May 1, 2024

ప్రాయశ్చితం – 2

రచన: గిరిజారాణి కలవల

గెలుపు… గెలుపు…. గెలవాలి… తానే గెలవాలి. మరెవరూ గెలవకూడదు. అది ఆట అయినా, చదువు అయినా ఏదైనా సరే తనే మొదటి స్థానంలో వుండాలనుకునేవాడు సురేంద్ర.
ఒకసారి స్కూల్లో పరుగుపందెంలో, తన క్లాస్ మేట్ రాజేష్ తనని దాటి ముందుకు వెళ్ళి మొదటి బహుమతి పొందడం, సురేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. ఇంటికి వచ్చాక అన్నం కూడా తినకుండా ఏడుస్తూ కూర్చున్నాడు. సంగతి తెలిసిన తండ్రి, సురేంద్రని దగ్గరకు తీసుకుని, “ఇంతదానికి నువ్వు ఏడిస్తే ఎలా? మునుముందు నీ జీవన ప్రయాణంలో మరెన్నో పరుగు పందాలు వుంటాయి. అన్నిటిలోనూ గెలవలేక పోవచ్చు. అంతమాత్రాన నిరాశ పడకూడదు. మరో ప్రయత్నం చేయాలి. గెలిచే దాకా ప్రయత్నం, పట్టుదల వీడకూడదు. ఈ సాలెపురుగు చూడు, ఎంత నైపుణ్యంతో చక్కని గూడు అల్లుకుందో? ఈ నేర్పరితనం వెనక అది ఎంత కష్టపడుతోందో తెలుసా? ఎన్నో సార్లు జారి పడిపోతుంది. అయినా కూడా సన్నని దారపు సహాయంతో పైకి ఎగబాకి తిరిగి గూడు నిర్మాణం చేసుకుంటుంది”.
నాన్న చెప్పిన ఈ మాటలు సురేంద్ర మనసులో బాగా నాటుకుపోయాయి. తానూ అలాగే పట్టుదలతో జీవితంలో పైపైకి ఎగబాకాలని, ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అప్పుడే స్ధిర నిర్ణయం తీసుకున్నాడు.
అప్పటినుంచి ఇటు చదువులోనూ, అటు ఆటల్లోనూ కూడా గెలవాలనే కృతనిశ్చయంతో పట్టుదలతో ప్రయత్నం చేసేవాడు. సాధించేవాడు.
సురేంద్ర తండ్రి రాజయ్య పెద్దగా చదువుకోలేదు. ఉన్న రెండెకరాల పొలం సాగు చేసుకునే చిన్నపాటి రైతు. సురేంద్ర పుట్టిన నాలుగు సంవత్సరాలకే రాజయ్య భార్య అనారోగ్యంతో మరణించింది. అప్పటినుంచి, సురేంద్రకి, తల్లి తండ్రి తానే అయి పెంచాడు రాజయ్య. పిల్లాడికి తల్లి లేని లోటు తీరుతుంది మళ్లీ పెళ్లి చేసుకోమని బంధువులందరూ అంటున్నా కూడా, ససేమిరా ఒప్పుకోలేదు. వచ్చే ఆమె తనకి భార్య అవుతుంది కానీ, సురేంద్రకి తల్లి మాత్రం అవదు అని అనేవాడు రాజయ్య. కొడుకు మీద తన పంచప్రాణాలు పెట్టుకుని పెంచాడు.
సురేంద్రకి చదువు మీద తగని మక్కువ. స్కూల్లో మాష్టర్లు కూడా అతని ఆశక్తిని గమనించి, ఎట్టి పరిస్థితుల్లోనూ సురేంద్ర చదువు ఆపనీయొద్దని రాజయ్యకి చెప్పడంతో, తన శక్తికి మించినదైనా, సురేంద్ర ఆశలు నెరవేర్చాలని పట్నంలో మంచి కాలేజీలో చేర్పించాడు. రెక్కలు ముక్కలు చేసుకుని చేసే వ్యవసాయంలో వచ్చే రాబడి, కొడుకు కాలేజీ ఫీజులకు సరిపోకపోవడంతో, నమ్ముకున్న భూమిని కూడా అమ్మేసి, కౌలు రైతుగా మారిపోయాడు రాజయ్య.
సురేంద్ర చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. తండ్రి పడుతున్న కష్టం తెలుస్తోంది కానీ… తన ఆశలు, ఆశయాల వెనక ఆ కష్టాన్ని కప్పి పెట్టేసాడు.
ఇంకా పెద్ద చదువులు అంటూ… తండ్రి రెక్కల మీదుగా రెక్కల విమానం ఎక్కి ఎగిరిపోయాడు. తన కలలన్నిటినీ సాకారం చేసుకున్నాడు. కానీ… అవన్నీ ఆకారం దాల్చడానికి కారణమయిన తండ్రిని మాత్రం మర్చిపోయాడు.
అమెరికాలో చదువు అనంతరం అక్కడే మంచి ఉద్యోగంలో స్ధిరపడ్డాడు. తనతో పాటు ఉద్యోగం చేస్తున్న ఉదయతో అయిన పరిచయం తర్వాత ప్రణయంగా మారడం అది పరిణయానికి దారి తీయడం జరిగింది.
హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన వినోద్ ఏకైక కూతురు ఉదయ.
సురేంద్ర వెనక ఆస్తిపాస్తులు లేకపోయినా, అమెరికాలోని అతని చదువు, చేస్తున్న ఉద్యోగం, అందచందాలు అన్నిటికీ మించి తన కూతురు మోజు పడుతోందని, వినోద్ కూడా ఉదయ, సురేంద్రల వివాహానికి కాదనలేదు.
పల్లెటూరు, మట్టివాసన గిట్టని ఉదయ, తన భర్త ఆలోచనలల నుంచి కూడా రాజయ్యని తప్పించేసింది. అంతకుముందు అడపాదడపా తండ్రితో మాట్లాడే సురేంద్ర పెళ్ళి తర్వాత అదీ మానేసాడు.
ఉన్నత చదువులు, విదేశంలో మంచి ఉద్యోగం, ఆ తర్వాత కోరుకున్న అమ్మాయి తో పెళ్ళి ఇలా అంచెలంచెలుగా సురేంద్ర జీవిత ‘ప్రయాణం’సాగిపోసాగింది.
ఈ ప్రయాణంలో తన పల్లెటూరు, తన తండ్రి నెమ్మదిగా కనుమరుగైపోయారు. కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
***
ఇలా గతంలోకి సాగిన సురేంద్ర ఆలోచనలని భంగపరుస్తూ, సమీపంలోనుండి, మాటలు వినపడి, అటుచూసాడు.
సుమారు డెబ్భై సంవత్సరాల వయసున్న వ్యక్తి ఫోనులో మాట్లాడుతూ కనిపించాడు. తెలుగువారు కాబోలు,
“హలో! విశ్వం! ఎలా ఉన్నావురా? నేను కులాసానే ఉన్నాను. ” అంటూ వినపడేసరికి, అసంకల్పితంగా సురేంద్ర చెవులకి ఆ మాటలు వినవచ్చాయి.

సశేషం

1 thought on “ప్రాయశ్చితం – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *