March 19, 2024

గిలకమ్మ కతలు.. “కణిక్కి…సింతకాయ్ ..! “

రచన: కన్నెగంటి అనసూయ
“సత్తెమ్మొదినే ..ఏటంత అడావిడిగా ఎల్తన్నావ్? మొకం గూడా.. అదేదోలాగా ఉంటేనీ..! ఎక్కడికేటి…? అయినా.. నాకెంతుకులే..!”

ఎదర కుచ్చిల్ల దగ్గర సీర పైకెత్తి  బొడ్లో దోపి..  కుడి సేత్తో పైట ఎగదోసుకుంటా ఎడం సేత్తో మనవరాలు సుబ్బులు  సెయ్యట్టుకుని ఈడ్సుకెల్తన్నట్టు అడావిడిగా  లాక్కెల్తన్న సత్తెమ్మ..రత్తయ్యమ్మన్న మాటలకి  అక్కడికక్కడే నిలబడిపోయి..ఎనక్కిదిరిగి  రత్తయ్యమ్మెనక్కి కుసింత ఇసుగ్గా సూత్తా…సెప్పక తప్పదన్నట్టు ..మొకవెట్టి..

” అడిగినియ్యన్నీ  అడిగేసి..కడాకర్న నాకెంతుకులే అంటావ్. ఎప్పుడూ దీని బుద్ధింతే..ఇది మారదు..అదే ఒల్లుమండుద్ది..మల్లీ సెప్పాపోతే అదే తప్పు ..” అని నోట్లో నోట్లో గొనుక్కుంటానే…రత్తయ్యమ్మ దగ్గరకంటా వచ్చి .. “..ఇక్కడదాకానే..రత్తప్పా..! మల్లినోరి ఈద్దాకాను..” అంది ఇసుగ్గా..

“ మల్లినోరీదికా ..? ఓ పక్కన సందలడతంది.?  పొయ్యి ముట్టిచ్చి ఎసరడేసేవేటి? ఇయ్యాల్టప్పుడేంపనోగానీ..మన్రాల్ని దీస్కునీ మరీ ఎల్తన్నా..!  అయినా నాకెంతుకులేమ్మా..పిల్ల మొకం గూడా అదోలాగుంటేనీ..ఏదన్నా గొడవేమోనని అడిగేన్లే…అయినా..”

“ ..గొడవనుకుంటే..గొడవే..రత్తప్పా..” అంటా…రత్తయ్యమ్మకి మరింత  దగ్గరకంటా వచ్చి పిల్లని  ఆవిడ  ముందుకి తోసి భుజాలకాడ గౌను సేతులెత్తి…

”సూసేవా ..? ఎల్లాక్కొరికేసిందో..? అదే మనవైతే …ఊరుకుంటారా  అంట..? “ కోపంగా అంది సత్తెమ్మ.

“ ఎంతుకూరుకుంటారు..? ఎగేసుకుని  మరీ వత్తారు. అయినా  ఎవతా కొరికింది? దయిద్రుగొట్టుమ్ముండ?  కలికాలం కాపోతే  అలా ముక్కొచ్చేతట్టు కొరికేత్తారా ఎవరైనా?  కడిగి ఒదిలి పెట్టు. అడిగేవోల్లు లేగ్గానీ..” ఎగదోసింది రత్తమ్మ.

దాన్తో రెచ్చిపోయిన సత్తెమ్మ..

” దయిద్రుగొట్టుమ్ముండా…మరి దయిద్రుగొట్టుమ్ముండా? నా మన్రాలే  దొరికిందా కొరుకుతాకి దానికి. దీన్ని కొరికి దాని పళ్లతీత తీరుసుకున్నట్టుంది..పెంటమ్ముండని.. పెంటమ్ముండ. నాలుగూ జ్జాడిచ్చి వద్దామని..సూత్తాను.. ఏం సెప్పుద్దో అల్లమ్మ..”  అంటా విస్సురుగా మన్రాలి  భుజన్నట్టుకుని  ముందుకి తోత్తా ..

“ నడూ..! రాచ్చసి పల్లేసుకుని  అదలా మీదబడి  కొరికేత్తా  ఉంటే  అచ్చోసిన ఆంబోతల్లే సూత్తా నిలబడి  కొరికిచ్చుకుందిగాక ఏడుపొకటి?  రోజూ.. గౌడు గేదల్లే  సిక్కటి పాలు గళాసుడు తాగి పడుకుంటేనేగానీ  మియ్యమ్మ ఊరుకోదుగందా!  ఆ శత్తంతా  ఎక్కడికోయిందో..” అంటన్నమామ్మకేసి  బెదురుగా సూత్తానే ముందుకు పడబోయేదల్లా  నిలదొక్కుకుని, కారుతున్న సీవిడ్ని గౌన్తో తుడ్సుకుంటా

“ అబ్బా..! ఏటే..నాయనమ్మా..! అంత గట్టిగా తోత్తావ్ ..పడిపోతేనో..!” అంటా  బేరమని ఏడుత్తానే  బిగిచ్చి పట్టుకున్న మామ్మ సేతిని భుజం మీదనించి కిందకి తోసేసింది సుబ్బలచ్మి.

“ సింగినాదం కాదా..!   ఆ మాత్తరం దానికే భుజం నెప్పొచ్చేసిందా..? అది ముక్కూడొచ్చేటట్టు కరికితే నోరు మూసుక్కూచ్చునావే..మరి..?” జాడిచ్చింది సత్తెమ్మ.

నోరెత్తలేదు..సుబ్బలచ్మి.

నాలుగడుగులేసేసరికి  రానే వచ్చింది మల్లినోరి ఈధి.

సరాసరెల్లి  నడుం మీద సెయ్యేసి సరోజ్ని ఇంటిగుమ్మం తిన్నగా నిలబడి..” సరోజ్నే…ఒసే..సరోజ్నే..” ఊరందరికీ ఇనపడేతట్టు గట్టిగా గొంతెత్తి అరిసింది  సత్తెమ్మ..

అంతకు ముందే  బళ్లోంచొచ్చి..కాళ్ళూసేతులు కడుక్కున్న  గిలకమ్మని  కంచం తెచ్చుకోమని   కాలిన  మజ్జిగ రొట్టి..దాని పల్లెంలో ఏసేసి..మల్లీ పేనం మీద  రెండు సుక్కల నూనోసి  అట్టకాడతో  అట్టా అట్తా ఓ తిప్పుతిప్పి రెండు గరిటెల పిండేసి , గరిటితో సుట్టూ నూనె సుక్క వొంచుతున్న సరోజ్ని..

”  సత్తెమ్మత్త గొంతులాగుందేటి..?” అని  తన్లోతాననుకుంటా..అక్కడే పీట మీద కూచ్చుని పళ్ళెంలో మజ్జిగి రొట్టి తింటున్న గిలకమ్మకేసి సూత్తా..

”తింటా ఉండు. ఇప్పుడే వత్తాను. సత్తెమ్మత్తొచ్చింది  మాట్తాడొత్తాను. పొయ్యారిపోతే కొరకంచు ఎగదొయ్యి..” అంటా.. అంతలోనే గిలకమ్మ పళ్ళెంకేసి  సూసి..

”ఉల్లిపాయ ముక్కలలా పక్కనెట్టేవే? గొంతు దిగవా? పచ్చిమిరగాయ్ ముక్కలైతే అనుకోవచ్చు. ఉల్లిముక్కలకేమయ్యిందే..? మజ్జిగలో ఊరి పుల్ల పుల్లగా  ఉండి అయ్యే బాగుంటాయ్. సలవజేత్తయ్. తిను పడేయ్యకుండాను. కట్టపడి వండుతుంటే తింటానిగ్గూడా ఒల్లొంగాపోతే ఎల్లాగా? తిను ..”

అంటా సీర సవరిచ్చుకుని…పక్కనే గిన్నెలో నీళ్ళుంటే  సెయ్యందులో ముంచిదీసి పైటకొంగుకి సేతులు తుడ్సుకుంటా..

“ ఇలాగొచ్చేవేటి సత్తెమ్మత్తా? లోపలికి రాపోయేవా ? ఎప్పుడోగాని రావు గూడాను. ఈ మజ్జన సూల్లేదు . ఎన్నాల్లయ్యిందో నిన్ను  సూసి..లోప్ల్కి రా..మజ్జిగరొట్టి తినెల్దువుగానీ..” అంటా  గుమ్మం దాటి నవ్వుతా బయటికెల్లిందల్లా..సత్తెమ్మ నీ, ఆ పక్కనే ఏడుత్తా నిలబడ్ద  సత్తెమ్మ మన్రాలు సుబ్బుల్నీ చూసి తెల్లబోతా..

“ మా కుర్రముండ ఏదో  సేసేసింది …దీన్ని  బళ్ళో..! ఇదింట్లో ఉంటే ఒగ్గొడవ..బళ్ళో ఏత్తే ఇంకో గొడవ..పేనం ఏగిచ్చిపోతంది దీంతో..” కూతుర్నే తల్సుకుంటా..మనసులోనే అనుకుంది సరోజ్ని.

అయితే..  సరోజ్ని మాటల్ని ఏ మాత్తరం పట్టిచ్చుకోకుండా..

“ మజ్జిగరొట్టో..గెంజిరొట్టోగానీ.. మీ కుర్రముండుందా ఇంటోనూ..?  “

అంది సత్తెమ్మ పెంకులెగిరిపోయేతట్టు..అరుత్తా..

“ ఆ..ఉంది.. ఇప్పుడే బళ్ళోంచి  వచ్చింది. ఏ? ఏవైంది సత్తెమ్మొదినే..” అంది సుబ్బుల్నే ఎగాదిగా సూత్తా..

“ ఎంత నంగనాసివే తల్లీ? నీ నంగి కవుర్లూ నువ్వూనూ..! ..సూడు పిల్లనెలా కొరికేసిందో..? ఇలాగేనా కొరికేసేది..?పిల్లని కాత్తంత అదుపులో పెట్టుకోవద్దా..? మేవూ పెంచేం పిల్లల్ని..”

సరోజ్ని ఏవనుకుంతదో అని కూడా సూడకుండా బిళ్ళూ బిళ్ళూ అనేసింది సత్తెమ్మ…మన్రాల్ని సరోజ్ని ముందుకి ఒక్క తోపు తోత్తా..

మల్లీ  ఏడుపు లంకిచ్చుకుంది..సుబ్బలచ్మి ఆల్ల  నాయనమ్మొంక  సిరాగ్గా సూత్తా..

తల్తిరిగిపోయింది సరోజ్నికి  ..సుబ్బలచ్మి సేతుల మీద పళ్లగాట్లు సూసి. కొంచెం ఉంటే ముక్క ఊడిపోయేదే.! అని  మనసులోనే భయపడతా..ఎనక్కి తిరిగి..

“ గిలకా..? ఒసేయ్ గిలకా..! ఆ కొరకంచు కిందకిలాగి నువ్వోసారి ..ముందిలా బయటికి..రా..”

పొయ్యి దగ్గరున్న గిలక్కినపడేటట్టు  గట్టిగా పొలికేకేసింది సరోజ్ని..

అయినా రాలేదు గిలక..

“ వత్తన్నావా? లేదా? “ మల్లీ అరిసింది..ఈసారి మరింత గట్టిగా..పైనెగిరే పచ్చులుగూడా భయపడి ఎగిరిపోయేతట్టు..

.అర్ధమైపోయింది గిలక్కి..

పళ్ళెం అలా సేత్తో పట్టుకునే తింటా బయటికొచ్చింది గిలక. ఆ నడకలో ఏ కోశానా..అయ్యో కొరికేనే..ఇప్పుడేమవ్వుద్దో  అనే భయం ఏ కోశానా  లేకుండా..వచ్చి నిలబడ్ద గిలకనే సూత్తా..

“పళ్ళెం..అక్కడెట్టి రా..! తర్వాత్తిందువుగానని సెప్పేనుగదా..? నీక్కాదా సెప్పింది. లేపోతే సెవుడొచ్చిందా? పట్టుకెల్లి పల్లెం లోపలెట్టిరా..? దిట్టిగూడాను..” కసిరింది సరోజ్ని,

ఆ మజ్జినిలాగే..పాలతాలికులు  సేత్తే ఈదరుగు మీద కూచ్చుని తిన్దేమో..వారం రోజులు ఈడ్సీడిసి  కొట్టిన ఇరోసనాలు గుర్తొచ్చి.

తల్లి మాటల్ని ఏం పట్టిచ్చుకోనట్టు  తీసిపడేత్తా..సుబ్బలచ్మి ఎనక్కే సూత్తా..
“ ఏటి ..మీ నాయనమ్మని తీసుకొత్తే నాకు భయమేసేద్ది అనుకున్నావా?” అంది గిలక నదురూ బెదురూ లేకుండా..

తెల్లబోయేరు సత్తెమ్మా, సరోజ్నినీ..గిలకన్న తీరుకి..

ఏడుత్తానే నేల సూపులు సూత్తందేమో..సుబ్బలచ్మి ఏం మాట్తాడలేదుగానీ

సత్తెమ్మంది..గిలకని సూత్తా..

“ ఏలెడంత లేదు. ఎలా ఓట్రిచ్చేత్తందో సూసేవా నీ కూతురు? నీ మాటే ఇంటాలేదు. ఇక మేస్టర్ల మాటేవింటాది..” గయ్యున ఇంతెత్తున లేత్తా.. బుగ్గల్నొక్కుకుంది సత్తెమ్మ తెల్లబోతా..

“ అసలేవైందో నువ్వైనా సెప్పు సత్తెమ్మత్తా..” అంది సరోజ్ని గిలకొంక సురా సురా సూత్తా..

“ ఏవుంది..? రత్తం వచ్చేట్టు కొరికిందంట..మియ్యమ్మాయి. నువ్వూ సూసేవ్ గందా! ఏడుత్తా వచ్చిందిది బళ్ళోంచి. అడగ్గా..అడగ్గా సెప్పింది మీయమ్మాయే కొరికిందని.  ఎందుక్కొరికిందంటే నోరిప్పదు. ఒకటే ఏడుపు. ఆమట్ని లగెత్తుకొచ్చేను పిల్లన్దీసుకుని.   సరిగ్గా సూసేవో లేదోగానీ సరోజ్నే..పళ్ళు సూడు ఎంత లోతుగా దిగడ్దాయో..! సూదిమందెక్కిచ్చాలో..ఏటో..! ఊరికినే ఏత్తాడా ఏటి డాట్రు సూదిమందు..?  ఆడికియ్యద్దూ..? అయినా అంత గట్టిగా కొరికుతాకి..అది మనిసేనా అసల..? ముక్కూడొచ్చేసిందంటే  ..నీకు మాత్తరం దెల్వదా..దానికి మనువెంత కట్తమవుద్దో..? సూడు నీ..కల్లతో నువ్వే సూడు..” అంటా మన్రాలి రెక్కట్టుకుని రింది..సత్తెయ్యమ్మ సరోజ్ని ముందుకంటా.. లాక్కొచ్చి ,  గిలక కొరికిన సోట సూపిచ్చిందేమో..అది సూసి కళ్ళు తిరిగినట్తయ్యిన్ సరోజ్ని అంతలోనే తమాయించుకుని..

గిలకెనక్కి తిరిగి సూత్తా..

” కండలూడోచ్చేట్టు ఎందుక్కొరికేవే ఇలాగా? నువ్వేనా కొరికింది.?”  ఉక్రోషంగా అంది అప్పటికే  సత్తెమ్మ అరుపులు విని ఇళ్లల్లోంచి బయటికొచ్చేసి కరెంటు  తంబాలల్లే  నిలబడి..ఇడ్డూరంగా సూత్తన్న  ఇరూగూపొరుగోళ్లని సూసి అవమానంతో సరోజ్ని.

“నేనే..కొరికా! కొరకనా మరి.. అలా సేత్తేని..” నదురూ బెదురూ లేకుండా మాట్తాడతన్న గిలకన్జూసి  సరోజ్నే గాదు..ఇరుగూ పొరుగూగూడా   నోళ్ళొదిలేసేరు..ఏమ్మాట్తాడాలో తెలవక.

“ ఆస్ని.. కరోడా ముండా? ఎలా సెప్పేత్తందో సూడు నేనే కొరికేనని. అస్సలు భయమన్నది పెట్తలేదేంటే దేవుణ్ణీకు?”  బుగ్గల్నొక్కుకున్నారంతా..

“ కొరికేవ్ లే. మంచి పన్జేసేవ్. ముక్క తీసెయ్యాల్సింది.ఉంచేవెంతుకు? అలాగ తలోసోటా అయిదారు ముక్కల దాకా తీసేసేవనుకో..బడి మానిపించేసి ..పెళ్ళీ పెటాకుల్లేకుండా ఇంట్లో పెట్టుక్కూచ్చుంటాం..దామ్మ..తీసెయ్..దా..”

అంటన్న సత్తెమ్మ మాటలకి అడ్డొత్తా..

“ ఊరుకో సత్తెమ్మొదినే! నువ్వు మరీ సెప్తావ్.  పిల్లలు బళ్ళో లచ్చ పడతారు. అంతమాత్రాన..ముక్కలు ముక్కలుగా  పీకెయ్యటానికి  మా గిలకమ్మేవన్నా  రాచ్చసి పిల్లా..? అయినా నేనడుగుతాను గదా ఎందుక్కొరికిందో.  దాన్తోనే సెప్పిత్తాను..ఈలోపు అంతంత మాటలనేసెయ్యాపోతే..ఊరుకోవచ్చుకదా..”

“ నీకలాగే అనిపిత్తాది..మరి.  కొరికింది నీ కూతురుగాబట్టి. నువ్వింకెలా మాట్తాడతావ్ లే  ఇలాక్కాపోతే..”

“ అలాగని నేనెంతుకంటాను సత్తెమ్మొదినే.  అడుగుతానుండు అంటన్నానుగదా ఒకపక్క. నువ్వేమో బిళ్ళూ బిళ్ళూ అనేత్తన్నావాయే..మాటలు.  కొంచెవాగు..” అంటా ఒక్క ఉదుట్న  గిలక దగ్గరకంటా ఎల్లి  రెండు జళ్లనీ  మొదట్లో లాగిపట్టుకుని తల ఎనక్కి వంచుతా..

“ నేన్నీకు  బళ్ళో ఏసిన్నాడేంజెప్పేను? ఎవర్ని కొట్తద్దు..కొరకద్దు..గిల్లద్దు అని  సెప్పేనా? సెప్పేనా లేదా?  సూడు ఇప్పుడేవయ్యిందో..? ఆ సత్తెమ్మామ్మ సూసేవా ఎన్నెన్ని మాటలంటందో..” ఉడుకుమోయింది సరోజ్ని సత్తెమ్మన్న మాటలకి.

తల్లి గొంతులోని జీరకి..    గిలకమ్మ ముఖవంతా ఎర్రగా రక్తం కందిపోగా..

“ ముందా జడొదులు. ఎంటికలు  ఊడ్నియ్యంటే..నీ సంగజ్జప్తా..”…తల అలా ఉంచే కళ్ళు తిప్పి తల్లొంక సూత్తా.. కసిర్నట్టుగా అంది గిలక

“   ఎందుక్కొరికేవంటే జడొదులంటావేటి?  ఎంతుక్కొరికా ..అంత రత్తంవొచ్చేట్టు..?”

“సెప్తాను.  జడొదులమ్మా..! నీగ్గాదేటే సెప్పేది. నొప్పొచ్చేత్తంది..”

“ మీయమ్మ జడట్టుకుంటేనే నీకంత నెప్పొచ్చేత్తందే? ఇంత లోతున పళ్ళు దిగడితే   ఈళ్లకుండదు మరి నొప్పి..”

“ మరీ.. మరీ.. సంచీలో సెయ్యెట్టి కణికి లాగేసుకుంటే  మాకు రాదా నెప్పి..” తాచుపామల్లే  బుసలు కొట్తేసింది గిలక.

“కణికి ఇత్తం ఏటి? “ సరోజ్ని నిలేసింది కూతుర్ని..

“ కాదమ్మా…! మా బళ్లోను..గిరీసు ఉంటాడు గదా..! మా కళాసే. గిరీసు రెండ్రోజుల్నించీ బళ్లోకి కణికి తెచ్చుకుంటల్లేదు. అదే ..! పలక మీద రాసుకునే  కణికి.  మా మేస్టారేమో..ఎవరి దగ్గరన్నా రెండు  కణికులుంటే  ఆడికోటియ్యండి” అన్నారు.

“ అప్పుడేమో..నేను  నా దగ్గర పెద్ద కణికుంటే   ఇరగదీసి  ఒక ముక్క ఆడికి ఇచ్చేనమ్మా. నాకు  వానా కాయ(పచ్చి  చింతకాయల్ని  లేత దశలో వానాకాయలు అంటారు)  పెట్టేడు కణికిచ్చేనని. అయితే ఆడికేమో..ఖ అచ్చరం ఎన్నిసార్లు దిద్దినా వత్తల్లేదు. మేస్టారేమో..ఆడి నెత్తి మీద  మొట్టిన సోటే మూడుసార్లు మొట్టేసేరు..వానాకాయలు తినమంటే ఎన్నన్నా తింటావ్..ఖ మాత్తరం వత్తాలేదని. పాపం…ఏడుత్తా…తెగ దిద్దేసేడమ్మా.. ! కనికేమో అరిగిపోయింది.  నా కణికిద్దామంటేనేమో..నేనూ  రాసుకోవాలిగదా..!  అంతుకని..ఆలోసిచ్చి ..ఆడి దగ్గరున్న వానాకాయలు తీసుకుని “ కణిక్కి .. సింతకాయ్..కణిక్కి సింతకాయ్..” అంటా  అన్ని కళాసులూ తిరిగేవమ్మా..నేనూ, ఆ గిరీసుగాడూను. ఈ సుబ్బు నాక్కూడా కావాలి వానాకాయ .నా నోరూరిపోతంది అని  మాయనకే వచ్చిందమ్మా…! దాన్దగ్గర  కణికి తీసుకుని  సరిగ్గా అదెంతుందో అంతే కొలిసి కణికిచ్చేము..ఆడూ, నేనూ.

అలా బోల్డన్ని కనికిలొచ్చేసినియ్ గిరీసుగాడికి. నా కనికి ముక్క నాకిచ్చేసేడుగూడాను.

బడి వదిలిపెట్టేసేకా..ఇంటికొచ్చేసేటప్పుడు…ఈ సుబ్బులు  మాకూడా వచ్చి..

” నా కణికి నాకిచ్చెయ్యండి.  మాయమ్మ కొట్టుద్ది కణికి లేకుండా ఇంటికెల్తే.. “ అని  ఏడుత్తం మొదలెట్టింది.  అలా ఏడుత్తానే  ఆడి మీద పడి రక్కేసి..ఆడి సంచీ లాగేసుకుని కనికి   తీసేసుకుంది కూడాను.

“ నా సింతకాయ్ నాకియ్యి.” అన్నాడు గిరీసు.

“  తినేసేను. నా పొత్తలో ఉంది తీస్కో అంది , పొట్త ఇలా ముందుకంటా పెట్టి . “ అంటా ..అక్కడే ఉన్న సుబ్బులెనక్కి సూత్తా ..

“ అన్నావా లేదా?  నిజ్జం సెప్పే సుబ్బులూ. మీ మామ్మని   తీసుకొచ్చేవ్ గదా..!న్పెద్ద  నీకే ఉన్నట్టు.. “ అని మళ్ళీ ఆల్లమ్మెనక్కి తిరిగి..

” ఆడి దగ్గర తీసుకున్న కనికి  లాగులో ఎక్కడో పెట్టేసిందమ్మా.అడిగినా ఇయ్యలేదు. అలా సెయ్యచ్చా..అమ్మా..? తప్పేగదా..? అంతుకే కొరికేను..”

“ అయినా నీకెంతుకే గిలకా? ఆడి సింతకాయ. సుబ్బులు కణికి. మజ్జలో నీకెంతుకు? అలా కొరికేత్తాకి..” తెల్లబోతా అంది సరోజ్ని..కూతుర్నే సూత్తా..

“ కాదమ్మా…! కణికిచ్చింది. వానాకాయ తీస్కుని తినింది. మల్లీ తన కణికి తనకిచ్చెయ్యమంది. అప్పుడు ఆ వానకాయ ఇవ్వాలి కదా..? ఇవ్వలేదు. అప్పుడు కనికెందుకు ఇత్తాం?  ఇవ్వలేదని ..ఆ గిరీసుగాడ్ని దీని గోళ్లతో ..రక్కేసి…మరీ తీసేసుకుంది. ..”

నోరెత్తలేదెవరూ..

“ కనిక్కి సింతకాయ్ ఇత్తే సాలానేకనికిలొచ్చుంటయ్ గందా?  పాపం అదేడుత్తుంటే ఒక్క కణికివ్వచ్చు గదా..మరి.  సెప్పింది కదా కనికి పట్టుకెల్లకుండా  ఇంటికెల్తే ఆల్లమ్మ కొట్టుద్దని. “

“ అలాగేమీ  అడగలేదది..? అడిగితే  ఇద్దుం. అడక్కుండా ఆడి మీద పడి  లాగేసుకుంది..అంతుకే..”

అంతా విన్న సత్తెమ్మకి అసలు సంగతేంటో  అర్ధమయ్యి.. తేలు కుట్తిన దొంగల్లే నోరు మూసుకుని వచ్చిందారినెల్తా..

“ అయినా..నీకు వానాకాయలు గావాలంటే..మీ నాన్తో   సెప్తే తేడా? కనికిచ్చి కొనుక్కుంటాకి..? నడు ఇంటికి . సేసింది సాల్లేగానీ..” ఎల్తా ఎల్తా  రత్తమ్మన్న మాటలకి

“మనమెన్నిచ్చినా…ఆల్లు తింటారా సత్తెమ్మత్తా?  ఏ గడ్దయినా  బళ్ళో  ఆల్ల సేయితుల్తో తింటేనే..ఆళ్లకిష్టం..”

అప్పటిదాకా పందెంకోళ్లా ఎగసెగసి పడ్ద గిలక లోపలికొస్తానే..మజ్జిగరొట్టున్న పల్లెం సేతుల్లోకి తీసుకుంది..

కూతురెంతుకో కొత్తగా కనపడ్దది సరోజ్ని కల్లకి.

—-

 

8 thoughts on “గిలకమ్మ కతలు.. “కణిక్కి…సింతకాయ్ ..! “

  1. Thanku కృష్ణబాబుగారూ..! అంతా చదివాకా చెప్పండి.,

  2. కణిక్కి చింతకాయ సగం వరకు చదివాను, తప్పకుండా పూర్తిగా చదువుతాను, గోదావరి యాస చాలా బాగా ఉంది
    ధన్యవాదాలు

  3. Thanku హైమా డియర్ ..! గోదారి ఇసుక తిన్నెలపై మన అడుగుల జాడలు కూడా కథలవ్వబోతున్నాయ్ ..రెడీగా ఉండు.

  4. Thanku somuch కామేశ్వరిగారూ! నామినిగారే నా గురువుగారండి…ధన్యోస్మి అండి.

  5. కణిక్కి .. సింతకాయ్..కణిక్కి సింతకాయ్..
    గోదావరి భాషమీద ఎంత పట్టు ఉందో ..ప్రతి పదం లోనూ ప్రతిబింబిస్తుంది అక్కా.. Really great.congratulations

  6. చాలా బాగుంది అనసూయగారూ ఆ గోదారి యాస చూస్తుంటే మీరుకూడా దర్గా. మిట్ట కతలు రాసిన ఖదీర బాబు గారిలా, సిన్నబ్బ కతలు రాసిన నామిని సుబ్రహ్మణ్యం గారిలా మీరు రాసిన గిలకమ్మ కధలు కూడా అంత పేరు సంపాదిస్తాయి. అది గ్యారంటీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *