April 26, 2024

“మూలాలు”

రచన: విజయలక్ష్మీ పండిట్

కృష్ణచైతన్యకు ఆ రోజు ఒకచోట కాలు నిలవడం లేదు. తమ్ముడు శ్రీ రమణ ఫామిలీతో క్రిస్మస్ సెలవులలో అమెరిక నుండి ఇండియా వస్తున్నాడు.
శ్రీరమణ, జయలక్ష్మి , పిల్లలు ఆదిత్య ,ఆద్య వాళ్ళందరితో గడపడం కృష్ణకు సుజాతకు పండగ.
వాళ్ళందరికి ఎవరెవరికి ఏమి ఇష్టమో రాసుకుని తెచ్చి పెట్టడం, రమణ కోసం కొత్త నవలలు , కథల పుస్తకాలు కొనిపెట్టే హడావిడిలో వున్నాడు కృష్ణ చైతన్య.
సుజాత భర్త హడావుడి గమనిస్తూనే రమణకు ,పిల్లలకు ఇష్టమయిన తినుబండారాలు చేసి పెడుతూంది.
“సుజి రమణకు నీవు చేసే బూందీ లడ్డు ఇష్టం చేస్తున్నావా “ అంటూ హడావిడిగా వంటింటిలోకి వచ్చాడు కృష్ణ .
భర్తను చూస్తూ”లడ్డు వాసన పట్టేశారన్నమాట” అంటూ తాను చేతులలో ఒత్తుతూన్న చిన్న లడ్డూను భర్త నోటి కందించింది.
“పచ్చకర్పూరం జీడిపప్పు ద్రాక్ష వేసి నీవు చేసే లడ్డు విజయవాడ దుర్గ గుడి ,తిరుమల లడ్డు ప్రసాదంలా రుచిగా వుంటుంది సుజా” అన్నాడు
కృష్ణ లడ్డు రుచిని ఆస్వాదిస్తూ.
“అవునూ..,మనం తిరుమలకు వెళ్ళాలనుకన్నాము కదా రమణ ఫామిలితో, ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేయాలి” అంటూ వెళ్ళాడు హడావుడిగా .
భర్త వెళ్ళిన వైపే చూస్తూ నిట్టూర్చిన సుజాత మనసులో ఆలోచనలు ముసురుకున్నాయి.
“ఎక్కడ పుట్టామో ? ఎవరి మూలాలు ఎక్కడో ?…ఎవరికెవరు రాసిపెట్టి ఈ అనురాగ బంధాలు అల్లుకుంటాయో ? ఇదేనేమో విధి రాత
అంటే ..పిల్లలు లేని మాకు దేవుడిచ్చిన మరిది శ్రీరమణే కొడుకైనాడు “ అనుకుంటూ లడ్డులు వత్తుతున్న సుజాతను ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.

***

కృష్ణచైతన్యతో తన పెండ్లి ఆ రోజు . పీటల మీద కూర్చుంది సుజాత. పెండ్లి మంత్రాలు చదువుతూన్న పూజారి ఆదేసానుసారం పూలు అక్షింతలు పసుపు గణపతి పై చల్లుతున్నారు తామిద్దరు.
తన ప్రక్క ఎవరో మెల్లగా చోటుచేసుకుంటూ తనను రాసుకుంటూ కూర్చోవడంతో ప్రక్కకు తిరిగి చూసింది సుజాత.
ఆరేండ్ల శ్రీ రమణ బుగ్గసొట్టతో నవ్వుతూ తన వైపు చూశాడు.
అది గమనించిన కృష్ణ “ నా తమ్ముడు శ్రీరమణ” అన్నాడు సుజాతనుద్దేసించి.
సుజాత కండ్లు ముఖంలో ఆశ్చర్యం తొంగిచూసింది “ఇంత చిన్న తమ్ముడా “ అన్నట్టు . అది గమనించినా గమనించనట్టు వుండిపోయాడు కృష్ణ చైతన్య పెండ్లి హడావిడిలో.
కృష్ణ చైతన్యకు తమ్ముడున్నాడని విన్నది కాని చూడలేదు సుజాత. కృష్ణతో తన పెండ్లి కుదరడం , సుజాత వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేక త్వరగా పెండ్లి ముహూర్తం అనుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.
కృష్ణ చైతన్య వాళ్ళ నాన్న వెంకటేశ్వర రావు సుజాత తండ్రి రామారావు చిన్ననాటి స్నేహితులు. కృష్ణ చైతన్య మంచి కుర్రాడు ఈ మధ్యనే లెక్చరర్ ఉద్యోగం వచ్చిందని విన్న సుజాత తండ్రి తన ఏకైక కూతురు సుజాతను కోడలుగా చేసుకోమని వెంకటేశ్వర రావును అడుగుతాడు.
తన తల్లి తండ్రులతో సుజాతను చూసివచ్చిన కృష్ణచైతన్య సుజాతలోని అందము ఆకర్షణకు లోనయి ఇష్టపడతాడు. సుజాత కృష్ణ చైతన్యల పరస్పరం ఆమోదంతో పెండ్లిరోజు నిర్ణయం కావడం హడావుడిగా జరిగిపోతాయి. ఆ హడావిడిలో శ్రీ రమణను చూడలేదు సుజాత.
తమ పెండ్లిరోజు అదే మొట్టమొదటిసారి శ్రీరమణను చూడడం సుజాత అప్పుడప్పుడు తమరూములోకి నవ్వుతూ తొంగి చూడడం. సుజాత రమ్మంటే పరిగెత్తిపోవడం చేసేవాడు.
కృష్ణకు తమ్ముడంటే ప్రేమ . ఇంటికి వచ్చిన తరువాత సాయంకాలం రమణను కూర్చో పెట్టుకుని ఇద్దరు స్నాక్స్ తింటూ, రమణ స్కూలు విషయాలు, జరిగిన క్లాసులు,ఆడిన ఆటలు , ఫ్రెండ్స్ విషయాలు అడిగి తెలుసుకొనేవాడు హోమ్ వర్క్ చేయించేవాడు.
ఒక్కోసారి తను కృష్ణతో గడపాల్సిన తన టైమ్ ను రమణ లాగేసుకుంటున్నాడని మనసులో బాధపడేది.
అమ్మా అమ్మా అంటూ అత్తమ్మ జయంతి కొంగు పట్టుకుని తిరిగే రమణను చూసినపుడు సుజాత మనసులో ఓ ప్రశ్న మేల్కొనేది “లేటుగా ఇంత గాప్ తో పిల్లలను ప్లాన్ చేసుకున్నారేమి అత్తమ్మ మామగారు “ అని.
ఒక రోజు కృష్ణ కాలేజికి బయలుదేరుతూ బస్ మిస్ అయిందని రమణను పిలిచాడు కారులో స్కూల్ లో దింపుతానని.
“రమణను దింపినపుడు మీకు తమ్ముడని తెలియక మిమ్మల్ని మీ అబ్బాయా అని ఎవరు అడగలేదాండి స్కూల్లో “అని మరలా..,
“చాల ఏజ్ గాప్ కదండి మీ అన్న తమ్ముడికి “ అని తన మనసులో గిరికీలు కొడుతున్న ఆ ప్రశ్నను కృష్ణ ముందు బయటపెట్టింది.
కృష్ణ సుజాత వైపు ఓ చూపు చూసి ఊరకుండిపోయాడు “టైమయింది కాలేజికి వెళుతున్నా సుజాతా “అంటూ. కృష్ణ ముఖం సీరియస్ కావడం గమనించింది సుజాత.

****

ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చి స్నానంచేసి వచ్చి బాల్కని లో కేన్ ఊయలలో కూర్చున్నాడు కృష్ణ చైతన్య .
బాల్కనీలో ఆ చోటు , సూర్యుడు అలసి సంధ్య కౌగిలో సేదతీరేందుకు పయనించే ఆ సాయంకాలపు ఆసమయం కృష్ణకు ప్రీతి పాత్రమయినవి. తమ బెడ్ రూము ప్రక్క ఆ బాల్కని సుజాత పెంచిన పూలమొక్కలతో రంగులీనుతూ అందంగా వుంది.
సుజాత కాఫీ కప్పులు ఇద్దిరికి ట్రేలో పెట్టుకుని వచ్చి కృష్ణకు ఒక కప్పు ఇచ్చి , తానొకటి తీసుకుని ఇద్దరు కాఫీ తాగుతూ ఉండిపోయారు.
కొంతసేపయినాక “శ్రీరమణ అమ్మ ఇంట్లో లేరా “అని అడిగాడు కృష్ణ.
“లేరు అత్తమ్మ రమణను వెంటపెట్టుకుని బాలాజి గుడికి వెళ్ళారు. ఈ రోజు శుక్రవారము కదా “ అంది సుజాత.
కృష్ణ “ శ్రీ రమణ నాకు సొంత తమ్ముడు కాదు సుజాత. మా అమ్మ వాడిని నెల పసిబిడ్డగా ఎవరో గుడిలో వదిలి పోతే , ఎవరు పట్టించుకోకపోగా గుడికి వెళ్ళిన అమ్మ ఆ బిడ్డను ఇంటికి తెచ్చింది. నేను అప్పుడు కాలేజిలో చదువుతున్నా . మా నాన్న బొద్దుగా ముద్దుగా వున్న వాడిని చూసి ..
“మంచి పని చేశావు జయంతి! ఏ తల్లి కన్న బిడ్డో పాపం. తోబుట్టువులెవరు లేని మన కృష్ణకు తమ్ముడు వీడు“ అని, శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర చదువుతున్న మా నాన్న వాడికి శ్రీ రమణ అని నామకరణం చేశారు.”అని ఆగాడు.
“అయ్యే .., అవునాండి తెలియక తేలిక మాటలన్నాను తప్పు తప్పు “ అని రెండు చెంపల మీద చేతులతో తట్టుకుంటూ “నన్ను క్షమించండి” అన్నది కృష్ణతో .
“సరేలే నీకు ముందే చెప్పక పోవడం నా తప్పు “ అని కాఫీ తాగి కప్పును ప్రక్కన స్టూల్ పైని ట్రేలో పెట్టాడు.
“నేను మొదట్లో నాకే సొంతమయిన అమ్మ నాన్నల ప్రేమను వీడు కాజేస్తువ్నాడని అనుకునే వాడిని. నా అసూయను, మనసును గమనించిన మా అమ్మ నాతో..,
“నాన్నా కృష్ణా నీకు దేవుడిచ్చిన తమ్ముడు శ్రీ రమణ . నీకు ఒక తోబుట్టువునైన ఇయ్యలేకపోయాను. మేము వున్నా లేకపోయినా శ్రీరమణ జీవితాంతం నీ కష్ట సుఖాలను పంచుకొనే తోడు నీకు. రమణను ప్రేమతో చూడాలి నీవు. “అని చెప్పినప్పటినుండి రమణంటే అనాద అనే ఆ భావన పోయి నా తోబుట్టువు అనుకుంటూ ప్రేమతో చూసుకుంటున్నాను. ఓక తోడ పుట్టిన వాళ్ళు వుంటే బాగుంటుందనేది రమణ వల్ల అనుభవమయింది నాకు. “ అన్నాడు కృష్ణ .
“అత్తమ్మది ఎంత మంచి హృదయం కదండి. శ్రీరమణను అత్తమ్మ చేరదీయకపోయివుంటే ఏ అనాధ శరణాలయంలోనో ఉండి ఈ ప్రేమ ఆదరణకు దూరమయేవాడు” అన్న సుజాత తో ఏదో చెప్పబోయి ఆగిపోయాడు కృష్ణ .
అంతలో శ్రీరమణ “అన్నయ్యా! వదినమ్మా”అంటూ పరిగెత్తుకుని వచ్చాడు వాళ్ళదగ్గరికి. చేతులో పట్టుకొచ్చిన పొంగలి ప్రసాదాన్ని కృష్ణ చేతిలో పెట్టాడు.
తరువాతి సంవత్సరం హార్ట్ అటాక్ తో అత్తమ్మ జయంతి చనిపోవడం . తాను గర్భం దాల్చి ఏడో నెలలో హైబీపీ వల్ల గర్భంలో బిడ్డ చనిపోయి తనకు గర్భసంచి సెప్టిక్ అయి తాను బతకాలంటే గర్భసంచిని తీసేయాలనడంతో ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయమని భార్యను బ్రతికించుకున్నాడు కృష్ణచైతన్య.
అప్పటి నుండి శ్రీరమణనే సొంత బిడ్డగా భావించుకుంటూ ప్రేమతో పెంచుకున్నారు .
“సుజి మనకు రమణ వాళ్ళు వచ్చాక ఐదో రోజుకు టికెట్లు బుక్ అయ్యాయి తిరుమలలో దర్శనానికి. ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేశాను నాన్నతో చెప్పి. నాన్నకూడా వస్తారు. నాన్న రైల్వే ఆఫీసర్ కదా ట్రైన్ టికెట్స ప్రాబ్లమ్ లేదు” అంటూ కృష్ణ రావడంతో సుజాత జ్ఞాపకాలు తెగి వర్తమానంలోకి వచ్చింది.
“ఏంటి అంత ఆలోచనలలో పడిపోయావు “ అని అడిగాడు కృష్ణ.
“మన గడిచిన జీవితం గుర్తుకొచ్చింది. అత్తమ్మ అన్నట్టు దేవుడిచ్చిన శ్రీరమణ మనకు తోడు నీడయినాడు “ అంది.
“అవును సుజి శ్రీరమణ లేకుంటే మన జీవితం ఎంత దుర్భలంగా నిరాశాజనకంగా ఉండేదో కదా” అన్నాడు కృష్ణ.
“అవునండి “ అంటూ లడ్డులను స్టీల్ మూతడబ్బాలో పేరుస్తూ వుండిపోయింది సుజాత.
ఆ సాయంకాలం ఆరు గంటల సమయంలో బాల్కనీలో వచ్చికూచున్న కృష్ణకు, వాళ్ళ అమ్మ జయంతిని గురించి వాళ్ళ నాన్న శ్రీనివాసరావు తనకు చెప్పిన మరపురాని ఆ సంఘటన మనసులో మెదిలింది.

***

ఆ రోజు కాలేజి నుండి వచ్చాడు తను. లంచ్ చేయకుండా బిస్కట్లు, టీతో సర్దుకుని క్లాసుకు అటెండవడంతో బాగా ఆకలేసింది.ఇంట్లోకి రాగానే “అమ్మ ఆకలేస్తూంది తినడానికేమయినా పెట్టు” అన్నాడు.
అప్పుడే పాలుకలిపి ఐదు నెలల శ్రీరమణకు పడుతూంది అమ్మ.
“అయిపోయింది నాన్న వస్తున్నా నంటూ శ్రీరమణను ఊయలలో పడుకోబెట్టి వచ్చేప్పటికి కొంచెం ఆలస్య మయిందని .తను అలిగి తన రూముకు వెళ్ళి పడుకున్నాడు. అమ్మ తన కోసం చేసిపెట్టిన బజ్జీలు ,సాస్ ప్లేటులో పెట్టుకుని తన రూములోకి వచ్చి చాలసేపు నన్ను బుజ్జగించి తినిపించింది.
ఇదంత నాన్న గమనించాడని తనకు తెలియదు.మరుసటి దినం సాయంకాలం తనను కూడా పార్క్ లోకి వాకింగ్ కు రమ్మని పిలుచుకొని వెళ్ళాడు. ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళాము. కాలేజి కబుర్లు నా చదువు విషయం తాను నాన్నతో చెపుతూ నడిచిన తరువాత ఒక బెంచి మీద కూర్చున్నాము.
నాన్న నా బుజం పై చేయి వేసి ,”కృష్ణా మీ అమ్మను గురించిన ఒక విషయం నీతో చెప్పాలిరా నాన్న. “ అన్నాడు
“ఏంటి చెప్పండి నాన్న “ అన్నాడు తను .
“బిడ్డలు కలగని మా మేనత్త కమలమ్మ ,ఆమె భర్త మాధవ రావు మామయ్యకు శ్రీకృష్ణజయంతి రోజు అనాధగా బస్టాండులో పొత్తిళ్ళలో చుట్టిన ఏడుస్తూన్న బిడ్డను ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్న బిడ్డే నా భార్య , మీ అమ్మ కృష్ణ జయంతి. “ అన్నాడు.
కొంత సేపు ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు తను.
“మా అత్తమ్మ ,మామయ్య వాళ్ళకు బస్టాండులో కృష్ణాష్టమి రోజు ఆ పరిస్థితిలో దొరికినపుడు ఇంటికి తెచ్చి కృష్ణ జయంతి అని పేరు పెట్టుకున్నారు.
మా మామయ్యకు ముఖ్యమయిన స్నేహితుడు రామకృష్ణ పెంచుకోమని సలహాఇవ్వడంతో ,మా మేనత్త అన్న .., అదే మా నాన్న, మా చిన్నాన్న వాళ్ళు కూడా “బిడ్డలులేని మీకు దేవుడిచ్చాడు పెంచుకోమని “ చెప్పి సహకరించారు.
మీ అమ్మ నేను మేమిద్దరము చివ్నప్పటినుండి మంచి స్నేహితులము. తెల్లగా అందంగా వుండే కృష్ణ జయంతి అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం .
మా కాలేజి చదువులు అయిన తరువాత , నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. పెద్దల అంగీకారంతో మా పెండ్లి జరిగింది.
“నాన్నా..అమ్మ కు తాను తాతకు దొరికి పెంచుతున్న బిడ్డ అని తెలుసా “ అని అడిగాడు తను.
“ జయంతి ఎనిదో క్లాసులో ఉన్నపుడు ఎవరి ద్వారానో జయంతికి తెలిసి అడగడంతో జరిగింది చెప్పారు . తనకు అంత మంచి జీవితానిచ్చిన మా అత్త మామలంటే ఎంతో కృతజ్ఞతతో కూడుకున్న ప్రేమ మీ అమ్మకు “.తన జీవితాన్ని తెలుపుకున్న మీ అమ్మకు రమణ అనాధగా గుడిలో ఏడుస్తూ కనిపించినపుడు ఎలా ఒదిలి వస్తుంది చెప్పు. మీ అమ్మ మనసును గ్రహించిన నేను వెంటనే ఒప్పుకున్నాను మీ అమ్మను మెచ్చుకుంటూ. ఇదంతా నీకెందుకు చెపుతున్నా నంటే ,మీ అమ్మ నేను రమణను పెంచుకున్నందుకు నీవు బాధపడకుండా వాడిని నీ తమ్ముడిగా ప్రేమతో అంగీకరించాలి కృష్ణ “ అని అన్నాడు నాన్న.
“కృష్ణా మనము లోతుగా ఆలోచిస్తే ఈ భూమిపై మన మానవులందరి మూలాలు ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడికి పాకి వ్యాపించినాయో ఎవరికి తెలుసు. మానవుల రక్తంలో ప్రవహిస్తున్న అమూల్యమయిన మానవత్వాన్ని మనం మరువకూడదు రా నాన్న కృష్ణ . మనలో ఇంకా మిగిలివున్న ఆ మానవత్వమే మానవ జాతిని బతికిస్తూంది. ఆ మానవత్వమే మీ అమ్మకు,శ్రీ రమణకు అందమయిన జీవితానిచ్చింది. “అని ఆగాడు నాన్న.
నా కండ్లు చెమ్మగిల్లడం గమనించి తుడుచుకున్నాను. నాన్న నన్ను తన ఛాతికదుముకుని ఓదార్చుతూ వుండిపోయాడు.
నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిన మా నాన్నతో గడిపిన ఆ రోజును నా జీవితంలో మరువలేను.
భార్య సుజాతకు వాళ్ళ అమ్మ విషయం చెప్పవలసిన అవసరం లేదని అనుకున్నాడు కృష్ణ చైతన్య.
ఆ సంఘటనలో మునిగిపోయిన కృష్ణ బుజంమీద సుజాత చేయి ఆన్చి “ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు” అనడంతో కృష్ణ తేరుకుని,
తమ మీద కురుస్తున్న వెన్నెలను చూస్తూ “తమ వెలుగు కిరణాలతో చీకటిని పారద్రోలే సూర్యుడు, చంద్రుడు లేకపోతే మన జీవితాలు ఎంత పేలవంగా వుండేవో కదా సుజి..“అని అన్నాడు కృష్ణ సుజాత చేతిని తన చేతిలోకి తీసుకుని.
“అవునండి మన జీవితాకాశంలో అలముకున్న చీకటిని తరిమి వెలుగును నింపే సూర్యుడిలా శ్రీరమణ మన జీవితాలలోకి వచ్చినట్టు” అంది సుజాత వెన్నల నాస్వాదిస్తూ..”

*******

2 thoughts on ““మూలాలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *