May 1, 2024

సుందరము సుమధురము

రచన: – నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:

మొన్ననే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం కదండీ, ఈ నేపథ్యంలో వెలుగునీడలు చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా!” అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను.
అన్నపూర్ణా పిక్చర్స్ వారి పతాకంపై, 1961 జనవరి 7న విడుదలైన ఈ చిత్రానికి, శ్రీ ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకత్వం వహించారు. మాటలు ఆత్రేయగారు వ్రాయగా, పాటలు శ్రీశ్రీగారు, కొసరాజుగారు వ్రాసారు. శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు సంగీతాన్ని అందించారు.
శ్రీయుతులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గిరిజ, జగ్గయ్య, యస్వీయార్, సూర్యకాంతం, రేలంగి మొదలైన వారు, ఈ చిత్ర తారాగణం.

‘పాడవోయి భారతీయుడా!’ అనే ఈ గీతాన్ని కవి శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావుగారు వ్రాయగా ఘంటసాల, సుశీలగారలు ఆలపించారు. (కాలమాన పరిస్థితులబట్టి ఈ చిత్రం విడుదల అయిన నలభై రెండు సంవత్సరాల తరువాత కూడా మన దేశ దుస్థితి ఏమాత్రం మారలేదు, ఇంకా దిగజారిపోయింది, కులమతభేదాలు, అవినీతి, భాషాద్వేషాలు ఇంకా పెచ్చు మీరిపోయాయన్నది ఎంతో నిజం.) ఈ విషయం ఈ పాటలో ఆనాడే ఎంతో బాగా వివరించారనేది పాట వింటే మనకు అర్థమౌతుంది. ఎంతో కమనీయంగా ఆలపించిన ఈ గీతాన్ని దృశ్యపరంగా వైద్యకళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వేదికపై అక్కినేని, నర్తకి రాజసులోచనలపై చిత్రీకరించారు. తెలుగు చిత్రసీమకు రాజసులోచన, యల్ విజయలక్ష్మి, ఇవి సరోజ వంటి నర్తకీమణులు వరాలని చెప్పవచ్చు. రాజసులోచన ఈ గీతాన్ని అద్భుతంగా అభినయించారు. ఇక అక్కినేనివారి అభినయం గురించి మనం వేరే చెప్పనక్కరలేదు. పాటలో సాహిత్యపరంగా ఎంతో ఉద్వేగంగా ఉండే భావాలను ముఖంలో సునాయాసంగా పలికించారు. చూసిన కొద్దీ చూడాలనిపించే ఈ దృశ్యకావ్యాన్ని, పాట గురించి తెలుసుకున్నాక వీక్షించుదాం. సరేనా?

మరి ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించుదాం రండి…

పాట సాహిత్యం:

ఆమె:
పాడవోయి భారతీయుడా…
ఆడిపాడవోయి విజయగీతికా… ఆ… ఆ…
బృందం:
పాడవోయి భారతీయుడా…
ఆడిపాడవోయి విజయగీతికా… ఆ… ఆ… ఆ
పాడవోయి భారతీయుడా…

(ఓ భారతీయుడా… పాడవోయి, ఆడుతూ పాడవోయి నీ విజయగీతాన్ని…)
ఆమె:
నేడే స్వాతంత్య్ర దినం… వీరుల త్యాగఫలం…
నేడే స్వాతంత్య్ర దినం… వీరుల త్యాగఫలం
నేడే నవోదయం… నీదే ఆనందం… ఓ…

(ఈ రోజే కదా స్వాతంత్ర్య దినోత్సవం! మన వీరుల త్యాగఫలమిది… నేడే ఓ కొత్త ఉదయం, నీదే ఆనందం…)

బృందం:
పాడవోయి భారతీయుడా…
ఆడిపాడవోయి విజయగీతికా… ఆ… ఆ…
పాడవోయి భారతీయుడా… …

అతడు:
ఓ… ఓ… ఓ…
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి…
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి…
సాధించినదానికి సంతృప్తిని పొంది…
అదే విజయమనుకుంటే పొరపాటోయి…

(స్వాతంత్ర్యం వచ్చిందని ఉత్సాహంగా సభలు చేసి, సంబరపడగానే సరిపోదు. మనం సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమని భ్రమ పడటం చాలా పొరపాటు సుమా!)

ఆగకోయి భారతీయుడా…
కదిలి సాగవోయి ప్రగతిదారులా… ఆ… ఆ… ఆ…
బృందం:
ఆగకోయి భారతీయుడా…
కదిలి సాగవోయి ప్రగతిదారులా… ఆ… ఆ…
ఆగకోయి భారతీయుడా…
(ఆగకు భారతీయుడా! ప్రగతిదారులు వేసుకుని ముందుకు సాగిపో…)

అతడు:
ఆకాశం అందుకొనే ధరలొక వైపు…
అదుపులేని నిరుద్యోగమింకొక వైపూ…
ఆమె:
ఆకాశం అందుకొనే ధరలొకవైపు…
అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ…
(ఓ వైపు ఆకాశాన్ని అంటే ధరలు… అరికట్టలేని నిరుద్యోగం మరో వైపు…
అతడు:
అవినీతి… బంధుప్రీతి… చీకటి బజారూ…
అలముకున్న నీ దేశం ఎటు దిగజారు?

కాంచవోయి నేటి దుస్థితి…
ఎదిరించవోయి ఈ పరిస్థితి… ఈ… ఈ… ఈ
(అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు… అలముకున్న నేటి దేశం ఎటు దిగజారిపోతున్నది? ఓ భారతీయుడా! నేటి దుస్థితి గమనించు… ఈ పరిస్థితిని ఎదిరించు!)
బృందం:
కాంచవోయి నేటి దుస్థితి…
ఎదిరించవోయి ఈ పరిస్థితి… ఈ… ఈ… ఈ
కాంచవోయి నేటి దుస్థితి… .

అతడు:
పదవీవ్యామోహాలూ కులమత భేదాలూ…
భాషాద్వేషాలూ చెలరేగే నేడూ…
ఆమె:
పదవీవ్యామోహాలూ కులమత భేదాలూ…
భాషాద్వేషాలూ చెలరేగే నేడూ…
(దేశమంతటా… పదవీవ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగుతున్నాయి…)
అతడు:
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే…
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే…
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే…
స్వార్థమీ అనర్థ కారణం… అది చంపుకొనుటే క్షేమదాయకం…
(ప్రతీ మనిషీ ఎదుటి మనిషిని దోచుకోవాలని, తాను మాత్రమే బాగుపడాలని కోరుకుంటున్నాడు. స్వార్థమే ఈ అనర్థానికి కారణం. దానిని చంపుకుంటే తప్ప దేశప్రగతి జరగదు.)
బృందం:
స్వార్థమీ అనర్థ కారణం… అది చంపుకొనుటే క్షేమదాయకం…
స్వార్థమీ అనర్థ కారణం…
అతడు:
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం…
బృందం:
నీ ధ్యేయం
అతడు:
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం…
బృందం:
నీ లక్ష్యం
ఆమె:
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం…
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం…
బృందం:
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం…
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం…
(ఓ భారతీయుడా! సమసమాజాన్ని నిర్మించటమే నీ ధ్యేయం కావాలయ్యా… అలాగే, సకల జనులు సుఖ సంతోషాలతో ఉండటమే నీ లక్ష్యమయ్యా!)
అతడు:
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే…
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం…
(ఈ విషయంలో అందరం ఏకదీక్షతో మన గమ్యం చేరిననాడు… ఈ ప్రపంచానికి మన భారతదేశం, శుభ సందేశాన్ని అందించి తీరుతుంది… అప్పుడే నిజమైన స్వాతంత్ర్యదినం…)
బృందం:
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం
(ఈ ప్రపంచానికి మన భారతదేశం, శుభ సందేశాన్ని అందించి తీరుతుంది… అప్పుడే నిజమైన స్వాతంత్ర్యదినం…)

ఈ పాటలో ‘పదవీవ్యామోహాలు’ చరణాన్ని ఆలపిస్తున్నప్పుడు ఘంటసాలవారి గళంలో ఎంతటి ఆవేదన ఉన్నదో పరికించండి. ‘సమసమాజ నిర్మాణమె’ అనే పంక్తులు రెండు ట్యూన్లలో విడివిడిగా వినిపిస్తారు గాయనీ గాయకులు. అది ఒక చక్కని సొబగు కదా… రాగమాలికగా శ్రీ పెండ్యాలవారు రూపొందించిన ఈ పాట శ్రవణపరంగా వింటున్నా, దృశ్యపరంగా చూస్తూ వింటున్నా మన ఒడలు గగుర్పొడుస్తుంది. ఆవేదన, బాధ, దుఃఖం, విచారం, ఉత్తేజం, సంకల్పదీక్ష కలుగుతాయి. దేశమాత మీద అంతులేని భక్తిభావం పొంగి పొరలుతుంది… మనం కూడా ఏదైనా చేయాలి, నీతిగా ఉండాలని, అవినీతికి లొంగకూడదన్న సంకల్పాలు కలుగుతాయి.
అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఇటువంటి పాటలను ప్రతీ పాఠశాలలోనూ తరచుగా వినిపించాలి. అప్పుడే చిన్ననాటినుంచీ సమతాభావం పిల్లలకు కలుగుతుంది. అందమైన జాతీయత వారి మనసుల్లో రూపు దిద్దుకుంటుంది. తద్వారా దేశం బాగుపడుతుంది.
ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవంనాడూ ఈ పాట వింటూ ఉంటాము. అలా సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే కాక, ఇది నిత్యం ఆలపించే, ఆలకించే గీతం కావాలని, మనలో స్ఫూర్తిని పెంపొందించుకోవాలని నా ఆకాంక్ష.
మరి ఈ అందమైన గీతాన్ని ఈ క్రింది వీడియో లింక్ లో వినేద్దాం రండి.

1 thought on “సుందరము సుమధురము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *