June 19, 2024

తలరాత మార్చిన క్షణాలు

రచన: G.V.L. నరసింహం

ఆ ఊరి పేరు కొత్తపేట. ఎంత కొత్తదో తెలియదు కాని, ఆ ఊళ్లోని ఇళ్లన్నీ, తాతలనాటి పాతవే. ఆలా అని, చిన్న చూపు చూడకండి. ఆ గ్రామానికున్న కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు తెలుసుకొంటే, మీరే ఆశ్చర్యపోతారు. అందులోనూ విశేషమేమిటంటే, అంత అభేద్యమయిన భద్రతకు, గ్రామవాసులు ఒక చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం భరించిందనుకొంటున్నారా. అది కలలో మాట. నిజానికి ప్రభుత్వం, ఆ ఏర్పాట్లను నాశనం చేసే దిక్కుగా, అడుగులేస్తోంది. ఆ భద్రతా ఏర్పాట్ల వివరాలలోకి వెళితే – పూర్వం, రాజుల కోటల చుట్టూ ఉండే కందకాల లాగ, గ్రామం లోని కొంపలన్నిటి ముందు, కంపు గొడుతున్న, వెడల్పాటి మురుగు కాలువ; ఎవరూ, ఏ ఇంటిలోకి, సుళువుగా ప్రవేశించలేకుండా, అడ్డుకొంటుంది. అదీకాక, రాత్రింబగళ్లు కాలువని అంటిబెట్టుకొని ఉండే, లక్షలాది దోమలదండు, అదనపు భద్రతా సైన్యం. అంతేకాదు. ప్రతీఇంటి ముందు, కాలువ మీదనుండి వేయబడిన ఒక బల్లచెక్క, వెడల్పు, ఒక అడుగు మించకుండా ఉండడం మూలాన్న, ఏ ఇంటిలోనికి, మూకుమ్మడిగా ఎవరూ ప్రవేశించలేకుండా, నియంత్రిస్తుంది. ఆ బల్లచెక్క మీద నడకకు నైపుణ్యం ఉండాలి. తొందరపడి అడుగు తప్పితే, గంగా స్నానమే. ప్రతి సంవత్సరం, భోగీ పండుగ ముందు రాత్రి, ఎవరి బల్లలు వారు వాళ్ళ ఇళ్లల్లో, భద్రంగా దాచుకొంటారు. మరచిపోయిన వారి బల్లలు, మరునాడు తెల్లవారు ఝామున, భోగీ మంటలో, బూడిదగా దర్శనమిస్తాయి. అదండి, కొత్తపేట ప్రత్యేకత.
ఇహ కథలోకి వెళదామా. ఆ గ్రామవాసులలో, ఎల్లాజీ, సీతాలు, అనే దంపతులున్నారు. వెనుక గొడ్లసాల గల, రెండు గదుల పెంకుటిల్లు, వారి నివాసం. వారి ఏకైక సంతానం, అప్పికొండ. ఏడెనిమిది ఏళ్ళు ఉంటాయి. ఎల్లాజీ కష్టజీవి. దగ్గరలోనే ఉన్న పట్నంలో, భవననిర్మాణాలు జోరు మీదున్నాయి. ఎల్లాజీ, వాటిలో కూలి చేసుకొని, జీవనం గడుపుతున్నాడు. సీతాలు కూడా కష్టజీవి. ఓ పది కోళ్లు, రెండు పాడిగేదెలను సంరక్షణ చేస్తూ, వాటి ఆదాయంతో, వేన్నీళ్ళకు చన్నీళ్లు కలువుతోంది. దంపతులిద్దరి ఆదాయంతో, ఆ ముగ్గురికి, రోజూ నిరాటంకంగా అయిదు వేళ్ళూ నోట్లోకి వెళుతున్నాయి.
ఆ ఊరి పిల్లలందరకు, అప్పికొండ ఒక హీరో. పట్టుదలతో ఏదయినా సాధిస్తాడు. గోళీకాయలాటలో నంబరు వన్ అయిన మన హీరోది, బిళ్ళాకర్రలో కూడా అదే రేంక్. అంతేకాదు. గాలిపటాలు ఎగురవేయడంలో స్పెషలిస్ట్. తండ్రి ఎల్లాజీతో పట్నం వెళ్ళినప్పుడు, గాలిపటాలికి కట్టే దారాలిని ఎంపిక చేసి కొనుక్కొంటాడు. కోడి పందేలలో కోడికి కత్తి కట్టినట్లు, గాజు ముక్కలను మెత్తగా పొడి చేసి,దానిని జిగురు బంకలో కలిపి, దారానికి పొడవునా చాకచక్యంగా, ఒక కవచంలా పూత పూస్తాడు. ఆ పూత, దాడి చేయదలచిన గాలిపటానికి, ఒక కోత కోసి, దాని రాత మార్చేస్తుంది. తను మాత్రం, ఎవరి గాలిపటాలపైనా దాడి చెయ్యడు.
ఒక రోజు ఉదయం, గుంట జట్టు గోళీకాయలాటకు సన్నాహమవుతన్న తరుణంలో, మన హీరో అప్పికొండ, “కిట్టిగాడు ఈ కాడికింకా రాలేదేట్రా” అని ఎటెండెన్సు తీసుకొంటున్న సమయంలో, యమ స్పీడులో కిట్టిగాడొచ్చి “అప్పీ, ఈ యేల నేను ఆటకి రానురా” అనడంతో “ఏటయింది” అని వివరణ కోరేడు అప్పికొండ.
“ఈ యేల మా అయ్య నన్ను బడిలో ఏత్తున్నాడు. కొత్త నాగు, సొక్కా ఒట్టుకొచ్చినాడు. అవిఏసుకొని, మా అయ్యతో గుడికెళ్ళి, అమ్మోరికి దండమెట్టుకొని, బడికెళ్తా.” అని గుక్క తిప్పుకోకుండా ప్రకటన చేసి, వచ్చిన స్పీడులోనే, ఇంటికి తిరుగు ముఖం పట్టేడు. అది విన్న మన హీరో అయిదు నిముషాలు, దీర్ఘాలోచనలో పడి, అకస్మాత్తుగా “ఒరే, మీరు ఆడుతుండండ్రా. నాను అర్జన్టుగా ఇంటికెళ్లి ఒత్తా.” అని క్రికెట్లో, బౌండరీ దిశగా దూసుకు పోతున్న బంతిని, ఆపడానికి శరవేగంతో పరుగులెడుతున్న, ఫీల్డర్ వలె, పరుగున ఇల్లు చేరుకొన్నాడు. ఏ కారణం చేతనో, ఆ రోజు ఎల్లాజీ ఇంట్లోనే ఉన్నాడు. పరుగు పరుగున వచ్చి, అప్పికొండ ఎగఊపిరి దిగ ఊపిరితో, జారిపోతున్న లాగుని, మొలత్రాడులోనుండి మీదకు ఎగతోస్తూ, ఎల్లాజీ చెయ్యి పట్టుకొని “అయ్యా, కిట్టిగాడిని, ఆడయ్య బడిలో ఏత్తున్నాడు. నన్నూ బడిలో ఎయ్యయ్య.” అని ఒక అర్జన్టు డిమాండ్ పెట్టేడు. గొడ్లసాలలో ఉన్న సీతాలు చెవిలో, ఆ శుభవార్త పడగానే, చేతిలో ఉన్న పేడ, ప్రక్కనే ఉన్న గోతిలో పడవేసి, కుడిత కుండీలోని నీళ్లతో చెయ్యి కడుక్కొని, చీర కొంగుతో చెయ్యి తుడుచుకొంటూ, రంగస్థల ప్రవేశం చేసింది.
తల్లిని చూడగానే, “అమ్మా, అయ్యతో సెప్పవే, నన్ను బడిలో ఎయ్యమని.” అని మనవి చేస్తుంటే, దంపతులిద్దరూ సంబ్రమాశ్చర్యాలతో, ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొన్నారు. కారణమా? వాళ్ళ కుటుంబాల్లో, అటూ ఇటూ, ఏడు తరాలలో ఏ ఒక్కరు, అంత విప్లవాత్మకమయిన ఆలోచన చెయ్యిలేదు. సీతాలు సుపుత్రుణ్ణి గట్టిగా కాగలించుకొని, “నా బంగారు కొండే. అమ్మోరి పండుగల్లో, దేవాలయం కాడ కొండదొర సెప్పినాడు గా, నువ్వు సదువులు సదుక్కొని, కలకటేరు సేత్తావని. అంతా, ఆ అమ్మోరి దయ.” అంటూ కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ, స్తంభించిపోయిన ఎల్లాజీ భుజం తడుతూ “ ఏటి అట్టా సూత్తావు, గమ్మున పూజారి గారి కాడకెళ్లి, మన బంగారుకొండని బడిలో ఎయ్యడానికి, మూర్తం అడుగు.” అని నొక్కి చెప్పింది, ఉబ్బి, తబ్బిబ్బయిపోతున్న , సీతాలు.
“ఎహె, నోటికాడ, ఆ బీడీ ముక్క పారేయి. సేతులు కడుక్కోని, తొందరగా రా.” ఎల్లాజీకి, కొద్దిగా అసహనం ప్రకటిస్తూ, చెప్పింది సీతాలు.
చేతులు కడుక్కొని, సీతాలు ముందు నిలబడ్డాడు, ఎల్లాజీ.
“అమ్మోరు హుండీలో, ఈ సిల్లర డబ్బులేసి, పూజారి గారి పాదాలకి దండమెట్టి, మన బంగారుకొండని, బడిలో ఎయ్యడానికి, మూర్తం అడుగు. అయన సెప్పింది జాగరత్తగ ఇనుకో. పూజారిగారి కాడనుండి, నే…రుగా, బడిలో పంతులుగారికాడకెళ్ళు. మన బంగారు కొండని, బడిలో ఎయ్యడానికి, ఏటేటి కొనాలో; బలపాలు, పుల్లలు, పుత్తకాలు, అన్నీ అడిగి జాగరత్తగ ఇనుకో.” ఎల్లాజీకి, ఏక్షన్ ప్లేను వివరంగా చెప్పింది, సీతాలు.

సీతాలు మాట తు.చ.తప్పకుండ, పూజారిగారి ఎదుట చేతులు కట్టుకొని, వినయంగా నిలబడ్డాడు ఎల్లాజీ. పంచాంగం చూస్తూ, వ్రేళ్ళు లెక్కపెడుతూ, “రాబోయే మంగళవారం, ఉదయం పది గంటలకు, బ్రహ్మాండమైన ముహూర్తం. ఆ రోజు ఉదయాన్నే, అమ్మవారికి పూజలు చేసి, మీ అప్పిగాడిని బడిలోచేర్పించు. చదువు ఫస్టుగా వస్తుంది. అమ్మవారికి కొత్త చీర కట్టబెట్టి, పూజ ప్రారంభించాలి.” పూజారిగారు ముహూర్తం పెట్టేరు.
“అట్టాగేనండి, అయ్యగారూ. పట్టంనుండి, అమ్మోరికి ఎర్ర చీర కొని ఒట్టుకొత్త” గంగిరెద్దులా తల ఊపేడు, సింహాద్రి.
“సరేలే, మంగళవారం ఉదయాన్నే, మీరు ముగ్గురు, తలకి స్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకొని, ఎనిమిది గంటలికి, ఇక్కడికి రండి. పూజ అయిన వెంటనే, అప్పిగాడిని బడిలో చేర్పించండి. సరేనా.” వివరంగా చెప్పేరు, పూజారి గారు.
“అమ్మోరివి, తమరివి దీఎనలు ఉంటె, మా కిట్టిగాడికి సదువు బాగ ఒత్తదండి. దండాలండి అయ్యగారు. ఒత్తానండి.” వంగి, వంగి, దండం పెడుతూ, పూజారి గారి దగ్గర శలవు తీసుకొన్నాడు, సింహాద్రి.
సంతోష సముద్రంలో మునిగి తేలుతున్న ఎల్లాజీ, బడి భవనం చేరుకొని, స్తంభం వద్ద చేతులు కట్టుకొని, వినయంగా నిలబడ్డాడు. పంతులుగారు అది గమనించి, లోపలికి రమ్మని, సౌంజ్ఞ చేసేరు. వంగి, వంగి, దండాలు పెడుతూ, తన పరిచయం చేసుకొని, పంతులుగారికి ఆమడ దూరంలో నిలబడి, ఎల్లాజీ విషయం విపులంగా విన్నవించుకున్నాడు. పంతులుగారు సంతోషిస్తూ “మీ వాడికి, అంత మంచి ఆలోచన రావడం, ఆ సరస్వతీ దేవి కటాక్షం. పూజారిగారి సలహా మేరకు, వచ్చే మంగళవారం వాడిని బడిలో చేర్పిస్తాను.” అని హామీ ఇచ్చేరు, పంతులుగారు.
“పంతులుగారండి, బడిలో సేరడానికి, ఆడికి ఏటేటి కొనాలో, తమరు సెలవిస్తే, పట్టంలో కొని ఒట్టుకొత్తా.” విన్నవించుకున్నాడు, సింహాద్రి.
“రాసి ఇస్తాను. పట్నంలో, ఆంజనేయస్వామి ఆలయం ప్రక్కనే, పుస్తకాల దుకాణం ఉంది. అక్కడ అవన్నీ దొరుకుతాయి.” అని సలహా ఇచ్చి, లిస్టు రాసి ఇచ్చేరు, పంతులుగారు.
“అట్టాగేనండి అయ్యగారు. రేపే ఒట్టుకొత్తానండి.” వంగి దండం పెడుతూ అన్నాడు, సింహాద్రి.
“సరే, మీవాడి పేరేమిటన్నావు.” పంతులుగారు తెలియగోరేరు.
“ఆడి పేరు… అప్పికొండండి, పంతులుగారు.” సింహాద్రి సమాధానం.
“అప్పికొండ పేరు…అంత బాగులేదు. అప్పారావు, అని రెజిస్టరులో రాస్తాను. సరేనా.” అప్పిగాడి పేరును, అఫీషియలుగా సంస్కరణ చేసేరు, పంతులుగారు.
“తమరికి అన్నీ, బాగ ఎరిక. తమరు ఎట్టా సెబితే అట్టాగే నండి.” అంగీకారాన్ని వినయపూర్వకంగా, తెలియబరచేడు, సింహాద్రి.
“సరేలే. మంగళవారం వాడితోబాటు ఓ అరగంట ముందుగా రా.”
“అట్టాగేనండి. దండాలండి పంతులుగారు. ఒత్తానండి.” పంతులుగారి దగ్గర శలవు తీసుకొన్నాడు, సింహాద్రి.
ఇంటికి మళ్ళిన ఎల్లాజీ జరిగినదంతా, వివరంగా సీతాలు చెవిలో వేసేడు.
మన హీరో చేరబోయే బడి వివరాల్లోకి వెళితే –
ఆరు కర్ర స్తంభాలు, వాటిపై ఎండుగడ్డితో ఏర్పడ్డ పైకప్పు, గ్రామవాసులు సమకూర్చిన, బడి భవనం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, దిగువున, కొత్తపేట, అని లిఖింప బడ్డ, రెండడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు గల బల్లచెక్క, మూడు మేకులతో కొట్టబడి, ఒక మధ్య స్తంభానికి, ఆరడుగుల ఎత్తున, అలంకారంగా దర్శనమిస్తుంది. మూడునాలుగు వరుసలలో, విద్యార్థులు ఆసీనులై ఉంటారు. వెనుక, సేద తీర్చుకొంటున్న మేకలు, భవనానికి నిండుతనం ఇస్తుంటాయి. ప్రభత్వం వారి రికార్డులలో, బడి పనిచేయు వేళలు; ఉదయం ఎనిమిది గంటల నుండి, మద్యాహ్నం రెండు గంటల వరకు; ఆదివారం శలవు అని ఉంటుంది. కాని, పట్నంనుండి ఆ గ్రామానికి 9 గంటలకు వచ్చే మొదటి బస్సు, బడి తెరచుకొనే సమయాన్ని రోజూ నిర్ణయిస్తుంది. బడిలో పాఠాలు చెప్పే పంతులుగారు, ఆ బస్సులోనే రోజూ వస్తూంటారు. ఆ బడి మొత్తం సిబ్బంది, తాత్కాలికంగా నియమింపబడ్డ ఒకే ఒక పంతులుగారు. ఆయనికి, ప్రభుత్వం నుండి ముడుతున్న జీతం కన్నా, గ్రామస్తులు గురుదక్షిణగా ఇచ్చే బియ్యం, పప్పులు, కూరగాయలు, పండుగలికిచ్చే, నూతన వస్త్రాల విలువ ఎక్కువ. అందుకు కృతజ్ఞతగా, ఆయన తనకు వీలుపడని రోజులలో, పదో తరగతి పాసయిన పెద్దకొడుకుని తన డ్యూటీలో వేస్తాడు.
అప్పారావు అవతారం ఎత్తబోతున్న అప్పిగాడిని, ఎల్లాజీ పట్నానికి తీసుకెళ్ళేడు. పెద్దబజారులో, కిటకిట లాడుతున్న, పాదచారుల దారి మీద ఉన్న, ఒక తాత్కాలిక దుకాణంలో, నాలుగు జతల లాగులు, చొక్కాలు, కొన్నాడు. తోపుడు బండిమీద అమర్చి అమ్ముతున్న, హవాయి చెప్పులు నుండి, ఒక జత, వాటికి చేర్చేడు.
ఎల్లాజీ కుటుంబం ఎదురుచూస్తున్న, మంగళవారం వచ్చింది. పూజారి గారి మాట ప్రకారం, ముగ్గురూ ఉదయాన్నే తలకు స్నానం చేసేరు. దంపతులిద్దరూ ఉతికిన వస్త్రాలు ధరించేరు. మన హీరో, పట్నంనుండి కొని తెచ్చుకొన్న వాటిలో, నీలంరంగు లాగు, పసుపుపచ్చని చొక్కా, ఎంచుకుని వేసుకొన్నాడు. అతి ఉత్సాహంతో, పలక, పుల్ల, మున్నగు సరంజామా, తండ్రి కొన్న సంచిలో, జాగ్రత్తగా అమర్చుకొన్నాడు. ముగ్గురూ, ఎనిమిది గంటల ప్రాంతంలో దేవాలయం చేరుకొన్నారు. అప్పటికే, పూజారిగారు పూజా సన్నాహాలు చేస్తున్నారు. కొత్త చేనేత తువ్వాలుపై, బియ్యం, చతుర్భుజాకారాలలో అమర్చి, వాటి మధ్యన, విఘ్నేశ్వరుని ప్రతిమ నిలబెట్టేరు. సరస్వతి దేవి పటం, గోడకు చేర్చి నిలబెట్టేరు.అప్పిగాడి పుస్తకాల సంచి కూడా, తువ్వాలుని చేరింది. ఎర్ర రంగు చీర అమ్మవారిని అలంకరించింది. వేరొక కొత్త చేనేత తువ్వాలుపై, ఎల్లాజీ దంపతులిద్దరి ప్రక్క, విద్యార్ధి కాబోతున్న అప్పికొండ ఆసీనుడు కాగా ‘శుక్లామ్బర ధరమ్’ తో పూజ ప్రారంభమయింది. తొమ్మిదిగంటల ప్రాంతంలో పూజ ముగిసింది. పూజారిగారికి దక్షిణ తాంబూలాలు, చేనేత తువ్వాళ్లు, బియ్యం, పూజాసామగ్రుల విలువ సమర్పించుకొని, అయన దీవెనలందుకొన్నారు. బడిలో ప్రవేశిస్తున్నప్పుడు,ముందుగా కుడికాలు మోపమని, అప్పిగాడికి సలహా ఇచ్చేరు, పూజారిగారు. ముగ్గురూ, బడి దిక్కుగా పయనమయ్యేరు. కాలిజోడు జోలికి ఏ రోజూ పోని, అప్పిగాడి పాదాలను, హవాయి చెప్పులు తప్పించుకొని, ప్రక్కకు జారిపోతున్నాయి. ఆ సీను గమనించేడు, ఎల్లాజీ. బడికి, ముహూర్తం వేళకు చేరలేమేమో అని ఆందోళన పడి, సుపుత్రుడిని భుజాలికెక్కించుకొన్నాడు. ఒక చేత్తో, వాడి చెప్పులు పట్టుకొని, సీతాలుతో బాటు వడివడిగా అడుగులేస్తూ, పదిగంటలకు పది నిమిషాల ముందుగానే, ప్రభత్వ పాఠశాల ముందు ప్రత్యక్షమయ్యేడు. మన హీరో వాహనం దిగేడు. అది గమనించిన పంతులుగారు ప్రసన్నులయ్యేరు. రెప్పలార్పకుండా చేతినున్న వాచీలోకి చూస్తూ, పెద్దముల్లు పండ్రెండవ అంకెను సమీపిస్తుంటే “అప్పారావు, లోపలికి రా.”అని ఆహ్వానం పలికేరు.
ఆతృతగా సంబరబడుతూ, అప్పికొండ పరుగున బడిలోనికి ప్రవేశించేడు. అది గమనించిన సీతాలు, “ముందస్తుగా కుడికాలెట్టాలని పూజారి గారు సెప్పినారు. ఏ కాలెట్టినావురా.” అని పుత్రరత్నాన్ని ప్రశ్నించింది, సీతాలు. కొయ్యబారిపోయేడు, అప్పికొండ. సమస్య గ్రహించిన పంతులుగారు, “ఫరవా లేదు. పదికి ఇంకా పది సెకండ్లున్నాయి.” అంటూ ధైర్యం పలికేరు.
“అప్పారావు, బయటకు పోయి దండం పెడుతూ, ముందుగా కుడికాలు లోపలికి పెట్టి, బడిలో ప్రవేశించు.” సవరణ పలికేరు, పంతులుగారు. సీతాలు ఊరట చెందింది. అప్పిగాడి కుడికాలు, పాఠశాలలో ప్రవేశించింది. పంతులుగారి సౌంజ్ఞలు చూసి, పిల్లలందరూ, ఆపకుండా చప్పట్లు కొట్టి, వాళ్ళ నాయకునికి స్వాగతం పలికేరు. ఆ చప్పుళ్లకు బెదిరిపోయి, వారి వెనుకనున్న మేకలు, పరుగున దగ్గరలో నున్న మర్రిచెట్టు క్రిందకు మకాం మార్చేయి. అప్పిగాడి పేరు, అధికారికంగా మారింది. ఎటండెన్సు రెజిస్టరులో, ‘అప్పారావు’ అని వ్రాయబడింది. అప్పారావు పుట్టిన తేదీ కూడా, పంతులుగారే బాగా అలోచించి, తగు రీతిలో రెజిస్టరులో నమోదు చేసేరు. పంతులుగారికి వినయపూర్వకంగా నమస్కరించి, ఎల్లాజీ దంపతులు గృహోన్ముఖులయ్యేరు.
పూజారిగారు పెట్టిన ముహూర్త బలం: అప్పారావు చదువులో మెచ్చుకోదగ్గ శ్రద్ధ చూపడంతో, ఆటలలోలాగే, చదువులో కూడా, ఫస్టు రేంకు స్వంతం చేసుకొన్నాడు. ఎల్లాజీ, పంతులుగారి సలహా పాటించి, ఎలిమెంటరీ స్కూలులో చదువు ముగిసేక, కొడుకుని పట్నంలోని మిడిల్ స్కూలులో, ప్రవేశపెట్టేడు. ఎల్లాజీ దంపతులకు కూడా, రోజులు కలిసొచ్చేయి. కూడబెట్టిన డబ్బుతో, ఒక ఎకరా భూమి కొన్నారు. గ్రామంలో కొత్తగా వెలిసిన బేంకులో, అప్పు చేసి, మరో రెండు గేదెలు, యాభయి కోళ్లు కొని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొన్నారు.
అటు తనయుడు అప్పారావు ఇంతింతై వటుడింతై అన్నట్లు, పట్నంలో హైస్కూలు, డిగ్రీ, తరువాత పి.జి. చెప్పుకోదగ్గ మార్కులతో పూర్తి చేసి తెలుగులో సివిల్స్ రాసేడు. ఉన్నతమయిన రేంకులో ఉత్తీర్ణుడయి ఆంధ్ర రాష్ట్రంలోని పాత్రికేయుల ప్రశంసలనందుకొన్నాడు. ‘‘మట్టిలో మాణిక్యం’ ‘మరో తెలుగు తేజం’ అని పత్రికలు ప్రశంసల వర్షం కురిపించేయి. తగు సదుపాయములు అందజేస్తే, ఎవ్వరికీ తీసిపోని పిల్లలు, మన పల్లెలలో కొల్లలుగా ఉన్నారని, నొక్కి చెప్పేయి.. అప్పారావు పేరుకు, ఐ.ఏ.ఎస్. అను మూడక్షరాలు జోడించబడ్డాయి. తరతరాలనుండి, వేలిముద్రలే వేసుకొని వస్తున్న కుటుంబంలో జన్మించి, నిత్యం గోళీకాయలో, బిళ్ళాకర్ర ఆడుతూ, బాల్యం గడుపుతుండే తనను, గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు చేసిన క్షణాలు జ్ఞాపకం చేసుకొన్నాడు, అప్పారావు ఐ.ఏ.ఎస్. గా మారిన అప్పిగాడు. అవే, ఆరోజు ఉదయం కిట్టిగాడు తను బడిలో చేరుతున్నాని చెప్పిన క్షణాలు. కిట్టిగాడు బడికెళితే నేనెందుకెళ్లను, అని దీర్ఘంగా అలోచించి తన ఉన్నతమయిన భవిష్యత్తుకు తానే పునాది వేసుకొన్న క్షణాలు.

**********************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *