March 19, 2024

నదుల తీరాలపైననే నాగరికతలన్నీ

రచన: రామా చంద్రమౌళి

 

 

నాగరికతలన్నీ నదుల తీరాలపైననే పుట్టినపుడు

మనిషి తెలుసుకున్న పరమ సత్యం .. ‘ కడుక్కోవడం ‘ .. ‘ శుభ్రపర్చుకోవడం ‘

ఒంటికంటిన బురదను కడుక్కోవడం , మనసుకంటిన మలినాన్ని కడుక్కోవడం

చేతులకూ, కాళ్ళకూ.. చివరికి కావాలనే హృదయానికి పూసుకున్న మకిలిని కడుక్కోవడం

కడుక్కోవడంకోసం ఒకటే పరుగు

కడుక్కోడానికి దోసెడు నీళ్ళు కావాలి .. ఒక్కోసారి కడవెడు కావాలి

మనిషి లోలోపలి శరీరాంతర్భాగమంతా బురదే ఐనప్పుడు

కడుక్కోడానికి ఒక నదే కావాలి-

 

అసలు నది నిర్వచనమే ‘ కడుగునది ‘ అని

మనుషులను, పశువులను, పాపులను, పుణ్యులను

సకల చరాచర ప్రాణిసమస్తాలను కడగడమే నది పని

నది అంటే ఆగనిది

నది అంటే పరుగెత్తేది

నది అంటే వెనక్కి తిరిగి చూడనిది

నది అంటే నిత్య చలన చైతన్య శీలి.. జీవ ఝరి –

 

నదికి పుష్కరమంటే

తల్లి ప్రత్యేకంగా ప్రేమతో బాహువులు చాచి పిల్లలను పిలుస్తూండడమే

‘ బురదలో ఆడుకుని ఆడుకుని మకిలి పట్టిన పిల్లల్లారా

రండి నా ఒడిలోకి .. మిమ్మల్ని ప్రేమతో లాలించి మళ్ళీ

మీ ఒంటి .. మీ హృదయాల బురదనంతా కడిగి శుభ్రిస్తా రండి ‘

అని తీరమై విస్తరించి అభ్యర్థించడమే .. స్నానించడమే

ఇక ఒడ్డున జరిగే క్రతువులన్నీ అంతా ఒక తంతు

పూజలు .. పిండాలు ..    హారతులు .. తర్పణాలు .. అర్ఘ్యాలు

అంతా ఒక యథాలాప తాంత్రిక ప్రక్రియ

పుష్కర పర్యటనలను విహార యాత్రలో, వినోద యాత్రలో చేసుకుని

‘ జస్ట్ టు ఎంజాయ్ .. జస్ట్ టు సీ వాటర్ ‘ అనుకునేవాళ్ళకు

పన్నెండేళ్లకొకసారి పుష్కరించే నది ఒక కొరడా దెబ్బే

నదిని ఒక జీవదాతగా .. ప్రాణప్రదాయినిగా

నదిని ఒక నాగరికతా ప్రదాతగా

ఆఖరికి నదిని తల్లిగా స్వీకరించగల్గడమే  .. పుష్కర పాఠం

నీటిని ప్రాణమని గ్రహించడం .. నీటిని జీవమని తెలుసుకోవడం

నీరే దైవమని ప్రార్థించడం

చివరికి నీరే మనిషని స్పృహించడం

అదే .. అంతిమ పుష్కర పాఠం

నువ్వు పుష్కరుడవో .. పుష్కరిణివో .. జలదేవతా నీకు నా నమస్కారం –

 

 

2 thoughts on “నదుల తీరాలపైననే నాగరికతలన్నీ

  1. కడుక్కోవడం…శుభ్రపర్చుకోవడం..ఇవే జీవితం…నిజమే.
    సుందరి, విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *