June 25, 2024

చంద్రహారం.

రచన- కిరణ్మయి గోళ్లమూడి.

“ఈ ఏడాది ఇల్లు సంగతి చూడు సూర్యం! గోడలు పెచ్చులూడిపోతున్నాయి! కాంపౌండ్ గోడ విరిగిపోయింది. నీకు చాలా ఖర్చు ఉంది!” అంది కౌసల్య కంచంలో మిరప పళ్ళ పచ్చడిలో కాచిన నెయ్యి వడ్డిస్తూ.
“అవునమ్మా!.. పంట డబ్బు చేతికి వచ్చాక ఇల్లు బాగు చేయిద్దాం! ఉగాదికి రెడీ అయిపోతుంది!” అన్నాడు సూర్యం ముద్ద నోట్లో పెట్టుకుంటూ.
“సున్నాలు వేసి కూడా ఆరేళ్ళయింది.” పాతబడి పోయి, వెలిసి పోయిన గోడలు చూస్తూ దిగులుగా అంది కళత్రం నీరజ.
“ఎలాగూ ఇల్లు బాగు చేయిద్దాం అనుకుంటున్నాం కదా! అప్పుడే సున్నాలు వేయిద్దాం.” కంచంలో చెయ్యి కడుగుకుని లేచాడు సూర్యం.
“నాన్నా నాకు బండి కొంటా అన్నావుగా!” డిగ్రీ చదువుతున్న రవి కళ్ళలో అర్థింపు.
“ఈసారికి వాయిదా వేద్దాం రవీ. ముందు ఇల్లు సంగతి చూద్దాం.” రవిని అనునయిస్తున్నట్లు అన్నాడు సూర్యం.
“మరి నా బుట్ట కమ్మలు!” అంది శ్రావణి గడుసుగా. “నీకు తప్పకుండా చేయిస్తా తల్లీ! లేకపోతే నువ్వు నా బుర్ర తినేయవూ!” తండ్రి గొంతులో గారాం.
“అన్నీ దానికే కొంటారు.. నా వరకు వచ్చేసరికి అన్నీ గుర్తు వస్తాయి.. నేను ఒప్పుకోను! ఈ సారి నాకు బండి కొనవలసిందే.” నెమ్మదిగా డిమాండ్ స్థాయికి పెరిగింది రవి స్వరం.
“సరే! నువ్వు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అప్పుడు తప్పక కొంటాను. ఇప్పుడు మాత్రం ఓపిక పట్టాల్సిందే!” నవ్వుతూ అన్నా స్థిరంగా ఉంది సూర్యం గొంతు.
శ్రావణి బొటన వేలు అన్నకు చూపి నవ్వింది…నా బుట్ట కమ్మలు గ్యారంటీ అన్నట్లు చూస్తుంటే రవి ఉడుక్కుంటూ తల్లి వైపు చూశాడు.
కొడుకు, కూతురు వైపు సాలోచనగా చూసింది నీరజ. రవి నీరజ వైపు చూసిన చూపులో కోపానికి అర్థం ఉంది. ఎప్పటి నుండో అడుగుతున్నాడు రవి బండి కొనమని. ఏ ఏటికాఏడు ఏదో ఒక ఇబ్బందితో వాడి కోరిక తీర్చలేక పోతున్నారు.
ఈసారి కూడా తన టెండరు హుళక్కి అని అర్థం అయిన రవి మొహంలో అసంతృప్తి గమనించింది నీరజ. నేను మాట్లాడతాను అన్నట్లు సంజ్ఞ చేసింది.
సూర్యం నాల్గవ తరగతి ఉద్యోగి. భర్తకు వచ్చే ఆదాయంతో చాలా నేర్పుగా ఇల్లు చక్కదిద్దుతుంది నీరజ. పిల్లల కాలేజీ ఫీజులకు చాలా ఖర్చు అవుతోంది. సహజంగా పొదుపరి అయిన నీరజ జమా ఖర్చుల విషయంలో నిక్కచ్చిగా, పొదుపుగా ఉంటుంది…అనవసరంగా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టదు. ఆమె నిజంగా వరమే సూర్యానికి.
“నా పాత దుద్దులు మార్పించి శ్రావణి కి బుట్ట కమ్మలు చేయిస్తా కానీ ఈసారి వాడికి బండి వాయిదాల పైన అయినా తీసుకోండి.” అంది నీరజ.
“సరే చూద్దాం.. ముందు పంట సొమ్ము చేతికి రానివ్వండి!” తండ్రి గొంతులో విన్పిస్తున్న సౌమ్యతకు రవి మొహంలో నవ్వు విరిసింది.
“మరి నీకు ఏమీ అక్కరలేదా? నీ నుండి ఏమీ టెండరు లేదు?” సూర్యం గొంతులో వినిపిస్తున్న అల్లరికి నమస్కారం చేసింది నీరజ.
వింటున్న కౌసల్య నిట్టూర్చింది..తన పేరుతో ఉన్న మూడు ఎకరాల పొలంలో వరి పండుతుంది.. మూడేళ్ల నుండి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు, తుఫానులతో నష్టం వస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకుండా.
ఈసారి దేవుని దయ వలన పంట చేతికి వచ్చింది. ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే రెండు మూడు రోజుల్లో మార్కెట్ కి పంపే యోచనలో ఉన్నాడు సూర్యం.
“అమ్మా!” అన్న సూర్యం పిలువుతో కళ్ల మీద పెట్టుకున్న చేతులు తొలగించి చూసింది కౌసల్య. మంచం మీద లేచి కూర్చుంది.
“అమ్మా! రాధ ఫోన్ చేసింది. ఈసారి పండక్కి రావడం కుదరదు అంటోంది!”
కౌసల్యకు విషయం అర్ధం అయ్యింది…క్రితంసారి వచ్చినప్పుడే గట్టిగా చెప్పి వెళ్ళింది రాధ. నాలుగు వరుసల చంద్రహారంలో రెండు వరసలు తీయించి తనకు మరి కొంత పైకం వేసి నెక్లెస్ చేయించి ఉంచమని చెప్పింది. తనకే మనసు ఒప్పటం లేదు. అది అత్త గారి నుండి ఆమెకు సంక్రమించిన నగ. ఆమె గుర్తుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ వస్తోంది.
ఆ చంద్రహారం కౌసల్య ఎక్కువగా వేసుకున్నదీ లేదు.. ఎక్కువగా వాడితే పుటుక్కున ఎక్కడ విరుగుతుందో అని వేసుకున్న ప్రతిసారీ తడుముతూ ఉండటమే.
ఎప్పుడూ ఎక్కువగా బ్యాంక్ లోన్ తీసుకోవటానికి అక్కరకు వస్తోంది.. ఇప్పుడు కూడా ఋణం తీసుకొని పంట నిమిత్తం వాడారు. ఆ విషయం రాధకు తెలుసు.. పంట చేతికి వచ్చిందని సూర్యం విడిపిస్తాడని రాధకు తెలుసు…
కౌసల్య మౌనంగా ఉండటం చూసి “అమ్మా! పోనీ ఇల్లు సంగతి వాయిదా వేసుకుందాం. రాధ కోరినట్లు చేద్దాం” అన్నాడు.
“లేదు సూర్యం! ఆ చంద్రహారం మార్చే ఆలోచన లేదు. అది మీ బామ్మ గుర్తుగా నేను ఉన్నన్నాళ్లు ఉంటుంది. మనల్ని ఆదుకోవటానికి ఉన్న ఆధారం నేను వదలను. రాధకు నేను గట్టిగానే చెప్పాను, దాని మీద ఆశ వదులుకొమ్మని. అక్కడికి అది వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అడిగి తీసుకు వెళుతూనే ఉంది. నువ్వూ అవసరాలు వాయిదా వేసుకుంటూ దాని కోరికలు తీరుస్తూనే ఉన్నావు. ఇలా ఎంత కాలం సూర్యం? నీ పిల్లలు చదువులు కూడా తక్కువ కాదు. రాధ సంగతి ఇప్పుడు ఆలోచన చేయకు.. ఈ పండుగకు కాకపోతే మరో పండుగకు వస్తుంది లే!” అంది కౌసల్య మంచం మీద వాలుతూ. ఇంక ఆ విషయంలో మాట్లాడేది ఏమీ లేదన్నట్లుగా కౌసల్య కళ్ళు మూసుకోవటం చూసి తన గదిలోకి నడిచాడు సూర్యం.
కనులు మూసినా కౌసల్య అంతరంగం చంద్రహారం చుట్టూ తిరుగుతోంది. అది అత్త గారికి ఎంతో ఇష్టమైన నగ.. ప్రతి పండుగకు ఆమె మెడలో మెరుస్తున్న చంద్రహారం వైపే ఉండేవి తన చూపులు ఎప్పుడూ.. అది గమనించి బయట పేరంటానికి వెళ్ళినప్పుడు బయలుదేరేముందు బోసిగా ఉందంటూ తన మెడలో వేసేది. అద్దములో చూసుకుంటూ మురిసిపోతుంటే ఓరగా చూసి నవ్వుకునేది. ఆఖరి రోజుల్లో ఏమనుకుందో కోడలి చేతిలో పెట్టి కన్ను మూసింది.. ఆలోచిస్తూనే నిద్రలోకి జారింది కౌసల్య.
అనుకున్న ప్రకారం పంట డబ్బు చేతికి రావటంతో ఇల్లు బాగు చేయించి సున్నాలు, రంగులు వేయించి కొత్త కళని తీసుకు వచ్చారు ఇంటికి.. రెండు రోజులు ముందుగా వెళ్లి రాధని, బావని తీసుకు వచ్చాడు సూర్యం… ముందు కాస్త భయపడినా, మొహం మాడ్చుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి సంతోషించింది కౌసల్య..
రాధ ఏమీ జరగనట్టు మామూలుగా ఉండటంతో కౌసల్య మనసు కాస్త కుదుటపడింది. పండుగ సంతోషంగా గడిచింది. వాళ్ళు ఉన్న రెండు రోజులు ఇల్లు సందడిగా ఉంది. పిల్లలు అత్తా అంటూ రాధ వెనక తిరుగుతూ హడావిడి చేశారు.
“రాధా! ఈసారి పంట డబ్బు ఇంటికి ఖర్చు పెట్టాం. ఇల్లు చాలా ఏళ్ల నుండి అశ్రద్ధ చేశాం. వచ్చే ఏడు అన్నయ్య నీకు నచ్చిన వస్తువు కొంటాడు” అంది కౌసల్య రాధ బయలుదేరే ముందు.
“అమ్మా! నిన్ను నగల గురించి నేను అడగను… నాకు మా అత్తగారు తన మామిడి పిందెల నెక్లెస్ కానుకగా ఇచ్చారు నా పుట్టిన రోజుకు. అయితే ఒక కండిషన్ పెట్టారు. “నువ్వు ఇక మీదట మీ అమ్మను ఏమీ అడగకూడదమ్మాయ్!” అన్నారు.
“మా అత్తగారు ఇచ్చిన కానుక నాకు చాలా నచ్చింది. ఆ కానుక ఆమెకు వాళ్ళ అత్తగారు ఇచ్చారట. ఆ మాట ఆవిడ నాకు ఎంతో సంతోషంగా చెబుతున్నప్పుడు నాకు నువ్వే గుర్తు వచ్చావు. బామ్మ ఇచ్చిన కానుక అని చెబుతున్నప్పుడు నీ కళ్ళల్లో మెరుపు ఆ చంద్రహారంలో కనబడేది.. అదే మెరుపు మా అత్తగారి కళ్ళలో చూశాను. నిన్ను అనవసరంగా బాధించినందుకు నన్ను క్షమించు అమ్మా!” అంటున్న రాధ ను ఆశ్చర్యంగా చూసింది కౌసల్య.
“అమ్మా! మరో సంగతి..నీ చంద్రహారం నీవు అనుకున్నట్లుగా వదినకు ఇవ్వు.. అందులో రెండు వరుసలు నేను అడిగానని నువ్వు నొచ్చుకున్నావు.. మా అత్తగారి మాటలు విన్నాక నా తెలివితక్కువ తనం నన్ను వెక్కిరించింది. వారసత్వం విలువ అర్థం అయింది.” అంది నవ్వుతూ.
వియ్యపురాలు తన సమస్య ఇలా పరిష్కరించి కూతురు మనసు దోచుకుందని గ్రహించింది కౌసల్య.. ఎన్నాళ్ళు గానో తన మనసులో ఉన్న కోరిక తీరబోతున్నందుకు కౌసల్యకు కూడా సంతోషంగా ఉంది.
తన గదిలోకి వెళ్లి బీరువా తెరిచింది.. బ్యాంక్ లోను చెల్లించి సూర్యం తీసుకు వచ్చిన చంద్రహారం చేతిలోకి తీసుకుంది.. వస్తూ వస్తూ మెరుగు పెట్టించి తీసుకు రమ్మని చెప్పిన మాట తూ చ తప్పకుండా తెచ్చాడు సూర్యం..
ఆమె పెదవి పై చిరునవ్వుతో పోటీ పడుతూ చేతిలో తళుక్కున మెరుస్తున్న చంద్రహారంతో కోడలి గదిలోకి కదిలింది కౌసల్య.
***************

1 thought on “చంద్రహారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *