May 8, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 3

రచన: కొంపెల్ల రామలక్ష్మి

సంగీతం నేర్చుకుంటున్న క్రమంలో, గీతాలు, స్వరజతుల తర్వాత, స్వరం, సాహిత్యం చక్కగా పాడడం తెలిసాక నేర్చుకునే తర్వాతి అంశం ‘వర్ణం’.
ఒక సంగీత విద్యార్థి వర్ణాల దాకా వచ్చే సమయానికి కొన్ని సంపూర్ణ రాగాలు, కొన్ని జన్య రాగాలు, వాటిలో ఔడవ రాగాలు (5 స్వరాలు ఆరోహణ మరియు అవరోహణలో ఉండే రాగాలు), షాడవ రాగాలు (6 స్వరాలు ఆరోహణ మరియు అవరోహణలో ఉండే రాగాలు), కొన్ని ఘన రాగాలు (నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం అనే 5 రాగాలు), సప్త తాళాలు మొదలైన సంగీత పరమైన ఎన్నో అంశాలు తెలుసుకోవడం జరుగుతుంది. సంగీతంలో ఇంత పూర్వ పరిజ్ఞానంతో నేర్చుకోవలసినవి వర్ణాలు. కచేరీలలో కూడా పెద్ద పెద్ద విద్వాంసులు వర్ణంతో మొదలు పెట్టడం పరిపాటి.
ఒక వర్ణం సంపూర్ణంగా నేర్చుకోవడం, సాధన చెయ్యడం వల్ల, మనం ఏ రాగవర్ణం నేర్చుకుంటామో, ఆ రాగం యొక్క స్వరూపం పూర్తిగా అర్థం అవుతుంది. వర్ణంలో ఉండే స్వరాల వల్ల, రాగంలో సంచారాలు చాలా బాగా తెలుస్తాయి. ఇది, మనోధర్మం (రాగాలాపన, స్వరకల్పన వంటి అంశాలు) పాడడానికి (వాయిద్యం అయితే, వాయించడానికి) చాలా ఉపకరిస్తుంది. అందుకే సంగీత గురువులు వర్ణసాధన బాగా చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉంటారు. విద్యార్థికి కూడా సంగీతం నేర్చుకోవడంలోని కష్టమైన దశ ఇదే. ఈ స్థాయిలో, చాలామంది విద్యార్థులు సంగీతం కొనసాగించాలా లేక, ఎక్కువ కష్టం లేని భక్తి సంగీత రచనలు నేర్చుకోవటంతో సరిపెట్టుకోవాలా అనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.
సంగీతం మీద పట్టు సాధించాలి అంటే, సాధ్యమైనన్ని వర్ణాలు నేర్చుకోవాలి.
వర్ణాలు రెండు రకాలు
1. తాన వర్ణం
2. పద వర్ణం
తాన వర్ణాలను రెండు రకాలుగా విభజించారు
1. చిన్న వర్ణాలు
2. పెద్ద వర్ణాలు
ప్రసిద్ధ తాన వర్ణ రచయితలు –
వీణ కుప్పయ్యర్, తిరువత్త్యుర్ త్యాగయ్యర్, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, పచ్చిమిరియం ఆది అప్పయ్య, స్వాతి తిరునాళ్, రామ్నాడ్ శ్రీనివాసయ్యంగర్, ముత్తయ్య భాగవతార్ మొదలైనవారు.
ప్రముఖ పదవర్ణ రచయితలు –
వడివేలు, పల్లవి శేషయ్య, పొన్నయ్య పిళ్లే మొదలైనవారు.
ఆదితాళ రచనలుగా మనం నేర్చుకునే మోహనరాగ వర్ణం ‘నిన్నుకోరీ’, శంకరాభరణ రాగంలోని ‘సామి నిన్నే’, వంటివి చిన్నతాన వర్ణాలకు ఉదాహరణలు.
అట తాళ మరియు ఝoపె తాళ వర్ణాలు పెద్ద తాన వర్ణాలుగా విభజించారు.
ఈ వర్ణాలకు ఉండే అంగాల గురించి చెప్పుకున్న తర్వాత పద వర్ణం గురించి అర్థమవుతుంది.
వర్ణాన్ని రెండు భాగాలుగా విభజించారు –
1. పూర్వాంగం
2. ఉత్తరాంగం
పూర్వాంగంలో పల్లవి, అనుపల్లవి మరియు ముక్తాయి స్వరం ఉంటాయి. పల్లవి, అనుపల్లవి భాగాలు స్వర సాహిత్యాలలో కలిసి ఉంటాయి.
ముక్తాయి స్వరం పూర్తిగా స్వరాలతో కూడిన రచన.
ఉత్తరాంగంలో చరణం, ఎత్తుగడ స్వరాలు ఉంటాయి.
చరణం సాధారణంగా చిన్న రచనగా (ఒక్క ఆవృతానికి పరిమితం) ఉంటుంది. స్వర సాహిత్యాలతో కలిసి ఉంటుంది. ఎత్తుగడ స్వరాలు పూర్తిగా స్వరాలతో ఉండే రచన. కొన్ని వర్ణాలలో 3, కొన్నిటిలో 4, కొన్ని వర్ణాలలో 5 ఎత్తుగడ స్వరాలు ఉంటాయి. ప్రతీ ఎత్తుగడ స్వరం పాడాక, చరణం పాడాలి. ఇలా సాగుతుంది వర్ణం యొక్క గానం.
ఇప్పుడు పదవర్ణం గురించి ఒక్క విషయం చెప్పుకుందాం. తానవర్ణంలో ఉండే స్వరం మాత్రమే పాడే భాగాలు, ముక్తాయి స్వరం, ఎత్తుగడ స్వరాలు – వీటికి కూడా సాహిత్య రచన చేసిన వాటిని పదవర్ణాలుగా పేర్కొన్నారు. ఇవి నాట్యానికి అనుకూలంగా ఉంటాయి.
ఇప్పుడు మనకు వర్ణం యొక్క స్వరూపం, విభజన, పాడే విధానం అన్నీ తెలిసాయి. ఇప్పుడు వర్ణాలలో రాగమాలికల గురించి తెలుసుకుందాం.
నూకల చిన్న సత్యనారాయణ గారి ‘సంగీత సుధ’ గ్రంథం ప్రకారం మనకు 3 రాగమాలికావర్ణాల సంగీత లిపి (notation) లభ్యం అవుతోంది.
1. నవరాగమాలికా వర్ణం – వలచి వచ్చి – శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్
2. నవ ఘనరాగమాలికా వర్ణం – ఇంత కోపమేలరా – శ్రీ వీణ కుప్పయ్యర్
3. నవ రాగమాలికా వర్ణం – సామి నిన్నే – శ్రీ M. నాదముని పండితులు
ఈ మూడు రచనల్లో చాలా జనాదరణ పొంది, ఒక విద్యార్థి తప్పనిసరిగా నేర్చుకోవలసిన రచనగా పేర్కొన దగినది, పై మూడింటిలో మొదటిది.
ఆ రచన వివరాలు, అది రచించిన వాగ్గేయకారుని వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
‘వలచి వచ్చి’ – నవరాగమాలికా వర్ణం:
ఈ రచన చేసిన ప్రముఖ వాగ్గేయ కారులు శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్. వీరు క్రీ. శ. 1845 సంవత్సరంలో తంజావూరులో జన్మించిరి. మనందరికీ సుపరిచితమైన, చాలా ఇష్టమైన కృతి, కదన కుతూహల రాగంలో చేయబడిన ‘రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ’ని రచించిన వారు వీరే. ఆ రాగం కూడా వారి సృజనే. వీరి రచనలు త్యాగయ్య రచనలను పోలియుండడం వల్ల, వీరిని ‘చిన్న త్యాగరాజు’, అని కూడా అంటారు. వీరి వాగ్గేయకార ముద్ర ‘వేంకటేశ’. అనగా, వారి ప్రతీ రచనలోనూ ‘వేంకటేశ’ అన్న పదం సాహిత్యంలో తప్పనిసరిగా ఉంటుంది. వీరు నూరుకు పైగా రచనలు చేసినట్టు తెలుస్తున్నది. వీరు, వర్ణాలు, కృతులు మరియు తిల్లానాలు కూడా రచించారు. ‘బేగడ రాగం’ పాడడంలో వీరు ప్రత్యేకమైన నైపుణ్యం ప్రదర్శించడం వల్ల వీరిని ‘బేగడ సుబ్రహ్మణ్యయ్యర్’, అని కూడా పిలిచేవారట.
వీరు రచించిన నవరాగమాలికా వర్ణం పేరుకు తగ్గట్టుగా 9 రాగాలతో తయారైన చక్కటి మాలిక.
***
పల్లవి:
వలచి వచ్చియన్న నాపై – చలము సేయమేరా సామి
అనుపల్లవి:
చెలువుడైన శ్రీ వేంకటేశ – కలసిమెలసి కౌగిలించ
చరణం:
పద సరోజముల నే నమ్మితిని
***
సాధారణంగా వర్ణాలలో సాహిత్యం చాలా సరళమైన భాషలో చేయబడుతుంది. అలాగే, రచన శృంగార పరమైనదిగా కనిపించినప్పటికీ, అంతర్లీనంగా మధుర భక్తి ద్యోతకమౌతుంది.
ఈ వర్ణంలోని పూర్వాంగం మరియు ఉత్తరాంగం, పల్లవి, అను పల్లవి, ముక్తాయిస్వరం, చరణం, ఎత్తుగడ స్వరాలు (చిట్ట స్వరాలు), అవి చేయబడిన రాగాల పేర్ల గురించి ఇక్కడ వివరిస్తాను.
పల్లవి – కేదారం
అనుపల్లవి – శంకరాభరణం
ముక్తాయిస్వరం – 1వ భాగం కళ్యాణి, 2వ భాగం బేగడ
చరణం – కాంభోజి
1 చిట్ట స్వరం – యదుకుల కాంభోజి
2 చిట్ట స్వరం – బిళహరి
3 చిట్ట స్వరం – మోహన
4 చిట్ట స్వరం – శ్రీ రాగం
చరణంలో ‘పద సరోజములనే నమ్మితి’ అనే పంక్తిలో పదస అనేవి స్వరాక్షరాలుగా పాడటం అనేది ఒక విశేషం.
ఈ రచన, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల సంగీత విభాగంలో ఒక ముఖ్యమైన పాఠ్యాంశంగా సంగీత విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది.
యూట్యూబ్ వంటి సాంఘిక మాధ్యమాల్లో ఈ రచనకు సంబంధించిన వీడియోలు చాలానే కనిపిస్తాయి. దాదాపు పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ కూడా ఈ రచన పాడిన ఆడియోలు మరియు వీడియోలు మనకు అందుబాటులో ఉన్నాయి. భాగ్యలక్ష్మి చిత్రం కోసం శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన వర్ణం యొక్క లింక్ ని ఈ క్రింద ఇస్తున్నాను. అయితే ఇందులో కేవలం ఆడియో మాత్రమే ఉంటుంది, విని ఆనందించగలరు.

మరిన్ని రాగమాలికల విశేషాలు వచ్చే సంచికలో ముచ్చటించుకుందాం.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *