June 25, 2024

ఇది కథ కాదు

రచన: రాజశేఖర్

“నీ కథలో కంగారుందోయ్ రాంబాబు!” అన్నారు జోగిశాస్త్రిగారు చిరునవ్వుతో, పడకకుర్చీలో వెనుకకు జారపడుతూ. మీ టూత్పేస్ట్లో ఉప్పుందోయ్ అన్నట్టుగా కథలో కంగారేమిటో బోధపడలేదు రాంబాబుకి. తలగోక్కుంటూ “ఆయ్” అన్నాడు అయోమయంగా.

******
మొన్నామధ్యన ఆఫీసుపనిమీద కాకినాడ నుంచి విజయవాడ శేషాద్రిలో కిటికీకి పక్కసీటులో కూర్చుని వెళ్తోంటే ఆ కనిపించే పచ్చని పంటపొలాలు, చెరుకులారీలు, పూరిగుడిసెలు, కరెంటుస్తంభాల మీద కావుమనకుండా ఉన్న కాకులని చూసి భావుకత పెల్లుబుకి సమాజానికి తనవంతు సాయం చేయాలని అర్జెంటుగా నిర్ణయించుకొని.. ఎలా సాయపడదామా అని కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి పై జేబులోంచి విసురుగా ఫోనుతీసి ఫేస్ -బుక్ పోస్ట్ ద్వారా తన సందేశాన్ని బయటకక్కాడు రాంబాబు.
“స్వచ్ఛభారత్ అంటే బాహ్యశుభ్రమేకాదు…అంతర్మాలిన్యాన్ని తొలగించడం కూడా.. ఆధ్యాత్మిక చింతన దానికి దోహద పడుతుంది. “Let us strive to be swacch inside first” అని కొటేషన్లోపెట్టి అంత లోతైన ఆలోచన వచ్చినందుకు తనకు తానునూ, ఆ ఆలోచనని ప్రేరేపించిన ప్రకృతిని మెచ్చుకుంటూ బయట నుండి తాకుతున్న చల్లగాలికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రాంబాబు.
బెజవాడ చేరుకొని తాపీగా ఫేస్బుక్ చూసిన రాంబాబు ఆనందానికి అవధుల్లేవు. ఉపనిషత్ వాక్యంలాగా ఆ పోస్టుకి దాదాపు నూరుకి పైగా లైకులు, రెండు డజన్ల కామెంట్లు వచ్చాయి భక్తులనించి. “ఏం రాసావోయ్” అని ఒకరంటే “భారతీయతని పరిమళింపజేసే వాక్యం” అని ఇంకొకరు ఇలా రకరకాలుగా అతని సలహాని శ్లాఘించారు. ఒక భక్తుడు మరియు తన కింద పనిచేసే సహోద్యోగి అయితే.. “సమన్వయబ్రహ్మ రాంబాబు” అని కామెంట్ పెట్టాడు. ఆరోజు రాంబాబు శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో సుత్తివేలు లాగా కుర్చీలని తన్నుకొంటూ పిచ్చానందంతో గాలిలో తేలియాడాడు. ఆ బలమైన క్షణంలో లోకకళ్యాణార్ధం తన మస్తకంలోంచి తన్నుకొచ్చే ఆలోచనలని అనుభవాలని తన కలంద్వారా ప్రపంచానికి విరివిగా అందజేయాలని నిర్ణయించుకున్నాడు మన రాంబాబు.
ఓం ప్రథమంగా తన హాస్యరస మనోభావాలని పరికించి తన చిన్నతనంలో శ్రావణమాసం పోతుపేరంటాళ్ళ గురించి తరువాత బాల్యంలో తన తొలిప్రేమ సుధ ఆర్.ఎస్.ఎస్ (RSS) స్కూలులో తనకి రాఖీకట్టిన వైనం కథలా వ్రాసి కొన్ని పత్రికలకి పంపించాడు. వారం తిరగకుండా ఈ క్రింది జవాబు వచ్చింది.
“రాంబాబుగారు, మీ కథను పరిశీలించాము. మా పత్రిక ప్రచురణలోకి తీసుకోలేనందుకు క్షమాపణలు తెలియచేస్తున్నాము” ఇట్లు సంపాదక బృందం.
ఇలా అయిదారు కథలు వెనుతిరిగి రావటంతో పత్రికాసంపాదకులందరిని స్వాతికిరణం సినిమాలో మమ్ముట్టిలా ఊహించుకొని తన టాలెంట్ని తొక్కేస్తున్నారని భావించి…”రాంబాబు కథలని తిరస్కరిస్తున్నది ఆ దేవుడా…ఈ దేవుడా” అని మదనపడుతూ తన దూరపుబంధువు, రిటైర్డ్ టీచర్ అయిన జోగిశాస్త్రిగారి దగ్గరకు అలా ఆ విధంగా సలహాకోసం వచ్చాడు మంజునాథ్ అదే మన రాంబాబు.
******
“కంగారు తగ్గించు కథలో. పాత్రలని బాగా తీర్చిదిద్దు. సన్నివేశాలని మాటలతో చిత్రీకరించు. కథ కంచికి అని ఎందుకు అన్నారు అనుకున్నావు మన పెద్దలు…ఏ సామర్లకోటో, ద్రాక్షారామమో అనొచ్చుకదా?
అవును కదా అని ఆలోచనలోపడ్డాడు రాంబాబు.
“ఎందుకంటే…,మొహానవున్న కళ్ళజోడు తీసి భుజంమీద ఉన్న తన జరీకండువాతో శుభ్రం చేస్తూ విపులీకరించారు జోగిశాస్త్రి. కంచి అంటే బాగా దూరం…అలాగే కథని కూడా పొడిగించాలని సూక్ష్మం. ఇప్పుడు మన గజేంద్రమోక్షం తీసుకో.. ఒక మొసలి ఒక మదపుటేనుగు కాలు కొరికే కథ… పోతనామాత్యులు…మహానుభావుడు! దగ్గర దగ్గర నూటిరవయి పద్యాల్లో వర్ణించారు ఈ చిన్ని వృత్తాంతాన్ని. చాగంటివారి నుండి గరికపాటివారిదాకా ఇప్పటికీ ఈ కథని ప్రవచనరూపంలో చెప్తున్నారా లేదా! ఇక గీత గురించి చెప్పనక్కరలేదు. ఫలం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుపో అన్న ముక్కుసూటి మాటని పద్దెనిమిది అధ్యాయాల్లో పొందుపరచారు వ్యాసదేవులు. నీ కథలో కూడా గంధకం ఉందిరా రాంబాబు దానిని సిసింద్రీలాగా కాకుండా సీమటపాకాయతోరణంలా వెలిగించు” అని బోధచేశారు శాస్త్రిగారు.
జోగిశాస్త్రిగారి తలవెనుక లేచిన జుట్టు తాను కూర్చున్న కోణంనించి నెమలిపింఛంలా కనపడింది రాంబాబుకి. అయన చెప్పింది పూర్తిగా అర్థంకాకపోయినా ఖంగుమనే గొంతుతో శాస్త్రిగారి ఉదాహరణలు అమితమైన స్ఫూర్తినిచ్చి ఎలాగోలాగా ఒక మంచి కథ రాయాలన్న పట్టుదల రెట్టింపైంది రాంబాబులో.
ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తున్నాడు. అనగాఅనగా అన్న తరువాత రాజుగారి ప్రపంచ ప్రఖ్యాత గాజులాగా ఎంతకీ బయటకి ఊడిరాదే కథ. ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా కథావస్తువు మీదే దృష్టి. తన చిన్ననాటి తెలుగు గద్యభాగ కథలు నెమరువేసుకున్నాడు. ఎప్పుడో ఏడో తరగతిలో చదువుకున్న త్రిపురనేని మరియు విశ్వనాథవారి కథలు ఇప్పటికీ కంఠోపాఠమే. జ్ఞాపకమున్న ఒక కథ అయితే ఒక మామూలు రిక్షావాడి గురించి. కథ అంతా స్వాగతంలో నడుస్తుంది. అంత సరళమైన కథావస్తువుని మనుసుకిహత్తుకునేలా ఎలా రాశారా అని ఆశ్చర్యపడ్డాడు రాంబాబు. ప్రేరణకోసం తపించాడు.
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కథకి అనర్హం అని అన్వయించుకొని ఆలోచిస్తుండగా…”అనగాఅనగా ఒక అగ్గిపుల్ల ఉంది” అని తట్టింది. మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది కథకు రాంబాబుకి మధ్య. ఫేస్బుక్లో “సమన్వయబ్రహ్మ” అని కామెంట్ పెట్టిన సహోద్యోగి లెంపలు ఎడాపెడా వాయించి కడుపులో ఒక గుద్దుగుద్దాలనంత కోపం వచ్చింది.
రోజూలాగే సాయంత్రం అయ్యింది. ఆఫీసులో కూర్చొంటే ఇంక మతిపోతోందని పక్కనునున్న కిళ్ళీకొట్టుకొచ్చాడు. ఆకాశంలో సూరిబాబు కూడా ఇంటికెళ్లడానికి తయారవుతున్నాడు. అస్తమిస్తున్న సూర్యున్నిచూసి అది ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయా లేక ఆవపూవు మీద అద్దంపు పొడిఛాయనో సమయానికి గుర్తురాలేదు రాంబాబుకి. గూగుల్ చేద్దామనుకొని ఏదోఒక పూవులే అని సర్దుకున్నాడు. పొద్దునలేస్తే ప్రత్యక్ష భాస్కరుడు రోజూ ఎన్ని భాగోతాలు చూస్తాడో.. ఒకటి ఇలా పారేయచ్చుగా అని ప్రాధేయపూర్వకంగా ఆకాశంకేసి చూసాడు.
బడ్డీకొట్టు చెక్కబల్ల మీద కూర్చొని టీ తాగుతున్న రాంబాబు చుట్టుపక్కల వారి మీద దృష్టి సారించాడు. రోడ్డుకవతలి పార్కింగులో బళ్లన్నీ ఒకటొకటిగా హెల్మెట్లు పెట్టుకుని బయలుదేరుతున్నాయి. దూరంగా ఆజాన్ వినబడుతోంది. ఎదో మొక్కుతీర్చుకుంటున్నట్టు కొందరి జనాల తలలమీద దోమలు గిరగిరా తిరుగుతున్నాయి. తన తలమీద కూడా ఉన్నాయేమో చెయ్యి విదిల్చి చూసుకున్నాడు రాంబాబు. పక్కనే ఉన్న మెడికల్ షాపులో ఇద్దరు వ్యక్తులు పిఠాపురం హైవే పక్కనేవున్న స్థలాన్ని వెంచర్ వేద్దామని చర్చించుకుంటున్నారు. ఇంతలో ఒక తాత తన మనవడిని సైకిలు మీద తీసువచ్చి బడ్డీకొట్టులో పులిబొంగరాలు కొనిపెట్టాడు. బంగారపు ఉంగరాలకిమల్లే అన్ని వేళ్ళకుతొడిగి ఆడుతున్న మనవడిని చూసి మురిసిపోతున్నాడు ఆ తాత. పక్కనే కోచింగ్ సెంటర్లో కుర్రవాళ్లు సైకిళ్ళమీద స్కిడ్లుకొడుతూ పాట్లు పడుతున్నారు క్లాసులో ఆడవారి ఓరచూపు కోసం. ఒక బాలింతకుక్క మురికికాలువ పక్కన అలపోయి పడుకునుంది. పాలుత్రాగి బొద్దుగా ఉన్న దానిపిల్లలు దానిమీద పడి ఆడుకుంటున్నాయి. సిగ్నల్ దగ్గర ఒక బిచ్చగత్తె అడుక్కుంటున్నది ఒక చేతిలో పళ్లెం మరొక చేత పసిబిడ్డతో. గుడిసెలో బడ్డీకొట్టువాడు తన నోకియా మొబైల్ ఫోన్లో ఘంటసాల పాటలు విటున్నాడు. బడ్డీకొట్టువాని పెళ్ళాం పిల్లలు లోపలిగదిలో టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తున్నారు. తాటాకుగుడిసెపైనున్న గూటిలో పిచ్చుకపిల్ల కింద పడిపోయింది. బిత్తర చూపులతో వచ్చీరాని రెక్కలతో ఎగరడానికి ప్రయత్నిస్తోంది.
రాంబాబు బుర్రంతా ఆ మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ లాగా ఆలోచలనతో రద్దీఅయ్యింది. ఈ తాత కథ ఏమిటో! ఇతని కొడుకు బాగా చూసుకొంటున్నాడా? ఈ కోచింగ్ సెంటర్లో ఎన్ని ప్రేమ కథలో ఎవరికి తెలుసు? ఈ పిచ్చుక పిల్ల బతికిబట్టకడుతుందా? ఆ బిచ్చగత్తె చంకనున్న పిల్ల ఆమె సొంతబిడ్డేనా? రాంబాబు మనసు కదిలింది కానీ కలం మెదలలేదు. ఇంతలో జేబులోనున్న తన మొబైల్ రింగ్ గాయత్రీమంత్రం వల్లించింది ఇంటికెళ్ళమని గుర్తుచేస్తూ. బల్లమీదనించి భారంగాలేచి కొట్టునించి ఒక గ్లాసుడు పాలుకొని ఆ తల్లికుక్కకి పోసి గాంధీనగరం పార్కు వైపు నడవసాగాడు రాంబాబు ఇంకా ప్రేరణకోసం అన్వేషిస్తూ.
తదుపరి నేనింక రాంబాబు వెనుక వెళ్ళలేదు. నాకు ప్రేరణనందించిన రాంబాబుకి మనస్సులో కృతఙ్ఞతలు తెలియచేస్తూ తన కథకి కూడా ఒక ప్రేరణ తొందరలోనే దొరకాలని ఆకాంక్షిస్తూ బైకు మీద భానుగుడి వైపు బయలుదేరాను సఖి సినిమాలో మాధవన్ లాగా.

6 thoughts on “ఇది కథ కాదు

  1. బావుంది కథ. ఆఖర్లో కొంచెం అర్థం కావడం కష్టమైంది. అభినందనలు.

  2. ముందుగా… తెలుగు భాషలొ రాసినందుకు జోహారులు
    కధ బాగుంది …
    బాగా నచ్చినది : పాత సినిమా పాత్రలతో పోలిక, సందర్‌బ విశ్లేషణ కళ్ళకు కట్టినట్టుంది.
    మెరుగు పరచ గలది: కధ యొక్క కాల పరణిధి (time period). Facebook లాంటివి వాడినా పాత కాలమే ఊహించుకునేలాగ అనిపించింది.

  3. బావుంది, అయితే ప్రారంభంలో కాకినాడ నుండి విజయవాడ శేషాద్రి లో ప్రయాణం అని రాశారు జెనరల్ హా విజయవాడ పోయే వారు శేషాద్రికి వెళ్ళరు, కారణం మైన్ లైన్లో పోదు, వయా భీమవరం, గుడివాడ మీదుగా చుట్టూ తిరిగి వెళుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *