April 28, 2024

తనివి తీరింది

రచన: యశస్వి జవ్వాది

డాక్టర్ విశ్వం మనసు అలజడిగా ఉంది. తన మనసు లోతుల్లో తాను బ్రతుకుతున్న వ్యవస్థను మోసం చేస్తున్నాననే భావన వలన చాలా భారంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే అతని మొహం మీద ఒత్తిడి ఛాయలు పేరుకున్నాయి. ఎవరి మొహం చూడకుండా నేరుగా తన క్యాబిన్ వైపు వేగంగా వెళ్ళాడు. టేబుల్ మీదనున్న పేషెంట్ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చూసాడు.
ఈలోగా, “అయ్యా!! లోపలకు రావచ్చా?” అంటూ సగం తెరచిన తలుపు సందునుండి అడిగాడు రాములయ్య.
అతన్ని చూసిన విశ్వం కంగారు తొక్కిపెట్టి మొహాన నవ్వు పులుముకుని , “రా!! రా!! రాములయ్యా..! నీకోసమే చూస్తున్నాను” అని ఫైల్ పక్కన పెట్టాడు.
రాములయ్య లోపలకు వస్తూ, “సీతాలుకి ఆపరేషన్ చేస్తారు కదయ్యా…” అని ఆర్థిస్తున్నట్టుగా అడిగాడు.
విశ్వం, “ఈ రోజే ఆపరేషన్. నువ్వెళ్ళి సీతాలుకి చెప్పు, అంతా మంచిగానే జరుగుతుంది” అన్నాడు.
రాములయ్యకి విశ్వం మాటల మీద అపారనమ్మకం ఉంది. తనకు ఈ లోకంలో సహాయం చేసే వ్యక్తి విశ్వం ఒక్కడేనని నమ్మాడు.
రాములయ్య వెళ్ళగానే విశ్వం ఫోన్ తీసుకుని భరణికి కాల్ చేసి, “హా.. భరణీ!! అన్నీ ఓకే కదా., నాకు సీతాలు ఫేక్ డయగ్నోక్ రిపోర్ట్ అందాయి. వాటిని స్కాన్ చేసి పంపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటకు పొక్కకూడదు” అని చెప్పాడు.
మొదటిసారి విశ్వం మాటల్లో తప్పు చేస్తున్న భయం కనిపెట్టిన భరణి, ”సర్!! ఇవన్నీ నాకు చిటికెలో చేసే పనులు. మీరు హైరానా పడొద్దు. నేను చూసుకుంటాను” అన్నాడు.
భరణి మాటల్లో ఉన్న అతినమ్మకం కూడా విశ్వాన్ని ఆలోచనల్లో పడేసాయి. సమాధానం చెప్పకుండా అలానే ఉన్నాడు.
అటునుండి భరణి, “అంతేనా సర్!! ఇంకేమైనా చెప్పాలా?” అనడిగాడు.
విశ్వం వాస్తవానికొచ్చి, ”అంతే భరణీ!!” అని ఫోన్ పెట్టేసాడు.
కొన్ని నిమిషాలు అనంతరం రిపోర్ట్స్ స్కాన్ చేసి భరణికి పంపాడు.
***
సీతాలు దగ్గర కూర్చున్న రాములయ్య, విశ్వం చెప్పిన విషయం చెప్పాడు.
సీతాలు గుండెలు నిండిన గుబులుతో, “ఏందయ్యా? ఆ డాక్టరుగారు నా పొట్ట కోస్తారా?” అని వణుకుతూ అడిగింది.
రాములయ్య, “ఆ కోతలు భరిస్తేనే కదా, మనకో కొత్త జీవితం వస్తుంది….” అని సీతాలు వంక బరువైన కళ్ళతో చూసాడు.
సీతాలు, భర్త చెప్పిన సుదీర్ఘ ఫలితం గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనంలోనే తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్నం చేసింది. రాములయ్య ఆపరేషన్ ఎప్పుడవుతుందా, తన ఇల్లాలు ఎప్పుడు ఇంటికి
వస్తుందనే ఆలోచనలో ఉన్నాడు.
***
ఆ రిపోర్ట్స్ తీసుకుని విశ్వం నేరుగా అకౌంటింగ్ సెక్షన్ రాజారాం వద్దకు వెళ్ళాడు. రిపోర్ట్స్ ఇస్తూ, “క్లెయిమ్ కోసం అకౌంటింగ్ సెక్షన్ నుండి ఇంకొన్ని డాక్యుమెంట్స్ కావాలి” అని చూపు పక్కకు తిప్పుకుని అడిగాడు.
రాజారాం, “ఏంటి సర్!! ఈరోజు మీరు నా స్థానంలో నేను మీ స్థానంలో ఉన్నట్టున్నాము. మొహం కూడా చూపించలేకపోతున్నారు” అని వెటకారంగా నవ్వి, “సాయంత్రంలోపు డాక్యుమెంట్లన్నీ రెడీ చేస్తాను” అన్నాడు.
విశ్వానికి తలకొట్టేసినట్టైంది. మరోమాట మాట్లాడకుండా అక్కడనుండి వెళ్లిపోయాడు.
రాజారాం వెళ్తున్న విశ్వాన్ని చూసి, “వీడికి అవసరమైతే తప్పు కూడా ఒప్పవుతుంది. అదే నేను చేస్తే మాత్రం తప్పు తప్పే అవుతుంది” ఈసడింపుగా అంటూ పనిలో మునిగాడు.
***
క్యాబిన్‌లో కూర్చున్న విశ్వం ఫోనులో భార్య జానకి ఫోటో చూస్తూ ఆర్ద్రమైన గొంతుతో, “నన్ను క్షమించు జానకీ…..” అనుకున్నాడు.
ఇంతలో నోటిఫికేషన్ బార్‌లో భరణి నుండి, ‘ఫస్ట్ స్టెప్ డన్!!’ అని సందేశం వచ్చింది.
మనసులో ‘హమ్మయ్య!!’ అనుకుని, ‘గుడ్!!’ అని ప్రతి సమాధానం పంపాడు.
ఆరోజు తనకు అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల క్యాబిన్ లోనే అనేక ఆలోచనల మధ్య గడుపుతూ కాలాన్ని కరగతీసాడు విశ్వం.
కొద్ది సమయానికి అతని స్నేహితుడు రఘు క్యాబిన్ లోకి వచ్చి, “హాయ్ విశ్వం!! సారీ రా, జానకీ విషయం తెలిసినప్పుడు నేను ఊరిలో లేను” అంటూ కుర్చీలో కూర్చుంటూ విశ్వం మొహంలో ఏదో తెలియని సందిగ్ధత గమనించాడు.
విశ్వం, “అంతా సడన్‌గా జరిగిపోయింది. మేజర్ యాక్సిడెంట్. బ్లడ్ చాలా పోయింది. ఇంటర్నల్ ఆర్గాన్స్ హెవీగా డ్యామేజ్ అయ్యాయి. నాకు తెలుసు హోప్స్ లేవని. చివరి క్షణాల్లో ఆమె పక్కనే కూర్చున్నాను. కళ్ళు తెరచి ఒక్కసారైనా నా వంక చూస్తుందేమోనని. నాకా అదృష్టం కూడా లేకుండా చేసాడా దేవుడు” అంటూ జరిగిన విషయం క్లుప్తంగా చెప్పి, అంతలో రఘుని పిలిచిన విషయం గుర్తొచ్చి, “అసలు విషయమేమిటంటే ఈరోజు ఓ సర్జరీ చేయాలి. నేను చేసే స్థితిలో లేనని నీకీపాటికే అర్థమయ్యుంటుంది. దీన్ని నువ్వే చేయాలి” అంటూ సీతాలు ఫైల్ రఘు చేతిలో పెట్టాడు.
ఫైల్ అందుకుని వివరాలు చదువుతూ ఆశ్చర్యంగా తలెత్తి విశ్వం వంక చూసి, “ఇదేంటి…!?” అన్నాడు.
విశ్వం, “అన్ని విషయాలు తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి ఈరోజు గడవనివ్వు…..” అని నిస్సత్తువగా చూసాడు.
రఘుకి ఒక్కింత భయమేసినా విశ్వం కోసం ఒప్పుకుని, “సరే రా!! నేను మిగతా ఏర్పాట్లు చేస్తాను…..” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
వెళ్తున్న రఘు మనసులో, ‘ఎందుకింత రిస్క్ చేస్తున్నాడు. నాకర్థం కావడం లేదు. అదీకాక హాస్పిటల్లో తనకున్న పేరు కూడా చెడిపోతుంది. ఇన్నాళ్లు తాను దేనికి వ్యతిరేకంగా మాట్లాడాడో ఇప్పుడు తాను కూడా అదే దారిలో వెళ్తున్నాడు’ అనుకున్నాడు.
***
సమయం సాయంత్రమైంది. సీతాలుని ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకొచ్చారు. వెనుకనే రాములయ్య కూడా వెళ్లి,
బయట కూర్చున్నాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న రఘు ఫైల్ చేతిలోకి తీసుకుని పేషంట్ వివరాలు నిర్ధారణ చేసుకుని ఆపరేషన్
మొదలెట్టాడు. రఘు ఎటువంటి ఆలోచనలకు తావు లేకుండా మనసుని ప్రశాంతత పరచుకుని ఆపరేషన్ కొనసాగించాడు. కొన్ని గంటల పాటు కొనసాగిన సర్జరీ, పూర్తయిన తర్వాత రఘు ఆపరేషన్ థియేటర్ నుండి నేరుగా విశ్వం వద్దకు వెళ్ళాడు. బయటున్న రాములయ్య ఆపరేషన్ థియేటర్ నుండి విశ్వం వస్తాడేమోననుకుంటే రఘు రావడంతో కొంచెం గాబరా పడ్డాడు. మరికొన్ని క్షణాలకు బయటకొచ్చిన నర్స్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని చెప్పడంతో మనసులో విశ్వానికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుని, ఆ తర్వాత దేవుడికి చెప్పుకున్నాడు.
***
విశ్వం క్యాబిన్‌కి వెళ్లిన రఘు మౌనంగా అతని ముందు కూర్చున్నాడు. ఎంతకీ విశ్వం నోరు విప్పకపోవడంతో రఘు, “జానకీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది” అని చెప్పి విశ్వం సమాధానం కోసం చూసాడు.
విశ్వం ప్రతిగా కృతజ్ఞతా భావంతో చూసాడు. కొన్ని క్షణాలు వారి మధ్య మౌనమే రాజ్యమేలింది.
రఘు చేసేది లేక అక్కడనుండి వెళ్లిపోవడానికి పైకి లేవబోతుంటే, “థాంక్స్ రఘూ!! ఇంతకంటే ఏం చెప్పగలను. యస్..! నేను తప్పు చేశాను. చనిపోయిన భార్య జానకీ స్థానంలో సీతాలుకి ఆపరేషన్ చేయించాను. నాకు మరొక మార్గం తోచలేదు. ఆమె ఆపరేషన్ కోసం ఇరవై లక్షలు కావాలి. ఆమె భర్త మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్. వాళ్ళకంత స్థోమత లేదు. కానీ భార్య అంటే ఎనలేని ప్రేమ, అనురాగం ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం పదికాలాల పాటు నిలిపే ప్రయత్నంలో నేను చేసిన పని తప్పుగా అనిపించలేదు. కానీ నా వృత్తిని, నేను జీవిస్తున్న ఈ సమాజాన్ని నేను కూడా అందరిలా స్వార్థం కోసం వాడుకుంటున్నాననే భావం మాత్రం నన్ను నిలువునా క్షణక్షణం దహించి వేసింది. తప్పు చేయడంలో ఉన్న భయం కంటే మంచి చేయడంలో ఉన్న కష్టమే ఎక్కువని తెలిసింది. ఇదే హాస్పిటల్లో ఫేక్ క్లెయిమ్స్ పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళున్నారు. వారి లక్ష్యం డబ్బు సంపాదించడం మాత్రమే. వాళ్ళు చేసిన పనే నేనూ చేసాను. వాళ్ళ ముందు నేనూ వాళ్ళ కోవకు చెందినవాడిలానే నిలబడ్డాను. చూసావా., యాదృచ్చికంగా సీతాలు, జానకీ పేర్లు కూడా కలిసాయి. ఈ రాముడికి ఆ జానకీతో గడిపే అవకాశం ఆ దేవుడు ఇవ్వలేదు గానీ, ఆ రాములయ్యకి తన సీతాలుతో గడిపే అవకాశం మాత్రం నేను పోగొట్టను. ఇంకో విషయం ఆ ఇరవై లక్షలు నా దగ్గరే ఉంటే మోసం చేస్తున్నాననే భావం లేకుండా చేసేవాడ్ని. క్లెయిమ్ మనీ నేరుగా హాస్పిటల్ అకౌంట్‌లో పడతాయి” అని తన మౌనం వెనుకనున్న అసలు విషయం చెప్పాడు.
రఘుకి విశ్వం చేసిన పని వెనుకున్న ప్రమాదం కంటే దాని వల్ల జరిగిన మంచే ఎక్కువని అర్థమై, “విశ్వం!! ప్రౌడ్ ఆఫ్ యూ రా..!! మెడికల్ ఇన్సూరెన్స్ అడ్డదారిలో వాడుకుని వాళ్ళున్న ఈ రోజుల్లో దాన్ని ఓ మంచి పని కోసం యూజ్ చేసావు. జానకీ చాలా హ్యాపీగా ఫీలవుతుంది” అంటూ స్నేహితుని దగ్గర సెలవు తీసుకుని బయటకి నడుస్తూ ఓ మంచిపనిలో తాను కూడా భాగమైనందుకు సంతృప్త భావంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
విశ్వం క్యాబిన్ చేరి, అనుకున్న పని సక్రమంగా అమలు జరిగినందుకు సంతోషంగా నిట్టూర్చాడు.
***
విశ్వం అకౌంట్ సెక్షన్ వద్దకు వెళ్లి రాజారాం నుండి డాక్యుమెంట్లు తీసుకుని, “థాంక్స్ రాజారాం.. నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను….” అని వాటిని కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ భరణికి స్కాన్ చేసి మెయిల్ చేసాడు.
రాజారాం, విశ్వం నుండి అటువంటి సమాధానం ఊహించక ఆశ్చర్యపోయాడు.
విశ్వం ఇంటికి అడుగులు వేస్తూ, ‛నా జానకీ కోసం చేసిన హెల్త్ ఇన్సూరెన్స్, ఆ రాములయ్య సీతకోసం వాడాను.
వ్యవస్థను మోసం చేసానన్న భావన కంటే ఆ రాముడు ఆనందంగా ఉన్నాడనే భావన నాకు సంతృప్తిగా ఉంది’ అనుకున్నాడు.

★★★శుభం★★★

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *