May 9, 2024

శంఖు చక్రాలు

రచన: భవాని కుమారి బి

“బుజ్జిముండ స్కూల్ నుంచి వచ్చేసిందా?” గుమ్మంలో అడుగుపెడుతూనే అడిగాడు సదాశివ౦.
“బుజ్జిముండేమిటి మామయ్యా! దానికి పేరు లేదా?” డూప్లెక్స్ హౌస్ లో ఆఖరి మెట్టు మీద నిలబడి అన్నది సుధ, “అయినా ఆ లుంగీ ఏమిటి అంత పైకి కట్టారు? ఎన్నసార్లు చెప్పాలి? అట్లా సగం, సగం గుడ్డలతో కమ్యూనిటీలో తిరగొద్దని ?
సదాశివం “నా ఇష్ట౦,, పల్లెటూరి ముండావాణ్ణి, నా గురించి నీకూ, నీ ఫ్రెండ్స్ కి దేనికి?’ రౌద్రంగా అన్నాడు.
“ఔనౌను, మాకు పరువంటూ ఒకటంటూ ఉంటే కదా, పోవటానికి” అతనికంటే గట్టిగా అరిచింది.
సదాశివం విసురుగా గదిలోకి వెళ్ళి, భార్యని ఉద్దేశించి గట్టిగా అరిచాడు, “తింటానికి ఏవన్నా ఉందా, లేదా?”
“తెస్తున్నా” అంతకంటే గట్టిగా అరిచింది సుగుణమ్మ.
“రోజంతా ఆ నైటీ వేసుకొని తిరుగుతుంది, లేకపోతే పైజామా, టీ షర్ట్. పైనించి క్రింది దాకా పిప్పళ్ల బస్తాలా తయారయ్యింది. ఒంటిమీద సోయ లేకుండా ఓ తుండు గుడ్డ అడ్డంగా వేసుకొని పిల్లని స్కూల్లో దింపటానికి వెళుతుంది, ఈమా నాకు చెప్పేది?
“అంత గట్టిగా మాట్లాడకండి, అమ్మాయి వింటే బాగుండదు” సుగుణమ్మ బ్రతిమిలాడుతున్న ధోరణిలో అన్నది.
“నీ బొంద, నువ్విలా భయపడబట్టే ఆవిడలా రెచ్చి పోతుంది” అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు సదాశివం.
సుగుణమ్మ భయాలు వేరు, పెద్ద కొడుకు శ్రీపతి భార్య వెళ్ళిపోయి మూడేళ్లు అయ్యింది. ఒక్క పదంటే పదిరోజులు వుంది వాళ్ళతో. శ్రీపతి చెప్పినట్టు అతను ఏ పెద్ద సంస్థలో పని చేయటం లేదు.
అతను విపరీతంగా పూజలు చేస్తాడు. గుళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు, తరచూ జాబ్స్ మారుతుంటాడు. ఒక మాటకి ఇంకో మాటకీ పొంతన లేదు. పదిరోజుల్లో ఒక జన్మకి సరిపడిన అనుభవం వచ్చింది. పొలం నాలుగెకరాల ఉంటే పది ఎకరాలు ఉందన్నారు, అవి కూడా అబద్దాలే. వాళ్ళు పూర్తిగా కొడుకుల మీద ఆధారపడ్డారు. పెద్దవాళ్ళతో ఉండటానికి ఆమెకు అభ్యంతరం లేదు కానీ అతనిలోని మూర్ఖత్వం ఆమెని చాలా భయపెట్టింది. తన సర్టిఫికెట్స్ తెచ్చుకొంటానని వెళ్లిన రేఖ మళ్ళీ ఆ గడప తొక్క లేదు. రెండేళ్ల వివాదం తర్వాత, mutual అగ్రిమెంట్ మీద విడాకులు తీసుకొన్నారు. శ్రీపతి చాదస్త౦ ఇంకా ఎక్కువైంది. తీరిగ్గా కూర్చుని పిచ్చిపనులు చేసి, గొడవలకు కారణం మౌతున్నాడు.
అతని పెళ్లి పెటాకులైనాక, కిరణ్ పెళ్లి సుధతో అయ్యింది. కిరణ్ కి నోరు ఎక్కువే, సుధ అంతకంటే గట్టిగా అరిచి అందరి నోళ్లు మూయిస్తుంది. ఈ విషయం తెలిసిన సుగుణమ్మ పనంతా తన మీద వేసుకొని చేస్తూ ఉంటుంది.
కూతురు శ్రీజ నిద్రపోకుండా గొడవ చేస్తుంటే నాలుగు తగిలించింది సుధ. మూడేళ్లు లేని ఆ పిల్ల తల్లిమీద పడి కొరకసాగింది. మరో రెండు వేసి, పడుకోబెట్టింది సుధ. శ్రీజకి ఇంట్లో ప్రతి నిత్యం ఏదో ఒకదానికి పెద్దవాళ్ళు అరుచుకుంటుంటే, ఎవరి మాట వినకుండా పెంకిగా తయారయ్యింది
చాలా చిన్న విషయాలు కూడా చిన్నగా మాట్లాడుకోరు వాళ్ళు. ఏ విషయమైనా చుట్టుప్రక్కల వాళ్లకి వినిపించాల్సిందే.
రాత్రి ఎనిమిదింటికి భోజనాలు అయ్యాక, పాల ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ తెరిచింది సుధ. అందులో పాల ప్యాకెట్ లేదు. “ఇందులో ఒక ప్యాకెట్ ఉండాలి కదా అత్తయ్యా, ఏది?”
సుగుణమ్మకి భయం వేసింది, జవాబు చెప్పకుండా నిలుచుంది.
“నిన్నే అత్తయ్యా! ప్యాకెట్ ఏమయ్యింది?” సుధకి కోపం వస్తే వెనకా ముందు చూడదు. ఏకవచనంలోకి దిగుతుంది.
శ్రీపతి వచ్చాడు, అతను, సుధ భర్త కిరణ్ కి అన్న. “ప్యాకెట్ పాలు నేనే పిల్లులు ఒకటే అరుస్తుంటే, వాటికి పోసాను” ఎంతో మామూలుగా చెప్పాడు.
అంతే, శివాలెత్తి పోయింది సుధ,
“ఎంత కూల్ గా చెబుతున్నావు, పిల్ల పాలకోసం నేనుంచితే నువ్వు పిల్లులకు పోసావా? వెనకటికెవడో పనిపాటలేనివాడు పిల్లి తలగోరిగాడట” అన్నది.
“వెధవ పాల ప్యాకెట్ కోసం బావగారు అనైనా చూడకుండా, అలా మాట్లాడతావేంటి మర్యాదలేకుండా? అయిదు నిమిషాల్లో తెస్తా” పెద్దకొడుకుకి సపోర్ట్ గా అరిచాడు సదాశివం.
నిరసనగా నవ్వింది సుధ, “ఒక పాకెట్ పిల్లుల పాలయ్యింది, మళ్ళీ ఇంకోటా, దానికి కూడా నేనే ఇవ్వాలిగా, మన దగ్గిర గిల్లలుండవుగా” వెటకారంగా అని పిల్లని లాక్కుపోతూ, ” ఒక్క రోజు పాలు లేకపోతే చావదులే “దురుసుగా అన్నది.
కిరణ్ తో విషయమంతా చెప్పింది.
“రేపు మార్నింగ్ తేల్చుకొంటాను” అన్నాడు ఉద్రేకంగా.
లేచి, లేవగానే గొడవకి దిగాడు, శ్రీపతి ఊరుకోలేదు, సదాశివ౦ కిరణ్ కంటే గట్టిగా గొడవకి దిగాడు. సుధ వచ్చి “మీ ముగ్గురి భారం మోస్తున్నాం, మీరు మాత్రం పెద్ద కొడుకుని సప్పోర్ట్ చెయ్యండి” ఆ గొడవ చాలా సేపటివరకు సద్దుమణగలేదు.
****
తెల్లవారక ముందే లేచి వాకిలి ఊడుస్తుంది సుగుణమ్మ. శని, ఆదివారాలు కోడలికి సెలవు. సుధ ఆ రెండు రోజులు కూడా లేవదు. కిరణ్ భార్యనేమి అనడు. ఒక్కోసారి తల్లిని చూస్తే జాలి వేస్తుంది అతనికి. నలుగురు పెద్దవాళ్ళు, ఒక పాపకి నాలుగు వేలు అడుగుతున్నారు పనివాళ్ళు. పూర్తిగా కొడుకుల మీదనే ఆధారపడ్డ సుగుణమ్మ, నాలుగువేలుంటే కూరగాయలైనా వస్తాయని, ఆమె పని చేసుకుపోతుంటుంది. పిల్లని స్కూల్ కి తయారు చేసే బాధ్యత కూడా ఆమెదే. కోడలు 8.30 కి లేచి, పిల్లని స్కూల్ లో దించి వస్తుంది. ఆదివారం కిరణ్. సుధ కలిసి నాన్ వెజ్ వండుకొంటారు. కోడలు స్నాన౦ చేయకుండా వంట చేయటం సుగుణమ్మకి ఇష్టం ఉండదు, కొత్తలో స్నాన౦ చేస్తే బావుంటుందని చెప్పినందుకు సుధకి చాలా కోపం వచ్చింది. సుధకి అత్తగారు యాత్రల కెళ్లినప్పుడు శంఖు, చక్రాలు వేయించుకొంది సుధ కోపానికి కారణ౦ అదే. ఏ హోటల్ కో వెళదామంటే బడ్జెట్ సరిపోదు, అత్తగారు నాన్ వెజ్ వండదు. తినదు అప్పనించీ. సుధకి తండ్రి లేడు. తల్లి చిన్న వుద్యోగం చేసే కొడుకుతో Srinagar లో సింగల్ బెడ్ రూమ్ లో ఉంటుంది. తరచూ తల్లి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటుంది సుధ.
అసలు సమస్య అది కాదు. ప్రతి నెలా ఆ మూడు రోజులు సుధని క్రిందికి రానివ్వదు సుగుణమ్మ. మూడేళ్ళ పిల్ల బట్టలు లేకుండా పైకి, క్రిందికి తిరుగుతూ ఉంటుంది. కోడలు మెట్ల మీద కూర్చుంటే, తిండి పెడుతుంది. పిల్ల పెద్దవుతుంటే, ఇలా డ్రాయర్ కూడా లేకుండా తిప్పటం, సుధకి భరించరానిదిగా తయారయ్యింది. ఆ రోజు ఆమె ఈ గోలంతా ఎందుకని తల్లి దగ్గరకు బయలు దేరింది. సుగుణమ్మకి కోపం వచ్చింది, “ప్రతి నెలా డేట్ వచ్చే టైం తెలుసుగా నీకు, రాకముందే వెళ్లచ్చుగా”
సుధ విసురుగా వెళ్లి కారులో కూర్చుని అన్నది, “ఇప్పుడు ఇలంతా శుద్ధి చేసుకొని మీ ముగ్గురే వుండండి, నేనీ యాతన భరించలేను, అమ్మా వాళ్ళింటి నించి ఆఫీస్ కి వెళ్లాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు”
కొడుకు కోడల్ని దింపి వచ్చాక సుగుణమ్మ కారుని పసుపు నీళ్లతో శుద్ధి చేసింది. కిరణ్ తల్లి చాదస్తానికి నెత్తి కొట్టుకొంటూ లోపలి నడవబోయాడు. సుగుణమ్మ అతన్ని బయట బాత్రూమ్ లో స్నాన౦ చేసి ఇంట్లోకి రమ్మన్నది.
పదిరోజుల తర్వాత వచ్చింది సుధ. కొడుకు ఏమని సముదాయించి తీసుకు వచ్చాడో సుగుణమ్మను తెలియదు. కానీ ఆ తర్వాత వీలున్నప్పుడల్లా వాళ్ళు బయటకు వెళ్లి అలసిపోయిన మొహాలతో ఇల్లు చేరేవాళ్లు. ఒక ఫైన్ మార్నింగ్, టిఫిన్ అయ్యాక చెప్పాడు, “ఇప్పుడున్న ఇల్లు ఆఫీస్ కి చాలా దూరమైంది, అందుకే త్రి బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నామని చెప్పాడు”
సదాశివ౦”ఇదంటే ఇండిపెండెంట్ హౌస్, ఇంతమందికి ఎలా సరిపోతుంది” కోపంగా అన్నాడు. “ఆ ఇరుకుల్లో మేముం డలేము”. సుధా అదోలా నవ్వింది.
మర్నాడు ఫ్లాట్ చూడటానికి వెళ్లారు. చాలా బిజీ ఏరియా, ఇల్లు మరీ విశాలంగా ఏమి లేదు. సుగుణమ్మ ఏమీ అనలేదు. ఇంటికొచ్చాక, “ఆ ఫ్లాట్ మనకు ఎలా సరిపోతుందనుకొని, మాటమాత్రమైనా చెప్పకుండా అంత డబ్బు తగలబెట్టావేం?” అన్నాడు సదాశివ౦.
“మీరిక్కడ వుండండి, మిమ్మల్ని ఎవరు వచ్చి ఇబ్బంది పడమంటున్నారు? మీ పెద్దకొడుకుని ఇంటి బాధ్యత తీసుకో మనండి” అంది సుధ.
నోటా మాట పడిపోయింది ఇద్దరికీ. పెద్ద కొడుకు మీద ఆధార పడటం అంటే, “కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే” పొలం మీద కౌలు, అక్కడున్న ఇంటికి అద్దె అంతా కలిపి ఏడాదికి లక్ష వస్తే ఎక్కువే.
అన్నట్టుగానే సుధ కిరణ్ కొత్త ఇల్లు గృహప్రవేశం చేసి వెళ్లిపోయారు. ఇంట్లో సామాను సగం ఖాళీ అయ్యింది. మరో పది రోజులకి శ్రీపతి నాగపూర్ లో వుద్యోగం చూసుకొని వెళ్ళిపోయాడు.
ఆ నెల అడ్వాన్స్ వుంది కాబట్టి, నెలాఖరుదాకా ఉండవచ్చు. సదాశివానికి మాట పడిపోయినట్టు అయ్యింది. వూరు వెళ్లి ఏమి చెయ్యాలి? ఈ వయసులో వ్యవసాయం చేయలేడు. ఏమి చెయ్యాలో తోచక చిరుగుతున్నాడు.
*****
సుగుణమ్మ కమ్యూనిటీ మొతం తిరిగింది. మెయిన్ గేట్ దగ్గరలో ఒక సింగల్ బెడ్ రూమ్ ఇల్లు ఆలనాపాలనా లేక, పిచ్చి మొక్కలతో పాడుబడ్డ ఇల్లులా వుంది. సదాశివంతో కలిసి ఆ ఇంటి ఓనర్ గురించి కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీహరిగారిని అడిగింది. అతను శశిధర్, US లో ఉంటాడు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పి, బ్రతిమిలాడి, తమ పరిస్థితి చెప్పి, ఇల్లు శుభ్రంగా ఉంచుతామని, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేస్తామని చెప్పింది.
శ్రీహరిగారి మాట మీద మొత్తానికి ఇల్లు బాగు చేయిస్తానని చెప్పాడు.
అన్నట్టుగానే ఇల్లు మరో పదిరోజుల్లో బావమరిదికి చెప్పి బాగు చేయించాడు. ఇల్లు చాలా చిన్నది, కానీ ఖాళీ స్థలం చాలా వున్నది. శశిధర్ వీడియో కాల్ లో వాళ్ళని చూసాక, అద్దె వద్దని, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు.
ఈ విషయాలేమి కొడుకులకి చెప్పవద్దని భర్తకి చెప్పింది. చాలా సింపుల్ గా, ఒక్క శ్రీహరిగారి ఫామిలీని పిలిచి ఇంట్లోకి వెళ్లారు.. భర్తకు మొక్కలతో వున్న అనుభవ౦ బాగా పనికొచ్చింది. ఖాళీ జాగాలో కూరగాయలు, ఆకుకూరలు పండించాలని అనుకొన్నారు. ఆ రాత్రి చాలా సేపు పిల్లల గురించి ఆలోచించింది. తాను చాలా మూర్ఖంగా ప్రవర్తించి కిరణ్ వేరే ఇల్లు తీసుకొనేలా చేసి౦దా? చాలా బాధపెట్టిందా? పెద్దకొడుకుని మందలించలేకపోయింది.
సదాశివ౦ నోరు అదుపులో పెట్టుకోలేదు. అది కూడా ఒక కారణ౦ కావచ్చు. కోడలు అస్సలు పని చేయకపోవటం, తాము ఆధారపడి బ్రతుకుతున్నందుకే అన్న ఆలోచన ఆమెని చాలా బాధపెట్టింది. అయినా కిరణ్, వూరు విడిచి వచ్చాక ఆరేళ్ళు సరైన ఉద్యోగం లేకపోయినా, శ్రీపతి బాధ్యతారహితంగా ప్రవర్తించినా, ఇంటి భారం మోశాడు. వాడినేమి అనటానికి లేదు.
పిల్లని చూసుకోవటానికి అత్తగారు, బావమరిదితో కలిసి తమతో ఉంటారని చెప్పినప్పుడు మాత్రం బాగా బాధపడింది కానీ పైకి ఏమీ అనలేదు.
ఉదయమే లేచి, స్నాన౦ చేసి, చిన్నగా ఏర్పాటు చేసుకొన్న పూజా మందిరం ముందు కూర్చుని తన మనసులోని వేదనను నివేదించుకొంటూ అన్నది, “స్వామీ, పిల్లలిద్దరూ గూడు వదిలి ఎగిరిపోయారు. నా మూర్ఖత్వం కూడా ఒక కారణంమెమో. నీ ‘శంఖు చక్రాలు’ ఈ రోజు న నీకే సమర్పిస్తున్నాను. IT ఉద్యోగాలు చేసే అమ్మాయిలకు, శక్తీ ఉన్నంతవరకు అన్ని రకాలు వండుతానని ఆర్డర్లు తీసుకొన్నాను. నీ ‘శంఖు చక్రాలు’ నీకే సమర్పిస్తున్న౦దుకు నన్ను క్షమించు. పిల్లల మీద కోప౦ లేదు, ఈ కొత్త జీవితానికి కావాల్సిన శక్తినివ్వు” అంటూ గట్టి రెండు చెంపలూ వేసుకొంది సుగుణమ్మ.

*****

1 thought on “శంఖు చక్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *