March 19, 2024

తల్లి మనసు

రచన: G.S.S. కళ్యాణి.

ఉదయం ఏడుగంటల ప్రాంతంలో, తమ వరండాలోని పడక్కుర్చీలో కూర్చుని ఆ రోజు దినపత్రికను తిరగేస్తూ, తన పక్కనే బల్లపైనున్న కాఫీ కప్పును తీసుకుని ఒక గుటక వేసిన రమాపతి, చిరాగ్గా మొహంపెట్టి, “ఒసేయ్ శ్రీకళా! ఓసారి ఇలా రావే!!”, అంటూ తన భార్య శ్రీకళను కోపంగా పిలిచాడు.
భర్త అరుపుకు భయపడి, చేతిలో ఉన్న పనిని వదిలేసి పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చి, “ఏంటండీ? ఏమైందీ??’ అని రమాపతిని కంగారుగా అడిగింది శ్రీకళ.
“ఇంత చల్లటి కాఫీని నా మొహాన కొట్టి ఎటు పోయావ్? కాఫీ వేడిగా ఉండాలని నీకెన్నిసార్లు చెప్పినా అర్ధం కాదు! ఛ! ఒట్టి మట్టి బుర్ర!!” శ్రీకళను కసురుతూ అన్నాడు రమాపతి.
“అది కాదండీ! నేను కాఫీ చాలా వేడిగా ఉన్నప్పుడే తెచ్చి ఇక్కడ పెట్టి, వెంటనే ఆ విషయం మీకు చెప్పి, తులసిలో నీళ్లు పొయ్యటానికని వెళ్లాను. మీరు చూసుకున్నట్టు లేరు! అందుకే కాఫీ చల్లారిపోయింది!” భయంతో వణుకుతున్న కంఠంతో, తల దించుకుని రమాపతికి వివరించబోయింది శ్రీకళ.
“అవునే! తప్పంతా నాదే!! అసలు నిన్ను కట్టుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు!” అన్నాడు రమాపతి పళ్ళు కొరుకుతూ.
అవకాశం దొరికినప్పుడల్లా రమాపతి శ్రీకళను అలాంటి సూటీ-పోటీ మాటలు అంటూనే ఉన్నా, గత యాభై సంవత్సరాలుగా ఆ బాధను ఎవరికీ తెలియనివ్వకుండా అతికష్టం మీద దిగమింగి, మాటలకందని వ్యధను మనసులోనే భరిస్తూ వచ్చింది శ్రీకళ! ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయానికి రమాపతి తనను నోటికొచ్చినట్లు తిట్టడం, ఆపై తను మౌనంగా కాసేపు కుమిలిపోవడం శ్రీకళకు అలవాటైపోయింది! అసలు రమాపతి తనతో ప్రేమగా మాట్లాడి ఎరుగదు శ్రీకళ!
***
రమాపతి సొంత ఊరు చింతలపల్లె అనే కుగ్రామం. ఊహ కూడా తెలియని అతి చిన్నవయసులోనే తన తండ్రిని కోల్పోయాడు రమాపతి. అటువంటి క్లిష్ట పరిస్థితులలో, ఎన్నో కష్టాలకోర్చి అన్నీ తానై రమాపతిని పెంచి పెద్దవాడిని చేసింది రమాపతి తల్లి సీతమ్మ. చదువు పూర్తి కావటంతోనే ఉద్యోగవేట మొదలుపెట్టిన రమాపతికి, తన స్నేహితుడిద్వారా పట్నంలో ఒక మంచి సంస్థలో ఉద్యోగం ఉందని తెలిసింది. సీతమ్మకు తగిన జాగ్రత్తలు చెప్పి ఆ ఉద్యోగవివరాలు కనుక్కుని రావడానికి పట్నం వెళ్ళాడు రమాపతి. సంస్థవారికి రమాపతి నచ్చడంతో ఆ ఉద్యోగంలో వెంటనే చేరిపొమ్మని అతడికి ఆదేశాలిచ్చారు. రమాపతి ఉద్యోగంలో చేరేందుకు రెండు రోజులు గడువడిగి సీతమ్మను తన వెంట తీసుకువెళ్ళడానికి తమ ఊరు చేరుకున్నాడు. రమాపతికి పట్నంలో గుమాస్తాగా ఉద్యోగం వచ్చిందని తెలిసి చాలా సంతోషించింది సీతమ్మ.
భోజనాలయ్యాక మధ్యాహ్నం వేళప్పుడు సీతమ్మతో కబుర్లు చెబుతూ, “అమ్మా! నిన్ను రేపు నాతో పాటూ పట్నం తీసుకెళ్లాలని ఉంది నాకు. కానీ నేను ప్రస్తుతం నా స్నేహితుడి గదిలో ఉంటున్నాను. అక్కడ నువ్వు ఇబ్బంది పడతావేమో! నువ్వు ఇంకొక్క వారం ఇక్కడే ఉండగలనంటే నేను పట్నంలో ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అప్పుడు నిన్ను పట్నం తీసుకెడతాను. సరేనా?” అని అడిగాడు రమాపతి.
అందుకు సీతమ్మ, “నా గురించి నువ్వు అస్సలు కంగారు పడకురా! నువ్వు ముందు కొత్త ఉద్యోగంలో కుదురుకుని ఆ తర్వాత నిదానంగా నన్ను నీ వెంట తీసుకుని వెడుదువుగానిలే! నా కోసం ఆలోచిస్తూ నువ్వు ఇబ్బంది పడకు. ఎంతైనా ఇది మన సొంత ఊరు కదా! ఊళ్ళో అందరూ నాకు తెలిసినవారే! ఏదైనా కావాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేస్తారులే!” అంది నవ్వుతూ.
“అమ్మా! చిన్నప్పటినుండీ నా చదువుకోసం నిన్ను చాలా కష్టపెట్టాను! ఇక పై నేను నిన్ను అస్సలు కష్ట పెట్టను! నాకు చేతనైనంతలో నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు సుఖంగా, ఆనందంగా ఉంటే నేను చూడాలి. అది నా కోరిక! నాకు సాధ్యమైనంత త్వరలో నేను నిన్ను పట్నం తీసుకెళ్ళిపోతాను!” అన్నాడు రమాపతి.
“సరేరా నాయనా! అయినా, నీకొక విషయం చెప్తాను విను! ప్రతి తల్లికీ తన బిడ్డపై ఉండేది అమితమైన ప్రేమ! అందువల్ల పిల్లల బాగు కోసం ఆ తల్లి ఇష్టంతో చేసే పనులు ఆమెకు కష్టమని అనిపించవు! నువ్వు ఇన్నాళ్లూ నన్ను కష్టపెట్టలేదురా! నాకు బిడ్డవై పుట్టి ‘అమ్మ’ అని పిలిపించుకునే అదృష్టాన్ని నువ్వు నాకు కలిగించావు! నీకు కావలసినవన్నీ సమకూర్చడం ఒక తల్లిగా నా బాధ్యత! నువ్వు ఆనందంగా ఉంటే అదే నాకు పదివేలు!” అంటూ రమాపతి బుగ్గలు మురిపెంగా నిమిరింది సీతమ్మ.
‘అదే! ‘తల్లి మనసు’ గొప్పతనం!’అనుకున్నాడు రమాపతి.
ఆ రోజు రాత్రి సీతమ్మ వంటింట్లో పనిచేస్తూ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది! రమాపతికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఎందుకంటే సీతమ్మకు అత్యవసర వైద్య సేవలందించడానికి వారి ఊరిలో వైద్యసదుపాయము లేదు! దాంతో ఆ చీకట్లో రమాపతి సీతమ్మను తన చేతులపై మోస్తూ ఎంతో కష్టపడి పరుగులాంటి నడకతో పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ రమాపతి పడిన కష్టానికి ఫలితం దక్కలేదు! ‘ఇంకొంచెం ముందుగా తెచ్చి ఉంటే ఆవిడను మేము కాపాడగలిగి ఉండేవాళ్ళం!’ అని చెప్పారు అక్కడి వైద్యులు.
తన చేతుల్లోనే ప్రాణాలు విడిచిపెట్టిన తన తల్లిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రమాపతి! అనుకోకుండా అదే ఆసుపత్రిలో వేరే పనికని వచ్చిన రమాపతి దూరపుబంధువు పరంధామయ్య రమాపతి పరిస్థితిని చూసి జాలిపడి, అతడిని ఓదార్చి ధైర్యం చెప్పి తనతోపాటు తీసుకెళ్లి కొద్దిరోజులు వాళ్లింట్లోనే ఉండమని చెప్పాడు. వారం తర్వాత రమాపతి పట్నం వెళ్లి ఉద్యోగంలో చేరిపోయాడు. రమాపతి చదువును, ఉద్యోగాన్నీ చూసిన పరంధామయ్య తన కూతురు శ్రీకళను పెళ్లి చేసుకోమని రమాపతిని కొంచెం బలవంతం చేశాడు. తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా, తను కష్టంలో ఉన్నప్పుడు ఆదరించిన వ్యక్తి మాట కాదనలేక శ్రీకళను పెళ్లి చేసుకున్నాడు రమాపతి.
శ్రీకళ చాలా నెమ్మదస్తురాలు. ‘పతియే ప్రత్యక్ష దైవం!’ అని నమ్మే ఇల్లాలు! వివాహం అయిన తర్వాత కూడా సీతమ్మ గురించే ఆలోచిస్తూ, ఎప్పుడూ ముభావంగా ఉండేవాడు రమాపతి. ఓసారి శ్రీకళను చూసి వెడదామని వచ్చిన పరంధామయ్య రమాపతిని గమనించి, పిల్లలు కలిగితే అతడి తీరు మారుతుందేమోనని, “అల్లుడూ! త్వరలో నన్ను తాతయ్యను చెయ్యండి!”, అని చెప్పాడు. పరంధామయ్యంటే ఉన్న అభిమానంవల్ల రమాపతి, ‘ఊఁ!’ అన్నాడు. రమాపతి, శ్రీకళలకు ఇద్దరు మగపిల్లలు కలిగారు. శ్రీకళ మూడోసారి గర్భవతి అయ్యేసరికి రమాపతి అగ్గిపైగుగ్గిలం అయ్యాడు.
“నేనేమైనా కోట్లు సంపాదిస్తున్నానని అనుకున్నావా? మూడోవాడిని నేనెలా పెంచుతాను? వాడికి బట్టలు కొనడం, తిండి పెట్టడం, చదివించడం నావల్ల కాదు!!” అని శ్రీకళకు కచ్చితంగా చెప్పేశాడు రమాపతి.
శ్రీకళకు మూడోసారి కూడా మగపిల్లవాడే కలిగాడు. భర్తకు ఎదురు చెప్పలేక, మూడోబిడ్డను దూరం చేసుకోలేక, “మన మూడో బిడ్డ సంగతి మీరు మర్చిపోండి! వాడిని మీకు భారం కానివ్వను! నేనే పెంచుతాను! మీకు ఇద్దరే పిల్లలని అనుకోండి!” అంది శ్రీకళ విపరీతమైన దుఃఖంతో.
“నన్ను ఎదిరించడానికి ఎంత పొగరే నీకు? నువ్వు అంత ఘనురాలివే అయితే ఒక్క మూడో బిడ్డ బాధ్యతే ఎందుకు? మనకున్న ఆ మిగతా ఇద్దరు పిల్లలను కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే పెంచుకో! వాళ్ళిక నీ పిల్లలు!” అని రమాపతి అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయాడు.
అంతే! అప్పటినుంచీ రమాపతి పిల్లల గురించి కానీ, శ్రీకళ గురించి కానీ పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు!! ఎప్పుడూ ఒంటరిగా తన గదిలో సీతమ్మ పటం వంక చూస్తూ ఒక్కడే కూర్చునేవాడు. తను పడిన బాధ ఇంకెవరూ పడకూడదనీ, తమ సొంతఊరిలో ఎప్పటికైనా ఒక ఆసుపత్రి నిర్మించాలని రమాపతికి మనసులో గట్టి కోరిక ఉండేది. కానీ అందుకు తగ్గ ఆర్ధిక స్థోమత తనకు లేకపోవడంతో ఏమీ చెయ్యలేక ఊరుకుండిపోయాడు రమాపతి.
రమాపతి ప్రవర్తన వల్ల పిల్లలను పెంచే బాధ్యతంతా శ్రీకళ ఒక్కత్తే తీసుకోవలసి వచ్చింది. ప్రతి నెలా ఇద్దరు పిల్లల అవసరాలకు కావలసినంత డబ్బు మాత్రమే శ్రీకళకు ఇచ్చేవాడు రమాపతి. చూస్తూండగా పిల్లలు ముగ్గురూ పెద్దవాళ్ళైపోయారు. అందరిలోకీ పెద్దవాడు రాజీవ్ రాజకీయ నాయకుడయ్యాడు. రెండవవాడు ముకుంద విదేశాలకు వెళ్ళిపోయాడు. మూడోవాడు తేజస్ కాలేజీ చదువులకొచ్చాడు. ఉద్యోగంపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడంతో రమాపతి గుమాస్తాగానే మిగిలిపోయాడు!
***
ఆ రోజు కాఫీ విషయంలో రమాపతి కోపగించుకోవడంతో వేరే గ్లాసుతో వేడివేడి కాఫీ వరండాలో కూర్చుని ఉన్న రమాపతి వద్దకు పట్టుకొచ్చింది శ్రీకళ. కాఫీ అందుకోవడానికని చెయ్యి పైకి ఎత్తిన రమాపతి తనకేదో అవుతోందంటూ హఠాత్తుగా కుర్చీలో పక్కకు వాలిపోయాడు. కాసేపటి తర్వాత రమాపతికి స్పృహ వచ్చింది. ఆ సమయానికి అతడు ఒక పెద్ద ఆసుపత్రిలోని ఐ. సి. యు. వార్డులో ఉన్నాడు.
‘నేను ఇక్కడెందుకున్నాను?’ అని కంగారు పడుతున్న రమాపతి దగ్గరకు ఒక వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి, “కంగారు పడకండి! మీరు ప్రాణాపాయస్థితినుండి పూర్తిగా బయటపడినట్లే!” అన్నాడు. “ధన్యవాదాలు!” అన్నాడు రమాపతి.
“నాక్కాదండీ! ఆ మాట బయట కూర్చుని ఉన్న మీ భార్యకు చెప్పండి! ఆవిడ మీకు గుండెనొప్పి వచ్చిన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించారు! లేకపోతే మిమ్మల్ని మేము కాపాడగలిగి ఉండేవాళ్ళం కాదు! అటువంటి భార్య దొరకడం మీ అదృష్టం!” అని చెప్పాడు వైద్యుడు.
రమాపతికి నోట మాట రాలేదు! శ్రీకళ పట్ల ఇన్నేళ్లూ తనెంత దారుణంగా ప్రవర్తించాడో తనకే తెలుసు!
రమాపతికి స్పృహ వచ్చిందన్న సంగతి వైద్యుడి ద్వారా తెలియటంతో శ్రీకళ రమాపతి దగ్గరకు వచ్చి, రమాపతి పడుకుని ఉన్న మంచానికి పక్కనున్న కుర్చీలో కూర్చోబోతూ ఉండగా, తన పక్కన కూర్చోమన్నట్టు సైగ చేశాడు రమాపతి. శ్రీకళ కాస్త మొహమాటంగా రమాపతి పక్కన కూర్చుంది. రమాపతి శ్రీకళ వంక చిరునవ్వుతో చూశాడు!
అంతలో తేజస్ వారి వద్దకు వచ్చి, “నాన్నా! మీ ఆరోగ్యం గురించి దిగులు పడకండి. మీకు నేను రెండు శుభవార్తలు చెప్పడానికొచ్చాను! మొదటిది, చింతలపల్లెలో పెద్దన్నయ్య కృషివల్ల పెద్ద ఆసుపత్రిని నిర్మించేందుకు మనకు అనుమతి లభించింది! ఆ ఆసుపత్రిని అన్ని వసతులతో నిర్మించేందుకు అవసరపడే ధనం రెండో అన్నయ్య విదేశాలనుండి ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఇక రెండో శుభవార్త! నాకు మెడిసిన్ లో సీట్ వచ్చింది!! త్వరలో మన సొంత ఊరిలోని ఆసుపత్రిలో నేను కూడా ఒక డాక్టర్ గా సేవలు అందించగలుగుతాను! మీ చిరకాలపు కోరిక తీరినట్లే నాన్నా! మీరు అనుకున్నట్లే చింతలపల్లెలో బామ్మ విషయంలో మీరు ఎదుర్కున్న పరిస్థితి భవిష్యత్తులో ఇంకెవరికీ రాదు!” అని చెప్పాడు.
రమాపతికి ఏమీ అర్ధం కాలేదు! ‘ఏమిటిదంతా?’అన్నట్లు శ్రీకళ వంక చూశాడు.
“దయచేసి కోపగించుకోకుండా ప్రశాంతంగా వినండి! పిల్లలు పసిగా ఉన్నప్పుడు ఒకరోజు మీరు మీ స్నేహితుడితో మాట్లాడుతూ ఉండగా చింతలపల్లెలో ఆసుపత్రి నిర్మాణం గురించి మీకున్న కోరిక నాకు తెలిసింది! మీరు మీ జీవితాశయంగా భావించాలని అనుకుంటున్న ఆ కోరికను నేను తీర్చగలిగితే ఎప్పుడూ దిగులుగానూ, గంభీరంగానూ ఉండే మీ ముఖంలో ఆనందం చూడగలుగుతానని నాకు అనిపించింది. అందుకని మీ కోరికను నా లక్ష్యంగా మార్చుకుని మన పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాను. వాళ్ళు నాకు సహకరించారు. మీ కోరిక తీరబోతోంది! నాకు చాలా సంతోషంగా ఉంది!” అంది శ్రీకళ.
“మరి తేజస్ ను పెద్ద చదువు చదివించేందుకు నీకు అంత డబ్బెక్కడిది?”ఆశ్చర్యంగా అడిగాడు రమాపతి.
“మన ముగ్గురు పిల్లలూ మంచి తెలివితేటలుగలవారు కావడం ఆ భగవంతుడి దయ! మన తేజస్ చదువులో బాగా రాణించి స్కాలర్ షిప్పులు సంపాదించాడు. అందుకనే వాడి చదువుకు ఎక్కువ డబ్బు ఖర్చు కాలేదు. నాకు చిన్నప్పుడు మా అమ్మానాన్నలు సంగీతం నేర్పించారు. నేను బాల్యంలోనే సంగీతంలో ఎంతో ప్రతిభను కనబర్చి ఎందరో విద్వాంసుల మన్ననలను పొందాను. వివాహం తర్వాత సంగీతం గురించి ఆలోచించే పరిస్థితులు లేకపోవడంతో ఆ విషయం మీ దగ్గర ఎప్పుడూ ఎత్తలేదు. తేజస్ పుట్టాక మన పిల్లలను పెంచేందుకు ఆర్ధికంగా మనకు కొంత డబ్బు అవసరపడింది. ఆ సమయంలో నాకున్న సంగీతజ్ఞానంతో నేను కొందరు పిల్లలకు సంగీతపాఠాలు నేర్పుతూ కొద్దిగా డబ్బు సంపాదించగలిగాను. ఆ డబ్బును మీ సంపాదనతో కలిపి పొదుపుగా వాడుకుంటూ పిల్లల చదువుకు కొంత డబ్బును కూడపెట్టగలిగాను. ఇప్పుడు మీకు వైద్యం అందించిన వైద్యుడి కూతురు గతంలో నా వద్దే సంగీతం నేర్చుకుంది. ఆనాటి పరిచయం ఇవాళ నాకు ఉపయోగపడింది! మీరు చలనం లేకుండా పడి ఉండటం చూసి, వెంటనే ఆ వైద్యుడికి కబురు పంపి, మీకు అత్యవసర వైద్యసేవలు సమయానికి అందించగలిగాను! మిమ్మల్ని కాపాడుకోగలిగాను! ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని ఎన్నోమార్లు ప్రయత్నించాను కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు! నన్ను మన్నించండి!” అంది శ్రీకళ.
“శ్రీకళా! నిన్నెప్పుడూ మట్టిబుర్ర అని హేళన చేస్తూ ఉంటాను కదా? నువ్వు ఆ మట్టినుండీ బంగారం సృష్టించావు! నీ దగ్గర పిల్లలు ప్రయోజకులయ్యారు! డబ్బును కూడబెట్టేందుకు నువ్వు పడ్డ కష్టం, అందుకు నీ సుఖాలను వదులుకుని నువ్వు చేసిన త్యాగం, నేను అర్ధం చేసుకోగలను! నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు!” అన్నాడు రమాపతి.
“అయ్యో! నేను మీ అర్ధాంగిని! మీరు నాకు దేవుడితో సమానం! మీరు నన్ను క్షమించమని అడగకూడదు! నాకు మీరన్నా, పిల్లలన్నా అమితమైన ప్రేమ! నా భర్తకూ, నా పిల్లలకూ కావలసినవి చేసిపెట్టడం నా బాధ్యత! అది నేను నాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను. అందుకని నేను ఇన్నాళ్లూ చేసిన పని ఇష్టంతోనే కానీ కష్టంతో కాదు! మీరందరూ ఆనందంగా ఉంటే అదే నాకు పదివేలు!” అంది శ్రీకళ.
ఆ మాటలు విన్న రమాపతికి తన తల్లి సీతమ్మ మాటలు గుర్తుకొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది! ఆ క్షణం శ్రీకళలో తన ‘తల్లి మనసు’ కనపడింది రమాపతికి!!
భావోద్వేగంతో పెల్లుబికిన కన్నీళ్లను తుడుచుకుని, “శ్రీకళా! నిన్ను భార్యగా పొందగలగడం నిజంగా నాకు ఆ భగవంతుడిచ్చిన వరం!” అని అంటూ మొట్టమొదటిసారి శ్రీకళను ప్రేమగా దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నాడు రమాపతి.

*****

2 thoughts on “తల్లి మనసు

  1. శ్రీమతి జి.ఎస్.ఎస్. కళ్యాణిగారు వ్రాసిన “తల్లిమనసు” కథ చాలా బాగుంది. తల్లి తన బిడ్డల గురించి ఇష్టంతో చేసే చేసే ప్రతి పని తనకు కష్టంగా అనిపించదు” అన్న మాటలు అక్షర సత్యాలు – ప్రసాద్ ఉప్పలూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *