May 9, 2024

బాలమాలిక – ‘నెపాలెందుకు?’

రచన: విశాలి పేరి

సుధన్వ స్కూల్ నుంచి వచ్చి స్కూల్ బాగ్ విసిరేసి రాఘవయ్యగారి గదిలోకి వెళ్ళి “తాతయ్యా! నాకు రన్నింగ్ లో సెకండ్ వచ్చింది” అని చెప్పాడు.
“కంగ్రాట్స్ నాన్నా!” అన్నాడు రాఘవయ్య.
“నాకు పార్టీ కావాలి మరి!” అడిగాడు సుధన్వ.
“ఓ తప్పకుండా, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రా”
సుధన్వ వంటింట్లోకి వెళ్ళి తల్లి, నాన్నమ్మ కి తను ఎలా గెలిచింది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు.
“అమ్మా ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా, నేనే ఫస్ట్ వచ్చేస్తాననుకొన్నా, లాస్ట్ వరకు నేను మౌక్తిక్ ఒకే స్పీడ్ లో పరుగెత్తాము, లాస్ట్ రెండు స్టెప్స్ లో తను నా కన్న స్పీడ్ అయ్యిపోయాడు. ఈ పాత షూ మూలంగా నాకు ఫస్ట్ రాలేదు… నాకు కొత్త షూ కావాలి!” అని మొదలెట్టాడు. అన్నీ వింటున్న రాఘవయ్య గారు నవ్వుకున్నారు. రాత్రి తండ్రి రాగానే మళ్ళీ అదే కథ!
“ఈ పాత షూ కరక్ట్ టైం కి స్పీడుగా పరుగెత్తనివ్వలేదు నన్ను… నాకు కొత్త షూ కావాలి నాన్నా…” అంటూ భోజనం దగ్గర చెప్పాడు. అది విని సరేనని తల ఊపాడు తండ్రి మధు.
ఆ తల ఊపడం సమ్మతం కాదని మళ్ళీ మళ్ళీ షూ అడిగాడు సుధన్వ.
“నాన్నా! నావి పాత షూ కాబట్టి నాకు ఫస్ట్ రాలేదు. రేపే నాకు కొత్త షూ కొనాలి…” అంటూ మారాము చేయడం మొదలెట్టాడు.
వచ్చే వీకెండ్ కొనిస్తానని మధు ప్రామిస్ చేశాకే మారాము ఆపాడు సుధన్వ.
***
రాత్రి భోజనాలు అయ్యాక తాతగారి దగ్గరకు వచ్చి సుధన్వ పడుకుంటూ, “తాతయ్యా, ఏదైనా కథ చెప్పవా?” అని అడిగాడు.
“ఈ రోజు నీకు ఒక కథ చెప్తాను విను…
పూర్వం కశ్యప ప్రజాపతికి అరవై మంది భార్యలు కలరు. అందులో వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకసారి వినత, కద్రువ కశ్యప్రజాపతికి చాలా సేవ ఛేశారు. అందుకు ఆయన సంతోషించి ఏదైనా వరము కోరుకోమన్నాడు. అందుకు కద్రువ “చాలా బలమైనవారు, పొడుగ్గా ఉన్నవారు, అతి ఉత్సాహవంతులు అయిన వెయ్యి మంది సంతానం కావాలి” అని కోరుకుంది. వినత మాత్రం అతి బలవంతులు, బుద్ధిమంతులు, యశస్సు కల ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంది.
కొన్ని రోజులయ్యాక కద్రువకి వెయ్యి పాములు పుట్టాయి. వినత తన కన్నా ముందుగా కద్రువకి పిల్లలు పుట్టడం చూసి కాస్త బెంగపడి, తన దగ్గర ఉన్న రెండు గుడ్లలో ఒక గుడ్డు కాస్త చిదిమి చూసింది. అందులో శరీరము ఇంకా పూర్తిగా ఏర్పడని ఒక చిన్న ఆకారం కనిపించింది. అతడు బయటకు వస్తూనే, “అమ్మా! పిన్ని మీద అసూయతో నాకు ఇంకా పూర్తిగా శరీరము ఏర్పడకుండా గుడ్డు చిదిమేశావు కదా… ఆ పిన్ని కే దాసివైపోతావు చూసుకో!” అని కోపంగా అన్నాడు.
తను చేసిన తప్పుకు చాలా బాధపడిన వినత తప్పును క్షమించమని కోరుకుంది. తల్లిని చూసి ఎంత కోపం వచ్చినా తనలా తల్లిని శపించి ఉండకూడదని భావించి, అలా చేసినందుకు చాలా సిగ్గు పడి, “అమ్మా! ఆ రెండో గుడ్డును చాలా జాగ్రత్తగా చూసుకో… ఆ గుడ్డు నుండి వచ్చేవాడే నీ దాస్యాన్ని విముక్తి చేసేవాడు…” అని చెప్పి తపస్సు చేసుకొనడానికి వెళ్ళిపోయాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యుడు అతనిని తన రథసారథిగా చేసుకున్నాడు.
ఊరువులు( తొడలు) లేకుండా పుట్టాడు కాబట్టి అతని పేరు అనూరుడు. అతనినే అరుణుడు అని కూడా అంటారు. ప్రభువుకి సమానముగా ఎప్పుడు సేవకుడు కూర్చోడు, కానీ అనూరుడు సూర్యుడికి సమానముగా కూర్చొని రథము నడుపుతాడు.
“ఇప్పుడు చెప్పు సుధన్వా! ఆ కాళ్ళు లేని వాడు ఎంతో ఘోరమైన తపస్సు చేసి పట్టుదలతో సూర్యుడికే రథ సారధి అయ్యాడు, చెప్పులు సరిగ్గా లేవని నువ్వు ఫస్ట్ రాలేదన్నావు… అది నిన్ను నువ్వు సమర్థించుకోవడమే కదా? ” అని సూటిగా అడిగారు రాఘవయ్య గారు.
కాసేపు అలా ఫాన్ కేసి చూసి సుధన్వ…. “అవును తాతయ్యా… ఇంకా ప్రాక్టీస్ చేయాలి నేను షూ బాలేదు అని నా తప్పు వాటి మీదకు తోసేసా… సారీ…” అని అన్నాడు.
***
పిల్లలూ, మీరు కూడా చదువుకు సంబంధించి, ఆటలకు సంబంధించి ‘అవి లేవు, ఇవి లేవు… కాబట్టి మేము సాధించలేకపోతున్నాము’ అని చెప్పకుండా మీలో పట్టుదల ఉందో లేదో చూసుకోండి. అవిరామంగా మీ లక్ష్యాలకు కృషి చేయండి… ఇక విజయం మీదే మరి! సరేనా?
***
(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *