April 27, 2024

మారిపోయెరా కాలం

డా. కె. మీరాబాయి

ముందుగా ఒక మాటకూడా చెప్పకుండా సెలవు పెట్టి వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్య పోయింది భారతి.
పోయిన నెలలోనే బెంగుళూరు వెళ్ళి కొడుకు ఇంట్లో పదిహేను రోజులు వుండి వచ్చింది.
ముప్ఫై అయిదేళ్ళు దాటుతున్నా పెళ్ళి కాని కొడుకు పరిస్థితి తలచుకుంటే భారతికి దిగులుగా వుంటుంది.
ఒక అచ్చటా ముచ్చటా లేదు…..పండుగా పబ్బమూ లేదు. పొద్దున్నే ఆ ఎం ఎన్ సి కంపెనీకి పోవడం రాత్రికి వరకు పనిచేసి గూడు చేరడం గానుగెద్దు జీవితం గడుపుతున్నాడు.
చేతి నిండా డబ్బు, ఇంటినిండా అధునాతన సామగ్రి. దేనికీ లోటులేదు. జంటకు తప్ప.
కొడుకు ఒంటరి జీవితం గురించి ఆలోచిస్తే భారతి తల్లి మనసు తల్లడిల్లి పోతుంది.
మూడు నెలలకు ఒకసారైనా బెంగుళూరు వెళ్ళి కొడుకు దగ్గరకు పది రోజులు వుండి వస్తుంది. సెంట్రల్ స్కూల్లో టీచర్ గా పనిచేసిన భారతి ఒక్కగానొక్క కొడుకు వుద్యోగంలో చేరాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది.
భారతి భర్త రాఘవకు ఇంకా అయిదేళ్ళ సర్వీస్ వుంది.
ఇటు భర్తను వదిలి ఎక్కువ రోజులు మారుతి దగ్గర వుండలేందు. అంటూ పండుగనాడు కూడా పావ్ భాజీ తిని కడుపు నింపుకునే కొడుకును తలచుకుంటే చేసుకున్న పరవాన్నం చేదుగా అనిపిస్తుంది ఆమెకు.
నెట్టికంటి ఆంజనేయస్వామికి మొక్కుకుని వచ్చాక కడుపున పడ్ద తనయుడికి ఎంతో ఇష్టంగా మారుతి అని పేరు పెట్టుకుంది. తమ వంశోద్ధారకుడు ఆ రామదూత లాగా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా ఆన్న భయం పట్టుకుంది భారతికి ఈ నడుమ.
నెలక్రిందట దీపావళికి రాఘవను కూడా బయల్దేరదీసింది బెంగుళూరుకు. కొడుకు ఇంట్లో దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. అనంతపురం నుండి వచ్చేటప్పుడే కొబ్బరి బొబ్బట్లు, నిప్పట్లు, చక్కిలాలు, మడతకాజాలు తీసుకుని వెళ్ళింది.
నాలుగు రోజులు వుండి రాఘవ వెళ్ళిపోయాడు. భారతి మరో వారం రోజులు వుండి వచ్చింది.
పదిహేనురోజులకే వున్నట్టుండి వూడిపడ్డ కొడుకుని చూసి సంతోషంతో బాటు ఆశ్చర్యమూ కలిగింది ఆమెను.
పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తున్నాము ఒక పూట రమ్మని అంటేనే “ పని ఎక్కువగా వుంది కుదరదు అనేవాడికి సెలవు ఎలా దొరికిందో అర్థం కాలేదు ఆమె
పెళ్ళికూతుళ్ళను చూసి చూసి ఏదీ కుదరక విసిగి పోయిన కొడుకు ఇలా హఠాత్తుగా వచ్చాడు అంటే ఏదైనా శుభవార్త వుందా? ఈ మధ్యన ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి ప్రొఫైల్ నచ్చి స్నేహం చేసాడు. ఆక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? “ నెట్టికంటి ఆంజనేయా అదే నిజమైతే నీకు కొత్త చెప్పులు సమర్పించుకుంటాను “ అని మనసులోనే మొక్కుకుంది భారతి.
భారతి కొడుకు పెళ్ళిగురించి ఇంతగా బెంగ పెట్టుకోడానికి చాలా కారణాలే వున్నాయి
పదేళ్ళ క్రిందట మొట్టమొదటిసారి మారుతికి పిల్లని చూడ్డానికి వెళ్ళిన రోజు భారతికి బాగా గుర్తుంది.
మగపిల్లవాడి తల్లి అన్న హోదాలో కించిత్ గర్వం తొంగి చూస్తుండగా ఖరీదైన జరీ అంచు పట్టుచీర కట్టి, తమ సంపద చూపేలా నగలు ధరించి, హుందాగా వెళ్ళింది.
హైదరాబాదు చిక్కడపల్లిలో త్యాగరాజ గానసభ వెనుక వైపు సందులో వాళ్ళ ఇల్లు.
అమ్మాయి బాగానే వుంది. పెళ్ళిసంబంధం మాట్లాడింది పిన్ని బాబాయి అట.. పెళ్ళికూతురికి తల్లి లేదు. పనీ పాటా వచ్చును. చదువు వుద్యోగం వున్నాయి. కొడుకు సుముఖంగానే వున్నాడనిపించింది.
భారతికే కాస్త అసంత్రుప్తిగా వుంది. ఇంటికి వచ్చాక కొడుకుతో మనసులోని మాట చెప్పింది.
“అత్తగారు లేని ఇంట అల్లుడికి ఆకేసి అన్నం పెట్టి మర్యాద చేసేదెవరు? రేపు పురుడు పుణ్యం అంటే చేసేదెవరు? ఏ ముచ్చటా తీరదు. “ అని.
“ నిజమే కదా ! మొదటి సంబంధానికే తొందరపడడం దేనికి? ఇంకా అందమైన అమ్మాయి తనకు రాసి పెట్టి వుందేమో “ అనుకుని అమ్మ మాట ప్రకారం వూరుకున్నాడు.
రెండో ప్రయత్నంలో పెళ్ళికూతురి ఫోటో చూసి బాగుందనుకున్నారు. జాతకాలు కుది రాయి.
అమ్మాయి ఎకనమిక్స్ లో బి ఏ చేసి చిన్న వుద్యోగం చేస్తొంది.
“బి టెక్ చదివిన అమ్మాయి అయితే బాగుంటుంది కదమ్మా “. అన్నాడు మారుతి ఆలోచిస్తూ. నిజమే. ఉన్నది ఒక్క కొడుకు. కోడలు ఇంజినీరు అయితే గొప్పగా వుంటుంది అనుకుంది అమ్మ.
తరువాతి చూసిన పిల్ల చాలా బాగా ఆస్థిపాస్థులు వున్నవాళ్ళు. అమ్మాయిలో ధనదర్పం బాగానే కనబడింది.
“ మా అమ్మాయి ఇటుపుల్ల అటు తీసి పెట్టే అవసరం లేకుండా పెంచాము. వంట ఇంటి వైపుకే వెళ్ళదు. ఇల్లరికం అల్లుడు దొరికితే బాగుండుననుకున్నాము కానీ.. “ అంది పిల్ల తల్లి.
“ చదుకుంటున్నపుడూ, వుద్యోగం వచ్చాకా తానే వండుకుని తింటున్నాడు. పెళ్ళయ్యాక ఇద్దరికీ వండాలి కాబోలు బాబోయ్ అని భయపడ్డాడు మారుతి.
ఆడంబరాలు లేని ఇంట పెరిగాడు. మంచి జీతం వస్తున్నా అలాగే బ్రతుకుతున్నాడు. ఆమెను తను భరాయించలేడు అనుకుని మిన్నకున్నాడు మారుతి
నాలుగేళ్ళు గడిచి పోయాయి. చదువు, జాతకం కుదిరిన మరో సంబంధం ఇంకో కారణం తో వీగిపోయింది. వాళ్ళకు ఇద్దరూ ఆడపిల్లలే. పెద్ద పిల్ల పెళ్ళైన ఏడాదిలో అత్తవారిమీద గ్రుహహింస కేసు పెట్టి మరీ విడాకులు తీసుకుందని తెలిసి అదిరి పోయారు అమ్మా కొడుకులు.
“ఇక మా వల్ల కాదు కానీ ఇంటర్ నెట్లో చూసుకోరా “ అనేసింది భారతి.
ఆ ప్రయత్నమూ కలిసి రాలేదు మారుతికి.
సన్నజాజి మొగ్గలా నాజూకుగా,తెల్లగా, అందంగా వున్న అమ్మాయి స్కైప్ లో మారుతిని చూడగానే “ మీరు జిమ్ము కి వెళ్ళరా? కాస్త డైటింగ్ చేసి, బరువు తగ్గితే స్మార్ట్ గా వుంటారు “ అందిట అప్పుడు ఆలోచిస్తాను అన్నట్టు.
బారెడు జుట్టుతో షాంపూ ప్రకటన మోడల్ లా వున్న అందగత్తెకు మారుతి జుత్తు నచ్చలేదు.
“మీ జుత్తు అంత పల్చగా వుందేమిటి? బట్టతల వచ్చేస్తుందేమో ! హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకో వచ్చుగా అని సున్నితంగా సూచించింది.
ఈ దెబ్బతో మారుతికి కొత్త దిగులు పట్టుకుంది “ ముప్ఫై ఏళ్ళు దాటుతుండగానే తనకు బట్టతల వచ్చేస్తుందా అని.
“ ఆ పిల్లకు తనకు ఇంత బారు జుట్టు వుందని గర్వం లేరా. “ అని సముదాయించింది భారతి.
అమ్మ మాటలతో స్థిమితపడ్డాడు.
మరోసారి మారుతి స్నేహితుడి పిన్ని కూతురిని చూసారు. కంపూటర్ ఇంజినీరింగ్ లో పి.జి. చేసి పేరున్న ఎం. ఎన్.సి లో పనిచేస్తోంది. బాబ్డ్ హెయర్, జీన్స్ లో అల్ట్రా మోడ్రన్ గా వుంది. పబ్ లు, పార్టీ లు గురించి మాట్లాడింది. ఆఖరి గా “ మీకు బాగేజి ఏమీ లేదుకదా “ అంది.
బాగేజి అంటే అమ్మా నాన్నల బాధ్యత అని అర్థం అయ్యాక దండం పెట్టి వూరుకున్నాడు.
ఇంకో అమ్మాయి మొదటి మాటే “ నా సంపాదన గురించి నా పార్ట్ నర్ అడగడం నాకు నచ్చదు. ఇంటి ఖర్చులు సగం పంచుకుంటాను. మిగతాది నా వ్యక్తిగతం. మా అమ్మ డివొర్సీ. నాతోనే వుంటుంది. “ అంటూ వ్యాపార బంధంలా మాట్లాడింది.
ఈ కాలం ఆడపిల్లలకు చదువు, సంపాదన వుండడం వలన ఆత్మ విశ్వాసం, తమ దైన వ్యక్తిత్వం పెరిగింది. తమకు ఏమి కావాలో ఆన్న విషయంలో స్పష్టమైన అభిప్రాయాలు వున్నాయి. ఒకప్పటిలాగా పెళ్ళికొడుకు ఒప్పుకుంటే చాలు పెళ్ళి కుదిరినట్టే అనే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నది ఆడపిల్లలే. వరకట్నం స్థానం లో కన్యాశుల్కం వస్తుందో రాదో గానీ స్వయంవరం అన్న పద్ధతి మాత్రం మొదలయింది అన్న విషయం భారతి,రాఘ ల వంటి తలిదండ్రులకు తెలిసి వస్తోంది..
ఈ మధ్యన ఫేస్ బుక్ లో పరిచయం ఆయిన ఒక అమ్మాయి గురించి కొడుకు ఆసక్తి చూపడం తెలిసిన భారతి ఆ విషయం గానే మారుతి వచ్చాడేమో అని ఆశ గా అడిగింది “ ఏమంటున్నదిరా నీ ఫ్రెండ్ రమ్య? “ ఆని
“ అమ్మా నువ్వు నొచ్చుకోకు. ఏమన్నదీ అంటే “ మొదట మీ పేరు మార్ఛు కోండి బాబూ! అయినా అదేం పేరు? ముద్దుగా పిలవాలంటే ‘ మారూ’ అనాలా, ‘మారో ‘ అనాలా ? గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి మంచి పేరు పెట్టుకోండి. కావాలంటే నేనే సెలెక్ట్ చేస్తాను అంది. అన్నాడు మారుతి.
ఆ మాటలు విన్న రాఘవ, భారతి విస్తుబోయారు.
“ ఎంత పొగరు చూసారా ఈ కాలం ఆడపిల్లలకు. “ కోపంగా అంది భారతి.
రాఘవ సాలోచనగా తలవూపాడు.
“ భారతీ! మన పెళ్ళి నిశ్చయ మైనప్పుడు మా అమ్మా వాళ్ళు మన జాతకాల ప్రకారం నీ పేరు భారతి అని మార్చుకోమంటే నువ్వు కాదనలేదు. అవునా? “ అన్నాడు.
భారతి కోపం చప్పున చల్లారి పోయింది. ఏమీ సమాధానం చెప్పలేనట్టు మౌనం వహించింది.
“కాలం మారిపోయిందమ్మా. ఆడపిల్లకు పెళ్ళి అయితే చాలు అనుకునే రోజులు కావమ్మా ఇప్పుడు. ఈ తరం అమ్మాయిలు పెళ్ళి జీవితం లో ఒక భాగమే తప్ప అదే జీవిత లక్ష్యం అనుకోరు. అంతే కాదు. తమ ఇష్టాఇష్టాలను గౌరవించే భాగస్వామి కోసం ఎదురు చూస్తారే గానీ మనసుకు నచ్చని విషయం లో సర్దుకు పోదాము ఆన్న భావనకు తావివ్వరు. “ మారుతి నెమ్మదిగా అన్నాడు.
“ ఆ ఆంజనేయ స్వామి దయవలన పుట్టినవాడవురా.ఆ పేరు ఎలా మారుస్తాము? “ కుదరక కుదరక కొడుకు పెళ్ళి కుదరబోతుంటే కాదనలేక భారతి నిస్సహాయం గా చూసింది.
“అందుకే ఒక ఉపాయం ఆలోచించాను అమ్మా! నా పేరు చివర తనకు నచ్చిన పేరు చేరుద్దాము. అప్పుడు నీ దేవుడికీ కోపం రాదు.. సరేనా? “ మారుతి మధ్యే మార్గం సూచించాడు.
“ మారుతీ చరణ్ అని పెట్టుకుంటానంటే తను సంతోషంగా ఒప్పుకుంది. రమ్యకు చిరంజీవి, రాం చరణ్ అంటే ఇష్టం. నీకు ఒకె కదమ్మా ! “ మారుతి అమ్మ వైపు బ్రతిమాలుతున్నట్టు చూసాడు.
“నీకు అన్నీ ఒకె అయిటే అమ్మ కాదు అనదులేరా. పెళ్ళి కుదిరినందుకు ఆ నెట్టికంటి ఆంజనేయ స్వామికి కొత్త చెప్పులు సమర్పించి మొక్కు తీర్చుకుంటుంది.” రాఘవ కొడుకు భుజం తట్టాడు.
“ అవును నాన్నా నువ్వు సంతోషంగా వుంటే నాకు అదే చాలు.” చిరునవ్వుతో అంది భారతి.

. ——————. —————— —————-

1 thought on “మారిపోయెరా కాలం

Leave a Reply to మాలిక పత్రిక మార్చ్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *