May 1, 2024

నాకూ!! కూతురుంది….

రచన: సుధ ఆత్రేయ

అప్పుడే కోచింగ్ సెంటర్ నుండి వచ్చిన నాకు, నీకు ఈ రోజు సాయంత్రం పెళ్లి చూపులు అని హఠాత్తుగా చెప్పింది అమ్మ.
“ఇంత హఠాత్తుగానా అమ్మ!!” అంటే
“అవును నా బంగారం!! శాపమో వరమో నాకు తెలీదు కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటిని వదిలి వెళ్లవలసిందే. బహుశా తానెక్కడ ఉన్న దానిని నందనవనంగా మార్చుకోవడం ఒక స్త్రీకి మాత్రమే తెలుసు కాబోలు అందుకేనేమో. అబ్బాయి పేరు మదన్. శ్రీహరికోటలో సైంటిస్ట్ గా పని చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు ఒక కూతురు. అమ్మాయి కి పెళ్ళై పోయింది. అబ్బాయ్ తల్లి తండ్రులు ప్రస్తుతం హైద్రాబాదు. రిటైర్డ్ అయ్యాక కొడుకుతో వుంటారు. అబ్బాయ్ కూడా చాల బాగున్నాడు. అన్ని విధాలా తగిన సంబంధం. పోయిన నెల మన కాంతం పిన్ని వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో నిన్ను చూశారంట వారికి నచ్చావుట. నా కూతురు అందాల భరిణ ఎవరికీ నచ్చదు చెప్పు. స్వయంగా బాబాయ్ నాన్న బ్యాంకుకు వచ్చి చెప్పాడట. అబ్బాయ్ అనుకొకుండా వచ్చాడంట మళ్ళీరేపు ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళిపోతాడు. అందుకే హడావడిగా ఈ పెళ్లిచూపులు. జాతకాలు కూడా బాగా కలిసాయని వారు నిన్ను బాగా ఇష్ట పడుతున్నారు. పొద్దుటే కాల్ చేసాడు బాబాయ్ నాన్న యధాలాపంగా మొదటిది, వారే వచ్చారు, ఎందుకు వద్దు అనడం అని సరే అన్నారు. అది ఇంత వరకు వస్తుందనుకోలేదు. నాకు నచ్చాడు. నీకు నచ్చుతుంది అనిపించింది. అందుకే. ఇంకో మంచి విషయం వారికి వుద్యోగం చేసే అమ్మాయి వద్దుట””. అని చివరి వాక్యం వత్తి పలికింది.
పో అమ్మా!! అని సిగ్గు ను కోపంతో కలిపి అమ్మ చెతిలొనుంచి ఫోటో లాక్కొని నా గదిలోకెళ్ళిపోయా.
పడుచు ప్రాయపు సిగ్గుతో, నాకే తెలియని గిలిగింతల నడుమ నన్ను ఏలుకొనే వాడెవ్వరా!! అని ఫోటో వంక చూసా. అదిగో అతడే ఆ రోజు పెళ్లి లో చూపుల బాణాలు వదిలిన అందగాడు. ఆనాడే నాకు నచ్చాడు. . కలల రాకుమారుడికి ఏమాత్రం తీసిపోడు. కాబోయే శ్రీవారికి ప్రేమలేఖ రాద్దాం అనుకొనేలోపే పెళ్లి భాజాలు మోగాయి. కళ్ళు మూసి తెరిచేలోగా నేను శ్రీమతిగా మారిపోయాయి. ఒకే కూతుర్నని అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి. ఇంకా! అన్నయ్య ఆటపట్టించినట్టేవుంది. అమ్మో కాలం ఎంత వేగంగా ఆనందంగా పరిగెత్తింది. అప్పుడే!! నా జీవితంలోకి నావాడు వచ్చేసాడు.
మొదటినుంచి నాకు స్కూలు అంటే అంతగా పడదు. కానీ సంగీతం చిత్రలేఖనం అంటే చాల ఇష్టం. పాటలపోటీలో మా స్కూల్ లెవెల్ నుంచి కాలేజీ వరకు నేనే ఫస్ట్. టీవీ ప్రోగ్రామ్స్ కూడా వెళ్లమని అందరు ప్రోత్సహించారు కానీ నాకు అంతగా ఇష్టం లేదు. చిత్రలేఖనం పర్వాలేదు. అమ్మ నాన్న అన్నయ్య ఇదే నాలోకం. పెద్దగా చదవకపోయినా అమ్మ నాన్న నన్నెప్పుడు కనీసం మందలించిన పాపాన పోలేదు. నాకే ఎందుకో చదువు అంతగా అబ్బలేదు. ఇక చదివే పనిలేదు. చదువురాదంటే ఫెయిల్ అని కాదు. నాతోటి వాళ్లంతా ఇంజనీరింగ్ అంటే నేను BA లో చేరడం అన్నమాట. BA ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యా. బీఎడ్ చేద్దామని ఎంట్రన్స్ కోసం కోచింగ్లో జాయిన్ అయ్యా. అదిగో కలలోనైనా వూహించకుండా మనసుపడ్డవాడితోనే మనువైపోయింది. మనసు పడడం అంటే ప్రేమ దోమ కాదు. మా బాబయ్ వాళ్ళ అబ్బాయ్ అంటే మా అన్నయ్య పెళ్ళిలో పెళ్లికూతురు వైపునుండి వచ్చారు వారు. అమ్మాయిని కదా వెనకనుండి గమనించినా తెలిసిపోతుంది. ఎవరో నన్ను గమనిస్తున్నారని చూసా వెంటనే సర్దుకున్నారు. నాకు ఎందుకో మొదటి చూపులోనే నచ్చేసారు. చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి అనుకున్నా. కానీ అతన్నే చేసుకుంటా అనుకోలేదు. ఈ మాట మొదటి రాత్రి తనతో చెప్పినప్పుడు ఎంత సంబరపడిపోయారో!!.
హనీమూన్లు, అత్తిల్లు, అమ్మ ఇల్లు అన్నీ ముగించుకొని శ్రీహరికోటలో కొత్త సంసారం. పెళ్లవగానే govt మంచి ఇంటిని కేటాయించిoది. నాకైతే భలే నచ్చేసింది. నాన్నగారిలా కాదు పొద్దుటే తొమ్మిదికి వెళ్తే మళ్లి ఆరింటికెల్లా ఇంటికి వచ్చేస్తారు. కావాల్సినంత ఏకాంతం ఇంకేం మూడ్నెల్లు తిరిగేలోపు నెల తప్పాను. అందరూ ఎంత సంబర పడిపోయారో!! అంతా సవ్యంగా వుంది అన్నారు డాక్టరుగారు. మూడోనెల పడగానే అమ్మ వాళ్ళు అదేదో పద్దతి అంటూ పుట్టింటికి పిల్చుకొచ్చారు. ఎదో చెప్పలేని సంబరం అత్తయ్య వాళ్ళు చుట్టుపక్కల వాళ్లు అందరు పలకరిస్తుంటే. వేవిళ్లు అవి అంటూ అందరూ కలిసి రకరకాల వంటకాలతో మేపుతూ కాలు కిందపెట్టనీయకుండా చూసుకుంటుంటే ఆహా!! నా వైభోగానికి నాకే ముచ్చట వేసింది.
ఇక రేపటితో మూడో నెల నిండుతుంది అనగా, రాత్రి ఉన్నట్టుండి కడుపులో నొప్పి. అమ్మ నాన్న ఇద్దరు భయపడ్డారు ఎందుకు తాత్సారం అంటూ నేను చూపించుకొనే మా డాక్టర్కు ఫోన్ చేస్తే రమ్మన్నారు. నేను అమ్మ నాన్న అన్నయ్య అందరం వెళ్ళాము. డాక్టర్ గారు పరీక్షా చేసి
“సారీ కడుపులో బిడ్డ గుండెకొట్టుకోవడం ఆగిపోయింది. అంటే తనకు అబార్షన్ అయ్యింది” అని చెప్పింది. అంతే!! ఆ మాటవినగానే నాకు భూకంపం వచ్చినట్టు అయ్యింది నా బిడ్డను ఎవరో లాగేసుకుంటున్నట్టుంది. ఏడుపు తన్నుకొచ్చింది. ఆపుకోలేక గట్టిగ ఏడ్చేసాను. డాక్టర్ ఇప్పుడు ఇంటికెళ్లి ఉదయం రమ్మంది అదేదో d&c చేస్తారుట. మూడు పూర్తి అయ్యింది కాబట్టి మాత్రలతో కష్టమన్నారు. ఇంటికొచ్చాక అమ్మను పట్టుకొని గట్టిగ ఏడ్చేశాను.. అందరు ఓదారుస్తున్నారు కానీ ఏడుపు ఆగటం లేదు. ఏడ్చి ఏడ్చి ఎప్పుడూ నిద్రపోయానో తెలీదు. నేను లేచేపాటికి మా వారు అత్తయ్య మామయ్యా అందరు వచ్చి ఉన్నారు. బహుశా అమ్మవాళ్ళు అందరికి చెప్పినట్టున్నారు. వారందరిని చుసేపాటికి మళ్లి దుఃఖం తన్నుకొచ్చింది. అందరు ఓదార్చారు. అమ్మమేమో “ఇలాంటివన్నీ సహజం. మీ అన్న పుట్టకముందు నాకు రెండు పోయాయి నీకు ముందుకూడా ఒకటి పోయండి. ఇదేం అంత భయపడాల్సిన విషయం కాదు” అంది. అత్తమ్మ కూడా ఎవరెవరివో అబార్షణ విషయాలు చెప్పి నన్ను ఊరడించడానికి ప్రయత్నం చేశారు. d&c అయ్యాక డాక్టర్ గారు కూడా ఇది సర్వసాధారణం. చిన్నవయసు కదా అని ఇంకా ఏవేవో చెప్తున్నారు కానీ నా మనసుకేమీ ఎక్కటం లేదు. ఎవరో నా బిడ్డను చిదిమినట్టే అనిపించింది. బాగా నిస్సతువగా ఉండడం వల్ల ఇంటికొచ్చాక బాగా నిద్ర పోయాను. ఎవరెంత చెప్తున్నా అసంకల్పితంగా నా చెయ్యి నా కడుపును తడుముతూనే వుంది. ఇది చూసి ఈసారి అమ్మ చివాట్లు పెట్టింది. మావారు రెండు రోజులుండి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు అత్తయ్య వాళ్లు వచ్చి పలకరిస్తున్నారు. పదిహేను రోజులకు మళ్లి మావారు వచ్చి చూసుకొని వెళ్లారు.
ఒక నెలయ్యాక డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి కొద్దిగా బలహీనంగా ఉండడం వల్ల ఒక ఆరునెలలవరకు గర్భం వద్దని మందులు అవి రాసిచ్చింది. మందులు అవ్వగానే వచ్చి కలవమంది. లేదా అక్కడే ఉన్న డాక్టర్ను ఈ ప్రిస్క్రిప్షన్ చూపించి కలవమంది. అమ్మ నాన్న కూడా నాతొ మా వూరొచ్చారు. అన్ని సర్దించి ఒక వారముండి నాకు దైర్యం నూరి పోసి వెళ్లారు. పాపం మావారు ఈ సంఘటన తర్వాత మరింత ఎక్కువ సమయం ఇచ్చి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు . ప్రతి శనివారాలు ఆదివారాలు ఎప్పుడూ బయటకే. కాలం గడిచే కొద్దీ నేను ఈ ఘటనను మర్చిపోయాను. మర్చిపోలేదు కానీ మరుగున పడ్డది. అప్పుడప్పుడు నీద్రలో పీడకల గా గుర్తొస్తూనేవుంటుంది. మా వారి ప్రేమ సంరక్షణలో ఆరు నెలలకాలం ఇట్టే గడచిపోయింది. నాకైతే తేదీలు గుర్తులేవు కానీ మా వారు గుర్తు చేసుకొని లేడీ డాక్టర్ దగ్గరకు పిల్చుకెళ్లారు. మా డాక్టర్ గారి ప్రెస్సీప్షన్ చూసిన తర్వాత తనూ స్కానింగ్, మరి ఇంకొన్ని టెస్టులు చేసి అంతా బాగుంది అని నిర్దారించుకొని తీసుకోవలసిన జాగ్రత్తలు వేసుకోవలసిన మందులు అవి ఇచ్చి పంపింది.
చూస్తుండగానే మళ్లి నెల తప్పాను. మా వారికి అమ్మవాళ్ల, అత్తమ్మ వాళ్ళు అందరు చాల సంతోషపడ్డారు. కానీ నాకెందుకో ఏదో భయం. ఆ మాటంటే అందరు నన్ను తిట్టిపోస్తారు. అందుకే మారు మాట్లాడకుండా ఉండిపోయా. నన్ను చూడడానికన్నటు అత్తయ్యవాళ్ళు, వాళ్ళు వచ్చి వెళ్ళాక అమ్మ వాళ్ళు వచ్చారు. ఇద్దరు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. డాక్టర్ గారి అనుమతితో మూడు నిండుతుందనగా అమ్మవాళ్లు నన్ను పిల్చుకెళ్తామన్నారు. నేను రానన్నాను. నాకెందుకో మొదటి సారి ఆలా జరిగింది కదా భయము. వారు బలవంతం చేయలేదు. నాన్న వెళ్లినా అమ్మ నాతొ కూడా మరిన్ని రోజులు ఉంది. మూడు నిండి నాల్గు పడ్డాక డాక్టర్ గారు అంతా బాగుందని చెప్పాక నేను కాస్త నవ్వే పాటికి అందరికి జీవ వచ్చినట్టయింది. డాక్టర్ గారి భరోసా మీద అమ్మ అన్ని జాగ్రత్తలు చెప్పి తను వూరెళ్ళిపోయింది. మావారు అన్ని తానై చూసుకుంటున్నారు. ఏ జన్మ ఫలమో తనకు భార్యను కావడం. చూస్తుండగానే ఐదో నెల పూర్తి కావచ్చింది. ఇప్పుడే డాక్టర్ గారు స్కానింగ్ చేసి సవ్యంగా ఉందని చెప్పారు. ఈ మాట విన్న తర్వాత మనసుకు ఏంటో హాయ్ గా అనిపించింది. ఎంత మంది దేవుళ్ళకు మొక్కానో నాకు తప్ప ఎవరికి తెలీదు. ఆ మొక్కులో వారి తిరుపతి గుండు కూడా వుంది. తనకు చెప్పలేదు. గుండుతో మా వారు ఎలా వుంటారో ఊహించుకుంటే నాకు నవ్వువొచ్చింది. మా వారు నా నవ్వు చూసి ఎంత సంబరపడ్డారో.
మొదటి పెళ్లి రోజును చాలా ఘనంగా జరుపుకున్నాము. కానుకలు నాకేమి వద్దన్నా ఎన్నో బహుమతులు కొనిచ్చారు. నేనిచ్చే బహుమతి ముందు అవన్నీ దిగదుడుపే అని. చూస్తుండగానే ఆరు పూర్తి కావచ్చింది. ఏడో నెలలో అమ్మవాళ్ళు శ్రీమంతానికి కానుపుకు పిల్చుకెళ్తామని చెప్పారు. శ్రీ మంతం ఆ పేరు వినగానే ఆనందభాష్పలు రాలాయి. ఈ సంతోషం నాకు పెళ్లైనప్పుడు కూడా కలగలేదు అందుకే పెద్దలు మాతృత్వం ఓ గొప్ప వరం అంటారు కాబోలు. ఇప్పుడు ఒక్క దాన్ని వాకింగ్కు వెళ్లట్లేదు. మావారే రోజు దగ్గరుండి వాకింగ్ కు పిల్చుకెళ్తారు ఎన్నో కబుర్లు చెప్తూ. ఇవాళ కూడా వాకింగ్ కు బయలు దేరాము. నిదానంగా జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని పిల్చుకెళ్తున్నారు. తనతో నడవడం అంటే నాకు భలే ఇష్టం. ఏవో కబుర్లు చెప్తూ నడుస్తన్న నేను ఒక్క సారిగా పడిపోయా ఏమైందో తెలుసుకొనేలోపు ఆసుపత్రి బెడ్ పైన. కడుపు తడిమి చుస్తే. … గట్టిగ ఏడ్చేసా. హిస్టీరిక్ పేషంట్ లాగ నా బిడ్డ నా బిడ్డ అని అరిచాను. వెంటనే డాక్టర్ గారు వచ్చి సూది ఇచ్చారు ఎప్పుడు నిద్రవైపోయానో ఎంత సేపు నిద్రపోయానో తెలీదు. మెలకువ వచ్చి చూడగానే నా చుట్టూ అమ్మా వాళ్ళు అత్తయ్య వాళ్ళు. ఏమైందో చెప్పండని వేడుకున్న మీదట ఆ రోజు వాకింగ్ వెళ్తున్న నాకు పిల్లల క్రికెట్ బంతి ఎక్కడినుంచో వచ్చి నా కడుపుకు బలంగా తాకింది. దాని దెబ్బకు కడుపులో చిన్ని ప్రాణం విలవిలా లాడిపోయి ప్రాణం వదిలింది. ఆరో నెల కాబట్టి డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సివచ్చింది అని చెప్పారు. ఇది వినగానే కోపం కసి. నా అదృష్టాన్ని చిదిమిన ఆ బంతిని కసి తీరా చంపేయాలని కానీ ఏమి చేయలేని నిస్సహాయత. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అమ్మవాళ్ళు నన్ను హైద్రాబాదు పిల్చుకొచ్చేశారు. .
ఈ సారి అసలు కోలుకోలేక పోతున్నాను. నిజానికి ఈసారి మావారు నావాళ్లు అందరు ఇంచుమించు అలానేవున్నారు. అతికష్టం మీద రెండు నెలలు గడిచాయి. నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇప్పుడప్పుడే పిల్లలకు వెళ్లోద్దని మునపటి లానే అన్ని చెప్పారు. ఇంకా పెళ్ళై ఏడాదే ఐన ఎదో కోల్పోనట్టు అనిపించింది. స్నేహితులు బంధువులు అందరు దైర్యం నూరిపోశారు. వారి మాటలు పెద్దగా ఎక్కలేదుకాని పిన్ని మాత్రం సపరేటుగా నన్ను పిలిచి బుజ్జగిస్తునే చివాట్లు పెట్టింది. నాలో ఒక రకమైన భయం నింపింది. నిజానికి తను నింపిన భయం నాలో పెద్ద మార్పును తీసుకొచ్చి అతి త్వరగా కోలుకోనేట్లు చేసింది. తను నాలో ఎలాంటి భయం నింపిందంటే నేను ఎప్పుడూ కళావిహీనంగా వుండి, ఏడుపు ముఖం తో ఉంటే మొగుడికి మెల్లిగా అత్తింటి వాళ్లకి నా మొహం మొత్తి నన్ను దూరంగా పెట్టె అవకాశం వుంది అని చెప్పింది. అంతే కాదు నేను మామూలుగా ఉంటే వారే పాపం అని నన్ను అక్కున చేర్చుకుంటారు అని చిప్పింది. భయమో మాటల్లోని నిజమో తెలియదు కానీ పిన్ని చెప్పింది నిజమే అనిపించి నేను తేరుకొని మాములుగా వుండేపాటికి తానన్నట్టుగా మునుపటికంటే ఎక్కువ ప్రేమ చూపించారు. నాకు పిన్ని చెప్పింది నిజమే కదా అనిపించింది. పైకి మాములుగా వున్నా లోపల మాత్రం ఎదో తెలియని భయం ఐతే వుంది.
ఏంటో!! రెండో పెళ్లి రోజు కూడా అయిపోయింది. ఎందువల్లో ఈసారి ఇంకా గర్భవతిని కాలేకపోయా. ఎవరిని అడగాలో తెలిటం లేదు. మాటల్లో అమ్మతో అన్నాను. నీకెప్పుడూ అదే ధ్యాస అందుకె నిధానమౌతోంది అని తిట్టి పోసింది. నిజమే కాబోలు అని నేను ఊరుకుండిపోయా. అప్పటికి. మళ్లి షరా మామూలే. పైకి ఆనందంగా. మా వారు కనిపెట్టారేమో ఒకరోజు అడిగారు అదేం లేదని, మీరంతా అండగా ఉండగా నాకెందుకు భయం అని చెప్పా. నాకు తెలుసు తనకు తెలుసు ఇవి పెదవి చివరి మాటలని. ఏమనుకున్నారో ఆ తర్వాత ఎప్పుడు అడగలేదు.
రోజులు గడిచేకొద్దీ నాలో ధైర్యం సన్నగిల్లుతోంది. పెళ్ళై మూడేండ్లు పైనే ఇంక మేకపోతు గాంభీర్యం నటించలేకపోయా. వుండ పట్టలేక మావారిని అడిగా ఒకసారి డాక్టర్ను కలుద్దామని. సరే అన్నారు సరే అనడం ఆలస్యం వెంటనే డాక్టర్ను కలిసాము. అన్ని టెస్టులు చేసిన తర్వాత అన్ని నార్మల్గా వుంది మీరు మరేం కంగారు పడాల్సింది లేదు అని మందులు రాసిచ్చారు వాటిని ఎలా తీసుకోవాలో వివరించి చెప్పారు. డాక్టర్ దగ్గరనుంచి వచ్చిన తర్వాతం మా వారి ముఖం లోకూడా నాకు లాగే ప్రశాంతత వచ్చింది. బహుశా తనుకూడా డాక్టర్ను కలవాలనుకున్నట్టు వున్నారు. చెబితే నేనేమనుకుంటానో అని నాకు లాగే ఆగిపోయారు.
ఈ సారి ఆవిడ ఇద్దరిని టెస్టు చేసింది. ఇద్దరి రిపోర్ట్స్ నార్మల్ అని తెలిసాక ఇద్దరిలోను ప్రశాంతత అంతకు మించి ఎదో ధైర్యం. ఆవిడిచ్చిన మందులు సక్రమంగా వాడుతున్న ఏంటో ఇంకా గర్భం దాల్చెలేదు. ఆవిడేమో ఇంకో మూడు నెలలు వాడుదాము అప్పటికి కాకపొతే ఎదో ఒక నిర్ణయం తీసుకుందాం అంది. సరే అన్నాను. మూడునెలల నిరీక్షణ ఫలించింది మళ్లి గర్భం దాల్చాను. బయటకు సంబర పడాలన్నా ఎదో భయం అందుకే మా సంతోషం మౌనంగా కళ్ళతోనే పంచుకున్నాము. ఈలోపు అన్నయ పెళ్లికూడా అయ్యింది. వదిన సలహా మీద నన్ను అమ్మవాళ్ళు డాక్టర్ ప్రయాణం చెయ్యొచ్చు అనగానే జాగ్రత్తగా ఇంటికి పిల్చుకొచ్చారు. ఈసారి కానుపు అయ్యాకే పంపుతామన్నారు. అత్తయ్య వాళ్లు ఒప్పుకున్నారు. అంతా సవ్యంగా వుంది అనుకునేంతలో వచ్చిన రెండో రోజే కళ్ళు తిరిగి పడిపోయా. లేచేపాటికి ఆసుపత్రిలో. ఈ సారి ఎక్టోపిక్ ప్రగ్నెన్సీ ఓ పదివేల మందికి ఒకరికి ఇలా!! అందులోను కవలలు ఒకటి ఫెలోపిన్ ట్యూబులో ఇంకొకటి గర్భసంచిలో. అందువల్ల డాక్టర్లు ట్యూబులో గర్భం గమనించలేదు. అది అక్కడే పెరుగుతూ ఇంక స్థలం లేక ట్యూబులోనే రప్చర్ అయ్యిoది. దానివాల్ల ట్యూబ్ చిన్నాభిన్నమయి, విపరీతంగా రక్తస్రావం జరిగి ఆ ట్యూబును కడుపులో బిడ్డను తొలిగించేసారు. విపరీతంగా రక్త స్రావం జరగడం మూలాన మూడు బాటిళ్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. నేను నిజానికి కోమా లో వెళ్ళవలసినదాన్ని. అమ్మ వాళ్ళింట్లో వున్నా కాబట్టి సమయానికి నన్ను ఆసుపత్రికి పిల్చుకెళ్లారు. అదే మా ఊర్లో ఉండుంటే ప్రాణాలే దక్కేవి కాదని ఇది అత్యవసరంగా జరగాల్సిన ఆపరేషన్ అని డాక్టర్లు చెప్పారు. ఈ raptured ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ దెబ్బకు అందరు భయపడిపోయారు.
ఈ సారి నాకైతే ఏడుపుకూడా రాలేదు. మాట రాలేదు అందరు భయపడ్డారు. ఎలా ఓదార్చాలో ఎవ్వరికి అర్థం కాక వూరుకుండిపోయారు. నిజానికి ఎవ్వరు ఇంకొకరిని ఓదార్చే స్థితిలో లేరు. అందరి పరిష్టితి నాకన్నా దయనీయంగా వుంది. అమ్మైతె మరీ క్షణం కూడా వదిలి ఉండటం లేదు . మా వారు అంతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు వుండి వెళ్లిపోయారు. అమ్మ వదిన కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మరి మావారి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి భయపడ్డారో లేక అత్తయ్య వాళ్ళు వచ్చేయమన్నారో నేను శారీరికంగా కోలుకొనేటప్పటికీ మావారు హైద్రాబాదు ట్రాన్స్ఫర్ చేయెంచుకొచ్చేశారు.
నిజానికి మావారికి శ్రీహరికోటకు ఎప్పటికి వదిలిరావడం ఇష్టం లేదు. అన్నివిధాలా సౌకర్యంగా వుంటుoది. కానీ ఏంచేద్దాం విధి ఇక్కడకు రంపించేసింది. మామూలు అబార్షన్ అయ్యుంటే అంత భయపడేవారు కాదేమో. కానీ కొద్దిగా ఆలస్యమైనా ప్రాణానికే ముప్పు అన్న డాక్టర్ మాటలు మావారిని భయపెట్టినట్టున్నాయి కాబోలు వచ్చేసారు. ఈ అబార్షన్లే జీర్ణం కాకపోతే నావల్ల తన ఇష్టమైన ప్రదేశాన్ని వీడినందుకు మరింత బాధేసింది. అందరికన్నా అదృష్ట వంతురాలిని అనుకున్నా. కానీ ఇంత దురదృష్ట వంతురాలిని అనుకోలేదు. మావారు ట్రాన్ఫర్ మీద హైద్రాబాదులో జాయిన్ అయిపోయారు. ఇంక రేపు నేను అత్తయ్యావాళ్ళింటికి వెళ్లాలనుకున్న రోజు రాత్రి అనుకోకుండా అమ్మ నాన్న మాటలు నా చెవినపడ్డాయి. నాలో వున్న కొద్దో గొప్ప ధైర్యం కూడా నీరు కారిపోయింది. వారి భయం ఏమిటంటే ఇప్పుడు నాకు ఒక ట్యూబు లేకపోవడం మూలాన నేను గర్భవతిని అయ్యే అవకాశం నెల మార్చి నెల వుంటుంది. మనలో రెండు ట్యూబులు అంటే కుడి మరియు ఎడమ ట్యూబులు. ఒక నెల కుడి ట్యూబులో అండం విడుదలైతే మరోసారి ఎడమ ట్యూబులో. నాకు కుడికి లేదు కాబట్టి ఎడమలో అండం విడుదల అయినప్పుడే అంటే ఏడాదికి కేవలం ఆరునెలల కాలం మాత్రమే నేను గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెంసీ తర్వాత కూడా ఎందరో పిల్లల్ని కన్నారు అని డాక్టర్ గారు చెప్పారు. వారి భయం ఏమిటంటే మా అత్తయ్య మామగారు మా వారు ఏమనుకుంటారో. మునుపటిలా బాగా చూసుకుంటారో లేదో అని భయం వారికి. నాకు ఏమూలో ఈ భయం లేకపోలేదు. అలాంటి వాళ్ళు కాదుకానీ!!. అయినా ఏదో భయం వుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళ మాటలతో అది బలపడ్డది. ఇదివరకైతే మేమిద్దరమే వుండేవాళ్ళము కావలసినంత ఏకాంతము. ఇప్పుడు అత్తా మామలతో ఎంత మంచి వాళ్ళైనా అంత స్వేచ్ఛ వుండదు కదా.
అమ్మ నాన్నకు బాగా దిగులు పట్టుకుంది. ఎన్నడూ లేనిది నా జాతకం పట్టుకొనిపోయి చూపించుకొచ్చారు. వారు సంతాన యోగం వుంది అని ఏవో పూజల లిస్ట్ ఇచ్చారు. ఇంకేం నన్ను అత్తగారింట్లో దిగబెట్టి మావారికి వీలు దొరికినప్పుడల్లా పూజలు పునస్కారాలు. ఇటు అత్తా గారింట్లో వాళ్లు కూడా. పెళ్ళైన కొత్తలో ఏం ఆనందంగా గడిపానో ఆతర్వాతంతా ఇదే ఏడుపే. అత్తగారింటివాళ్ళు కానీ మా వారులో కానీ మునపటి ప్రేమలో ఏ తేడా లేదు. సంతోషమే! అయినా ఎక్కడో మూల భయం వుంది. నిజంగా మావారు బంగారం. నా మనసులో ఈ భయం కనిపెట్టారేమో నాకు జీవితం మీద భరోసాను కలిపించారు. నిజానికి అక్కడ నేను ఒక్కదాన్నే ఇప్పుడే బాగుంది అమ్మవాళ్ళు వచ్చిపోవడం మేము వెళ్లడం మనసు కొద్దికొద్దిగా కోలుకుంటోంది. ఈ ఘటన గడిచి ఏడాది అయ్యిన్ది. మళ్లి మొదలు పిల్లల కోసం తపస్సు. ఈలోపు పూజలు హోమాలు మొక్కులు, తీర్థ యాత్రలు అంటూ అమ్మ వాళ్ళు అత్తవాళ్ళు పోటీపడి చేయిoచారు. ఇప్పటివరకైతే ఫలితం సూన్యం. అమ్మ వదినతో చిప్పించిందేమో ఒకసారి తను యధాలాపంగా డాక్టర్ దగ్గరకు పిల్చుకొచ్చింది. షరా మామూలే అంతా సవ్యంగా వుంది మందులు వాడండి ఒక మూడు నెలలు కాకపొతే అప్పుడు చూద్దాం ఇదే మాటే. కొత్త వైద్యుడు కన్నా పాత రోగే మేలు అన్నట్టుంది నా పరిస్థితి.
మళ్ళీ కధ మొదలు. కానీ ఈసారి మూడు నెలలు కాదు ఆరు నెలలు దాటిపోతున్న ఏమి ఫలితం లేదు. అందరిలోనూ భయం ఆవహించింది. ఇక లాభం లేదని ఒక ఫెర్టిలిటీ సెంటర్ కు వెళ్ళాము. వారు అన్ని పరీక్షలు చేసి అంతా సవ్యంగా వుంది కాబట్టి ivf అక్కర్లేదు iui చాలు అని ఎప్పుడు రావాలి ఏమి చెయ్యాలి అని మొత్తం ఒక ప్రణాళిక ఇచ్చారు. వారి ప్రణాళికననుసరించాము. హైద్రాబాదు రావడం వల్ల ఇది ఉపయోగపడ్డది. పాపం అమ్మకైతే ఇదే ధ్యాశ. ప్రతిసారి మావారు రావడానికి వీలయ్యేది కాదు. తను రాలేరు అనగానే నాన్న అమ్మ హాజరు. నాన్న రిటైర్డ్ అయ్యారు గా. ఇక కారేసుకొని టైంముకు వచ్చేసేవాళ్ళు. అత్తకూడా వచ్చేది. ముగ్గురు వద్దు నలుగురు వెళ్ళాలి అని మామగారి మాట మీద అందరం వెళ్ళేవాళ్ళం. అయినా ఏ ప్రయత్నం ఫలించలేదు. iui మీద iui లు చేస్తూనేవున్నారు. దాదాపు ఒక నెల మార్చి నెల ఒక ఐదు సార్లు చేశారు. నా వళ్ళు హూణమౌతోంది కానీ. ప్రయోజనం సూన్యం. ఇట్టే ఇంకో ఏడాది గడిచిపోయింది.
నా తర్వాత పెళ్ళైన వారందరి పిల్లలు అప్పుడే స్కూలుకు వెళ్లడం కూడా మొదలు పెట్టారు. అంతెందుకు నా మేనకోడలు నా అల్లుడు కూడా బడిలో చేరిపోయాయారు. ఈ సంతానం కోసం యాతనలో పెళ్ళై ఎన్నెండ్లు గడిచాయి కూడా తెలీలేదు.
గత కొన్నేండ్లుగా ఆనందానికి అవతల వున్నా. ఏ ముచ్చటా లేదు. ఎవరిదైనా పెళ్ళికి వెళ్తే ఇదే గోలే! మావాళ్లకి ఇలాగే పిల్లలు లేరని, అయ్యో పాపం అని… వాళ్ళు అభిమానంతోనే అనచ్చు. కానీ ఈ అయ్యోపాపం తట్టుకోలేకపోతున్నా. జాలి చూపులు ఉచిత సలహాలు ఆదేవునికి మొక్కు ఈదేవునికి మొక్కు కాదంటే పూర్వ జన్మ లో ఏం పాపం చేసానో అదీకాదంటే ఈ జన్మలోనే ఎవరికి అన్యాయం చేసానో ఇవే మాటలు.. నామీద నాకే కోపం వస్తోంది. మనస్ఫూర్తిగా సంతోషంగా పాట పాడుకొని ఎన్నిరోజులు అయ్యిందో. అందరికి నాతో మాట్లాడ్డం అంటే వేరే విషయం లేదు కేవలం పిల్లలు పిల్లలు అంతే. ఇప్పుడు ఈ మధ్య కొత్త సాంత్వన వచనాలు మావాళ్ళు తప్ప మిగతా అంతా నాకు పిల్లలు పుట్టరని ఎవరికి వారు డిసైడ్ అయినట్టున్నారు. “అయ్యో పిల్లలు లేరన్న ఒకమాట కానీ వుండి మేమేమి సాధించినట్టు. రోజు రోజు టెన్షన్లే చదవకపోతే ఓ బాధ. లేటుగా వస్తే ఇంకోటి నిఘావుండలేక చస్తున్నాము. నీవేమి బెంగ పెట్టుకోకు” అని అంతేనా మళ్ళీ పైగా “అయ్యో! వాడు ఒక్క క్షణం కనపడకపోతే బెంగ. మా వాడికి ఇది ఇష్టం అది ఇష్టం అది వoడాలి, ఇవి కొనాలి”. ఇది ఓదార్పా!! దెప్పిపొడుపా!!!. ఛీ!! నామీదే నాకు కోపం వస్తోంది. వీరికి జవాబు ఏమి చెప్పాలో అర్థం అయ్యేది కాదు. నిజమే లెండి అని అనేదాన్ని. లోపల ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలయ్యేవో ఎవరికి తెలుసు. ఇలా దెప్పిపొడిచినప్పుడెల్లా అత్తగారు వాళ్ళో అమ్మవాళ్ళో నన్ను వెనకేసుకోచ్చేవాళ్ళు.
ఇంకోసారి దగ్గరి చుట్టాలవిడ నా వయసుదే మొదటినుంచి నేనంటే అసూయా. ఇప్పుడు నాకు ఇంకా పిల్లలు కాలేదుగా తనదే పై చెయ్యి. మర్యాదకు ఇంటికి పిలిస్తే “అదృష్టమంటే నీదేనే హాయిగా ఏ కష్టం లేదు అత్తా మామల పోరులేదు పిల్లల జంజాటం లేదు. అందరికి నీ అదృష్టం ఎక్కడ వస్తుంది” అని పిల్లలేరన్న విషయాన్నీ దెప్పి పొడిచింది. కడుపు రగిలిపోయిoది. ఎన్నాళ్ళోకో మార్కెట్లో కనిపిస్తే రమ్మన్నాను. వచ్చాక ఒకటే దెప్పిపొడుపు. విన్నంత సేపు విన్నాను. సహనం చచ్చి ” పోనీలే నా అదృష్టం నీ పిల్లలకు రావాలని కోరుకోకు అన్నాను”… అంతే వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇoకొందరు “అబ్బో!! అదృష్టమే నీది మాకు తెలిసిన ఒకళ్ళకి పిల్లలు కాకపోతే ఆమెను వదిలేసి రెండో పెళ్ళిచేసారు అత్తమామ్మలు, ఎంచక్కా చేసుకున్నాడు మొగుడు పాపం తనబతుకే” అని నిట్టూర్పులు. నిజమో కల్పితమో తెలీదు కానీ… నాకు ఈ భయం లేకపోలేదు. నేనే ఒక సెలవు రోజున అందరికి చెప్పేశా. మీరు కావలనుకుంటే ఇంకో పెళ్లి నిరభ్యంతరఁగ చేసుకోవచ్చు. వారసుడిని ఇవ్వలేకపోయా కదా అని. బహుశా ఇదొక్కటేనేమో నేను చేసుకున్న పుణ్యం అందరికందరు తిట్టి పోశారు. నాకు బాసటగా మేమున్నాము చెప్పడమే కాదు అడుగడుగునా నిరూపించారు.
ఇప్పటివరకు మందులు తర్వాత iui ఇదిగో ఇప్పటి నుంచి ivf మొదలు. అబ్బా చాల కష్టమైన ప్రక్రియ. అంతకన్నా ఖరీదైన ప్రక్రియ. ఆ మందులు అవి వేసుకోలేక పిల్లలొద్దు అసలు ఈ జీవితమే వద్దు చద్దాం అనిపించేది. వరుసగా మూడేండ్లు మూడు సార్లు ivf. డబ్బు బూడిదలో పోసిన పన్నీరు ఫలితం సూన్యం. ఈ మందులు హార్మోన్లు వల్ల ఆరోగ్యం అటకెక్కుతుంది. దాన్ని కాపాడుకోవడానికి యోగ. జీవితం మీదే రుచి పోయింది. గలగలా మాట్లేడే నేను ఇప్పుడు అన్నింటిపైనా నిర్లిప్తత. పాపం శ్రీవారు ఎక్కడా రాజి పడకుండా తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇదోక్కటే నేను బతికుండడానికి కారణం. ఎవరో అన్నారు దత్తత తీసుకోండి అని. అవును కదా అనిపించింది. కానీ నేనెలా చెప్పను. వంశానికి వారసుడిని ఇవ్వలేకపోయా కానీ దత్తత అని ఎలాచేప్పను. తెలీకుండానే నాలోనేను కుంచించుకుపోతున్నాను, ఆరోగ్యం బాగా మందగిస్తోంది. పూర్తి నిర్లిప్తత వచ్చేసింది. స్తబ్దత. నాకూ ఓదార్పు నివ్వటానికి నావారిలో కూడా శక్తి సన్నగిల్లింది. పోరాడే శక్తి కూడా ఎవ్వరిలో లేదు. దేవుని పూజలకు లక్షలు కృష్ణార్పణం. డాక్టర్లకు దానికి రెండింతల డబ్బు శివార్పణమ్. కాలం కదలటమే లేదు. నీరసంగా సాగుతున్న నా జీవితంలోకి ఒకరోజు
నాకు తెలియకుండా మావారు మా అత్తా గారు మా ఆడపడుచు ఒక చంటి బిడ్డతో వచ్చారు. బిడ్డ భలేవుండి ముద్దోస్తోంది. కానీ ఎత్తుకొని ముద్దాడాలన్న కోరిక కూడా కలుగలేదు. అత్తమ్మ నన్ను తన పక్కన కుర్చోబెట్టుకొని ఈ పాపను దత్తత తీసుకున్నట్టు ఇప్పుడు ఈ పాప నాదే అని చెప్పింది. ఎక్కడో మనస్సులో చిన్ని వెలుగు అంతలోనే మళ్లి భయం. ఈ పాపను భగవంతుడు నాకు దూరం చేస్తే!! ఆమ్మో!! ఆ తలపే భయంకరంగా వుంది. ఎత్తుకోబోతున్నదానినల్లా చేతులు వెనక్కు తీసుకున్నా వద్దని. అందరు ఎంత చెప్పినా కనీసం మూడునెలలవరకు దూరంగానే వుండాలనుకున్నట్టు చెప్పా. అందరు నచ్చచెప్పారు, తిట్టిపోశారు, బతిమలాడారు, సామ దాన భేద దండోపాయాలన్ని ప్రయోగించారు. వారికేం తెలుసు నా భాధ. నా వల్ల బిడ్డకు ఏమైనా అయితే ఆమ్మో ఆ ఊహే వద్దు. ఏంటో పిల్ల కూడా నేనే తల్లినన్నట్టు నాదగ్గరికే వస్తోంది. అందరికి నా మీద కోపంగా వుంది. నాకు మాత్రం దూరంగా వుండాలని వుందా ఏమిటి. ప్రతిసారి నాకు మూడోనెలలో గర్భం పోయింది. అందుకే మూడు గండం దాటాకే అంటే ఎవ్వరు వినరే!!!. చివరకు మావారు ఒప్పుకున్నారు. అంతా ప్రభుత్వ రూల్స్ ప్రకారం దత్తత కాబట్టి ఆ ప్రక్రియలకు మాత్రం హాజరు. కానీ పాపను ముట్టుకోను. వాళ్లకు కోపం. కానీ!! ముద్దులొలికే ఆ చిన్నదాన్ని చూస్తుంటే దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. వారికేమి తెలుసు అది వచ్చినప్పటినుంచి ప్రతిరోజూ లెక్క గడుతున్న మూడు నెలలు ఎప్పుడు గడుస్తాయని. మీకు తెలుసా!!పెద్ద!! దానికి ఎవరో నేనే తల్లిని అని చెప్పినట్టు అది ఏడ్చినప్పుడు నేను ఎత్తుకుంటేనే ఏడుపు ఆపేది. ఏడుపు ఆపాక మళ్లి అత్తయ్య కు ఇచ్చేదాన్ని. రేపే అది వచ్చి మూడు పూర్తి అవుతుంది. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు అని తెల్లవార్లూ ఆ దేవుడిని వేడుకుంటూ కూచున్నా!!!.
తెల్లవారింది. ఎప్ప్పుడు ఆరు గంటలకు తన ఏడుపుతో నిద్రలేచే నేను తన ఏడుపు వినబడకపోయే పాటికి గుండె గుభేలుమన్నది. భయపడుతూ ఒక్క పరుగుతో అత్తగారి గదికి వచ్చా. నాకొసమే అన్నట్టు ఊయలలో బోసినవ్వులతో స్వాగతం పలుకుతోంది. ఇక ఒక్క క్షణం కూడా దూరంగా వుండలేకపోయా. ఊయలలో ఉన్న బిడ్డను ఎత్తుకొని ముద్దాడాకే మనసు కుదుట పడ్డది. అది కూడా నన్ను ముద్దులతో ముంచెత్తుతోంది. గట్టిగ గుండెలకు హత్తుకున్నా!! నాకూ!!! కూతురుంది!!! అని ప్రపంచానికి కోటి గొంతుకలేసుకొని చెప్పాలనిపించింది. అనిపించడమేమిటి చెప్పేశా!! దాన్ని గట్టిగా గుండెలకు హత్తుకొని చెప్పేశా!!!. నావాళ్లంతా చెమ్మగిల్లిన కండ్లతో నన్ను హత్తుకున్నారు. ఇన్నాళ్లు దురదృష్టవంతురాలిని అనుకున్నా. అందరి మనస్సులో నామీద ఇంత ప్రేమ వున్నందుకు నన్ను అర్థం చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తేలియక అత్తయ్యకు మామగారికి నా కూతురుతో కలిసి పాదాభివందనం చేశా.
శరత్ చంద్రిక లాంటి నా కూతురు ఏ ముహూర్తాన అడుగు బెట్టిందో, నా బంగారు తల్లి వచ్చిన వేళ విశేషం మళ్లీ ఇన్నాళ్ళకు అదిగో మళ్ళీ ఇప్పుడు గర్భం దాల్చాను అదీ ఏ మందులు పూజలు లేకుండా. నా చిట్టి తల్లి చేతులు నా కడుపును నిమురుతుంటే ఎటువంటి ఆటంకo లేకుండా ఒక శుభముహూర్తాన నా చిట్టితల్లికి దేవుడు తమ్ముడిని ప్రసాదించాడు. మావారికి వంశోద్ధారకుడు. నాకు మాత్రం నా కుతురే సర్వస్వం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *