April 26, 2024

జీవన వేదం – 2

రచన: స్వాతీ శ్రీపాద

అప్పట్లో టీవీలు, అంతర్జాలాలూ, స్మార్ట్ ఫోన్ లూ లేని రోజుల్లో ఎంత చదువుకున్నా కొంత అమాయకత ఉంటూనే ఉండేది. తల్లిని వదిలి వెళ్ళడం మరీ కష్టంగా ఉంది. అడగకముందే సమయానికీ అన్నీ అమర్చిపెట్టే అమ్మ, ఇప్పుడిహ సర్వం తనే చూసుకోవాలి. అమ్మ ధైర్యంగానే ఉంది.
” పిల్లలను కన్నాం పెంచి పెద్ద జేసాం, చదువుకుని ప్రయోజకులై వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతకాలి కదా? అమ్మ కొంగట్టుకు తిరిగితే జీవితం గడచిపోతుందా?” అంటూ తనే ధైర్యం చెప్పింది అందరికీ.
దిగులు దిగులుగానే విమానం ఎక్కినా కాలేజీ మిత్రులు నలుగురైదుగురు వెంట ఉండటంతో కాస్సేపటికే తేరుకో గలిగాడు. చదువు ముఖ్యం. ఆపైన మంచి ఉద్యోగం సంపాదించటం ముఖ్యం. అక్కడ వెళ్ళగానే కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్ పోస్ట్ సిద్ధంగా ఉంది, అంచేత సంపాదన కోసం పెద్ద బెంగ అవసరం లేదు. వాళ్ళిచ్చేది తనకు బాగానే సరిపోతుంది.
అమెరికాలో దిగిన క్షణం నుండీ అన్నీ కొత్తగానే ఉన్నాయి.
ఆ పెద్ద పెద్ద భవనాలు, చిన్న సైజ్ ఊరిలా ఉండే కాలేజీ కాంపస్. ముఖ్యంగా అందరితో పోటీ పడుతూ చదువూ, అప్పుడో ఇప్పుడో ఇంటికి ఫోన్ చెయ్యడం. వీటన్నింటి మధ్యనా ఒకరోజున ఊడిపడింది సీత ఉత్తరం.
కవర్ మీద అడ్రస్ కోళ్ళు కెలికినట్టు.
ఇన్లాండ్ లెటర్ లో ఇరికించి రాసిన చీమతలకాయల సైజు అక్షరాలు.
పుస్తకాల్లో దాచుకుని రాత్రి అందరూ పడుకున్నాక గది తలుపు వేసుకుని తెరిచాడు.
ప్రియమైన బావా,
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ నువ్వు క్షేమమేనా?
ఎట్టుండావు? నువ్వు పోయినప్పటి నుండీ ఏమీ చెయ్యబుద్ధి కాడం లేదు. అత్తకూడా అంత ధైర్యంగా నిన్ను పంపి నువ్వటు వెళ్లగానే బోరున ఏడ్చేసింది. ఏమత్తా అంటే పిల్లడు మనం దిగులుపడితే వాడు బెంబేలు పడతాడని ఉగ్గబట్టుకున్నా గాని వాడు నా ప్రాణం గదే. ఎల్లా బ్రతుకుతాను వాడిని చూడకుండా అనింది.
నేను ఇంటికి దగ్గర్లో ఉన్న ఉమెన్స్ కాలేజీలో చేరినాను. ఒక్క సారి ఇంగ్లీష్ మీడియమ్ అనేసరికి దిగులుగా ఉంది, మాట్లాడాలంటే భయంగా ఉంది. మాట్లాడదామన్నా చటుక్కున తెలుగే వస్తున్నది. అస్సలు నాకైతే కాలేజీకి పోవాలనే లేదు కాని, నీ చదువయ్యేలోగా కనీసం పీయూసీ అయితే కొంచం ఇంగ్లీష్ వస్తుందని అత్త బలవంతం. నిజమే కదూ నేను నీతో పాటు అమెరికా వస్తే కొంచమైనా భాష రాకుంటే ఎట్టా?
మన ఇంటిముందు మామిడిచెట్టుకి ఈసారి ఆకు కనబడకుందా పిందెలు వచ్చాయి. ఉగాదికి మీ అక్కలు ముగ్గురూ వచ్చారు. అందరూ క్షేమంగా ఉన్నారు. మీ పెద్దక్కకు మూడోసారి వేవిళ్ళు, అందుకని ఇక్కడే ఉండి పోయింది. మీ మూడో అక్క, అదే మొన్న మొన్నే పెళ్ళయింది కదా ఆషాఢం అంటూ తీసుకువచ్చారు. రెండో అక్క పసివాడితో ఇబ్బందిగా ఉందని విశ్రాంతిగా ఉంటుందని ఉంది. మొత్తానికి ఇంట్లో నువ్వు తప్ప అందరూ ఉన్నారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. మీ అక్కలు నీ గురించి, చిన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి చేష్టల గురించీ కథలు కథలుగా చెప్తున్నారు.
మీ పెద్దక్కయ్యకూ నీకూ పదేళ్ళు తేడా కదూ, తనెలా నిన్ను ఎత్తుకు తిరిగేదో చెప్పింది. చిన్నప్పుడు నువ్వు ఎంతగా సతాయించేవాడివో కదా, చీటికీమాటికీ జ్వరపడేవాడివనీ జ్వరం వస్తే అత్త ఒడి వదిలేవాడివి కాదనీ, అత్త పూజ, వంట చేసుకునేవరకూ తనే ఒక చీర కట్టుకుని నిన్ను ఒడిలో పెట్టుకుని కూచునేదట కదా. అత్త ఇల్లు కదలక పోయినా జ్వరం దడుపు జ్వరమో దిష్టి జ్వరమో అని బెంగపడి మీ అక్కయ్యను మంత్రం వేయించుకు రమ్మని నిన్నిచ్చి పంపేదట. అదేమితో ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా చిన్నప్పటి నుండీ ఇవన్నీ పెద్ద నమ్మకం ఉండేవి కాదట. సగం దూరం నిన్ను తీసుకెళ్ళి దారిలో ఉన్న పార్క్ లో కాస్సేపు పిల్లలతో ఆడించి నేల గంధం నొసటన పెట్టి వెనక్కు తీసుకు వచ్చేదట, అత్త మాత్రం ఎంత దిష్టో మంత్రం వెయ్యగానే జ్వరం దిగిపోయింది అనేదట. పిల్లాడికి ఎంత ఝడుపో మంత్రానికి గాని తగ్గలేదు అనేదట. మీ అక్క నవ్వుకునేదట. రోజూ తనే నిన్ను పార్క్ వరకూ తీసుకువెళ్ళి తెచ్చేదాన్నని ఎన్నిసార్లు చెప్పిందో- సాయంత్రం కాగానే అదే గుర్తుకు వస్తుందట.
ఇంటి ముందు చెరుకు బళ్ళు వెళ్తే చాలు వదిలేవాడివి కాదట కదా, వాళ్ళను పీడించి పీడించి వాటితో పాటూ ఓ చెరుకివ్వు, ఓ చెరుకివ్వు అంటూ వెంట నడిచి ఇచ్చాక కాని వెనక్కు వచ్చేవాడివి కాదటగా.
మీ రెండో అక్కకూ నీకూ అంత పొసగదట కదా, ముచ్చట పడి కొనుక్కున్న దాని గోళ్ళరంగు మొత్తం వరండాలో ముగ్గులు వేసావట, పాపం గోళ్లరంగు కొనుక్కోడమే ఒక గగనం నువ్వది అలా పాడు చెయ్యడం తప్పేగా? అయితే మీ అక్క మాత్రం తక్కువ తిందా?నీ తెల్లటి షర్ట్ మొత్తం పసుపు నీళ్ళలో ముంచేసిందట- చెప్పింది. అయినా ఎంత సేపు రెండు రోజులు ఎండలో ఆరవేస్తే పసుపు వెలిసిపోయిందనీ అంది. అన్ని విషయాల్లో నాతో పేచీకి దిగుతాడు ఇప్పటికీ అంటుంది.
ఇహ మీ మూడో అక్క మన లోకంలో లేదు బావా, ఎంతసేపూ కొత్తమొగుడి ఊసులే. ఇలా మెచ్చుకున్నాడు అలా మెచ్చుకున్నాడు అంటూ. అన్నం వడ్డించినా ఆయనకు ఈ కూర నచ్చదు, ఆ పచ్చడి ఇష్టం అంటూ అదే సొద. కొత్త పెళ్ళికూతురికి మొగుడు తప్ప మరొక మాట రాదేమో.
ఇంతకూ అక్కడ ఎలా ఉంది బావా? చెప్పొద్దూ నాకూ దిగులుగానే ఉంది, అత్తలానే, అటు నువ్వు విమానం ఎక్కింది మొదలు ఎప్పుడు తిరిగి వస్తావా అన్న ఎదురు చూపే.
మా మాటకేం కాని నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించాలి. అలాగని నీ ఆరోగ్యం అశ్రద్ధ చెయ్యకు. బద్దకం అని వంట చేసుకోడం మానకు – అని అత్త మరీ మరీ చెప్పమంది.
జవాబు రాస్తావుగా
నీ చరణ దాసి
సీత.
నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు రవి కిరణ్ కి. కావ్యాలూ కవిత్వాలూ చదివిన మనసుకు ఉత్తరం చేదు మాత్రలానే అనిపించింది.
ప్రేమ లేఖ ఎలా ఉండాలి? మేఘ సందేశంలా –
ఆషాఢ మాసపు తొలిదినాన మేఘంతో విన్నవించుకునే విరహంలా,
ఇది మరెవరి కళ్ళైనా పడితే ఇంకేమయినా ఉందా? ఎంత ఏడిపిస్తారు? ముక్కలు ముక్కలుగా చింపి పారేసినా అందులో అక్షరం అక్షరం మనసుకు నాటుకుపోయింది.
కొత్త జీవితంలో తీరిక దొరికేదే తక్కువ. నలుగురు కలిసి ఉన్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకోడం మొదటిసారి. వంట చేసుకోడం మొదటి సారి. అసలు మరొకరితో కలిసి ఉండటమే మొదటిసారి.
భాష ఎంత తెలిసినా ఏక్సెంట్ కొంచం కష్టంగానే ఉండేది.
మొత్తానికి రోజులు గడుస్తున్నాయి, నెమ్మదిగా ఒక్కోసారి, పరుగులు తీస్తూ ఒక్కోసారి.
నెల తిరిగేసరికి మరో ఉత్తరం, ఈసారి రాత కొంచం కుదురుగానే ఉంది.
క్రితం మారు వచ్చిన ఉత్తరానికి జవాబే రాయలేదు, ఒకసారి ఫోన్ చేసి అందరితో మాట్లాడాడు సీతతో తప్ప.
అక్కడికీ అమ్మ అడగనే అడిగింది – “సీతతో ఏమైనా మాట్లాడతావా?”
” ఏం మాట్లాడాలి? దాని మొహం దానికి మాటలు కూడా వస్తాయా?”
అమ్మ నవ్వేసి ఊరుకుంది.
ప్రియమైన బావా,
నా మీద నీకేమయినా కోపం గట్రా ఉన్నాయా? నీకు ఉత్తరం పోస్ట్ చేసిన మర్నాటి నుండీ నీ జవాబు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. తెల్లారి లేచినది మొదలు పోస్ట్ మాన్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నీ ఉత్తరం వస్తుందా అని. చూసి చూసి నిద్రలో కూడా నాకు అవే కలలు. పోస్ట్ మాన్ వచ్చి ఇంటి తలుపు కొట్టినట్టూ, తలుపు తీసేలోగా వాడు ఖాళీ చేతులతో నన్ను వెక్కిరిస్తూ వెళ్ళిపోయినట్టూ- మరో రోజున వాడు ఇచ్చిన ఉత్తరం చదివేలోగా గాలికి ఎగిరిపోయినట్టు, లేదా ఉత్తరం తెరిచేలోగా అది జారి నీళ్ళ బకెట్ లో పడి చూస్తూండగానే నానిపోయినట్టు, కష్టపడి ఉత్తరం తెరిస్తే అందులో అక్షరాలు కనబడకో, కళ్ళు తెరిపిడి పడకో చదవలేకపోయినట్టు ఇలా రోజూ ఈ కలలే. కలలు వదిలేస్తే ప్రతి నిముషం నీ ఉత్తరం ఆలోచనే. నిద్రలేచింది మొదలు ఈ రోజైనా ఉత్తరం వస్తుందా రాదా అన్న ఆలోచనే, ఆ పరధ్యానమే. ఎందుకు బావా ఒక్క జవాబైనా రాయలేదు?
నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను. ఇంగ్లీష్ చదవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. మాట్లాడదామని చూస్తానా ఉన్నట్టుండి తెలుగే వచ్చేస్తుంది. కాని నీ కోసమే నేను చదువుతున్నాను, రేప్పొద్దున నేను నీతో పాటు వచ్చాక ఇంగ్లీష్ రాకపోతే ఎలాగ? నలుగురూ నవ్వితే నీకు కదా ఇబ్బంది.
కాలేజీలో ఒకరిద్దరు స్నేహితులు దొరికారు. మంచి స్నేహితులు…సుగుణ, సౌందర్య.
సుగుణ హాస్టల్ లో ఉంటుంది. దానికి మొన్నీమధ్యే పెళ్లైంది. వాళ్ళాయన ఇక్కడికి బదిలీ చేయించుకునే వరకూ హాస్టల్ లో ఉంటుందట. శనాదివారాలు అతను వస్తూ ఉంటాడు. వారమంతా అది కలలలో తేలిపోతూ ఉంటుంది. అసలు అతని పేరు తలచుకుంటేనే గుండె జివ్వుమంటుందట. అది స్వయంగా తెలుసుకోవాలి తప్ప ఒకరు చెప్తే తెల్సేది కాదంటుంది. నేను నీ గురించి చెప్పాను. కాని బావా దాన్ని చూసాక అనిపిస్తోంది నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మన పెళ్ళి జరుగుతుంది, ఇవన్నీ తలుచుకుంటే బెంగగా ఉంది. నిజం చెప్పనా బావా, అమ్మా నాన్నలకన్నా నీ గురించే ఎక్కువ దిగులు పడుతున్నాను.
అన్నట్టు నా మరో స్నేహితురాలు సౌందర్య. కాలేజి పక్కనే వాళ్ల ఇల్లు. మధ్యాన్నం లంచ్ టైంలో వాళ్ళింటికి వెళ్ళి ఇద్దరం అక్కడే లంచ్ చేస్తాం. అత్తయ్య లంచ్ బాక్స్ ఇస్తుందనుకో అది ఇద్దరం షేర్ చేస్తాము.
నాకంటే మరో జానెడు పొడుగు, సన్నగా ఉంటుంది, కాని పిట్టతిండే తెలుసా?
మనం అన్నం పప్పు ఆవకాయ, కూర, చారు పెరుగు ఇన్ని ఆధరువుల్తో తింటామా, అది గరిటెడు అన్నంలో సాంబారు కలుపుకుని మిగతావన్నీ పక్కన ఉంచుకుని తినేస్తుంది. మరో స్పూన్ అన్నంలో పెరుగు అంతే.
అందుకే అది అలా నాజూగ్గా ఉంటుంది.
బావా ఇంకేం చెప్పను?
అక్కడ నువ్వు సరిగ్గా వంట చేసుకుంటున్నావా? లేకపోతే ఆ బయట తిళ్లకు అలవాటు పడ్డావా? అవును అక్కడ అమెరికావాళ్ళు మనలా అన్నం పప్పు కూరలు తినరటగా? బ్రెడ్ తిని బతుకుతారా?
మనకు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ తినాలంటేనే వెగటుగా ఉంటుంది, కాని రోజూ అదే బ్రెడ్ ఎలా తింటారు?
మనలో మన మాట అక్కడ అందరూ మాంసం ఎక్కువగా తింటారటగా? నువ్వూ ఏమైనా వాటికి అలవాటు పడ్డావా? అత్తకు చెప్పనులే.
ఇంకా చాలా రాయాలనుంది, కాని బావా అందరూ నిద్రపోతున్నారు. ఇంకా లైట్ తియ్యవేమని మీ అక్కల గోల
ఈసారైనా తప్పకుండా ఉత్తరం రాయి బావా.
ప్రతి నిముషమూ ఎదురు చూస్తూ ఉంటాను
నీ చరణ దాసి
సీత.
ఈసారి అంతగా చిరాకుపడలేదు రవికిరణ్. ఏదేమైనా మాట ఇచ్చేసి నిశ్చితార్ధం కూడా చేసుకున్నాక సగం పెళ్ళైనట్టే లెఖ్క. అంత చదువుకుని అమెరికా వచ్చాక వాళ్లముందు తామంతా ఎంత అనాగరికుల్లా ఉన్నారు? ఇహ ఎక్కడో కుగ్రామం నుండి వచ్చిన సీతను చిన్న చూపు చూడటం భావ్యమేనా? తనలో తనే రెండు మూడు రోజులు తర్కించుకున్నాడు రవికిరణ్. ఉత్తరం రాద్దామని అయిదారుసార్లు ప్రయత్నించాడు. కాని ఉత్తరం ఇంటి అడ్రస్ కి వెళితే అక్కలు వదిలిపెడతారా, ముందు వాళ్ళు చదివి కాని ఇవ్వరు. రాసిన ఉత్తరం చింపేసాడు. ఆరోసారి తల్లికే రాసాడు ఉత్తరం.
ప్రియమైన అమ్మకు
అమ్మా, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేను బాగానే ఉన్నాను. అక్కలందరూ క్షేమమే కదా అంటూ మొదలుపెట్టి పేరుపేరునా ప్రతి వారి యోగ క్షేమాలు విచారించి, అందరికీ బెంగ పడవద్దని చెప్పి చివరిలో సీత ప్రస్తావన తెచ్చాడు. సీత ఏ కాలేజీకి వెళ్తోంది? బాగా చదువుకుంటోందా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నేను, నా స్నేహితులూ ఇక్కడ వంట చేసుకునే తింటున్నాము, నువ్వు ఇచ్చిన ఊరగాయాలు, పొడులు మాకు బాగా పనికి వస్తున్నాయి.
సీతను ఇంగ్లీష్ బాగ నేర్చుకోమని.
నాన్నకు పాదాభివందనాలు- అంటూ ముగించాడు.
ఎలాగూ ఈ ఉత్తరం సీతతోనే చదివించుకుంటారు. తను చెప్పవలసినది అన్యాపదేశంగా చేరిపోతుంది. – అని
ఆలోచించాడు.
అవును, సీతకు ఏ మాత్రం బుర్ర ఉన్నా తనకు కాలేజీ అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాస్తుంది. లేదా నా ఖర్మ దాని అదృష్టం అనుకున్నాడు.
ఎదురు చూసినట్టుగానే వచ్చింది జవాబు.
ప్రియమైన బావా,
చాలా సంతోషం వేసింది. నీ ఉత్తరం ఒక వందసార్లు చదువుకుని ఉంటాను. ఎంత తెలివిగా అత్తకు రాస్తూనే నా గురించి అడిగి, నా సందేహాలకు జవాబిచ్చావు. కష్టంగా ఉన్నా తప్పదు కదా బావా, మన పద్ధతులు మన అలవాట్లు ఎక్కడికి వెళ్ళినా వదులుకోకూడదు. నువ్వు వంట చేసుకోడం బాగుంది.
కాలేజీ అడ్రస్ ఇస్తున్నాను బావా -ఇహపైన ఉత్తరాలు అక్కడికే రాయి. ఇన్నాళ్ళూ ఇంగ్లీష్ లో ఉన్న సందేహాలు ఎవరినడగాలో తెలియక ఇబ్బందిపడిపోయాను. ఇహపైన నీకు రాసి తెలుసుకుంటాను.
నేను కాలేజీలో బాగానే చదువుకుంటున్నాను, అత్త కు సాయంత్రాలు సాయం చేస్తూ వంట కూడా నేర్చుకుంటున్నాను.
నీ చదువు త్వరగా పుర్తి చేసుకో. ప్రతి క్షణమూ నీ ఊహల్లోనే ఉండే
నీ సీత
కొంత మార్పు గమనించిన రవికిరణ్ సీత నిశిత పరిశీలనకు ఆనందపడ్డాడు, మరీ పప్పుసుద్ధ కాదులే, త్వరలోనే మార్చుకోవచ్చును అనిపించింది.
***

రెండేళ్ల చదువు పూర్తవుతూనే రవికిరణ్ కు మంచి ఉద్యోగమే దొరికింది. ఉద్యోగంలో చేరేముందే ఒకసారి అందరినీ చూడాలని వచ్చాడు రవికిరణ్.
మంచి రంగేమో చల్లని వాతావరణానికి మరింత రంగొచ్చి మిసమిసలాడుతున్నాడు. పసితనం పోయి కాస్త హుందాతనం వచ్చి చేరింది.
సీతలో కూడా చెప్పుకోదగ్గ మార్పే కనిపించింది అతనికి భాష కొంచం మెరుగుపడింది. మనిషి నాజూగ్గా మారింది. బిగించి జడగంటలు వేసుకున్న జడకు బదులుగా వదులు వదులుగా సగం అల్లి మధ్యలోనే వదిలేసిన జుట్టూ, కొంత పెద్దరికం వచ్చినట్టుగానే ఉంది.
సరిగ్గా మూడూ వారాలకే వచ్చినా పెళ్ళి చేసుకునే వెళ్ళమని పట్టుబట్టారు అటూ సీత ఇటూ రవికిరణ్ తలిదండ్రులు కూడా. పెళ్ళి చేసుకున్నా ఇంకా సీత పాస్పోర్ట్ వీసా రాడానికి టైమ్ పడుతుందని చెప్పినా వినలేదు.
వీలైనంత దగ్గరలో ఉన్న ముహుర్తం ఎంచుకున్నారు.
అందరూ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు.
ఇంట్లో సీత ఒక్కతే ఉంది. నలుగురూ నాలుగుపనులూ భుజాన వేసుకుని బయటకు వెళ్ళారు.
సీత సంధ్యా దీపం వెలిగించి వంట చేసేందుకు సిద్ధమైంది.
అప్పుడే బయటి నుండి వచ్చాడు రవికిరణ్.
రోజంతా ఎండలో తిరిగాడేమో మొహం ఎర్రగా కందిపోయింది.
వచ్చి రాగానే సోఫాలో వేళ్ళాడబడ్డాడు.
ఒక గ్లాస్ తో చల్లటి మంచినీళ్ళూ, మరో గ్లాస్ తో కాఫీ తీసుకువచ్చింది సీత.
నీళ్ళ గ్లాస్ అందుకుని గట గటా తాగి – కాఫీ గ్లాస్ అందుకుంటూ – “ప్రాణం లేచి వచ్చినట్టుంది సీతా ” అన్నాడు.
అతను వచ్చాక మాట్లాడిన మొదటి మాట అది.
కాఫీ గ్లాస్ అందించింది సీత -“ఎండ అలవాటు తప్పిపోయిందిగా, అందుకే అలసిపోయి ఉంటావు.”
పీయూసీ అయినాక సీత మరిక కాలేజీకి వెళ్లలేదు. కుట్లూ అల్లికలూ అంటూ కొన్నాళ్ళు, వంటలు కొన్నాళ్ళు, బ్యూటీషియన్ కోర్స్ చిన్న చిన్న కోర్స్ లు చేసింది.
కొంత బయట నలుగురితో తిరగడం అలవాటైంది.
ఇంట్లో ఎవరూ లేరు చెప్పవలసిన మాట ఇప్పుడు చెప్పడమే నయమనిపించింది.
” సీతా నీకో విషయం చెప్పాలి” అన్నాడు.
” చెప్పు బావా” టీపాయ్ మీద పేపర్లు సర్దుతూ అంది సీత.
” సీతా మా అమ్మా నాన్నా, మీ అమ్మా నాన్నా ఎవరికి వాళ్ళు ఈ పెళ్ళి జరిగిపోడం ముఖ్యం అనుకుంటున్నారు కాని నాకు గట్టిగా పాతికేళ్ళయినా రాలేదు, నువ్వింకా మేజర్ వే కాదు. పెళ్ళి చేసుకున్నా ఇప్పుడే నేను నిన్ను తీసుకెళ్ళి సంసార జంజాటంలో పడాలని లేదు. ఇంకా కొంత చదువుకోవాలి, మంచి స్థితికి రావాలి. నీ చదువు ఇక్కడితో ఆపేస్తే అది ఏమీ చదువుకోని కిందకే లెక్క. కనీసం డిగ్రీ అయినా ఉంటే కాని అక్కడేమీ చెయ్యలేవు. అందుకని… ” అంటూ ఆగాడు.
“అందుకని, చెప్పు బావా, ఇప్పుడూ పెళ్ళి వద్దంటావా?”
“అలాగని అమ్మా నాన్నను కాదనలేను. కాని నువ్వు ఇక్కడే వుండి డిగ్రీ చెయ్యాలి. నేను కుదిరినప్పుడల్లా వస్తాను”
మౌనంగా ఉండిపోయింది సీత.
ఎటూ చెప్పలేని స్థితి. అప్పుడే మనసంతా మబ్బులు కమ్మినట్టు అయిపోయింది.
“ఇప్పుడే మనం మన కుటుంబం మొదలుపెడితే ఇహ చదువులూ, ఆశయాలూ గాలికి వదిలెయ్యల్సిందే, ఏమంటావు సీతా ?”
“నీ ఇష్టమే నా ఇష్టం బావా, కాని ఇక్కడ ఇంత దూరాన ఉండటమూ కష్టమే” అంది.
“ఎంతలో ఏడాది తిరిగి వస్తుంది? అయినా వీలయినప్పుడల్లా వస్తాను”
ఆ ఇద్దరి ఒప్పందమూ ఇంట్లో మరెవరికీ తెలియదు.
సీత కాస్త మూడీగా మారిపోయింది.
పెళ్ళుళ్ళు పెద్ద ఆర్భాటంగా చేసే కాలం కాదది. ఎవరి స్థాయిలో వాళ్ళు ఇంటిముందు పందిరి వేసుకుని ఓ పాతిక మంది బంధుమిత్రులతో జరుపుకునే శుభకార్యం.
రెండు పట్టు చీరలు కొంటే జీవితాంతం దాచుకునే రోజులు.
పిల్లకు ముక్కుపుడక చెవుల దుద్దులతో కన్యాదానం చేసే రోజులు. చూస్తూండగానే పెళ్ళి రోజు రానూ వచ్చింది.
పెళ్ళి జరిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *