April 28, 2024

తులసి

రచన: శ్యామదాసి

జీవితం ఒక పాఠశాల అయితే, ప్రతి క్షణం కొత్త పాఠాన్ని నేర్వవలసిన జీవుల జీవననాటకాల్ని కాలం కలంగా మారి చిత్ర విచిత్రంగా రచిస్తుంది. అటువంటి ఒక సాగిపోతున్న రచనే ప్రస్తుత ఈ తులసి.
పాతికేళ్ళ క్రితం మా అమ్మాయి పెండ్లిలో, పెండ్లి కొడుకు పెద్దమ్మ కోడలని, దగ్గర బంధువుగా పరిచయ మయింది తులసి. అప్పటికే తనకు ఐదారేళ్ళ పాప. అత్తగారిది టౌనుకు దగ్గరలో ఒక పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం.
పల్లెటూరి అమాయకత్వంతో కూడి నునుపైన పచ్చని పసిమి మేని ఛాయతో మళ్ళీ మళ్ళీ చూడాలని పించేట్లుగ పొందికగా అనిపించింది తులసి. ఆమె భర్త మాత్రం తుమ్మ మొద్దులా మొరటుగా వున్నాడు. పల్లెల్లో సహజంగా ఇంటిపని, తోటపని, కట్టెల పొయ్యిల పై వంటలు సామాన్య కుటింబీకులకు సర్వసాధారణమే అయినా, అన్ని హుషారుగా చక్కబెట్టగల చురుకుదనం కూడ ఆ అమ్మాయికి వుందని విన్నాను.
ఇన్నేళ్ళలో బంధువుల ప్రసక్తి వచ్చినప్పుడల్లా మా మధ్య తులసి విషయం కూడా వస్తుండేది. ఏవో సందర్భాల్లో తప్ప, తనని నేను కలిసింది తక్కువే కాని, ఒడిదుడుకులతో కూడి మలుపులు తిరిగి సాగుతున్న ఆమె జీవిత కధనంలో, తన ప్రత్యకమైన వ్యక్తిత్వంతో తరచు గుర్తు చేసుకున్నట్లుగా అయ్యింది. ఒకే టౌనులో ఉండటం వలన మా అమ్మాయి వాళ్ళు తరచు మా యింటికి వచ్చేవాళ్ళు మేమూ వెళ్ళేవాళ్ళము. ఒక సారి అలా మా అమ్మాయి వాళ్ళింటికెళ్ళిన్నప్పుడు తులసి రావడం తటస్టించింది. పలకరింపులు అయిన తరువాత పాప 10th క్లాస్ అనీ అందుకొరకు టౌను కాపురం పెట్టామని చెప్పింది. అత్తగారు, భర్త తను పాప ఇదీ వాళ్ళ కుటుంబం. ఒక ఆడపడుచు ఆమెకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు, కాసేపు అవి, ఇవి మాట్లాడుకుని వెళ్ళిపోయిందితను.
చూస్తుండగానే రెండు మూడేళ్ళ కాలం అలా జరిగిపోయింది. ఈ మద్య కాలంలో నేను తులసిని చూడ లేదు కానీ ఆమె విషయాలు ఎదోక రకంగా వినబడుతుండేవి. ఇంటి బాడుగ కట్టలేక అవస్థ పడుతున్నారని, భర్త వ్యవసాయం పనులు మానేసి టౌను నుండి కదలకుండ, చాలానే అప్పులు చేసి పొలాన్నీ తాకట్టు పెట్టి ఆ డబ్బుతో అవసరాలు తీర్చుకుంటుంటే, కూర్చుని తింటే కొండలయినా కరిగి పోతాయన్నట్లు ఆ ముచ్చట కూడ పూర్తయింది. తులసి భర్తను మా అల్లుడుగారు వాళ్ళకు తెలిసిన వారి దగ్గర కోళ్ళఫారం యజమాయిషీకి చేర్పించాడని చెప్పారు. అత్తగారు కొన్నాళ్ళుండి వస్తానని కూతురింటికి వెళ్ళారట.
కాలేజీలో చేరిన కూతురుతో తులసి ఒక్కర్తే ఉండిపోయింది. ఒంటరి ఆడవాళ్ళయ్యేసరికి పోకిరి పిల్లల తుంటరి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటే, మా అమ్మాయి వీళ్ళ పరిస్థితి గమనించి, వాళ్ళింటికి దగ్గరలో మా అల్లుడువాళ్ళు చిన్న పోర్షన్స్ గా ఇళ్ళు కట్టి బడుగులకు ఇచ్చి వున్నారు. అందులో ఒకటి ఖాళీ చేయించి తులసి వాళ్ళు అక్కడ వుండే ఏర్పాటు చేశారు. కష్టపడే స్వభావంగల ఆ అమ్మాయి చిన్నపుడు నేర్చుకున్న టైలరింగ్ ఇప్పుడుపయోగించుకుంది. ఇంటి వద్దనే చీరల బిజినెస్ చేస్తున్న తన వయసు ఆమెతో పరిచయం పెంచుకుని కొంత సమయం ఆమెకు బిజినెస్ లో సహాయ పడేట్లు అందుకు తగిన జీతం ఏర్పాటు చేసుకుంది. ఇంకా అక్కడకు వచ్చే కస్టమర్స్ కు చీరలు, ఫాల్స్, బ్లౌజులు కుడుతూ ఈ సంపాదనతో కొంత ఊపిరి తీసుకోగలిగింది. రేషన్ షాపులో బియ్యం ఉప్పు, పప్పులు తెచ్చుకుంటూ ఇల్లు గడపసాగింది.
భర్త నుండి సహాయం లేకపోగా, కొద్ది రోజులకు ఆ చేస్తున్న పని కూడ మానేసి, తన అసమర్థత కప్పి పుచ్చుకోవడానికి ఆ అమ్మాయి ఎదో విధంగా సంసారాన్ని గుట్టుగ నడుపుతుంటే ఖాళీగ కూర్చుని రోజూ గొడవలతో పొద్దు పుచ్చడం మొదలుపెట్టాడట. ఇల్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి చేయి చాచి ఎవ్వరిని సహాయం యాచించలేదు. దగ్గరగా చూస్తున్న వారికి తప్ప తను పడే అవస్థలు నోరు విప్పి ఎవ్వరికి చెప్పుకోలేదు కూడా. అయినప్పటికీ “సంసారంలో సమన్వయం లోపిస్తే ప్రపంచానికి మనం బట్టబయలయినట్లే”. “నాలుగు గోడల మద్య విషయాలు కూడ నడి రోడ్లో ఉంటాయి”. కూతుర్ని ఇంజనీరింగ్ చదివించాలని ఆశపడిన తులసి రోజు రోజూ యింట్లో గొడవలకు, వీలయినంత త్వరగా అమ్మాయికి పెండ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని ఆత్రుత పడసాగింది. తులసి కూతురు కూడా తల్లి లాగ అందమైన అమ్మాయి. సంబంధాల వేటలో భాగంగా బ్రతికి చెడ్డ కుటుంబంగా ఊరిలో కొంత ఆదరణ మిగిలి వుంది. ఊరి పెద్దల సహాయంతో పొలాలు అమ్మి అప్పులు కట్టి అమ్మాయికి ఇవ్వవలసినది నిర్ణయించుకున్నారు. అదృష్టం కొద్ది పొలాలు అనుకున్న దాని కన్న ఎక్కువ రేటుతో అమ్ముడయ్యాయి. అమ్మాయికి కూడ సంబంధం కుదిరింది. ఇక పెండ్లి ఖర్చులు అవీ ఎలాగూ ఉంటాయి. పది మందితో కూడిన వ్యవహారం కాబట్టి కొంత వితరణ గానే జరగాలి మరి. పెండ్లికని ప్రస్తుతముంటున్న చిన్న యింటి నుండి రెండు గదుల బాడుగ యింటికి మారారు. అనుకున్న కార్యం తలొక చెయ్యి వేసి సజావుగా జరిపించారు.
తులసి అల్లుడు, ఒక్కడే కొడుకు. పెద్ద కాంట్రాక్టర్ వద్ద చేరి గౌరవంగా గడుపుకుంటున్నాడు. హైదరాబాదులో కాపురం పెట్టారు. అమ్మాయి అత్తగారు గడసరి. బాధ్యత లేని యిల్లాలు. ఈ విషయమై తను కొంత వెనుక ముందు ఆడినా, పిల్లవాడు కష్టపడి సంపాదించుకుంటున్నాడు పెండ్లాన్ని పోషించగలడు. తన పరిస్థితిని కూడా గుర్తు పెట్టుకుని, ఎక్కువ ఆలోచించకుండ పెండ్లి జరిగి పోయింది.
కూతురు, అల్లుడిని తొలి పండుగలకు తీసుకురావడం, సారె పెట్టి పంపడం, కూతురు అత్తగారి గొంతెమ్మ కోర్కెలు సహనంతో తీర్చడం శక్తికి మించిన పనే అవుతున్నది. ఊపిరి తీసుకునే లోపు అమ్మాయి గర్భవతి ప్రసవానికి, పుట్టింటికి తీసుకువచ్చి పురుడు పోసి తల్లి బిడ్డను క్షేమంగా లాంఛనాలతో పంపింది. పొలం అమ్మగా మిగిలిన డబ్బు కూడ అయిపోయింది.
ఇప్పుడు ఇంటి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అత్త గారు, భర్త కోరికలకు తగ్గట్టుగ సదుపాయాలు చేయలేకపోతున్నది. అన్ని పేచీలే. తులసి సంపాదన సరిపోవడం లేదు. ఒక రోజు షాపు నుండి వచ్చేసరికి తల్లి, కొడుకులిద్దరు ఒక నిర్ణయాని కొచ్చినట్లు తులసిని కూర్చోబెట్టి ఇక ఇక్కడ ఉండటం కష్టం. అమ్మాయి అల్లుడి వాళ్ళ వద్దకు వెళ్ళి ఉందాము నువ్వూ అలసిపోతున్నావు అమ్మాయితో మాట్లాడు నువ్వు చెబితె కాదనరు. అని అనునయంగా మాట్లాడుతున్నవారిని ఏ కోవలోకి చేర్చాలో అర్ధం కాక తెల్లబోయింది. ఇప్పటి వరకు సహిస్తూ వస్తున్న తులసి ఈ విషయంలో పెద్ద గొడవే పడి ఆప్రయత్నం ఆపగలిగింది.
నిన్న సాయంత్రం నేను, మా వారు మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాము. ప్రక్కింట వాళ్ళు వ్రతం చేసుకుంటూ పిలిచారమ్మా, త్వరగా వచ్చేస్తాను అంటూ అమ్మా! మీరు డిన్నరు ఇక్కడే చేస్తారు అన్నీ ప్రిపేర్ చేసేశాను అని చెప్పి మా అమ్మాయి వెళ్ళింది.
ఇంటి వెనుక వైపు తులసి కోట మెట్ల పై కూర్చొని ఎదో చదువుకుంటున్నాను. ఇదుగో నిన్నే! తులసి
వచ్చింది అని చెబుతూ మా వారు, ఆ వెనుకనే తులసి వచ్చారు రా అమ్మా ! అని పలకరిస్తూ లేవబోతుంటే, వద్దాంటి ఇక్కడే కూర్చుందాము చల్లగా గాలి వస్తున్నది అంటూ తాను తెచ్చిన సంచి ప్రక్కన పెట్టి కూర్చుంది. ఆకు కూరలు, కూరగాయాలున్నాయందులో వంటామెకు తులసి కొరకు టీ, స్నాక్స్ తెమ్మని చెప్పి మార్కెట్ కెళ్ళి వస్తున్నావా!అన్నాను.
మంచినీళ్ళు తాగుతూ. లేదు ఆంటీ ఇవన్ని ఇంటి వద్ద పండించినవే, ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాను అని చెప్పింది. ఒకర్తెవేనా? అవునాంటీ టౌన్లో ఖర్చులకు తట్టుకోలేము. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెడ్తున్నది పాప పెండ్లయి ఆ బాధ్యత తీరిపోయింది కదా, పల్లెటూర్లో అయితే తన మన అనుకునే వాళ్ళింకా ఉన్నారు . పొద్దున వాకిట్లో కళ్ళాపి జల్లి ముగ్గు వేయలేదంటే తలుపు తట్టి ఎలా వున్నావని పలకరించుకుంటారు. ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో ఆకు కూరలు, కాయకూరలు నాలుగు మొక్కలు వేస్తే , ఇంటికి సరిపడా కాక ఇరుగు పొరుగుకు కూడా పంచవచ్చు ఎవరికి వీలయినవి వారు ఇచ్చిపుచ్చుకోవడాలు అక్కడ మామూలేకదా దేనికీ వెతుక్కోకుండా జరిగిపోతుంది. రెండు గేదలను పెట్టుకుంటే పాలు, పెరుగుకు లోటు లేక పోవడమే గాక మిగలగా అమ్మిన పాలతో పదిరూపాయలు చేతి ఖర్చులకు కూడ మిగులుతున్నది. దిగులు లేకుండా జరిగిపోతుంది. ఇవన్నీ చేతనయినవి. ముందు చేస్తున్న పనులే కదా ఆంటీ, ఇది అత్తగారికి, మా ఆయనకు చెప్పి ఒప్పించలేకపోయాను. ఆ యింటి స్థలాన్ని కూడ అమ్మి వేయాలన్న వారి ఆ ఆలోచనకు మీ అమ్మాయి, అల్లుడు గారి సహాయంతో నిలుపుకున్నాను.
అమ్మ వాళ్ళు కూడా పెద్దవాళ్ళయి పోయారు సంసారానికి సర్దుబాటు చాలా అవసరమనీ, అలాగే కూతురి సంసారంలో కలుగజేసుకోవడం పద్ధతి కాదని కూడ చెప్పి పెంచారు నన్ను. అంతంత మాత్రంగా పండీ, పండక అవస్థలు పడే చిన్నరైతు కుటుంబం మా నాన్న వాళ్ళది. వాళ్ళకున్నదాంట్లోనే నాకు పదీ, పరక సర్దుతూ వచ్చారు ఒక్కతే కూతుర్ని లోటు లేకుండా పెంచారు. కొరత పడకుండా పెండ్లి చేశారు. ఇప్పుడు నేను వారి దగ్గరే ఉండి పోవచ్చు. వాళ్ళకు, నా అవసరం ఉందిప్పుడు. కాని కాపురం వదిలేసి పుట్టింట్లో కూర్చుందన్నమాట, అమ్మా వాళ్ళు భరించలేరు, నేను స్వీకరించలేను. పైగా నా కూతురు అల్లుడు, పిల్లలు వచ్చి పోవాలన్నా నా యిల్లు నాకుండాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆంటీ, ఇన్నేళ్ళలో మీరెప్పుడు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు నన్ను. మీరు అడగకపోయినా ఈ రోజు మీకు చెప్పి భారందించుకుంటున్నాను. అమ్మా, నాన్న తరువాత అంతటి వారు మీరు నాకు. ఎవరికీ తెలియకుండానే, మీ అమ్మాయి ద్వారా మీరు చేసిన సహాయాలు కూడా నాకు తెలుసు ఆంటీ.
తాగుడు, తిరుగుడు లాంటి వ్యసనా లేవి మా ఆయనకు లేవు. సోమరితనం, మగవాడినన్న అహంకారం, ఆడవాళ్ళంటే చులకన. అందులోనూ భార్య అస్సలు నోరెత్తకూడదు అన్నింటికంటే సునాయాసంగా అప్పులు తెచ్చి వాడుకుని తిరిగి ఇవ్వాలన్న ఆలోచన లేని నిర్లక్ష్యం, ఈ స్థితికి తెచ్చాయి మమ్మలి. సంసారం గుట్టు రోగం రట్టు అంటారు. నా శాయశక్తులా గుప్పెట విప్పకుండ ప్రయత్నించాను. ఈ రోజు నా గుప్పెట్లొ ఏమి లేకుండా చేశారు. మొండి గోడల్లో నిలబడిన ఇంటిని నోరు మంచిదయితే ఊరు మంచిగా చేసుకుని ఇసుక, సిమెంటు మోస్తూ కూలి మిగుల్చుకుని ఇల్లు నివాస యోగ్యంగా చేసుకుంటున్నాను. “భగవంతుని కోరేదొక్కటే ఆంటీ, ఏ మొండి ధైర్యంతో అయాచితంగా చేయి చాచకూడదనుకుంటున్నానో, మా వూరి పూజారి చెబుతుంటారు. “వినాదైన్యేన జీవనం” అని, అందుకు తోడుగ నిలువు స్వామీ ! అంటూ తులసి చేసిన వేడికోలు తప్పక భగవంతుడు విని వుంటాడు. కాలుష్యం లేని పల్లె గాలి పీలుస్తూ, కపటం లేని అమాయకత్వమే అందంగా, ఆనందంగా పెరిగిన తులసి పెండ్లి వరకు టౌను కూడ చూడలేదు. ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆదర్శవంతమైన భావాలతో పెరిగిన ఒక ఆడపిల్లలో కొత్తగా ఇంకా ఏమి కోరగలం.
ఇది ఒక పేరుకు, వ్యక్తికీ సంబంధించిన జీవన యాత్ర కాదు ఆత్మాభిమానం కవచంగా తెగువతో సంసార రణరంగంలో ఒంటరి పోరాటం చేస్తూన్న వారందరిది. ఆ తెగువ కూడా లేని వారు కుటుంబమనే ముసుగులో ఊపిరాడక, నిత్యం మానసిక పోరాటం చేస్తూ, కను చూపు మేరలో కనిపించి నట్లుండే, ‘మరీచిక’ పై ఆశతో బ్రతుకు సాగిస్తూ, మూగవేదనతో ముగింపు పలుకుతారు.

1 thought on “తులసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *