April 26, 2024

మోదుగపూలు – 15

రచన: సంధ్యా యల్లాప్రగడ

ఆ కోట వివేక్ మునుపు చూసిన కోటలా చిన్నదిలా కాకుండా చాలా పెద్దగా ఉంది.
ఆ కోటను పదమూడవ శతాబ్ధంలో నిర్మించారట. అయినా ఇప్పటికీ చాలా బలిష్టంగా ఉంది.
పూర్తిగా పాడుపడిలేదది, కొంత నిలబడి ఉన్నది. పైకప్పు మాత్రం లేదు.
గోండు రాజులు తమ రాజధాని మధ్యప్రదేశ్‌లోని చంద్రగిరి నుంచి ఉట్నూరుకు మార్చారు. అప్పుడు తమ నివాసము కోసం ఈ కోటను వారు నిర్మించారు. అది మొత్తం మూడు ఎకరాల స్థలంలో నిర్మించి ఉంది. ఆ కోటలో దాదాపు ఏడు వందల ఏళ్ళ గోండురాజుల చరిత్ర దాగి ఉంది.
కోటలో విశాలమైన గదులు, దర్భారుహాలు, కోనేరులు, స్నానపు గదులు, రెండు సొరంగాలు ఉన్నాయి. ఈ రెండు సొరంగాలలో ఒకటి కోనేరు నుంచి దేవాలయ కోనేరుకు, దైవ దర్శనం కోసం గోండు రాణులు వాడేవారుట. మరొక సొరంగం గోండు రాజులు శత్రువుల నుంచి కాపాడుకోవటానికి. దాని చివర అడవిలోకి ఉన్నది.
కోట చుట్టూ లోతైన కందకం. కోట గోడలు ఎక్కటానికి వీలు కానివిగా ఉన్నాయి.
కోట పడిపోతూ ఉంది. కోనేరులో నీరు, కందకములో నీరు పాచిపట్టి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఆ కోట గత కాలపు గోండు రాజుల ప్రాభవానికి గుర్తుగా నిలిచి ఉంది.
స్వాతంత్ర పోరాటంలో గోండు రాజైన రాంజీ గోండు పాల్గొన్నాడు. ఆయన ఎందరినో ఆదివాసులను ఏకం చేసి బ్రిటీషువారి పైకి దండెత్తాడు. బ్రిటీషు వారు వారందరిని ఊచకోత కోసి, రాంజీ గోండును ఆ ఊరులోని మర్రిచెట్టుకు ఉరి వేశారు.
***
గోండు రాజులు స్వాతంత్రము వచ్చే వరకూ అక్కడే ఉండేవారు. తరువాత వారు భారత ప్రభుత్వములో విలీనమైనారు. అటుపై జనజీవితములో కలిసిపోయారు. ఉట్నూరులో వారి వంశస్తులు ఉండే ఉంటారన్న నమ్మకముతో ప్రతివారిని అడగటం మొదలెట్టారు మిత్రులు.
ఎవ్వరిని అడిగినా ఏ సమాచారం దొరకలేదు. సూర్యుడు నడి నెత్తికి వచ్చాడు. నిరాశ కలగకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు వివేక్‌. రాము కూడా ఇబ్బంది పడుతూ వెంట తిరుగుతున్నాడు. ఇలా అక్కడా ఇక్కడా తిరిగితిరిగి అలిసారు మిత్రులు.
అలసిన వారిద్దరూ ఒక సోడా బండి ప్రక్కన ఆగి షోడా కొట్టించుకుంటూ…
“ఇక్కడ రాజ వంశీయులు ఎవరూ లేనట్లున్నారు” అన్నాడు రాము నిరాశ దాచుకుంటూ…
“ఎవరి కోసము వెతుకుతున్నారు సార్‌?” అడిగాడు షోడా కొట్టి ఇస్తూ అతను…
“ఈ గోండు రాజుల, వీళ్ళ వంశీయులు…” కోటను చూపెడుతూ అన్నాడు వివేక్‌.
“వాళ్ళు హైద్రబాదులో ఉంటరు సారు!” అన్నాడతను.
ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.
“హైద్రాబాదులో ఎక్కడో తెలుసా?”
“నాకెట్ల తెలుస్తుంది సార్‌. అటు చూడండి. ఆ బోగన్‌విల్లా చెట్లు ఉన్న ఇంట్లో అడగండి. వాళ్ళు చుట్టాలనుకుంటా. వారింటికి వస్తూ ఉంటరు. మాకు ఇనాం ఇస్తరప్పుడు!” చెప్పాడతను.
ఇద్దరూ లేచి బండి ఎక్కి చప్పున అటు వెళ్ళారు.
ఆ ఇల్లు చిన్న మేడలా ఉంది. ముందు వైపు బంగాళాపెంకులతో ఉన్న వరండా ఉంది. వెనక మిద్దె ఉన్నట్లుంది. మిద్దె మీద మరి కొన్ని గదులు ఉన్నట్లున్నాయి.
ఇంటి ముందు చిన్న కారు. ఒక స్కూటరు ఉన్నాయి.
ఆ ఇంటి ముందు బండి దిగి గేటు తీసుకు లోపలికెళ్ళి బెల్‌ కొట్టాడు వివేక్.
రాము కూడా వెనకనే వచ్చి నిలుచున్నాడు.
***
తలుపు తీసిన నడి వయస్సు పెద్దమనిషి వీరిద్దరిని వింతగా చూశాడు.
“ఎవరు మీరు?ఎవరు కావాలి?” అడిగాడు.
“మేము ఆ కోట తాలుకు రాజుగారిని కలవాలి. అడ్రసు కోసము వచ్చాము”
“ఎవరు మీరు? వాళ్ళ అడ్రసు మీకెందుకు?”
వివేక్‌ గోండు భాషలో “నా పేరు వివేక్. నేను గిరిజన గురుకులంలో టీచర్‌ని. ఇతను నా మిత్రుడు రాము. అతను రిసెర్చు చేస్తున్నాడు. గిరిజనుల కల్చరు మీద” అన్నాడు.
“ఓ… రీసెర్చు కోసమా? రండి లోపలికి” అంటూ దారి తీసాడు.
ఆ గదిలో ఉన్న కుర్చీలలో కూర్చున్నారు ఇరువురు.
ఆ గది వెనకగా విశాలమైన హాలును ఆనుకొని అది పూర్తి ఎల్‌ షేపు హాలుగా ఉంది.
గదిలో ఒక సోఫా, నాలుగు కుర్చీలు ఉన్నాయి. మధ్య చిన్న బల్ల. ఆ రోజు పేపరు బల్ల మీద పెట్టి ఉంది.
హాలు విశాలంగానే ఉంది. హాలును ఆనుకొని వెనక నాలుగు గదులు నాలుగు వైపులా ఉన్నాయి. హాలు వెనక వైపు దొడ్డి గుమ్మము ఉంది. గుమ్మానికి పూర్తి అద్దాల తలుపులు ఉన్నాయి. కిటికీలకు, ఆ తలుపులకు పల్చటి తెరలు ఉన్నాయి. ఆ దొడ్డి గుమ్మం అవతల కూడా బోగన్‌విల్లా చెట్టు పూలు గులాబీరంగులో ఉండి గుమ్మము ముందుకు రాలుతున్నాయి.
ఒక వైపు డైనింగు టేబులు ఉంది.
బయట ఎండకు బోగన్‌విల్ల్ పువ్వు గులాబీ రంగు రిఫ్లెక్టు అయి, గది లోపల గులాబీరంగు ప్రతిబింబిస్తోంది.
ఆ ఇల్లు లోపల మాడ్రన్‌గా ఉన్నా గదిలో అలంకారము పురాతనంగా ఉంది. ఒక మూల గ్రామ్‌ఫోను రికార్డు ఉంది. గోడలకు రాజుల కత్తులు, డాలు వంటిది తగిలించి ఉన్నాయి.
ఇద్దరు మిత్రులు కూర్చున్నారు.
“మంచి నీళ్ళు కావాలా?” అంటూ వారు చెప్పేది వినకుండా “మంగమ్మా” అన్నాడు.
లోపల్నించి ఒక పదేళ్ళ పిల్ల వచ్చి నీళ్ళమగ్గు, గాజు గ్లాసులు పెట్టి వెళ్ళింది.
“సార్ ఈ రాజులు ఎక్కడ ఉంటారు వారి వివరాలు కావాలి?” అన్నాడు వివేక్ ఆత్రాన్ని అదిమి పడుతూ.
“ ముందు నీళ్ళు త్రాగండి, తరవాత మీ కథ, ప్రశ్నలు చెప్పండి” అన్నాడాయన ఎలాంటి తొందరా కనిపించకుండా.
రాము వంగి గ్లాసులో నీరు వంపుకొని త్రాగాడు.
“సార్ నేను వాళ్ళతో మాట్లాడాలి” అన్నాడు వివేక్ అసహనంగా.
“చెప్పవయ్యా” అన్నాడాయన నింపాదిగా. వీరి తొందర ఆయనకెందుకుంటుంది?
వివేక్, రాము ఒకరి మొఖము ఒకరు చూసుకున్నారు “వాళ్ళ అడ్రసు ఇవ్వండి సారు” అన్నాడు రాము.
“అరే వాళ్ళనడిగి ప్రశ్నలేమిటో చెబితే నే చెబుతానుగా” అన్నాడాయన కొద్దిగ్గా గొంతు పెంచి.
వివేక్‌కు ఈయన అడ్రసు ఇవ్వడని తెలిసింది.
“సార్ మీ గురించి మాకు అసలు తెలియదు. మా గురించి మేము చెప్పాము ముందే. వాళ్ళు హైద్రాబాదులో ఉన్నారా? లేదా?” అన్నాడు రాము కోపముతో.
జేబులోంచి తన తండ్రి ఫోటో తీసి “ఈయనను మీరు ఎప్పుడన్నా చూశారా?” అడిగాడు వస్తున్న విసుగును దాచుకుంటూ వివేక్‌.
“రీసెర్చు అని ఫోటోలు పట్టుకు తిరుగుతున్నారా?” అంటూ ఆయన ఆ ఫోటో తీసుకొని చూశాడు.
పరీక్షగా చూసి అది అక్కడి బల్ల మీద పెట్టాడు.
“ఆ ఫోటోలో ఆయన ఎవరు? నీకేమవుతారు?” అడిగాడు ఏదీ తేల్చకుండా.
“ఆయన మా నాయన. ” అన్నాడు వివేక్
“మీ నాయనా?” కళ్ళు పెద్దవి చేసి వివేక్‌ను చూస్తూ అన్నాడు.
తల ఊపాడు వివేక్.
ఆయన కళ్ళలలో రకరకాల భావాలు వచ్చి వెడుతున్నాయి. మౌనముగా కొంత సేపు అలా కూర్చుండిపోయాడు.
తరువాత లేచి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు.
రాము వివేక్ ముఖముఖాలు చూసుకున్నారు. ఏంటి ఈయన పరిస్థితి అని. తాము ఉండాలా లేదా? ఏమీ తోచలేదు. అలా దిక్కులు చూస్తూ కూర్చున్నారు. వెళ్ళాలో లేదో తెలియదు. ఆయన ఏ విషయము చెప్పకుండా మాయమయ్యాడు.
దాదాపు పావు గంట తరువాత, చేతిలో చిన్న డబ్బాతో వచ్చాడు.
“వాడుకలో లేని సరుకు. దొరకటానికి టైం పట్టింది. కొద్దిగా అనుమానంగా ఉంది. వెతకండి” అంటూ ఆ చిన్న పెట్టె తెరిచి అందులో ఉన్న చిన్నవి పెద్దవి నలుపు తెలుపు ఫోటోలు తీసి బల్ల మీద ఉంచి, “చూడండి ఇందులో ఏమైనా కలుస్తాయేమో” అన్నాడు కళ్ళజోడు తీసి తుడుచుకొని మళ్ళీ పెట్టుకుంటూ.
వివేక్, రాము ఒక్కదాటున ఉరికి ఆ ఫోటోలలో వెతకటం మొదలెట్టారు.
అవి పచ్చ రంగులోకి మారి పోతున్నాయి. యాబై ఏళ్ళనాటివైనా, వందల సంవత్సరాల క్రితము ఫోటోలులా అనిపిస్తున్నాయి.
అందులో అందురూ పెద్ద పెద్ద తలపాగాలతో, పంచెలతో, మెడలో దండలతో, పొడుగు చొక్కాలతో ఉన్నారు. కొన్ని పెళ్ళి ఫోటోలు. ఒక్కటి రెండు చోట్లు కొద్దిగ్గా ముఖం కలిసిందనిపించి రాము చూపాడు…. “ఇది చూడు” అని
వివేక్‌ కంగారుగా అదురుతున్న గుండెతో అందుకున్నాడు. అందులో ఒక పెద్దాయిన కూర్చొని ఉంటే పది మంది అలాంటి అటైరులోనే చుట్టూ నిలబడి ఉన్నారు. అందులో చివర్న ఉన్నది తన తండ్రి అని అనిపించింది.
‘వయస్సు తేడా వల్ల, అటైరులో తేడా వల్ల కొంత కష్టపడినా ఆ తీక్షణమైన కళ్ళతో పోల్చవచ్చు!‘ అనుకున్నాడు వివేక్‌.
తన వద్ద ఉన్న ఆయన ఫోటో, అదీ ప్రక్క ప్రక్కన పెట్టి చూశాడు. తల ఎత్తి రాము వైపు చూసి నవ్వాడు. అతని కళ్ళలో పల్చటి నీటిపోర రాముకు కనపడింది.
ఇద్దరూ ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకున్నారు ఆనందముతో.
తల ఊపాడు ‘ఇదే’ అన్నట్లుగా వివేక్‌.
మళ్ళీ మళ్ళీ చూశారు. ఇద్దురు మార్చి మార్చి చూసారు.
ప్రక్కన మరొకరు ఉన్నారన్న సంగతి మరిచి ఇద్దరూ కాసేపు సంతోషములో పోలికలను కంపేరు చేస్తూ వారి గోలలో వారు మునిగారు.
కాసేపటికి తేరుకొని ‘ఇంతకీ ఈయనెవరు?’ అన్న ప్రశ్న ఇద్దరికీ ఒకేసారి కలిగింది.
ఆయన వీళ్ళ వైపు ముచ్చటగా చూస్తున్నాడు అప్పటికే…

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *