May 29, 2022

చంద్రోదయం 15

రచన: మన్నెం శారద

ఇంతకూ అతను తనని నిజంగా ప్రేమించి వుండక పోవచ్చు. ఆ వయసు కుర్రాళ్లలా తమాషాకి అతనూ చేయి వూపి వుండొచ్చు. నిజంగా ప్రేమించి వుంటే తనని వెతుక్కుంటూ రాడూ. తన ప్రేమని తెలుపుకోడూ. ఇలా రోజూ ఎంతమందిని చూసి చిరునవ్వులొకల బోస్తాడో.”టాటా” చెబుతాడో.
ఆమె నిస్పృహగా నిట్టూర్చింది.
అయినా ఆమె విశాలమైన కళ్లు ఎన్నాళ్లపాటో రెప్పవేయడం మర్చిపోయి రోడ్లన్నీ అతని కోసం గాలించేవి.
కనీసం అతని పేరు కూడా తెలియదు.
ఏం చేస్తాడో అంతకన్నా తెలియదు.
ఎక్కడుంటాడో అసలే తెలియదు.
ఏ ఆధారంతో అతన్ని వెదుకుతుంది?
ఏ అనుబంధంతో ఎదురు చూస్తుంది?
నిరాస నిండిన ఆమె నయనాలు కన్నీటి పుష్పాలయ్యేవి.
స్వాతి కాలగతిలో దిగులుని దిగమింగి చదువులో పడిపోయింది. ఆ రోజున…
“రేపు నీకు పెళ్ళివారొస్తున్నారమ్మా. ఎక్కడికీ వెళ్లకు” అన్న తండ్రి మాటలకి వులిక్కిపడింది స్వాతి.
వెంటనే ఏం జవాబు చెప్పాలో ఆమెకు తెలియలేదు.
“డిగ్రీ అయిపోనీ నాన్నా” అంది ఎలాగో.
“ఈ లోపున అతను కన్పించడా?” అన్న ఆశ.
శంకరంగారు నవ్వేరు.
“పిచ్చి తల్లి! ఎంత చదువు చదివినా పెళ్లి బాధ్యత నాకు తప్పేది కాదమ్మా. మంచి సంబంధం. అనుకోకుండా వచ్చింది. పెళ్లికొడుకు ఎవరనుకున్నావు? లక్షలకు ఏకైక వారసుడు. పైగా దొడ్డ మనసున్న మనిషి. ఇలాంటి సంబంధం నేను ఎన్ని జన్మలెత్తినా చేయలెను.”
స్వాతి మాట్లాడలేదు.
మాట్లాడటానికి ఏముంది కనుక.
సినిమాహాల్లో ఎవరో అబ్బాయి కనిపించేడు. అతన్నే చేసుకుంటానని ఎలా చెబుతుంది? ఏమని చెబుతుంది చెప్పి నవ్వుల పాలు కావడం తప్ప.
మర్నాడు ప్రొద్దుటే పెళ్ళివారొచ్చేరు.
తను చాపమీద తల వంచుక్కూర్చుంది
“పెళ్ళి కొడుకుని చూడు. ఎంత బాగున్నాడో. మళ్లీ కావాలంటే దొరకడు. ఊఊ” పక్కింటి పిన్నిగారు స్వాతిని కుదుపుతూ గుసగుసగా అంది.
స్వాతి మెల్లిగా తల ఎత్తింది.
అంతే! ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యేయి.
తనవంకే ఆశ్చర్యంగా తెల్లబోయి చూస్తున్న అతను.. అతనే..
ఎంత తమాషా?
ఇంత అద్భుతమైన విషయం ఎక్కడైనా జరుగుతుందా? తన మనసులో వలచిన ప్రియుడు. మళ్లీ ఎన్నడూ కలవకపోగా, కనీసం తన మనసు తెలియకపోగా, ఇక తనకు మళ్ళీ కన్పించడు అనుకొన్న తరుణంలో పెళ్ళికొడుకుగా ఇలా సాక్షాత్కరించడం, నిజంగా స్వాతి నమ్మలేకపోయింది.
అతను కూడా తనలాగే ఖంగు తిన్నట్లున్నాడు. అందుకే అంత ఆశ్చర్యంగా, గుండె ఆగినట్లు చూస్తున్నాడు.
స్వాతి హృదయం ఆనందంతో గాలిలో గువ్వలా ఎగురుతోంది. పట్టలేని సంతోషంతో ఆమె లోనికి పరుగు తీసింది.
ఆ తర్వాత అతను తల్లితండ్రుల్ని, ఆస్తిని కాదని తనను కట్టుకోబోతున్నాడన్న విషయం ఆమెని గర్వపడేలా చేసింది.
తండ్రి ద్వారా “పెళ్ళికొడుకు పేరు శేఖర్ అని, ఇంజనీరుగా పని చేస్తున్నాడ”ని తెలిసి సంబరపడింది.
ఎవరూ లేకుండా చూసి శుభలేఖలో ఆతని పేరును గట్టిగా ముద్దు పెట్టుకొని, ఆ పైన సిగ్గుపడి పోయింది.
“తన ముద్దు అతని చెంపలకి తాకి ఉలిక్కిపడ్డాడేమో. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చి ఒకచోట నిలవలేనట్లుగా బాదం చెట్టు క్రిందకి పరిగెత్తింది.
పెళ్లి ముహూర్తం దగ్గర పడేవరకూ ఏ క్షణం ఏం చేస్తుందో ఆమెకే తెలియదు.
వేసిన జడలే విప్పి, మళ్లీ తలకి నూనె రాసి జడలేస్తున్న అక్కని చూసి తికమకపడ్డారు చెల్లెళ్లు.
కాఫీ పొడి అప్పు తనకే యిచ్చి, మళ్లీ గ్లాసునిండా వేసుకుని అప్పు తీర్చడానికి వచ్చిన స్వాతిని చూసి విస్తుపోయి ముక్కున వేలేసుకుని పక్కింటి పిన్నిగారు.
“పెళ్ళిళ్ళు మేమూ చేసుకున్నాంగానీ ఇంతలా వళ్ళు మరచిపోయి వుక్కిరిబిక్కిరయిపోలేదు సుమీ!” అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చిందావిడ స్వాతి బుగ్గ గిల్లుతూ.
శంకరంగారు కూడా స్వాతి అదృష్టానికి మురిసిపోయారు. శేఖర్ వినయ విధేయతలు, మంచితనం ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసేయి.
ఆ రోజు రానే వచ్చింది.
స్వాతి పెళ్ళిపీటల మీద తల వంచుకు కూర్చుంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.
పక్కన కూర్చున్న వ్యక్తి స్పర్శ ఆమెకి వింత గగుర్పాటు కల్గిస్తోంది ఏవేవో వూహలతో ఆమె పురోహితుడు చెప్పినట్లు చేస్తోంది.
స్నేహితురాళ్ల జోకులకి నవ్వొచ్చి ఆమె తలయెత్తి చూసింది. ఎదురుగా పందిరి రాటకి జేరబడి.. అతను..!
ఆమె గుండె ఆగినట్లయింది.
తన కళ్ళు తనకి అబద్ధం చెబుతున్నాయేమోనని ఆమె మరోసారి తల యెత్తి చూసింది.
అతను అక్కడ లేదు. వెళ్లిపోయేడు.
ఆలోచనలనుంచి తేరుకోక మునుపే బాజాబజంత్రీలు మారుమ్రోగేయి. మంగళ సూత్రధారణ జరిగిపోయింది.
స్వాతి ఊహాలోకం నుండి కిందికి జారిపడింది.
పెళ్ళి తతంగం ముగిసేక మెల్లిగా పిన్నిగారిని అడిగింది. “పెళ్ళికొడుకు ఎవరు?”
ఆమె స్వాతి వంక ఆశ్చర్యంగా చూసి, “ఆ రోజు రెండు కళ్లూ విప్పార్చి చూసేవుగా. మళ్లీ యిదేం ప్రశ్న?” అంది.
ఆ వెంటనే గుమ్మం దగ్గరకు చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి శంకరంగారితో మాట్లాడుతున్న శేఖర్‌ని చూపించింది.
పసుపు బట్టలతో తమాషాగా పెళ్లికొడుకు హోదాలో వున్న శేఖర్ క్రీగంట స్వాతిని చూసి చిన్నగా నవ్వేడు.
స్వాతి లోపలికొచ్చేసింది.
“ఏం బాగున్నాడా?” పిన్నిగారు నవ్వింది.
స్వాతి మాట్లాడలేదు.
ఆమె హృదయంలో పెద్ద తుఫాను చెలరేగుతున్నదనీ, భూకంపాలు కదిలించేస్తున్నాయనీ, ఆమెకి తెలియదు.
స్వాతి సజల నయనాలతో అద్దంలో చూసుకుంది. తన ప్రతిబింబమే తన్ని వెక్కిరిస్తోన్న భావన. “అయితే ఇప్పుడేం చేయగలదు.?”
ఆ తర్వాత తన మనసు పారేసుకున్న వ్యక్తి పేరు సారథి అని, అతను శేఖర్‌కి స్నేహితుడని ఆమె తెలుసుకుంది.
“అతను తనని ప్రేమించి వుండదు. ప్రేమిస్తే స్నేహితునితో పెళ్ళిచూపుల కొచ్చినప్పుడే తనని చూసి ఆ నిజం స్నేహితుడికి చెప్పేవాడు. అలా కాకుండా ఈ పెళ్ళి అతని చేతులమీదుగా చేయించేడంటే అతనికి తన మీద అలాంటి అభిప్రాయం లేదన్నమాట.”
క్రమంగా స్వాతిలో ఉదాసీనత చోటు చేసుకుంది. తన మనోభావాలని మరొకరికి తెలీనీకుండా మౌనం వహించింది. శేఖర్ లాలనలో, మంచితనంలో, నిష్కపటత్వంలో ఆమె తన బాధని మరచిపోవడానికి ప్రయత్నించింది.
అతను తన కోసం తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నాడు. ఆస్తిపాస్తుల్ని తృణప్రాయంగా చూసేడు.
ఇంతకంటే అతన్ని ఆరాధించడానికి ఏం కావాలి?
కాని.. కాని.. సారథిని చూసినప్పుడల్లా ఆమెలో చెప్పలేని అలజడి. కంగారూ.
అతను మరో యింటీకి వెళ్ళటం, ఆమెకు ఒక రకంగా ఆనందాన్నే కలిగించింది. ధైర్యాన్నిచ్చింది.
కారణం… అతన్ని చూస్తే ఆమె మనోధైర్యం సడలిపోతుంది.
దైవికంగా అతను మద్రాసు వెళ్లిపోవడం, కనీసం కంటికి కన్పించదనే బాధ కల్గినా మరోరకంగా ఆమెకు అదే ముందు ముందు తమ వైవాహిక జీవితానికి మంచిదిగా తోచింది..
ఆలోచనలతో స్వాతికి ఎప్పుడు తెల్లవారిందీ తెలియలేదు..

ఇంకా వుంది.

1 thought on “చంద్రోదయం 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *