April 27, 2024

కంభంపాటి కథలు – ఎందుకేడుస్తున్నానంటే .. అనే అడల్ట్ కధ

రచన: రవీంద్ర కంభంపాటి

ఉదయాన్నే బయటికొచ్చి తలుపు గొళ్ళేనికి తగిలించిన బ్యాగులోంచి పాల ప్యాకెట్లు తీసుకుంటున్న ఆనంద్ కి ఎదురింట్లో ఉండే గోవర్ధన్ గారు పొట్ట కిందకి జారిపోతున్న లాగుని ఓ చేత్తో పైకి లాక్కుంటూ , ఇంకో చేత్తో ముక్కులో వేలెట్టుకుని కెలుక్కుంటూ కనపడ్డాడు .
‘ఛీ .. ఉదయాన్నే వెధవ శకునం ‘ అనుకుంటూ తలుపేసుకుని లోపలికెళ్ళి, ఇంకా నిద్దరోతున్న భార్య మీనాక్షి ని లేపితే , ‘అబ్బా .. మీరే కాఫీ పెట్టుకోండి ‘ అంటూ అటు తిరిగి పడుకుంది .
‘ఏడ్చినట్టుంది .. నిన్ను లేపింది కాఫీ పెట్టించుకోడానికి కాదు .. ఎదురింటి గోవర్ధన్ ఉదయాన్నే లాగేసుకుని , ముక్కులో వేలెట్టి కెలుక్కుంటూ కనపడ్డాడు .. ఆ శకునం మంచిదేనంటావా ?’ అన్నాడు
‘దేన్ని లాగేసుకుని ?’ అందావిడ మంచం మీంచే
‘దేన్ని లాగేసుకునేమిటి ?. ఒంటి మీద లాగు తప్ప వేరేమీ వేసుకోకుండా ఉదయాన్నే దర్శనమిచ్చేడు వెధవ.
‘దాన్ని లాగు అంటారేంటీ ? స్టైల్ గా షార్ట్ అనలేరా ?’ అందావిడ
‘ఆఁ ..వాడి పొట్ట మీద బొచ్చంతా కనిపించేలా వేసుకునేదానికి మళ్ళీ స్టయిలుగా షార్ట్ అనే పేరొకటి .. ఉదయాన్నే వాడి పొట్టంతా చూపించినందుకు షార్ట్ కాదు వెధవకి షార్ట్ సర్క్యూట్ కొట్టెయ్యాలి .. ‘
‘ఏమో .. నిన్న ఆ గోవర్ధన్ వాళ్ళావిడ “మీ ఆయన ఇంకా ఓల్డ్ ఫ్యాషన్లా ఉన్నారే .. ఇంకా లుంగీ కట్టుకుంటారు ” అంది
‘నేనేం కట్టుకుంటే ఆవిడకెందుకో …. అయితే ఆవిడ వీపంతా కనిపించేలా జాకెట్లేస్తుంది .. నేనేవైనా ఆ గోవర్ధన్ దగ్గిరికెళ్ళి , మీ ఆవిడ వీపు బావుందోయ్ అన్నానా ?.. అయినా .. నువ్వు చెప్పాల్సింది .. మా ఆయన కట్టుకునేది లుంగీ కాదు .. పంచె అని ‘
‘ఆవిడ వీపంతా కనిపించేలా జాకెట్టేసుకుందే అనుకోండి , మీరెందుకు చూసారు ?’ అంది , ఈసారి మంచం దిగిందావిడ
‘చూడ్డం ..అంటే .. నాకదే పననుకున్నావా ? వాళ్ళాయన లాగేసుకుని ఆయన బొచ్చంతా ఉన్న పొట్టెలా చూపించేడో , వాళ్ళావిడ జాకెట్టేసుకుని వీపంతా చూపించింది ‘
‘ఆవిడ చూపించిందే అనుకోండి , మీరెందుకు చూడ్డం ? ఇన్నేళ్లొచ్చినా .. ఆ ఆబ మటుకూ ఎక్కడికీ పోదేం ?’
‘నాకదే పనేమిటీ ?.. వెధవ అపార్టుమెంటు .. ఖర్మ కొద్దీ .. ఎదురెదురు గుమ్మాలు .. తలుపు తీసేమంటే మనకి వాళ్ళ మొహాలు తప్ప ఇంక వేరేం కనిపిస్తాయి ?’
‘చూసారా .. టాపిక్ ఎలా మారుస్తున్నారో ?.. నేనేదో అడిగితే మీరేమో మా నాన్న కొనిచ్చిన అపార్టుమెంటుని తిడుతున్నారు !’
‘నేనెక్కడ తిట్టేనే బాబూ ..?’
‘హమ్మో .. .. మాట ఎలా మారుస్తున్నారో ?.. మీరు ఇందాక మన అపార్టుమెంటుని పిచ్చి అపార్టుమెంటు అనలేదూ ?.. అత్తయ్యగారి మీద ఒట్టేసి అనలేదని చెప్పండి ?’
‘నాకు తెలుసు నీ సంగతి .. ఇలా ఒట్టెట్టడానికి తప్ప మా అమ్మ నీకెప్పుడూ గుర్తుకు రాదు ! ‘
‘మరదే .. మా నాన్న మటుకూ మీకు ఇలా అపార్టుమెంటు కొనిపించుకోడానికి మటుకూ గుర్తొస్తాడేం !’
‘నేనెవన్నా “మావయ్యా .. నాకో అపార్టుమెంటు కొనిపెట్టండీ ” అనడిగేనేంటి ? ఏదో ఆయన కూతురి కోసం ఆయన కొన్నాడు ‘
‘అదే మరి .. ఆయన కూతురూ అని వేరెవరో అన్నట్టు చెబుతారేం ?.. ఆయన కూతురంటే నేనేగా .. మీరు ఇంతవరకూ కొనేడవలేదనే కదా ఆయన కొన్నది ‘
‘ఆ మాత్రం లాజిక్కు నేనూ లాగగలను …అపార్టుమెంటు ఆయన కొంటేనేం ..నేను కొంటేనేం .. ఏడుస్తున్నది నేనేగా ‘
‘మీరెందుకూ ఏడవడం ? అసలు మీలాంటి వాడిని చేసుకున్నందుకు నేనేడవాలి ‘
‘అలాగే ఏడుద్దువుగాని .. ఏమిటి అర్జంటుగా ఏదో వెతికేస్తున్నావు ?’
‘ఖర్మ .. ఏడిస్తే కళ్ళు తుడుచుకోడానికి కర్చీఫు కావాలి కదా .. అదీ వెతుకుతున్నాను .. అలా నిలబడేడవక పోతే, మీరు కూడా నాతో పాటు వెతకొచ్చు కదా ‘
‘.. ఏడవాలనుకుంటున్నది నువ్వూ .. బాగానే ఉన్న మనిషినట్టుకుని ఏడుస్తున్నాడంటావేమిటే బాబూ ‘
‘అబ్బ!.. నిలబడేడుస్తున్నారని ఏదో మాటవరసకి అన్నాను.. ప్రతీదానికీ అంతంతేసి ఆలోచించెయ్యకూడదు !’
‘ఇందాక నేను కూడా ఉదయాన్నేఆ వెధవ మొహం చూసేనన్నకోపంలో అన్నాను.. వెధవ అపార్టుమెంటని .. నువ్వు ఏవేవో అనేసుకోలేదూ ?’
‘నిజంగానే మాటవరసకి అన్నారా ? వెధవ అపార్టుమెంటని ?’
‘నిజ్జంగా నిజమే బాబూ .. కావాలంటే మా అమ్మ మీద ఒట్టు కూడా పెడతాను ‘
‘హమ్మయ్య .. పోనీలెండి ..మా నాన్న కొన్న అపార్ట్మెంటుని మీరేదో అన్నారని నేనేడవక్కర్లేదన్నమాట’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *