September 23, 2023

వెంటాడే కథలు! – 4 . మట్టిమనిషి

రచన: చంద్రప్రతాప్ కంతేటి

నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!
-చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు

 

*******************************************************************************************

 

 

అరవయ్యో పడిలో పడిన చున్నీలాల్ తన పొలంలో లేత గడ్డిని కోస్తున్నాడు. అతని వెనుకే ‘మే..మే’ అంటూ గంతులేస్తూ ఒక బుజ్జిమేక పిల్ల. అప్పుడప్పుడు అది చున్నీలాల్ ను వెనుక నుంచి ప్రేమగా కుమ్ముతూ ఆడుతుంటే అతని మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఆ మేక పిల్లంటే అతనికి ప్రాణం. దాని స్పర్శ అతనికి కితకితలు పెడుతుంది. అచ్చం సుందర్ చిన్నప్పుడు తనతో ఆడుకున్న అనుభూతే కలుగుతుంది. బుజ్జిమేక కోసమే లేలేత గడ్డి, లేత ఆకులు, చివుళ్లు కోస్తున్నాడు తను. రాత్రిపూట కూడా అది అతని గొంగళిలో దూరి వెచ్చగా పడుకుంటుంది. దాన్ని నిమురుతూ నిద్రిస్తాడతను. ఆ గ్రామంలో అదొక్కటే అతనికి నేస్తం.. వాళ్లిద్దరూ ఒకర్నొకరు అంటుకుతిరుగుతుంటారు
మధ్యాన్నం ఒంటిగంట అవుతోంది. ఎండ నిప్పులు చెరుగుతోంది. చున్నీలాల్ అలిసిపోయాడు. బుజ్జిమేక పక్కనే ఉన్న చెట్టు నీడలో పడుకుని విశ్రాంతిగా నెమరేస్తోంది.
ఆ సమయంలో ఎవరిదో కేక ..
గాలిలో అలలా తేలివచ్చి ముసలాయన చెవిని సోకింది.
”ఓ ముసలయ్యా.. యాడున్నావ్? తొందరగా ఇంటికి నడు..”
ఆ గొంతు పక్క పొలంలోని కైలాష్‌చంద్‌ది అని గుర్తుపట్టాడు చున్నీలాల్ !

”పోతాం లేరా.. అప్పుడే తొందరేమొచ్చింది.. ” అరిచాడు జవాబుగా.
”ఓర్నీ ముసలోడా! ఇందాకటి కారు సప్పుడు ఎవరిదనుకున్నావ్? పట్నం నుంచి మీ సుందరం వచ్చాడు.. నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? పిల్లోడికి తిండి తిప్పలు సూడవా?”
సుందర్ పేరు చెవులబడగానే ఉలిక్కిపడ్డాడు చున్నీలాల్.
మరుక్షణంలోనే మనసు ఆనందంతో ఉరకలు వేసింది.
ఎన్నాళ్ళయింది బిడ్డను చూసి?!
ఎన్నాళ్లు కాదు.. ఎన్నేళ్లు అయింది??
ఇప్పుడెంత ఎదిగిపోయాడో?
అవును చాలా సేపటి క్రితం కారు చప్పుడు విన్నాడు తను.
ప్రధాన్ గారి చుట్టాలో, అధికారులో అనుకున్నాడు.
ఆ కారు వచ్చింది తన గుడిసెకేనని ఊహించలేకపోయాడు.
అందులో వచ్చింది తన కొడుకేనని అస్సలు అనుకోలేదు.
నిజమే తనెప్పుడూ మట్టిబుర్రే!
పార్వతి బతికున్నంతకాలం తనని ‘మట్టిబుర్ర’ అనేది కోపానికైనా .. వేళాకోళానికైనా!
”బుజ్జి లేవరా.. అన్నయ్య వచ్చిండు.. మనం బేగి గుడిసెకు పోవాల.. ” అంటూ మేకపిల్లను మెడపైన, గడ్డిమోపును చంకన పెట్టుకుని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిసెకి బయలుదేరాడు.
బుజ్జిమేక ‘మేమే’ అంటుంటే –
”ఉండే పిచ్చిదానా నీ అల్లరి ఎక్కువై పోనాది” అని దాన్ని ముద్దుగా కసరి ఉరుకులు పరుగుల మీద రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చి పడ్డాడు చున్నీలాల్.
కానీ అతను ఆశించినట్టు తన గుడిసె ముందు కారు లేదు.. సుందర్ కూడా లేడు!
పక్కింటి కళాదేవిని అడిగాడు.
”అమ్మాయి మా పోరడు సుందర్ వచ్చిండా?”
”లేదు తాతా.. ఎవురూ వచ్చినట్టు లేదు..” అంటూ ఇంట్లోకి పోయిందామె.
మరి కైలాష్ గాడు అలా చెప్పి చచ్చాడేంటి? అయినా ఆడికి అబద్దం ఆడాల్సిన కర్మమేంటి ? అంతలో వీధిలో పోతున్న ప్రేమ్‌సింగ్ కొడుకు కనబడితే అడిగాడు.
”అబ్బీ .. ప్రధాన్ గారింటి దగ్గర మా సుందర్ కనిపించాడా? ఆడు వచ్చిండంట గదా?”
”అవును ముసలోడా.. సుందర్ ఆడ్నే ఉన్నాడు. సూటూ బూటూ కళ్లద్దాలు ఖరీదైన కారు.. నేనే గుర్తుపట్టలేదు” అన్నాడా కుర్రాడు నవ్వుతూ.
”ఆడు నా కొడుకురా. ఆడి దర్జా ఎవరికీ రాదు..” అంటూ మీసం దువ్వాడు చున్నీ.
ఆ కుర్రాడు వెళ్ళిపోయాక వేరే ఆలోచనలో పడ్డాడు చున్నీ.
తనకు పొద్దుటిది జొన్నన్నం కాస్త ఉంది. సుందర్ అది తింటాడో తినడో.. పట్నంలో ఉండేటోడికి అది రుసించదు. అని బియ్యం డబ్బా మూతతీసి చూశాడు. చారెడు బియ్యం ఉన్నాయి. తను వరన్నం తిని ఎన్నాళ్ళైందని! ఏమో గుర్తే లేదు.
సరే కళమ్మను అడుగుదాం.. అనుకుని పక్కింటి తలుపు కొట్టాడు.
మంచి నిద్రలో ఉందేమో విసుక్కుంటూ తలుపు తీసింది.
”ఏందీ ముసలోడా.. రాత్రంతా నీ మేక.. పగలంతా నువ్వు మమ్మల్ని పడుకోనివ్వరా ?” అని కరిచినంత పని చేసింది.
ఎలాగో బతిమాలి ఒక శేరు బియ్యం అప్పు తెచ్చాడు చున్నీలాల్.
బియ్యం ఇచ్చి ఆమె ఠపీమని తలుపు వేసుకోగానే అతనికి ఇంకో ఆలోచన వచ్చింది.
అన్నం సరే .. మరి కూర మాటేమిటి?
కళమ్మ దొడ్డి వైపు కంచె మీద పాకుతున్న సొరతీగ దాని పెద్దపెద్ద కాయలూ కళ్ళముందు మెదిలాయి.
సొరకాయ పులుసు అంటే సుందర్ కి పండగే.
తప్పని తెలిసినా కొడుకుపై ప్రేమ తప్పనిసరిగా దొంగతనం చేయించింది. అన్నం, పులుసు రెడీ అయిపోయాయి.
అప్పుడు గుర్తొచ్చిందతనికి..
మాంసం కూర లేకుండా సుందర్ ముద్ద ఎత్తడని.
ఇప్పుడు మాంసం కూర ఎక్కడ నుండి తేవాలి?
ఆలోచనలతో మెదడు వేడెక్కుతుండగా అదే సమయానికి మంచం కింద పడుకున్న బుజ్జిమేక ‘నేనున్నాను’ అన్నట్టు ‘మేమే’ అని అరిచింది.
బిడ్డలా చూచుకుంటున్న ‘బుజ్జి’ని బలి చేయడం నేరమా?
మనసు విలవిలలాడింది.
ఏం చేయాలో తోచలేదు.
మరో పక్క కొడుకు భోజనానికి వచ్చే సమయం అయింది.
గుండెను రాయి చేసుకున్నాడు చున్నీ.
కొడుకు కంటే తనకు ఎవ్వరూ ఎక్కువ కాదు.
రేపు తను పొతే తలకొరివి పెట్టేవాడు వాడే.
వాడి కోసం ఏం చేసినా తప్పులేదని తీర్మానించుకున్నాడు.
అమాయకంగా అతని వంక నడిచి వచ్చిన బుజ్జి చట్టిలో కూరైపోయింది.
దాని గొంతు కోసేటప్పుడు అది ఆశ్చర్యంగా చూసిన చూపు చున్నీలాల్ గుండెల్లో గునపంలా దిగింది.
దానికోసం ఏరేరి తెచ్చిన లేత గడ్డిపోచలూ, చివుళ్ళూ ‘ఇదేం పని?’ అన్నట్టు చూసి ఆశ్చర్యపడి కాబోలు గాలికి తలలు ఊపుతున్నాయి.
చున్నీలాల్ ఇప్పుడు ఏకాకిగా ఉన్నాడు కానీ పాతికేళ్ల క్రితం అతనికి ఒక కుటుంబం ఉండేది. తన భార్య పార్వతితో పాటు తమ్ముడు ఈశ్వర్ లాల్, అతని భార్య కమలాదేవి అంతా కలిసే ఉండేవాళ్ళు.
కొండ చరియల్లో తమకు నాలుగెకరాల పొలం ఉండేది.
తనకు పిల్లలు లేరుగానీ తమ్ముడికి సుందర్ లాల్ అనే ఒక ముద్దులు మూటగట్టే మూడేళ్ళ బాబు ఉండేవాడు.
ఇంట్లో వాడిని అందరూ విపరీతంగా గారాబం చేసేవారు. అందరికన్నా చున్నీలాల్ ఎక్కువ.
భుజం దింపితే సుందర్ కందిపోతాడు అన్నంత సున్నితంగా చూసుకునేవాడు.
ఇంట్లో మాంసం కూర వడ్డిస్తే తన కంచంలోని లేత లేత ముక్కలన్నీ ఏరి ప్రేమగా సుందర్ నోటికి అందించేవాడు. వాడు వాటిని ఇష్టంగా తింటుంటే అతని కళ్ళలో ఆనంద బాష్పాలు జలజల రాలేవి.
అది చూసి బాబు అమాయకంగా చప్పట్లు కొడితే మిగిలిన ముగ్గురు పెద్దలూ ఆ ఇద్దరినీ చూసి మురిపెంగా నవ్వుకునేవారు.
సుందర్ కు నాలుగేళ్ల ప్రాయంలో పట్నానికి వెళ్లి వస్తున్న తమ్ముడు, మరదలు మోటార్ బైక్ యాక్సిడెంటులో ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ సుందర్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.
వార్త తెలిసి చున్నీ- పార్వతీ హుటాహుటిన సంఘటనా స్ధలానికి వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి వాళ్ళు ఘొల్లుమన్నారు.
అమ్మా నాన్నల శవాల నడుమ కూర్చుని ఏడుస్తూ తన బుల్లి చేతులతో వాళ్ళను లేవమని తడుతూ ఉన్నాడు వాడు.
ఏడ్చి ఏడ్చి వాడి బుగ్గల మీద కన్నీటి చారికలు కట్టాయి. గొంతు కూడా బొంగురు పోయింది.
పెదనాన్నను చూడగానే వాడి కళ్ళు మెరిశాయి.
కిలకిలా నవ్వుతూ ఆయన భుజం ఎక్కి నేలపై పడున్న అమ్మా నాన్నల వంక ఆశ్చర్యంగా చూశాడు.
అప్పటి నుంచి సుందర్ బాధ్యత చున్నీ దంపతులే తీసుకున్నారు.
సొంత బిడ్డకన్నా ఎక్కువగా చూచుకున్నారు.
వాడు తమకు దైవం ఇచ్చిన బిడ్డ అనుకున్నారు. ఏ లోటూ తెలియనీయకుండా పెంచారు.
పట్నంలో చదివించారు.
ఈ క్రమంలో ఉన్న నాలుగెకరాల్లో మూడెకరాలు కరిగిపోయాయి.
అయినా చున్నీలాల్ బాధ పడలేదు.
తన కొడుకు ఎదుగుదలకు పొలం ఏమిటి? అవసరమైతే ప్రాణాలే ఇచ్చేస్తాడు తను.
కొన్నాళ్ళకు పులిమీద పుట్రలా పార్వతిని కాన్సర్ సోకింది.
ఆమె వైద్య ఖర్చులకు అరెకరం ఆవిరైంది.
గేదెలు, మేకలూ కూడా అమ్మేయాల్సి వచ్చింది.
అయినా మనిషి దక్కలేదు.
అప్పుడు నిరాశలో కూరుకుపోయాడు చున్నీలాల్.
ఏడాది క్రితం కొండచరియల్లో ఓ బుజ్జి మేకపిల్ల చలికి బిగదీసుకుపోయి కనిపిస్తే దాన్ని ఇంటికి తెచ్చుకుని బిడ్డలా సాకుతున్నాడు చున్నీలాల్. అప్పటి నుంచి అతనికి ఓ తోడు దొరికినట్లయింది. దానితోనే మాటలు ఆటలు సాగించేవాడు.
చదువు అయిపోయాక సుందర్ లాల్ ఒక్కసారి కూడా పెదనాన్న దగ్గరికి రాలేదు.
తన గురించి అడగలేదు. అతని గురించి చెప్పలేదు.
ఊరివాళ్లు ఎవరైనా పట్నానికి వెళ్తే కనిపించేవాడు కాబోలు..
”మీ వాడు పట్నంలో కార్లో వెళ్తూ ఉండడం చూశాం ముసలోడా.. యమా దర్జాగా దొరబాబులా ఉన్నాడు” అనేవారు.
వారి మాటలకు చున్నీ చేయి గర్వంగా మీసం మీదకు వెళ్లి దాన్ని దువ్వేది.
ఆలోచనల్లోనుంచి బయటకు వచ్చాడు చున్నీ.
‘అవును.. వీడింకా రాలేదేం?’ అనుకున్నాడు.
‘భోజనం వేళ మించిపోతోంది. అసలు ఆకలికి ఆగలేడు పిచ్చి సన్నాసి’
‘కొంపదీసి అటునించి అటే పోయాడా పట్నానికి?’ అనుమానం వచ్చింది.
‘అబ్బే అలా ఎందుకు చేస్తాడు?
ఊళ్లోని పక్క వీధి దాకా వచ్చిన వాడు పెదనాన్నను చూడకుండా ఎలా వెళ్తాడు?
కచ్చితంగా ఇంటికే వస్తాడు. రాగానే తనను కౌగిలించుకుని భోరుమంటాడేమో? బడిలో చదువుకునేప్పుడు చిన్నప్పుడు వాడికి తల్లిదండ్రులు ఎప్పుడూ గుర్తుకు వచ్చేవారు కాదు. తనూ తన భార్య పార్వతి తప్ప!
అంతలో తలుపు చప్పుడు..
‘అదుగో ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చాడు.. దేవుడు వాడికి అక్షరాలా నూరేళ్లాయుష్షు ఇవ్వాలి’
అనుకుంటూ తలుపు తీసిన చున్నీకి కొడుకు బదులు పక్కింటి కళమ్మ- కాళమ్మలా కళ్ళలో నిప్పులు రాలుస్తూ కనబడింది.
”ముసలోడా నీకు సిగ్గూ శరం మానం మర్యాద పెట్టలేదా దేవుడు? బియ్యం అప్పిచ్చిన దాని పెరట్లోనే సొరకాయ తెంపుకుపోతావా? కనీసం అడిగి తీసుకోవాలన్న బుద్ధి కూడా లేదా? కాటికి కాళ్లు చాచుకున్న వయసులో నీకిదేం మాయ రోగం?” అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా చెరిగేసింది.
”కాదు తల్లీ.. ”
”అరె చుప్.. నోరెత్తావంటే చెంపలు వాచిపోతాయి.. తప్పుడు పని చేసింది కాక మళ్ళీ తల్లీ పిల్లీ అని బుకాయింపులా? మా ఆయన రానీ.. నీ కాళ్లు చేతులూ విరిచి పొయ్యిలో పెడతాడు” అంటూ విసవిసా వెళ్ళిపోయింది.
ఆమె వెళ్లిన అరగంట దాకా చున్నీలాల్ మనిషి కాలేక పోయాడు.
ఇంకా వాళ్ళింట్లో నుంచి ఆమె తిట్లు వినబడుతూనే ఉన్నాయి.
అంతలో వీధి నుంచి వెళ్తున్న జీవత్ లాల్ కనబడితే –
”జీవత్.. మా సుందర్ ఇంకా ప్రధాన్ గారింటి దగ్గరే ఉన్నాడా? వాడి కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నా”అని అడిగాడు.
జీవత్ తలగోక్కుని – ”సుందర్ ఎప్పుడో రెండింటికే వెళ్ళిపోయాడు కదా ప్రధాన్ గారింట్లో భోజనం చేసి!.. నిన్ను కలుసుకుని వెళ్తాడు అనుకున్నాం. మా భోజనాలు ఇప్పుడే అయ్యాయి. అయితే వాడు నీ దగ్గరకు రాలేదా? సర్లే ఫోఫో లోపలి పోయి కాస్త ఎంగిలి పడు. వాడీపాటికి పట్నం కూడా చేరుకొని ఉంటాడు” అంటూ వెళ్ళిపోయాడు.
చున్నీలాల్ కు కళ్ళముందు ఆకాశం నేలా అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది.
చిన్నప్పుడు సుందర్ ముద్దుమాటలు ఒక పక్క, బుజ్జిమేక ‘మేమే’ అని అరుస్తూ తన దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతిలోని కత్తి వేటుకు తల వాల్చేసి విలవిలలాడడం మరోపక్క దృశ్యాదృశ్యంగా కనబడింది. తన శరీరాన్ని ఎవరో ఖండఖండాలుగా నరుకుతున్నంత బాధ కలిగిందతనికి. ఇంకోపక్క తమ్ముడు మరదలు శవాలు వాటి మధ్య ఏడుస్తూ చిన్నారి సుందర్ కనిపించాడు. కాన్సర్ బాధ భరిస్తూ కూడా భార్య పార్వతి తనను ‘మట్టి బుర్ర’ అంటూ నవ్వడం చెవుల్లో మార్మోగింది. బుగ్గ మీద ప్రేమగా పొడిచినట్టు తోచింది. కళమ్మ కాళికాదేవి అవతారం కళ్లముందు మెదిలింది. కళ్ళు మూతలు పడుతుండగా అతని నోటినుంచి ”ఆఁ సుందర్ వెళ్లిపోయాడా?” అన్న మాటలు చిన్నగా వినబడ్డాయి.
ఆ మాటలు వినడానికి అక్కడ ఎవ్వరూ లేరు.
రివ్వగాలి మాత్రం అయ్యో పాపం అన్నట్టుగా పరామర్శించి అతని దేహం మీదుగా పట్నం వైపు ప్రయాణించింది.

–:0:–

నా విశ్లేషణ: ఇండియా కావచ్చు.. యూరప్ కావచ్చు, చైనా, జపాన్ ఏ దేశంలో చూసినా ఇదే పరిస్థితి. మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. వృద్ధుల సమస్యలు అతి దయనీయంగా మారిపోతున్నాయి. కూలీల ఇళ్లలోనే కాదు కులీనుల ఇళ్లలోనూ ఇవే దృశ్యాలు. కనిపెంచడం, చదువులు చెప్పించడం, ఆస్తి పాస్తులు సమకూర్చడం వరకే తల్లిదండ్రుల బాధ్యత.. ఆ తర్వాత వారెవరో తామెవరో అన్నట్టుంది నేటి కొందరు యువత ఆలోచనా ధోరణి. ఇది పోవాలి. ఇల్లంటే నాలుగు గోడలు, పైకప్పు కాదు. పరస్పర ప్రేమాభిమానాలు, బంధాలు, అనుబంధాలు, వాటి ద్వారా వచ్చే ఆనందం దొరికేదే ఇల్లు. ఇల్లంటే ప్రశాంతత, ప్రేమ దొరికే చోటు. రక్షణ లభించే చోటు అనే విషయం నేటి తరానికి తెలియడం లేదనే చెప్పాలి. ఇదే తీరు కొనసాగితే వార్ధక్యంలోకి వచ్చేసరికి లభించేది కూడా ఇలాంటి నిరాదరణే.
మీ అభిప్రాయాలు నా మెయిల్ లేదా మ్యాగజైన్ కామెంట్ బాక్సులో నమోదు చేయండి. నాకు గుర్తున్నంతవరకూ ఇది ఏదో పర్వత ప్రాంతాల వాతావరణంలో జరిగిన కథ.

– చంద్ర ప్రతాప్
pratap.chandra08@gmail.com

18 thoughts on “వెంటాడే కథలు! – 4 . మట్టిమనిషి

 1. కొన్నిసార్లు ప్రేమ అవసరంకు ముడిసరుకు కావచ్చు. ప్రేమ -అవసరం రెండింటిని ఒకలానే అనుకునే తత్త్వం, పెంచిన వారి గురించి తమకు తెలుసు అనే ఆలోచనా పధ్ధతి వల్ల ఎప్పటికీ ఈ మనోఃశోకం తప్పనిదే.

 2. ఉత్క్ంటగా సాగిన కధ ముద్దుగా పెంచుకొన్న మేకపిల్లను బలిచేయడం బాధపెట్టింది.

 3. Namaste sir..
  Sundar vachadanna santoshamlo Bujjini (mekani) akkade polam vadileste baundedemo!!
  Sundar pai unna vallamalina prema meka mida pettukunte baundedemo!!
  Devudu kuda manishini ‘Mattiburra’ antadu… endukante manishiki denini preminchalo, denini vaadukovalo telidu….

  1. రమణి చక్కగా చెప్పావు తల్లి. నిజమే మేకను పొలంలో వదిలేసి ఉంటే బాగుండేది. కానీ సదరు రచయిత కథను మనం మార్చలేం కదా? నీ విశ్లేషణకు ధన్యవాదాలు.

 4. విషాదాంతం… వాస్తవికతకు దర్పణం.. హృదయాన్ని పిండివేసే సంఘటనలు..వెరసి చక్కని సందేశం. పాపం చున్నీ లాల్.
  మానవత్వం కోల్పోతున్న మనుషుల తీరును ఉద్ఘాటించారు. పెద్దలు ప్రతాప్ గారికి ధన్యవాదములు

  1. రెండు వాక్యాలలో చక్కగా విశ్లేషించారు.. ధన్యవాదాలు రవిగారు

 5. మట్టి మనిషి కథ చదివాక అలాగే నిస్తేజంగా ఉండి పోయానని గాని.. కళ్ళు చెమర్చాయని గాని .. నా శ్రీమతి తట్టి ఏమయ్యిందని అడిగితే గాని తెలుసుకోలేక పోయాను.
  ప్రాణప్రదం ప్రేమించిన మేక పిల్లను తను పెంచి ప్రయోజకుణ్ణి చేసిన కొడుకు తినే ముద్ద కోసం బలి చేస్తే.. కనీసం పలుకరించి పోని కఠినాత్ముడు. గుండెను పిండేసింది.
  ఇది యువకులు తప్పక చదివి అలాంటి తప్పు చేయరాదని.. మనసు తపిస్తోంది.
  గౌరవనీయులు చంద్రప్రతాప్ గారికి ధన్యవాదములు.

  1. సుదర్శన్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు. చక్కగా మీ హృదయాన్ని ఆవిష్కరించారు

 6. చంద్రప్రతాప్ గారు మాలిక అంతర్జాల మాసపత్రికలో నడుపుతున్న శీర్షిక “వెంటాడే కథలు” లో తాజాగా వచ్చిన కథ “మట్టిమనిషి”. వృత్తిరీత్యా వేలకథల రుచుల్ని బాగా ఆస్వాదించిన చంద్రప్రతాప్ గారిని వెంటాడే కథ అంటే దానికి వాస్తవంగానే మనిషిని జీవితాంతం వెంటాడే అంశాలు ఆ కథలో పుష్కలంగా ఉంటేనేతప్ప చంద్రప్రతాప్ గారు ఇంకా బాగా గుర్తుంచుకొన్నారనిపిస్తుంది. అది మాలిక పత్రిక పాఠకులు పుచ్చుకొంటున్న సాహితీ ప్రసాదం! వెంటాడే కథని ఒర్జినల్ గా కాకుండా తన “బుర్ర” లోంచి తవ్వి పాఠకులకోసం కీలకాంశాలని తీసుకొని పునర్నిర్మాణం చేసి ఒక కథాగుళిక రూపంలో మనముందుంచారు. నా అంచనా ప్రకారం దీన్ని చదివినవారిలో మెజారిటీ పాఠకుల్ని కూడా ఈ కథ వెంటాడుతూనే ఉంటుంది. మెజారిటీ అని ఎందుకు రాశానంటే పాఠకుల సంవేదనాశీలత స్థాయిలు అందరిలో సమానంగా ఉండవు కదా! ఈ కథ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథని చదివే అవకాశాన్ని కలిగించిన చంద్రప్రతాప్ గారికి (మాలిక పత్రిక్కి) కృతజ్ఞతలు.
  నా విశ్లేషణ: మూల కథ (లేక అనువాద కథ) చాలా పాతదే అయ్యుంటుంది. విపుల చతురలు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న గొప్ప మాసపత్రికలు. మనుషులు, ఇంట్లో పెంచుకొనే జంతువులపట్ల పెంచుకొన్న అనుబంధాల్ని తీసుకొని చక్కగా అల్లినకథ. స్వంత కొడుకు కాకున్నా పెంచినప్రేమతో సుందర్ని, పెంచుకొన్న ప్రేమతో బలీయమైన బంధాన్ని ఏర్పరచుకొన్న మేకపిల్లతో – ఈ రెండు ప్రేమల మధ్య పాఠకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఉత్కంటతో నడిపిన కథ. ఒక్క పూట తిండికోసం పెంచిన కొడుక్కి మాంసం ఇష్టమని నెలలుగా తనతోనే సహజీవిగా ఉంటున్న మేకని కోయడం హృదయాల్ని కదిలిస్తుంది. చున్నిలాల్ ఇంత ఘొరం చేస్తాడా / చేశాడా అని కోపం కూడా వస్తుంది. అదే స్థాయిలో ఆఫీసర్ రూపంలో సుందర్ ఊరికి వచ్చి పెంచి పెద్దచేసి, ఆస్తుల్ని అమ్మి చదివించిన పెద్దనాన్నని కలవకుండా పోవడం కంట తడిపెట్టిస్తుంది. పునర్నిర్మాణ కథ ద్వారా వారిద్దరు చాలా సంవత్సరాలనుండి కలవనట్టుగా అర్ధమవుతుంది. అంత పెద్ద గ్యాప్ వచ్చినా కొన్ని నిమిషాలు కూడా చిక్కించుకొని పెద్దనాన్నని కలిస్తే బాగుండు అని మనసుపీకుతుంది. కానీ బంధాలు బహుదూరాల్లోకి వెళుతున్నాయి కదా? ఓవరాల్ గా ఈ పునర్నిర్మాణ కథతో చంద్రప్రతాప్ గారు మనకో వెంటాడే కథని అందించారు. కథ పాత్రల పేర్ల ద్వారా ఇదేదో ఉత్తర భారత దేశంలోని ఊరిలో జరిగినట్టనిపిస్తుంది. గ్రామ పెద్దని ప్రధాన్ అని అక్కడి ఉర్లల్లోనే పిలుస్తారు.
  చంద్రప్రతాప్ గారి పునర్నిర్మాణ కథ వారి “మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం– Re-call” పద్దతి మీద ఆధారపడి రాసింది. ఈ టెక్నిక్ ని సర్వేల్లో వాడుతుంటాం. మూల కథ వారిని వెంటాడుతూనే ఉంది కావున కొన్ని అంశాలు బాగా హత్తుకుపోయి ఉంటాయి. అవి పునర్నిర్మాణ కథలో బాగా కనబడతాయి. ఒక సంఘటన నాకు కొంచం అవాస్తవంగా అనిపించింది. సుందర్ కోసం ఏకంగా మేకనే కోయడం – ఒక మనిషో, ఇద్దరు ముగ్గురో వస్తే మామూలుగా మన ఇళ్ళల్లో ఒక కోడి కోస్తారు. ఇక్కడ మమకారంతో పెంచుకొన్న కోడిపుంజు అని ఉన్నా సరిపోయి వాస్తవంగా ఉండేదనిపించింది. బంధం పలచబడిపోయేదికాదు అని నాకు అనిపించింది.
  కథ పేరు: మట్టి మనిషి అని పెట్టారు. కథలో భార్య పార్వతి భర్త చున్నిలాల్ ని మట్టి బుర్ర అని అనెదని తెలుస్తుంది. మట్టి బుర్ర అని కథకి పేరుపెట్టినా ఉపయుక్తంగా ఉండేదనిపించింది.
  ప్రతినెలా వెంటాడే కథల కోసం ఎదిరి చూస్తుంటాను. చంద్రప్రతాప్ గారికి శుభాకాంక్షలు.
  టి. సంపత్ కుమార్, నిర్మల్.

  1. సంపత్ గారు
   మీ విశ్లేషణ చాలా సూటిగా, చాల లోతుగా సాగింది. అందరినీ ఆలోచించేలా చేస్తుంది. ఇక మేకపిల్ల విషయానికొస్తే – చునిలాల్ దగ్గర ఉన్నది కేవలం అదొక్కటే. మనకు చాలా ప్రియాతి ప్రియమైన వ్యక్తులు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి మాంసం లేనిదే ఆహారం ముట్టడని తెలిసినప్పుడు బహుశా మీరు చెప్పినట్లు ఎవ్వరూ ఆలోచించరేమో. సొరకాయ కోసమే పక్కింట్లో దొంగతనం చేసిన వ్యక్తి చున్ని లాల్. అలాంటి వాడు మళ్ళీ కోడి ని మరోచోట ఎత్తుకు రాలేడు కదా? ఏమైనా మీ విశ్లేషణ అపురూపం. దానికి మనఃపూర్వక ధన్యవాదాలు.
   మీ చంద్రప్రతాప్

 7. మనసును మెలిపెట్టిన చక్కని కథ! పెంచిన మమకారం మరచిన మూర్ఖుడి కోసం.. మూగ జీవాన్ని బలిచేయడం అత్యంత బాధపెట్టింది. నిరాదరణకు గురి అవుతున్న వృద్ధుల ఆవేదనను కళ్లకు కట్టిన సహజ కథ.

  1. ధన్య వాదాలు తులసీ గారు చాలా బాగా విశ్లేషించారు

 8. చాలా మంచి కథ. కుటుంబ సంబంధాలు, మానవత్వపు విలువలు ఎలా సన్నగిల్లుతున్నాయో చెప్పే అద్భుతమైన కథ. ఇలాంటి ఎన్నో హృదయాన్ని కదిలించే కథలు ‘విపుల’లో చదివాను. పాత సంచికలు పారేయలేక దాచుకున్నాను కూడా.

  1. ధన్య వాదాలు శేషు గారు . మీ రచనా ప్రియత్వం చాలా గొప్పది

  1. ధన్య వాదాలు సింహప్రసాద్ గారు మీ అభిరుచి చాలా విశిష్టమైనది

  2. ధన్య వాదాలు సింహప్రసాద్ గారూ మీ అభిరుచి విశిష్టమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *