May 25, 2024

2. మేడిపండు జూడ – ఉగాది కథలపోటి

రచన: డా. కె. పద్మలత

నీలిమ స్కూల్కి వెళ్ళడానికి రడీ అయి టిఫిన్ బాక్సు బ్యాగులో పెట్టుకుంటూ ఆఫీసుకెళ్ళడానికి బయటికి వెళ్తున్న భర్త దగ్గరకొచ్చి ”ప్లీజ్ ! ఈ రోజు నన్ను స్కూల్ దగ్గర దించి మీరు వెళ్ళండి. ఆటో అతను రానన్నాడు” అంది.
”వారానికి రెండు రోజులు రాడు అతను, మీరు గట్టిగా అడగరు. సరే, తొందరగా రా, నాకు ఆఫీసుకు లేట్ అవుతుంది’
”వస్తున్నా!” అని ఇంటికి లాక్ వేసి బయలుదేరి స్కూటర్ మీద భర్త వెనకాల కూర్చుంది. ఆమెను అరుణోదయ స్కూల్ దగ్గర దింపి అతను వెళ్ళిపోయాడు.
”ఈ రోజు లేటయిపోయింది. అటెండెన్స్ రిజిష్టర్ ఉందో, తీసేసారో” అనుకుంటూ ప్రిన్సిపల్ రూంలోకి ప్రవేశించి” గుడ్ మార్నింగ్ మేడమ్” అంది.
”గుడ్మార్నింగ్, ఏంటీ ఈ రోజు లేట్ . . . ”
”సారీ మేడమ్” అని అటెండెన్స్ రిజిష్టర్లో సిగ్నేచర్ చేసి బయటికొచ్చింది.
లంచ్‌టైమ్‌లో స్టాఫ్‌రూమ్‌లో ముగ్గురు, నలుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తున్నారు. నీలిమ తన టేబుల్ దగ్గరకొచ్చి తన ఫ్రెండ్స్ జయ, మేఘనల కోసం వేయిట్ చేస్తూ కూర్చుంది.
ఈలోగా జయ హడావుడిగా లోపలికొచ్చి ఒక పత్రిక ఆమెచేతికిచ్చి ”ఈ సారి ‘మహిళ’ వార పత్రికలో నీ అభిమాన రచయిత జయరాం గారి వ్యాసం ఉంది, చదువు” అంది.
”జయరాంగారి ఆర్టికలా? తప్పకుండా చదువుతా, థాంక్యూ. ఈ రోజు ఈవినింగ్ చదివి మేగజైన్ రేపు తెచ్చిస్తా, స్కూల్లో చదివితే బాగుండదు” అంది. మేఘన కూడా టేబుల్ దగ్గరకొచ్చి ”అబ్బ, చాలా ఆకలిగా ఉంది, ముందు లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం” అంది.
ముగ్గురూ మాట్లాడుకుంటూ లంచ్ చేసారు. వాళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్, నీలిమ, జయ ఆ స్కూల్లో చేరి అయిదు సంవత్సరాలయింది. మేఘన సంవత్సరం క్రితమే చేరింది. కాని, తొందరగానే వాళ్ళతో కలిసిపోయింది. మిగతా టీచర్లందరూ వాళ్ళను త్రిమూర్తులు అంటారు. ”అబ్బో, ఇప్పుడు నైన్త్ క్లాసు ”బి” సెక్షన్‌కి వెళ్ళాలి. వాళ్ళకసలు డిసిప్లిన్ ఉండదు. ఆ క్లాసు కెళ్ళాలంటేనే చిరాకు” మేఘన అంది.
ఇంతలో అటెండర్ వచ్చి ”మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారమ్మా” అని నీలిమతో చెప్పాడు.
నీలిమలేచి ప్రిన్సిపాల్ గారి రూంకెళ్ళింది. ”మేడమ్, పిలిచారట” అంది.
”రా . . . నీలిమా, కూర్చో” అని నీలిమ కూర్చోగానే ”ఈ నెలలో స్కూల్ ఆన్యువల్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటి అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుదామని పిలిచాను” అని ”నువ్వు కల్చరల్ కమిటీ ఇన్చార్జ్‌వి కదా” అంది.
‘పిల్లలు ప్రోగ్రామ్స్ కోసం రిహార్సల్స్ స్టార్ట్ చేశారు. గెస్ట్లను ఎవరినీ పిలవాలో ఎప్పుడూ మీరే డిసైడ్ చేస్తారు కదా అంది”.
”ఈసారి మరీ ఎక్కువగా కాకుండా ముగ్గురు, నలుగురిని పిలుద్దాం, చైర్మన్‌గారు, ఒక పొలిటికల్ పర్సన్ ఇంకా సోషల్ సర్వీస్లో పేరుపొందిన వాళ్ళనెవర్నయినా పిలుద్దాం. నేనయితే ప్రొఫెసర్ జ్యోతీరాణి గారిని పిలుద్దామని అనుకుంటున్నాను. ఆవిడ స్పీచ్ చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ని ఉత్తేజపరిచేలాగా ఎన్నో విషయాలను చెప్తారావిడ”
”మేడం, ఇంతకు ముందు ఒకాసారి ఆవిడని పిలిచాము. నిజంగా చాలా బాగా మాట్లాడారు. కాని, ఈసారి ఫేమస్ రైటర్ జయరాం గారిని పిలిస్తే బాగుంటుందేమో. ఆయనకు మహిళలంటే చాలా గౌరవం. మహిళా సమస్యల గురించి ఎన్నో వ్యాసాలు రాసారు. మనది గర్ల్స్ స్కూలు కాబట్టి ఆయన చెప్పే విషయాలు వారికేమైనా ఉపయోగపడుతాయోమో”
నేను కూడా విన్నాను ఆయన గురించి, ”ఏం చేస్తారాయన”
”బ్యాంకు ఆఫీసర్, చాలా సంస్థలు వారి సమావేశాలకు ఆయనను పిలుస్తారట”
”ఆయనెవరో నాకు తెలీదు, నువ్వే వెళ్ళి ఇన్వైట్ చేయి. టూడేస్లో ఆహ్వానితుల లిస్ట్ ఫైనలైజ్ కావాలి. ”
”ఒకే మేడం, నేనే మన టీచర్స్‌ని ఎవరైనా ఒకరిని తీసుకెళ్ళి కలుస్తాను” అని సంతోషంగా బయటికొచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్ళేముందు జయకు, మేఘనకు ప్రిన్సిపల్గారు మాట్లాడిన విషయం చెప్పి, రేపు సండే కదా. జయరాంగారు కూడా ఇంట్లోనే ఉంటారేమో వెళ్ళి కలుద్దాం”. అంది. ”అలాగే, ఈ విషయం మా రఘుకు చెప్పాలి, ” అంది మేఘన. రఘు, ఆమె భర్త స్కూల్లో జరిగే ప్రతి విషయం అతనికి చెప్తుంది. నీలిమ నవ్వి ”సరే చెప్పు” అంది.
జయ ”అమ్మో, నాకు వీలవదు. మా అత్తగారిని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, మీరిద్దరూ వెళ్ళండి”
మేఘన ”ఆయన వ్రాసే ప్రతి ఆర్టికిల్ క్రింద మొబైల్ నంబర్ ఉంటుంది కదా. ఫోన్ చేసి వెళ్దాం” అంది.
నీలిమ ”సరే, నువ్వు ఫోన్ చెయ్యి, నేను రేపు పదకొండు గంటలకల్లా మీ ఇంటికొస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం” అంది.
మరునాడు ఆదివారం కావడంతో నీలిమ భర్త రవీంద్ర, కూతురు శ్రీకృతి లీజర్‌గా, టి. వి. చూస్తూ కూర్చున్నారు. నీలిమ హాడవుడిగా పనులు చేసుకోవడం చూసి ”ఏంటమ్మా ! ఈ రోజు హాలిడే కదా, అంత తొందరెందుకు, నువ్వు కూడా వచ్చి కూర్చో” శ్రీకృతి అంది.
”నాకంత తీరికెక్కడిది, తొందరగా పని పూర్తి చేసుకొని బయటికెళ్ళాలి”
”ఎక్కడికి” రవీంద్ర అడిగాడు,
”మీకు చెప్పలేదు కదా! ఈసారి స్కూలు ఆనివర్సరీకి నా అభిమాన రచయిత జయరాం గారిని పిలవాలనుకున్నాం. అందుకే ఆయనను ఇన్వైట్ చేయడానికి వాళ్ళింటికి వెళ్తున్నాం” సంతోషంగా అంది. నీలిమ.
”నీలూ, నీకెప్పటినుండో చెప్పాలనుకుంటున్నా, అతడు నీవనుకున్నంత ఉదారస్వభావి, స్త్రీలను గౌరవించేవాడు కాదని బయట కొందరు అనుకుంటారు. వ్రాసేదానికి, ప్రవర్తనకు పొంతన ఉండదని అంటారు”.
”ఊరుకొండి, ఎదుటివాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తే జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళెవరో ఈ రూమర్ క్రియేట్ చేసి ఉంటారు. అలాంటివి విని ఊరుకోవాలంతే” రవీంద్ర మాట్లాడలేదు.
నీలిమ అనుకున్నట్టుగానే పదకొండున్నరకల్లా మేఘన వాళ్ళింటికెళ్ళింది. ”జయరాం గారికి కాల్ చేసావా, ఏమన్నారు” ఆత్రుతగా అడిగింది.
”పన్నెండు గంటల వరకు రమ్మన్నారు, వచ్చే ముందు కాల్ చేసి రమ్మన్నారు”
”సరే పద. . మనం వెళ్ళేసరికి పన్నెండవుతుంది” అంది. ఇద్దరూ కలిసి మేఘన టూవీలర్ మీద జయరాం గారిచ్చిన అడ్రసు ప్రకారం వాళ్ళింటికెళ్ళారు. ఇంటి ముందు నిల్చొని మేఘన అతని నెంబర్కు కాల్ చేసింది. ఎవరో ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది ”హలో, ఎవరండీ”
”మేము జయరాం గారిని కలవడానికి వచ్చామండి, వచ్చే ముందు ఫోన్ చేసి రమ్మన్నారు”.
”ఆయన లేరండి, బయటికెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలీదు”
”మేము మీ ఇంటి ముందే ఉన్నాం. లోపలికొచ్చి వెయిట్ చేస్తాం” మేఘన అంది.
రెండు నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసి ఆమె ”లోపలికి రండి” అంది. ఆమెకు సుమారు ముప్పై అయిదు సంవత్సరాలుంటాయేమో. అందంగానే ఉంది, కాని, ముఖంలో ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది”
”సార్ ఎక్కడికి వెళ్ళారండి”
”తెలీదు”
”మీరు చాలా అదృష్టవంతులండి, సార్ లాంటి భర్త దొరకడం మీ అదృష్టం. వారికి మహిళలంటే అపారమైన గౌరవమని వారి వ్యాసాలు చదివినా, ఉపన్యాసాలు, విన్నా అర్థమైపోతుంది’ నీలిమ అంది.
ఆమె నవ్వి లోపలికి వెళ్ళింది. కానీ ఆ నవ్వులో ఏదో తేడా కనిపించింది. అయిదు నిమిషాలైనా ఆమె బయటకు రాలేదు.
మేఘనలేచి ”మేడమ్, మాకు కొంచెం పనుంది, బయటకు వెళ్ళి మళ్ళీవస్తాం” ఆమె బయటకు రాలేదు. లోపలినుండే ”అలాగే” అంది.
ఇద్దరూ బయటకొచ్చి దగ్గరలో ఉన్న సూపర్మార్కెట్లో అవసరమైన కొన్ని వస్తువులు కొనుక్కొని మళ్ళీ వెళ్ళారు.
జయరాంగారి ఇంటికెళ్ళి బెల్ కొడ్తాం అనుకునేలోగా లోపలి నుండి గట్టిగట్టిగా మాటలు వినిపిస్తున్నాయి.
”సండే కదా చికెన్ వండలేదా” మగగొంతుక
”లేదు, ఈ రోజు ఒంట్లోబాలేదు, నీరసంగా ఉంది” ఆమె గొంతుక.
”ఏం మాయరోగమొచ్చింది, తిండి బానే తింటున్నావు కదా, ”
”అలా అనకండి, నాలుగైదురొజుల నుండి ఎందుకో నీరసంగా ఉంటుంది, పని చేయాలనిపించట్లేదు, డాక్టర్కి చూపించుకోవాలి”.
”రోజంతా ఇంట్లోనే పడి ఉంటున్నావు కదా, నీరసం దేనికి, వేషాలు కాకపోతే”
”నేను ఉద్యోగం చేస్తా అన్నాను. మీరే ఒప్పుకోలేదు”.
‘ఆఁ. . నీ ముఖానికి ఉద్యోగంఒకటి. ఆ సాకుతో వాడితో, వీడితో కబుర్లు చెప్పుదామనుకుంటున్నావా”
‘ఛీ . . . అలా మాట్లాడకండి. వినడానికే అసహ్యంగా ఉంది”
‘ఏం, మాటకు మాట జవాబిస్తున్నావు, భర్త అనే గౌరవం లేదు. అసలు నిన్ను కాదే, నిన్నిలా పెంచిన మీ అమ్మననాలి. అది సవ్యంగా పెంచితే నువ్విలా ఉండేదానివి కాదు”.
”పెద్దావిడని అదీ, ఇదీ అంటారా, ఇదేనా మీ సంస్కారం”
”ఏయ్, నోర్ముయ్, నాకే నీతులు చెప్తున్నావా”
ఆ మాటలు వినలేక మేఘన కాలింగ్బెల్ గట్టిగా నొక్కింది.
జయరాం వచ్చి తలుపు తీసాడు. ”సార్, మేము అరుణోదయ స్కూల్ టీచర్స్మి. మీకు ఫోన్ నేనే చేసాను”
”ఆఁ. . రండి . . . రండి, కూర్చొండి”
నీలిమ మేఘనవైపు చిరాగ్గా చూసి ఇబ్బందిగా కూర్చింది,
”ఇందాక వచ్చాం, మీ మిసెస్ మీరు లేరని చెప్పారు, ఆవిడెందుకో చాలా నీరసంగా ఉన్నారు. ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళాం”
”ఔనట, తను చెప్పింది, ఫుడ్ సరిగ్గా తీసుకోదండి, ఎంత చెప్పినా వినదు, పోనీ వంటకెవరినైనా పెట్టుకోమంటే అది కూడా వినదు. ఆమె గురించే నా బెంగంతా” జయరాం అన్నాడు.
నీలిమకు అతన్ని చూస్తే అసహ్యమేస్తుంది, ముళ్ళమీద కూర్చున్నట్టుగా ఉంది, మేఘన వైపు చూసి ”వెళ్దామా” అంటూ లేచి నిల్చుంది.
”అదేంటి, ఆన్యువల్డే అన్నారు. ఏం చెప్పలేదు. నిజానికి నేను చాలా బిజీగా ఉన్నాను, కాని, మీరు డేట్ చెప్తే మిగతా ప్రోగ్రామ్స్ కాన్సిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను”.
”ఇంకా డేట్ డిసైట్ అవలేదండి, తర్వాత మీకు ఇన్ఫాం చేస్తాం, ముందుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని వచ్చాం, థాంక్యూ” అని ”మేడం మేం వెళ్ళొస్తాం” అని లోపలి ఆమెకు వినిపించెటట్టు చెప్పి బయటకు నడిచింది, నీలిమ.
బయటికొచ్చాక ”అదేంటి అలా సడెన్గా లేచి బయటికి వచ్చేసావు” మేఘన అంది.
”అతడు భార్యతో మాట్లాడింది విన్నాక అతడంటే అసహ్యం వేస్తుంది. అసలు లోపలికి వెళ్ళాలనిపించలేదు. నువ్వే బెల్ కొట్టావు. ”బెల్ కొడ్తే ఆమెను తిట్టడం ఆపేస్తాడని అనిపించింది” మేఘన అంది.
”సరే, రేపు మాట్లాడుకుందాం. నన్ను ఇంటిదగ్గర దించు’ మేఘన ఆమెను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది.
ఇంట్లోకి వెళ్ళగానే రవీంద్ర ”ఏమయింది, వస్తా అన్నాడా నీ అభిమాన రచయిత” అన్నాడు.
”ఇప్పటి నుండి అతడేం నా అభిమాన రచయిత కాదు’, అయినా అతడి గురించి మీరు చెప్పింది కరెక్టే” అని జరిగిందంతా చెప్పింది. ”అయినా, మహిళల గురించి అంత బాగా వ్రాసేవాడు అలా మాట్లాడమేంటి? మేక వన్నె పులి” అంది.
”వదిలెయ్ ఆ విషయం. వంద మందిలో ఒకళ్ళు అలాంటివాళ్ళు ఉంటారు. వాళ్ళు వ్రాసింది చదవాలే తప్ప పిచ్చి అభిమానం పెంచుకోకూడదు. సమాజానికి నిజంగా సేవ చేసే రచయితలు, రచయిత్రులు ఎంతో మంది ఉన్నారు. లంచ్ చేద్దాం, ఫ్రెష్ అయి రా . . . ” నీలిమ భర్త వైపు అభిమానంగా చూసి రూంలోకి వెళ్ళింది.
మరునాడు ప్రిన్సిపల్ని కలిసి ”మేడం జయరాంగారు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు, ప్రయత్నిస్తా అన్నారు. అయినా, ఆలోచిస్తే మీరు చెప్పినట్టుగా ప్రొఫెసర్ జ్యోతీరాణి గారిని పిలిస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. పిల్లలకు ఉపయోగపడే విషయాలు చెప్తారు. వాళ్ళు కూడా సంతోషిస్తారు అంది”.
”సరే, నా ఫ్రెండే కదా, నేను ఫోన్ చేస్తానామెకు”
”థ్యాంక్యూ మేడమ్”
మధ్యాహ్నం లంచ్టైంలో నీలిమ స్టాఫ్రూంకెళ్ళేసరికి జయ, మేఘన కూర్చొని ఉన్నారు. ”ఏంటి, నిన్న ఏదో విచిత్రం జరిగిందట” జయ అడిగింది.
”చిత్రం లేదు, విచిత్రం లేదు, అతనికి మహిళలను గౌరవించే సంస్కారం ఉందనుకున్నాను. కాని అది మేడిపండు సంస్కారమని అర్థమయింది”
”మేడిపండు సంస్కారమా? అదేం కొత్త పదం” మేఘన నవ్వింది.
”చిన్నప్పుడు ”మేడిపండు చూడమేలిమై ఉండును, పొట్టవిప్పి చూడ పురుగులుండు” అనే వేమన పద్యం చదువుకోలేదా. అతడు కూడా బయటకు నీటుగా తయారై, స్త్రీ జనోద్ధరణ గురించి వ్యాసాలు వ్రాస్తూ, ఇంట్లో మాత్రం భార్యను దారుణంగా తిడుతున్నాడు. అత్తగారిని కూడా అదీ, ఇదీ అని మాట్లాడుతున్నాడు. దానినే నేను ‘మేడిపండు సంస్కారం’ అంటున్నాను.
మేఘన ”మేడిపండు సంస్కారం” అని ”కొత్తగా ఉంది. దీని గురించి మా రఘకు చెప్పాలి” వ్యంగ్యంగా అంది. జయ, నీలిమ నవ్వుకున్నారు.

——————————–

1 thought on “2. మేడిపండు జూడ – ఉగాది కథలపోటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *