May 1, 2024

విరించినై విరచించితిని… సిరివెన్నెల

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

చిత్రసీమలో చక్కటి పదలాలిత్యంతో, మధురమైన మాటలనే పాటలుగా మలుచుకుంటూ, చిన్న వయసులోనే పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిని వారి ఇంటి దగ్గర కలుసుకున్నాను. ఆయన గది ఒక సాహిత్యవనం లాగానే కనిపించింది. ఇంటినిచూసి, ఇల్లాలిని చూడమని సామెత. కాని ముందుగా ఇల్లాలిని చూశాకే ఇంటిని చూశాను. శ్రీమతి పద్మావతిగారు చక్కని ఆతిథ్యమిచ్చారు. “విరించినై విరచించితిని” మధురంగా మదిలో మెదులుతుండగానే చిరునవ్వుతో వచ్చారు సిరివెన్నెల. కబుర్ల కలబోతలోనే మా గోష్ఠి మొదలయింది.
ప్ర. చిత్రరంగంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా పరిచయమున్న మీ పూర్తి పేరు ఏమిటండీ?
జ. చెంబోలు సీతారామశాస్త్రి. ‘సిరివెన్నెల’ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి అందరూ అభిమానంతో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ని చేసేశారు.
ప్ర. మీరు మొదటగా ఏ చిత్రానికి చేశారు? మొదటి పాట ఏది?
జ. పాటల రచయితగా నా మొదటి చిత్రం శ్రీ కె. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’. మొదటిపాట ‘విధాత తలపున ప్రభవించినదీ’.
ప్ర. మీరు రచనలు చెయ్యటం ఏ వయసులో ప్రారంభించారు?
జ. 1971 నుంచీ సీరియస్‌గా వ్రాయటం ప్రారంభించాను, అంతకు ముందు చాలానే వ్రాశాను కాని పర్టిక్యులర్‌గా నోట్ డౌన్ చెయ్యలేదు.
ప్ర. మీరు పాట వ్రాశాక మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్ చేస్తారా? లేక వాళ్ళు ట్యూన్ ఇస్తే మీరు పాట రాస్తారా?
జ. సాధారణంగా 90 శాతం ట్యూన్ ఇచ్చి పాటలు రాయమంటారు. కొందరు పాట రాయించుకుని అప్పుడు ట్యూన్ చేస్తారు. కొందరు సిట్యుయేషన్ చెప్పి పాట రాయించుకుంటారు.
ప్ర. మీరు ఎన్ని చిత్రాలకు పాటలు వ్రాశారు? ఎన్ని పాటలు వ్రాశారు?
జ. దగ్గర దగ్గర మూడువందల చిత్రాలదాకా చేశాను. సుమారుగా ఎనిమిది వందల పాటలదాకా వ్రాసివుంటాను.
ప్ర. ఒక పాట వ్రాయటానికి మీకు ఎంత సమయం పడుతుంది?
జ. ఒక గంటలో వ్రాయవచ్చును. లేదా నెల కూడా పట్టవచ్చును.
ప్ర. ఇంత చక్కటి భావాలను అంత అందంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
జ. నాలో నిబిడీకృతమైవున్న ఒక అలౌకికమైన భావనను నాదైన బాణీలో చెప్పగలుగుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే దైవదత్తమైనదే.
ప్ర. మీరు నటులు కూడా అనుకుంటాను. ఏదో పిక్చర్లో చూశాను. మీరు నటిస్తూ పాడారు.
జ. ఒక్క ‘గాయం’ చిత్రంలోనే నటిస్తూ పాడాను.
ప్ర. మీరు ఎన్ని భాషల చిత్రాలకి వ్రాశారు?
జ. ఒక్క తెలుగులో తప్ప ఏ భాషకీ చెయ్యలేదు.
ప్ర. ప్రస్తుతం ఎన్ని చిత్రాలకి చేస్తున్నారు?
జ. దాదాపుగా పది, పదిహేను చిత్రాలదాకా చేస్తున్నాను.
ప్ర. చిత్రసీమలో పాటల రచయితగా మీ ముఖ్యమైన అనుభవం ఏమిటి?
జ. ఒకటని చెప్పటానికి లేదండి. కాకపోతే నా మొదటి పాటే చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది. శ్రీ విశ్వనాధ్ గారితో పాట చెయ్యటం, దానికి శ్రీహరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వాయించటం, ఆ పాట లిరిక్ కూడా ఎంతో అద్భుతంగా వుండటం మరిచిపోలేని అనుభవం.
ప్ర. మీరీ సినీ ఫీల్డ్ లోకి రాకముందు ఏం చేసేవారు?
జ. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని.
ప్ర. మీరీ ఫీల్డ్‌లోకి ఎలా ప్రవేశించారు?
జ. ఆకెళ్ళగారు నా గురించి శ్రీ విశ్వనాధ్ గారికి చెప్పారుట. నా మిత్రులైన ఆకెళ్ళగారి సలహాతో నేను విశ్వనాధ్ గారిని కలిశాను. వారు నా పాటలు విని ‘సిరివెన్నెల’ చిత్రంలో నా చేత పాటలు వ్రాయించి ప్రోత్సహించారు.
ప్ర. మీ ఫ్యూచర్ ప్లాన్స్?
జ. నాకు శక్తి వున్నంతవరకు పాట వ్రాయటానికే ఇష్టపడతాను.
ప్ర. ఈ రోజుల్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడుతున్నారనుకుంటాను?
జ టేస్ట్ ఛేంజస్ ఎకార్డింగ్ టు ది టైమ్. పూర్వం హార్మోనియం ఒక్కటే వాడేవారు. ఇప్పుడు బెటర్మెంట్ కోసం చాలా రకాల కొత్త ఇన్స్‌ట్రుమెంట్స్‌తో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
ప్ర. ప్రతీ పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందంటారు. మీ శ్రీమతిగారి సహకారం ఉందా?
జ. సహకారం మీకు ఉంటుందా? ఇందాకటినుంచీ చూస్తున్నారు కదా ఆవిడ అష్టావధానం! ఆమె పూర్తి సహకారం నాకుండబట్టే నిశ్చింతగా వ్రాసుకోగలుగుతున్నాను. అందుకే ఆమెని నా బెటర్ హాఫ్ అనను. నా జీవిత సహచరి అంటాను.
ప్ర. మీకు పిల్లలెందరు?
జ. ముగ్గురు. పెద్దది పాప శ్రీ లలితాదేవి. రెండోవాడు అబ్బాయి, వెంకట యోగేశ్వరశర్మ. మూడవవాడు రాజ భవానీశంకరశర్మ.

శ్రీమతి పద్మావతి గారిచ్చిన పండూ తాంబూలం తీసుకుని, ముచ్చటైన వారి సంసారం చక్కగా సాగాలని కోరుకుంటూ వీడ్కోలు తీసుకున్నాను.

***

సంగీతం ఎటువంటి క్రోధాన్నయినా నిర్మూలించగలుగుతుంది. – మహాత్మాగాంధీ
ఎంతటి క్రూర హృదయం వున్న భయంకరమైన వ్యక్తులనైనా శాంతింపజేసే గొప్పతనం ఒక్క సంగీతానికే వుంది. సంగీతం ఓ అద్భుతమైన మంత్రంలా పనిచేస్తుంది. మాయాజాలంలా సమ్మోహన పరుస్తుంది. – జేమ్స్ బ్రంస్టన్
పగిలి ముక్కలై చెదిరిపోయే హృదయానికి దివ్యమైన ఔషధం సంగీతం. – ఎం. హంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *