May 4, 2024

అమ్మమ్మ – 48

రచన: గిరిజ పీసపాటి

వెంటనే గిరిజ కాలిక్యులేటర్ ముందేసుకుని లెక్క చూసి ఐదు వందలు జీతం, రెండు రోజులు సెలవు పెట్టనందుకు అదనంగా ముఫ్ఫై మూడు రూపాయలు ఇచ్చినట్టున్నారమ్మా!” అంది.
“నీకెమన్నా మెంటలా? జాయిన్ అయి రెండు నెలలు కూడా కాలేదు! అప్పుడే జీతం పెంచుతారా ఎవరైనా?” అని వసంత అడగడంతో ఆరోజు షాప్ లో జరిగినదంతా చెప్పింది.
అంతా విన్న నాగ “ఆయనకు నీ వర్క్ నచ్చి జీతం పెంచితే సంతోషించాల్సిన విషయమే. కానీ మన కుటుంబ పరిస్థితికి జాలి పడో, లేక నిన్ను టెస్ట్ చెయ్యడానికో ఎక్కువ జీతం ఇచ్చారేమో? కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది” అంటూ ఎక్కువ ఇచ్చిన డబ్బు తిరిగి కవర్ లో పెట్టేసి “భోజనం చేసి వెళ్ళగానే తిరిగి ఆయనకు ఇచ్చెయ్!” అంది.
“కిందటి నెలా ఇలాగే జరిగింది. పెంచినట్లయితే చెప్పి ఇవ్వొచ్చుగా. మనకీ గుండుగుమ్ముల అనుమానం ఉండేది కాదుగా!” అంటున్న వసంతతో “నీకన్నిటికీ కోపమే. ముందు భోజనాలు వడ్డించు” అన్న తల్లి మాటలకు “సాయం చేద్దువు రా!” చెల్లెలితో అంటూ మూతి ముడుచుకుని, ధుమధుమలాడుతూ వంటగదిలోకి వెళ్తున్న అక్కని నవ్వుకుంటూ అనుసరించింది గిరిజ.
మధ్యాహ్నం షాప్ కి వెళ్ళేసరికి మహవీర్ గారు కేష్ కౌంటర్ లో కూర్చుని కనిపించారు. హాండ్ బ్యాగ్ లోంచి కవర్ తీసి మహవీర్ గారికి ఇస్తూ “అన్నయ్య గారు పొరపాటున శాలరీ ఎక్కువ ఇచ్చారు సర్!” అంది గిరిజ.
ఆయన ఆ కవర్ అందుకోకుండా “అన్నయ్య గారు భోజనానికి వెళ్ళారు. ఆయన వచ్చాక ఆయనకే ఇవ్వండి” అనడంతో… కవర్ ని తిరిగి బ్యాగ్ లో పడేసి, తన వర్క్ చూసుకోసాగింది.
గణేష్ గారు షాప్ కి రాగానే చిన్నగా నవ్వుతూ గిరిజ దగ్గరకు వచ్చి “నీ శాలరీ పెంచాను చూసుకున్నావా?” అని అడగడంతో “మా అమ్మగారు చూసారు సర్! మా ఇంటి పరిస్థతులకి జాలి పడి పెంచినట్లైతే ఆ అమౌంట్ మీకు రిటర్న్ చెయ్యమని చెప్పారు” అంది ఆయన ఏమనుకుంటారోనని టెన్షన్ పడుతూనే.
“అలా అని ఎవరు చెప్పారు? నీ ప‌ని కాకపోయినా అకౌంట్స్ పని కూడా చూస్తున్నందుకు పెంచాను. అది సరే… చాక్లెట్ తిన్నావా?” అడిగారు.
“చాక్లెట్ ఏంటి సర్!?” అంది అయోమయంగా.
ఆయన గిరిజ పెన్సిల్ బాక్స్ ఓపెన్ చేసి, అందులోంచి 5 స్టార్ చాక్లెట్ బార్ తీసి గిరిజకు ఇస్తూ “నువ్వు లంచ్ కి ఇంటికి వెళ్ళగానే పెట్టాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని” అన్నారు నవ్వుతూ.
“నాకొద్దు సర్!” అంది తీసుకోకుండా ఇబ్బంది పడుతూ. “పిల్లలు అడిగితే కొన్నాను. నువ్వూ చిన్నపిల్లవేగా. అందుకే నీకొసం ఒకటి ఉంచాను. ముందు తిని పని చేసుకో” అంటూ రేపర్ విప్పి మరీ గిరిజ చేతిలో పెట్టి, బిల్స్ తను టైప్ చెయ్యసాగారు.
గిరిజ చాక్లెట్ తినడం పూర్తవగానే “గుడ్. ఇక మీద నువ్వు ఎక్స్ట్రా పని చేసినప్పుడల్లా నీకు ఒక చాక్లెట్ ఇస్తాను” అంటూ వెళ్ళి తన సీట్ లో కూర్చున్నారు.
రాత్రి ఇంటికి వెళ్ళి జీతం పెంచి ఇచ్చిన విషయంతో పాటు, తనకి పెద్ద చాక్లెట్ బార్ కూడా ఇచ్చిన విషయం చెప్పింది గిరిజ. అందరూ ‘మంచి బాస్ దొరికారు నీకు’ అని సంతోషించారు.
ఇది జరిగిన పదిహేను రోజులకి గిరిజ పుట్టినరోజు కావడంతో, ముందురోజు “రేపు ఒక గంట లేట్ గా వస్తానని చెప్పు. గుడికి వెళ్ళి, దేవుడికి దండం పెట్టుకున్న తరువాత షాప్ కి వెళ్దువుగాని” అన్న తల్లి మాటలకు ‘సరే’నన్నట్లు తల ఊపింది.
తల్లి చెప్పినట్లే ఆరోజు రాత్రి ఇంటికి వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ “రేపు ఉదయం ఒక గంట లేట్ గా వస్తాను సర్” అంది గణేష్ గారితో.
“బాధ్యతగా పని చేస్తున్న నువ్వే పర్మిషన్ అంటే ఎలా!? ఉదయం అకౌంట్స్ వర్క్ చెయ్యాలి కదా! రేపటి పని ఆదివారం నాడు చేసుకో!” అన్నారు కొంచెం చిరాగ్గా.
“సరే సర్!” అంటూ చేసేది లేక బయలుదేరింది. నాలుగడుగులు వేయగానే వెనుకనుండి “గిరిజా! ఒక్క నిముషం” అంటూ ఆయన పిలుపుకి వెనుదిరిగి చూసింది.
ఆయనే రెండంగల్లో గిరిజ దగ్గరకు వచ్చి “ఏదో చిరాకులో ఉన్నాను. ఎప్పుడూ పర్మిషన్ గానీ లీవ్ గానీ అడగని నువ్వు అడిగావంటే తగిన కారణం ఉండే ఉంటుంది. ఏంటి పని? తెలుసుకోవచ్చా!?” అంటూ అడిగారు.
“పెద్ద పనేం కాదు సర్. నేను రోజూలాగే వచ్చేస్తాను” అన్న గిరిజతో “సారీ తల్లీ! విషయం ఏంటో చెప్పు” అడిగారు.
“రేపు నా పుట్టిన రోజు సర్. గుడికి వెళ్ళాలని అమ్మ చెప్పారు. అందుకే అడిగాను. గుడిలో రష్ లేకపోతే టైమ్ కే వచ్చేస్తాను సర్” అంది.
“ఓహ్! అడ్వాన్స్ బర్త్ డే విషెస్ టూ యూ! నువ్వు హాపీగా గుడికి వెళ్ళి రా!” అన్నారు ప్రసన్నంగా.
‘ఈయన మూడ్ ఎప్పుడెలా ఉంటుందో ఆ దేవుడికైనా తెలుసో, లేదో’ మనసులో అనుకుంటూ ఇంటిముఖం పట్టింది.
ఇంటికి వెళ్ళేసరికి తల్లి మిషన్ కుడుతూ కనిపించింది. ‘ఇంత రాత్రి వేళ అమ్మ మిషన్ మీద ఏం చేస్తోందా!’ అని కుతూహలంగా చూసిన గిరిజ కళ్ళకి, అమ్మ కి ఎంతో ఇష్టమైన, వాళ్ళ పెద్దన్నయ్య మద్రాస్ వెళ్ళిప్పుడు పసుపుకుంకుమలతో పెట్టిన ఆనంద బ్లూ కలర్ కి నేవీ బ్లూ కలర్ బోర్డర్ గల పట్టుచీరను చూడీదార్ కుడుతూ కనిపించింది.
“అదేంటమ్మా! నీకంత ఇష్టమైన చీర, అదీ పెద్ద మామయ్య నీకు పెట్టిన చీరని చూడీదార్ కుడుతున్నావు?” అంది బాధగా.
“ఇంట్లో కాస్త కొత్తగా ఉన్న చీర ఇదొక్కటే ఉంది గిరీ! రేపు నీ పుట్టినరోజు కదా? షాప్ కి పాత బట్టలు వేసుకుని వెళ్తే బాగోదు. అందుకే రేపు ఇది వేసుకో. ఏవేళైనా కుట్టేస్తాను. రేపు ఒకసారి ఇస్త్రీ చేస్తే సరిపోతుంది” అన్న తల్లి మాటలకు కళ్ళంట నీళ్ళు తిరిగాయి గిరిజకు.
ఆ రాత్రి చూడీదార్ కుట్టడం పూర్తయ్యేవరకు భోజనం చెయ్యనని, భోజనం చేస్తే కుట్టలేనని ఆవిడ భోజనానికి
రాకపోవడంతో, పిల్లలు ముగ్గురూ కూడా భోజనాలు చెయ్యకుండా తల్లి కోసం ఉండిపోయారు.
అర్ధరాత్రి దాటాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించుకుని మేడమీదకి వెళ్ళి హాయిగా పడుకున్నారు.
మర్నాడు ఉదయం అందరూ గిరిజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాక, కుంకుడుకాయలతో తలంటుకుని, రాత్రి తల్లి కుట్టిన చూడీదార్ వేసుకున్నాక తను ఎన్నడూ చూడని పెద్ద మామయ్య దీవెనలు అందుకున్నట్లు అనిపించింది గిరిజకి.
తల్లికి, అమ్మమ్మకి, అక్కకి కూడా కాళ్ళకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాక, అన్నపూర్ణ అంటీ, మూర్తి అంకుల్ కి కూడా పాదాభివందనం చేసి, వారి ఆశీస్సులు కూడా తీసుకుంది.
“త్వరగా గుడికి వెళ్ళిరా! ఈలోగా నేను స్వీట్ తయారుచేసి ఇస్తాను. షాప్ లో అందరికీ ఇద్దువుగాని” అన్న అక్క మాటలకు ‘సరే’ నని ఇంటికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడి పూజారి ఇంటికి వెళ్ళింది.
వాళ్ళ అమ్మాయి చంద్ర వసంతకి, గిరిజకి స్నేహితురాలే. వారి ఇంటిని ఆనుకునే ఉంటుంది పెద్ద ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి వారి పూర్వీకులు కట్టినదేనట.
దేవాదాయ శాఖ ఆ గుడిని స్వాధీనం చేసుకున్నాక చంద్ర వాళ్ళ నాన్నగారిని అర్చకులుగా నియమించారు. ఆయన కాలం చేసాక చంద్ర వాళ్ళ అన్నగారు ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు.
గిరిజను చూస్తూనే ఎదురొచ్చి విష్ చేసారు చంద్ర, వాళ్ళ వదిన. ఐదు నిముషాలు గడిచాక “ఒకసారి గుడికి వెళ్ళొద్దాం. సాయం వస్తావా?” అడిగింది చంద్రని.
“ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్ళడానికి కూడా సాయం కావాలా నీకు?” అని మేలమాడింది చంద్ర వాళ్ళ వది‌న. “దాని పరికితనం మనకి తెలీదా వదినా!?” అని వదినకు సమాధానం ఇస్తూనే “పద” అంటూ గిరిజతో బయలుదేరింది చంద్ర.
ఇద్దరూ గుడికి వెళ్ళాక, చంద్ర వాళ్ళ అన్నగారికి చెప్పి, గిరిజ పేరిట అర్చన చేయించి, ప్రసాదంతో పాటు ఒక కొబ్బరి చిప్ప కూడా ఇప్పించింది. చంద్రకి “థాంక్స్” చెప్పి, ఇంటికి వచ్చాక కొబ్బరి చిప్పను, ప్రసాదాన్ని అక్కకి అందించింది.
ప్రసాదం అందరి చేతికీ ఇస్తూ గిరిజ చేతికి కూడా ఇవ్వబోతుంటే “గుడిలో తినాలంటారని, అక్కడ తిన్నానక్కా” అంది. “తింటే తిన్నావులే. మన ఇంట్లో ఉన్నదేదో మనం నలుగురం కలిసి తిందాం” అంటూ ఇచ్చింది.

***** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 48

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *