August 17, 2022

చిన్న గల్పికలు గొప్ప ఆలోచనలు – గల్పికా తరువు సమీక్ష

సమీక్ష: యడవల్లి శైలజ ( ప్రేమ్)


మనకు తెలియని విషయాన్ని నాకు తెలియదని నిర్భయంగా ఒప్పుకోవాలి అప్పుడే కదా మన వ్యక్తిత్వం ఏంటో మనం ఎంతవరకు నిజాయితీగా నిలబడగలం అని మన గురించి మనకు తెలిసేది.
” గల్పికలు ” అనే పదం నేను వినడం మొదటిసారి.
సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్ష, విమర్శ, పద్యాలు, నానీలు, తేనీయలు, చిమ్నీలు, చురకలు, మధురిమలు, నవల, పాటలు ఇవన్నీ నేను విని ఉన్నాను. కొన్ని ప్రక్రియలు రాసి ఉన్నాను.
‘గల్పికా తరువు’ దీనిలో 104 ఒక పేజీ గల్పికలు ఉన్నాయి. దీనిని చదివిన తర్వాత గల్పికల రూపం
‘సూక్ష్మంలో మోక్షంలా’ చెప్పదలుచుకున్న విషయాన్ని పరోక్షంగా ఒక సంఘటన తీసుకుని వ్యంగ్యరచన చేయడమని, సంక్షిప్తత పాటించడం గల్పికల లక్షణాలు అని తెలుసుకున్నాను “.
గల్పికా కథలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్రత్యేకత కలిగి వుండడమే కాకుండ సమాజంలోని అసమానతలు,రుగ్మతలను ఎత్తి చూపించాయి”.
మనదేశం పారిశ్రామికంగా, రాజకీయంగా ఇంకా వివిధరంగాల్లో అభివృద్ది చెందినప్పటికీ, చెందుతున్నప్పటికీ ఇంకా కొన్ని విషయాల్లో వెనకబడే ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు . ఈ గల్పికలు చదివిన తర్వాత.
‘ అడ్డుగోడ కథ ‘ చదువుతుంటే దాహంతో మంచినీళ్ళు అడిగి అవమానం ఎదుర్కొన్న మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గుర్తుకురాకపోరు. కులమనే జాడ్యం ఎంత క్రూరమైనదో, దారుణంగా ఈ సమాజాన్ని ఇంకా ఎంత వెనక్కి లాగుతుందో ! ఆడపిల్లని అమ్మగా, సోదరిగా చూసే సమాజం’చూసే రోజులు కనబడుతున్నాయి ప్రస్తుతం ఇప్పుడు
జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఎన్ని రకాల చట్టాలు వచ్చినా మగవారి ఆలోచనాధోరణి మారడంలేదు. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు అమ్మగా ఆమె ఎలా ఎదుర్కుందో తెలుస్తుంది ‘ అమ్మతనం ‘ కథలో. ప్రేమ మత్తులో మోసపోయిన యువతి కథ ‘ ఆమె కథ’.
‘ ఉష ‘ నిజంగా ఉషోదయంను నింపింది ఓపికగా ఆ కుటుంబంలోను, ఆఊరిలో కూడా కథలో లాగా మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వంకు ఆదాయం వస్తుందేమో కాని మద్యం వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎన్నో, విచ్చిన్నమైన ఊర్లు ఎన్నో. ఒకప్పుడు మద్యపాన నిషేదంపై పోరాటాలు విప్లవంలా పోటెత్తినయి కూడా ఇప్పుడు ఏమయ్యింది ఆ చైతన్యం, ఆ చట్టాలు? మనం ఆలోచించాల్సిన విషయమిది.
ఈ సృష్టిలో పుట్టిన పశుపక్ష్యాదులతో, మొక్కలతో కలిసిమెలిసి జీవిస్తున్నాం మనం వాటికివేటికి లేని స్వార్థం, కోపం, అసూయ, క్రూరత్వం, ద్వేషం మనిషికి మాత్రమే ఉంది. ఆ స్వార్థంతోనే మన చుట్టుపక్కల ఉన్న ఎంతో అమూల్యమైన వృక్ష సంపద, పశు సంపద, సహజవనరులను అధికంగా వాడుకుని ప్రకృతిని నాశనంచేసి మన వినాశానాన్ని కొని తెచ్చుకున్నామని అర్థం అయ్యేలా ” అంతరార్థం ” కథ ఉంది.
ఈ ప్రపంచీకరణ మత్తులో మాయమైన మానవ సంబంధాలు, కనుమరుగైన పాత పద్దతులు, సంప్రదాయాలు, సంస్కృతి సంపద , పాత వస్తువులు, మానవత్వం, ప్రేమ, స్నేహం అన్ని కథా వస్తువులుగా ఉన్నాయి. ఈ ప్రతి కథాంశాలు కదిలించేవిగా ఉన్నాయి. సమాజానికి, చదివేవారికి ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రపంచం మారినట్టు
మనల్ని భ్రమింప చేస్తున్నది ఎప్పటికీ మారని మనుషుల ప్రవర్తన ఇటువంటి పుస్తకాలు చదివిన తర్వాత నైనా కొంచెం మార్పు తెచ్చుకుంటారేమో చూద్దాం.
“ఈ గల్పికా తరువు సంపాదకురాలు జ్వలితగారు చేసిన ఈ మంచి పనికి అభినందించకుండా ఉండలేం. కనుమరుగైన ఈ ప్రక్రియ వెలుగులోకి తేవడం ఒకటి, ఇంకా ఈ ప్రక్రియ కోసం ముందు కృషిచేసిన రచయితలు ఎవరెవరు ఉన్నారో వారిని అందరికి పరిచయం చేయడం ప్రశంసనీయం.
ఈ పుస్తకంలో రాసిన రచయితలు పాతవారున్నారు, కొత్తవారున్నారు , ఇప్పుడిప్పుడే కలం పట్టిన వారూ ఉన్నారు. పట్టు వదలని అకుంఠిత దీక్షతో ప్రపంచం మొత్తం భయంకర విపత్తు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అందరిని చైతన్యపరుస్తూ ఈ గల్పికలు రాయించి అచ్చు వేయడం అభినందనీయం.
ఈ కరోనా వల్ల ప్రజలు కొంత దగ్గర అయ్యారు, కొంతదూరం అయ్యారు. కొందరు పాఠాలు నేర్చుకున్నారు. కొందరు ఎప్పటికి మారకుండా అలాగే ఉన్నారు అటువంటి వారు ఎన్నడు మారతారో, ఎప్పటికి మారతారో ఆ కాలమే చెప్పాలి మరి.
ఈ గల్పికలు పాఠకులు చదవడానికి అనుకూలంగా, సరళమైన భాషలో, సులువుగా అద్భుతంగా ఉన్నాయి.అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకం మనముందుకు తీసుకుని వచ్చిన జ్వలిత గారికి మరోమారు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సాహిత్య రంగంలో ఇంకా మరిన్ని రచనలు చేయాలని కోరుకుంటూ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *