April 26, 2024

జీవన సమీరం

రచన – డా. అర్చన ఆచార్య

కన్నీరు ఇంకింది, మనసు మోడు వారింది
నవ్వులో నిర్వేదం, నిండుగా నిండింది

పుట్టింట రాణినైతి
మెట్టింట జాణనైతి
దృష్టికొక కోణమైతి
విలువలేని వీణనైతి

తింటివా అని అడిగేవారు లేక
మిన్నకుంటివా అని ఓదార్చేవారు రాక
మాటల అస్త్రాలు.. నిందల శస్త్రాలు
అహాల మొహాలు.. అధికారాల దాహాలు

మనసు పొరల తొక్కిపెట్టి
పంటి కింద నొక్కిపెట్టి
బాధనంత దాచిపెట్టి
మోమున చిరునవ్వు చుట్టి

చేపట్టిన తన తోడుకు అమృతమందించాలని
అలవోకగా హాలాహలం గ్రోలిన ఓ ముదితనైతి

ఆ రేడే ఏమార్చగ
నే మోడై భువినోర్చగ
మదిని మధుర గవాక్షముగ
మార్చిన మంజుల గీతిగ

క్షణమొక యుగముగ గడపగ
కణమొక రణముగ మార్చగ
అదాటున వీచెనొక మీరసమీరం
అది మనసున నింపెను పెనుగాలి దుమారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *