July 7, 2022

ప్రయాణం

రచన – డా. లక్ష్మి రాఘవ

ప్రైవేటు బస్సులో నైనా టికెట్ దొరుకుతుందా అని ఉరుకులూ పరుగులుగా వచ్చిన సీతాపతికి బస్సులో టికెట్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కానీ సీటు లాస్ట్ లో వుండటం చిరాకనిపించింది. వెనకవైపు కూర్చుంటే బాగా ఎగరవేస్తూ వుంటుంది. రాత్రికి నిద్రపోవటం కూడా వుండదు. పోనీ అదైనా దొరికింది కదా అనుకుని సీటులో కూర్చున్నాడు.
మనసంతా చికాగ్గావుంది. భార్య సీతతో తను తండ్రికోసం వూరికి వెళ్ళాలన్న ప్రతిసారీ గొడవే…”మీరొక్కరే కొడుకు కాదు. మీ తమ్ముళ్ళకు లేని ఆత్రుత మీకే వుంటుంది. ఏమి వాళ్లకు మాత్రం బాధ్యత లేదా? ఒంట్లో బాగా లేకపోతే వాళ్ళను పిలిపించుకోవచ్చు కదా. ప్రతిసారీ మీరే పోవాలా??” అనే సీత ఆర్గ్యుమెంటు లో నిజం వుంది.
ముగ్గురు కొడుకులు వున్న నాన్న ఒంట్లో బాగా లేదంటే పెద్దకొడుకైన నాకే ఫోను చేస్తాడు. పోయినసారి తనకి పోవడానికి కాలేదు. తమ్ముళ్ళు ఇద్దరూ ఏదో సాకు చెప్పి రాలేదు. అందుకే ఈసారి తానే పోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక్క రోజే మళ్ళీ ఎల్లుండి బయలుదేరి వాపసు రావటమే..
క్రమంగా బస్సు నిండింది. కండక్టర్ అందరి టికెట్లూ చెక్ చేశాడు. ఇంతలో డ్రైవర్ రావటం బస్సు కదలటం జరిగింది. నైట్ సర్వీసు బస్సులో వూరు దాటగానే అందరూ నిద్రలోకి జారుకోవడం మామూలు. కాబట్టి తను కూడా కునుకు తీయవచ్చు అనుకుని సీటు కొద్దిగా వెనక్కి వంపుకున్నాడు.
ఇంతలో ముందు సీటులో ఒకాయన ఫోను మోగింది. “హలో ..ఆ.. బయలు దేరా… కస్టమర్లకు సమాధానం చెప్పాలి నువ్వే. మన కంపెనీ ఎక్కడా దివాలా తీసి మోసం చెయ్యదు అని చెప్పు. నేను రేపు రాగానే ఏమి చెయ్యాలో డిస్కస్ చేద్దాం…” కొనసాగుతూంది సంభాషణ.
పక్క సీటులో ఇంకో ఫోను మ్రోగింది “సంక్రాంతికి వస్తాను డార్లింగ్…నాకూ అలాగే వుంది. తప్పదు కదా. సెలవు దొరగ్గానే రెక్కలు కట్టుకుని నీ దగ్గర వాలనూ …” గుస గుసగా వినబడుతూంది వద్దనుకున్నా చెవిలో.
తప్పించుకో లేని ఫోను సంభాషణలు!!
“ఇంక కుదరదు రా తమ్ముడూ. ఆస్తి భాగాలు పెట్టుకుందాం. ఇంట్లో ఆడవాళ్ళతో కష్టంగా వుంది. భాగాలు అయిపోతే అమ్మేసి ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చని మీ వదిన ఒకటే పోరు…నేను వెళ్లి కొలతలు వేయి౦చి వస్తా..”
“అమ్మా, ఈసారి పాపను నీ దగ్గరే ఉంచుతా…స్కూల్ అడ్మిషన్ ఖాయం అవగానే తీసుకెడతా…ఆ.. పాప నిద్రపోతూంది….” ఒక ఆడ గొంతు.
వద్దనుకున్నా చెవిలో అందరి ఫోనులో మాటలూ వినిపిస్తూనే వున్నాయి సీతాపతికి…విసుగ్గా వుంది. నిద్ర రాదు.
“సార్. మీ ఫోను చార్జింగ్ అయ్యిందా … నేను పెట్టుకోవాలి…” చార్జింగ్ ప్లగ్గుల దగ్గర గొడవ.
ఇంతలో కండక్టర్ కు ఫోను “రేపు డ్యూటీ దిగగానే ఇంటికి వచ్చి ఇచ్చేస్తా…తప్పకుండా సార్. జీతం వచ్చింది”
ముందరి సీటాయన “ఆ ఈ నెలలోనే గృహప్రవేశం…భలేవారు సార్…మిమ్మల్ని పిలవకు౦డానా…కేటరింగు ఇద్దామనే అనుకుంటున్నా…” ఆయన గొంతు ఒక మైలుదూరం వినబడుతుంది.
“ఫోన్ చెయ్యద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి? కోర్టులో తేల్చుకుందాం….” ఇంకో ఆయన గొంతు తారాస్థాయిలో వుంది.
ఒక ముసలాయన లేచి కండక్టర్ తో “ఒక సారి ఆపండి..డయాబెటిస్ సార్..ఆపుకోలేను..ఒక నిముషం లో వచ్చేస్తా..”బతిమలాడాడు.
కండక్టర్ ముందుకు వెళ్లి డ్రైవర్ తో “అన్నా…ముసలాయన కిందికి దిగాలంట..కొంచెం ఆపు.”
“ఆయన ఒక్కడి నే దింపు. లేకపోతే అందరూ దిగి పోయి అరగంట లేటు అవుతుంది…” హెచ్చరిస్తూ పక్కకు ఆపి ముసలాయనను దింపాడు.
బస్సు మళ్ళీబయలు దేరింది..
“ఏమయ్యా, సినిమా వేసేది లేదా..ఇంత డబ్బులు తీసుకుంటున్నారు…” కోపంగా అడిగాడు ఒకాయన.
“దాని స్క్రీను పని చెయ్యటం లేదు సార్…రిపేర్ చేయించాలి…”
“అది లేదుకదా మరి టికెట్టు డబ్బు తగ్గించుకోవు గదా…”
“మాదేముంది సార్..మేనేజ్మేంట్ వాళ్ళది “
మళ్ళీ ఫోన్లు మొదలు…రక రకాల సంభాషణలు… వ్యాపారాలు, ఆస్తులు, కుటుంబ సమస్యలూ. వద్దనుకున్నా చెవిలో పడుతూనే వున్నాయి సీతాపతికి. ఈ రోజు సీత అలిగింది కాబట్టి తనఫోను మోగలేదు. అయినా టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్స్ వచ్చాక ప్రైవసీ నే లేకుండా పోయింది. గతంలో ఉత్తరాలు, లాండు ఫోన్లు వున్నప్పుడు పనులు జరగలేదా? కాకపోతే సమాచారం కాస్త ఆలస్యం అయ్యేది అంతే…ఇప్పుడు అంతా పరుగుల జీవితమే!
సెల్ ఫోన్లు స్టేటస్ సింబల్ అయిపోయాయి. పైగా సేల్ఫీ ల పిచ్చిలో ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయి? టెక్నాలజీ పెరగటం మంచిదే అయినా శృతి మించుతోందేమో…అని ఆలోచిస్తూ బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు సీతాపతి.
ధడ్ అని పెద్ద కుదుపు పక్కకు వాలి పోతున్న బస్సు..
అయ్యో…అయ్యో అంటూ హాహాకారాలు..ఒకరిమీద ఒకరు …తొక్కిసలాట…ఏమైందో తెలియని పరిస్థితి…సీటు మధ్యలో ఇరుక్కుపోయిన ముసలాయన…గట్టిగా ఏడుస్తున్న పాప….ఆక్సిడెంట్…ఎంతమందికి దెబ్బలు తగిలాయో…కష్టపడి దిగిన సీతాపతి కి “డ్రైవర్ ఫోనులో మాట్లాడుతూ ఉన్నాడండీ…డ్రైవింగ్ చేసే వెధవ ఫోను లో మాట్లాడుతూ ఒంటి చేతితో డ్రైవింగ్ చెయ్యడం నేను చూసాను. ముందు చెవి దగ్గర ఫోనుతో వాడే చచ్చి ఉంటాడు. చూడండి ??? కసిగా మాట్లాడుతూ సేఫ్ గా బస్సులో నుండీ బయట పడిన ఒకాయన. ఇప్పుడు ఎన్ని అనుకుంటే ఏమి???
బస్సు నడిపే వాళ్ళకూ, ప్రయాణీకులకూ కొన్ని క్రమశిక్షణా అంశాలు ప్రభుత్వం సూచించి అమలు పరచాలేమో! అవి పాటించేలా చర్యలు తీసుకోవాలేమో…లేకపోతే బస్సు ప్రయాణం చివరి ప్రయాణం అవుతుందేమో ఆలోచించంచాలి ప్రతి ఒక్కరూ…

2 thoughts on “ప్రయాణం

  1. ప్రతీ 200 km కూ డ్రైవర్ని తప్పని సరిగా check చెయ్యాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *