April 28, 2024

ప్రాయశ్చిత్తం – 5

రచన: గిరిజారాణి కలవల

గరాజ్ లో కారు పార్కింగ్ చేసి లోపలికి రాగానే హాల్లో టివీ చూస్తున్న కొడుకు రుషి, “ఎక్కడకి వెళ్ళావు డాడీ! ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేద్దాం. విన్నీ బయట తినేసి వస్తానంది.” అన్నాడు. ఆ మాటలలో తల్లి ప్రసక్తే లేదు.
నిట్టూరుస్తూ సురేంద్ర తన రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రస్ వేసుకుని వచ్చేసరికి, రుషి రెడీమేడ్ చపాతీలని పెనం మీద కాల్చి తండ్రికీ, తనకీ రెండు ప్లేట్లలో వేసి, ఫ్రిజ్‌లో నుంచి తీసిన కూరని ఓవెన్‌లో వేడి చేసి, టేబుల్ మీద రెడీగా వుంచాడు.
ఇంట్లో సురేంద్రతో కాస్త కలిసేదీ, మాట్లాడేదీ కొడుకు రుషి మాత్రమే. రుషి ఆలోచనా విధానం ఇంట్లో మిగిలినవారికి భిన్నంగా ఉంటుంది. రుషిని చూస్తోంటే… ఆ వయసులో ఉన్నపుడు తనని చూసుకున్నట్లే అనిపిస్తుంది సురేంద్రకి.
సురేంద్ర భార్య ఉదయకి ఇంటి పనుల కన్నా బయట స్నేహితులూ, పార్టీలూ, షాపింగులూ ఎక్కువ. భర్తతోనూ, పిల్లలతోనూ గడపడానికి టైమ్ తక్కువగా వుంటుంది.
కూతురు విన్నీ కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వుంటుంది. ఫేషనబుల్ గా అలంకరించుకోవడం, స్నేహితులతో పబ్బులు, పార్టీలు… పక్కా అమెరికన్ కల్చర్‌లో మునిగిపోయింది. సురేంద్ర ఎప్పుడైనా చెప్పాలని చూసినా ఖాతరు చేయదు. పైగా తల్లి సపోర్టు వుండేసరికి మరీ రెచ్చిపోతూ వుంటుంది. తన చేతిలో ఏదీ లేదని తెలుసుకున్న సురేంద్ర పట్టించుకోవడం మానేసాడు.
రుషితో గడిపే కొద్ది సమయమే సురేంద్ర మనసుకి సాంత్వన కలుగుతుంది.
సురేంద్రకి రుషి తనతో మాట్లాడినప్పుడల్లా, తను తన తండ్రితో గడిపిన
రోజులు గుర్తుకు వస్తూంటాయి. తమిద్దరి మధ్యా వున్న అనుబంధం జ్ఞప్తికి వస్తుంది. అంతగా తనని ప్రేమించిన తండ్రిని, ఎంతటి అహంకార మదంతో దూరం చేసుకున్నానో కదా! అని తలిచాడు సురేంద్ర. రేపు రుషి కూడా తనతో అలా ప్రవర్తిస్తోనో? నో. . . ఆ ఊహే భరింపరానిదిగా వుంటుంది.
“డాడీ! ఏంటి ఆలోచిస్తున్నారు. తినండి” రుషి మాటకి,
“ఏం లేదు రుషీ!” రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఛానల్ మార్చాడు సురేంద్ర.
ఏదో ఆధ్యాత్మిక ఛానెల్‌లో ఎవరో గురువుగారు ‘గతించిన పితృదేవత లకి ప్రతి సంవత్సరము కొడుకు పిండప్రదానం చేయాలనీ, మనకి ఒక సంవత్సరం వారికి ఒక రోజు కింద జరుగుతుందనీ, వారు చనిపోయిన రోజున వారిని తలుచుకుని శ్రద్ధగా శ్రాద్ధకర్మలు నిర్వర్తించాలనీ, వారికి పుణ్యగతులు పొందేలా చూడవలసిన కర్తవ్యం, విధి కొడుకుకి తప్పనిసరిగా వుంటుందనీ, ఈ రాబోయే మహాలయ పక్షం రోజుల్లో తప్పనిసరిగా తల్లితండ్రులకి, పెద్దలకీ తర్పణాలు వదిలి, వారిని స్మరించుకోవాలని’ చెపుతున్నారు.
టీవీ చూస్తూ తింటున్న, రుషి ఉన్నట్టుండి సడన్‌గా”నాన్నా! తాతయ్య చనిపోయారని తెలిసినపుడు నువ్వు అర్జంట్ ఆఫీస్ పని వుందని ఇండియా వెళ్ళలేదు. తర్వాత కూడా నువ్వు, ఇప్పుడు టివీలో గురువుగారు చెప్పినట్లు, ఎటువంటి కార్యక్రమం చేయలేదు. అలా చేయకపోవడం తప్పు అవుతుంది కదు నాన్నా! ఒకసారి ఇండియా వెళ్ళి కాశీలో తాతయ్యకి శ్రాద్ధ కర్మలు చేసి రండి” అన్నాడు.
ఆ మాటలు సురేంద్ర మనసుకి సూటిగా తాకాయి. తీవ్ర సంఘర్షణకి లోనయాడు. చిన్న పిల్లవాడితో తను చెప్పించుకోవలసి రావడం… తనదెంతటి హేయమైన పరిస్థితి అన్నదీ అర్ధమయింది. బతికివుండగా తన తండ్రిని పట్టించు కోవడం కాదు కదా, కనీసం పలకరించను కూడా లేదు. ‘నీ చేతుల్లో కను మూయాలని వుందిరా!’అన్న తండ్రి మాట తన చెవుల్లో గింగిరాలు తిరుగుతోంది.
“ఒరేయ్ మీ నాన్న పరిస్థితి అసలు బావులేదురా! వృద్ధాశ్రమంలో చాలా హేయమైన స్ధితిలో వున్నాడు… నిన్నే కలవరిస్తున్నాడు”అంటూ సత్యం ఫోను చేస్తే, ‘ఇప్పుడు రావడం తనకి కుదరదని, నువ్వే ఏదో ఏర్పాట్లు చేయమని, ‘ డబ్బు పంపేసి చేతులు దులుపుకున్నాడు సురేంద్ర.
చాలా పెద్ద తప్పిదం చేసాడు. గత కొన్ని రోజులుగా సురేంద్రలో ఏదో తెలియని సంఘర్షణ. ఇప్పుడు రుషి మాటలతో, కళ్ళు తెరుచుకున్నాయి. కనీసం ఇప్పటికయినా కొడుకుగా తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే, తనకి పుట్టగతులు వుండవు. తాను చేసిన ఘోర అపరాధానికి ప్రాయశ్చిత్తం వుండదు అనుకున్నాడు. ‘నాన్నా! నన్ను క్షమించు నాన్నా!’ తెలీకుండానే సురేంద్ర కళ్ళు ధారాపాతంగా స్రవించసాగాయి.
“నాన్నా! ఏమైంది? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు?” సురేంద్రని కుదుపుతూ, రుషి అనే మాటలకి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేడు సురేంద్ర.
***
సురేంద్రలో తెలియని అంతర్మథనం మొదలైంది.
తండ్రి విషయంలో చేసిన ఘోరాపరాధం, సురేంద్ర కళ్ళు తెరుచుకునేలా మనసు మారింది.
వెంటనే, తన ఊరిలో వుండే చిన్ననాటి స్నేహితుడు సత్యానికి ఫోను చేసి, ఇండియా వస్తున్నట్టు చెప్పాడు. తన తండ్రికి తాను చేయవలిసిన అంతిమ సంస్కారం చేసినది సత్యమే. ఏమిచ్చి అతని ఋణం తీర్చుకోవాలో కదా అని అనుకున్నాడు సురేంద్ర.
హైదరాబాదుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు.
మరునాడు ఉదయ, తన స్నేహితురాళ్ళతో వెళ్ళిన విహారయాత్ర ముగించుకుని ఇంటికి చేరింది. సురేంద్ర సూట్కేస్ సర్దుకుంటూ కనపడడం చూసి, ఆశ్చర్యపోయింది. తనకి తెలియకుండానే ఏ ఊరు వెడుతున్నాడు చెప్మా! అనుకుంది.
“ఎక్కడికి ప్రయాణం?” అని అడిగింది.
“ఇండియా వెడుతున్నాను” పెట్టె మూత వేస్తూ చెప్పాడు.
“ఇంత సడన్‌గా ఏంటి? మరో రెండు నెలల్లో మా పేరెంట్స్ షష్ఠిపూర్తి వుంది. అప్పుడు ఎలాగూ వెళ్ళాలనుకున్నాము కదా? మళ్లీ ఇప్పుడు ఎందుకు?” అంది.
“మా నాన్న కోసం వెడుతున్నాను” అన్నాడు.
“మీ నాన్న కోసమా? ఆయన పోయి సంవత్సరం అవుతోంది. మర్చి పోయారా?” అంది.
“ఔను! ఇన్నాళ్ళు మర్చిపోయాను. ఇప్పుడే గుర్తు వచ్చింది. అందుకే వెడుతున్నాను. తిరిగి ఎప్పుడు వస్తానో నాకే తెలీదు” అంటూ సూట్కేస్ తీసుకుని బయటకి నడిచాడు.
“డాడీ! ఫ్లైట్ టైమ్ అవుతోంది. మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను” కారు తాళాలు గిరగిర తిప్పుతూ తన రూంలోనుంచి రుషి వచ్చాడు.
“నేను రెడీయే. పద బయలుదేరుదాం. బై ఉదయా!” అని చెప్పేసి, సమాధానం కోసం కూడా చూడకుండా కారు ఎక్కాడు సురేంద్ర.
డ్రైవింగ్ చేస్తూనే, కారు సీటుకి వెనక్కి ఆనుకుని దీర్ఘాలోచనతో వున్న తండ్రి వేపు చూసాడు రుషి. కళ్ళు మూసుకుని వున్నాడు సురేంద్ర. అది నిద్ర కాదని తెలిసిపోతూనే వుంది. నెమ్మదిగా తండ్రి అరచేతిలో తన చేతిని వేసాడు. ఆ చేతిని తన పిడికిలిలో బిగించి, పెదవులవద్దకు తీసుకుని ముద్దాడాడు సురేంద్ర.
“డాడీ! అక్కడ ఎమోషనల్ అయిపోకండి. ధైర్యంగా వుండండి. సత్యం మామయ్య అన్ని ఏర్పాట్లూ చేస్తానని చెప్పారు కదా! అన్నీ అయాక నెమ్మదిగా రండి. వెళ్ళాలనుకుంటే తాతయ్య ఊరికి కూడా వెళ్ళి రండి.” అని చెప్పాడు రుషి.
వయసులో చిన్నవాడైనా ఎంత పరిపక్వతతో మాట్లాడుతున్నాడు కదా… అనిపించింది సురేంద్రకి.
ఈ మానసిక ధైర్యం ఇచ్చే మాటలు నినగానే మళ్లీ తండ్రి తలపుకి
వచ్చాడు. తను ఆటలలోకానీ, చదువులో కానీ వెనకడుగు పడితే… తన భుజం తట్టి ఇలాగే కదా ధైర్యం చెప్పేవాడు. రుషికి అన్నీ తన తండ్రి పోలికలే వచ్చాయి అనుకుంటూ మురిసిపోయాడు సురేంద్ర.
“డాడీ! ఎయిర్‌పోర్ట్ వచ్చింది. దిగండి. ” కారు ఆపుతూ అన్నాడు రుషి.
ట్రాలీ మీద సూట్కేస్ సర్దిపెట్టి, గేట్ దాకా సాగనంపి మరోసారి జాగ్రత్త చెప్పి వెనుతిరిగాడు రుషి.
ఎయిర్ పోర్ట్ దగ్గర తండ్రిని డ్రాప్ చేసి, ఇంటికి తిరిగి వచ్చిన రుషి మీద, ఉదయ విరుచుకుపడింది.
“తండ్రీకొడుకులు ఇద్దరూ నాకు తెలియకుండా నాటకం ఆడుతున్నారా? మీ తాత పోయి ఏడాది అయాక, ఇప్పుడు మీ నాన్న ఇండియా వెళ్ళాల్సిన పనేమిటి? అక్కడ ఆయన పోతూ పోతూ, మూటలు ఏవైనా దాచిపెట్టాడా ఏంటి? ఏ విషయం నాకు చెప్పకుండా దాచి పెడుతున్నారు.” అంటూ కోపంతో ఊగిపోయింది.
“మమ్మీ! నువ్వు అనవసరంగా ఆవేశపడకు. తాతయ్య మనకి మూటలు మిగల్చకపోయినా, వున్న తన మూటలు కరిగించి డాడీని ఈ ఉన్నత స్థాయికి తీసుకువచ్చారు. ఇక్కడకి వచ్చాక పరిసరాల ప్రభావం వలనో, మరి నీ ప్రభావంవలనో డాడీలో మార్పు వచ్చింది. తన మనసుకి విరుద్ధంగా జీవించారు. తన చేసిన తప్పు తనకి తెలుసు కానీ నీ ముందు ఎదురు చెప్పలేకపోయారు. తనలో చెలరేగుతున్న సంఘర్షణకి తానే మౌనంగా కుమిలిపోయేవారు. తాతయ్య చనిపోయినప్పుడు వెళ్ళనందుకు ఎంతగానో బాధపడ్డారు. కనీసం ఇప్పటి కయినా కొడుకుగా తన వంతు కర్తవ్యం నెరవేర్చాలని అనుకున్నారు. ఇందులో నువ్వు అనుకున్నట్లుగా…నేను, డాడీ నాటకాలు ఏవీ ఆడడం లేదు. నువ్వు అలా భ్రమపడుతున్నావు అంతే… ఈ విషయం ఎక్కువ చేయకు” తల్లి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
సశేషం.

1 thought on “ప్రాయశ్చిత్తం – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *