March 19, 2024

ఆ కీర్తనల శృంగారం అతి గుంభనం – శోభారాజ్

విరించినై విరచించితిని

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

అన్నమాచార్య కీర్తన అంటే ఎవరైనా స్ఫురణకు వచ్చే అతికొద్దిమందిలో శోభారాజ్ ఒకరు. అలాగే శోభారాజ్ పేరు వినగానే అన్నమాచార్యుని కీర్తన మృదుమధురంగా వినపడుతున్నట్లే వుంది. ఆవిడ నిర్వహిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ని చూస్తేనే మనలో ఒక విధమైన భక్తిభావన కలుగుతుంది.

ఆవిడతో కొన్ని ముచ్చట్లు:

అన్నమాచార్య కీర్తనలపైన మీకు ఆసక్తి ఎలా కలిగింది?

చిన్నప్పటినుంచే నాలో భక్తిభావన ఉండేది. శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాదం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల అనుకుంటా, నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు ఆ కీర్తనల మీద ఆసక్తి కలిగింది.

మీరు ఏ వయసు నుండి పాడుతున్నారు? మీకు స్ఫూర్తి ఎవరు?

నాకు నాలుగు సంవత్సరాల వయసులో కృష్ణుడు ఎర్రగా వుంటాడు అనుకునేదాన్నట.ఆ భావనతోనే నేపాల్ భాషలో ఆశువుగా కృష్ణుని మీద పాడానుట. అప్పుడు నాన్నగారు నేపాల్‌లో వుండేవారు. అంత చిన్న వయసులో నాకు రాని భాషలో ఆశువుగా పాడటం చూసి అంతా ఆశ్చర్యపోయారట. అప్పటినుంచీ ఆశువుగా చాలా పాటలు పాడాను. ఊహ తెలిసినప్పటినుంచి మాత్రం నాకు తట్టిన భావాన్ని రాయటం మొదలుపెట్టాను. మా నాన్న నారాయణరాజుగారు రోజూ మా చేత భగవద్గీత చదివించేవారు. మా అమ్మ రాజ్యలక్ష్మిగారిది మంచి గాత్రం. “విన్నపాలు వినవలె”,”అలరులు కురియగ” ఆమె పాడుతుంటే ఎంతో మధురంగా ఉంటుంది. వారే నాకు స్ఫూర్తి. మా ఇంట్లో అందరం పాడగలం. కానీ బయట కచ్చేరీలిచ్చేది మాత్రం నేనూ, మా పెద్దక్కయ్య సుమిత్రా గుహ. ఆమె ప్రముఖ హిందుస్తానీ గాయని.

మీరు సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు.
నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. నా మొదటి గురువు మాత్రం మా అమ్మ శ్రీమతి రాజ్యలక్ష్మిగారే.

అన్నమాచార్యుని కీర్తనల ప్రచారం మీతోనే మొదలయింది కదా. ఆ విశేషాలు, వివరాలు చెప్పండి.
నేను తిరుపతిలో కాలేజీలో చదివేటప్పుడు అన్ని ఏక్టివిటీస్‌లో ముందు ఉండేదాన్ని. ఒకసారి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావుగారి కచేరీకి వెళ్లాను. అప్పటికే నా పాట విని ఉన్న మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ పసుపతిగారు నన్ను శ్రీ రాజేశ్వర రావుగారికి పరిచయం చేసి, వారి కచేరీ అయ్యాక నా చేత రెండు కీర్తనలు పాడించారు. శ్రీ రాజేశ్వరరావు గారు చాలా ఇంప్రెస్ అయి, 1972లో కొలంబియా కంపెనీలో అన్నమాచార్య కీర్తనలది సింగిల్ ప్లే రికార్డ్ ఇప్పించారు. ఆ రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అన్నారావుగారినుండి అన్నమాచార్య కీర్తనల ప్రాజెక్ట్ చెయ్యటానికి ఆహ్వానం వచ్చింది. మొదట నడిచి కొండ ఎక్కి శ్రీ వేంకటేశ్వరుడికే రిపోర్ట్ చేసాను. దేవళానికి వెనుకవైపునే ఉన్న అన్నమాచార్యగారి సంతతి ఎదుట రెండు కీర్తనలు పాడి, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారికి రిపోర్ట్ చేసాను. 1978 నుండి 82 దాకా అన్నమాచార్య కీర్తనల మీద వర్క్ చేశాను.

‘అన్నమాచార్య భావనా వాహిని’ని ఎప్పుడు స్థాపించారు? మీరు ఈ సంస్థని ఏ ఉద్ధేశంతో స్థాపించారు? ఈ సంస్థ కార్యకలాపాలేమిటి?

1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ ని స్థాపించాము. అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే దీన్ని స్థాపించాము. మా సంస్థలో ఔత్సాహికులైన కళాకారులకు సంవత్సరానికి నలభైమందికి అన్నమాచార్య కీర్తనలను నేర్పిస్తాము. సంవత్సరం తరువాత పరీక్ష పెట్టి సర్టిఫికెట్స్ ఇస్తాము. బాగా పాడగలవారిని ప్రోత్సహించి కచ్చేరీలకు కూడా తీసుకువెళతాము. అన్నమాచార్యుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరిపిస్తాము. జాతీయ పరిధిలో అన్నమాచార్యుని కీర్తనలమీద పోటీ నిర్వహించి, ప్రతిభను ప్రోత్సహిస్తున్నాము. పోటీలో పాల్గొనే ప్రతి పోటీదారుకు కనీసం పది అన్నమాచార్య కీర్తనలు వచ్చి ఉండాలి. పోటీలో ఒకటి వాళ్లకి నచ్చింది, ఒకటి జడ్జిగారు అడిగింది పాడాలి. ఫస్ట్ ప్రైజ్‌గా ప్యూర్ గోల్డ్‌మెడల్ ఇస్తాము. సెకండ్ ప్రైజ్ తంబుర, థర్డ్ ప్రైజ్ శ్రుతి బాక్స్ ఇస్తాము.

బహుమతిగా సంగీతానికి సంబంధించినవే ఇవ్వడం విశేషమే. అన్నమాచార్యుల కీర్తనల మీద వాద ప్రతివాదాలున్నాయి కదా. మీకు తెలిసిన నిజాలు చెప్తారా?
నాకు తెలిసినంతవరకు అన్నమాచర్యులవారివి ముప్ఫై రెండు వేల కీర్తనలు. అన్నమాచార్యులవారి మనవడు తాళ్ళపాక పెద తిరుమలాచార్య ఈ కీర్తనలన్నీ రాగిరేకులమీద చెక్కించారు. వీటన్నింటినీ తిరుమలలో సంగీత భాండగారంలో ఇప్పటికీ పదిల పరిచారు. ప్రతి శాసనం మీద అన్నమాచార్యుడు ఆనతి ఇచ్చిన సంకీర్తన అని ఉంటుంది. ఒకటి రెండు కీర్తనల్లో భావప్రకటనలో స్వాతిశయం కనిపించింది.
కనుక ఆ కీర్తనలు అన్నమయ్యవి కావు అంటారు. కానీ ఏది నిజం కాదండి. అన్నమాచార్యుడు దైవాంశ సంభూతుడయినప్పటికీ ఆయనలోనూ మానవ సహజమైన భావావేశాలు ఉన్నాయి.

విదేశాలు వెళ్లారు కదా! అక్కడివాళ్లు ఎలా స్పందించారు?
విదేశాల్లో కచేరీలు చేసేటప్పుడు ఆడియన్స్ కొంతమంది ‘వేంకటేశ్వర గీతమాలిక’ లోని కొన్ని కీర్తనలు పాడమని కోరారు. నాకంటె ముందే నా కాసెట్ అమెరికాలో ప్రాచుర్యం పొందినందుకు ఆనందమనిపించింది.

అన్నమయ్య కీర్తనల్లో శృంగారం ఎక్కువపాళ్లు ఉన్నదనే వాదనని మీరు సమర్ధిస్తున్నారా?
లేదు. అన్నమయ్య కీర్తనల్లో శృంగారం ఉన్నమాట నిజమే. ఈ శృంగారం అతిగా ఉండదు. గుంభనగా ఉంటుంది. ఇందులో భగవంతుడు నాయకుడు. భక్తుడు నాయిక. వీరిమధ్య సాగే ప్రణయభావాలు దివ్యశృంగారమే కాని భౌతిక శృంగారం కాదు. అనితర సాధ్యమైన భావన, జీవాత్మ పరమాత్మల సంగమం. దీన్ని అర్థం చేసుకోవటానికి ఆధ్యాత్మిక సంస్కారం కావాలి. భగవంతుడే సర్వస్వం అనుకోవటం వల్ల అన్నమయ్య తనలో కలిగిన ప్రతి భావాన్ని అంత అందంగా మలచగలిగాడు.

మీకు చాలా అవార్డులు వచ్చాయి కదా:
అన్నిటికంటే ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రతిస్పందనే నాకు ఎంతో పెద్ద పురస్కారం.

మీరు కథలు కూడా రాస్తారు కదూ!
ఏదీ! టైం ఉండదండి. ‘ఆంధ్రప్రభ ‘, ‘జూల’, ‘కథానిక’, ‘స్వాతి’ లో జాతిపిత జ్ఞాపకం ప్రచురితమయ్యాయి.

మీ జీవితాశయం ఏమిటి?
అన్నమయ్య కీర్తనలు ప్రచారంలోకి తీసుకురావటమే నా ఆశయం. అన్నమయ్య మీద టీ.వీ.కి ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రపంచవ్యప్తంగా శ్రీ అన్నమాచార్యుని భావనా వాహిని విశిష్టత వ్యాపించింది. నాకు ఆ తృప్తి చాలు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *