April 26, 2024

గిలకమ్మ కతలు – మరేమో..! అమ్మా..నీకో ?

రచన: కన్నెగంటి అనసూయ
బోగుల్లోరి దొడ్లో   నందొర్ధనం పూల్లాగా తెల్లగా తెల్లారి పోయి సేలా సేపైపోయిందేవో..ఊరు..ఊరంతా ఒకటే మసాలా కంపు గుమగుమాలాడిపోతంది…
అయ్యాల ఆదోరం…
ఆ ఈధిలో  పెతాదారం  కోణ్ణి కోసి పోగులేసమ్మే శీలచ్వి  దగ్గర  కోడిమాసం కొని   పొయ్యెక్కిచ్చినోళ్ళు కొందరైతే  పాటి మీద సెర్లో సేపలడతన్నారని సాటింపేత్తే..పందుమ్ముల నోట్లో నవుల్తానే  గేలం మీద సేపకోసవని రెండు మూడు గంటలు పడిగాపులుగాసి మరీ తెచ్చుకున్నోళ్ళు మరికొందరు.
నీసుకూరేదైనా తగ్గ మసలా పడాపోతే ..మడుసులేగాదు..కుక్క గూడా మూతెట్తదని, మూతి ముటముటలాడిత్తాదని శాత్రం. అయినా  ముక్క నవుల్తా ఆ కారానికి ముక్కు సీదాపోతే ఏంబాగుంటదనుకుంటారో ఏటోగానీ  కసి కొద్దీ కలం లో రాయితో అల్లమెల్లుల్లి నూరీ నూరీ మరీ కూర్లో దట్టిచ్చేరేవో..పొయ్యెగదోత్తన్న కొద్దీ  కూర దాకల్లో కుతకుతలెక్కువై  ఊరు ఊరంతా ఒకటే మసాలా కంపు..
అంతకు  మునుపు సేలా సేపయ్యింది గిలక మేక మాసం కోసవని సాయిబ్బు దుకానానికెల్లి.
ఆపాటికి వత్తా ఉండేపని. మరెంతుకో ఇంకా వత్తాలేదు.
గిలక్కోసవని లోపలకీ, బయటికీ అటూ ఇటూ తిరగలి ముద రాయిలాగ గిర గిరా  తిరుగుతానే ఉంది సరోజ్ని.
ఉండుండి.. గుమ్మాన్నట్టుకుని  గిలక్కోసవే సూత్తందేవో…సరోజ్నీ, గిలకెంతకీ రాకపోయేతలికి ఒకటే గుబులు ఉడికెత్తించేత్తంది  లోపల్లోపల.
తీరా ఈ మడిసి పొలాన్నించొచ్చేడంటే..పిల్లనెంతుకంపేవని  అదో గొడవ.
ఈడొచ్చిన పిల్లని యేడకీ  అంపిచ్చకని  అడపా దడపా సెవులో ఏత్తానే ఉంటాడు.
అంతుకే..
గుమ్మంకాడికొత్తంది. గుమ్మాన్నట్టుకుని  కాసేపలాగ నిలబడద్దో లేదో అంతలోనే ఏదో వణుకు.  రెండు పక్కలకీ  వంగుని మరీ  గిలక జాడుందేవోనని సూసి మరీ  లోపలకో అడుగేత్తంది. కుదురుగా కాలోసోట నిలుత్తాలేదు.
మామూలుగా అయితే సరోజ్నీ ఇంట్లో కూడా ఆ యేలప్పటికి అందర్లాగ   పొయ్యి కూసేసేదే. కాపోతే..
“ సేన్నాళ్లైందే అమ్మా..ముడుసుని సీకి.  అబ్బా..!నోట్లో మేక ముడుసెట్టుకుని  జుర్రున లోనకి పీలిత్తే బలేగుంటాదిలే.  మేక మాసం తిందావే అమ్మా..” అని సెంగట్టుకుని పిల్లలడిగేతలికి కాదన్లేని సరోజ్ని  సర్లెమ్మని  డబ్బులిచ్చి  గిలకమ్మనంపింది .
ఎండొత్తే లైను పొడుగైపోద్దని  సరోజ్నికి భయం.  అంతుకే సీకటుండగానే దబ్కా దబ్కా ఒంటి మీద రెండిచ్చి లేపి మరీ తోలేసింది. ఎప్పుడనగా ఎల్లిందో?
ఎంతకీ రాదే..?
ఆ ఈధిలో ఉంటే   శీలచ్వి మా మాటకార్రకం. ఏలికేత్తే కాలికీ,కాలికేత్తే ఏలికి ఏసే రకం.అలాటి మడిసి  కోళ్లు కోసి మాసం పోగులేసి అమ్ముతుం మొదలెట్టింది. అంతకు   మునుపంతా సరోజ్నీ ఇంట్లో కోడిమాసం కంటే మేక మాసం అంటేనే  తెల్లో ముద్దెట్తనిచ్చీవోరు పిల్లలు.
కాపోతేనీ.. ఆ మేక ముడుసుతోనే  వచ్చేసేది  ఎక్కళ్ళేని  మా సెడ్ద సిక్కు. మా తెత్తే పావు కిలో మేకమాసం దెప్పిచ్చి పిల్లలిద్దరికీ పళ్లెంలో సెరో రెండేసి  ముక్కలేసి  తనేదో గుజ్జుతో అయిందనిపిచ్చి పొద్దున్నకీ, రాత్రేళకీ దాంతోనే సరిపెట్తేసేది.     కాపొతే ..పావు కిలో మాసానికీ  తూకవయ్యాకా కొసర్లాగ ఒక ముడుసేత్తం మాసం సాయబ్బుకి అలవాటు.
ఆ ముడుసుకోసం, జుర్రితే వచ్చే ముడుసులోని మూలక్కోసం  కొట్టేసుకునేవోరు పిల్లలిద్దరూను. నాక్కావాలంటే నాక్కావాలని ఒకటే గొడవ.
నోట్లోకంటా పెట్టుకుని లాగి మరీ పీలుత్తుం ,సీకటం గిలక్కిట్టం. పెద్దోడయ్యే కొద్దీ పిల్లోడు పోటీకొత్తం మొదలెట్టేడేవో..
ఎంతుకొచ్చిన గొడవని అందరూ సీలచ్వి  సికెన్ బాగుంటుందంటన్నారని  పోగెత్తుతుం మొదలెట్టింది సరోజ్ని.
పైగా  సీలచ్చివి కవురు గూడా ఎట్టింది..పోగు పదేను..ఎన్నిపోగులంపమంటాని.
సీలచ్చానికదే పని. ఆదోరం వచ్చేతలికి పాతిక, ముప్పై కోళ్లైనా పీకలు తెగ్గోత్తది. ఈకలు పీకేసి  తీరిగ్గా కూకుని  తాటాకు మంట్లో కాల్సేసి  ముక్కలు  కోసి పోగులెట్టి ఆల్లనీ, ఈల్లనీ అడుగుద్ది కావాలాని.
సచ్చిన కోళ్లనీ, రోగాలొచ్చిన కోళ్లనీ కాకుండగాను..కళ్ళెదురుగా తెచ్చి బతికున్న కోళ్ళని వారం పొడుగూతా తిప్పి మరీ కోత్తదని శీలచ్వంటే  ఆ ఈధోల్లకి అదోలాటి నమ్మకం.
బయటోళ్ల దగ్గర కొంటేనీ  ఆడు ఎలాటి కోడి మాసం తెత్నాడోనని అనుమానం. కోళ్ల పారాల కాడ సచ్చిన కోళ్ళకీ, రోగాలొచ్చి రేపో మాపో సత్తయ్ అన్న కోల్లకీ  తక్కువ తీసుకుంటారంట.  అలాటి సెబ్బరి సరుకుని  సవగ్గా తెచ్చి బజార్రేటికే అమ్ముతారని , అలాటియ్యి తింటే  ఎవుకల రోగాలొచ్చి మూలడతారనీ శీలచ్వే పెసారం సేసింది.
“ స్సీ..ఎదవ్ బతుకు. తింటే సరైందే తినాల. రోగాలొచ్చిన కోళ్లు తింటే కొన్నాళ్లైనా ఏదీ తిన్లేక  నోళ్లకీ సీళ్ళేసు కోవాల్సొత్తాదేవోనని  శీలచ్వి దగ్గరే  పోగులు కొనుక్కుని బ్రేవు  బ్రేవంటం మొదలెట్టేరు వాడవాడంతాని.
ఒకేళ ఎవరైనా అయ్యాల పోగులేసే కోడికూరొద్దనుకున్నా   ముక్కు సేసే మూలుగులు తట్తుకోలేపోయీవోరు. పైగా ఇరుగూ పొరుగోళ్ల పలకరింపులొకటి..” ఏటియ్యాల పోగెత్త లేదంట? “ అంటాను అదేదో తప్పు సేసినట్టు. అయ్యాలంతా నరకంనూన్లో ఏగినట్టే అయిపోయేది బతుకు.
అంతుకే ఆదోరం వత్తే సాలు   ఇట్తవైనోళ్ళు ఇట్టవైనన్ని పోగులు శీలచ్వి దగ్గర ఎత్తుతానే ఉంటారు.  ఎవరిట్తం ఆల్లది.  అలాగలాగ ఎండెక్కే కొద్దీ తీర్తంలో పెరిగిపోయిన తానాల్లాగా  ..తొట్తతొలి ఒక్కోడితో మొదలెట్టి  ముడుసులూ, మెడకాయ మిగిల్తే సాలనుకున్న సీలచ్వేపారం పాతిక్కోళ్లకి పాకేసి.. అయ్యాల్టి కూర కరుసులు  పోగా…ఒకట్రెండు సిట్టీలేత్తవేగాదు సీర్లేపారం మొదలెట్టింది.
కట్టపడితే కోళ్ళే కాదు కోకలూ అమ్మొచ్చు , కోటలూగట్టచ్చు. అమ్ముతుంది కదాని ఊరికే  వారానికోపాలి  కొనేసి తినేసి దొల్లుతున్నాం.  అదేవో  సుక్కల్లోకెక్కి కూకుంటంది..మారాణిలాగా . మన కల్లెదురుగ్గానే కోడీకలు పీకటం మొదలెట్తింది. ఎక్కడికెల్లిపోయిందో సూడు. ఆకాశంలో సుక్కై కూకుంది..అందకుండాని.అదీ దాని సోకు..
ఆడెవడో.. “సుక్కల్లోకెక్కినాడే..సక్కనోడు “ అని పాడ్నట్టు..సుక్కల్లోకెక్కినాదే శీలచ్వి…మిల మిల మిల మెరుత్తాంది శీలచ్వీ..
సిట్టీలు గట్టినాదే శీలచ్వీ..” అంటా ఈధిలోవోల్లంతా ఏడ్వని రోజు లేదంటే ఒట్తు.
దాంతో..ఇదిగాదు పనని..ముక్కునోసారి మూల కూచ్చోమని కసిరి తుమ్మజిగుర్రాసి మూసేసి , ఆకలినాయగట్టుకుని ఆక్కూరలన్నా తిందాంగానీ  శీలచ్వి కాడ సికెన్ మాత్రం కొనొద్దని..కంటి సైగల్తో సైరన్ మోగిచ్చేసేరు ఏక మొత్తంగా అందరూ ఏడుత్తా…
సరోజ్నీ  సెవినీ సేరిందీ కవురు.
” ఈల్లెప్పుడు ఓర్సుకున్నారుగన్క..ఎదటోళ్ళెదుగుతుంటే..ఎదవలు..ఎదవలని.రోగాలొత్తే తెలుత్తాది” అనుకుంది తప్ప సెవినెట్లేదు సరోజ్నీ.
అయితే ..మజ్జమజ్జలో..గిలకమ్మ  మేకమాసం అనడక్కుండా..మేకరిసినట్టు..”మే…మే..” అని మేక సకిలింపులు సకిలిత్తా అటూ ఇటూ తిరుగుతా ఉంటే…
సరోజ్నికి అర్ధవై  అయ్యాల్టికి   మేకమాసం తెప్పిచ్చి వండిపెట్టేది.
అయితే ఇదొరకట్లాగ  పావుకేజీ తెత్తే  సరిపోతల్లేదు. కరువొచ్చి కొంపలంటూ పోయినట్టు రెండేసి ముక్కలేసి రెండు పూట్లా అదే  సరిపెడతానంటే  పిల్లలు ఊరుకోక పావుకేజీనల్లా అరకేజీ సేసేసింది ఇంకెంతుకులే ఆల్ల కోసం కాదా ఏటి ఇదంతా అని.
“ఏదో  అడిగేరని , శీలచ్వి మాయలోబడి పిల్లల ఇట్తాన్నే పట్టిచ్చుకుంటాలేదేమో “ అనిపిచ్చి పోనీలే తెచ్చుకొమ్మన్నానుకో..మరీ..ఇంతసేపా?  ఎంత సేపున్నా రాదే! “
“ ఏ జతకత్తులన్నా తగిలేరేవో..?కవుర్లాడతా కూకునుంటాది..రానియ్ సెప్తాను  దీన్సంగతి. “ మనసులో ఇసుక్కుంది సరోజ్ని గిలకమ్మని.
అదేపనిగా అటే గిలకమ్మొత్తాదని సూత్తందేవో..దూరంగా  సైకిల్ మీద మెల్లగా వత్తా కనిపిచ్చేడు ఆ ఈధిలో సుబ్బారావు.
పక్కింటిల్లే. ముందు యేండిల్ కి ఏలాడ్తా..సంచీలో మాసం పొట్లాం. అదెప్పుడూ సుబ్బడు  మాసం కోసం అట్టుకెల్లే సంచే. సైను గుడ్దతో కుట్తిచ్చింది ఆల్లమ్మ మాసం పొట్లం  బయటికి అగుపిత్తే  దిట్టి తగుల్తాదేవోనని.
సైకిల్మీద సుబ్బణ్ణి సూత్తానే పేనం లేసొచ్చినట్తయ్యింది సరోజ్నీకి కాతంత కవురన్నా తెలుత్తాదని.
సుబ్బడు గుమ్మం దాకా వచ్చాకా    గబుక్కున గడప దాటెల్లి సీడీలు దిగి “ సుబ్బారావా..! “ అని పిల్సింది….
గబుక్కున సైకిలాపి ఒక్కాలు కిందెట్టి నిలబడి “ఏటత్తయ్యా ..” అన్నాడు..సుబ్బడు.
“ మాగిల్కాపడిందా ? ఇందాకనగా ఎల్లింది..మాసం కొట్టిచ్చుకొత్తానని. ఇంకా వత్తల్లేదు..నీకాపడిందేవోనని..”
“ ఆ కాపడిందత్తో…! సిన్నపిల్లని  నా కంటే ముందే కొట్టిచ్చేసేడు. రెండు పొట్లాలు  కట్టిచ్చింది.
ఇంకోటెవరైనా తెమ్మన్నారేవో? గట్టిగా దభాయించి మరీ రెండు పొట్లాల్లోనూ రెండు  ముడుసులేయిచ్చింది..కూడాను. మొత్తం మీద మీ గిలక అలాటిలాటి గిలక కాదత్తో. ఉండదగ్గదే.” అన్నాడు సుబ్బడు పళ్ళికిలిత్తా.
అదంతా ఏవీ ఇనపళ్ళేదు సరోజ్నీకి. రెండు పొట్లాలెంతుకు కట్టిచ్చిందన్నదే అర్ధమవుతా లేదు.
ఒకేల ఆ బళ్ళో మేష్టారంటే పడి సత్తాది. పోనీ ఆవిడికేవన్నా కట్టిచ్చిందా అంటే ఆవిడేవో బేపందాయే.. నీసంటే ఆవడ దూరం పరుగెత్తుకెల్లద్ది. మరింకెవరికి కొట్టిచ్చినట్టు..”
“ పోనీ….ఈల్లసలే  శీలచ్వి సంపాదిచ్చేసుకుంటందని కడుపు, కళ్ళూ మాడిసేసుకుంటన్నారు అంతకంతకీని.  అవతలోళ్ళు బాగుపడితే పట్టిచ్చుకోరు. మనోళ్ళు బాగుపడుతుంటేనే  నిద్రారాలు మానేసి మరీ ఏడుత్తారు..ఈధిలో వోళ్ళెవరన్నా తెమ్మన్నారా? “
సరోజ్ని ఆలోసన్లు ఎటెటో పోతన్నాయ్ అంతకంతకీని.
ఇంతలో ఛల్ ఛల్ మంటా ఎగురుకుంటా లేడి పిల్లలా గంతులేసుకుంటా వచ్చేత్తా దూరంగా  గిలక. పేనం ఊపిరోసుకున్నంత పనయ్యింది సరోజ్నికి.
దగ్గరకొచ్చే కొద్దీ…   ఎప్పుడూ సూడ్నంత  ఆనందం ఏటో మరి ఆ లేత మొకంలో.   ఊరికే మెరిసిపోతంది..
పిల్లిలా..లోనికొచ్చిందో లేదో..అప్పటిదాకా ఉగ్గబెట్టుకున్న కోపాన్నంతా మజ్జేల్లో కెక్కిచ్చి..మరీ   పుల్లటి రత్తవొచ్చేలాగ ఒక్కటిచ్చింది నెత్తి మీద.. “ఇంతసేపేటే? “ కోపంగా కళ్లెర్రజేసి గిలక్కేసే సూత్తా..
పాపం..తెల్లబోయింది గిలక. సురుక్కు మందేవో  నెత్తి మీద మొట్టినసోట పావుకుంటా తల్లికెసే సూత్తుండిపోయింది కాసేపు తన్జేసిన తప్పేటో తెల్వక గిలక.
అదలా సూత్తండగానే..  పిల్ల సేతిలో పొట్లాలు లాక్కున్నంత పన్జేసి..కుంటా..
“   రెండు పోట్లాలేటే..? ఎవరు  తెమ్మన్నార్నిన్ను..? ఎవరన్నా తెమ్మన్నారా? ” కసిర్నట్టరిసింది సరోజ్ని.
“ మనయ్యే? ఎవరూ తెమ్మల్నేదు…” గెంతుతా అంది గిలక ముడుసు గుత్తొచ్చి ..మామూలుగా అయిపోయి..
“ నేనరకేజీయ్యే కదా తెమ్మన్నాది. మరి రెండు పొట్లాలేటి? ”
“ అబ్బా..! “ అని లేత వేళ్లతో”నీతో వేగలేక సస్తన్నా బాబూ..” అన్నట్టుగా  పెద్ద ఆరిందాలాగా  తల మీద కొట్టుకుని..
“   అదంతా అరకేజియ్యేనే అమ్మా. కానీ   ఇద్దరికని సెప్పి  రెండు పావు కేజీలు కొట్టిచ్చేను..”
అంది  తొక్కుడు బిళ్ళాట ఆడుతున్నట్టు లంగా పైకెత్తి పట్టుకుని ఒక్కాలు పైకెత్తి ఇంకో కాలుతో ముందుకి దుముకుతా ..
“ తెలివి తెల్లార్నట్తే ఉంది. ఎంతుకలాగ? దానొల్ల  కలిసొచ్చేదేటి..? ఇంట్నిండా ఇస్తరాకుల సెత్త తప్ప..” పెఢసరంగా అంటా తీసిపడేసింది సరోజ్ని..కూతుర్ని.
“కాదే అమ్మా..! నువ్వొకద్దానివి. సెప్తే నీక్కాదా? అరకేజీ ఒకేసారి  కొనేత్తే..కొసర్లాగ  ఒక్క ముడుసే ఏసీవోడు గదా..! అదేవో కూరొండాకా సిన్నోడని తమ్ముడికి ఏసేసీదానివి.  మేవిద్దరం ఆ ముడుసుకోసం  కొట్తేసుకునేవోళ్లం గదా..అప్పుడెప్పుడో.  నాకూ ఇట్తవే ముడుసంటే. అంతుకే రెండు  పావు కేజీలు కొంటే రెండు ముడుసులేత్తాడు గదా. అప్పుడు తమ్ముడూ,  నేనూ ఇద్దరం తినొచ్చని..” అని ..అంతలోనే ఏదో అప్పుడే గుత్తొచ్చినట్టు..గెంతేదల్లా ఆగి ఎనక్కి తిరిగి ఆల్లమ్మెనక్కే జాలిగా  సూత్తా..
“మరే ..మరే ..మరేమో!అమ్మా..నీకూ ? నీకూ ఇట్తవే గదా..ముడుసంటే..!ఈసారి మూడు పొట్లాలు కట్టిత్తాన్లే. మూడు ముడుసులొత్తాయ్. అప్పుడు తమ్ముడూ, నువ్వూ,నేనూ ముగ్గురుం తినొచ్చు..’’
అని ..మరో గంతేసి ….అప్పుడే ఏదో గుత్తొచ్చినట్తాగిపోయి..తల్లొంక సూత్తా..
“అయ్యిలాగిచ్చెయ్. మళ్ళొచ్చే ఆదోరం దాకా ఎంతుకు? ఇప్పుడే మల్లీ..ఎల్లి..ఇయ్యిచ్చేసి మూడు పొట్లాలు ఇప్పుడే  కట్టిచ్చుకొత్తాను..” అంది గబుక్కున సరోజ్ని సేతిలోని పొట్లాల్ని లాక్కోబోతూ..
ఇంటానే..
ముంజు మీద గోరు గిచ్చితే ఇంతెంత్తునెగిరిన నీటి సుక్కలల్లే..సరోజ్ని కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరగ్గా..పొట్లాలక్కడడేసి..రెండు సేతుల్తో గిలకని దగ్గరకంటా లాక్కుని పొట్టకేసి అదువుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *