని పట్టుకుని నీళ్ళు కక్కించారు. ఈ లోపల ప్రవాహంలో మునిగి పోతున్న అమ్మాజీని చీర సాయంతో పైకి లాగేరు. ప్రమాదపరిస్థితిలో ఉన్న ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి, నీళ్ళు కక్కించి, చికిత్స చేయించారు.
రాధ దుఃఖం వర్ణనాతీతం. ఏమిచ్చి ఈ మహోపకారి ఋణం తీర్చుకోగలనంటూ కొడుకుతో పాటు, ఆమెకి సపర్యలు చేసింది. దూకడంలో అమ్మాజీ కుడి కాలు ఫ్రాక్చరయ్యింది. మొట్ట మొదటిసారి చైనులుగారు చెయ్యెత్తి నమస్కారం పెట్టారు. అన్ని ఖర్చులు భరించి వైద్యం చేయించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంఘటన తరవాత ఇరు కుటుంబాల మధ్య తగాదాలు, అగాధాలు బాగా తగ్గిపోయినట్టే. ఈలోగా రమణకి సింగపూర్లో మంచి ఉద్యోగావకాశం రావడంతో మేము సింగపూరు వెళ్ళిపోయాము మెరుగయిన జీవితాన్ని వెతుక్కుంటూ.
ఆ తరవాత రెండు, మూడు సార్లు వచ్చాము కానీ, అది మా అత్తమామల అంత్య క్రియలకు మాత్రమే. అప్పుడే తెలిసింది అమ్మాజీ చైనులుగారి ఆశీస్సులతో కార్పొరేటరు అయ్యిందని. కానీ ఆమెను కలవలేకపోయాను. రాధ మాత్రం పరామర్శ కొచ్చింది. సున్నిత మయిన ఆమె శరీరం దుర్బలంగా ఉంది. ఎముకల గూడులా అయిపోయింది. ఏమయి పోయింది ఆ అపురూప సౌందర్యం?. ఆ ఛాందస గృహస్థానికి ఆహుతయి పోయిన సమిధలా ఉంది. మళ్ళీ నేను ఆఛాయలకు వెళ్ళడం తటస్థ పడలేదు. మా ఆంక్షలసంకెళ్ళ పెద్దింటికి చాలా దూరంగా వెళ్ళిపోయాము.
కాలగమనంలో పదేళ్ళు గడిచి పోయాయి. మంచిభవిత కోసం అనుకుంటూ రకరకాల ఉద్యోగాలు, అనేక దేశాల్లో చక్కబెట్టి, చివరకు మాతృదేశంలో కుదురుకుందామని తిరిగి విశాఖ చేరాము. రమణ స్టార్టప్ కంపెనీ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. బీచ్ దగ్గరలో ఫ్లాటు కొనుక్కుని, దానికి హంగులమర్చడంలో ఐదారు నెలల నుండి నేను బిజీ. ఆ రోజు సాయంత్రం యధా ప్రకారం బీచ్ రోడ్డులో నడక మొదలెట్టాను.
రోజంతా అవిశ్రాంతంగా లోకాలకు వెలుగు, వేడి నిచ్చిన అరుణుడు, పశ్చిమాన కుంగుతూ, తన వెలుగును రేరాజుపై ప్రసరించాడు. సూర్యుణ్ణి మింగిన సాయంత్రం అరువు కాంతుల శశి బింబాన్ని గగనతలం పైకి తెచ్చి లేత వెన్నెల సముద్రంమీద పరుస్తున్నాడు. అలలు మెల్లగా వెండితనం సంతరించుకుంటున్న వేళ, సముద్రంతో పోటీ పడుతున్న జనసంద్రం ఒడ్డున.
హఠాత్తుగా నా కళ్ళకి అతుక్కుంది ఓ జంట. పదమూడేళ్ళ పిల్లాడితో క్వాలిటీ ఐస్ క్రీం బండి దగ్గర. ఎవరు వాళ్ళు? అమ్మాజీ, శంకరంలా ఉన్నారే. వాళ్ళే గుర్తుపట్టి నన్ను పేరుతో పిలిచారు. అమ్మాజీ వడివడిగా నడుచుకుంటూ ఒచ్చి, సంభ్రమంగా నా చెయ్యి పట్టుకుంది.
“ఎన్నాళ్ళయ్యిందమ్మా మిమ్మల్ని చూసి? మీ గురించి చాలా ప్రయత్నించాను. మీ వివరాలు దొరకలేదు. మీ పెద్దింట్లో కూడా ఎవ్వరూ ఉండడంలేదు ఇప్పుడు. ”
“అవును అమ్మాజీ! ఆరు నెలలయ్యింది ఇండియా ఒచ్చేసి. మీరేంటి యిలా?” వాళ్ళ కేసి అయోమయంగా చూస్తూ.
శంకరం అందుకున్నాడు. ”శాంతి గారు! మేమిద్దరం దంపతులం ఇప్పుడు. రాధ కాలం చేసింది న్యుమోనియాతో. తన కోరిక మీదే నాన్నగారు మా ఇద్దరికీ వివాహం చేసారు. ఇదిగో వీణ్ణి గుర్తుపట్టారా? మా కృష్ణశాస్త్రి. నాన్న గారు తన పేరును అపర్ణగా మార్చేరు”.
“రాధ పోయిందా!” మ్రాన్పడిపోయాను
“సంతోషం అండి. మీరిద్దరు పెళ్ళి చేసుకున్నందుకు. బహుశా అమ్మాజీ కన్నా ఇంకెవరూ తల్లి స్థానం భర్తీ చెయ్య లేరని ఆమెకి తెలుసుంటుంది” అంటూ అమ్మాజీ చెయ్యి ఆప్యాయంగా నొక్కాను. ఈ లోపల కిట్టూ స్కూల్ ప్రోజెక్టు చెయ్యాలని, “ఇంటి కెళ్దామమ్మా” అని గునవడంతో, వెళ్ళడానికి సెలవు తీసుకున్నారు.
వెళ్తూ వెళ్తూ అమ్మాజీ వెనక్కొచ్చి,”శాంతమ్మా! రేపు మా ఇంటికి రాగలరా?శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నా. నేనొచ్చి తీసికెళతా. మీ అడ్రస్ ఇస్తారా”?
మేమిప్పుడు డాబా గార్డెన్సులో ఉండట్లేదు. మా రెండిళ్ళు కలిపి ఫ్లాట్లు కట్టాము. మా అందరికీ ఇళ్ళొచ్చాయి. మామయ్యగారు ఎమ్. వీ. పి . కాలనీలో ఇల్లు కట్టించారు. అక్కడ ఉంటున్నామమ్మా!!. ” అంది. అదే వినయం. నా మీద అదే ఆత్మీయత. అదే అందం. ఇప్పుడు హుందాతనం కూడా తోడయ్యింది. నేను ఇంటి అడ్రస్ ఇచ్చి, పదకొండింటికి వస్తానని చెప్పా.
ఆ మరునాడు సరిగ్గా పదకొండు గంటలకు స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఒచ్చింది. మా ఇల్లు, అలంకరణ చూసి మురిసిపోయింది. మా అమ్మాయి స్నిగ్ద అమెరికా ఫోటోలు చూసి, ముచ్చటపడి పోయింది. తన జీవితంలో మార్పుల గురించి చెప్పుకొచ్చింది. తను రాజకీయాల్లో ఇమడలేకపోయానని, రాధ మరణం తనని క్రుంగదీసిందని, చెల్లెళ్ళు, తమ్ముడు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో, చైనులుగారు పెళ్ళి ప్రస్థావన తెచ్చారని, రాధ ఆఖరికోరికని చెప్పారని చెప్పింది. రాధ స్థానం తను కాదంటే వేరెవరో ఆక్రమిస్తారు, కిట్టూ తనకి దూరం అవుతాడని భయపడింది. చైనుల్లాంటి ధనవంతుడి అండ తన కుటుంబానికి అవసరం అని గుర్తించి ఒప్పుకుందిట.
వాగ్దానం చేసినట్టే ఆయన తన కుటుంబాన్ని ఆదుకున్నారుట. ఆఖరి చెల్లి, తమ్ముడు అమెరికాలో ఉన్నారుట. రాజీ మొగుణ్ణి వెతికించి తెచ్చి, వారిద్దరి చేత పెద్ద పూజా సామాగ్రికొట్టు పెట్టించారుట. ఇదివరుకులా ఇంట్లో శిష్యులను చేర్చుకోకుండా, సింహాచలం దగ్గర వేద పాఠశాల పెట్టి, అక్కడే పాఠాలు చెప్తున్నారుట.
ఆయన పౌరోహిత్య బాధ్యతలు, శంకరానికీ, శిష్యులకూ అప్పచెప్పి పూర్తి విశ్రాంత జీవనం గడుపుతూ, తిరుపతి దేవస్థానానికి వేద విద్య, స్మార్తం గురించి పుస్తకాలు రాస్తున్నారుట. శంకరం తనను చాలా ప్రేమగా, గౌరవంగా చూస్తాడుట.
“పిల్లలా?” అడిగా.
“గత జీవితపు నీలి నీడలు గ్రహణంలా పట్టి పీడిస్తున్నాయి. కడుపు పండినా నిలబడడం లేదు. ”. తలొంచుకుంది.
“అయ్యో! బాధ పడకు. తప్పక పుడతారు. మరి రాధ రావాలి కదా తిరిగి ఈ లోకానికి. ”అన్నా.
కళ్ళు మెరుస్తుండగా, “అవునమ్మా!. మీ నోటి చలువ. మొదటిసారి నన్ను మనిషిగా చూసినవారు. నిందలు నమ్మకుండా ఆదరించారు నన్ను. మీ మాట జరిగి తీరుతుంది. నా రాధమ్మొస్తుంది. ” ఉద్వేగంగా పలికింది.
వారింటికెళ్ళాను. రెండంతస్థుల పెద్ద ఇల్లు, చుట్టూ పూల మొక్కలు. ఇంటి ముందు పెద్ద ముగ్గు, తూర్పు వాకిట అలంకరించిన తులసమ్మ. అమ్మాజీ మారలేదు. ఇంటిలో ఆధునికమయిన ఫర్నిచరు. పూర్వపు చాదస్తపు ఛాయలు లేవెక్కడా. అమ్మాజీ స్వప్నసౌధంలా చేసుకుంది ఇంటిని.
రాధది నూతన వధువుగా ఉన్న పెద్ద పటం. దానికి ఖరీదయిన ఫ్ర్రేము. గులాబీల మాల. ఆ అమాయకురాలు, అర్భకురాలు, దురదృష్టవంతురాలు ఫొటో నుండి నవ్వుతోంది. ”నేనిప్పుడే హాయిగా ఉన్నానని ”.
అమ్మాజీ, అదే అపర్ణ పెద్ద పట్టుచీర, పూలూ, పళ్ళతో నాకు పసుపు, కుంకుమలిచ్చింది. అచ్చం నాలాగే అమ్మవారిని అలంకరించింది. నా కన్నా ఎక్కువ నగలు పెట్టింది.
చైనులుగారు చాలాసంతోషించారు నన్ను చూసి. రాధను తలుచుకుని పాపం దౌర్భాగ్యురాలు. ఈ సిరంతా దానికి ప్రాప్తం లేదన్నారు. అపర్ణ సమర్ధవంతురాలన్నారు. నవకాయ పిండి వంటలతో తృప్తిగా భోజనం పెట్టింది.
నా మనసు మిశ్రమభావాల సంఘర్షణతో ముద్దయి పోయింది. సందర్భం కాకపోయినా డార్విన్ సిద్ధాంతం గుర్తుకొచ్చింది. వృక్ష, జంతుజాలాల్లాగే, మానవుడూ అడుగడుగున మనుగడ కోసం శ్రమిస్తూనే ఉండాలి. ఈ జీవనసంఘర్షణలో, బలవంతులు అన్ని ఆటంకాలనూ దాటి గెలుస్తారు. బలహీనులు తుడిచి పెట్టుకుపోతారు.
కొన్ని జీవ జాతులు, పరిణామక్రమంలో, అవసరమయిన, ఆమోదయోగ్యమయిన, ఉపయోగపడే పరివర్తనాలు చెంది, ప్రకృతి చేత ఆమోదించబడి, సృష్టిలో శక్తివంతమయిన స్థానం పొందుతాయి, అమ్మాజీ లాగ!!. రాధ లాంటి దుర్బలులు, ఎంత శ్రమించినా, అవకాశ లోపం, సరయిన వాతావరణం లేక కాలక్రమంలో కృశించి, మాయం అయిపోతారు. కొందరు మనుగడ కోసం, స్వప్రయోజనాల కోసం, ఎన్నో మార్పులను, చేర్పులను కూర్చుకుంటూ, సుఖ జీవనానికి బాటలు వేసుకుంటారు.
చైనులు గారు, శంకరం తమ వారసుడి భవిష్యత్ దృష్ట్యా, ఎన్నో మెట్లు దిగి, వారికెంతో ఉపకారం చేసిన అమ్మాజీని స్వీకరించారు. అమ్మాజీకి అందం, బలం, అవకాశం, అదృష్టం, సేవాభావం, తెలివితేటలు ఆమె మనుగడకు కలిసొచ్చాయి.
అన్ని విధాల విధి వంచితురాలు రాధ. ఆ సుకుమార గులాబీబాల ఆ ఇంటి ఛాందసంలో శలభంలా మాడి మసయ్యింది. ఆమె తనకు చేసుకున్న ఒకే ఒక ఉపకారం అమ్మాజీతో స్నేహం. నా నోరు తీపి తిన్నా, నా మనసంతా ఎందుకో చేదయిపోయింది.
అన్నట్టు, సరిగ్గా ఏడాదికి వరలక్ష్మీ వ్రతం రోజే చైనులుగారింట్లో రాధిక పుట్టింది.
-****–

11 thoughts on “మనుగడ కోసం.

  1. ‘మనుగడ’ కథ చాలా బావుంది శశీ… ఆద్యంతమూ ఆసక్తిగా చదివింప జేసింది… అభినందనలు!!

  2. సమాజంలో ఒంటరి స్త్రీ మనిషిగా నిలదొక్కుకుని మనుగడ సాగించాలంటే ధైర్య సాహసాలు ఎంత అవసరమో చెప్పకనే చెప్పిన కథ. .. చాలా బావుంది శశి గారూ…..నోరు విప్పలేని రాధ అంతర్ధానమై పోవడం..ఆ లోటును అమ్మాజీ అపర్ణ గా రూపాంతరం చెంది భర్తీ చేయడం..అంతా కూల్ గా సాగిపోయింది..అభినందనలు!

    1. పద్మజగారూ! మీ విశ్లేషణ చాలా బాగుంది. ధన్యవాదాలండి

  3. బావుంది శశికళగారు, ఎప్పటిలానే ఆశునిక భావజాలాన్ని మంచి సాంప్రదాయపు పెట్టెలో అందంగా అలంకరించి అందించారు. అభినందనలు

  4. చక్కని కథ. ముగింపు చాలా బాగుంది. బలవంతులు బయటపడడం, దుర్బలులు నశించిపోవడం- డార్విన్ సిద్దాంతం ఉటంకించబడడం ఏప్ట్ గా ఉంది. కథ నిడివి చాలా పెద్దది గా ఎంచుకున్నారు కనుక కథా గమనం వేగంగా సాగింది. ఇంత వేగం కథ లోని కమ్మదనాన్ని పాఠకుడు సంపూర్ణంగా ఆస్వాదించడానికి దోహదం చెయ్యదు. ఏది ఏమైనా ఒక మంచి కథ చదివిన అనుభూతి పొందక మానడు పాఠకుడు. రచయిత్రి కి అభినందనలు. ఆస్థి కాదు ఆస్తి అనాలి.

    1. ధన్యవాదాలండి. వేగం గురించిన మీ సూచనను జ్ఞప్తికి పెట్టుకుంటా! కధాంశం నచ్చినందుకు , మీ స్పందనకు ధన్యవాదాలు మీకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2017
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930