April 28, 2024

ఈశ్వర సేవ

కథ: G.S.S. కళ్యాణి.

ఆదివారం మధ్యాహ్నం, సమయం మూడు గంటలయ్యింది. సముద్రం పైనుండి వీస్తున్న చల్లటి గాలి ఎండ వేడిమినుండి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉండటంతో పిల్లలూ, పెద్దలూ అందరూ సముద్ర తీరంలో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలోంచి ఎనభయ్యేళ్ళ ప్రకాశరావు మెల్లిగా కిందకు దిగి, తన జేబులోంచి ఒక వంద రూపాయల నోటును తీసి ఆ ఆటో డ్రైవర్ చేతిలో పెట్టి, సముద్రం వైపుకు తిరిగాడు.
“అయ్యా!”, పిలిచాడు ఆటో డ్రైవర్.
ఏమిటన్నట్లు అతనివంక చూశాడు ప్రకాశరావు.
“నేను అడిగినది ఎనభయ్ రూపాయలేనయ్యా..! ఇరవై ఇస్తాను. కాస్త ఆగండి!”, అంటూ గబగబా చిరిగిన తన చొక్కా జేబులోకి చెయ్యి పోనిచ్చాడు ఆటో డ్రైవర్.
“చూస్తే పేదవాడిలా ఉన్నావ్. చిల్లర ఉంచుకోవయ్యా! పర్లేదు. అవసరానికి పనికొస్తాయి”, అన్నాడు ప్రకాశరావు.
ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోతూ, “సరేనయ్యా! అయ్యా, నా పేరు సుందరం. మీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండాలయ్యా! దండాలు..వస్తాను!”, అని చిరునవ్వుతో ప్రకాశరావుకు మర్యాదపూర్వకంగా దణ్ణం పెట్టి అక్కడినుంచీ వెళ్ళిపోయాడు.
‘నా వల్ల కనీసం ఒక్క మనిషి ముఖంలోనన్నా ఈరోజు నవ్వు కనపడింది!’, అని నిట్టూరుస్తూ సముద్రంవైపుకి మెల్లిగా నడవటం ప్రారంభించాడు ప్రకాశరావు.
సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుంచో ఒక సాధువు కూడా ఆ ప్రదేశానికి వచ్చి ప్రకాశరావుకు కొద్దిదూరంలో సముద్రం వైపుకి నడవటం మొదలుపెట్టాడు. ప్రకాశరావూ, సాధువూ ఒకరినొకరు పరస్పరం చూసుకుని పలకరింపుగా నవ్వి ముందుకు నడిచారు. కాస్త దూరం నడిచాక అక్కడ కొందరు పిల్లలు కేరింతలు కొడుతూ ఇసుకతో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. ఆ పిల్లలను చూసేసరికి ప్రకాశరావుకి తన అన్నలూ, అక్కలూ గుర్తుకు వచ్చారు. చిన్నప్పుడు ప్రకాశరావుతో కలిసి ఆడుకున్న వాళ్లంతా ఇప్పుడు లేరు. కానీ వాళ్ళ జ్ఞాపకాలు ప్రకాశరావు మదిలో చెదరకుండా ఉన్నాయి.
“బంగారు బాల్యం!”, ఆ పిల్లలను చూస్తూ అన్నాడు ప్రకాశరావు.
“భగవంతుడిని తేలికగా మెప్పించగలిగే ప్రాయం! నమః శివాయ!”, అన్నాడు సాధువు.
మరికొంత దూరం నడిచాక అక్కడ యవ్వనంలో ఉన్న కొందరు యువతీయువకులు ఏవో పరీక్షలకు సంబంధించిన పాఠాలు చదువుకుంటున్నారు.
“మా తరంలో సంపాదించిన జ్ఞానం నేటి తరానికి పాత చింతకాయ పచ్చడిలాంటిది!”, అన్నాడు ప్రకాశరావు.
“భగవంతుడి గురించి తెలుసుకోలేని జ్ఞానం జ్ఞానమేనా? పురాణాలవల్ల కలిగిన జ్ఞానం పాతబడుతుందా? అది నిత్యనూతనం! నమః శివాయ!”, అన్నాడు సాధువు.
ప్రకాశరావు, సాధువు కలిసి మరో పదడుగులు వేశాక అక్కడ కొన్ని జంటలు ప్రేమించుకుంటూ కనిపించారు.
“భార్య పై ప్రేమతో, భవిష్యత్తుపై ఆశతో బతికిన రోజులు! మళ్ళీ వస్తాయా? ఇప్పుడు భార్యా లేదు! భవిష్యత్తుపై ఆశా లేదు!!”, అన్నాడు ప్రకాశరావు నిట్టూరుస్తూ.
“అదీ శాశ్వతుడైన భగవంతుడిపై ప్రేమను పెంచుకోవాల్సిన సమయం! సంసార సాగరాన్ని ఈదటానికి తగిన శక్తినిమ్మని ఆయనను ప్రార్ధించవలసిన ప్రాయం! నమః శివాయ!”, అన్నాడు సాధువు.
ప్రకాశరావు, సాధువు సముద్రతీరాన్ని సమీపించే సమయానికి, అక్కడ కొందరు వృద్ధులు, ఎవరికివారు ఒంటరిగా ఏదో దిగులుతో సముద్రానికేసి చూస్తూ కూర్చుని కనిపించారు.
“పిల్లలూ, మనవళ్ళూ, మనవరాళ్ళూ అందరూ పెద్దవారైపోయాక, వయసు మీద పడ్డ వారిని కన్నవారే భారంగా భావించే కాలం ఈ వృద్ధాప్యం! ఎవ్వరినీ ఆనందపరచలేక, బాధను పంచుకునే తోడులేక, ఇంకెన్నాళ్లీ బతుకోనని అనుకునే సమయం! నావంటి వారికి ఎంత జ్ఞానమున్నా, ఎంత అనుభవమున్నా నావల్ల ఎవరికి ప్రయోజనమని మధనపడే తరుణం!”, అన్నాడు ప్రకాశరావు ఇసుకలో చతికిలపడి కూర్చుంటూ.
సాధువు ఈసారి ఏమీ మాట్లాడలేదు. సముద్రపు అలలు తన పాదాలకు తాకేదాకా వెళ్లిన సాధువు, అక్కడ నిలబడి సముద్రానికి నమస్కరించి, తన చేతులతో మట్టిని తీసి సైకత లింగాన్ని చేసి, దాన్ని భక్తితో పూజించి, అరటిపళ్ళు నైవేద్యంగా ఆ శివుడికి సమర్పించి, ఆ పళ్ళల్లో ఒకటి తీసి ప్రకాశరావు చేతిలో పెడుతూ, “శివాయ నమః! వృద్ధాప్యం అంటే గతాన్ని తవ్వుకుంటూ కృంగిపోయే తరుణం కాదు! ఈ జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవలసిన సమయం. మనిషిగా పుట్టినందుకు, ఆ పరమేశ్వరుడిని నిరంతరం సేవిస్తూ ఆయన కరుణను పొందగలిగితే ఈ జన్మ సార్ధకమైనట్లే కదా?! ఈ దేహం వల్ల మన ఆత్మ ప్రయోజనం పొందినట్లే కదా! అరిషడ్వార్గాలను ఎలా జయించాలో తెలియక సతమతమవుతున్నవారిని ఆనందపరిచే ప్రయత్నం చేసేకన్నా, భక్తసులభుడైన ఆ ఈశ్వరుడిని ఆరాధిస్తే ఆయన మనకు అంతులేని బ్రహ్మానందాన్ని ప్రసాదించగలడు! అదే సత్యం!”, అన్నాడు చిరునవ్వుతో.
ఆ మాటలు ప్రకాశరావును ఆలోచనలో పడేశాయి.
“నిజమే! నేను సంపాదించిన జ్ఞానం, నా అనుభవం ఇవన్నీ ఈ జన్మకే పరిమితం! జన్మజన్మలకూ ఉపయోగపడే ఈశ్వర జ్ఞానం నేనింతవరకూ సంపాదించనేలేదు! ఆ జ్ఞానం పొందేదెలాగో మీరే చెప్పండి!”, అన్నాడు ప్రకాశరావు.
“ఈశ్వరానుగ్రహంవల్ల ఈశ్వర జ్ఞానం కలుగుతుంది. ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలంటే ఆ ఈశ్వరుడినే సేవించాలి! మన చుట్టూ ఉన్న మనుషులలో ఆ ఈశ్వరుడున్నాడన్న భావనను పెంచుకుంటే వారికోసం మనం చేసే ప్రతిపనీ ఈశ్వర సేవ అవుతుంది! అప్పుడు ఆ మనుషుల స్పందన మన మనోభావాలపై అంతగా ప్రభావం చూపదు. మన పనిని మనం ఆనందంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవచ్చు. కాదంటారా?”, అన్నాడు సాధువు.
సాధువు మాటల్లోని ఆంతర్యాన్ని ఇట్టే గ్రహించాడు ప్రకాశరావు. అంతవరకూ ఏదో దిగులుతో ఉన్న ప్రకాశరావు ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది.
“మీరు చెప్పినది అక్షరాలా నిజం! కాదని ఎలా అనగలను? మీరు నా కర్తవ్యమేమిటో నాకు తెలిసేలా చేశారు. ఈశ్వరానుగ్రహాన్ని పొందటానికి నావంతు కృషి నేను చేస్తాను!”, అంటూ సాధువుకు భక్తితో నమస్కరించాడు ప్రకాశరావు.
“మంచిది! ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు!! నమః శివాయ!”, అని సాధువు ప్రకాశరావును ఆశీర్వదించి అక్కడినుండీ వెళ్ళిపోయాడు.
ప్రకాశరావు శివుడి గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దగ్గరకు వచ్చాడు. అక్కడ ఇంతకుముందు తనను ఆ ప్రదేశానికి తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ సుందరం ఆటోతో కనిపించాడు.
ప్రకాశరావును చూస్తూనే, “రండయ్యా! రండి! రండి! మిమ్మల్ని నేను ఇంటి దగ్గర నా ఆటోలో దిగబెడతాను!”, అంటూ ఆటోలో కూర్చున్నాడు సుందరం.
ఆటో వెతుక్కునే బాధ తప్పిందనుకుంటూ ఆటో ఎక్కాడు ప్రకాశరావు.
“అయ్యా! ఇందాక నాకు మీరు దిగులుగా కనబడ్డారు. మీ వయసువారు ఎందుకు దిగులు పడతారో నాకు బాగా తెలుసు. అందుకే మీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను”, అన్నాడు సుందరం ప్రకాశరావుతో.
“ఏమిటా విషయం?”, కుతూహలంగా అడిగాడు ప్రకాశరావు.
“అయ్యా! మన ఊళ్ళో మీ వయసువారందరూ కలిసి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సమాజంలో ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించటానికి ఆ సంస్థ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసి, వాటిని అమలు చేసే బాధ్యత మాలాంటి యువకులను అప్పగిస్తూ ఉంటుంది. మీకున్న జ్ఞానం, మీ అనుభవం ఆ సంస్థకు ఎంతో అవసరం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఆ సంస్థ కార్యదర్శి నారాయణగారికి పరిచయం చేస్తాను”, అన్నాడు సుందరం.
ప్రకాశరావుకు ఆనందాశ్చర్యాలు కలిగాయి.
“ఎంత విచిత్రం?! ఇన్నాళ్లుగా నాకు తెలియని ఈ విషయం ఇవాళ నీ ద్వారా ఇలా తెలిసిందంటే ఇదంతా ఆ ఈశ్వరేచ్ఛ!! నేను నా జీవితంలో సంపాదించిన అనుభవం వృధా అయిపోతుందని చాలా బాధ పడ్డాను. అలాకాకుండా అది పది మందికి ఉపయోగపడి, నావల్ల ఈ సమాజానికి కొద్దిపాటి ఉపకారం కలుగుతుందంటే అంతకన్నా నాకు సంతృప్తినిచ్చే పని మరొకటి ఏముంటుందీ? ఈ సమాజసేవను ఆ ఈశ్వర సేవగా భావిస్తూ నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను! ఈశ్వరానుగ్రహాన్ని ఈ విధంగా పొంది నా జన్మకు కూడా ఒక ప్రయోజనం ఉందని నిరూపించుకుంటాను! నువ్వు చెప్పిన ఆ నారాయణగారిని వెంటనే కలుద్దాం”, అంటూ సంతోషంగా సుందరం అడిగినదానికి తన అంగీకారాన్ని తెలిపాడు ప్రకాశరావు.
“అలాగేనయ్యా!”, అంటూ ఆటోను ఉత్సాహంగా ముందుకు పోనిచ్చాడు సుందరం.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *