April 22, 2024

చంద్రోదయం – 32

రచన: మన్నెం శారద

స్వాతి సారథి బేంక్ కెళ్లగానే జానకమ్మని పిలిపించింది రహస్యంగా.
“పిన్నిగారూ! నాకు మళ్లీ అనుమానంగా వుంది. డాక్టరు దగ్గరకెళ్దాం” అంది భయంగా.
జానకమ్మ స్వాతిని తేరిపారా చూసింది.”నువ్వు చదువుకున్నావ్ గాని బొత్తిగా బుద్ధిలేదే అమ్మాయ్. ఇప్పటికే రెండుసార్లయింది. మొన్నటిసారే మూల్గుతూ ప్రాణానికి ముప్పంటూ నసిగి విసిగి చేసింది. ఈసారి వెళ్తే మొహన్నే వూస్తుంది. నావల్ల కాదు బాబు” అంది.
స్వాతి “అలా అంటే ఎలా పిన్నిగారూ, మీరు కాకుంటే నాకెవరు దిక్కు?” అంది ఏడుపుమొహం పెట్టి.
జానకమ్మ కాస్త మెత్తబడింది.”అదీ నిజమేననుకో. అయినా ఏదో మాత్రలుపయోగించమని డాక్టరు ఎన్నిసార్లు చెప్పింది నీకు. వింటేనా? ఇలా ఎన్నిసార్లు కొంపమీదకు తెచ్చుకొని పరుగులు పెడతావ్?”
“మీకు తెలియందేముందు పిన్నిగారూ. ఆ మాత్రలు ఎక్కడైనా పొరపాటున కన్పిస్తే నా కొంప మునిగిపోతుంది. ఆయన దృష్టిలో జీవితాంతం దోషిగా నిలబడాల్సొస్తుంది. ఈసారికి…” అంటూ బ్రతిమాలింది స్వాతి.
ధైర్యం చేసి జానకమ్మ స్వాతిని తీసుకొని డాక్టరు దగ్గరకు ప్రయాణమైంది. వీళ్లను చూస్తూనే డాక్టరు ముఖం చిట్లించింది.
పేషెంట్లందరినీ పంపించేసి చివరగా స్వాతిని పిలిచింది.
“ఏవిటి ట్రబుల్?” అంది యధాలాపంగా.
“ఏవుంది? మామూలే? అమ్మాయికి మళ్లీ నెల తప్పింది!” అంది జానకమ్మ.
డాక్టర్ వాళ్లిద్దరివైపూ తీక్షణంగా చూసింది.
“ఏమ్మా! పోయినసారి నీకేమని చెప్పేను? ఈసారిలాంటి పని చేస్తే ప్రాణానికే ముప్పని చెప్పలెదూ. మొన్ననే చాలా బ్లడ్ పోయింది. ఇంకా నీ ముఖం చూడు, ఎలా పాలిపోయిందో. ఇష్టం లేకపోతే ముందే జాగ్రత్తపడాలి. లేదంటే చచ్చినట్టు కనాలి. సారీ, నా వల్ల కాదు” అని ఖచ్చితంగా.
స్వాతి బిక్కమొహం పెట్టేసింది.
జానకమ్మ బ్రతిమాలటం మానలేదు.
“మీరలా అంటే ఎలాగమ్మా. ఈసారికెలాగో చూడండి. ఇంకోసారి రాము. డబ్బు ఎంత కావాలన్నా తీసుకోండి”
డాక్టర్ తీవ్రంగా చూసింది.
“ప్రాణం పోతుందని చెబితే వినరేం. చావటానికి నాకెదురు డబ్బు యివ్వడమెందుకు? కానీ ఖర్చు లేకుండా చావొచ్చు” అంది కోపంగా.
ఇద్దరూ ఈసురోమంటూ యిల్లు చేరేరు.
స్వాతి మంచమ్మీద పడుకొని కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే జానకమ్మ “ఏం చేస్తాం? అది వుత్త పట్టుదల మనిషి. కాదంటే.. చ్స్తే దానిచేత మళ్లీ ఆ దేవుడు కూడా ఔననిపించలేడు” అంది ఓదార్పుగా.
“అదికాదు పిన్నిగారూ! ఈసారి యిది పోగొట్టుకోకపోతే నేను అన్నివిధాలా నష్టపోతాను” అంది దుఃఖంతో.
“అదేమిటి?” అంది జానకమ్మ ఆరాగా.
“నేను మీకు చెప్పనేలేదు. మా మామగారు ఆస్తంతా ఆయన పేరున పెట్టేరు. ఆ ఆస్తి మీద నాకేం మమకారం లేదు. ఆ డబ్బువల్ల ఆయన మనసు మారి, రేపు తనకంటూ పిల్లలు కలిగితే నానీని నిరాదరించరూ. అది చూసి నేను భరించగలనా” అంది మనస్తాపంగా.
జానకమ్మ ఆశ్చర్యంగా చూసింది.
“ఎంతపని చేసేడు ఆ ముసిలోడు. సొంత మనవడికన్నా ఈయనగారు ఎక్కువయ్యేరన్నమాట. అయ్యో, అయ్యో.. కలికాలం తల్లీ. డబ్బుకు లొంగనివాడెవడు? ఈ సంగతి ముందే చెప్పేవు కాదేం. అంత ఆస్తి మూటగట్టుకున్నవాడు నీ కొడుకుని చూస్తాడన్నమాట కల్ల. అయ్యో నాయనా శేఖరం. చచ్చి ఏ లోకాన వున్నావో కానీ, నీ కొడుకు గతి చూడు. ఏమవబోతున్నదో?” అంటూ రాగాలు తీసింది జానకమ్మ.
స్వాతి బెంగగా మంచంకోడుకి తలాన్చి పడుకొంది.
“నీ దగ్గర డబ్బెంత వుంది?” అంది జానకమ్మ ఉపాయం తోచినట్లు వుషారుగా.
“అయిదారువేలుంటుంది. బేంక్‌లో వుంది”
“సరే, ఓ రెండు వేలు తెప్పించు. డాక్టర్ సుశీల అని మన పక్క మూడవ వీధిలోనే వుంది. డబ్బు కాస్త ఎక్కువగానే గుంజుతుంది కానీ పనవుతుంది” అంది జానకమ్మ.
“బేంక్‌లో ఆయన వుంటారు ఎలా?” అంది ఆమె భయంగా.
“మరేం చేద్దామంటావ్. నేనొక నాటుమందిస్తాను. మింగుతావా మరి.”
స్వాతి భయంగా చూసింది.
జానకమ్మ ధైర్యం చెబుతున్నట్లు చూసి “ఏం ఫర్వాలేదు. మా కాలంలో ఈ ఆసుపత్రులూ, ఫేమిలీ ప్లానింగులూ ఎక్కడివి. ఇష్టం లేకపోతే చటుక్కున ఏ ఎరుకలసాని దగ్గరో నాటుమందు తీసుకుని మింగేసేవాళ్లం. మంచెమెక్కి పడుకోవటాలూ అవీ మేమెరగం. మూడోరోజే గుండ్రాళ్లలా తిరుగుతూ దంపుడు పనులు కూడా చేసేసేవాళ్లం.” అంది.
ఆమె మాట్లాడలేదు.
“ఏం మాట్లాడవు? నీ ఇష్టం. కంటానంటే నాకేం అభ్యంతరం లేదు. నీ కొడుకు సంగతి నువ్వాలోచించుకోవాలి గాని మధ్యలో నాదేవుంది?” వెళ్లడానికి లేచింది.
“పిన్నిగారూ మీ యిష్టం” అంది స్వాతి నిర్ణయానికొచ్చినట్లు.
“ఒక్క నిమిషం. ఇప్పుడే తెచ్చిపెడతాను” అంటూ జానకమ్మ వుషారుగా క్రిందకెళ్లింది.

ఇంకావుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *