May 8, 2024

ఇంటర్వెల్ బెల్

రచన: ధరిత్రిదేవి ఎమ్

ఇంటర్వెల్ బెల్ మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటకు చొచ్చుకుని వచ్చారు. రెండు నిమిషాల్లో ఆ సందడి సద్దుమణిగింది. అంతే ! అలా వెళ్ళిన పిల్లలు మళ్లీ అరగంట దాకా తిరిగి రారు. కొందరు అసలే రారు. ఇంటర్వెల్ టైం పది నిమిషాలే! ఉదయం గదుల నిండుగా ఉన్న పిల్లలు ఇంటర్వెల్ తర్వాత సగానికే ఉంటారు. మధ్యాహ్నం పూటా అంతే!
సుగుణ పదిరోజుల క్రితం ఆ స్కూల్ హెచ్.ఎం గా జాయిన్ అయింది. వారంరోజులుగా ఇదంతా గమనిస్తూ ఉంది.
***
“ఇక్కడ ఇంతే మేడం. నేను ఇక్కడికి వచ్చి నాలుగేళ్లవుతోంది. అప్పుడున్న హెడ్‌మాస్టర్‌ను నేనూ ఇలాగే అడిగితే..ఎన్నో ఏళ్ల బట్టి ఇక్కడ ఇలాగే నడుస్తోంది. ఈ పద్ధతి మార్చడం నా ముందున్న వాళ్లకూ సాధ్యం కాలేదు.. అంతే.! నేనూ అడ్జస్ట్ అయిపోయాను. అన్నాడాయన.. ”
మరుసటి రోజు ఏర్పాటు చేసిన స్టాఫ్ మీటింగ్ లో మూర్తి అనే ఉపాధ్యాయుడు చెప్పాడు సుగుణతో.
“ప్రయత్నించాలి గదండీ.. అలా వదిలేస్తే ఎలా?”
“నేను వచ్చాక, సార్ ను ఒప్పించి పిల్లలకు ఎంతగానో చెప్పి చూశాం మేడం .. నాలుగైదు రోజులు. కానీ ఫలితం మాత్రం లేదు. మళ్లీ మామూలే.! లాభం లేదనుకొని అంతటితో నేనూ సైలెంట్ అయిపోయాను,” బదులిచ్చాడు మూర్తి.
“ఉదయం తిని రారు మేడం. ఎందుకంటే మా ఇంట్లో అంత తొందరగా వంట చేయరు అంటారు.”
కమల, శ్రీలత అనే టీచర్స్ మూర్తికి వత్తాసుగా చెప్పారు. సుధ అనే టీచర్ కూడా దాదాపు అదే అభిప్రాయం వెలిబుచ్చింది.
“సరే. మనం ఒక పద్ధతి ఫాలో అవుదాం. మీరంతా నాతో సహకరిస్తే చాలు”
సుగుణ చెప్పిందంతా విని, టీచర్స్ చప్పరించేశారు.
“మేడం! పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి, ప్రాబ్లం అవుతుంది మేడం..” మూర్తి అన్నాడు.
“అవును మేడమ్, ఇది పల్లెటూరు.. లేనిపోని గొడవలౌతాయి”
మిగతావాళ్లూ వంత పాడారు.
“చూద్దాం. పేరెంట్స్ ను రానివ్వండి. వాళ్ల వాదనలూ విందాం”
“ఓకే మేడం! మూర్తి సార్. మీరు ఓసారి చూశారు. మేడం చెప్పినట్లు. ఈసారి మరో విధంగా చేసి చూద్దాం. తప్పేముంది? మనమేమీ మనకోసం చేయడం లేదు కదా. పిల్లల కోసమే కదా. !”
శ్రీనివాస్ చెప్పాడందరివైపు చూస్తూ. అతను సంవత్సర క్రితం ఈ స్కూల్లో చేరాడు. ఉత్సాహం, చురుకుదనం ఉన్న వ్యక్తి. సుగుణ అతని వైపు మెచ్చుకోలుగా చూసింది. సరే అని తలలాడిస్తూ అంతా లేచారు. ఒక్క శ్రీనివాస్ లో తప్ప మిగతా అందరి ముఖాల్లో ఉత్సుకత అన్నది కనిపించలేదు సుగుణకు.
ఇంటర్వెల్లో పిల్లలు బయటకు వెళ్ళిపోగానే, వాళ్లంతా ఓ రూమ్ లో చేరి, పిచ్చాపాటి చెప్పుకుంటూ అక్కడున్న కొందరు పిల్లలతో టీలు తెప్పించుకుని తాగుతూ కాలక్షేపం చేయడం, ఇంకా టైం మిగిలితే టేబుల్ పై తలవాల్సి రిలాక్స్ అవ్వడం చూసి ఉంది సుగుణ. చూడబోతే.. పిల్లల కంటే వీళ్లే ఎక్కువగా ఇంటర్వెల్ ను ఆస్వాదిస్తున్నట్టుగా అనిపించిందామెకు..!
**
“రేపటినుండీ ఇంటర్వెల్ ఉండదు. అవసరమైన వాళ్ళు మాత్రం మీ టీచర్ నడిగి వెళ్ళొచ్చు. ఐదు నిమిషాల్లో కచ్చితంగా తిరిగి రావాల్సి ఉంటుంది. మీరంతా ప్రతిరోజులాగా కాదు.. ఉదయమే ఇంటి వద్ద తినేసి రావాలి.. తెలిసిందా.!”
అనుకున్న ప్రకారం.. మరుసటి రోజు ఉదయం ప్రార్థన సమయంలోనే పిల్లలందరికీ గట్టిగా చెప్పేసింది సుగుణ.
ఆ రోజు గడిచింది. మరుసటిరోజు ఇంటర్వెల్ బెల్ మోగలేదు. పిల్లలు బిక్కమొగాలేశారు. టీచర్లూ మిన్నకుండి పోయారు. మూడు రోజులు గడిచాయో లేదో.. మూర్తి అనుమానం నిజమై కూర్చుంది. పిల్లల తల్లులు ఏడెనిమిదిమంది బిరబిరమంటూ వచ్చారు టీచర్ల దగ్గరికి.!
“ఏంది టీచరమ్మా! పొద్దుట ఇంటికి పంపిస్తలేరు.? పిల్లలు ఆకలితో అల్లల్లాడిపోతండారు..!”
టీచర్లు వాళ్లందర్నీ సుగుణ వద్దకు మళ్ళించారు.
“అవునమ్మా, పంపడం లేదు.. స్కూలు టైం మీకు తెలీదా ఏంటి? అది అన్నం బెల్లు కాదు. మధ్యలో వదిలేది పది నిమిషాలే. ఇంటికి వెళ్లి గంట తర్వాత వస్తే, చదువెట్లా సాగుతుంది ! మీ పిల్లలకు చదువు కావాలా..వద్దా?”
“కావాలి.. కానీ”
“ఉదయమే వాళ్లకు తిండి పెట్టి పంపండి. ఇంటర్వల్ లో పంపడమయితే కుదరదు. ”
“అంత జల్దీగా ఎట్టా అవుద్ది.? ”
“ఎందుకవదు? అవాలి.. మేమంతా ఎక్కడెక్కడినుండో ఇంట్లో అందరికీ వండివార్చి, మాకూ తెచ్చుకుంటున్నాము. ఇక్కడే ఉంటున్న మీకు ఎందుకవదు..? ”
ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క నెత్తులు గోక్కున్నారు వచ్చిన ఆడవాళ్ళంతా.!! వారం గడిచింది. సుగుణ చలించలేదు. పద్ధతి మార్చలేదు..
**
ఆ రోజు ప్రార్థనలో సగంమంది పిల్లలే కనిపించారు. మరో రెండురోజులు అలాగే కొనసాగింది. సుగుణకు ఏదో అనుమానం వచ్చినా.. తేలిగ్గానే తీసుకుంది. కానీ. ఏమిటో. మనసులో.. తను చేస్తున్నది అంత కాని పనా.! అని మధనపడసాగింది.
“అదేమీ లేదు మేడం, పక్క ఊళ్లో జాతర జరుగుతోంది. ఈ ఊర్లో కూడా ఇళ్లకు చుట్టాలంతా వచ్చినట్టున్నారు. ఆ సందట్లో పిల్లలు బడి ఎగ్గొట్టేస్తున్నారు. అంతే అయ్యుంటుంది మేడం.!”
సుగుణ మొహంలో ఆందోళన గమనించి అన్నాడు శ్రీనివాస్. కానీ, ఆ మరుసటి రోజే.. బస్సు దిగగానే తాను, మూర్తి విన్న మాటలు చెప్పక తప్పలేదు.
“ఈ కొత్త టీచరమ్మ అన్నీ కొత్త రూల్సు పెడతా వుంది. అన్నం తిని లేటుగా వెళ్లిన పిల్లల్ని క్లాసులోకి రానీయకుండా బయటే నిలబెట్టిస్తోందట! అందుకే.. అసలు బడికి వెళ్ళద్దు.. ఏం చేసుకుంటారో చేసుకోండని వెళ్లొద్దన్నాము పిల్లల్ని..!”
మూర్తి, శ్రీనివాస్ వినాలని గట్టిగానే మాట్లాడుకుంటున్నారు అక్కడ ఐదారుమంది.!!
“సరేలే. నీలాంటి వాడే ఒకడు ఏటి మీద అలిగి..”
శ్రీనివాస్ చేయి పట్టి, వద్దన్నట్లు సైగ చేశాడు మూర్తి..
“అది కాదు మూర్తి సార్, తాము కూర్చున్న చెట్టుకొమ్మనే నరుక్కుంటున్న సంగతి తెలియడం లేదు వీళ్ళకి.! మేడమేదో నేరము, ఘోరము చేస్తున్నట్లు ఫీలయిపోతున్నారు.. ”
దారిలో బాధపడుతూ అన్నాడు మూర్తితో శ్రీనివాస్.
విషయం విని నవ్వుకుంది సుగుణ. ఇంతకుముందు తాను పనిచేసిన స్కూళ్లల్లో హెడ్ మాస్టర్లు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని వాళ్ళు ఎదుర్కొన్న తీరు మననం చేసుకుంది. వాళ్ళ అనుభవాలు ఇప్పుడు తనకు పాఠాలై.. పరిష్కారం కోసం వెతక మన్నాయి. నిజానిది చాలా చిన్న సమస్య.. చాలా చాలా చిన్న సమస్య.. వీళ్ళకిది అర్థమవ్వాలి. అంతే.. అనుకుంది.
“సరే శ్రీనివాస్, మూర్తిగారు.. మీరు అర్థం చేసుకున్నారు. అదే నాకు ఎంతో బలాన్ని ఇస్తోంది. ఆలోచిద్దాం..ఏం చేయాలో..! అని తన గదిలోకి వెళ్లి కూర్చుంది.
మరుసటి రోజు టీచర్లందరినీ పిలిచి, పేరెంట్స్ మీటింగ్ పెడదామని చెప్పింది. తల్లిని గానీ, తండ్రిని గానీ కచ్చితంగా పిలుచుకొని రావాలని పిల్లలతో తాను చెబుతూ, టీచర్లు అందరితో కూడా చెప్పించింది.
**
“ఇన్నేళ్ళుగా లేని కొత్త అలవాటు ఇదేందమ్మా టీచరమ్మా..! పిల్లకాయలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో మా ఆడవాళ్లు ఒకటే గోల!”
అది మంచి పనా.. కాని పనా.. అన్న విచక్షణ, ఆలోచన ఏమాత్రం లేని ఆ మగవాళ్ళు ఆడవాళ్ళతో కలిసి సుగుణ మీద అరవడం మొదలెట్టారు పేరెంట్స్ మీటింగ్ మొదలవగానే..
“ఇంతకుముందు సారోళ్ళు శానా మంచోళ్ళు..ఈయమ్మ వచ్చినాకే ఇట్టా. !” కొందరాడవాళ్ళు గట్టిగట్టిగా గొణిగారు.
“అదంతా కుదరదులే మేడమూ. ముందులాగే ఉండనీయి..”
నలుగురైదుగురు మగవాళ్ళు ఖండితంగా చెప్పేశారు..
“కాస్త ఆగండి.”
వాళ్లలో నుండి ఒకాయన లేచి అందర్నీ వారించాడు. అందరూ గప్ చుప్ అయిపోయారు.
“ఆయమ్మ మన పిల్లగాళ్ళ బాగు కోసమని ఏదో చేస్తా ఉంటే వినాల్సింది పోయి అరుస్తారేంటి, తెలివితక్కువ దద్దమ్మలారా.!”
“……..”
“కొత్త టీచరమ్మ వచ్చినాక బడి సూడండి ఎంత బాగా తయారయిందో! ఆడపిల్లలు కూడా బడికి పోతాం అంటున్నారు”
ఇంట్లో పుస్తకాలెన్నడూ తెరవని తమ పిల్లలు సాయంత్రాలు ఆటలు కూడా మరిచి, చదువుకోవడం మదిలో మెదిలింది అక్కడ చేరిన వాళ్లందరికీ..
ఆయన ఊర్లో పెద్ద మనుషుల్లో ఒకరు. ఆయన మాటంటే అందరికీ గురి ! ఆలోచనలో పడ్డారంతా!
“ఏమ్మా, పిల్లల ఆకలి తెలుస్తోంది గానీ, వాళ్ళ బాగు మాత్రం వద్దనిపిస్తోందా! పొద్దుట పూట కాస్త ఉడికించి పెట్టడానికి ఇంత యాగీ సేయాల్నా! మీ పిల్లల కోసమే గదా పంతుళ్లు సెప్తా ఉండేది !” ఆడవాళ్ళ వైపు చూస్తూ అన్నాడాయన.
“తప్పు చేసినామా ఏందే.!” అన్నట్లు ఒకరి మొగాలొకరు చూసుకున్నారు అందరూ. ఓ పెద్దావిడ అందుకుంది.
“నేను సెప్తానే ఉండా గదే… ఇంతకుముందు పిల్లగాళ్లు ఎప్పుడు జూసినా.. ఇళ్ళ ముందు, సందులంటా గెంతులే గదా ! బడి ఊసే లేకపాయ! ఇప్పుడు పిట్ట కనపరాదే !!”
“సరెసర్లేవమ్మా ఇప్పుడొచ్చినావ్ సెప్పనీకి”
మరొకాయన గద్దించేసరికి ఠక్కున కూర్చుందామె.
మొత్తానికి ఆడా మగ అంతా తగ్గారు. ఆలోచనలో పడ్డారు..
“అమ్మా, ఈళ్ళకేం తెలవదు. చదువు సంధ్యాలేని పల్లె జనాలు. ఈ ఊరు తప్ప మరోటి తెలవదు. మరోలా అనుకోకమ్మ.. నువ్వు ఏమేం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేసేయ్ తల్లీ” అన్నాడు మరొకాయన.
ఆ వెంటనే మరో ఇద్దరు!! అందరికీ నమస్కరించింది సుగుణ. పేరెంట్స్ మీటింగ్ అనుకున్నప్పుడే ఊహించింది సుగుణ.. ఊర్లో అందరూ ఒకేలా ఉండరనీ.. వ్యతిరేకించే వాళ్ళ పక్కనే సహకరించేవాళ్లూ ఉంటారనీ.. ఆమె నమ్మకం నిజమైందిప్పుడు..!
“మీలాంటి పెద్దలు ఊరికి చాలా అవసరం పెద్దయ్యా .. పిల్లల చదువుకు బాగా ఆటంకం కలుగుతోంది. అసలు సాగటం లేదు. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ అన్నదే ఉన్నట్టు కనిపించలేదు నాకు . బడి అంటే ఏదో కాసేపలా గడిపి పోదాంలే అన్నట్లున్నారు. రేపు వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని మార్పులు అవసరం అనిపించింది, మాటలతో చెప్తే ఫలితం ఉండటం లేదు. అందుకే… చేతల్లో చూపించాల్సి వచ్చింది. మొదట్లో ఇబ్బందిపడ్డా.. అలవాటైపోయాక అంతా సర్దుకుంటుందని నా గట్టి నమ్మకం”
“మంచిది తల్లీ..నీవు చేసేది మంచి పనే అని అందరికీ ఎరికయింది..ఏమర్రా ! పదిహేడేళ్ళకాడినుండి సూస్తా ఉండాం. మన ఊరి బడి దాటి, ఏ పిలగాడైనా పెద్ద బడిదాకా ఎల్లినాడా ! చెప్పండి.. ఈయమ్మ పుణ్యాన్నయినా అది ఐతదేమో..అడ్డం పడతారెందుకు ! ”
అంతా మారు మాట్లాడక, లేచి, మన్నించమన్నట్లు సుగుణ వైపు చేతులు జోడించారు. మూర్తితో సహా ఉపాధ్యాయులంతా ఊహించని ఈ మలుపుకు అబ్బురంగా సుగుణ వైపు చూశారు..
**
మరుసటి రోజు నుండి బడి వేళల్లో కొత్తదనం సంతరించుకుంది. క్రమంగా ఉపాధ్యాయులే కాక ఊర్లో అంతా సుగుణ అంకితభావాన్ని గుర్తించి పూర్తిగా సహకరించడం మొదలైంది. అందువల్ల సుగుణ పాఠశాల అభివృద్ధికి మరింతగా కృషి చేయడానికి అవకాశం లభించింది.
మనిషి సంకల్పానికి దైవ బలం కూడా తోడైనట్లు కొద్ది రోజుల లోనే మధ్యాహ్నం భోజన పథకం అమల్లోకి వచ్చింది.. ఇంకేముంది ! పిల్లలంతా బడి దగ్గరే తినేసి, కాసేపు ఆట్లాడుకుని మధ్యాహ్నం క్లాసులకు వచ్చి కూర్చోవడం చేస్తున్నారు. చదువు నిరాటంకంగా సాగిపోతోంది. ప్రస్తుతం పాఠశాల మండలంలోనే మంచి గుర్తింపు పొందగలిగింది.
ఒక రోజు…
“మేడం, అప్పట్లో నాకు తోచలేదు. నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఉండదని మీ ద్వారా తెలుసుకున్నాను. యు ఆర్ గ్రేట్ మేడం.” మూర్తి సుగుణతో మనస్ఫూర్తిగా అన్నాడు. కాస్త పొట్టిగా, బక్క పల్చగా. చూడగానే గొప్ప అభిప్రాయమేమీ కలగని ఆమెలో అంతటి పట్టుదల, సంకల్ప బలం దాగి ఉన్నాయన్న సత్యం బోధపడి అచ్చెరువొందాడతను.
నిశ్శబ్దంగా, నిస్తేజంగా కొన్ని గంటలపాటు పిల్లల సందడి లేక, చదువు లేక కళావిహీనంగా కనిపించిన పాఠశాల ఆవరణ దృశ్యం సుగుణ మదిలో మెదిలింది ఆ క్షణం! అదంతా… కొద్ది నెలల క్రితం ! ఆ రోజు…”ఈ పరిస్థితి మారదా!” అన్న ఆవేదనలోంచి పుట్టిన ఒక ఆలోచన ఫలప్రదమై.. అదే బడి.. ఈ రోజు పిల్లలతో, రోజంతా క్లాసులతో, తీరిక లేక గడుపుతున్న టీచర్లతో కళకళలాడుతూ ఉంది..!
“అంతేకదా మూర్తిగారూ! గట్టిగా ప్రయత్నం చేయాలన్న భావన మన మెదడులో స్థిరంగా ఉంటే.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదుర్కోగల మనోధైర్యం అదే వచ్చి తీరుతుంది. పైగా.. మనం చేస్తున్న పని మంచి కోసమని నమ్మినప్పుడు.. ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు.. అయినా మీ సహకారం కూడా నాకు తోడైంది. అందుకు నేను మీకు థాంక్స్ చెప్పాలి..”
అంటూ ఉండగా.. ఇంటర్వెల్ బెల్ మోగింది. అయితే.. సుగుణ ఇప్పుడు కంగారుపడలేదు. ఎందుకంటే.. మరో పది నిమిషాల్లో లోపలి బెల్ మోగగానే పిల్లలంతా క్లాసుల్లోకి పరిగెడతారు గనుక !!
************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *