March 19, 2024

రెండో జీవితం 9

రచన: అంగులూరి అంజనీదేవి

కోపం మనిషిని పశువును చేస్తుందని విమలమ్మకి తెలియంది కాదు…
”ఆయన బాధంతా ఆయన కొడుకు గురించే అన్నయ్యా! మనం అర్థం చేసుకోవాలి కాని, ఇలా పంతాలకి పోతే కాపురాలు నిలవ్వు… అయినా ఎంత మంది భర్తలు ఉద్యోగరీత్యా బయట ఊళ్లలో గడిపిరావటం లేదు. అంతమాత్రాన వాళ్ల భార్యలు విద్వంసాన్ని సృష్టించుకుంటున్నారా? ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అభిమానులు, యాడ్‌ ఏజన్సీలు, సన్మానాలు చేసేవాళ్లు, ఎగ్జిబిషన్లవాళ్లు ఇలా ఎందరెందరో ఫోన్లు చేస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా మాట్లాడుతుంటారు. అంతమాత్రాన అలిగి పుట్టింట్లో వుండటం… మంచి పద్ధతి కాదు.
ఈ పాటికి మీకంతా అర్థమైవుంటుంది. శృతికకు నచ్చచెప్పండి! అంతేకాని శృతికతోపాటు నన్ను కూడా మీ దగ్గర వుంచుకోవాలని చూడొద్దు… ఇక్కడ నాకో విషయం బాగా అర్థమవుతోంది! అదేమిటంటే మీరు తినగా మిగిలింది తిన్నా నా జీవితం వెళ్లిపోతుంది. నేను మీకు పెద్దభారం కూడా కాను. కానీ నా జీవితం నాకు బరువు అవుతుంది. ఎందుకంటే ఎక్కడ ప్రశాంతంగా ఓ ముద్ద దొరికితే అక్కడ తింటూ కాలం గడుపుదాములే అనుకొనే పిచ్చి శృతికను కాను కాబట్టి…” అంటూ ఆగింది.
చెల్లెలి వైపు అలాగే చూస్తున్నాడు నరేంద్రనాధ్‌.
”నేను వెళ్లి నా ఇంట్లో కార్తీకదీపాలు వెలిగించుకోవాలి. వెళ్లొస్తాను అన్నయ్యా! వెళ్లేముందు ఓమాట! పిల్లల తప్పుల్ని పెద్దవాళ్లు సవరించాలి. సపోర్ట్‌ చెయ్యకూడదు.” అంటూ ఆమె వెళ్తుంటే ఆపలేకపోయాడు.
వాళ్లు మ్లాడుకుంటున్న ప్రతిమాట పక్కనుండి వింటున్న సుభద్రకి తన కూతురు ఏం కోల్పోతుందో అర్థమై మనసు కళుక్కుమంది.
******

రింగ్‌ రాగానే మృదువుగా నవ్వి… కాల్‌బటన్‌ నొక్కి, మొబైల్‌ని చెవి దగ్గర పెట్టుకొని…
”హలో చైత్రికా ఎలా వున్నావ్‌?” అన్నాడు ద్రోణ.
”బాగున్నాను. నువ్వెలా వున్నావు ద్రోణా?” అంది చైత్రిక.
”నేనా ? అదోలా వున్నాను. నువ్వీ మధ్యన ఫోన్‌ చెయ్యట్లేదు కదా! అందుకని … ”అన్నాడు.
నవ్వింది చైత్రిక… వాళ్ల స్నేహం గడ్డిపరక మీద పడ్డ వానచినుకులా ప్రారంభమై ఉదృతంగా వర్షించి జలపాతంలా, నదులుగా, సాగరంలా సాగింది. సాగుతూనే వుంది.
స్నేహమంటే ఒకసారి మాట్లాడితే సరిపోదని. అది ఒక అంతులేని, అంతంలేని అనుభూతని తెలుసుకున్నారు. ‘దేవుడా! ఎవరిని ఎవరికి వశం చేయకు. చేశావా జీవితాంతం వారిని దూరం చేయకు.’ అని వేడుకున్నారు. అలా వాళిద్దరు తమ జీవితపు మలుపు దగ్గర ఆగి బాగా ఆలోచించుకున్నాకనే ఈ స్నేహాన్ని శాశ్వతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
”కానీ నాకు ఎగ్జామ్స్‌ వున్నాయి ద్రోణా! అందుకే ఫోన్‌ చేయ్యలేదు. చాలా సీరియస్‌గా చదువుతున్నాను. ఈసారి నా మార్క్స్‌ విషయంలో నా ఎక్స్‌పెక్టేషన్‌ హైలో వుంది.” అంది.
”ఓ.కె. ఓ.కె. ఎగ్జామ్స్‌ ఎలా రాస్తున్నావ్‌?” అన్నాడు.
”ఇవాళే లాస్ట్‌ ఎగ్జామ్‌ రాశాను. కాలేజినుండి హాస్టల్‌కి రాగానే నేను చేస్తున్న మొదటి పని నీకు కాల్‌ చెయ్యటం… నువ్వేం చేస్తున్నావు ద్రోణా? బొమ్మ వేస్తున్నావా?” అంది.
”అలాంటి పని ఇక చెయ్యనని చెప్పాను కదా!” అన్నాడు. ఆ మాటలు చైత్రికకు నచ్చటంలేదు.
”పట్టుదల అనేది పని చెయ్యటంలో వుండాలి కాని ‘పని’ చెయ్యకుండా బద్దకాన్ని కొని తెచ్చుకోవటంలో వుండకూడదు. నువ్వేమైనా అనుకో ద్రోణా! నువ్వు బద్దకానికి బాగా వశమైపోయావు. మళ్లీ పని చెయ్యాలంటే చెయ్యలేక పోతున్నావ్‌!” అంది.
మాట్లాడలేదు ద్రోణ.
”నువ్వొక మహాకవి గురించి చెప్పావు గుర్తుందా? ఆ కవి అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించి – ఆ అమ్మాయికి పెళ్లై పోవటంతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా, కవితల్ని రాయకుండా, వున్న ఆస్తుల్ని అమ్ముకుంటూ తాగుతూ లైఫ్‌ని కొనసాగిస్తున్నాడని… ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అలాంటిదే. దానివల్ల ఏమి ప్రయోజనం? పుట్టాక.. అందులో ఆర్టిస్ట్‌గా పుట్టాక తమలో వున్న ఆర్టిస్ట్‌ని తమ కృషితో బయటకి లాగి పదిమందికి పంచాలి కదా! కానీ నువ్వో మంచి పని చేశావులే… దానికి సంతోషించాలి.” అంది.
”ఏంా మంచి పని? ” అన్నాడు అర్థంకాక
”నా పనులు నేను చేసుకోగలను కదా! ఇక పెళ్లెందుకు? పెళ్లి చేసుకుంటే నామనసులో మనిషికి ద్రోహం చేసినట్లు కదా అని ఆ మహాకవిని ఆదర్శంగా తీసుకోలేదు” అంది.
ద్రోణ నవ్వి… ”అంత ఋష్యత్వం నాలోలేదు చైత్రికా! జీవితం కోసం కొన్ని వదులుకోవాలనుకున్నాను. నా ప్రేమను వదులుకొని శృతికను చేసుకున్నాను. అయినా తనకేం తక్కువ చెయ్యలేదు. కానీ తనకే నామీద ప్రేమ లేదు. అదేవుంటే ఈ అపార్థాలు, అనుమానాలు విడి, విడిగా వుండాలనుకోవాలు వుండవు కదా!” అన్నాడు.
”నెమ్మదిగా నేర్పుకోవాలి” అంది
”ప్రేమ నేర్పిస్తే వచ్చేది కాదు.” అన్నాడు
”అఫ్‌కోర్స్‌! కానీ మాటల ప్రభావం కూడా మనిషిని మంచి వైపు మళ్లించే అవకాశం వుంది. అలా నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్‌ చాలా వున్నాయి.” అంది తన స్నేహితురాలైన శృతిక పట్ల ద్రోణకి మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలన్న తాపత్రయంతో…
”నేను అవి వినదలుచుకోలేదు. టాపిక్‌ మార్చు చైత్రికా!” అన్నాడు ద్రోణ.
”సరే! నన్ను నీ పెళ్లిలో సరిగ్గా చూడలేదన్నావ్‌గా.. ఇప్పుడు చూడాలని వుందటున్నావ్‌! అలా నన్ను చూడాలీ అంటే నేను నీదగ్గరకి రావాలి. నేను రావాలి అంటే నువ్వు బొమ్మ వెయ్యాలి. నువ్వు బొమ్మ ఎప్పుడు వేస్తే అప్పుడు వస్తాను.” అంది. ఎలాగైనా అతని చేత మళ్లీ బొమ్మలు గీయించాలని వుందామెకు.
”ఇలాంటి లిటిగేషన్స్‌ పెట్టకు. నాకు నిన్ను చూడాలని వుంది. నా బొమ్మకు, దానికి సంబంధంలేదు.” అన్నాడు
”నేను నీకన్నా మొండిదాన్ని…” అంది.
‘నువ్వనుకున్నట్లు జరగాలీ అంటే నాకు ఇన్సిపిరేషన్‌ కావాలి చైత్రికా! అదంత ఈజీకాదిప్పుడు.. ” అన్నాడు.
”ఒకప్పటి నీ ప్రేయసిని ఊహల్లోకి తెచ్చుకో ద్రోణా!” అంది.
”ఇప్పుడది నావల్ల కాదు.” అన్నాడు సిన్సియర్‌గా.
…ఎలాగైనా పూర్వ వైభవాన్ని ద్రోణకి తేవాలన్న కృషి, పట్టుదల పెరిగి ”నేనో చిత్రాన్ని చెబుతాను. దాన్ని ఆధారం చేసుకొని ఆ టైప్‌లో ఓ చిత్రాన్ని గీయి.” అంది చైత్రిక.
”ఏమిటది?” అన్నాడు ఆసక్తిగా
”ఏపుగా ఎదిగిన కొమ్మలు. వాటికి అందమైన పూలు. ఆ పూలపై వాలటానికి సిద్ధంగా వున్న రంగు, రంగుల సీతాకోకచిలుక… ఇదీ మన కళ్లతో చూస్తే కన్పించే చిత్రం. కానీ మనసుతో చూస్తే… పువ్వు పెదవిలా విచ్చుకుంటుంది. ఆకు కన్నుగా మారుతుంది. ముక్కుస్థానంలో సీతాకోకచిలుక వుంటుంది. మొత్తంగా ముచ్చట గొలిపే ఓ అందమైన మోము మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది…
ఈ చిత్రాన్ని రీసెంట్ గా నేనో మేగజైన్‌లో చూశాను. చాలా బావుంది కదూ! ఆ క్రియేటివిటీ?” అంది.
”ఓ.. అదా! అది ఆక్టావియో అనే చిత్రకారుడు గీసిన బొమ్మ. ఆయన చిత్రించిన అద్భుతమైన చిత్రాల్లో అదో చిత్రం..” అన్నాడు.
”అలాంటి చిత్రాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకో ద్రోణా! నువ్వు స్పందించి గీయాలే గాని ఎన్ని అద్భుతాలు లేవు చెప్పు! ప్రస్తుతం నీకై నువ్వు నిర్మించుకున్న ఆ చీకటి ప్రపంచంలోంచి బయటకి రా!” అంది.
”ఈ ప్రపంచమే నాకు కరక్ట్‌ అన్పిస్తోంది.” అన్నాడు ద్రోణ.
అతను చాలా డిప్రెషన్‌లో వున్నట్లు, అందులోంచి బయటకి రావటానికి అతను సుముఖంగా లేనట్లు అర్థమైంది చైత్రికకి..
”ద్రోణా! ఒక్కసారి కళ్లుమూసుకొని దట్టమైన అరణ్యాన్ని వూహించుకో.. అందులో అప్పుడే మొలకెత్తిన చిన్నమొక్కను ఊహించు… దాని చుట్టూ స్నేహితుల్లా పెద్ద, పెద్ద చెట్లుంటాయి. వచ్చిపోయే అతిదుల్లా, కాకులు, చిలకలు కనబడ్తుంటాయి. దగ్గర్లో చిన్న సెలయేరు పారుతుంటుంది. పకక్షులు పాడుతుంటాయి. జంతువులు ఆడుతుంటాయి.
ఆ మొక్కతో చల్లగాలులు ఆత్మీయంగా సంభాషిస్తుంటాయి. ఇది కూడా ఆ మాటలు వింటూ తలవూపుతూ వుంటుంది. వీటన్నితో స్నేహం చేస్తూ ఆ చిన్న మొక్క క్రమంగా ఎదుగుతుంది. దానికి అవసరమైన సారాన్ని భూమి ఇస్తుంది. ఆ బలాన్ని తాకుతూ మొక్క చెట్టుగా మారుతుంది. దాని వేళ్లు నేలలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. చుట్టుపక్కల విస్తరిస్తాయి. అది ఎత్తులో మేఘాలను అందుకుంటుంది. ఆ చెట్టు ఎంత ఎదగగలిగితే అంత ఎదగటానికి అవసరమైన వాతావరణాన్ని ఆ అడవి దానికి కల్పిస్తూ వుంటుంది.
ఆకాశమే హద్దుగా ఎదగగలిగే ఆ మొక్కను ఒక కుండీలోనాటితే! దాని శాఖలను ఎదగకుండా కత్తిరిస్తూ పోతే?
ఆ మొక్క ప్రపంచం చిన్నదైపోతుంది ద్రోణా! దానికి అందాల్సిన సారానికి పరిమితి ఏర్పడుతుంది. దాని సహజమైన ఆకారం దానికి రాకుండా పోతుంది… నీ విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది” అంది చైత్రిక.
నిజమే అన్పించింది ద్రోణకి.
”ద్రోణా! నువ్వు బొమ్మవేసిన వెంటనే వచ్చి నీకు కన్పిస్తాను. నాకోసమైనా వేస్తావు కదూ! ఓ.కె బై.” అంటూ కాల్‌ క్‌ చేసింది.
ద్రోణలో ఏదో సంచలనం బయలుదేరింది.
ఎవరీ చైత్రిక?
నాన్నలా క్లాస్‌ పీకుతోంది. అమ్మలా అక్కున చేర్చుకుంటుంది. అన్నలా అప్యాయతను పంచుతోంది. తమ్ముడిలా తగవులాడుతోంది. మొత్తానికి ఓ మంచి స్నేహితునిలా ‘ఇదికాదు… ఇంకా ఏదో వుంది ప్రయత్నించు.’ అంటూ ఆత్మ స్థయిర్యాన్ని తనలోకి నింపుతోంది.
వెంటనే చైత్రికను చూడాలి. ”నువ్వు కల్గించిన స్పూర్తితోనే నేను మళ్లీ ఈ బొమ్మ వేశాను. వచ్చి చూడు.” అంటూ ఆమెను ఆహ్వానించాలి అనుకుంటూ కుంచెతో రంగుల్ని కలిపాడు.
అక్కడే ఠీవిగా నిలబడివున్న కేన్వాస్‌ అతను తనపై చల్లబోయే రంగుల్ని వూహించుకుంటూ అతని కుంచె స్పర్శకి పులకించింది.
*****

శృతికకి తనమీద తనకే జాలిగా వుంది.
ఇంట్లో ఏ పని చేయబోయినా ”నీకేం రాదు. నువ్వాగు. చెడగొడతావ్‌!” అంటుంది సుభద్ర. అలా అంది కదాని చెయ్యకుండా నిలబడితే ”ఏ పనీ చెయ్యకుంటే ఆ పనెప్పుడు కావాలి?” అని విసుక్కుంటుంది. అటువంటప్పుడు అమ్మలో ఆత్మీయత కాకుండా అధికారం, చిరాకు కన్పించి ఏడుపొస్తోంది.
కూతురు ఏడుపు ఏ మాత్రం పట్టించుకోనట్లు చాలా మామూలుగా వుంటుంది సుభద్ర.
ఇదిలా వుండగా చైత్రికతో ఫోన్‌ కాంటాక్ట్‌ లేకుండా అయింది. ఇదింకా బాధగా వుంది. అసలే చైత్రిక నిండుకుండ. అనవసరంగా భర్తను అప్పగించానేమో! ఎంతో విలువైన క్షణాలను, ఫీలింగ్స్‌ను తన భర్తతో తనకి తెలియకుండా పంచుకుంటుందేమో! ఇదికూడా తను ఇచ్చిన అవకాశమే కదా! అనుకొని లోలోన నిప్పుల ఉప్పెన పొంగినట్లై భరించలేక….
సుమ ఇంటికి వెళ్లి… ”సుమా! నీ సెల్‌ ఇయ్యవే! చైతూకి మిస్‌డ్‌ కాల్‌ ఇస్తాను”. అంది శృతిక.
”ఏం నీ సెల్‌ ఇంకా దొరకలేదా?” అంది సుమ.
”లేదే! సెల్‌ మిస్‌ అయితే ఎక్కడైనా దొరుకుతుందా? డాడీని అడిగాను ఇంకో సెల్‌ కొనిమ్మని… ‘కాస్త ఆగు బిజీగా వున్నాను. కొనిస్తాను.’ అన్నారు. ఆ సెల్‌ పోయినప్పటి నుండి నాకు చైత్రికతో కమ్యూనికేషన్‌ పోయింది.” అంది శృతిక… చైత్రిక ఎవరో సుమకి తెలియదు. సుమవాళ్లు శృతిక పెళ్లి అయ్యాక వచ్చారీ ఊరు.
”ఇదిగో సెల్‌ ! ఆ గదిలోకి వెళ్లి మాట్లాడుకో! మా నాన్న చూస్తారు. ఆయనకి ఇలాంటివి నచ్చవు.” అంది సుమ.
సెల్‌ అందుకొంది శృతిక.
కాల్‌ బటన్‌ నొక్కే లోపలే ప్రచండ గర్జనలా సుమతండ్రి గొంతు విన్పించి హడలిపోయి సెల్‌ పట్టుకున్న చేతిని గుండెలపై పెట్టుకొంది శృతిక.
‘భవ్యా!’ నిద్ర లేచినప్పటినుండి మీ వదిన ఒక్కటే అవస్థపడ్తోంది. వెళ్లి పనిలో హెల్ప్‌ చెయ్యొచ్చుగా… అదేం అంటే ఎగ్జామ్స్‌ వున్నాయంటావ్‌! మా పనులే గాక నీ పనులు కూడా మేమెక్కడ చేస్తాం…” అన్నాడు బైరవమూర్తి. ఆయన మాట్లాడే విధానం చాలా కటువుగా వుంది.
అవతల నుండి మాటలు విన్పించటంలేదు.
తొంగి చూసింది శృతిక…
పెద్ద బుక్‌ని ముందు పెట్టుకొని బుక్‌లోకే చూస్తూ కూర్చుని వుంది భవ్య.
…భవ్య బైరవమూర్తి ఆఖరి చెల్లెలు. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతోంది.
”డబ్బుకి లోటులేదు నీకు.. నీ మొగుడు ఆర్మీలో వుండి హాయిగా సంపాయిస్తున్నాడు. వెళ్లి ఏదైనా హాస్టల్లో చేరు. ఎంత అన్ననైతే మాత్రం ఎన్ని రోజులు వుంటావిక్కడ? ఇదే రోజూ చెప్పాలనుకుంటున్నా… తెలుసుకుంటావులే అని చూస్తున్నా…” అంటూ వెళ్లిపోయాడు బైరవమూర్తి.
శిలలా నిలబడివున్న శృతిక వైపు చూస్తూ…
”మా నాన్న ధోరణి అదో టైప్‌ శృతీ! మొన్నటి వరకు అత్తయ్యను మాతో సమానంగానే పెంచి, చదివించాడు. పెళ్లిచేసి ఆవిడ పాకిస్తాన్‌ నేను రాజస్తాన్‌ అంటున్నాడిప్పుడు… అప్పటికి అత్తయ్య పాపం రిక్వెస్ట్‌ చేస్తూనే వుంది. ‘ఈ ఒక్క నెలే అన్నయ్యా! హాస్టల్లో ఎలా వుంటుందో ఏమో! అలవాటు పడాలంటే టైం పడ్తుంది. పైగా నాది కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌’ అని. మా నాన్న వినటంలేదు. బహుశా ఇవాళో, రేపో హాస్టల్‌కి వెళ్తుంది అత్తయ్య” అంది సుమ.
శృతిక బిత్తరపోతూ ”ఇదిగోనే నీ సెల్‌! తర్వాత వచ్చి మాట్లాడతా! నాకెందుకో భయంగా వుంది.” అంటూ ఇంటికెళ్లి పడుకొంది శృతిక.
*****

శృతిక నిద్రలేచి బాల్కనీలోకి రాగానే భవ్య తన లగేజిని ఆటోలో పెట్టుకొని హాస్టల్‌ వైపు వెళ్లటం కన్పించి షాక్‌ తిన్నది.
ఆ షాక్‌ లోంచి శృతిక తేరుకోకముందే ”ఏం చూస్తున్నావే అక్కడ? నీకీ మధ్యన ఏం చేయాలో తోచటం లేనట్లుంది. ఎక్కడ నిలబడితే అక్కడే వుంటున్నావ్‌!” అంది సుభద్ర తలకొట్టుకుంటూ…
”అదేం లేదు మమ్మీ! భవ్య హాస్టల్‌కి వెళ్తుంటే చూస్తున్నా… వాళ్లన్నయ్య మరీ అంత కఠినంగా వుండక పోతేనేం? చెల్లెలేకదా! అనుకుంటున్నా…” అంది అమ్మవైపుకి తిరిగి శృతిక.
ఆమె కూతురివైపు చూడకుండా ”నువ్వనుకుంటే సరిపోతుందా? వాళ్ల ఇబ్బందులు ఎలా వున్నాయో ఏమో! ఆడపిల్లను ఒకసారి బయటకి పంపాక మళ్లీ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే వుంటుంది. పైగా పుట్టింటికొచ్చి తిష్టవేసే వాళ్ల దగ్గర తిండికని, అవసరాలకని డబ్బు తీసుకోలేరు. ప్రీగా పెట్టాలంటే పెట్టలేరు. అది అర్థం చేసుకొని ముందే భవ్య హాస్టల్లో వుండి వుంటే సరిపోయేది. ఇప్పుడు వెళ్తుంది కాబోలు… ఇందులో అంత ఫీలవ్వాల్సిందేమి లేదు. అన్నిచోట్ల ఇప్పుడు అలాగే జరుగుతోంది.” అంది సుభద్ర.
”కానీ … మమ్మీ! భవ్య కష్టపడి తను అనుకున్న స్థాయిని రీచ్‌ అయిందంటే త్వరలోనే కలెక్టర్‌ అవుతుంది. అప్పుడు సుమ తండ్రి ఏమవుతాడు?” అంది శృతిక.
”ఏమీ కాడు. కలెక్టర్‌ భవ్య నా చెల్లెలు అని నలుగురికి చెప్పుకుంటాడు.” అంది సుభద్ర.
”సుమ తండ్రిది ఇంత చిన్నబుద్దా మమ్మీ? ఆయనతో పోల్చుకుంటే డాడీ ఎంత మంచివాడు. ఇప్పటిక్కూడా అత్తయ్యల్ని గౌరవిస్తాడు.” అంది.
”అత్తయ్యల్నే కాదు. నిన్నుకూడా గౌరవిస్తాడు.” అంటూ లోపలకెళ్లింది. ఉలిక్కిపడింది శృతిక మనసు…
ఏమిటో ఈ మనుషులు! మనీమనుషులై పోతున్నారు. మనిషికీ, మనిషికి మధ్యన గౌరవభావం లేకపోతే లోపల ఎంత మమకారం వుండి ఏం లాభం… ఇన్నాళ్లు హద్దులు, సరిహద్దులు అనేవి దేశానికి వుంటాయికాని మనుషులకి, మనసులకి వుండవు అనుకునేది కానీ అవి వుండేదే మనుషుల మధ్యన అని ఇప్పుడు తెలిసింది.

*****

ఆముక్త చాలా రోజుల తర్వాత ద్రోణను చూసి ఆశ్చర్యపోయింది.
”ద్రోణా! నువ్వు మళ్లీ బొమ్మవేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. నిన్ను కదిలించి, నీచేత మళ్లీ కుంచె పట్టించిన ఆ మహత్తర శక్తి ఏంటో తెలియదు కాని నాకు ఆనందంగా వుంది. నా కవితకు ఎప్పుడు వేస్తావు?” అంది ఆముక్త అతనికి ఎదురుగా కూర్చుని ఉత్సాహంగా.
నవ్వాడు ద్రోణ.
”సరే! నీ ఇష్టం! నీకు ఎప్పుడు వెయ్యాలనిపిస్తే అప్పుడు వెయ్యి నాకేం అభ్యంతరం లేదు.” అంది. నన్ను మించినవాళ్లు లేరు అన్నంత హుందాగా కూర్చుని, స్టైల్‌గా చేతులు వూపి…
చేతులు వూపటం, ఆ స్టైల్‌ చూసి గట్టిగా నవ్వాడు ద్రోణ.
ద్రోణనే చూస్తూ… ‘ఎన్ని రోజులైంది ద్రోణ నవ్వి… ఎంత హాయిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో ఎంత తృప్తి. దేన్నో జయించినపుడు ఆ విజయం గుర్తొచ్చినప్పుడు నవ్వే నవ్వులో వుండే వెలుగు అది. అది మామూలు నవ్వు కాదు.
”ఈ మధ్యన యాడ్‌ ఏజన్సీ వాళ్లు ఓ అమ్మాయి బొమ్మను వెయ్యమన్నారని తెలిసింది. ఎప్పుడు వేస్తున్నావు ద్రోణా?” అంది ఆముక్త.
”దానికింకా టైముంది ఆముక్తా! ఆ అందం కోసమే అన్వేషిస్తున్నాను. అదెలా అంటే ఒక అందమైన అమ్మాయి నాకు మోడల్‌గా దొరికినప్పుడు దాన్ని ప్రారంభిస్తాను.” అన్నాడు.
”ఉత్తినే దొరుకుతారా అమ్మాయిలు?” అంది ఆముక్త.
”దొరకరు దొరికితే కొంత డబ్బు ఇస్తాను. నా దగ్గర ఆ అమ్మాయి కొన్ని గంటలు కూర్చోవలసి వుంటుంది.” అన్నాడు.
”కొండ ప్రాంతాల్లో దొరుకుతారేమో ట్రై చెయ్యలేక పోయావా?” అంది.
”ఇంకా టైముందని చెప్పానుగా ఆముక్తా! ఇప్పుడు వేరే బొమ్మ వేస్తున్నాను. ఇది పూర్తి అయ్యాక దానిపని చూస్తాను” అన్నాడు.
”ఒకసారి నావైపు చూడు ద్రోణా! నాలాంటి అందం అయితే సరిపోతుందా? నన్ను మోడల్‌గా వుండమంటారా?”అంది.
పెదవి విరిచాడు ద్రోణ.
మూతి ముడుచుకొంది ఆముక్త.
”నా కవితకి ఎలాగూ బొమ్మ వెయ్యట్లేదు. కనీసం నా రూపమైనా నీ బొమ్మల్లో రూపుదిద్దుకుంటుందని ఆశపడ్డాను. అది కూడా పోయింది.” అంది నిరాశగా.
”బాధపడకు ఆముక్తా! నువ్వు బాగా రాస్తావు. ఒక కవయిత్రిగా మంచిపేరు సంపాయించుకుంటావు. దేనికైనా టైం రావాలి.” అన్నాడు.
”నిజంగా ఆ టైం వస్తుందా ద్రోణా?” అంది ఆశగా ముందుకి వంగి…
”వస్తుంది. డౌట్ లేదు.” అన్నాడు
”శృతికెప్పుడొస్తుంది?” అంది సడన్‌గా.
అతని ముఖం వివర్ణమైంది.
ఇకపై ఏ మాత్రం మాటలు పెరిగినా కొడుకు ముఖంలో రంగులు మారతాయని, ప్రశాంతతను కోల్పోతాడని ”ఆముక్తా! ఇలారా!” అంది హాల్లో కూర్చుని టి.వి.లో స్టార్‌ మహిళ పోగ్రాం చూస్తున్న విమలమ్మ.
”ఆంటీ పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను వర్షిత్‌!” అంటూ లేచి హాల్లోకి వెళ్తుంటే ఆముక్త వేసుకున్న డ్రస్‌కాని, ఖరీదైన అలంకరణ కాని రాశిపోసిన డబ్బులకట్టని తలపింప చేసేలా వున్నాయి… మణిచందన్‌ గారి బిజినెస్‌ టాలెంటంతా ఆమెలో కన్పిస్తుంది.
”ఆంటీ! ఏంటి? పిలిచారు…”అంటూ చాలా ఉత్సాహంగా వెళ్లి ఆమె పక్కన కూర్చుంది.
” ఈ స్టార్‌ మహిళ పోగ్రాం చూస్తున్నప్పుడు నువ్విందులో పాల్గొంటే తప్పకుండా విన్‌ అవుతావని అన్పిస్తుంది ఆముక్తా!” అంది విమలమ్మ ఆముక్తను డైవర్ట్‌ చెయ్యాలని…
ఆముక్త కళ్లు లైట్ హవుసుల్లా తళుక్కుమన్నాయి. అంతలోనే…
”కానీ ఆంటీ! నాకెందుకో ద్రోణతో బొమ్మ వేయించుకునే స్థాయిలో కవిత రాస్తే చాలనిపిస్తుంది. దాని ముందు ఇలాంటివన్ని నార్మలే… కానీ నేనలా రాయలేనేమో” అంటూ అప్పటికప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆమెను అందులోంచి బయటకు తీసుకురావాలని…
”చూడమ్మా! మనిషికి ఆశ అవసరం… ఒక ఆశావాది విమానాన్ని కనిపెడితే నిరాశావాది పారాచూట్ ని కనిపెడతాడు. ఆశకి, నిరాశకి మధ్యన వున్నవాడు నేలమీదనే నిలబడి ఆ ఇద్దరిలో తప్పుల్ని వెతుకుతాడు. ముగ్గురు చేసేది పనే. దేన్ని సాధించాలన్నా ప్రయత్నలోపం వుండకూడదు కదా! నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అదీకాక మనుషులు నేలమీద వున్నంత సేపు స్థిరంగానే వుంటారు. వాళ్లను ఎవరూ పట్టించుకోరు. పైకి ఎదిగే కొద్ది ప్రత్యేకంగా కన్పిస్తారు. అది కూడా నువ్వు గమనించాలి. నువ్వేం కోరుకుంటున్నావో కూడా నీకు తెలియాలి. కోరికలో బలం వుంటే తప్పకుండా నెరవేరుతుంది.” అంది విమలమ్మ.
నిజమే కదా! అన్నట్లు ఆమెనే చూస్తూ, ఆమె మాటల్ని వింటూ కూర్చుంది ఆముక్త.
రాత్రి పన్నెండు దాటాక…
భార్య పక్కన పడుకొని వున్న శ్యాంవర్ధన్‌ నిద్రలేచి, సడన్‌గా బెడ్‌ దిగి, నేరుగా నిశిత దగ్గరకి నడిచాడు.
గంగాధరం పడక దేవికారాణి గదిలోకి మారినప్పటి నుండి శ్యాంవర్ధన్‌కి నిశిత దగ్గరకి వెళ్లానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది.
ఎప్పుడెళ్లినా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుందే కాని సహకరించటంలేదు.
తనేమైనా – ఇంద్రుడు కవచ కుండలాలు యిమ్మని కర్ణున్ని అడిగినట్లు… ద్రోణాచార్యులు బొటనవేలు ఇమ్మని ఏకలవ్యుడ్ని అడిగినట్లు… ఆమె శరీరంలో ఓ భాగాన్నేమైనా కోసిమన్నాడా? అలాంటిదేంలేదే! చిన్నకోరిక… అదీ ఒకే ఒకసారి.. ఆ తర్వాత అది కొనసాగకపోయినా పర్వాలేదు. దాన్నే ఓ జ్ఞాపకంగా మిగిల్చుకుందాం అని కూడా అన్నాడు. వినటం లేదు. ఇవాళ ఎలాగైనా భయపెట్టో, బ్రతిమాలో దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు.
… హాల్లో లైటార్పి వుంది. చుట్టూ చీకటి… బయట రోడ్డుమీద వెలుగుతున్న స్ట్రీట్ లైట్ వెలుగు కిటికీలోంచి లోపలకి ప్రసరిస్తూ నిశిత పడుకున్న దగ్గర పడ్తోంది.
నిశిత కదిలింది. ఆమెకు ఈ మధ్యన సరిగా నిద్రరావటంలేదు.
బావ ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో! తనను తను ఎలా రక్షించుకోవాలో తెలియక ఊపిరిబిగబట్టి నిద్రలో లేచి కూర్చుంటోంది. కారడవిలో ఏదో మృగం తరుముతున్నట్లు రోజూ అదే భయం, అదే కలవరింత. ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోతూంటే…కళ్లు తెరిచి చూస్తున్న ఆమెకు తనవైపే వస్తున్న బావ కన్పించి ఇది నిజమా!’ అని వణికిపోతూ చూసింది.
”నాకోసం ఎదురు చూస్తున్నావా నిశీ! వెరీగుడ్‌!” అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యాంవర్ధన్‌.
అతన్నలా చూడగానే భయంతో చేష్టలుడిగి ఆమె గొంతు తడారిపోయింది. కట్టెలా బిగుసుకుపోయింది. అతనదేం గమనించకుండా, ఆత్రంగా ఆమెనే చూస్తూ…
”ఏం చేయను? ఆఫీసులో వర్క్‌ చేస్తున్నంతసేపు నీ ధ్యాసే… ఇంటికొచ్చాక నీ పక్కనే వుండాలనిపిస్తుంది. మా అమ్మా, నాన్న, మీ అక్క చూస్తారని భయం. అయినా నిన్ను చూడందే మాట్లాడందే వుండలేకపోతున్నా… నడుస్తున్నా గుర్తొస్తావ్‌! కూర్చున్నా గుర్తొస్తావ్‌! నిద్రలో గుర్తొస్తావ్‌! అర్థం చేసుకో…”అన్నాడు. అతని గొంతులో మాటల్లో విన్పిస్తున్న బలీయమైన మార్పుకి ఆమె గుండె జల్లుమంది.
”బావా! నేను స్వతహాగా కుంటిదాన్ని… తల్లీ, తండ్రి లేనిదాన్ని… మీరు, అక్కా తప్ప నాకు ఎవరూ లేరు. అందుకే మీ దగ్గర అంత తిండి తిని తలదాచుకుంటున్నాను. నా నిస్సహాయత మీకు తెలుసు. నాకు రక్షణ ఇవ్వండి. ముఖ్యంగా ఓ స్త్రీ ఎలాటి నీడను కోరుకుంటుందో మీనుండి అలాంటిదే ఆశిస్తున్నాను.” అంది అర్థింపుగా చేతులు జోడించి….
తెల్లగా, పొడవుగా, నాజూగ్గా వున్న ఆమె చేతులవైపే చూస్తూ…
”నన్ను కూడా అర్థం చేసుకో నిశీ! ఒక మగవాడు ఏం కోరుకుంటాడో తెలుసుకోలేని చిన్నపిల్లవు కావు నువ్వు… మీ అక్క స్థానాన్ని నీకు ఇవ్వలేకపోయినా ఆ స్థానంలో నిన్ను ఊహించుకుంటున్నాను. నీకేం తక్కువ చెయ్యను. మీ అమ్మా! నాన్నా పోయినప్పటినుండి నేనే కదా నిన్ను చూస్తున్నది. ఆ మాత్రం నమ్మకం లేదా నీకు?” అన్నాడు
”వుంది మీ సహాయాన్ని మరచిపోను”అంది.
”దానివల్ల నాకేంటి లాభం…? చూడు నిశీ! అవసరాన్ని అవసరంతోనే పంచాలి. ఉపయోగాన్ని ఉపయోగంతోనే తీర్చాలి. ప్రస్తుతం నీకు తిండి, నీడ కావాలి. నీ దగ్గర డబ్బు లేదు. అది నేను ఇస్తున్నాను. మరి నాకేమి ఇస్తావు నువ్వు? ఏదో ఒకటి ఇచ్చి తీర్చుకోవాలి కదా! ఇలా మొండికేసి ఋణ భారాన్నెందుకు పెంచుకుంటున్నావు?” అన్నాడు.
మాట్లాడలేని నిశిత మనసు రోదిస్తుంటే తలవంచుకొంది.
”నిన్ను బలవంతం చేసి అనుభవించటానికి క్షణం పట్టదు. అలాంటి అనుభవం నాకొద్దు. నువ్వు కూడా నన్ను కోరుకోవాలి. అయినా నాకేం తక్కువ?” అన్నాడు
”మా అక్కకేం తక్కువని నా వెంటపడ్తున్నారు?” సూటిగా చూస్తూ అడిగింది.
”మీ అక్కలో ఆడతనం లేదు” అన్నాడు
”అబద్దం ….” అంటూ గట్టిగా అరిచింది నిశిత.
ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి పిట్టగోడ దగ్గర నిలబడి శ్యాంవర్ధన్ని గమనిస్తున్న గంగాధరం | సంవేద ఆ అరుపుకి ఉలిక్కి పడ్డారు.
”అబద్దమేం కాదు. ఇంట్లో చెబితే మావాళ్లు మళ్లీ పెళ్లి చేస్తారని… సంవేదను వెళ్లగొడతారని ఆలోచిస్తున్నాను.. నువ్వు ఒప్పుకుంటే నువ్వూ-సంవేద ఇక్కడే వుండొచ్చు. ఆలోచించుకో. తొందరేం లేదు.” అంటూ నిశిత గుండెలో ఓ విస్పోటనం పేల్చి, లేచి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు… అతని కళ్లకి నిశిత అందమైన ముఖం తప్ప ఇంకేం కన్పించటంలేదు.
అతనలా వెళ్లగానే గుండెలనిండా గాలి పీల్చుకొని ‘హమ్మయ్యా!’ అనుకుంటూ – వేలు కూడా బయకి కన్పించకుండా నిండుగా దుప్పి కప్పుకుంది నిశిత.
…వెనుదిరిగిన గంగాధరం సంవేదను చూసి ‘నువ్వా!’ అంటూ స్థాణువయ్యాడు.
”అవును మామయ్యా నేనే!” అంది లోస్వరంతో
”నువ్వెప్పుడొచ్చావ్‌?” అన్నాడు తడబడుతూ.. కొడుకు నిర్వాకం కోడలికి తెలిస్తే కాపురం వుండదని భయపడ్తున్నాడు గంగాధరం.
”మీ వెనకాలే వచ్చాను మామయ్యా!” అంది. ఆమె మానసిక స్థితి అప్పటికప్పుడే చాలా నీరసంగా మారింది.
ఆమెను అర్థం చేసుకున్నాడు గంగాధరం…
ఇలాంటి పరిస్థితిని ఏ ఆడపిల్లా ఓర్చుకోలేదు. వెంటనే వెళ్లి భర్త కాలర్‌ పట్టుకొని అటో, ఇటో తేల్చుకొని వుండేది. కానీ సంవేదలోని సహనం భూదేవిని మించి కన్పిస్తోంది. అంతేకాదు ఆమె అంతరంగంలో ఏర్పడ్డ అల్లకల్లోలాన్ని అణచుకుంటూ నిండు గోదావరిని తలపింపజేస్తోంది.
ఆమెనలాగే చూస్తూ ”సంవేదా! నీ మౌనం చూస్తుంటే నాకు భయంగా వుంది. గట్టిగా ఏడువు తల్లీ! కొంతయినా ఆ భారం తగ్గితే మామూలు మనిషివవుతావు.” అన్నాడు
చీకటి వెలుగులో ఆయన్నలా చూస్తుంటే ఎంతో ఆత్మీయంగా అన్పించి ముఖాన్ని దోసిలితో కప్పుకొని వుదృతంగా ఏడ్చింది.
కొద్దిసేపు గడిచాక… ఉప్పెన ఆగి ప్రకృతి చల్లబడ్డట్టు పవిట కొంగుతో కళ్లు తుడుచుకొంది.
”ఇలా కూర్చో సంవేదా!” అంటూ ఆ ఇద్దరు పిట్టగోడపై కూర్చున్నారు.
కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.
”మామయ్యా!” అంటూ మెల్లగా పిలిచింది సంవేద.
”ఏమిటో చెప్పు సంవేదా?” అన్నాడు
”ఒంట్లో ఓ భయంకరమైన వ్యాధిని పెట్టుకొని తెలిసికూడా పైకి చెప్పుకోలేని రోగిలా బాధపడ్తోంది నిశిత… ఒకవైపు నా జీవితం, ఇంకోవైపు ఆమె జీవితం రెండు అర్థరహితంగా కన్పిస్తూ ఆమెను భయపెడ్తున్నాయి. ఇప్పుడేం చేద్దాం మామయ్యా?” సలహా అడిగింది సంవేద.
”నిశితకి పెళ్లి చేద్దాం సంవేదా!” అన్నాడు గంగాధరం.
”నిశితను పెళ్లెవరు చేసుకుంటారు మామయ్యా!” అంది నీరసంగా
”మీ బంధువులకి చెప్పి చూడు. నేను కూడా నాకు తెలిసిన వాళ్లతో మాట్లాడతాను. మనకి మంచి సంబంధంగా అన్పిస్తే ఇచ్చి చేద్దాం… వీలైనంత త్వరగా చేద్దాం…” అన్నాడు.
”పెళ్లంటే మాటలు కాదు. పైగా అది హ్యాండిక్యాప్‌డ్‌ అని తెలిస్తే దాన్నెవరు చేసుకోరు. పెళ్లి కాకుండా ఇంకేదైనా దారివుంటే చూడండి మామయ్యా” అంది.
”సహజంగా ఆడవాళ్లకి పెళ్లే సెక్యూరిటీ! అందులో నిశితకి అదే ఎక్కువ సేఫ్టీ… ఆలోచించు” అన్నాడు.
”స్వతహాగా గొప్ప మానవత్వంతో కూడిన మనిషైతేనే దాన్ని చేసుకోటానికి ముందు కొస్తాడు. అలాటి వ్యక్తి దొరుకుతాడా మామయ్యా?” అంది సందేహంగా.
”రకరకాల వ్యక్తులతో కూడిన ప్రపంచం ఇది. వెతికితే తప్పకుండా దొరుకుతాడు.” అన్నాడు.
”వెతకానికి డబ్బు కావాలిగా మామయ్యా!” అంటూ అసలు విషయం బయటపెట్టింది సంవేద.
”మీ నాన్నగారు నిశిత కోసం ఏమి దాచివెళ్లలేదా? ” అన్నాడు.
”లేదు మామయ్యా! ఆయన సంపాదన ఆయన తాగుడికి పోగా మిగిలింది ఇంటి ఖర్చులకి సరిపోయేది. ఆ తర్వాత నాకు పెళ్లి చేశారు. ఇంకేం మిగల్చకుండానే వెళ్లిపోయాడు.” అంది బాధగా.
”బాధపడకు. నాకు తెలిసిన చాలా ప్యామిలీలు ఇలాగే వున్నాయి. కానీ ఇలాంటి టైంలోనే తట్టుకొని నిలబడాలి. నువ్వు నిలబడగలవు. నీ మానసికస్థాయి ఎంత బలమైందో ఇంతకుముందే చూశాను.” అన్నాడు. తన భర్తను అలాంటి స్థితిలో చూసి కూడా పెదవి కదపకుండా మౌనసముద్రంలా నిలబడిన కోడల్ని చూసి… ఇప్పటికీ ఆశ్చర్యంగా వుందాయనకి…
తన కొడుకులో మాత్రం పైకి కన్పించరుకాని – రావణుడు, నరకాసురుడు, జరాసందుడు కలిసికట్టుగా వున్నారు. ఏమాత్రం సందేహంలేదు.
ఆమె మౌనం చూసి ”నా దగ్గర కొంత డబ్బు వుంది. అప్పట్లో ఆ డాక్టర్‌గారు నా జీతంలోంచి కొంత డబ్బును బ్యాంక్‌లో వేశాడు. దాన్ని దీనికి వాడతాను. వెళ్లి పడుకో సంవేదా!” అన్నాడు ఆయన అక్కడ నుండి లేచి వెళ్తూ.
సంవేద వెళ్లి భర్త పక్కన పడుకొని నిద్రరాక కదులుతోంది.
”ఏంటా కదలటం? ఇరిటేషన్‌ వస్తోంది. కదలకుండా పడుకో.. అసలే హెడేక్‌గా వుంది.” అన్నాడు శ్యాంవర్ధన్‌.
కంగుతిన్నది సంవేద. ‘ఇతనింకా మేలుకొని వున్నాడా?’ అని మనసులో అనుకొని కర్రలా బిగుసుకుపోయి పడుకొంది.
నిశితను ఎలా కాపాడాలి? అన్న ప్రశ్న ఆమె బుర్రలోకి చేరి తేనేటీగలా కుడుతోంది.
పెళ్లిచేసి పంపటమనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. అందుకే కొద్దిరోజులు బంధువుల ఇంట్లో వుంచాలనుకొంది. ‘ఏ బంధువు ఇల్లయితే బావుంటుందా!’ అని ఆలోచించింది. ఆమె సర్వే ప్రకారం ప్రతి ఇంట్లో మగవాళ్లున్నారు.. భర్తో, తమ్ముడో, అన్నో, బావో, మరిదో ఇలా ఎవరో ఒకరు ప్రతి ఇంట్లో వున్నారు.
వాళ్లందరికన్నా శ్యాంవర్ధన్‌ బెటర్‌… ఏదో ‘నీ ఇష్ట ప్రకారమే నిన్ను తాకుతా’ అని చెప్పాడు. ఇది కొంతమేలైంది. పశువులా పైన పడకుండా అనుకొని నిద్రలోకి జారుకొంది సంవేద.
*****
శృతికవైపు బాణాలను సంధిస్తున్నట్లు చూస్తూ…
”ఈ పనిచేసే పద్ధతి ఇదేనా? ఇలాగే చేస్తారా ఎవరైనా? ఏ పని ఎలా చెయ్యాలో తెలియదా? ఇంకా చిన్నపిల్లవేనా నువ్వు?” అంది సుభద్ర.
బిత్తరపోయింది శృతిక…
తల్లిలో కొత్తతల్లిని చూస్తున్నట్లై ”నేను బాగానే చేశాను మమ్మీ! దాన్నోసారి చూడు!” అంది తల్లి సరిగ్గా చూడకుండానే తనను అంటుందన్న సత్యాన్ని జీర్ణించుకోలేక…
శృతికను ఇంకా తీక్షణంగా చూస్తూ… ”సరిగ్గా చూడకుండానే మాట్లాడుతున్నాననుకుంటున్నావా?” అంది.
”అది కాదు మమ్మీ! నువ్వెందుకిలా కోప్పడుతున్నావ్‌? కనీసం అదైనా చెప్పు?” అంది ఏ మాత్రం భయపడకుండా తల్లినే చూస్తూ…
”అన్నీ చెప్పాలి నీకు? ఒక్కపని కూడా సరిగ్గా చెయ్యవు. నీకన్నా హేండిక్యాప్‌డ్‌ పిల్లలు నయం.. ఏదో కుంటు కుంటూనైనా చక్కగాచేస్తారు.” అంటూ అక్కడనుండి లోపలకి వెళ్లింది సుభద్ర.
ముఖంమీద పేడనీళ్లు చల్లినట్లు ఏడుపొచ్చింది శృతికకు.
నరేంద్రనాధ్‌ ఆఫీసునుండి రాగానే కూతురు కన్పించకపోవటంతో…
”శృతీ!” అన్నాడు. ఎక్కడున్నా రమ్మన్నట్లు…
”వస్తున్నా డాడీ!” అంటూ ఆయన గొంతు వినగానే ఒక్క అడుగులో వచ్చినట్లు వచ్చింది శృతిక… తండ్రి తప్ప ప్రపంచంలో అందరు రాక్షసుల్లా కన్పిస్తున్నారు శృతికకు.
శృతిక కన్నా ముందే భర్త ముందు నిలబడి ”దాన్నెందుకు పిలుస్తారు? ఏం పని దాంతో? ఏదైనా వుంటే నాకు చెప్పండి! దానికి ఏ పనీ సరిగ్గా రాదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు?” అంది విసుగ్గా చూస్తూ…
”ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే దానికి నువ్వు తల్లిలాలేవు. అత్తలా అన్పిస్తున్నావు. నా చిట్టితల్లికి పనెందుకు చెబుతాను? సెల్‌ఫోన్‌ కొనిద్దామని పిలిచాను. ఇవాళ అందుకే ఆఫీసునుండి ముందుగా వచ్చాను.” అన్నాడు శృతిక వైపు మురిపెంగా చూస్తూ నరేంద్రనాధ్‌.
”దానికిప్పుడు సెల్‌ఫోన్‌ అవసరమా?” అంది ఉరిమి చూస్తూ సుభద్ర.
”ఏంటి అలా ఉరిమి చూస్తావు? నేనేదో గన్‌ కొనిస్తానన్నట్లు…”
”గన్‌ కొనిచ్చినా తప్పులేదు. సెల్‌ కొనిస్తే పిల్లలు ఏ టైంలో ఎలా మారతారో తెలియటంలేదు. ఇదే విషయం మీద తల్లిదండ్రులు టీ.వీల్లో పత్రికల్లో వాపోతున్నారు.” అంది.
”నీకీ మధ్యన ఇలాంటి భయాలు బాగా ఎక్కువయ్యాయి. నువ్వు భయపడి, మమ్మల్ని భయపెట్టకు…” అన్నాడు జోవియల్‌గా చూస్తూ…
”అంత జోగ్గా ఎలా మాట్లాడుతున్నారో…! ఎలా నవ్వుతున్నారో…! అసలు మీకు నిద్రెలా పడ్తుందో నాకర్థం కావటంలేదు.” అంది సుభద్ర.
”చూడు సుభద్రా! చదువుకునే అమ్మాయిలకి సెల్‌కొనిస్తే చదువు పాడయ్యే అవకాశాలున్నాయి. కాని మనమ్మాయికి పెళ్లయింది. నువ్వు నిశ్చింతగా వుండు.” అన్నాడు.
”నిశ్చింతగా వుండానికి అది మొగుడి దగ్గరలేదు. మొగుడ్ని వదిలేసి పుట్టింట్లో వుంది. అది మరచిపోయి తెగ మురిసిపోతున్నారు.” అంది.
అక్కడే నిలబడివున్న శృతిక తల్లి మాటలు వింటున్నా ఏం మాట్లాడలేక చూస్తోంది.
”దానిముందే ఎందుకలా మాట్లాడతావ్‌! అది బాధపడ్తుంది. మొగుడ్ని వదిలేశానని అదేమైనా మనతో చెప్పిందా? ఏదో నాలుగు రోజులువుండి వెళ్తుంది. అంతమాత్రాన ఎందుకంత కఠినంగా మ్లాడతావ్‌?” అన్నాడు మందలింపుగా
”మీలాంటి వాళ్లు నిజాలను అంతత్వరగా గ్రహించరులెండి! అందుకే మీకు పైన వుండే చొక్కా తప్పలోపల వుండే బొక్కల బనీను కన్పించదు. అంత లోతుగా చూసే ఓపిక మీకెక్కడిది..? ఏదో తిన్నాం పడుకున్నాం. పని చేసుకుంటున్నాం. బ్రతుకుతున్నాం. అంతే! ఎలా బ్రతుకుతున్నామో అవసరంలేదు” అంది
”సుభద్రా! నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్‌!” అన్నాడు నరేంద్రనాద్‌.
”నా మనసులో ఏంలేదు. ఇప్పుడు దానికి సెల్లెందుకు? అదెవరితో మాట్లాడాలని? భర్తకి దూరంగా వుంది. కొత్త పరిచయాలేమైనా అయితే కష్టంకదా! అసలే కొత్త, కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చి పిల్లల మనసులతో ఆడుకుంటున్నాయి. అర్థం చేసుకోండి!” అంది సుభద్ర.
ఆ మాటలకి రోషంగా, కోపంగా చూస్తూ ”మమ్మీ! ఎందుకలా మాట్లాడతావ్‌! ద్రోణకి దూరంగా వున్నంత మాత్రాన తప్పుచేస్తాననా? నాకా అవసరంలేదు.” అంది గ్టిగా శృతిక.
”నేనలా అనటంలేదు. అయ్యే అవకాశం వుంది కదా! ఆడపిల్ల తండ్రిగా ఆయన జాగ్రత్తలో ఆయన్ని వుండమని చెబతున్నాను.సమస్య చిన్నదా! పెద్దదా! అన్నది కాదిక్కడ ప్రశ్న… జీవితాలను భీబత్సం చేయానికి ఎంతదైతేనేం?” అంది సుభద్ర.
”డాడీ! నాకిప్పుడు సెల్‌ఫోన్‌ అవసరంలేదు. మమ్మీ ఇన్నిన్ని మాటలు అంటుంటే నాకు షేమ్‌గా వుంది.” అంటూ కోపంగా అక్కడనుండి వెళ్లింది.
నరేంద్రనాద్‌కి మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సుభద్ర వంటగదిలోకి వెళ్లింది.

నరేంద్రనాధ్‌ లేచి భార్య వెంట వెళ్లాడు.
”సుభద్రా! మాట్లాడేముందు ఆలోచించాలి. నీకెందుకంత కోపం? అది మన కూతురు. పరాయివాళ్లను కూడా అంత డైరెక్ట్‌గా మాట్లాడలేమేమో! ఎందుకలా మాట్లాడుతున్నావ్‌! అదెంత బాధపడ్తుందో అర్థం చేసుకున్నావా?” అన్నాడు కాస్త వంగి ఆమె భుజం మీదుగా ఆమె ముఖంలోకి చూస్తూ….
ఆమె కళ్లలో చెమ్మతప్ప నోట్లోంచి మాటరావటంలేదు.
”అదంటే నాకు ప్రాణం సుభా! అదలా బాధపడ్తే నేను చూడలేను. ఎవరైనా దాన్ని ఒక్కమాట అన్నా ఓర్చుకోలేను. నాముందే నువ్వు దాన్ని అలా అంటుంటే నాకు చాలా బాధేసింది.” అన్నాడు.
…కళ్లను గట్టిగా మూసుకొని ఏడుపును కంట్రోల్ చేసుకుంది సుభద్ర.
”కూతురంటే ఏ తండ్రికయినా ప్రాణంగానే వుంటుంది.. అదెందుకిలా మనింట్లో వుందో అడిగారా దాన్ని…? అదెప్పుడు వచ్చిందో డేట్ రాసి పెట్టుకున్నారా? నేను రాసిపెట్టాను. ఇప్పటికి చాలా రోజులైంది. ఇలా నేను కూడా మా పుట్టింటికి వెళ్తే మీరు ఒంటరిగా వుండగలరా? తోడు కావాలని ఎవరికైనా వుంటుంది. ద్రోణ గురించి కూడా ఆలోచించండి!” అంది సుభద్ర.
”ద్రోణ ఎక్కువగా బయటకెళ్తుంటాడు. బోర్‌గా వుంది డాడీ అంది. నేను ‘సరే’అన్నాను. మొన్న విమల కూడా ఇలాగే మాట్లాడింది. కానీ చూస్తూ, చూస్తూ నాకక్కడ బోర్‌గా వుంది డాడీ అని చెప్పాక కూడా కాస్త అర్థం చేసుకోవాలి. చూసి, చూడనట్లు వదిలెయ్యాలి. మాటలతో బాధపెట్టటం ఎందుకు? వున్నన్ని రోజులు వుంటుంది. ఇక్కడ బోర్‌ కొట్టాక అదే వెళ్తుంది. దాన్నిలా బాధపెట్టకు…” అన్నాడు నరేంద్రనాధ్‌.
”అది జీవితాన్ని బోర్‌గా ఫీలవుతున్నప్పుడు తండ్రిగా మీరు చెప్పాల్సిన మాటలు మీరు చెప్పండి! ఆ భావం దానిలో లేకుండా చూడండి! మగవాళ్లకి సంపాదన కావాలి కాబట్టి భర్తలు ఎక్కువగా బయటే వుంటారు. అంతేకాని భార్య ఓ స్టిక్‌ పట్టుకొని సిట్ స్టాండ్‌ అంటుంటే కూర్చుంటూ, లేస్తూ ఆడే బొమ్మలు కాదుగా భర్తలు…!” అంది సుభద్ర.
”ఏదో లేవే! చిన్నపిల్ల ఎందుకంత సీరియస్‌ అవుతావు?” అన్నాడు.
”…మీకో విషయం తెలుసా? మనబ్బాయికి పిల్లనిస్తామన్న వాళ్లు మన గురించి మన పక్కింట్లో ఎంక్వయిరీ చేశారట… వాళ్లమ్మాయి ఎప్పటికీ పుట్టింట్లోనే వుంటుందా? విడాకులేమైనా తీసుకుందా? మేం వాళ్లబ్బాయిని అనుకున్నప్పటినుండి పుట్టింట్లోనే వుంది కదా! అసలు విషయమేమి? అన్నారట. మీరేమో అది చిన్నపిల్ల… అదంటే నాకు ప్రాణం.. దానికక్కడ బోర్‌గా వుందట… అంటూ మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారు.” అంది అసలు విషయం ఇదీ అని స్పష్టం చేస్తూ…
ఈసారి నరేంద్రనాధ్‌ మాట్లాడలేదు
ఆలోచనగా తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు.
*****

రోజుల గడుస్తున్నాయి.
సుభద్రలోని తల్లి మనసు చచ్చిపోయి శృతికను గాయపరిచిన రోజునుండి శృతిక మనసు డోలాయమానమైంది.
ద్రోణకి కాల్‌చేసి, ద్రోణ దగ్గరకి వెళ్లాలనుకొంది. ఆ నిర్ణయం తీసుకోటానికి నవనాడుల్ని నలగ్గొట్టుకొంది.
వెంటనే సుమ దగ్గరకి వెళ్లి సెల్‌ తీసుకొని ద్రోణకి కాల్‌ చేసింది.
లాంగ్‌ రింగ్‌పోయి నో ఆన్సరింగ్‌ అని వచ్చింది.
మనసంతా చితికినట్లై ఇంటి కొచ్చింది.
తల్లిలో అదే నిరసన… అదే రౌద్రం….
…మళ్లీ సుమ ఇంటికి వెళ్లింది. ఈసారి చైత్రికతో మాట్లాడాలనుకొంది.
సుమ తండ్రి భైరవమూర్తి గొంతు స్పీకర్‌ పెట్టినట్లు మోగుతుంటే బయటే నిలబడింది శృతిక…లోపలకెళ్లాలంటే భయమనిపించింది.
సుమ ఏదో చెప్పబోతుంటే ”నోర్ముయ్‌! వారానికోసారి నీ సెల్‌ఫోన్లో నెంబర్స్‌ని, మెసేజ్‌లని చెక్‌ చేస్తానని తెలిసి కూడా నువ్వింత బరి తెగించావంటే నిన్నేమనుకోవాలి. చదివించేది. ఇందుకేనా నిన్ను? నీకిప్పుడు బాయ్‌ఫ్రెండ్‌ కావలసి వచ్చాడా? ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌లు కావాలనుకున్నప్పుడు కాలేజీల కెందుకెళ్లటం…? పబ్‌లలో, పార్క్‌లకో వెళ్తే సరిపోతుందిగా! రేపటినుండి కాలేజి మానేసి సిటిలో ఎక్కడెక్కడ నీకు తిరగాలనిపిస్తుందో అక్కడంతా తిరుగు. ఇంటికి రాకు… నాకింకా ఆడపిల్లలు వున్నారు.” అన్నాడు భైరవమూర్తి ఉగ్రనరసింహ రూపం దాల్చి.
”నాన్నా! నన్ను కాస్త మాట్లాడనిస్తావా? ఆ నెంబర్‌కి కాల్‌ చేసింది నేను కాదు అతనెవరో కూడా నాకు తెలియదు. శృతిక చేసింది” అంది సుమ.
”తప్పు చేయ్యటమే కాక అబద్దాలు కూడా నేర్చుకుంటున్నావా? వాళ్ల ఇంట్లో ఫోన్లులేక నీదగ్గరకి వచ్చిందా?” అన్నాడు.
”ప్రామిస్‌ నాన్నా…! నేను చెప్పేది అబద్దం కాదు. వాళ్ల ఇంట్లో తెలియకుండా మాట్లాడాలని మన ఇంటికి వచ్చి, మాట్లాడివెళ్లింది. కావాలంటే నేను తనని పిలిచి మాట్లాడిపిస్తాను.” అంది ఈ ప్రమాదం నుండి ఎలాగైనా బయటపడాలని…
సుమ మాటల్లో నిజాయితీ కన్పించింది భైరవమూర్తికి.
ఆయన వెంటనే మామూలు మనిషయ్యాడు
సుమకి దగ్గరగా వెళ్లి తల నిమురుతూ ”వద్దులేమ్మా! నువ్వలా రహస్యంగా ఫోన్లో మాట్లాడి చెడిపోతున్నావేమో నని భయపడ్డాను. నువ్వలాంటి పనులు చెయ్యవు నాకు తెలుసు” అన్నాడు గర్వంగా, సుమ తేలిగ్గా గాలి పీల్చుకొంది.
”కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో.. మనం ఈ మధ్యనే ఈ ఊరు వచ్చాం కాబ్టి శృతిక ఎలాంటిదో మనకి తెలియదు.. ఎవరో ద్రోణ అనే అబ్బాయితో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది. నీ సెల్‌లో వున్న నెంబర్‌కి కాల్‌చేస్తే ‘ద్రోణను మాట్లాడుతున్నా’ అన్నాడు. నేనతనితో మాట్లాడకుండా కట్ చేశాను. భర్తను వదిలేసి వచ్చి, ఇంట్లోవాళ్లకి తెలియకుండా నీ ఫోన్లో మాట్లాడుతోంది. ఇవన్నీ బలుపుతో కూడిన పనులు.. ఇలాంటివాళ్లు ఏమాత్రం విలువలులేని జీవితాన్ని గడుపుతూ – కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా బ్రతుకుతుంటారు. నువ్వింకెప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడకు. ఇంటికి రానీయకు..” అన్నాడు వార్నింగ్‌ ఇస్తూ…
”సరే నాన్నా! ఈసారి వస్తే రావొద్దని చెబుతాను.” అంది సుమ
భైరవమూర్తి మాటలకి – బయట నిలబడివున్న శృతిక మనసు విలవిల్లాడింది. తల తిరుగుతున్నట్లైంది. అక్కడే నిలబడితే కిందపడిపోతానేమోనని వెనుదిరిగి సుడిగాలిలా ఇంటికెళ్లింది.
ఓ గంట గడిచాక…
”మమ్మీ! నేను మా ఇంటికి వెళ్తున్నా…” అంది శృతిక
ఆకాశం వురిమినట్లు ఉలిక్కిపడింది సుభద్ర.
తను కర్కశంగా ప్రవర్తించి కూతురు ఇండిపెండెన్సీ మీద దెబ్బతీసినట్లు భయపడింది. అత్తగారింటికెళ్లి క్షణికావేశంలో ఏమైనా చేసుకుంటుందేమోనని ”డాడీని రానీ ! వెళ్దువుగాని! ” అంటూ అడ్డుపడింది. ఎంతయినా తల్లికదా అన్నట్లు ప్రాధేయపడింది.. తల్లి కంగారుచూసి తనని వెళ్లనివ్వదని ”ద్రోణ కాల్‌ చేశాడు. నేను వెళ్లాలి.” అంటూ అబద్దం చెప్పి, ఒక్కక్షణం కూడా ఆగకుండా ఇంట్లోంచి బయటకొచ్చింది శృతిక.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *