May 8, 2024

బాలమాలిక – ఎవరికి ఇవ్వాలి?

రచన: మంగు కృష్ణకుమారి

రమేష్, శుశ్రుత్, గౌతమ్, కిరీటిలు కూచొని గట్టి చర్చలు చేస్తున్నారు. వీళ్ళు నలుగురూ ఒకటే ఎపార్టమెంట్‌లో వేరు వేరు ఫ్లోర్స్‌లో ఉంటారు. ఒకటే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళ క్లాస్మేట్ కిరణ్ పుట్టినరోజు రెండురోజుల్లో ఉంది. వాడికి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు.
ఒకొక్కళ్ళూ ఒకొక్కటి చెప్పేరు.
“అది కాదురా… కిరణ్ అసలే చాలా డబ్బున్న వాళ్ళబ్బాయి. మనం ఇచ్చేది గ్రాండ్‌గా ఉండాలి” శుశ్రుత్ అన్నాడు.
మల్లాగుల్లాలు పడి, మంచి క్రికెట్ బేటూ, కీ ఇస్తే పైకి ఎగిరి, దిగే బేటరీతో నడిచే విమానం బొమ్మా, పట్టాలమీద బేటరీతో నడిచే రైలూ, మంచి కామిక్ పుస్తకాలూ తలా ఒకరూ కొన్నారు. కిరీటి మావయ్య వీళ్ళకి బజారుకి వచ్చి సాయం చేసేడు.
కిరణ్ జన్మదిన వేడుకలు గ్రాండ్‌గా జరిగేయి. నలుగురూ మిత్రులూ ఘనంగా తాము కొన్న బహుమానాలన్నీ కిరణ్‌కి ఇచ్చేరు. ఒక గుమస్తా వచ్చినవన్నీ పక్కన భద్రపరచసాగాడు.
వేడుకలు‌ ముగిసి, ఇంటికి వచ్చిన దగ్గరనించీ, నలుగురూ హేపీగా ఫంక్షన్ కబుర్లే. అప్పుడే వాళ్ళకి‌ మరో బర్త్ డే పార్టీ పిలుపు. ఇది వాళ్ళ ఎపార్టమెంట్ వాచ్‌మెన్ కొడుకు శ్రీనివాసుది. ఈ శ్రీనివాసుకి ఇద్దరు చెల్లెళ్ళు.
పిల్లలు సరదా పడుతున్నారని, నాలుగో ఫ్లోర్‌లో శ్రీలక్ష్మిగారు తమింట్లో శ్రీనివాసు చేత కేక్ కట్ చేయించాలని, ఎపార్టమెంట్ పిల్లలని సాయంత్రం పార్టీకి రమ్మంది.
రమేష్, శుశ్రుత్ విసుగ్గా మొహాలు పెట్టేరు. కిరీటి ఏడుపు మొహంతో, “మనం వెళ్ళక తప్పదురా, వెళ్ళకపోయేమా మా మావయ్యకి చాలా కోపం వస్తుంది. వీడికి ఏదో ఒకటి కొనాలి కాబోలు” అన్నాడు.
శుశ్రుత్ నిర్లక్ష్యంగా “మా ఇంట్లో ఓ పలక, పలకపుల్లల (బలపాల) డబ్బా ఉన్నాయి. అవి ఇచ్చేస్తే సరి” అన్నాడు.
ఇంచుమించు నలుగురూ అలాగే ఇంట్లో ఉన్న కారుబొమ్మా, పిల్లి, కుక్కల్లాటి బొమ్మలు గిఫ్ట్ పార్సిల్ చేసి శ్రీలక్ష్మిగారింటికి వెళ్ళి, శ్రీనువాసు కేక్ కట్ చేసినదాకా ముక్తసరిగా కూచొని, లాంఛనంగా వాడికి హేపీ బర్త్‌డే చెప్పేరు.
శ్రీలక్ష్మి గారు ప్లేట్లలో ఇచ్చిన కేక్ ముక్క, జిలేబీ, సమోసాలు ‘ఘుమ ఘుమ’లాడుతున్నా సరే, సగం తిని, సగం వదిలీసి, తాము తెచ్చిన కానుకలు శ్రీనివాసు చేతిలో పెట్టి వచ్చేసేరు.
శ్రీనివాసు, అతని చెల్లెళ్ళ ముఖాలు ఎంత వెలిగిపోతున్నాయో వాళ్ళ దృష్టిలో పడలేదు.
***
నాలుగు రోజులు గడిచేయి.
కిరీటి మామయ్య నలుగురు స్నేహితులనూ పిలిచేడు.
“ఒక్కసారి కిందకి వెళ్ళి చూడండి. శ్రీను చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో చూసి, పైకి రండి” అన్నాడు.
నలుగురూ కిందకి దిగేరు. శ్రీనివాసు చెల్లెళ్ళు ఇద్దరూ వీళ్ళు ఇచ్చిన బొమ్మలతో ఆడుతున్నారు. శ్రీనివాసు కారు బొమ్మకి తాడు కట్టి రయ్యిన లాగుతున్నాడు. వాళ్ళ ఊరి పేర్లు చెప్తూ, ‘తోవలోంచి లెండి’ అని అరుస్తున్నాడు.
వాళ్ళమ్మ వచ్చి “జాగ్రత్తర్రా పిల్లలూ… ఆటలు అవగానే బొమ్మలన్నీ దాచండి. పడీవద్దు. ముద్దుగా ఉన్నాయి బొమ్మలన్నీ. అయినా, శ్రీనూ! ఆటలు ఆపి, నువ్వు శుశ్రుత్ బాబు ఇచ్చిన పలకమీద అక్షరాలు దిద్దు. మళ్ళీ అన్నీ పెట్టెలో దాచండి సుమా!” అంటున్నాది.
నలుగురిలోనీ వాళ్ళకి తెలీకుండానే ఆనంద వీచికలు. తాము ఇచ్చిన చిన్న బహుమానాలతో, వీళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. సంతోషంగా మేడమీదకి వెళ్ళి మామయ్యతో చెప్పేరు.
మామయ్య వాళ్ళతో “చూసేరు‌కదా… ఈ పిల్లలు మీరిచ్చినవి ఎంత అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్నారో? మరి మొన్న కిరణ్ కి వేలకి వేలు పెట్టి గొప్ప బహుమానాలు కొని ఇచ్చేరు. అవి ఎలా ఉన్నాయో తెల్సా?” అన్నాడు.
రమేష్ చటుక్కున “ఈ సాదా బొమ్మలే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా… మరి కిరణ్ వాటిని ఇంకా బాగా చూసుకోడా?” అన్నాడు.
మామయ్య ముఖమ్మీదకు నవ్వు వచ్చింది. అతను కిరణ్ నాన్నగారి కంపెనీలో సూపర్వైజర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళుతూ ఉంటాడు.
“లేదు పిల్లలూ… మీరిచ్చిన నాలుగూ కాక, ఇంకొన్ని అలాటివన్నీ వాళ్ళ మామ్మ స్టోర్ రూమ్‌లో పడేసింది. ‘ఈ పిచ్చిపిచ్చివన్నీ అలా ఉంచండి. ఎప్పుడో ఒకప్పుడు వదిలించుకుందాం’ అంది కిరణ్ వాళ్ళ అమ్మానాన్నలతో. కిరణ్ కూడా వాళ్ళమామ్మ మాటలకి కిలకిలా నవ్వేడు”‌ మామయ్య చెప్పేడు.
నలుగురూ నిశ్చేష్ఠులయి ఉండిపోయేరు.
“ఏమర్రా… మీకు ఒక మంచిమాట చెప్తాను, వినండి. సహజంగానే ఎవరయినా, డబ్బున్నవాళ్ళకి ఖరీదైన బహుమానాలు ఇవ్వాలి అనుకుంటారు. పేదవాళ్ళు అనేసరికి ఒక చిన్నచూపుతో, ఏదో ఇంట్లో ఉన్న వస్తువు మొక్కుబడిగా ఇస్తారు. అది ఎంత తప్పో తెలుసా? నిజానికి మనం పేదవాళ్ళకి ఇస్తేనే మనం ఇచ్చినది సద్వినియోగం అవుతుంది. గొప్పవాళ్ళు అసలు మనం ఇచ్చినవి చూడనే చూడరు. మీరే చూసేరుగా…” అన్నాడు.
అప్పుడే బయటకి వచ్చిన అత్తయ్య అన్నాది,
“పిల్లలూ, ఈ విషయాన్ని ఏనాడో మారయ వెంకయ్య కవిగారు పోల్చి ఒక పద్యం చెప్పేరర్రా… వినండి… ఇది భాస్కర శతకంలోని పద్యం.
‘సిరిగలవాని కెయ్యెడక చేసిన మేలది నిష్ఫలంబగున్
నెఱి గుఱికాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేలమీదటన్
కురిసిన గాక అంబుధుకర్వగ నేమి ఫలంబు భాస్కరా!’
నలుగురూ అర్థం కానట్టు ముఖాలు పెట్టుకుని చూస్తూ ఉంటే, ఆవిడే అంది. “మీకు బోధపడలేదు కదూ… భావం చెప్తాను వినండి” అని ఇలా అంది.
“ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవానికి చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేనపుడు, ఎండిపోతూ ఉన్న చేలమీద వానకురిస్తే ఫలితం ఉంటుంది కాని, సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఏమిటి?”
ఆమె తెలుగు టీచరే కాక తెలుగు అంటే ప్రాణం పెట్టే మనిషి.
కిరీటి గబగబా అన్నాడు. “నాకు ఇప్పుడు బాగా బోధపడింది అత్తా… ఈసారి ఇలాటి తప్పులు చేయం.”
మావయ్య ప్రేమగా నవ్వుతూ, “అంతే కాదర్రా… మీరంతా మన నీతి శతకాలు నేర్చుకోండి. వారానికి రెండుసార్లు మీ అత్త దగ్గర ఓ గంట కూచుంటే చాలు. ఇట్టే వచ్చేస్తాయి మీకు” అన్నాడు.
నలుగురూ వికసించిన ముఖాలతో, “తప్పకుండా మేమంతా మన తెలుగు శతకాలు నేర్చుకుంటాం” అని ముక్తకంఠంతో మాట ఇచ్చేరు.
పిల్లల వైపు సంతోషంగా నవ్వుతూ చూసారు అత్తయ్య, మామయ్య.
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *