March 30, 2023

మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు

రచన:సి. ఉమాదేవి

డా. లక్ష్మిరాఘవ గారు సాహిత్యానికే కాదు తనలోని కళాభిరుచికి నైపుణ్యాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందించి ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు. వృధాగా పారెయ్యవలసిన వస్తువులను కళాత్మకంగా వినియోగించడంలోనే వీరి ప్రతిభ ఆవిష్కృతమవుతుంది.
వనిత మహావిద్యాలయలో రీడర్ గా పదవీ విరమణ చేసాక తన సమయాన్ని సాహితీబాటలో విహరింపచేస్తున్నారు. చక్కని కథలతో ఆత్మీయులు అనే కథాసంపుటిని మనకందించారు. ఇరవైమూడు కథలున్న ఈ పుస్తకంలో ప్రతి కథ మనసును తట్టిలేపుతుంది. తద్వారా ఆలోచనకు పునాది పడుతుంది. ఎందుకంటే ప్రతి కథ సామాజికాంశాలను స్పృశిస్తుంది. సమస్యలను పరిష్కారానికి వదిలివేయక ప్రశ్నలు సంధించి మన మేధను మేల్కొలుపుతారు. ఒకొక్కసారి వారందించిన పరిష్కారాలు మన మనసులను తృప్తి పరుస్తాయి. కథాసంపుటిలో మొదటి కథ ఆత్మీయులు. అవయవదానం గురించి తెలిసినా ఉలిక్కిపడే మనస్తత్వం ఉన్నవారు తప్పక చదవాల్సిన కథ. కొడుకు రాకేశ్ ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పినపుడు తమ కొడుకు అవయవాలను ఇతరుల అవసరాలకు అందించి తల్లిదండ్రులు కొడుకును అమరుడిని చేస్తారు. అవయవాలను అమర్చుకున్న వారిని ప్రతి సంవత్సరం రాకేశ్ పుట్టిన రోజున కలుసుకుని వారిలో తమ బిడ్డను చూసుకునే ఆ తల్లిదండ్రులకు ప్రణమిల్లాలనిపిస్తుంది.
పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని పిల్లలే కాదు పెద్దలు అందిపుచ్చుకోవాలనే సందేశం అవగతమవుతుంది. ఎద్దుల బండి,గుర్రపు బండినుండి కార్లు,ఆటోలు వరకు మార్పును ఆహ్వానించాం. అదే రీతిలో కంపెనీ ఎదుగుదల టెక్నాలజీతో పెరుగుతుందంటే అందులో పనిచేసే సీనియర్లు కూడా సాంకేతిక విజ్ఞానాన్ని ఆహ్వానించాలి అని కంపెనీ మానేజర్ రాజేష్ చెప్పిన సోదాహరణ ప్రసంగం అందరి అభినందనలందుకుంటుంది.
ఇక ఒక అమ్మ కథ అమ్మ దీనగాథను వివరిస్తుంది. మనసును నులిమేసే కథ. కూతురి నిస్సహాయత వెనుక అమ్మ జీవితం వృద్ధాశ్రమంబారిన పడటం మనసును కుదుపుతుంది. సహాయం కథ సాధారణంగా జరిగే విషయమే అయినా కథనంలో వచ్చిన మలుపులు కథలో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. వైద్యానికయే ఖర్చును భరించడం కష్టమే. అయితే ఆపన్నహస్తం అందించే వారున్నప్పుడు మనిషిలోని నిజాయితీకి దేవుడు తప్పక సహాయం చేస్తాడనడం ఈ కథలో నిజమేననిపిస్తుంది.
మోసంచేసి సంపాదించేవారిని ఎందరిగురించో తెలుసుకున్నా ఏమరుపాటు మనిషిని మళ్లీ మోసానికి బలిచేస్తుంటుంది. కొత్తచీరలు తెచ్చానని ఇంట్లోనే వ్యాపారం చేసే కుసుమ లేరు కాబట్టి మీ దగ్గర పెట్టుకుని ఒక్క ఐదువందలిమ్మని అడిగిన వ్యక్తికి సందేహపడకుండా ఇచ్చి అతడు వెళ్లిపోయాక సూట్ కేస్ లో ఉన్నది పాత చీర,రాళ్లు,అట్టముక్కలు అని తెలుసుకోవడం మోసపోయేవారికి ఓ హెచ్చరికే. అభిప్రాయం కథ రచనలు చేసేవారి మానసిక సంఘర్షణను తెలియచేసిన కథ. కథ ప్రచురింపబడినపుడు సద్విమర్శలు,అభినందనలు ఒక్క పళ్లెంలోనే వడ్డించబడతాయి. అయితే రచనాపరంగా తమ మానసిక విశ్లేషణను సవివరంగా సభలో వివరించగలగడం ఈ కథను ఉన్నత శిఖరాన కూర్చోబెడుతుంది. ఒక విమర్శ కొత్త ఆలోచనలకు దారితీసి మరింత మెరుగైన సాహిత్యం వెలువడుతుందనీ, కొత్త తరం కొత్త పోకడలతో సమాజంలో మార్పులకు తప్పక దోహదపడగలదని చెప్పడం బాగుంది. మంచి మనసున్న మనుషులను దేవుడు తప్పక ఆదుకుంటాడనే సత్యాన్ని వినిపించిన ఆటో కథ.
తల్లికి పిల్లలెందరున్నా అందరినీ కోడి తన రెక్కల క్రింద పొదువుకున్న చందాన ప్రేమలో వ్యత్యాసాలుండవు. అయితే కష్టాలలో ఉన్న పిల్లలకు ధైర్యం ఇచ్చే తల్లిని అపార్థం చేసుకోవడం సాధారణంగా చూస్తుంటాం. ఇదే అమ్మ ప్రేమలో తేడా కథ విశదపరుస్తుంది.
పుస్తకం ఆత్మకథ నేను అక్షరాభిరుచి కలవారి మనసును కలతపరిచే కథ. అందరి చేతులలో కొత్త పుస్తకంగా ఒదిగి పాతబడినాక పాతపేపర్లు అమ్ముకునే వ్యక్తి దగ్గరకు చేరి ఫుట్ పాత్ పై ఉన్న పుస్తకాన్ని ప్రేమతో ఆర్తిగా అందుకున్న పుస్తక ప్రేమికుడి చేతిలో ఆప్యాయతనందుకుంటుంది పుస్తకం.
సమిష్టి కుటుంబంలో అందరి ప్రవర్తనలో విభిన్నత గోచరిస్తుంది. అయితే ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ,ఆప్యాయత ఇతరులలోని తప్పొప్పులను పట్టించుకోరు. అయితే నానమ్మ కథలో భారతమ్మ ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటూ తన మాటే నెగ్గాలనే ధోరణిలో ఇతరులను ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అయితే నానమ్మను ఆశ్రమంలో వదిలిపెట్టి భారతమ్మలో మార్పును కోరుతారు. అన్నదమ్ముల అనురాగ బంధాన్ని పారదర్శకం చేసిన కథ ఆలోచన. పిల్లలలో మనసును స్పందింపచేసిన కథ ఎడం. పూల పరిమళమందించిన కథ తోటలో ఒక రోజు. చక్కని కథలతో అలరించిన డా. లక్ష్మి రాఘవగారికి అభినందనలు.

2 thoughts on “మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు

  1. విశ్లేషకులు చూసే దృష్టి ఎలావుంటుందో అన్న తపన ప్రతి రచయితకూ తప్పదు. ఎందుకంటే రచయిత భావనలకు అద్దం పట్టి చూపేవి అవే! వారు స్పందించినవి తన ఆలోచనలంకు తగ్గరీతి లో ఉంటే ఎంత సంతోషమొ ! “ ఆత్మీయులు “ అన్న నా కథా సంపుటి లో కథలను చక్కగా వివరించి చదివే వారికి ఆసక్తి కలిగించేలా సమీక్ష చేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
    నా లోని ఆర్టిస్టు కు ఒక ప్రత్యేకతనను ఇఛ్చినందుకు స్పెషల్ ధన్యవాదాలు ఉమా గారు. ఎలాటి ట్రైనింగ్ లేకుండా నాకు తోచినది చేస్తున్నా మీ లాటి వారి మెప్పును పొందగలుగు తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

June 2020
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930