April 16, 2024

వెంటాడే కథలు – 15

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

ఓ సర్పంచి గారి కథ!

మధ్యాహ్నం రెండు గంటల వేళ!
ఎండ నెత్తి మాడుస్తోంది..
జోల్టన్ పక్క గ్రామం నుంచి తన స్వగ్రామానికి మోటార్ బైక్ మీద చెమటలు కక్కుకుంటూ వస్తున్నాడు. అతను ఆ రెండు గ్రామాలకి సర్పంచ్. ఇళ్ల పన్నుల బకాయిలకు సంబంధించి ఆ గ్రామంలో అందరికీ చెప్పడానికి వెళ్లి వస్తున్నాడతను. మోటార్ బైక్ స్లోగా ఊళ్లోకి ప్రవేశించింది.
అంతలోనే ఒక సందులో నుంచి ఇద్దరు పిల్లలు హఠాత్తుగా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. బండి స్లో చేశాడు జోల్టన్.
ఒక కుర్రాడు పక్క సందులోకి పరుగు తీసి మళ్లీ ఏమైందో మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి రోడ్డు మీదకు వచ్చాడు. స్లోగా వెళుతున్న జోల్టన్ బైక్ అతనికి ఢీకొనడంతో కింద పడిపోయాడు వాడు.
జోల్టన్ కూడా బండితో సహా పడిపోయాడు. కుర్రాడికి దెబ్బలు తగిలాయి. వాడికంటే జోల్టన్ కు కాస్త పెద్ద దెబ్బలే తగిలాయి. బండి కూడా దెబ్బతింది.
అంతలో పుట్టల్లోంచి వచ్చిన చీమల్లా చుట్టుపక్కల సందుల్లోంచి జనం బిలబిలా అక్కడికి చేరుకున్నారు.
కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
అప్పటికే లేచిన జోల్టన్ తన ఒంటికంటుకున్న మట్టి దులుపుకొని రోడ్డుపై పడిపోయి ఉన్న కుర్రవాడిని లేపి నిలబెట్టడానికి ప్రయత్నించాడు. వాడు నిలబడలేకపోతున్నాడు. పైగా ఏడుస్తున్నాడు..
“పెద్దోళ్ళు కదా అంతే కన్నుమిన్నుకనకుండా ఊళ్ళల్లో బండ్లు నడుపుతారు..” అన్నాడు ఒకడు వ్యంగ్యం ఉట్టిపడేలా జనంలో నుంచి.
“ఆళ్ళు బండ్లు రోడ్లమీద నడపరెహే.. మనుషులు మీద నుంచి నడుపుతారు” అన్నాడొకడు.
“అంతే కాదు రా బాబు. ఇప్పుడు రోడ్డు మీద ఎందుకు నడిచావని ఆ పిల్లోడికి జరిమానా ఏసినా ఏస్తాడు దొర. ఎంతైనా సర్పంచ్ కదా?” ఇంకొకడు అన్నాడు వాడికి మద్దతుగా.
అంతా పెద్దగా నవ్వారు.
“అంతవరకైతే మంచిదే. బండి రిపేరీ ఖర్చులు కూడా ఇమ్మని అడుగుతార్రా నాయనా! లేకపోతే పోలీసుల దగ్గరికి తీసుకుపోతారు.. ఇంకా లేదంటే కోర్టుకు లాక్కెళ్తారు…” ఒక ముసలామె మెటికలు విరుస్తూ అంది.
జోల్టన్ కి ఈ మాటలన్నీ సూదుల్లా గుచ్చుకున్నాయి.. అయినా పెదవి విప్పకుండా గాయపడిన కుర్రవాడ్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి అతనికి సాయం చేయడం లేదు.. జోల్టన్ ఒంటికి తగిలిన దెబ్బలతో అతని చొక్కా, ప్యాంటు తడిసిపోతున్నా ఎవరు కనీసం జాలి పడడం లేదు.. పైగా ములుకుల్లాంటి మాటలు.. చిత్రవధ చేస్తున్నారు!
అంతలోనే గుంపు నుంచి ఒక మహిళ వడివడిగా వచ్చి ఆ పిల్లోడిని ఎత్తుకొని చరచరా తీసుకెళ్లి పోయింది.
తల్లి పిల్లవాడిని తీసుకుపోయాక దెబ్బల గాయాలతోనే జోల్టన్ బండి నిలబెట్టడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యం కావడం లేదు..
అయినా ఊర్లో జనం అతన్ని విమర్శిస్తూ అతని బాధల్ని కళ్లారా చూస్తూ ఉన్నారే తప్పితే ఎవరూ సాయపడడానికి ముందుకు రావడం లేదు.
అంతలోనే పోలీస్ జీప్ వచ్చింది.
జీపులోంచి ఇన్స్పెక్టర్ కాటియాన్ దిగాడు. అతని వెనకే ఇద్దరు కానిస్టేబుళ్లు!
లాఠీ ఊపుకుంటూ జోల్టన్ దగ్గరకి వచ్చాడు ఇన్స్పెక్టర్.
“మీకు కూడా దెబ్బలు బాగానే తగిలినట్టు ఉన్నాయి. అయ్యో. బండి కూడా బాగానే దెబ్బతిన్నట్టుంది. ఇంతకీ ఆ పిల్లోడు చచ్చాడా బతికాడా?” అడిగాడతను సానుభూతి చూపిస్తున్నట్టుగా.
ఆ సానుభూతి వెనక వెటకారం ఉందని జోల్టన్ కి బాగా తెలుసు. ఎందుకంటే జోల్టన్ అంటే ఆ ఇన్స్పెక్టర్ కు అసలు పడదు.
“అయినా ఈ సందుల్లో 30 కంటే స్పీడు వెళ్ళటానికి కూడా వీలుండదు లెండి. కానీ పొరపాటు అయితే జరిగింది కదా” అన్నాడు ఇన్స్పెక్టర్.
“నేను చాలా స్లోగా వస్తున్నాను. రోడ్డు దాటి వెళ్లిన కుర్రాడు మళ్లీ వేగంగా వెనక్కి వచ్చి నా బండికి తగులుతాడని ఊహించలేదు” అన్నాడు జోల్టన్ అపరాధిలా.
“అంతే కావచ్చు! కానీ కుర్రాడికి ఏమైనా అయితే కేసు మెడకు చుట్టుకోక తప్పదు” కాటియాన్ కంఠంలో హెచ్చరికతో కూడిన సూచన.
అంతలోనే గుంపును చీల్చుకుంటూ కుర్రవాడి తల్లి వడివడిగా అక్కడికి వచ్చింది.
“అయ్యా సర్పంచ్ గారు! మీ పుణ్యాన మా పిల్లాడికి రెండు కాళ్లు విరిగిపోయాయి.. ఇప్పుడు ఏమిటి దిక్కు?” అంటూ ఏడుపు లంకించుకుంది.
“అయ్యో అలాగా. వైద్యం నేను చేయిస్తాను.. ఆ ఖర్చు నేను భరిస్తాను” అన్నాడు జోల్టన్ జాలిగా.
“అది సరే మరి కేసు మాటేమిటి?” అన్నాడు ఇన్స్పెక్టర్ ఎగతాళిగా.
“ఏముంది మిమ్మల్ని కూడా కొనేస్తారు. ఊరికి పెద్ద కదా ఏదైనా చేయగలడు” అన్నాడొకడు.
ఆ మాటలన్న అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు జోల్టన్.
ఇన్స్పెక్టర్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ-
“నన్ను కొనడం అతని వల్ల కాదులే” అన్నాడు నిజాయితీపరుడిలా పోజు పెట్టి.
* * *
ఈ సంఘటన విషయం పార్టీ జిల్లా అధ్యక్షుడి దాకా చేరిపోయింది. హుటాహుటిన వచ్చి తనను కలవమని జోల్టన్ కి సమాచారం పంపాడు ఆయన.
ఆదేశం మేరకు ఆయన్ని కలిశాడు జోల్టన్.
అధ్యక్షుడి నుంచి గట్టిగానే చివాట్లు పడ్డాయి అతనికి ఎవరు.
“నీలాంటి వాడుంటే మన పార్టీ ఎట్లా బతికి బట్టకడుతుంది? ఒక చిన్న సంఘటనలో కూడా ఊళ్లో ఒక్కడు కూడా నీ తరఫున మాట్లా డటానికి రాలేదు అంటే నీ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకో! నాకు తెలుసు నువ్వు మంచివాడివే! కానీ ప్రజలు నీ పక్షాన లేరు.. అలాంటప్పుడు నీ ఒక్కడి కోసం నేను పార్టీని బలిపెట్టలేను..”
“జరిగిన దాంట్లో నా తప్పేం లేదు సార్.” వివరించపోయాడు జోల్టన్.
ఆపమన్నట్టు చెయ్యి ఎత్తి సైగ చేశాడు జిల్లా అధ్యక్షుడు.
“జోల్టన్ ఆ సంగతి కూడా నాకు తెలుసు. నీ తప్పు ఏమీ లేదని కూడా తెలుసు. నువ్వు మంచివాడివని కూడా తెలుసు. నిజాయితీ పరుడివనీ తెలుసు. కానీ ప్రజలు నీ పక్షాన లేనప్పుడు నువ్వు ఆ పదవిలో ఉండటానికి అర్హుడివి ఎలా అవుతావు? అది చెప్పు చాలు”
జోల్టన్ కి అర్థమైంది. తను మాట్లాడేందుకు ఇక ఏమీ లేదు.
వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ కాగితం అధ్యక్షుడి చేతిలో పెట్టి మౌనంగా వెనుతిరిగాడు.
గ్రామానికి వచ్చేటప్పుడు తను చేసిన తప్పులు ఏంటో ఆలోచించుకుంటూ వచ్చాడతను.
అవినీతిపరులకు రోడ్ల కాంట్రాక్టులు ఇవ్వలేదు. తప్పుడు తూనికల వ్యాపారులను హెచ్చరించాడు. పంచాయతీలో డబ్బు ఉండి కూడా ఇళ్లపన్ను కట్టని వారి నుంచి బలవంతంగా వసూలు చేశాడు. గ్రామ పారిశుధ్యం కోసం రోడ్లపై చెత్తవేసే వారిని కఠినంగా మందలించాడు.. చిన్నచిన్న జరిమానాలు వేశాడు.. వాళ్లతోనే వీధులు శుభ్రం చేయించాడు. వీధి దీపాలు పగలగొట్టే ఆకతాయిలకి బుద్ధి చెప్పాడు. వాళ్లనే పగిలిపోయిన లైట్ల ఖర్చు భరించమన్నాడు. స్కూల్ టీచర్లని వేళకి బడికి రావాలని హుకుం జారీ చేశాడు. ప్రైవేట్ లు చెప్పవద్దని, సొంత వ్యాపారాలు చేయకూడదని ఆదేశించాడు. మద్యం దుకాణాలు తొలగించాడు. రోడ్లమీద అల్లరి చేసే తాగుబోతుల్ని పోలీసులకు అప్పగించాడు. మద్యం దుకాణాలు తొలగించడం వలన మద్యం వ్యాపారులకు, తాగి అల్లరి చేసిన వారిని పోలీసులు అప్పగించినందున తాగుబోతులకు శత్రువయ్యాడు. తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చే లంచగొండి అధికారుల్ని తొలగించాడు. ప్రజల్ని, అధికారులని బాధ్యతగా నిజాయితీగా ఉండమని పదేపదే ఉపన్యాసాలు ఇచ్చాడు. ప్రజలు అతనికి దూరం కావడానికి ఇవి చాలవూ?!

-:0:-

నా విశ్లేషణ:

నాకు గుర్తున్నంతవరకు ఇది హంగేరీ కథ. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఇది ‘విపుల ‘ లో ప్రచురితమైంది. అద్భుతమైన కథ.. రచయిత ఈ కథను ఎంత గొప్పగా నడిపించాడో అనిపిస్తుంది. యదార్థవాది లోక విరోధి అన్నట్టుగా సాగుతుంది ఈ కథ. నిజాయితీ పరులు, నీతివంతులు ఉన్నతస్థానాల్లో ఉండాలని కోరుకుంటాం కానీ వారి సంస్కరణలను మనమే ఇష్టపడం. వారి నిక్కచ్చితనాల వల్ల మన ప్రయోజనాలు దెబ్బతింటాయని మన ఆవేదన. అందుకనే నిజాయితీపరులు ఎవరూ మన ఎన్నికల్లో గెలవరు. నాలుగున్నర దశాబ్దాల క్రితమే పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటి మాట చెప్పేదేముంది? అందుకనే ప్రజాప్రతినిధులుగా ఎలాంటి వాళ్ళు ఎన్నికవుతున్నారో చూస్తున్నాం. హంగేరీ అయితేనేమీ.. ఇండియా అయితేనేమి? ఎక్కడ కాలుపెట్టినా అవినీతిదే రాజ్యం! పాలకుల అవినీతి తెలిసిందే.. ప్రజలు కూడా అలాగే తయారయ్యారని ఈ కథ చెబుతుంది.. అందుకే ఇది మంచి కథ అయింది.

8 thoughts on “వెంటాడే కథలు – 15

  1. నాకు ఇలాంటి అనుభవాలు ఎదురైనాయి సర్. ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పటికీ గౌరవంగానే చూస్తున్నారు. నిజాయతీకి విలువ వుంది సర్. కాకపోతే ఆ రోజులు గడిచిపోయాక అప్పుడు ఎక్కువ గుర్తొస్తుంటాయనుకుంటా. అంతే.

    1. ఈ కథ రాస్తున్నప్పుడు మీరే గుర్తొచ్చారు.. నిజాయితీకి విలువ ఉన్నది కరెక్టే కానీ వాళ్లు మిమ్మల్ని రెండోసారి గెలిపించుకోలేకపోయారు.. మీరు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించడమే దానికి కారణం అనుకుంటున్నాను

  2. శ్రీహరి లాగే అవినీతి కూడా
    ఇందుగల దందు లేదని చందంగా విస్తరిస్తూ ఉన్నది మీరు చక్కగా అభిప్రాయం వెలుబుచ్చినందుకు ధన్యవాదాలు మేడం

  3. నిజాయితీగా ఉంటే అంతే నండీ. మన దేశంలో లోనే ఇలాంటి పరిస్థితి అనే అపోహ ఉండేది నాకు. కానీ ఇతర దేశాల్లో కూడా ఇలా ఉండటం ఎక్కడైనా నిజాయితీకి గౌరవం లేదు అని అర్ధమైంది

  4. మంచి కథ. నిజాయితీ గా ఉంటే ఫలితం ఇలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు కథకుడు.ఎక్కడైనా జరుగుతున్నది ఇదే.. ఐనా విధి నిర్వహణ లో చిత్తశుద్ధి ప్రదర్శించే వారు ఏటికి ఎదు రీదుతూనే ఉంటారు.. వారి వల్లే సంఘం లో అభివృద్ధి, శాంతి కొనసాగుతూంటాయ్

    1. మీరన్నట్టు నిజాయితీకి ప్రతిఫలంగా అవమానాలు దక్కుతున్న ప్ప టికీ చాలామంది మహానుభావులు విలువల కోసం పోరాడారు.. కథపై మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *