April 26, 2024

ఫ్రీ… ఫ్రీ….. ఫ్రీ..

రచన: గిరిజారాణి కలవల

పొద్దున్నే అష్టావధానం.. శతావధానం అయిపోతోంది..
ఓ పక్క కుక్కర్.. ఓ… తెగ కూసేస్తోంది రా.. రమ్మని.. రా.. రా.. రమ్మని..
ఇంకో పక్క సాంబారు కుతకుతలాడిపోతోంది… పోపుకి టైమయిందంటూ..
మరో వేపు శ్రీవారు కారుతాళాలు కనపడక కారుకూతలతో.. తైతక్కలాడుతున్నారు.. .
ఇంకో వైపు పనిమనిషి గిన్నెల మోతలు..
సుతుడి సుత్తి ఇంకో రకం..
పూజగదిలో అమ్మవారి అష్టోత్తరమే చదివాను.. నాది చదవలేదేమని అయ్యవారు అలిగి.. ఎక్కడ అష్టకష్టాలు పెడతారో అని.. అదో భయం ఇంకో పక్క…
ఇవీ.. ఈ కుత కుత కూతల మోతల మధ్య నా వెతలు… హాడావుడి లో అప్పడప్పుడు చిరు వాతలు.
ఇన్నిటి మధ్య.. అప్పుడే ఫోన్ మోగుతూంటే.. ఆ టైమ్ లో రేగే తిక్కకి అసలు లెక్కే వుండదు..
ఇప్పుడు ఆ గబ్బర్ సింగ్ గబ్బు మాటలెందుకు గుర్తొస్తాయో.. అర్ధం లేదు..
ఓ రింగ్ వచ్చి ఆగిపోయింది.. కాసేపాగి రెండు రింగులు… ముచ్చటగా మూడో నిముషంలో మూడే రింగులు…
అర్థం అయిపోయింది.. ఆ రింగులరాణి ఎవరో….. అసలు మొగుడితో వేగలేకపోతోంటే.. మధ్యలో ఈ అర్ధమొగుడు ఒకటీ… ఫోను తీస్తే ఒక గోల.. తియ్యకపోతే మరో గోల…
తనది జియో సిమ్మే.. తన సొమ్మేదో అరిగిపోతున్నట్టు మిస్సుడు కాల్ ఇస్తుంది.. నాకు కాలిపోతూవుంటుంది.. ఆ కాల్ చూస్తే.. కుతకుతలాడే పొయ్యిలు అన్నీ సిమ్ లో పెట్టి.. తిరిగి ఫోను చేసాను. అటువైపు రెడీగానే వుంది.
” వదినోయ్… ఈ రోజు బిగ్ బజార్ లో అన్నీ ఆఫర్ లే అట.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అట.. పేపర్ చూడలేదా! నేను మధ్యాహ్నం మూడింటికల్లా వస్తాను. రెడీగా వుండు.. వెడదాం.” అంటూ అప్పచెప్పేసింది పాఠం.
చచ్చాను బాబోయ్ అనుకున్నా.. ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు వూళ్ళోకి వచ్చింది. వెళ్ళి కలుసుకుందామనుకున్నా.. ఇంతలో ఇదొకటి.. ఆడపడుచు వున్న వూళ్లో వుండడం నా చావుకొచ్చింది. రావడం కుదరదని చెపితే… వెంటనే వాళ్ళ అన్నగారికి.. వాళ్ళమ్మకీ న్యూస్ వెళ్లిపోతుంది. ఈయన అష్టోత్తరం ఎలాగోలా భరించగలను కానీ, అత్తగారి సహస్రనామాలు నా వల్ల కాదు.. స్నేహితురాలికి ఏదో ఒకటి చెప్పుకుని ఈవిడ గారితో ఆ బిగ్ బజార్ కి వెళ్ళడమే ఇక తక్షణ కర్తవ్యం అనుకున్నా..
ఈ ఫోన్ వస్తుందని పొద్దున్నే పేపరు చూసినప్పుడే అనుకున్నా… ఈ ఆఫర్ లూ, ఫ్రీగా వస్తున్నవీ వున్నాయంటే చాలు.. ఎంతదూరమైనా.. ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఈవిడ జాతకం ఏంటో కానీ.. జీవితం అంతా ఫ్రీ సర్వీస్ మీదే లాగించేస్తుంది. మొగుణ్ని కూడా ఫ్రీగానే కొట్టేసింది.. మేనత్త కొడుకు కదా… ఊరికే వచ్చేసాడు. ఆ మాటే నేను ఎప్పుడైనా మా ఆయన దగ్గర అంటే తెగ ఉడికిపోతారు..
” మీ చెల్లి కి ఎంచక్కా ఫ్రీ గా వచ్చేసాడు. నాకే.. మా నాన్న ఎంత బేరం చేసాడో మిమ్మల్ని కొనడానికి.. అప్పటికీ వసుదేవుడి టైపులో.. మీ నాన్నగారి గారి కాళ్లు కూడా పట్టుకుందామనుకున్నారట పాపం”..
” అంటే.. ఏంటే.. మా నాన్న గాడిద అనుకుంటున్నావా?” అని గుర్రులు..
” మీ నాన్నేంటీ.. మిమ్మల్ని అదే అనుకుంటున్నా.. మీ కాళ్లు నిజంగానే పట్టుకున్నారుగా, కన్యాదానం చేసేటప్పుడు “.. అందామనుకునేదాన్ని…అంటే ఇంకేమైనా వుందీ… కురుక్షేత్ర సంగ్రమమే ఇక.
ఏది కొంటే ఏది ఫ్రీ గా వస్తుందా! అని చూసి, అది నాచేత కొనిపించి… ఆ ఫ్రీగా వచ్చేది తను కొట్టేస్తూ వుంటుంది. వాళ్ళింటి నిండా.. మా ఇంటి వస్తువుల తాలూకు వచ్చిన ఫ్రీ సామాన్లే… తనకి ఓసారి బకెట్ అవసరమయింది… చూస్తే ఏదో చెత్త వాషింగ్ పౌడర్ ఆరుకేజీల పేకెట్ కొంటే బకెట్ ఫ్రీ అట.. వద్దు మొర్రో అంటున్నా కూడా.. బలవంతంగా అంటగట్టించి… బకెట్ తీసుకునిపోయింది. ఆ పౌడర్ తో బట్టలు ఉతకడం మాట అలా వుంచి టాయిలెట్ లు కడగడానికి కూడా పనిచెయ్యలేదు. అలాగే ఎప్పుడో తాగుతాం కాఫీ అన్నా వినిపించుకోకుండా… స్టీలుగ్లాసు ఇస్తున్నారని ఏకంగా కేజీ కాఫీపొడి కొనిపించింది. అది చెల్లుబాటు అవడానికి ఆరునెలలు పట్టింది. మా ఆయన ఏదో కార్డుకి నెలకి ఓసారి సినిమా టిక్కెట్లు ఫ్రీ అన్నారొకసారి.. అప్పటినుంచి అవి వాడుకుని ఇంటిల్లపాది సినిమాకి వెళ్లి పోయేవారు. ఇలా ఏది ఎక్కడ ఫ్రీ యా అని వెతుకుతూనే వుంటుంది.
వద్దంటే మా వీధి చివర వున్న గుర్నాధం కొట్లోనే ఇంటికి కావలసిన సరుకులు కొంటుంది. వాడు అన్నీ చచ్చులూ, పుచ్చులూ, మన్నూ, మసానం అన్నీ కలిపేసి అమ్మేస్తాడు. అన్నీ కల్తీ సరుకులే వాడి దగ్గర. అక్కడ కొనొద్దని ఎన్నో సార్లు చెప్పాను… వినిపించుకుంటే కదూ! బయట కంటే ఓ రెండు రూపాయలు తక్కువ ప్రతీ దానిమీదా.. అంటుంది.. నీ ఖర్మ.. అనుకునేదాన్ని. ఓ సారి అక్కడ ఏదో ఐదుకేజీల ఆయిల్ డబ్బా కొంటే, రెండు స్టీల్ ప్లేట్లు ఫ్రీ అంటే కొనుక్కుని వెళ్ళింది. ఆ తర్వాత నాకు ఫోను చేసి… ” వదినా! ప్లేట్లతో పాటుగా ఈ నూనె డబ్బా మీద.. Fat free అని కూడా వుంది.. అదివ్వడం మర్చిపోయినట్టున్నాడు గుర్నాధం.. అటువైపు వెడితే అడిగి తీసుకుని వుంచు” అంది మా అయోమయం ఆడపడుచు… ఈ మేనత్త తెలివితేటలు నా కొడుక్కి వస్తాయేమో అని దిగులు పట్టుకుంది నాకు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ ఉచిత ప్రహసనాలు చాలానే వున్నాయి.
మథ్యాహ్నం మూడింటికి ఓ మిస్సుడు కాలు… బయలుదేరినట్టుంది అనుకుంటూ.. తిరిగి ఫోన్ చేసాను. ” కిందకి వచ్చేయ్యి.. వదినా! ఆటో లో వున్నాను” అని ఆర్డర్. ఔను మరి ఇక్కడ దాకానే ఆటో మాట్లాడుకుని, ఇంట్లోకి వస్తే.. ఇక్కడే ఆటోవాడికి తను డబ్బులు ఇవ్వాలిగా మరి.. ఒకేసారి బిగ్ బజార్ దాకా మాట్లాడి, దారిలో నన్ను ఎక్కించుకుంటే.. మొత్తం డబ్బులు ఇవ్వడానికి నేనొక బకరాని వున్నానుగా.. ఇక్కడెందుకు దిగుతుందీ! మళ్ళీ రిటర్న్ లో ఇక్కడ దిగి… రాత్రికి తినడానికి అన్నీ పార్శిళ్ళు కట్టించుకుని, వాళ్ళ అన్నగారిని కారులో దింపమని అడుగుతుంది.
” ఇదిగో.. తాళం వేసి దిగుతున్నా..” అంటూ వచ్చి ఆటో ఎక్కాను.
” నీ చీర బావుంది .. వదినా! ఎక్కడ కొన్నావు?” ఆటో ఎక్కగానే మొదటి మాట.
” చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నా… మొన్న నా పుట్టినరోజు కి” అన్నాను.
” అయ్యో! అక్కడ రేట్లు ఎక్కువ కదా! అక్కడెందుకు కొన్నావు? సి ఎమ్. ఆర్ లో అయితే ఒక చీర కి ఇంకో చీర ఫ్రీ అట.. అక్కడ తీసుకోకపోయావా? ” అంది.
ఆ ఫ్రీ చీర తీసుకుపోదామని.. ప్లాన్ కాబోలు.. అనుకున్నా.. కచ్చగా..
” అవి.. అలాంటివి మన్నవులే… అయినా ఇది నాకు నచ్చింది. అందుకే తీసుకున్నా ” అనేసాను ఖరాఖండిగా.
ఇంతలో బిగ్ బజార్ వచ్చింది… మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడకయితే ఏభై రూపాయలు… అమ్మగారు మరి తన ఇంటి నుంచి మాట్లాడిందిగా.. నూటేభై… నోరు మూసుకుని ఇచ్చాను.
” ముందు పైకి వెళ్లి. . చూసుకుంటూ కిందకి వద్దాం వదినా! ”
ఔను… ముందు పైకెళ్ళి నన్నో తోపు కిందకి తొయ్యడానికేగా.. అనుకున్నా మనసులో..
ముందు జాగ్రత్త చర్యగా ఈసారి కార్డు తేలేదు… ఈవిడ సంగతి తెలుసుకదా… ఓ పదివేలు పర్సులో పడేసుకుని వచ్చాను.
పైన బట్టల సెక్షన్ లోకి వెళ్ళాము.” వదినా! అన్నయ్య పుట్టినరోజు వస్తోందిగా.. షర్టు లు చూద్దాం పద… నా సెలక్షన్ వాడికి చాలా ఇష్టం… నిన్ను సెలక్ట్ చేసింది నేనేగా.. అందుకే నువ్వంటే మా అన్నయ్య కి ఎంత ఇష్టమో.. ” అంటూ ఓ కుళ్లు జోకేసింది.
” ఔనొను.. నీ సెలక్షన్ బావుంటుంది.. కానీ.. ఈ సారి పుట్టినరోజు కి వేసుకోని చొక్కాలే నాలుగున్నాయి.. ఇక కొనుక్కోనని అన్నారు మీ అన్నయ్య. ” అన్నాను.
” ఆ.. వాడలాగే అంటాడు.. మనం కొనేది మనం కొనెయ్యడమే.. వాడేం కాదనుడులే.. ” అంటూ నా మాట తీసిపారేసి, చొక్కాలు సెక్షన్ లో దూరింది. నిమిత్తమాత్రురాలిలా చూస్తూండిపోయాను. తిరిగి తిరిగి నాలుగు చొక్కాలు తీసుకొచ్చింది.
” ఎలా వున్నాయి వదినా? ” అంది..
ఎలా వున్నా నా నోట వచ్చే సమాధానం ఒకటే..
” బావున్నాయి ” అన్నా..
” రెండు కొంటే రెండు ఫ్రీ అట… అదిగో చూడు.. Buy 2 get 2.. అని పెట్టాడు..” అంది.
అయితే మా ఆయనకి ఆ buy వి రెండు.. మీ ఆయనకి get వి రెండూ.. అనుకున్నా.
ఆ తర్వాత పిల్లల బట్టలు… నా ఖర్మ కొద్ది ఆవిడ గారి కొడుకూ.. నా కొడుకు ఈడు వాడే.. మూడు నెలలే తేడా.. కాబట్టి ఇక్కడ కూడా కొన్నవి నాకూ.. ఫ్రీవి తనకీ..
అలా తన సెలక్షన్ లతోనే షాపింగ్ పూర్తవుతుంది ఎప్పుడూను..
ప్లాస్టిక్ డబ్బాలు, స్టీలు సామాన్లలో ఫ్రీ లు పెట్టలేదు.. ఆ జోన్ లోకి వెళ్ళదేమో అనుకున్నా… పెట్టకపోయినా అవీ వదల్లేదు.. తనకి ఒక్కదానికీ కొనమంటే ఏమైనా అనుకుంటాననుకుంటుంది కాబోలు.. ఏది తీసినా రెండు సెట్లు తీస్తుంది.. నీకోటి.. నాకోటి.. అంటుంది దయార్ధహృదయురాలు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. షాపింగ్ చేసినంతసేపూ ఆ తోపుడుబండిని తానే తోసేది. నన్ను చేయి కూడా వేయనిచ్చేదికాదు. “ఫర్వాలేదు వదినా” అనేది… అందులోంచి ఏదైనా తీసి పక్కన పెట్టేస్తానేమో అని అనుమానమేమో అనిపిస్తుంది నాకైతే..
అలా.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అంటూ అంతా కలియతిరిగి.. బిల్లింగ్ దగ్గరకి రాగానే… ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ.. దూరంగా నిలబడేది. మొత్తం అన్నిటికీ బిల్లు వేయించి నీరసంగా బయటకి రావడం నా వంతు.
ఇలాంటి షాపింగ్ లు మాకు మూడునెలలకోసారి పరిపాటి అయిపోయయి.
ఓరోజు పొద్దున్నే మా ఆయనకి ఫోను… చెల్లి గారి ఫేమిలీ.. ఫేమిలీ వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ పాలయినట్లు. వెంటనే మా ఫేమిలీ మొత్తం పరుగెత్తాం..ఏమయిందో, ఏంటో. అని..
మూడు బెడ్స్ మీదా.. ముగ్గురు.. సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటూ కనిపించారు. ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ అన్నారు.
పొద్దున్నే.. మా పనమ్మాయి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. కల్తీ సరుకులు అమ్ముతున్నాడని గుర్నాధం కొట్టు సీజ్ చేసారట.. వాడి మీద కేసు బుక్ అయిందనీ చెప్పింది.
వెంటనే అడిగాను.. నిన్న ఏం తిన్నారని..
ముక్కుతూ.. మూలుగుతూ.. చెప్పింది..
” గోధుమపిండి పేకెట్లు ఒకటి కొంటే మూడు ఫ్రీ ఆఫర్ వుంటే.. గుర్నాధం కొట్లో తీసుకున్నా వదినా!. రాత్రికి చపాతీలు ఆ పిండితో చేసాను.. తిన్నపుడు బానే వున్నాయి.. మధ్య రాత్రి నుండే.. ముగ్గురికీ ఇలా మొదలయ్యాయి..” అంది.
తిక్క కుదిరింది.. ఇప్పటికైనా ఈ ఫ్రీ పిచ్చి వదులుతుంది అనుకున్నా.
” డాక్టర్ గారు ఫర్వాలేదు అన్నారులే… సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారట. రెండు రోజులు రెస్ట్ తీసుకుందురు గాని.. మా ఇంటికి తీసుకెడతా ” అన్నారు శ్రీవారు.
” వదినా… ఈ హాస్పిటల్ డాక్టర్ నీకు వేలు విడిచిన మేనమామకి తోడల్లుడి కొడుకటగా.. ట్రీట్మెంట్ ఫ్రీ గా చేస్తాడేమో.. కాస్త అడుగు.”
ఈ మాటలకి నేనూ.. మా ఆయనా మొహామొహాలు చూసుకున్నాం.. ఈ ఫ్రీ పిచ్చి పీక్ స్టేజికి వెళ్లి పోయిందనుకున్నాను.
” అతను ఒకప్పుడు వుండేవారు ఇక్కడ.. ఇప్పుడు లేరు.. ” అన్నాను.
” అయ్యో! ఔనా! ఎంత బిల్లు అవుతుందో ఏంటో? ” రాబోయే బిల్లు ని తలుచుకుని బిపి పెంచేసుకుంటూంటే… మూడో బెడ్ మీద నుంచి వాళ్ళాయన… ” ఫర్వాలేదు, శ్యామలా! ఇన్సూరెన్స్ కవరేజి వుంది.. కంగారు పడకు” అని వూరడించేసరికి మా ఆడపడుచు మొహం అంత నీరసంలోనూ కూడా వెలుగులు సంతరించుకుంది.
” అయితే.. ఇంకో రెండు రోజులు ఇక్కడే వుందామండీ! ఇరవైనాలుగు గంటలూ ఏసీ లో వుండవచ్చు ఎంచక్కా..” అనేసరికి…
అంతే.. నాకు సడన్ గా..
బిపీ డౌన్ అయి సుగర్ పెరిగి.. తల తిరిగి.. ఢాం అని కూలపడిపోయాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *