June 24, 2024

పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

రచన: డా. కె. వివేకానందమూర్తి

విశాఖపట్నంలో స్టీలు ప్లాంటు తీసుకురావాలని విద్యార్థులకున్నంత గాఢంగా, విద్యార్థుల్లో క్రమశిక్షణ తీసుకురావాలని ఉపాధ్యాయులనుకున్నంత గాఢంగా – లక్ష్మీవారం నాడు లక్ష్మీకుమారి మనసులో రసభావాలు పోజిటివ్ గా తీసుకురావాలని బాలరాజు అనుకున్నాడు. అంతకు ముందే అమితమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చినా అదే బాటలో అతనిన్నాళ్ళు నడవలేదు. మనస్సుకి తెగింపు చాల్లేదు. కానీ ఉన్నట్టుండి వెళ్ళిపోయిన లక్ష్మీవారం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్మి వందనం లక్షలకొద్దీ ప్రేమ భావాలతో లక్షణంగా తయారై వచ్చి, విశాఖపట్నం బీచ్ ని సముద్రం తినేస్తున్నట్లు, విశాఖపట్నం ప్రజల్ని మునిసిపాలిటీవాళ్ళు తినేస్తున్నట్టు – బాలరాజు మనస్సుని తినేయడం మొదలు పెట్టింది.
ఒక రోజు బాలరాజు ఇంకా సముద్రం తినని బీచ్ రోడ్డులో లేడీస్ హాస్టల్ పక్కగా నడుస్తున్నప్పుడు ఒకవైపు నుంచి సీ వెదరూ – మరోవైపు నుంచి షీ – వెదరూ వొంటికి తగిలి మనసు పులకించి, వెచ్చని ఆలోచనలు వుదయించి “సమయం మించిపోకుండా ‘ప్రేమించు’ అని అతన్ని తొందరచేశాయి. మనసంతా సందడి చేశాయి. ప్రేమ గురించి అంతరాత్మ అంత పర్టిక్యులర్‌గా పక్కనున్న సముద్రంలా ఘోషిస్తూంటే సహించలేక లక్ష్మీకుమారి విషయం తక్షణ కర్తవ్యంగా అనుకోకుండా వుండలేకపోయాడు. ఇన్నాళ్ళూ బాలరాజు గుండెల్లో లక్ష్మీకుమారి మీద ప్రేమ నిర్లక్ష్యం చేసినట్లుండిపోయింది. యిప్పుడది మన సామ్రాజ్యానికి నియంతలా తయారైంది.
నడుస్తున్న బాలరాజు గడుస్తున్న కాలాన్ని తల్చుకొని యిప్పటికే కాలాతీతమయిందని చాలా యిదయ్యాడు. మొన్న మొన్ననే మెడికల్ కాలేజీలో తన జీవితానికి ముగింపు ప్రారంభమైంది. కానీ ఇంకా ఆమె చదువులో ప్రారంభమే ముగియలేదు. తను యింత త్వరగా ఎందుకు పాసయిపోయానా అని బాధ పడ్డాడు. ఎన్ని సార్లని ఫెయిల్ చేస్తామని విసుగేసి అనుకున్న దానికంటే తొందరగా పాస్ చేశారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్ లైఫ్ మళ్ళీ జన్మెత్తితే వస్తుందా?
హైదరాబాదులో హౌసర్జన్సీ చెయ్యమని హైదరాబాదు మామయ్య తన ఫస్టియర్ నుంచి బలవంతం చేస్తున్నాడు. మామయ్యకి ఆడపిల్లలు లేకపోయినా అజీర్తి రోగం వుందనుకొనే రోగం వుంది. మామయ్యని కలసినప్పుడల్లా హైదరాబాదులో హౌస్ సర్జన్సీ గురించి ఆరుగంటలూ, అజీర్తి గురించి అరవై గంటలూ ఆపకుండా రాజకీయ నాయకుడిలా మాట్లాడుతాడు. అంచేత ఆ బలవంతం. అక్కడికీ అంత బలవంతం చేసినా – ఇక్కడే బావుంటుంది. నేనిక్కడే వుంటా మావాయ్ అన్నాడు. అందుకాయన “ఎక్కడున్నా చేసేదొక్కటే – సమ్మె! అక్కడే చేద్దువుగాని రా!” అని బలవంతం చేసి, హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ రప్పించేశాడు. – సమ్మె అంటే ఆయనకేం తెలుసు? ఏమిటో? ఇక తను వుందామన్నా వీల్లేదు. లక్ష్మీకుమారిని కలుస్తూ వుందామన్నా వీల్లేదు.
ఇంతకాలం – అశ్రద్ధ చేసిన ప్రేమ మహేంజొదారోలో బైటపడిన మహోన్నత మనోహర శిల్పంలా ఇప్పుడు బైటపడింది. ఆమెతో మాట్లాడాలనీ, మనసు కలిపి ఆట్లాడాలనీ అదే పనిగా అల్లరిచేస్తోంది. ఇప్పుడిక తనకి మిగిలింది ఒకే ఒక్క అవకాశం. జారవిడిస్తే ఇక జన్మలో తామిద్దరూ కల్పుకోలేరు. మనసు విప్పుకోలేరు. మాటలు చెప్పుకోలేరు. కాబట్టి ఏం చెయ్యాలి?
రోజూలాగే తాజా రోజాపూవులా తయారై పామ్ బీచికి వస్తుంది. ఇసకలో కూర్చుంటుంది. రోజూలాగే తనూ వెళ్ళి ఆమెకు అల్లంతదూరంలో కూర్చుంటాడు. ఆమె సముద్రంకేసి చూస్తున్నట్టు తన్ను చూస్తుంది. తను ఆమెకేసి సముద్రాన్ని చూస్తున్నట్టు చూస్తాడు. తరవాత రోజూలాగ కాదు. “ఈరోజు ఏదో చెయ్యాలి?” ఏం చెయ్యాలి? ప్రేమకి ఏం కావాలి? ధైర్యం కావాలి. కాబట్టి ధైర్యం చెయ్యాలి. లక్ష్మీకుమారి అండ్ ఫ్రెండ్స్ మాచ్ ఖండ్ కి మంగళవారం నాడు వెళ్తారని తెలిసింది. తను తన ఫ్రెండీ మంగళవారం అదే రోజని తెల్సుకుని వెళ్తాడు. కలిస్తే యిద్దరూ అక్కడే కలవాలి. తలిస్తే దైవం అక్కడే కలపాలి.
ఇలా అనుకుంటూ అడుగులు వేస్తూ బాలరాజు పామ్ బీచ్ కి వచ్చేశాడు. లక్ష్మీకుమారి అప్పటికే అక్కడికొచ్చేసి కూర్చొని, తను రోజూ కూర్చునే ఇసుక తిన్నె మీద శూన్యాన్ని వెదుకుతోంది. ఇంతకంటే ప్రేమకి దాఖలా అక్కర్లేదు. దగ్గరికి నడుస్తున్నాడు బాలరాజు. దడదడ లాడుతున్నాయి గుండెలు. అమ్మాయితో ప్రేమగా మాట్లాడానికి పెదవులు సందేహిస్తే గుండెలు తొందరపడుతున్నాయిలా వుంది.
కూర్చున్న లక్ష్మీకుమారి కుముదంలా వుంది. నడిస్తే బాలరాజుకి దగ్గరగా వుంది. నరాల్లో ప్రేమ ధైర్యంగా వుంది. నవవధువులా ఆమె తలొంచుకునుంది. ఎవరో ఒకరు మాట్లాడాలనుంది. మాట్లాడితే బాగుణ్ణని వుంది. బాగుణ్ణని మాట్లాడాలనుంది.
అతనే ధైర్యం చేశాడు – “లక్ష్మీకుమారిగారూ!” ఆమెకి అతన్ని చూస్తే ముచ్చటగా వుంది. తలెత్తి చూసింది. చిరునవ్వు తయారు చేసింది. అతని మీదికి విసిరింది. అంటే కూర్చోమని అర్థం లాగుంది. కూర్చున్నాడు –
“మీతో మాట్లాడాలి.”
“మీరు చేసేపని అదేగా” కళ్ళల్లో అల్లరి కనబడింది.
“అదికాదు, చాలా మాట్లాడాలి.”
“అబ్బాయిలెప్పుడూ చాలా మాట్లాడరు. అమ్మాయిలే చాలా మాట్లాడతారు”
“జోక్కాదు, నిజం!”
ఆమె తనలా అందంగా నవ్వింది.
“నేను హైదరాబాదు వెళ్ళిపోతున్నాను. చాలా రోజులుగా మీకు చెప్పాలనుకున్నది – చెప్పాలి.” నుదుటి మీద పడిన క్రాఫు సరిచేసుకున్నాడు. “మీరు మంగళవారం మాచ్ ఖండ్ చూడ్డానికి వెళ్తారుగా, నేను మిమ్మల్ని చూడడానికి మాచ్ ఖండ్ వస్తాను.”
“ఇప్పుడు నేను కనిపించడం లేదా?”
“కాదు ఎప్పుడూ ఇలాగే కనిపించేలా చూడ్డానికి”
ఆమెలో ఏదో కొత్త చైతన్యం ప్రవేశించింది. “
మీ రొచ్చినా ఎలా? కూడా నా ఫ్రెండ్సుంటారు”
“నేను కూడా ఫ్రెండ్స్న తెచ్చుకుంటున్నాను.”
“మరెలా?”
“ఏమిటి?”
“మీరు చెప్పాలనుకున్నది-”
“మీరేం అనుకోలేదా?”
“అనుకున్నాను” లక్ష్మీకుమారి కళ్ళల్లో కోటి దీపాలు వెలిగేయి.
“మనం మాట్లాడుకోడానికి అనువైన వేళవుంది.”
“ఏవేళ?”
“మాచ్ ఖండ్ మీకు చూడ్డం యిదే మొదటి సారనుకుంటా.”
“అవును.”
“వెళ్ళిన తర్వాత ఉదయం ఉదయం కాకుండా లేదండి, స్నానం చేశాక బావుంటుంది. మంచుకురిసే శుభోదయం. సందడిలేని చల్లని సమయం ఆరింటికి – గెహౌస్ ముందు కొండ అంచుకివస్తే నైట్ క్వీన్ మొక్క వుంది. అక్కడ.”
“అలాగే.”
“అంతే మరి వెళ్ళిస్తాను.” బాలరాజు లేచాడు.
“ఒక్కరేనా?”
“నాకు భయం లేదు.”
“నాకుంది.” ఆమె లేచింది.
బీచ్ లో యిద్దరూ కలిసి నడిచారు.
ఊహల్లో యిద్దరూ కలిసి తడిశారు.
“గుడ్ నైట్!”
“గుడ్ నైట్!”
* * *
మాచ్ ఖండ్ చుట్టూ మంచుకొండలు మహారాజుల్లాగున్నాయి:
ప్రకృతికి చలేసి మరేం తోచక మంచుదుప్పటి కప్పుకుని మరింత వణుకుతున్నట్టుంది. నిండా చెదిరిన నీహారాలు, నిండిన వాతావరణం ఆలోచనలో ఉక్కిరిబిక్కిరయిన మనస్సులాగ వుంది. బాలరాజు చుట్టూ చక్కటి చిక్కటి మంచుంది. అయినా అతను వణకటల్లేదు మనస్సులో వేడిభావాలు మంచుని కరిగించి కాచి మరగబెట్టేలా వున్నాయి.
బాలరాజు తడిసిన వాచ్ గ్లాస్ తుడిచి టైము చూసుకున్నాడు. ఆరు కావస్తోంది. తను వచ్చి అప్పుడే అరగంటయింది. వస్తానన్న లక్ష్మీకుమారి యింకా రాలేదు. తను ఆమె కలలోగాని వున్నాడా? లేక తయారవుతోందా? ఏమిటో ఈ ఆడవాళ్ళు ప్రేమలో కూడా ఆలస్యం మరువరు. అయినా ఆమె నిజంగా తనని ప్రేమిస్తోందా? లేక ఆడిస్తోందా? ఛా! కాదు! అసలు తప్పంతా తనది. ఇన్నాళ్ళ ముఖపరిచయంలో ఎన్నో సంకేతాలు తనకి అవకాశాలు కల్పించాయి. తనకే సాహసం లేకపోయింది. ఒకసారి కాలేజీ ఫంక్షన్లో కారిడోర్‌లో కావాలని తనవైపు చూసిన ఆ కళ్ళు తనకింకా జ్ఞాపకం. వాటికి తనేం బదులు చెప్పాడు? ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో దగ్గరగా నిలబడి ఆమె పెదాలు కదిపితే తనెందుకు కదపలేదు. అంతా అశ్రద్ధ జరిగిపోయింది. కానీ యిప్పుడు, యిన్నాళ్ళ, యిన్నేళ్ళ తన మూగప్రేమకి ఈ క్షణాలు పరీక్ష. యిన్నాళ్ళు, యిన్నేళ్ళు నిశ్శబ్దంలో బ్రతికిన ప్రేమకి ఈ క్షణాలు పరాకాష్ట. బాలరాజు మళ్ళీ వాచీ చూసుకున్నాడు.
ఆరుంపావైంది. ఆమె రాలేదు.
ఆరున్నరైంది. ఆమె రాలేదు.
ఒక్కసారిగా బాలరాజుకి మంచు మీద కోపం ముంచుకొచ్చింది. ప్రేమకి వున్న కృతజ్ఞత మంచుతెరకి లేదు. మంచుతెరల్లో మగతగా సోలిపోతూ వెచ్చటి అనుభూతుల్ని తొలిసారిగా ఇద్దరూ పంచుకుంటామనుకున్నాడు. కాని పవిత్రప్రేమకి సాక్ష్యంగా నిలిచి తనని కలుపుతాయనుకున్న మంచుతెరలు ఇప్పుడు నిర్దయగా మనసు మనషుల్ని వేరు చేస్తున్నాయి. ఏమైనా అనుభవంకంటే ఆలోచనే గొప్పదేమో! ఎందుకంటే ప్రేమ వూహలో బాగున్నంతగా అనుభవంలో బాగుండడం లేదు. నిజమేనేమో!
బాలరాజు వాచీ చూసుకోబోయి మానేశాడు. లక్ష్మీకుమారి ఎందుకు రాలేదు? వస్తానని మాట యిచ్చి ఎందుకు రాలేదు? ఒకవేళ తనంటే ఆమెకు ఏ విధమైన అభిప్రాయం లేదేమో! లేక విద్యాసంస్థల్ని విప్లవ రాజకీయాలు వికలం చేస్తున్నట్టు, లక్ష్మీకుమారి మనస్సుని దుష్టశక్తులేమైనా విరిచేశాయేమో! అయినా ఆడవాళ్లని నమ్మకూడదు. ఆశ పెంచి అంతలోనే తుంచేస్తారు. చిత్రం! జీవితమంతా ఆమెని తనతో కలిసి బ్రతకడానికి ఎన్నిక చేసుకొన్న లక్ష్యం కోసం ఎంచుకొన్న క్షణాల్ని ఎంత తేలిగ్గా తీసిపారేసింది. లక్ష్మీకుమారి! – ఇలా అనుకుంటుండగా మంచుతెరలు సన్నసన్నగా విడిపోవడం ప్రారంభించాయి.
విసిగిపోయిన బాలరాజు, ఆశ చితికిన బాలరాజు, ఒంటరి బాలరాజు తీరని ఆశాభంగంలో వెనక్కి వెళ్లిపోయాడు.
* * *
మాచ్ ఖండ్ చుట్టూ మంచుకొండలు. మహారాజుల్లాగున్నాయి. ప్రకృతికి చలేసి మరేం తోచక మంచుదుప్పటి కప్పుకుని మరింత వణుకుతున్నట్టుంది. నిండా చెదిరిన నీహారాలు నిండిన వాతావరణం ఆలోచనలో ఉక్కిరిబిక్కిరయిన మనస్సులాగా వుంది. లక్ష్మీకుమారి మనస్సులో వేడి భావాలు మంచునికరిగించి కాచి మరగబెట్టేలా వున్నాయి.
లక్ష్మీకుమారి తడిసిన వాగ్లాస్ తుడిచి టైమ్ చూసుకుంది. ఆరు కావస్తోంది. తను వచ్చి అప్పుడే అరగంటయింది. రమ్మనిన బాలరాజు రాలేదు. తను అతని కలలోగాని వుందా? ఏమిటో ఈ మగవాళ్ళు ఆలస్యంలో ఆడవాళ్ళని మించిపోతున్నారు. అయినా అతను నిజంగా తనని ప్రేమిస్తున్నాడా? లేక ఆడిస్తున్నాడా? ఛా? కాదు! అసలు తప్పంతా తనది. యిన్నాళ్ళు ముఖపరిచయంలో ఎన్నో సంకేతాలు తనకి అవకాశాలు కల్పించాయి. తనకి సాహసం లేకపోయింది.
బాలరాజు తనకెంత చిత్రంగా కలిశాడు:
ఆవాళ:
వర్షంలో తడిసిన సాయంత్రం – తను కారులో ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ బీచ్ రోడ్డులో వుల్లాసంగా పోతూంటే హఠాత్తుగా వినబడిన చిత్రమైన అరుపుకి సడన్ బ్రేకు వేసింది.
కంగారుగా కారు దిగింది. కారు పక్కనే ఎవరో వ్యక్తి – ముఖం తెలియడం లేదు. కారు చక్రం విసిరిన రోడ్డు మీది బురదలో అతని మొహం నవ్వొచ్చేలా తయారైంది. కాని తనకప్పుడు నవ్వు రాలేదు, కంగారు పడింది.
తడిసిన సాయంత్రం తలంటుపోసుకున్న అమ్మాయిలా వుంది.
బీచ్ లో మనుషుల్లేరు. తను అతనికి దగ్గరగా వెళ్ళింది – అబ్బ! ఎంత దగ్గరికి!
క్షణం అలాగే వుండిపోయింది.
వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు. “ఐయామ్ వెరీ సారీ” అంది.
“డజన్ట్ మేటర్!” ఆ మొహంలోంచి మాటలు వినిపించాయి.
తను తడబాటుతో చీరకొంగుతో అతని ముఖం తుడిచింది. నుదురు కనిపించింది. చిన్న నుదురు, ముచ్చటగా మళ్ళీ తుడిచింది. చక్కటి కళ్ళు. చిక్కటి కనుబొమ్మలు – అవే – తనకి రోజూ కలలో కనిపించి కవ్వించే కళ్ళు, మళ్ళీ తుడిచింది. అందమైన ముక్కు – పట్టుదల సూచించే వొంపుతో మళ్ళీ తుడిచింది. పెదాలు కనిపించాయి,తను రోజూ కలలు కనే పెదాలు. అలా ఆ విధంగా పంకంలోంచి పంకజం పుట్టినట్టు బాలరాజు ముఖం పుట్టింది. తను కోరుకునే మనోహరమైన మనోజ్ఞరూపం అనుకోకుండా తన చేతుల్ని పలకరించింది. నిద్దట్లో తపస్సు నిజమై నిలిచింది. ఆ రోజే అతని పరిచయం కోసం, అతని కోసం అంతరంగంలో భావాలు సముద్రపు కెరటాల్లా ఎగిరి వయ్యారంగా విరిగేయి.
లక్ష్మీకుమారి వాచీ చూసుకుంది. ఆరూంపావైంది. అతను రాలేదు. ఆరున్నరైంది. అతను రాలేదు. ఒక్కసారిగా లక్ష్మీకుమారికి మంచు మీద కోపం వచ్చింది. ఎందుకు రాలేదు? ఒకవేళ తనంటే అతనికి ఏ విధమైన అభిప్రాయం లేదేమో! తప్పంతా తనది. మగాళ్ళని నమ్మకూడదు. ఆశపెంచి అంతలోనే తుంచేస్తారు. మంచు నీరైపోతుంది. మనస్సూ నీరై పోతోంది.
విసిగిపోయిన లక్ష్మీకుమారి, ఆశ చితికిన లక్ష్మీకుమారి, ఒంటరి లక్ష్మీకుమారి తీరని ఆశాభంగంతో వెనక్కి వెళ్ళిపోయింది.
* * *
అలా తీరని విరహాన్ని మిగిల్చి యిద్దరూ వెళ్ళిపోయేక, ఆ విరహం వేడికి క్రమంగా మంచు అంతా కరిగిపోయింది. అలా కరిగిన మంచు పదడుగుల తేడాలో ఒకర్నొకరు గమనించకుండా యిద్దరూ మంచు ముసుగులు కప్పుకొని నిలబడినట్టు నిలబడిన నైట్ క్వీన్ మొక్కల ఆకుల మీద బిందువులుగా జారి అరుణకిరణాలకి అందంగా మెరిసింది.

*****

1 thought on “పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *