February 9, 2023

మోదుగపూలు – 16

రచన: సంధ్యా యల్లాప్రగడ

“ఈ ఫోటోలు వీరు ఎవరు సార్‌? మీకేమవుతారు? మీ దగ్గరకెట్ట వచ్చాయి!” అడిగాడు వివేక్.
“ఇవి మా ప్యామిలి ఫోటోలు…” అని వివేక్‌ను చూస్తూ
“ఫ్యామిలినా…?”
“అవును. ఈ కూర్చున్న ఆయన గోండు రాజు హీర్ దేశ్ షా. బ్రీటీషు వారు తీసేసిన గోండు రాజు. చుట్టూ ఉన్నవారు ఆయన తమ్ములు నలుగురు. ఆయనకు ఆరుగురు కుమారులు. నీవు చూపిన ఆ చిట్టచివరున్న నిలుచున్నాయన చివరి కొడుకు” చెప్పాడాయన.
ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు.
“అంటే మా నాయన గోండు రాజు కొడుకా?” అన్నాడు వివేక్‌ ఉద్వేగంగా.
“ఆయన మీ నాయనేనా? సరిగ్గా చూశావా?” అడిగాడాయన వంగి ఫోటోలు చూస్తూ.
“అవును సార్ ఆయన మా నాయనే!” చెప్పాడు కన్నీరు తుడుచుకుంటూ వివేక్‌.
“ఈయన ఇప్పుడెక్కడున్నాడు?” అడిగాడా పెద్దమనిషి.
“లేదు సార్. చనిపోయారు” చెప్పాడు వివేక కంఠం బొంగురుపోతుండగా.
నివ్వెరపోయాడాయన. “లేడా? పోయాడా?” తనలో తను మాట్లాడుకున్న ట్లుగా అన్నాడు.
ఆయన కొంత సేపు మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు. ఎలా మాట్లా డాలో, ఎక్కడ మొదలుపెట్టాలా అని ఆలోచించి తరువాత గొంతు సవరించుకొని…బొంగురుపోతున్న కంఠం సరిచేసుకుంటూ.. “నేను గోండు నర్సింగుషా. మా నాయన హీర్‌దేశ్‌షాకు పెద్దకొడుకు. గోండు భరత్‌షా మా చిన్న చిన్నాయన. అదే మీ నాయన అని నీవు చెబుతున్నావు. ఆయన నాకన్నా పది సంవత్సరాలు పెద్ద ఉండవచ్చు. చాలా ఆవేశపరుడు. బ్రీటీషు వారి తరువాత దగ్గర్నుంచి మాకు ఆస్తులు అన్నీ పోయాక మాకు మిగిలిన ఆస్తిని ఆ ఆరుగురు అన్నదమ్మలు పంచుకున్నారు. అయినా తాత మాట మీద నిలబడి ఉండేవారు..” అని వాళ్ళ వైపు చూసి వింటున్నారా అన్నట్లుగా…తరువాత కంటిన్యూ చేస్తూ
“బ్రిటీషు వారు వెళ్ళినా గిరిజనులకు షావుకారుల బెడద తప్పలేదు. వారిని అనుక్షణం రక్షించుకునే ప్రయత్నం చేసేవాడు చిన్నాన్న. తన వాటా ఆస్తి అంతా వారి బాగోగుల కోసం వెచ్చించేవాడు. చాలాసార్లు వెళ్ళి షావుకారులతో గొడవలు పెట్టుకు వచ్చేవాడు.
ఒకనాడు ఏ తాండాకు వెళ్ళాడో కాని తరువాత ఆ షావుకారు మరణించాడని, అది చిన్నాన్న చేశాడని తలచి పోలీసులు ఇంటి మీదకు వచ్చారు. పూర్వ రాజని కూడా చూడక మా తాతను బయటకు లాగి పడేసి అవమానించారు. ఆ రాత్రి చిన్నాన్న ఇంటికి వచ్చినప్పుడు అవమానముతో ఉన్న తాత, ఆయన్ని లాగి బయటకు పొమ్మన్నాడు. హంతకులుగా తిరగటం తన మతం కాదని, తనది గాంధీయమని చాలా గొడవ చేశాడు.
చిన్నాన్న బయటకెళ్ళుతుండగా “ఇక నేను పెట్టిన పేరును, వంశం వాడకుండా బ్రతుకు పో!” అన్నాడు.
“మళ్ళీ కనపడకు…” అని కూడా చెప్పాడు.
చిన్నాన్న కట్టు పెట్టాడు. ఆయన చాలా మొండివాడు కదా!
ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
తరువాత ఎంత వెతికినా కనపడలేదు. తర్వాత తాత చాలా బాధపడ్డాడు. కాని చిన్నాన్న దొరకలేదు. తరువాత తాత, నాయనా అందరూ వెళ్ళిపోయారు…
ఇన్నాళ్ళకి నీవు వచ్చావు ఆయన గురించి అడుగుతూ” కన్నీరు తుడుచుకుంటూ ముగించాడు.
ఆయన చెప్పటం ముగించినా వివేక్ కదల్లేదు.
‘తన తండ్రి పట్టుదల, తల్లి పట్టుదల ఎంత గొప్పవి. వారి కట్టు ఎంత గొప్పది. గోండుల చరిత్ర, ప్రజలకోసము వారి త్యాగాలు ఎంత ఘనమైనివి. మనం ఆ సంప్రదాయానికి దూరంగా వారి విలువలను మరిచి పెరిగాం….’
కన్నీరు ఆపలేకపోయాడు వివేక్. వెక్కుతున్నాడు.
రాము వచ్చి వివేక్‌ను భుజం చుట్టూ చుట్టి ఓదార్పుగా తడుతున్నాడు.
నర్సింగు వచ్చి వివేక్ ను దగ్గరకు తీసుకు కౌగిలించుకున్నాడు. “నీవు నాకు తమ్ముడివిరా!” అన్నాడాయన కన్నీరు తుడుచుకుంటూ.
ఇద్దరి మధ్య మౌనం చోటుచేసుకుంది.
తన వెతుకులాట ఇలా ముగిసింది… ఇన్నాళ్ళకు తండ్రి గురించి తెలుసుకోగలిగాడు. ఒక ఓదార్ప, ఒక కంఫ్లీట్‌నెస్. అదే చోట ఒక ఎమ్టీనెస్.
“తమ్ముడా! ఇన్నాళ్ళకు మనము కలవగలిగాము. ఇక నిన్ను వదలను.” అన్నాడాయన సంతోషముగా.
“మీ అమ్మా ఎక్కడుంది? మీరెంత మంది?” అంటూ మాటలలో పడ్డాడు నర్సింగు అన్న.
***
ముగింపు
గోండు వివేక్‌ ఉట్నూరులో స్థిరపడి అప్పుడే పది సంవత్సరాలు గడిచింది.
ఉట్నూరులోనే ఆత్రం వారి పిల్లను పెళ్లి చేసుకున్నాడు వివేక్.
అతని రీసెర్చు ‘గోండు భాష పై ద్రావిడ ప్రభావము’ పూర్తి అయి అప్పటికే ఐదు సంవత్సరాలయ్యింది.
ఉట్నూరులో గిరిజన కాలేజీకి అతను ప్రిన్సిపాల్.
అతని కవితలు, నాటకాలు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. గోండు భాషలో వాచకాలను తయారు చేశాడతను. గిరిజనులకు ఏ సహాయము కావాలన్నా అది తీర్చటమే అతని ప్రవృత్తి.
ప్రతీ ఏడు గిరిజన ఉత్సవము చెయ్యటము, తండ్రి పేరు మీద బహుమతులు ఇవ్వటము ఆచారముగా సాగుతున్నది.
అతని చెల్లి లక్ష్మి ఇంటరు కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉంది.
తల్లి నాగమ్మ ఇంకా అంతే అమాయకంగా ఉంది. ఆమెను గోండుల గురించి అడిగినా, ఆమె భర్తను గురించి అడిగినా ఏమీ చెప్పదు. తెలియదనే చెబుతుంది. పైపెచ్చు “నాకేమి తెలుసు బిడ్డా?” అంటుంది.
రాము, వివేక్‌ను విడవక తోడుగా ఉంటాడు. అవును మరి గిరిజనులు కట్టు పెడితే విడవరు అసలు.
గోండు వివేక్‌ వేషము కూడా పూర్తిగా గోండుల వేషమే. పంచె, దాని మీద తెల్ల చొక్కా, ఉత్తరీయము. తలపై తలపాగా. నుదుటిన తిలకము. అతని తన వంశాచార పచ్చ చేతుల మీద ఉంది.
అతన్ని చూస్తే ఆ ఊరిలోనే కాదు ఆ జిల్లాలోనే గౌరవము.
ఏ పొలిటికల్ పార్టీలో చేరమన్నా చేరడతను. ప్రజల కోసము అందునా
గిరిజనుల కోసమా ఎప్పూడూ నిలబడి ఉంటాడు ఆ అడవిలో సువాసనలు
వెలికే మోదుగపువ్వులా.

***

సమాప్తం

1 thought on “మోదుగపూలు – 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *