May 4, 2024

పరవశానికి పాత(ర) కథలు – కొన్ని కన్నీళ్లు కొందరికే వస్తాయి

రచన: డా. వివేకానందమూర్తి

“ఇందులో దుక్కరసం బాగా ఎగస్ట్రాగా వుండేలా గుందే!” అని తల పక్కకి తిప్పేశాడు నా ఫ్రెండు మహాదేవరావు – ఈ కథ శీర్షిక చూసి. అతనికి వొత్తులు పలకవు. అతనికున్న వొత్తు ఒక్కటీ అతని జుట్టు మాత్రమే. హెయిర్ కట్ చేయించుకున్నాక కూడ అతని జుత్తు, జులపాల్లా వేలాడుతుంది.
“క్షవరం చేయించుకున్నాక కూడా అంత జుట్టేవిటయ్యా?” అని అడిగితే సమాధానంగా, “కటింగ్- చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ!” అంటాడు మహదేవరావు. మరేం చెయ్యను? ఇక్కడ లండన్లో వున్న కొద్ది తెలుగువారిలో తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉందని అరిచే శాల్తీ అతనొకడే.
మా మహదేవరావులా మరి మీకు కూడా తల, పేజీలు తిప్పేయకండి. మన తెలుగమ్మాయి రాణీ గురించి తెలిశాక ఒక్క తెలుగు మనసే కాదు. ఇంగ్లీషు మీద కూడా యిదవక తప్పదు. ఆ “యిదే” యీ కథ.
* * *
నేను చాలా సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా లండన్లో ఉండిపోయాను. అయినా ఇండియాతో ఇంకా నాకు సంబంధాలు, బంధాలు వున్నాయి. అక్కడికి ఇక్కడికీ నాకు అనిపించే పెద్ద తేడా “ఎండ” ఒకటే.
ఇండియాలో గుండె లేని ఎండ – మండించి మాడుస్తుంటే, ఇక్కడ ఎండ అపురూపం. తనకి తోచినప్పుడు చల్లటి చలి ప్రియసూర్యుడు ఫ్రిజ్ లో లైట్ వెలుగుతూ – చలిని మనల్ని చంపుకుతినమంటాడు.
మరి అక్కడికీ, ఇక్కడికీ తేడా తెలియనిదల్లా ఒక్కటే- నా ప్రాణమిత్రుడు శేషాచలం, విశాఖపట్నంలో వుంటాడు. అక్కడ పెద్ద వ్యాపారవేత్త-బాగా గడించాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాడు.
శేషాచలానికి ఒక్కడే కొడుకు. పేరు “హర్ష”. పెద్ద డాక్టర్ని చెయ్యాలని పై చదువులకు లండన్లో నా దగ్గర పెట్టాడు. నేనుండే ప్లాటు థేమ్సునది వొడ్డున వుంది. కిటికీ తెరిస్తే థేము. నిజానికి నా థీమ్సు అన్నీ ఆ థేమ్సు ప్రసాదాలే.
నేను వంటరిని. ఇక్కడ నాకు శేషాచలం కొడుకు “హర” ఒక్కడే తోడు. పిల్లలులేని నాకు హర్ష కొడుకులాంటివాడు. చక్కటి కుర్రాడు. వాడి మెదడు పదును పెట్టిన చాకు. వాడో గొప్ప ఆసరా నాకు.
ఈ మధ్య హర్పకి తగిన ఈడొస్తోందని గ్రహించి, “ఒరేయ్ హర్షా! నువ్వు పెళ్లీడుకొచ్చినవాడివనిపిస్తోంది. ప్రయత్నాలు చైమంటావా? – మీ నాన్నతోకూడా మాట్లాడతాను” అనడిగాను. అన్నాళ్లు లండన్లో వున్నా సంప్రదాయాల మార్పుని సంగ్రహించుకోలేక.
హర్ష, నన్ను ప్రేమగా “డాడ్!” అని పిలుస్తాడు. ఇండియాలో నా ప్రాణ మిత్రుడు మరియు వాడి తండ్రిని “నాన్న” అని ఉదహరిస్తాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు హర్ష నాకు ఒకటే సమాధానం చెప్పాడు.
“డాడ్! ఏవీ అనుకోకు. నేనే చెబుదామనుకుంటున్నా. డాడ్ వి కదా-కాస్త హెజిటేషన్-సందర్భం వచ్చింది కాబట్టి – చెప్పాలి మరి. నేను ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాను. మంచి పిల్ల. అందంగా ఉంటుంది. ఆ అందానికి అందనంత అందమైన మనసు. నాకు నచ్చింది. నీకు త్వరలో పరిచయం చేద్దామని అనుకుంటున్నాను.
నాకు పాత సినిమాలు గుర్తొచ్చాయి. “ఎవరూ! తెల్లపిల్లా?” అభిజాత్యం చావని అనాగరికుడిలా.
“కాదు. మన ఆంధ్రాపిల్లే. నేను చేసే హాస్పిటల్ లోనే”
“డాక్టరా!”
“నో”
“నర్సా?”
“నో, వాళ్ళ ఆఫీసువాళ్లు ఉద్యోగానికి ముందు మెడికల్ చేయించుకోమన్నారు. రొటీన్ టెస్ట్ కి వచ్చింది – ఫిట్నెస్ రిపోర్టుకి. రెండు, మూడుసార్లు కలిశాం. మాకు బాగానే స్నేహం కుదిరింది”.
“అవునులే. వయసుకి తగిన అందమైన ఆడపిల్లతో స్నేహం-ప్రేమగా దారితీస్తుంది. ఈ పరిచయం స్నేహంగా మిగిలిపోవడం నాకు డౌటే-ఇంతకీ ఆ పిల ఏ జాబ్ లో జాయినవుతోంది?”
“ఇంకా అడగలేదు. వైద్యపరీక్షలు ఇన్స్యూరెన్స్ వాళ్ళడుగుతారు ఆమె జాయినయ్యే ఫరమ్ ని బట్టి – ఈసారి అడుగుతా” అన్నాడు హర్ష
“పోనీ పేరేనా అడిగావా?”
“ఉష”
“వాళ్ళ పేరెంట్స్?”
“ఇంకా అంతదాకా మాట్లాడుకోలేదు. బట్ వుయ్ డోంట్ కేర్ ఫర్ ఎనీ అబ్జెక్షన్స్”
“బాగానే వుంది. నాకేం అభ్యంతరం లేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు. నీకు వీలైనప్పుడు నాకోసారి చూపించు” అన్నాడు వాడితో.
“ష్యూర్”
“ఇక ఆలశ్యం దేనికి? మీ నాన్నతో మాట్లాడతాను”
“అప్పుడే వద్దు”
“ఏం?”
“అప్పుడే వద్దంటాడేమోనని” జంకుతూ అన్నాడు.
“నాట్ టు వర్రీ. నేను స్వయంగా విశాఖపట్నం వెళ్లి పర్సనల్ గా మాట్లాడతాను. వాడు నా క్లోజ్ ఫ్రెండ్. నీకు గుడ్ న్యూస్ తీసుకొస్తాను”.
“థ్యాంక్యూ! డాడ్! థ్యాంక్యూ!” హర్ష హర్షాతిరేకంతో నన్ను వాటేసు కున్నాడు.
వాడి మనస్సులో ఆనందం వాడిగా పెరిగిందని గ్రహించగలిగాను. తేరుకుని కాస్త మెత్తగా మందలించాను. “ఆ సిగరెట్లు కాస్త తగ్గించు. ఆరోగ్యం మాటెలా వున్నా ఆ పిల్లకి నచ్చకపోవచ్చు”.
“ఓకె. డాడ్! అయామ్ కటింగ్ దెమ్ డౌన్. రోజూ ఆ రికార్డు ప్లే చైకండి” అన్నాడు హర్ష
అవాళ మేం అంతకంటే ఎక్కువగా మాట్లాడుకోలేదు. మా బిజీ రోటీన్లో పడిపోయాం.
గబ గబా పదిరోజులు గడిచాయి. రానురాను హర్ష కాస్త నీరసంగా కనిపించ సాగాడు. ప్రేమలో పడి తినడం నిర్లక్ష్యం చేస్తున్నాడో? లేక విశాఖపట్నంలో వాళ్ళనాన్న ఏవంటాడో అని సస్పెన్సులో సతమతమవుతున్నాడో నాకు అంతు చిక్కలేదు. నా అలసత్వం మాని ఆలస్యం చైకుండా ఇండియాకు ఫ్లెట్ బుక్ చేసుకున్నాను. జర్నీ కన్ఫర్మ్ అయిందని హర్షకి ధైర్యం చెప్పాను.
ఇంతలో ఓ రోజు హర్షతో పనిచేసే మరో సీనియర్ డాక్టర్ సింహాద్రి, – హర్ష ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేశాడు. డాక్టర్ సింహాద్రిగారిని అడపాదడపా కలిశాను గానీ, ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు.
వెళ్లి కలిశాను.
“మీ వాడు సిగరెట్లు ఎన్నాళ్ళబట్టి కాలుస్తున్నాడో మీకు తెలుసా?” అడిగారు సింహాద్రిగారు.
“నాకు తెల్సినంతవరకూ ఫ్యూ ఇయర్స్-ఎగ్జాక్టుగా చెప్పలేను” అన్నాను.
“పోనీ రోజుకెన్ని కాలుస్తాడో తెలుసా?”
“అదీ ఎగ్జాక్టుగా తెలీదు. నా ముందు కాల్చడు. అయినా వాసన తెల్సినప్పు డల్లా వార్న్ చేస్తున్నాను. ఏం ఎక్కువగా కాలుస్తున్నాడా? గట్టిగా మందలిస్తానండి” అంటూ లేవబోయాను.
“కూర్చోండి” డాక్టర్ సింహాద్రి శాసించాడు. “నేను మిమ్మల్ని అర్జంటుగా పిలిచిన అసలు విషయం వేరు. ఈ మధ్య హర్ష అడపాదడపా దగ్గుతున్నాడు. “స్మోకర్స్ కాఫ్” అనుకుని “ఆ సిగరెట్టు తగ్గించవయ్యా” అని చాలాసార్లు సలహా చెప్పాను. తర్వాత నాకే ఎందుకో డౌటొచ్చింది. ఫోన్ చేసి, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ + ఎక్స్ రే, స్కాన్, బ్రోంఖోస్కోపీ, హిస్టాలజీ అన్నీ ఎరేంజ్ చేశాను. “ఇదీ విషయం” అని హర్ష రిపోర్ట్సన్నీ నా ముందుంచాడు.
వాటిని చూశాను. చదివాను నాక్కాస్త కళ్ళు తిరిగినట్టయింది. భయంతో, ఆశ్చర్యంతో, బాధతో, బెంగతో నిభాయించుకోలేకపోయాను.
అంతా కల అయితే, ఆ కల నిజమైతే బావుంటుందని ఆ క్షణం ఆశ పడ్డాను. “ఈ ఇన్వెస్టిగేషన్స్ నిజంగా హర్షవేనంటారా?” సిల్లీగా అడిగా,
“వాట్ డు యు మీన్?” డాక్టర్ సింహాద్రి, డాక్టర్ సింహంలా ఉరిమాడు. “హి నోస్ ఎబౌట్ హిజ్ డయాగ్నోసిస్ – హర్షకి కూడా తెలుసు”
“ఐ యామ్ సారీ” అన్నాను. నా నోట్లోంచి మరో మాటలేదు. డాక్టర్ సింహాద్రి వెంటనే అర్థం చేసుకుని, నా భుజం తట్టి “ఐ యామ్ సారీ” అన్నాడు.
నేను లేచి, వెనక్కి తిరిగి రోడ్డు మీదికి వచ్చాను. అవాళ స్నో లేకపోయినా స్లోగా నేనెక్కడికో జారిపోతున్నట్టుంది. లండన్ ట్రాఫిక్ అనవరతమైన విసుగులా వుంది. అడుగడుక్కీ “పబ్స్”. “పబ్” అంటే “పబ్లిక్ హౌస్” – మన ఇండియాలో బార్స్ లాగా అని అందరికీ తెలుసు.
లండన్ “పబ్బు” లే ఎక్కువనుకున్నా. ఇప్పుడు “జబ్బులూ” ఎక్కువే అనిపిస్తుందిక్కడ.
శేషాచలం నా ప్రాణమిత్రుడు. వాడికి కొడుకంటే ప్రాణం. ఏ తండ్రికి కాదు. నాకు హర్ష కొడుకులాంటివాడు. నాకు ప్రాణాధికం.
హర్షకి హఠాత్తుగా లంగ్ క్యాన్సర్స్ అంకురించడం నాకు అంకుశఘాతం. వెంటనే ఇండియా వెళ్ళి శేషాచలంతో హర్ష పెళ్ళి విషయం చెప్పి, వాణ్ణి ఒప్పించి, తిరిగొచ్చి హర్షకి ఆనందవార్త అందించి హర్షిద్దామనుకున్నాను. అనుకున్నదంతా అనుకోని విధంగా మారింది. ఆ సమయంలో నేను విశాఖపట్నం బైల్దేరుతున్నట్టు లేదు. విచారపట్నం వెళ్తున్నట్టుగా వుంది.
ఇంటికి వెళ్లాక, హర్షతో మాట్లాడాను – చాలా క్లుప్తంగా “మీ డాక్టర్ కొలీగ్ పిలిస్తే వెళ్లాను. బాగా ఎర్లీ స్టేజట. ట్రీట్మెంట్ తో మంచి ఫలితం వుంటుందన్నాడు” అబద్దం చెప్పడం నాకు చేతకాదని హర్షకి తెలుసు.
“మీ ప్రయాణం మానకండి. నేను హాస్పిటల్లో ఎడ్మిట్ అవుతున్నాను. నాన్నగారితో ఏదైనా చెప్పకతప్పదు. డాడ్! మీరు అధైర్యపడకండి. ఐ విల్ ఫైట్ ఇట్ బాక్” అన్నాడు హర్ష. వాడి పరిస్థితికి జాలిపడాలో, నా అయోమయ పరిస్థితికి స్థిమితప్రజ్ఞ ఎలా వెతుక్కోవాలో తెలీకపోయినా, హర్ష ధైర్యానికి మనసులో జోహారు చెప్పుకున్నాను. నేనే మళ్లా మాట్లాడాను. “మరి ఆ పిల్ల సంగతి, ఆమెకు తెలుసా?”
“ఇంకా తెలీదు. చెప్తా” హర్ష.
“ఏం చేస్తావ్, ఏడవదూ?”
“నో. నో, నా ఆరోగ్యానికీ, మా ప్రేమకీ ముడి పెట్టే మనస్తత్వం కాదు ఉషది. ఏం జరిగినా వేరయ్యే వేరే ఆలోచనలు మాకు లేవు” కచ్చితంగా స్పష్టం చేశాడు.
“ఏం చేస్తావిప్పుడు?”
“సరిగ్గా ఇదే ప్రశ్న- ఉషని అడుగుదామనుకుంటున్నాను” ఇక సంభాషణ సాగదీయదల్చుకోలేదు నేను.
* * *
విమానం విశాఖపట్నంలో వాలింది. విషణ్ణమైన విషయాన్ని ఎలా ఎదుర్కొవాలో తెలీడం లేదు. కాని తప్పదు. శేషాచలం చిన్ని పెర్సనాలిటీ. ఎమెస్కోబుక్ లా వుంటాడు. సింహాచలం వెళ్లే రోడ్డులో ఓ పెద్ద ఇంట్లో ఒక్కడూ వుంటున్నాడు.
సడన్‌గా ఇంట్లోకి అడుగుపెట్టగానే, నన్ను చూసి, “ఓర్ని ఏవిట్రా యీ సర్సైజు!” అని ఆనందాశ్చర్యాలతో పలకరించాడు శేషాచలం.
ఇద్దరం ఇంట్లోకి అడుగుపెట్టాం. నేను వెళ్లిన టైముకి వాడు “విస్కీ” తాగుతున్నాడు. నన్నడిగాడు. “నువ్వేం తాగుతావ్-కాఫీ తాగుతావా? టీ తాగుతావా? కోక్ తాగుతావా?”
“నేను తాగడం మానేశాను” చెప్పాను.
“నేనూ మానేద్దామనుకుంటున్నాను. కానీ తాగకపోవడం అలవాటయి పోతుందేమోనని బెంగ – అంచేత కాస్తే పుచ్చుకుంటున్నా” అన్నాడు మానేయడం ఏదో చెడు అలవాటులాగా.
“నీ వాలకం చూస్తే రాత్రి, పగలూ తాగుతున్నట్టుగా ఉంది”
“అందుకే – గేట్ మీద నా నేమ్ ప్లేట్ మీద “ఇన్”, “ఔట్” మార్చేసి “ఆన్” “అవుట్” అని పెట్టుకుందామనుకుంటున్నా” అని ఒళ్లంతా కుదుపుకుంటూ నవ్వాడు.
“నన్నసలు శేషాచలం అనకుండా శ్లేషాచలం అంటే కరెక్టేమో” ఈసారి నవ్వుతూ దగ్గాడు. దగ్గు ఆపుకోలేక పోతూ – “ఈమధ్య పెగ్గు పెగ్గుకీ దగ్గు ఎక్కువవుతోంది. శ్లేషాచలం కంటే శ్లేష్మాచలం ఇంకా కరెక్టు” మళ్లా తనే మాట్లాడి దగ్గులనవ్వుతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
నా పని శేషాచలం శ్లేష్మంలో పడ్డ ఈగలా ఉంది. వాడికి కొడుకు హర్ష గురించి ఏం చెప్పడం? ఎలా చెప్పడం? అనే సందిగ్ధం-కబుర్లన్నీ వాడే చెబుతున్నాడు.
సాయంత్రం, ఇద్దరం బీచికి వెళ్లాం. సముద్రంకేసి చూస్తూ కాస్త ధైర్యం తెచ్చుకుని, గుండె నిబ్బరించుకుని, మెల్లగా హర్ష హెల్తు గురించి చెప్పాను.
శేషాచలం శేషరహితంగా చలించిపోయాడు. చిన్నపిల్లాడిలా ఏడిచాడు. సముద్రపు హోరులో భోరుమన్నాడు.
“ఫర్వాలేదు. ఎర్లీగా డయాగ్నోస్ చేశారు. ట్రీట్మెంట్ తో పూర్తిగా నయమవుతుందన్నారు” దొంగ ధైర్యం చెప్పాను. ఆశగా చూస్తూ నన్ను నమ్మాడు. గిల్టీగా ఫీలయ్యాను. తర్వాత హర్ష పెళ్లి గురించి ప్రస్తావించడం కాస్త సులభం అనిపించింది.
హర్ష ఎవర్నో ప్రేమించాడని చెప్పకుండా – నేనే ఎవర్నో చూసి పెట్టానని బొంకాను. అదీ నమ్మాడు. ప్రాణప్రదంగా ప్రేమించే మిత్రుడిని మోసం చైడం ఎంత సులభం! కానీ నా రెండు అబద్దాల్లో నిజాలున్నాయి. అవి నా ప్రాణమిత్రుడికి ప్రాణం పోషించే నిజాలు.
ఎదురుగా నురగల మధ్య ఆకుపచ్చని కెరటాలు అరిటాకుల్లా మడతపడుతూ చిరిగిపోతున్నాయి.
ఆ రాత్రి శేషాచలం మళ్లీ తాగాడు. కొడుకు మీది బెంగతో- బిందువుతో మొదలెట్టి సింధువయ్యాడు.
నేను లండన్ తిరిగొచ్చే ముందు, ముంబయి ఫ్లైట్ ఎక్కేటప్పుడు శేషా చలం వైజాగ్ ఎయిర్‌పోర్టుకి వచ్చాడు. “పెళ్లి కాస్త పోస్టన్ చెయ్యి. హర్షకి కాస్త నయం కానీ” అమాయకంగా అనిపిస్తూ అన్నాడు.
“నువ్వేరా వాడికన్నీ. నేను కూడా జర్నీ ఫిక్స్ చేసుకుని నీ వెనకాలే లండనొస్తా. వచ్చే ముందు ఫోన్ చేస్తాలే. జాగర్తగా వెళ్లు” వీడ్కోలు చెప్పాడు.
విమానం ఎక్కి విండో సీట్లోంచి చూశాను. విజిటర్స్ గ్యాలరీలోంచి శేషాచలం చెయ్యూపడం కనబడింది. ఎగురుతూంటే ఎంతో పెద్ద వైజాగ్ నగరం అంతా చిన్నదై మేఘాల మడుగయిపోయింది. నేను ఇంకా బాగా చిన్నవాడినయినట్టు చిన్నతనంగా ఫీలయ్యాను.
ముంబయి చేరి పెద్ద విమానం ఎక్కాను. ఫ్లైటంతా ఖాళీ, ట్రావెల్ ఏజంట్లు, ఎయిర్లైన్సువారు ఎప్పుడూ అన్ని సీట్లూ ఫుల్ అంటారు. మరి ఫ్లైటంతా అంత ఖాళీగా ఎందుకుందో అర్ధం కాలేదు.
విమానం విహంగించే ముందు ఓ చక్కటి పిల్ల ప్రమాదం జరిగితే ఏవేం జాగర్తలు తీసుకోవాలో కూచిపూడి నాట్యం చేస్తూ వ్యక్తపరిచింది. తర్వాత సదుపాయ సమర్పణలయ్యాక ఆ పిల్ల అటూ ఇటూ చూసి ఖాళీగా ఉందని, వచ్చి నా పక్కసీట్లో కూర్చుంది.
ఆమె కళ్లు తెలుగు పిల్లవిలా ఉన్నా, ఆమె కలరు తెల్లపిల్లదిలా ఉంది. కట్టుకున్న చీరె – యూనిఫారం అనుకుంటా – కదలికలు ఇంగ్లీషు పద్ధతిలో వున్నాయి. బహుశా ఆమె తల్లో, తండ్రో ఒకరు ఇంగ్లీషేమో! ఈ పిల్ల హర్షని చేసుకుంటే వాడికెంత ఊపిరిపోసునో కదా! అనుకున్నా గానీ ఈ ఆలోచన ఇరువైపులా న్యాయం కాదనిపించింది. తనే పలకరించింది – “లండన్?”
“యస్” అన్నా
నా మస్తిష్కంలో ఆలోచనలు చిందరవందరగా తిరుగుతున్నాయి. ప్రశ్నలు వేధిస్తున్నాయి. హరగురించి ఏం చేస్తావని బాధిస్తున్నాయి. నా మూడ్ బాగా లేదు. ఆ పిల్లకి తెలిసిపోయినట్టుంది. అంది, “ఏవిటిలా డల్ గా వున్నారు? ఒంటరి ప్రయాణం బోరేలెండి” అచ్చమైన తెలుగులో మాట్లాడితే అచ్చెరువు కలిగింది.
“మీరు తెలుగా?” అన్నా.
“ఆఫ్ కోర్స్” అని ఇంగ్లీషులో రిషీకరించింది.
మళ్లీ అన్నా – “నేను తెలుగు వాడినని ఎలా పసిగట్టారు?”
“వెరీ సింపుల్. మీ చేతిలో ఆత్రేయ రాసిన పుస్తకం. మీ పక్క మీ పేపర్ కారియర్ బ్యాగ్ మీద” అన్ని పుస్తకాలకు అలవాలం – ఆలపాటి అన్నమయ్య చౌదరి పుస్తకాల షాపు” అని క్లియర్ గా రాసుంది” అంది.
నా మతిమరపుకి నవ్వొచ్చింది. ఆ పిల్ల చురుకుదనానికి నా మది మెచ్చింది. “పేరు అడగొచ్చా ?” అన్నా.
“ష్యూర్-రాణి” అంది. తెలుగు రాణీలాగే ఉంది కూడా.
“మీ పేరు?” అడిగింది. చెప్పాను.
నెమ్మదిగా కబుర్లలో పడ్డాం. కంప్యూటర్ల దగ్గర్నుంచి కనీసం పూట కూడా అన్నం తినని అందరి గురించీ అనేకం మాట్లాడాం. నేను మాట్లాడుతున్నాను గానీ – నా అంతరంగంలో ఆలోచనలు వేరేగా పేరుకుంటున్నాయి. .
గంటలు గడుస్తున్నాయి. గాలిలో కలుస్తున్నాయి. రాణీ అంది. “మీ పేరు టూ లాంగ్. అంకుల్ అని పిలవచ్చా?”
“ఐ లవిట్” అన్నా. తను కిలకిలా నవ్వింది.
ఆకాశగంగ సెలయేరై ఉల్కల మీంచి ఉరుకుతున్నట్టు ఇందాకటి ఆలోచన – హర్ష గురించి తప్పనుకున్నా. హర్ష ప్రేమించిన ఉషదే కాదు. వాణ్ణి కట్టుకుంటే ముత్యంలాంటి ఈ రాణి బ్రతుకూ హత్యే.
ఇందులో వాడి తప్పేవిటి? క్యాన్సరు వాణ్ణి కంగారుగా తినేస్తుంది. వెళ్లగానే ఏం చెయ్యాలో తెలీడం లేదు. వాడికి ధైర్యం చెప్పాలి. ఆరోగ్యం గురించి కాదు. ఆ విషయంలో వాడు ధైర్యాన్ని వ్యక్తపరిచాడు.
మరి దేనికి? తను ప్రేమించిన ఉష కోసం బెంగెట్టుకుని వుంటాడు. నో-ఉషకి తనగురించి చెబుతానన్నాడు. ఈ పాటికి చెప్పే ఉంటాడు.
పాపం! ఆ వెర్రిపిల్ల ఎంత తల్లడిల్లిపోయిందో, వెళ్లగానే ఉషను కలిసి నేనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇలాంటి అప్రత్యాశితమైన అవస్థను నేను ఎప్పుడూ అనుభవించలేదు. ఎదుర్కోనూ లేదు.
రెక్కలూపని విమానం రెస్టులేకుండా ఎగురుతోంది. రాణీ ఇద్దరికీ కోక్ తెచ్చింది. ఇప్పుడు నా పక్క సీట్లో కొచ్చి కూర్చుంది. చిల్లర పనులన్నీ తన కొలీగు పురమాయించేసి, దగ్గరగా కూర్చుని దగ్గరైన ఈ రాణిని సలహా అడిగితే? ఎలా అడగడం? – నాకంటే చాలా చిన్న పిల్ల. కానీ తెలివైనది. అయినా నా వ్యక్తిగత సమస్యలు ఎందుకూ తనతో చర్చించడం? మరి మార్గం తోచడం లేదే. ఎందుకో స్వల్ప వ్యవధిలో రాణీ అవధిమీరిన ఆత్మబంధువై పోయింది. నా మనసిక వెనుకాడలేదు.
“రాణీ – తెలుగు సాహిత్యం చదువుతూంటే, ఐ మీన్ మంచి పుస్తకాలుహుషారు కలిగిన అప్పుడప్పుడు నాకూ రాయలనిపిస్తుంది”.
“దట్స్ గ్రేట్. వై డోంట్యూ ట్రై?”
“ప్రయత్నించాను. ఓ కథ కూడా ఆలోచించాను. కానీ రాసేముందే, ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నువ్వు సాల్వ్ చేయగలవా?”
“ఐ విల్ ట్రై”
“అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. కానీ అబ్బాయికి అనుకోకుండా హెల్తు పాడవుతుంది. అది తొందరగా ప్రాణం తీసే వ్యాధి. అమ్మాయికి తెలుస్తుంది. అబ్బాయికి హెల్త్ పాడైందని తెలిసినప్పటికీ పర్లేదనుకోవాలా?” తడబడుతున్నా తెలివిగా అడిగాననుకున్నాను. రాణీ వెంటనే సమాధానం చెప్పింది.
“వెరి సింపుల్. ఆ అమ్మాయి ఆ అబ్బాయినే చేసుకోవాలి. ఇటీజ్ నథింగ్ టు డు విత్ హిజ్ హెల్త్”
“మరి అబ్బాయి చనిపోతే – ఆ అమ్మాయి జీవితం?”
“చూడండి అంకుల్! ప్రేమకథలు సాఫీగా నడవ్వని షేక్స్పియర్ ఏనాడో చెప్పాడు” రాణీ ఇంకా చెప్పింది.
“అయినా నిజమైన ప్రేమకు శరీరం ఒక్కటే ముఖ్యమని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రేమ అనేది రెండు మనసుల్ని ఏకం చేసే దైవస్వరూపం. బై ది బై మీకు దేవుడంటే నమ్మకం ఉందా? డు యు బిలీవ్ ఇన్ గాడ్?”
“ఉంది. బాగా వుంది. అందరికీ దేవుడు కావాలి. అయితే దేవుణ్ణి కొందరు స్మరిస్తారు”.
“రైట్. అయితే మీ కథలో ఆ అబ్బాయికి ఏవైనా సరే – వాళ్ల ప్రేమ కొనసాగవలసిందే”
“రాణీ! అన్ని ప్రేమలూ పెళ్లికి దారితీయట్లేదు కదా. కథ పెళ్లిదాకా రానీయకుండా వదిలేస్తే?”
“దట్స్ మీన్- అంటే ఆ కథ కంచికి చేరలేదన్న మాట. అంకుల్! కంచికి చేరిన కథే మంచికథ, మీరు రాస్తే మంచి కథ రాయండి. లేకపోతే మానేయండి. వాటీజ్ ది బిగ్ డీల్?” అడిగింది రాణి.
“రాణీ! అసలే కథ. అందులో ప్రేమకతలు అనేకం. ఎవరు పట్టించుకుంటారు? అదీగాక, అంతా ప్రేమ గుడ్డిదంటారు తెలుసా?”
“ప్రేమ గుడ్డిదయితే, పెళ్ళి కళ్లు తెరిపించేది. ప్రేమకి పెళ్లే రమ్యమైన గమ్యం” రాణీ ఉంగరంలేని తన వుంగరం వేలు నిమురుకుంది.
విమానం లండన్ హీత్రోలో వాలింది. రాణీని మళ్లీ కలుస్తానన్నాను. నా టెలిఫోన్ నెంబరు తీసుకుంది. అంది “ఇట్స్ నైస్ టాకింగ్ టు యు ఫర్ సో లాంగ్ అంకుల్! నేనెప్పుడూ ఈ ఫ్లైట్ లో అటూ ఇటూ ఎగురుతూనే వుంటా. ఎప్పుడో ఒకసారి మీ దగ్గర వాలి మళ్లా కబుర్లు చెప్తాలెండి. బై!” చిరునవ్వుతో రాణీ నాకు వీడ్కోలు చెప్పింది. ముత్యాల కోసం సముద్రగర్భంలో ఎందుకు వెదుకుతారో నాకర్థం కాలేదు.
ఎయిర్‌పోర్టు వదిలి రోడ్డు మీదికొచ్చి, ఆకాశంలోకేసి చూశాను. ఎంత ఎత్తునుండి ఎంత క్రిందకు
దిగిపోయానో తెలిసింది. అర్జంటుగా హర్షను చూడాలి.
ఇంటికి, అదే నా ఫ్లాటకు, వెళ్లి లగేజ్ పడేసి తొందరగా తయారై హర్ష ఎడ్మిట్ అయిన హాస్పిటలుకి వెళ్లాను. డాక్టర్లు హడావుడిగా నడుస్తున్నారు.
పేషెంట్లు ఆయాసంగా నడవలేకపోతున్నారు. డాక్టర్ల కంటే ఎమర్జన్సీ లున్నట్లు కంగారుగా, గంతులు వేస్తూ కదిలే నర్సులూ, వానర్సులా అనిపించారు.
హర్ష వున్న రూములోకి ప్రవేశిస్తోంటే, కర్టెస్ స్టాండు వెనక బెడ్ దగ్గర్నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో? నేను హర్ష బెడ్ సమీపిస్తూనే షాక్ అయ్యాను. అవే కళ్లు అదే చీర, ఆమె – రాణీ.
నన్ను చూసింది. పేలవంగా “మళ్లీ కలిశాం. ఇది చాలా చిన్న ప్రపంచం అంకుల్” అంది.
నా వైజాగ్ ప్రయాణం జరిగిన కాసిని రోజుల్లోనూ, హర్ష బాగా శుష్కించిపోయాడు. ముఖంలో జీవకళ లేదు. కళ్లల్లో తడి, గుండెలో బెంగ, గొంతులో గద్గదం, పలకబోతే కంగారు – ఇదీ నా అవస్థ. హర్షతో ఎలాగో మాట్లాడగలిగాను. “హర్షా! నాకు కొడుకుని కని, పెంచే అవకాశం నా జీవితంలో కలగకపోయినా, నా సొంత కొడుకుని పోగొట్టుకుంటున్నట్టుగా వుందిరా” అని వాడి లోతైన కళ్లలోకి చూస్తూ నిశ్చలుడినయ్యాను.
హర్ష ఆ కళ్లతోటే నాకేసి ఆప్యాయంగా చూశాడు. వాడి చేతిలో రాణి చెయ్యి వుంది. రాణీ చేతిని నొక్కడానికి ప్రయత్నిస్తూ “డాడ్! నే చెప్పానేఉష షి ఈజ్ ది వన్ – తనే” గొణుగుతున్నట్లు పరిచయం చేశాడు.
రాణీ అంది “దట్స్ రైట్. పూర్తి పేరు ఉషారాణి అంకుల్! హర్షా! అంకుల్, నేనూ ఆల్రెడీ ఫ్రెండ్స్. సేమ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేశాం రిటర్న్ లోనే. అంచేత అంకుల్ ని ఆకాశంలోనే కలిశాను” మళ్లా అంది హర్పకేసి చూసి,
“నిన్ను కూడా ఆకాశంలోనే కలుస్తాలే”
హర్ష అనగలిగాడు “ఉషా! నాకో మాటిస్తావా?”
రాణీ “చెప్పు”
“నా ప్రాణం పోయేదాకా నన్నిలాగే ప్రేమిస్తూ ఉంటానని”
“నో” రాణి అంది.
నాకు ఆశ్చర్యం! హర్ష ముఖంలో అర్థం కానట్టు ప్రశ్నార్ధకం.
రాణీ వెంటనే అంది “ఓయ్ పిచ్చి హర్షా! నీ ప్రాణం కాదు. నా ప్రాణం పోయేదాకా నిన్ను ప్రేమిస్తాను. సరేనా. ఓ.కే”. హర్ష ముఖంలో వెలుగు, నా మనసులో దిగులు.
ఇంతలో కాస్తంత అంతరాయం.
ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కోసం నర్సులు వచ్చి, మమ్మల్ని బైటకు నడిచి వెయిట్ చైమన్నారు.
కారిడార్‌లో రాణీకేసి చూశాను. ఆమె అటువేపు తిరిగి వుంది. దగ్గరకు నడిచి, సముదాయంగా తాకబోయాను. రాణీ కదిలింది. అప్పుడు ఆమె పమిట కొంగు జారి నా వేళ్లమధ్య ఆగింది.
రాణీ నావైపు తనతల సగం తిప్పింది. ఆమె పెద్దకళ్లల్లోంచి రెండు ధారలు చెక్కిళ్లమీంచి ఆమె గుండెల మీదికి జారేయి. నా కవి ఆమె గుండెల్ని కాటేసే కన్నీటి సర్పల్లా కనిపించేయి.
అలా తను నాకు కనబడటం అయిష్టమై అనుకుంటా – ఆయాచితంగా తన అరచేయి నాకేసి తెరిచింది. తను ఫైట్లో నిమురుకున్న ఉంగరంలేని ఆమె ఉంగరం వేలు ధగధగా మెరిసింది. నేను నా చెయ్యి వెనక్కి తీసుకుని అక్కణ్ణుంచి కదలబోయాను.
“అంకుల్!” వెనక్కి తిరిగా.
“మా పెళ్ళికి మీ హెల్పు కావాలి. సింపుల్ గా చాలు. రోజెస్, రింగూ నేను సెలెక్టుచేసి తెచ్చుకుంటా. మంగళసూత్రం మాత్రం మీరు తేవాలి”
అచంచలమైన ఆమె ఆత్మశుద్ధికి నేను చలించాను. అపారమైన ఆమె ధైర్యానికి నేను తలవొంచాను.
“ష్యూర్” అని హామీ యిచ్చి అక్కణ్ణించి కదిలాను. చీకటి పడుతుంది.
అలా పడుతున్నప్పుడు దెబ్బలు మాత్రం చీకటికి తగలట్లేదు. నాకు తగుల్తున్నాయి.
హర్షకీ! ఏమో! రాణీకి? ఇంకా ఏమో?
ఈ మనోగాయం నా లండన్ స్మృతుల్లో చిరస్మరణీయ బాధామధుర గేయంగా నిలిచిపోతుంది. పైకి చూస్తే ఆకాశంలో అపురూపంగా మెరిసే ఒంటరి నక్షత్రం.
ఇంకా నడిచా – నాలుగడుగుల్లో నాకెదురుగా “డ్రాప్ ఇన్” (Drop Inn) అనే పెద్దక్షరాలు ఇంగ్లీషులో చూపించుకుంటున్న “పబ్” (Pub) కనబడింది.
ఏవిటో! ఎటు తిరిగినా నాకు చుక్కెదురే.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *